Pages

Wednesday, June 3, 2026

బృందావన కథలు – 22 (రాధమ్మ పాదరేణువు)

జై రాధే కృష్ణ శ్యామ్!

బృందావనం…
అది ప్రేమకు రూపం వచ్చిన ధామం.
అక్కడ గాలి కూడా రాధానామమే జపిస్తుంది.
యమునమ్మ అలలు కూడా కృష్ణస్మరణలోనే ప్రవహిస్తాయి.
కదంబవృక్షాలు ప్రేమకు సాక్షులై నిలుస్తాయి.
అక్కడి ధూళి కూడా సాధారణ ధూళి కాదు…
అది రాధాకృష్ణుల పాదస్పర్శతో పవిత్రమైన చరణరేణువు.
ఆ రోజు ఉదయం…
యమునా తీరం సూర్యోదయపు బంగారు కాంతితో మెరిసిపోతోంది.
మంచుబిందువులు తామరరేకులపై ముత్యాల్లా మెరుస్తున్నాయి.
గాలి పారిజాతాల పరిమళంతో నిండిపోయింది.
ఆ రోజు బృందావనంలో ఏదో ఒక అద్భుతం జరగబోతోంది... కానీ ఎవరికీ తెలియదు.
---
యమునా తీరంలో ఒక రాయి ఉండేది. అది ఎన్నో సంవత్సరాలుగా అక్కడే ఉంది. ఏ ప్రత్యేకతా లేనందువల్ల ఎవ్వరూ దాన్ని గమనించేవారు కాదు. గోపికలు దాని పక్కనుంచి వెళ్లేవారు… యమునమ్మ అలలు అప్పుడప్పుడు దానిని తాకేవి… ఆవులు దాని దగ్గరలో ఉన్న గడ్డిని మేత మేసేవి… దాని దగ్గర యమునా నీటిని తాగేవి. కానీ అది కేవలం ఒక రాయిగానే ఉండిపోయింది.
ఆ రోజు ఉదయం,
రాధారాణి తన సఖులతో కలిసి యమునా స్నానానికి బయలుదేరింది.
ఆమె అడుగులు మృదువుగా నేలను తాకుతున్నాయి.
జడలో రాత్రి పెట్టుకున్న మల్లెలు ఊగుతున్నాయి.
ముఖంలో చంద్రకాంతి నవ్వు.
కళ్లలో కృష్ణస్మరణ.
ఆమె నడుస్తూ మెల్లగా "శ్యామ్... శ్యామ్..." అంటూ జపిస్తోంది
ఆ నామస్మరణ వినగానే గాలి కూడా మంద్రంగా ఆ మాటలను తిరిగి వినపించసాగింది.
---
రాధ నడుస్తూ ఉండగా
ఆమె పాదాల దగ్గర నుంచి కొంత ధూళి లేచింది.
గాలి ఆ రేణువులను మెల్లగా తీసుకెళ్లి
ఆ చిన్న రాయిపై చల్లింది.
అది మామూలు ధూళి కాదు, సాక్షాత్తూ రాధమ్మ పాదరేణువు...
అంతే...
ఒక అద్భుతం జరిగింది.
ఆ రాయి ఒక్కసారిగా ఒక వింత అనుభూతిని పొందింది.
ఇన్నాళ్లు నిశ్చేష్టంగా ఉన్న దానిలో
ఏదో దివ్యమైన ప్రకాశం ప్రవహించడం మొదలైంది.
యమునమ్మ అలలు ఆశ్చర్యంగా చూశాయి.
కదంబవృక్షాలు పులకించిపోయాయి.
ఆ రాయి మీద నుంచి ఒక మృదువైన కాంతి వెలువడసాగింది.
కొద్దిసేపటికి అక్కడికి వచ్చిన గోపికలు ఆశ్చర్యపోయారు. "ఈ రాయి ఎందుకు ఇలా మెరుస్తోంది? ఎప్పుడూ దీన్ని గమనించలేదే మనం?!" అని ఒకరు ఆశ్చర్యంగా అడిగారు. మరొకరు దగ్గరకు వెళ్లి చూశారు. "ఆహా! ఆ రాయి నుంచి మల్లెల పరిమళం వస్తోంది." అని అన్నది.
ఆరాయి చుట్టూ చిన్న చిన్న గడ్డి పూలు అందంగా వికసించాయి. ఆ పరిణామాన్ని ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు.
అప్పుడే మురళీనాదం వినిపించింది. అందరూ వెంటనే తిరిగి చూశారు. నీలమేఘ శ్యాముడు నడుచుకుంటూ వస్తున్నాడు.
తలపై నెమలిపింఛం…
చేతిలో మురళీ…
ముఖంలో చిలిపి నవ్వు…
ఆయన ఆ రాయిని చూసి చిరునవ్వు నవ్వాడు.
ఒక గోపిక వెంటనే "కాన్హా! ఈ రాయి ఏమిటి? నిన్నటివరకూ ఇలాంటిది ఇక్కడ చూడలేదు అంతా వింతగా ఉంది" అని గోముగా అడిగింది.
కృష్ణుడు మెల్లగా ఆ రాయి దగ్గరకు వెళ్లాడు.
తర్వాత ప్రేమగా దానిని తాకుతూ "ఇది ఈరోజు గొప్ప భాగ్యం పొందింది..." అన్నాడు.
అందరూ ఆశ్చర్యంగా చూసి "ఏ భాగ్యం?" అని అడిగారు.
కృష్ణుడు రాధ వైపు చూసి మృదు మధురంగా నవ్వాడు.
"ఈ రాయిపై రాధా చరణరేణువు పడింది..." అన్నాడు.
ఆ మాట వినగానే ఆ క్షణంలో అందరూ ఇంకా విషయం చెప్తాడని మౌనంగా వినడం కొనసాగించారు.
కృష్ణుడు కొనసాగించాడు
"గంగానది పవిత్రం ఎందుకంటే - అది భగవంతుని శరీరాన్ని తాకింది...
ఈ రాయి పవిత్రం ఎందుకంటే ఇది రాధా చరణరేణువును పొందింది..." అన్నాడు.
అక్కడే ఉన్న రాధ వెంటనే సిగ్గుతో తలవంచుకుంది. ఆ సిగ్గుతోనే "శ్యామా! నువ్విలా ఎందుకు అంటున్నావు?" అంది.
కృష్ణుడు ఆమె కళ్లలోకి చూస్తూ మెల్లగా
"రాధే... నువ్వు ప్రేమకు రూపం.
నీ పాదాలు తాకిన చోట
భక్తి వికసిస్తుంది.
నీ చరణరేణువు పడిన చోట
ప్రేమ పరిమళిస్తుంది." అని అన్నాడు.
ఆ మాటలు విన్న గోపికల కళ్లలో నవ్వులు మెరిశాయి.
అప్పుడే
ఆ రాయి మీద ఒక చిన్న తామరపువ్వు వికసించింది.
యమునమ్మ అలలు సంతోషంగా ఒడ్డును తాకాయి.
గాలి మల్లెల పరిమళాన్ని చల్లింది.
కదంబవృక్షాలు పూలవర్షం కురిపించాయి.
ఆ రాయి ఇక రాయి కాదు...
అది ప్రేమను స్పృశించిన సాక్ష్యం.
అది రాధా చరణరేణువు మహిమకు గుర్తు.
ఆ సాయంత్రం
కృష్ణుడు మురళీని పెదవులకు చేర్చాడు.
ఆ రోజు వేణువులోంచి వచ్చిన రాగం
మామూలు రాగం కాదు.
అది రాధా మహిమను గానం చేస్తున్న ప్రేమగీతం.
రాధ మెల్లగా తలవంచుకుంది.
ఆమె పాదాల దగ్గర యమునమ్మ అలలు నమస్కరించాయి.
అప్పుడు నాకు ఒక సత్యం తెలిసింది —
భగవంతుని కృప ఒక జీవిని పవిత్రం చేస్తే,
రాధా ప్రేమ ఒక రాయిని కూడా తన గుణధర్మాలకతీతంగా దివ్యమైనదిగా మార్చగలదు.
"రాధమ్మ పాదరేణువు తగిలిన రాయి
కేవలం మెరవలేదు...
ఆమె ప్రేమను అనుభవించింది...
అతని భక్తిని శ్వాసించింది...
దివ్యత్వాన్ని పొందింది...
ఎందుకంటే రాధా చరణరేణువులో కూడా
కృష్ణుని హృదయం దాగి ఉంది..."
రాధే రాధే
-శంకరకింకరః

No comments:

Post a Comment