జై రాధే కృష్ణ!
బృందావన ధామం...
ప్రతి గల్లీ ఒక లీలా క్షేత్రం.
ప్రతి ధూళికణం రాధా-కృష్ణుల చరణరేణువులతో పవిత్రమైనది.
అక్కడ జరిగే ప్రతి సంఘటన వెనుక ఏదో ఒక దివ్యరహస్యం దాగి ఉంటుంది, మనకేదో నేర్పుతూంటుంది.
అటువంటి బృందావనంలో జరిగిన ఒక హృద్యమైన సంఘటన ఇది.
బీహార్‌కు చెందిన రాజు అనే ఒక నిరుపేద వ్యక్తి జీవనోపాధి కోసం తన భార్యతో కలిసి బృందావనానికి వచ్చి స్థిరపడ్డాడు. చదువు లేదు, ఆస్తిపాస్తులు లేవు. చేతిలో ఉన్నదల్లా ఒక రిక్షా మాత్రమే.
ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం వరకు బృందావన వీధుల్లో భక్తులను ఒక చోటు నుండి మరొక చోటుకు రిక్షాలో తీసుకెళ్తూ జీవనం సాగించేవాడు.
రాజుకు ఒక గొప్ప అలవాటు ఉండేది.
ఎంత అలసిపోయినా, ఎంత పని ఉన్నా, రాత్రి బాంకే బిహారీ మందిరంలో జరిగే శయన ఆరతికి తప్పకుండా వెళ్లేవాడు. దూరంగా నిలబడి అయినా తన ప్రియమైన బిహారీ జీని ఒక్కసారి దర్శించుకుంటే చాలు అని భావించేవాడు.
ఇంతలో హరికృపతో వారి ఇంట ఒక పాప జన్మించింది.
కానీ కాలక్రమేణా జీవనభారం పెరిగింది.
పని ఎక్కువైంది...
అవసరాలు పెరిగాయి...
అలసట అధికమైంది...
అలా నెమ్మదిగా బిహారీ జీ దర్శనాలు తగ్గిపోయాయి.
ఆ చిన్నారి పుట్టిన రోజు వారి జీవితంలో ఆనందాన్ని నింపింది. కానీ ఆ ఆనందం ఎక్కువకాలం నిలవలేదు.
కొద్ది రోజులకే వైద్యులు ఒక చేదు నిజం చెప్పారు.
"మీ పాప పుట్టుకతోనే అంధురాలు."
ఆ మాట విన్న రాజు, అతని భార్య గుండెలు పగిలిపోయాయి.
ఎన్నో వైద్యులను చూపించారు.
ఎన్నో మందులు వాడించారు.
ఇంగ్లీషు, ఆయుర్వేదం వైద్యులు, హకీములు, మంత్రగాళ్లు... ఎవరినీ వదల్లేదు, అన్నీ ప్రయత్నించారు. కానీ ఫలితం మాత్రం శూన్యం.
చివరకు... "ఇది దేవుడి సంకల్పం కావచ్చు" అని బాధను హృదయంలో దాచుకొని జీవించడం నేర్చుకున్నారు.
రాజు రోజూ భక్తులను తీసుకెళ్తూ బాంకే బిహారీ మహిమలను వినేవాడు.
"బిహారీ జీ మా కోరిక తీర్చారు..."
"మా కష్టాలను తొలగించారు..."
"మాకు సంతానం ప్రసాదించారు..." అంటూ భక్తులు చెప్పుకునే అనుభవాలు వింటే అతని హృదయం కదిలిపోయేది.
అతనికీ ఒక కోరిక ఉండేది. "ఒక్కసారి బిహారీ జీ ముందు నిలబడి నా కూతురి బాధ చెప్పాలి..." అని అనుకునేవాడు.
కానీ వెంటనే తన మనసే తనను ఆపేది. "ప్రభువు వద్దకు కూడా ఏదైనా అడగడానికే వెళ్తానా? ప్రేమతో వెళ్లాలి గానీ కోరికతో కాదు..." అని అనుకొని మౌనంగా ఉండిపోయేవాడు.
ఒక రోజు మాత్రం తన చిన్నతల్లి బాధ చూడలేక అతని హృదయం ఆ బాధను భరించలేకపోయింది, తల్లడిల్లింది. "ఈరోజు ఏదైనా సరే బిహారీ జీని దర్శించి నా మనసులోని వేదన చెప్పాలి." అని నిశ్చయించుకున్నాడు.
సాయంత్రం పనులన్నీ ముగించుకొని నేరుగా బాంకే బిహారీ మందిరానికి చేరుకున్నాడు. కానీ అప్పటికే ఆలయ పట్టాలు మూసివేయబడ్డాయి. అంతా నిర్మానుష్యమైపోయింది, బైట దుకాణదారులు కూడా తమ దుకాణాలు మూసేస్తున్నారు "అయ్యో! భగవంతుడా...! అనుకుంటుండగా.. అదే సమయంలో ఆలయంలోంచి ఒక గోస్వామి బయటకు రావడం చూసాడు.
రాజు వినయంగా చేతులు జోడించి "గోస్వామి మహారాజ్! ఒక్కసారి బిహారీ జీ దర్శనం చేసుకోవచ్చా?" అని అడిగాడు.
గోస్వామి మృదువుగా నవ్వుతూ "ఈరోజు పరదాలు మూసేశారు. తలుపులు వేసేశారు రేపు రా బాబూ" అన్నారు.
ఆ మాట విన్న రాజు హృదయం దిగులుతో నిండిపోయింది.
నాలుగడుగులు వేసిన ఆ గోస్వామి అతను రిక్షానడుపుతున్నాడని గ్రహించి "నన్ను నా ఇంటి వరకు రిక్షాలో తీసుకెళ్తావా?" అని అడిగారు.
రాజు బాధలోనే ఉండి తల ఊపాడు. వారు రిక్షాలో కూర్చున్నారు. రిక్షా బృందావన వీధుల్లో నెమ్మదిగా ముందుకు సాగుతోంది. కొద్దిసేపటి తర్వాత గోస్వామి "ఎందుకు దిగులుగా ఉన్నావు? నువ్వు బిహారీ జీకి ఏమి చెప్పాలనుకున్నావు?" అని అడిగారు.
ఆ ప్రశ్న వినగానే రాజు హృదయంలో దాచుకున్న దుఃఖం ఒక్కసారిగా పెల్లుబికింది. కన్నీళ్లు ఆగలేదు. ఆ రిక్షా తొక్కుతూ ఏడుస్తూనే "గోస్వామీ మహారాజ్! నా పాప పుట్టుకతోనే అంధురాలు. నేను బిహారీజీని అడగాలనుకున్నది ఒక్కటే... నా పాప కళ్లలో వెలుగు ప్రసాదించమని... పిల్ల బాధచూడలేకున్నాను" అని ఏడుస్తూ చెప్పాడు.
గోస్వామి ఎంతో శ్రద్ధగా అతని బాధ అంతా విన్నారు. ఏ బదులూ ఇవ్వలేదు, మారు మాట చెప్పలేదు. కేవలం ఒక సానుభూతితోకూడిన కరుణామయమైన చిరునవ్వు బదులుగా ఇచ్చారు. అలా మాట్లాడుకుంటూ ఉండగానే వారి ఇల్లు వచ్చేసింది. రాజు వారిని దింపి నమస్కరించి తిరిగి తన ఇంటికి బయలుదేరాడు.
---
ఇంటి వద్దకు చేరుకున్న రాజు ఒక్కసారిగా ఆశ్చర్యంతో నిలిచిపోయాడు.
అతని కళ్లను అతనే నమ్మలేకపోయాడు.
ఇంట్లో అతని చిన్నారి పరుగులు పెడుతోంది!
గోడలను తడుముకుంటూ నడిచే ఆ పాప...
ఇప్పుడు ఇంటంతా ఆనందంగా తిరుగుతోంది!
రాజు గబగబా ఆమె దగ్గరకు వెళ్లి కౌగిలించుకున్నాడు.
"అమ్మా! ఏమైంది? ఎలా కనిపిస్తోంది?" అని అడిగాడు.
అందుకు ఆ పాప అమాయకంగా
"నాన్నా! కొద్దిసేపటి క్రితం ఒక అందమైన చిన్నబ్బాయి వచ్చాడు. నువ్వు రాజు కూతురివేనా?" అని అడిగాడు.
"అవును" అన్నాను.
అప్పుడు అతను తన రెండు చేతులను నా కళ్లపై ఉంచాడు.
అంతే...
నాకు ఒక్కసారిగా అన్నీ కనిపించడం మొదలైంది!
నేను ఆనందంతో కళ్లుతెరిచి చూసేలోపే ఆ అబ్బాయి ఎక్కడికో వెళ్లిపోయాడు..." అని చెప్పింది.
ఆ మాటలు విన్న రాజు హృదయం ఒక పక్క ఆనందంతో, మరో పక్క భక్తితో నిండిపోయింది, అతని కన్నీళ్లు ఆగలేదు. ఇప్పుడవి ఆనంద సముద్ర జలాలు...
"బాంకే బిహారీకీ జై...
బాంకే బిహారీకీ జై..."
అని అరుస్తూ... ఆ వెంటనే అతను చెప్పులు కూడా వేసుకోకుండా పరుగెత్తుకుంటూ మళ్లీ ఆ గోస్వామి ఇంటికి వెళ్లాడు. తలుపు తట్టి గట్టిగా పిలిచాడు.
"గోస్వామీ మహారాజ్! గోస్వామీ మహారాజ్!...."
లోపల నుండి ఒక వృద్ధుని స్వరం వినిపించింది.
"ఎవరు బాబూ?"
రాజు "నేనండీ రిక్షా రాజును, ఇంతకు ముందు మిమ్మల్ని రిక్షాలో ఇంటికి చేర్చాకదా!, నా బాధ చెప్పుకున్నాను కదా" అని పరిచయం చేసుకున్నాడు.
అప్పుడు లోపల నుండి నెమ్మదిగా నడుస్తూ వచ్చిన ఆ గోస్వామి వద్దనుండి ఆశ్చర్యకరమైన సమాధానం వచ్చింది.
"ఏమంటున్నావు? నేను గత రెండు రోజులుగా తీవ్రమైన జ్వరంతో మంచం మీదనే ఉన్నాను. రెండు రోజులుగా మందిరానికే వెళ్లలేదు! విపరీతమైన అలసటతో ఉన్నాను, నువ్వు గట్టిగా తలుపులు బాదేసరికి వచ్చి తలుపు తీస్తున్నాను " అన్నారు.
ఆ మాట విన్న క్షణంలో రాజు స్థంభించిపోయాడు.
అతని శరీరం వణికిపోయింది.
గోస్వామి లోపలికి పిలిచి ఏం జరిగిందో చెప్పమన్నారు..
రాజు మనసులో ఒక్కసారిగా ఆ సాయంత్రం జరిగిన సంఘటనలన్నీ మెరుపులా కదిలాయి. అన్నీ చెప్పసాగాడు....
రిక్షాలో కూర్చున్న ఆ గోస్వామి, ఈ గోస్వామి కారా!?...
తన బాధను ప్రేమగా విన్న ఆ కరుణామూర్తి...
ఆ రాత్రి చీకట్లోనే స్వచ్ఛంగా కనిపించిన ఆ మధురమైన చిరునవ్వు...
అన్నీ తరచి తరచి గుర్తుకు తెచ్చుకుంటున్నాడు.
అప్పుడు అతనికి అర్థమైంది.
తన రిక్షాలో కూర్చొని తన బాధ విన్నది గోస్వామి కాదు...
సాక్షాత్తూ బాంకే బిహారీ లాలేనని!
గోస్వామికి జరిగింది విని ఎక్కడలేని సత్తువా వచ్చింది, రిక్షారాజును అభినందించాడు, బాంకేబిహారీని చూసి, సంభాషించిన గొప్పభక్తుడివంటూ కౌగిలించుకుని సత్కరించారు.
---
భక్తుడు అడగడానికి సంకోచించాడు.
కానీ, భగవంతుడు అతని మనసులోని వేదనను అడగకుండానే విన్నాడు.
భక్తుడు కోరలేకపోయాడు.
కానీ కరుణాసాగరుడు అడగకుండానే అనుగ్రహించాడు.
ఇదే భగవంతుని ప్రేమ.
ఇదే బృందావన మహిమ.
ఇదే బాంకే బిహారీ కరుణ.
భక్తుడు మాటలతో ప్రార్థించకపోయినా...
హృదయంlo, ఆర్ధ్రత ప్రార్థిస్తే చాలు...
ఆ కన్నీటి భాషను ఠాకూర్‌జీ ఎప్పుడూ అర్థం చేసుకుంటారు.
దీనుల కాపాడుటకు దేవుడే ఉన్నాడు
దేవుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడూ...
ఆకలికి అన్నమూ వేదనకు ఔషధం
పరమాత్ముని సన్నిధికి రావే ఓ మనసా!
----
శ్రీ బాంకే బిహారీ లాల్ కి జై!
బృందావన బిహారీ లాల్ కి జై!
రాధే రాధే!
-శంకరకింకరః
No comments:
Post a Comment