జై రాధే! జై జై శ్రీ రాధే!
Saturday, May 30, 2026
బృందావన కథలు – 21 ( శ్యామానంద ప్రభు)
Monday, May 25, 2026
బృందావన కథలు - 7 (పూలబ్బి - ఠాకూర్ మిత్రుడు)
జై శ్రీ రాధే కృష్ణ
బృందావనంలో కన్నయ్య లీలలు నేర్పించే జీవితపు పాఠాలు అద్భుతమైనవి. భక్తుల గుండెల్లో నిలిచి, జీవితాలనే మార్చేవిగా ఉంటాయి. అలాంటి లీలలలో ఒకటి ఇది.
మనము భగవంతుణ్ణి చూడడం చాలా కష్టం—అది కోటికో ఒక్కరికి లభించే అదృష్టమని భావిస్తాం. ఆ భగవంతుడితో మాట్లాడటం మన వల్ల అయ్యే పని కాదనుకుంటాం. సరే, అవి నిజమే అనుకున్నా… భగవంతుడితో స్నేహం చేయడం, అతని మిత్రుడిగా మారడం, అతని స్నేహాన్ని ఆస్వాదించడం ఎంతో సులభమని బృందావనంలో చెప్పుకునే ఈ కథ ద్వారా తెలుస్తుంది.
బృందావనంలో బాంకేబిహారీ ఆలయం ఎప్పుడూ భక్తుల రాకతో పెళ్లివారిల్లులా కళకళలాడుతూ ఉంటుంది. బయట భోగ్ సమర్పించడానికి మిఠాయి దుకాణాలు, వస్త్రాల దుకాణాలు, పూజా సామగ్రి దుకాణాలు ఉంటాయి. తిరుగుతూ అమ్మేవాళ్లూ ఉంటారు.
ఒకనాటి మధ్యాహ్నం, ఒక యువకుడు బాంకేబిహారీ దర్శనానికై వచ్చి, బయట ఉన్న మిఠాయి దుకాణంలోకి వెళ్లాడు. దుకాణదారుడు అతనికి తాజా మిఠాయిలు, పేడాలు చూపించాడు. ఆ యువకుడు వాటిని చూసి, “ఇవి బాంకేబిహారీ ఠాకూర్‌కు సమర్పిస్తే బాగుంటుంది” అనుకుని, ఒక్కో కిలో చొప్పున కట్టమన్నాడు. దుకాణదారుడు తూకం వేస్తూ ఉండగా, యువకుడు బయట జరుగుతున్న దృశ్యాలను గమనిస్తున్నాడు.
ఒక చిన్న పిల్లవాడు పూలమాలలు అమ్ముతున్నాడు. దర్శనానికి వచ్చే భక్తుల దగ్గరకు పరిగెత్తి వెళ్లి, మళ్లీ వెనక్కి పరిగెత్తుకొస్తున్నాడు. కొందరు మాలలు కొనుగోలు చేస్తున్నారు, మరికొందరు కాదు. అయినా పిల్లవాడు ఆగకుండా తిరుగుతూనే ఉన్నాడు.
యువకుడికి ఆశ్చర్యంగా అనిపించింది. మరింత నిశితంగా గమనించాడు. ఆ పిల్లవాడికి చెప్పులు లేవు. మిట్టమధ్యాహ్నం కావడంతో నేల మండుతోంది. అతను వేడిని తట్టుకోలేక, పరిగెత్తి వెళ్లి మాల అమ్మి, తిరిగి నీడలోకి వచ్చి కాళ్లను చల్లబరుచుకుంటున్నాడు.
ఈ దృశ్యం చూసి యువకుడు చలించిపోయాడు. మిఠాయి కట్టడాన్ని కాసేపు ఆపమని చెప్పి, పక్కనే ఉన్న చెప్పుల దుకాణానికి వెళ్లి ఒక జత చెప్పులు కొనుక్కొచ్చాడు.
పిల్లవాడి దగ్గరకు రాగానే, ఆ పిల్లవాడు “పూలమాల కావాలండీ, మంచి పూలదండ ఠాకూర్‌కి సమర్పించండి” అంటూ వేడుకుంటున్నాడు.
అప్పుడు యువకుడు, “తప్పకుండా కొంటాను, కానీ ముందు ఈ చెప్పులు వేసుకో” అంటూ చెప్పులు ఇచ్చాడు.
పిల్లవాడు చెప్పులు వేసుకుని, కళ్లలో నీళ్లు తెప్పించుకుని, తల ఎత్తి ఆ యువకుణ్ణి చూశాడు. గిరిజాల జుట్టు, పసుపు బట్టలు చూసి ఆశ్చర్యంగా అడిగాడు:
“నువ్వు కృష్ణుడివి కదా?”
యువకుడు నవ్వుతూ, “లేదు బాబూ, నేను కృష్ణుణ్ణి కాదు” అన్నాడు.
కానీ పిల్లవాడు ఒప్పుకోలేదు. ఆలయ ద్వారం వైపు చూస్తూ, మళ్లీ యువకుడిని చూస్తూ,
“కాదు, నువ్వే కృష్ణుడివి—ఒప్పుకో!” అన్నాడు.
యువకుడు మళ్లీ, “నేను కృష్ణుణ్ణి కాదు బాబూ” అన్నాడు.
పిల్లవాడు కన్నీళ్లు పెట్టుకుని, “నువ్వే కృష్ణుడివి. నేనెవరికీ చెప్పను. నన్ను మోసం చేయకు” అంటూ అతని నడుము పట్టుకుని ఆప్యాయంగా అంటిపెట్టుకున్నాడు.
యువకుడు మృదువుగా, “నేను కృష్ణుణ్ణి కాదు బాబూ” అని మళ్లీ చెప్పాడు.
అప్పుడు పిల్లవాడు కన్నీళ్లు తుడుచుకుంటూ,
“నువ్వు కృష్ణుడివి కాకపోతే… నాకు చెప్పులు ఎలా ఇచ్చావు?” అని అడిగాడు.
యువకుడు కాసేపు ఆలోచించి,
“కృష్ణుడు చెప్పాడు కాబట్టే ఇచ్చాను” అన్నాడు.
అప్పుడా పిల్లవాడు ఆనందంతో చెప్పాడు:
“నిన్ననే నేను కృష్ణుడిని అడిగాను—ఈ ఎండల్లో చెప్పులు లేక ఇబ్బంది పడుతున్నాను, ఒక జత చెప్పులు ఇప్పించమని. ఇప్పుడు నువ్వు ఇచ్చావు… అంటే కృష్ణుడికి నువ్వు చాలా దగ్గర మిత్రుడివి కదా!”
అని చెప్పి అతని పాదాలపై పడబోయాడు. యువకుడు వెంటనే అతన్ని లేపి, కౌగిలించుకున్నాడు.
ఇద్దరి కళ్లలో నీళ్లు. ఇద్దరూ ఆలయం వైపు చూస్తున్నారు.
పిల్లవాడు—తన కోరిక తీర్చినందుకు ఆనందంతో…
యువకుడు—చేసిన చిన్న సహాయం తనను ఠాకూర్ మిత్రుడిగా నిలబెట్టిందనే కృతజ్ఞతతో…
జై బాంకేబిహారీ కన్నయ్యా లాల్ కీ
రాధే రాధే – రాధే కృష్ణ
— శంకరకింకరః
బృందావన కథలు - 6 (మోర్కుటి లీల - నెమళ్ళ నృత్యపు లీల)
జై రాధే కృష్ణ
బృందావనానికి సమీపంలో ఉన్న పవిత్ర బర్సానా గ్రామం రాధారాణి నివాసస్థలం. ఆ ప్రాంతంలోని గహ్వర వనం దట్టమైన, మధురమైన రహస్యలీలలకు నిలయంగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ రాధా–కృష్ణులు నిత్యం కలుసుకుని విహరిస్తూ ప్రేమరసాన్ని విరజిల్లిస్తుంటారు. ఈ వనమధ్యంలో ఒక చిన్న సరస్సు ఇప్పటికీ దర్శనమిస్తూ, వారి లీలలకు సాక్ష్యంగా నిలిచింది. ఆ సరస్సు ఒడ్డున ఇప్పటికీ ఎన్నో దివ్యస్మృతులు పరిమళిస్తూనే ఉన్నాయి.
రాధారాణి తన ప్రియ సఖులైన లలిత, విశాఖ, చిత్ర, చంపకలత, తుంగవిద్య, ఇందులేఖ, రంగదేవి, సుదేవి లతో కలిసి ఈ వనంలో విహరిస్తూ, ఆటలాడుతూ, నృత్యగీతాలతో ఆనందంగా కాలం గడిపేది. ఆ అష్టసఖులు రాధారాణికి అత్యంత సన్నిహితులు — ఆమెను సింగారించటం, సరదాగా మాట్లాడటం, కావలసినవి తెచ్చిపెట్టటం, కలిసి ఆటలాడటం, నృత్యం చేయటం, పాటలు పాడటం — ఇవన్నీ వారి సేవలో భాగం.
ఒక పౌర్ణమి సాయంత్రం రాధారాణి తన మనసులో ఒక మధురమైన కోరిక కలిగించుకుంది — “ఈ రోజు నా సింగారం కృష్ణుడే చేయాలి” అని. కానీ ఈ విషయం సఖులకు చెబితే వారు ఆటపట్టిస్తారనే సిగ్గుతో, ఆ భావాన్ని బయటపెట్టలేదు. సఖులతో కలిసి గహ్వర వనం మధ్యలోని సరస్సు పక్కన ఉన్న ఒక పొదరింట్లో (కుంజంలో) సింగారం కోసం కూర్చుంది, కానీ మనసంతా కృష్ణుడిపైనే ఉంది.
సర్వజ్ఞుడైన కృష్ణుడికి అది తెలియక మానదు. సరిగ్గా సాయంత్రం, రాధారాణి సింగారానికి సిద్ధమవుతున్న సమయంలో, ఆయన అక్కడికి చేరుకున్నాడు. రాధ ఎక్కడుందని అడిగితే, సఖులు కొంటెగా నవ్వుతూ — “లోపల నీకోసమే సింగారమవుతోంది” అని చెప్పి పక్కకు వెళ్లిపోయారు.
కృష్ణుడు మెల్లగా తీగలతో ఉన్న తెరను తొలగించి లోపలికి వెళ్లాడు. కృష్ణుణ్ణి చూసిన వెంటనే రాధారాణి బుగ్గలు మరింత ఎర్రగా మెరిశాయి. కృష్ణుని కళ్ళు ఆనందంతో తడిసిపోయాయి. ఆయన ఎంతో ప్రేమతో రాధారాణిని సింగారించాడు — చందనం అలంకరించాడు, బొట్టు పెట్టాడు, కస్తూరి తిలకం, కాశ్మీర తిలకం దిద్దాడు, నుదుటన తెల్ల - పచ్చ చదనాలతో పత్రలేఖ దిద్దాడు, కళ్ళకు కాటుక పెట్టాడు. జడ వేసి పువ్వులు తురిమాడు, తల ఆభరణాలు అమర్చాడు, చెవులకు దుద్దులు, ముక్కుకు ముత్యాల నత్తు పెట్టాడు, ముసుగు సరిచేశాడు. చేతులకు అల్తాతో పుష్పలతలు చిత్రించి, మణులు పొదిగిన బంగారు గాజులు తొడిగాడు. అనంతరం ఆమె పాదాలను తన ఒడిలో పెట్టుకుని పారాణి అద్దాడు.
ఇద్దరూ కలిసి బయటకు వచ్చి గహ్వర వనం సరస్సు ఒడ్డున కూర్చొని ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆ ప్రశాంత వాతావరణంలో రాధ మృదువుగా అడిగింది
“కృష్ణా! నేను నీకు ఎలా కనిపిస్తున్నాను?”
కృష్ణుడు ప్రేమతో
“రాధా! నీవు ఆకాశంలో వెన్నెలలు వెదజల్లే చంద్రబింబంలా ఉన్నావు” అని అన్నాడు.
ఆ మాట రాధారాణి మనసుకు కొంచెం బాధ కలిగించింది. తన పక్కనే ఉండి చంద్రుణ్ణి చూసి పోల్చడం ఆమెకు అలక తెప్పించింది. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. కృష్ణుడు వెంటపడినా, ఆమె కనిపించలేదు. “రాధా… రాధా…” అని ఆర్తిగా వెతుకుతుండగా, లలిత సఖి కనిపించి — “ఆమె మయూరకూటిలో ఉంది” అని తెలిపింది.
మయూరవనంలో నెమళ్ళు రాధను చూసి ఎప్పుడూ పురి విప్పి నాట్యం చేస్తాయి. కానీ ఆ రోజు రాధకు ఆనందం కలగలేదు. కృష్ణుడి విరహంతో ఆమె మనసు నిండిపోయింది. కృష్ణుడు అది చూసి బాధపడి, తానే ఒక అందమైన నెమలిగా మారి, నెమళ్ళ మధ్యలో చేరి అద్భుతంగా నాట్యం చేయసాగాడు. “రాధా… రాధా…” అనేలా మధురధ్వని చేస్తూ నాట్యం చేశాడు.
ఆ నాట్యాన్ని చూసి రాధ ఆశ్చర్యపోయింది. ఆ నెమలిని దగ్గరకు తీసుకొంది, ఆ నెమలి ఇంకా ఇంకా ఆనందంతో నృత్యం చేస్తోంది. కానీ మిగతా నెమళ్ళు ఆ నాట్యానికి సరితూగలేక ఓటమితో దిగులుగా నిలిచిపోయినట్టు ఆమె గమనించింది. తన వారి బాధలను, కష్టాలనే చూడలేదు రాధమ్మ. ఆవనంలో తనను సంతోషపెట్టే నెమళ్ళ బాధను చూడలేకపోయింది. వెంటనే రాధకు జరిగిందేమిటో అర్థం అయ్యింది,ఆ నెమలి ఎవరో తెలిసింది, తనకోసం కృష్ణుడు పడుతున్న విరహం అర్థమైంది. ఇటు తన వనంలో నెమళ్లను గెలిపించాలని తలపుకూడా వచ్చి తాను కూడా ఒక బంగారు నెమలిగా మారి, వాటి తరఫున నాట్యం చేయడం ప్రారంభించింది.
అది ఒక అపూర్వ దృశ్యం —
కృష్ణుడు నెమలిగా నాట్యం… రాధకోసం
రాధ బంగారు నెమలిగా నాట్యం… కృష్ణునికోసం
చుట్టూ నెమళ్ళ సమూహం ఆనందంతో నాట్యం… రాధాకృష్ణులకోసం నెమళ్ళు.
ప్రకృతి అంతా పులకరించింది. రెండు దివ్య నెమళ్ళు పరస్పరం దగ్గరగా, దూరంగా, గాల్లో ఎగిరి, రంగురంగుల ఈకలను విప్పి అద్భుత విన్యాసాలతో నాట్యం చేశాయి మిగిలిన నెమళ్ళన్నీ ఈ రెండు దివ్య నెమళ్ళ చుట్టూ పురివిప్పి తిరుగుతూ అమోఘమైన నృత్యం చేస్తూ తలలు పైకెత్తి ఖ్రేంకణాలు చేస్తున్నాయి. ఆ సమయంలో ఆకాశంలో ఆ నెమళ్ళ ధ్వని “రాధా–కృష్ణా! రాధా–కృష్ణా..” అని మారుమ్రోగింది.
రాధా వదన విలోకన వికసిత వివిధ వికార విభంగం,
జల నిధిమివ విధు మండల దర్శన తరళిత తుంగ తరంగమ్!
హరిమేక రసం చిరమభిలషిత విలాసం,
సా దదర్శ గురు హర్ష వశంవద వదనమనంగ నివాసమ్!!
(జయదేవ)
ఈ మయూరకూటి లీలను స్మరించుకుంటూ బర్సానాలో ఇప్పటికీ భక్తులు నృత్యాలు చేస్తుంటారు. ఆ దివ్య స్థలాలను దర్శించే వారికి ఆ లీలామాధుర్యం హృదయంలో సజీవంగా నిలుస్తుంది.
రాధే కృష్ణ!
Wednesday, May 20, 2026
బృందావన కథలు - 5 (కాలే ఖాన్ భక్తి )
శ్రీ రాధే కృష్ణ
రాజస్థాన్‌లోని కరోలీ అనే పుణ్యక్షేత్రంలో, మదనమోహన్ ఆలయం సమీపంలో కాలే ఖాన్ అనే పోస్టుమాన్ జీవించేవాడు. అతను వేరే మతానికి చెందినవాడైనా, అతని హృదయం మాత్రం సున్నితమైనది, నిర్మలమైనది.
ఒక రోజు అతని చేతికి ఒక విచిత్రమైన ఉత్తరం వచ్చింది — మదనమోహన్ పేరుతో, ఆలయ చిరునామాతో. కాలేఖాన్ ఆలయ ద్వారం వద్దకు చేరి గోస్వామి గారిని పిలిచాడు.
“ఇక్కడ మదనమోహన్ గారు ఎవరు?” అని వినయంగా అడిగాడు.
గోస్వామి గారు చిరునవ్వుతో, “మన ఠాకూరే మదనమోహన్. భక్తులు ఆయనకు ఉత్తరాలు రాస్తుంటారు,” అని సమాధానమిచ్చారు.
ఆ సమయంలో గుమ్మం లోపల నుండి ఒక దివ్య కాంతి మెరిసింది. ఆ కాంతిలో — క్షణకాలం — మోహనమూర్తి దర్శనమిచ్చింది. ఆ రూపం కాలే ఖాన్ హృదయంలో చెరిగిపోని ముద్ర వేసింది.
అది ఒక చూపే అయినా — అది అతని జీవితం మారడానికి సరిపోయింది.
దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో, వారి హృదయంలో తనపై విరహాన్ని పెంచుతాడు.
కాలే ఖాన్ హృదయంలో అదే విరహం మొదలైంది.
ఆ రోజు నుంచి కాలే ఖాన్ మనసులో ఒక కొత్త తపన మొదలైంది. మదనమోహనుని మరలా చూడాలని, ఆ మాధుర్యాన్ని మళ్లీ ఆస్వాదించాలని అతని అంతరంగం కోరుకుంది. కానీ అతనికి ఆలయంలోకి ప్రవేశం లేదు. మత పరిమితులు అతన్ని బయటే నిలిపేశాయి.
అయినా ప్రేమ మార్గం ఆగదుగా...
కొన్ని రోజులు గడిచాయి. ఆ ఉత్తరాలు రాక కూడా ఆగిపోయింది. అప్పుడు కాలే ఖాన్ ఒక ఉపాయం ఆలోచించాడు. తానే ఉత్తరాలు రాసి, అవి వచ్చినట్టు తీసుకెళ్లి గోస్వామి గారికి అందించేవాడు. ఆ సందర్భంలో ఆలయ గుమ్మం వద్ద నిలబడి, లోపల కనిపించే మదనమోహనుని కొద్ది లఘు దర్శనంతో తన మనసును నింపుకునేవాడు.
అది ఒక భక్తుని సాహసమా? లేక ప్రేమలోని అమాయకత్వమా? — చెప్పడం కష్టం.
ఒక రోజు అతని హృదయం మరింత మధురమైన ఆర్తితో నిండిపోయింది.
“స్వామీ! నేను లోపలికి రాలేను. కానీ నువ్వు బయటికి రావచ్చు కదా!” అని అతను మృదువుగా ప్రార్థించాడు.
నీ సంపూర్ణ దర్శనం కావాలి అని అతను అన్నపానీయాలను మానేశాడు. “నువ్వు దర్శనం ఇచ్చే వరకు నేను తినను, మంచినీళ్లు కూడా తాగను” అని సంకల్పం చేసుకున్నాడు.
రెండుమూడు రోజులు గడిచాయి… శరీరం బలహీనమైంది… కానీ తపన మాత్రం మరింత బలపడింది.
ఒక నాటి అర్థ రాత్రి — నిశ్శబ్దంలో ఒక అద్భుతం జరిగింది.
ఒక బాలుడు అతని ముందుకు వచ్చాడు. మేఘశ్యామల వర్ణం, పెద్ద కన్నులు, తలపై నెమలిపింఛం, పీతాంబరం — ఆ రూపం మాటల్లో చెప్పలేనిది. అతని చేతిలో పాయసం ఉన్న గిన్నె ఉంది.
“కాలే ఖాన్! నీకోసం తెచ్చాను, తిను ” అని బాలుడు మృదువుగా అన్నాడు.
ఆ క్షణంలో కాలే ఖాన్ హృదయం కరిగిపోయింది. మదనమోహనుడి చేతితో పాయసం స్వీకరించి, ఆ బాలుణ్ణి కౌగిలించుకుని ఆనందభాష్పాలతో తడిసిపోయాడు.
ఆ బాలుడు — స్వయంగా శ్రీకృష్ణుడే.
మరుసటి ఉదయం ఆలయంలో కలకలం చెలరేగింది. నైవేద్యానికి ఉంచిన పాయసం గిన్నె కనిపించలేదు. అందరూ ఆశ్చర్యంతో మాట్లాడుకున్నారు.
ఆ సమయంలో కాలే ఖాన్ ఆ గిన్నెతో ఆలయానికి వచ్చి, జరిగినది అన్నీ వివరంగా చెప్పాడు.
భక్తులు, ఊరి ప్రజలు ముందు సందేహించారు, తరవాత మదనమోహనుని లీలలు తెలిసినవారు కావడంచేత ఆశ్చర్యచకితులైయ్యారు. ఇది మదనమోహనుడి లీలే అని గ్రహించారు.
కాలే ఖాన్ హృదయంలో ఒక కోరిక కలిగింది — “ఇక్కడే సేవ చేయాలి.”
కానీ అతను అన్య మతస్థుడవడం వల్ల ఆలయ నియమాల వల్ల అతన్ని ఆలయం లోపలికి అనుమతించలేకపోయారు. కాబట్టి అతనికి ఆలయం బయట ప్రాంగణం శుభ్రం చేసే సేవ అప్పగించారు.
అతను ఆనందంగా అంగీకరించాడు.
రోజులు గడిచాయి. అతని భక్తి మరింత లోతుగా మారింది. కానీ ప్రపంచం మాత్రం అతన్ని అర్థం చేసుకోలేదు. అతని మతస్తులు విమర్శించారు కాఫిర్లకు సేవ చేస్తున్నావ్ అని నిందించారు, అందుకే నీకు సంతానంలేదు అని హేళన చేసారు.. అతని భార్య కూడా బాధతో అతన్ని నిందించింది, తన మతస్థులను సమర్థించింది.
ఒక రోజు కాలే ఖాన్ మదనమోహనుడితో
“స్వామీ! నాకు ఒక సంతానం ఇవ్వు, వీళ్ల నోళ్లు మూయించు.” అని వేడుకున్నాడు
కొద్ది కాలంలో అతనికి కుమారుడు పుట్టాడు. తన మతం వాళ్ళు అల్లా మెహర్బాన్ అన్నారు, ఇతను కృష్ణుని లీల అన్నాడు, ఆనందంతో గుడిద్వారం బైట నుంచుని పదాలు పాడుతూ కొద్దిగా కనిపిస్తున్న శ్రీ కృష్ణుణ్ణి చూస్తూ భజన చేస్తూ గడుపుతున్నాడు.
కాలం గడిచింది. ఆ బాలుడు పెరిగాడు.
ఒక రోజు — విధి మరో పరీక్షను తీసుకువచ్చింది.
ఆ బాలుడిని పాము కాటేసింది.
కాలే ఖాన్ భార్య భయంతో పరుగెత్తుకుంటూ వచ్చి,
“ఇక్కడ గుళ్ళో భజన చేస్తూ కూర్చున్నావా అక్కడ నాకొడుకును పాము కరిచిది త్వరగా వైద్యుణ్ణి తీసుకురా! ఆలస్యం చేసావో... నాకొడుక్కేదైనా ఐతే నీ సంగతి నీ కృష్ణుడి సంగతి చూస్తాను” అని అరిచింది.
కానీ కాలే ఖాన్ — మదనమోహనుని నామస్మరణలో లీనమైపోయాడు. ఆలస్యంగా వైద్యుణ్ణి తీస్కెళ్లాడు.
చివరకు వైద్యుడు వచ్చేసరికి బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
వేదనతో అతని భార్య బాలుణ్ణి ఎత్తుకుని వీధులవెంట పరుగెడుతోంది ఆలయం వేపు, ఆవెనక కాలేఖాన్ వాళ్ళవెనక ఊరిజనాలు వస్తున్నారు . ఆమె తన కొడుకును ఆలయ గుమ్మం ముందు పెట్టి,
“నా కొడుకు బ్రతకాలి! లేకపోతే నిన్నూ ఉండనివ్వను!” అని విలపించింది.
ఆ సమయంలో కాలే ఖాన్ నిశ్చలంగా నిలబడి — కన్నీళ్లు కారుస్తూ — చిరునవ్వుతో ఇలా అన్నాడు:
“ప్రభూ! నేను వేరే మతానికి చెందినవాడిని.
కానీ నువ్వు జగన్నాథుడివని అందరూ అంటారు.
ఈ సత్యాన్ని నిరూపించు!” అంటూ
"దయగలవాడా, కరుణామయుడా, ఈ జగత్తులో ఉన్న శ్రేష్ఠుడా,
నన్ను వంటి పేదవారి పాపాలను క్షమించు.
కాలే ఆతురతతో నీ దర్వాజా ముందు నిలబడి ఉన్నాడు,
నంద కుమారుడా, ఈసారి కొంచెం దయ చూపించు.
హిందువుల దేవుడివే ఐతే నిన్ను నిలదీయడానికొ మాకు ఎలాంటి హక్కు లేదు
కాని జగత్తుకే నాథుడివైతే, మాపై కూడా దృష్టి సారించు కనికరించవా! జగమ్నాథా! మదనమోహనా!"
అని ప్రార్థించాడు. ఈ అర్థం వచ్చేలా పాడాడు.
అప్పుడు అతని కన్నీటి చుక్క బాలుడిపై పడింది…
ఒక్క క్షణం తర్వాత — అద్భుతం!
బాలుడు ఒక్కసారిగా లేచాడు!
“అమ్మా! నా స్నేహితుడు ఎక్కడ?” అని అడిగి, లేచి అటూ ఇటూ వెతికేసుకుంటున్నాడు.
“ఎవడు?” అని ఆశ్చర్యంతో అడిగితే,
“గిరిజాల జుట్టు ఉన్న ఒక బాలుడు… నాతో ఆడుకుంటున్నాడు సాయంత్రం నుంచీ, ఇప్పుడు మీరందరూ వచ్చారు తను ఎటోవెళ్ళిపోయాడు…” అన్నాడు.
అందరూ ఆశ్చర్యపోయారు...
కాలే ఖాన్ ఆనందభాష్పాలతో,
“స్వామీ! నా పిల్లాడితో స్నేహితుడిలా ఆడుకున్నావా! ఈ జగత్తే నీ లీల, అది నీకో ఆటకదా ! జగన్నాథా !” అంటూ, కనుకొనల్లోంచి నీరు ధారగా ప్రవహిస్తున్నా, గానం చేస్తూ ఆ మదనమోహన రూపాన్నే చూస్తూ ఉండిపోయాడు.
----
ఆ రోజు నుంచి కాలే ఖాన్ కేవలం ఒక పోస్టుమాన్ కాదు…
అతను కృష్ణభక్తుల చరిత్రలో ఒక చిరస్మరణీయ వ్యక్తిగా మారాడు.
ఇప్పటికీ కరోలీ ప్రాంతంలో, మదనమోహనుని లీలల్లో ఈ కథను భక్తులు ఆవేదనతో, ఆనందంతో స్మరించుకుంటారు. రాజస్థాన్లోని మేవార్ ప్రాంతాన్ని తన భక్తులకోసం కృష్ణుడే మరో బృందావనంగా ఎంచుకున్నాడని భక్తుల విశ్వాసం ఆ ప్రాంతాన్ని గుప్త బృందావనా పిలుస్తారు.
శ్యామ సుందర్ మదన మోహన్ బాఁసురి వాలే
తూ న సంభాలే తో హమే కౌన్ సంభాలే?
జై మదన మోహన్ - రాధా మోహన్
జై మదన మోహన్ - రాధా మోహన్
-శంకరకింకరః
Tuesday, May 19, 2026
బృందావన కథలు - 4 ( భక్తి - ప్రేమ - దీక్ష - అలకల కలయిక. కృష్ణదాస్ - రాధాదాస్ )
జై రాధే కృష్ణ
కృష్ణునికి దాసుడిగా తనను ప్రకటించుకుని, నిరంతరం ఆయన సేవలో లీనమై జీవించిన ఒక భక్తుడు “కృష్ణదాస్”గా ప్రసిద్ధి చెందాడు.
ఒకసారి బృందావనంలో సత్సంగంలో మహాభారత కథలు వింటూ ఉండగా, “ఏ కార్యమైనా పుష్కరకాలం — పన్నెండేళ్లు — వ్రతంలాగా ఆచరిస్తే అది సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది” అని భీష్మాదులు చెప్పిన మాటలు అతని హృదయంలో గాఢంగా ముద్రపడ్డాయి.
మరుసటి రోజు ఒక దివ్యమైన సంకల్పం పుట్టింది. ఒక అందమైన పూలమాల తీసుకుని ఠాకూర్ కి సమర్పించి ఇలా అన్నాడు:
“స్వామీ! ఈరోజు నుంచి పన్నెండేళ్ల పాటు ప్రతిరోజూ నీకు పూలమాలలు తీసుకొస్తాను. పదమూడో సంవత్సరపు మొదటి రోజున నువ్వే నా ఇంటికి వచ్చి నా ఆతిథ్యం స్వీకరించి, నీ చేతులారా మాలను నువ్వే ధరించాలి.”
ఆ రోజు నుంచి ప్రతిరోజూ రంగురంగుల, సువాసనభరితమైన పూలమాలలు సమర్పిస్తూ, కృష్ణస్మరణలో మునిగి జీవించాడు.
ఒక సంవత్సరం… రెండు… మూడు… ఐదు… ఏడు… పది… చివరకు పన్నెండో సంవత్సరపు చివరి రోజు వచ్చింది.
ఆ రోజు కూడా స్వామికి మాల సమర్పించి, తన వ్రతాన్ని మరలా గుర్తు చేశాడు:
“స్వామీ! పన్నెండేళ్లు నీకు సేవ చేశాను. రేపు నేను రాను… నువ్వే నీ మిత్రులతో, గోపికలతో కలిసి నా ఇంటికి వచ్చి నా ఆతిథ్యం తీసుకోవాలి, మాల వేసుకోవాలి నేను ఎదురుచూస్తుంటాను.” అని ఒకటికి పది సార్లు చెప్పాడు.
ఆ రాత్రి అతనికి నిద్ర రాలేదు.
“ఎవరెవరితో వస్తాడు? గోపాలురతోనా? గోపికలతోనా? సర్కార్ (రాధమ్మ)ని తీసుకొస్తాడా? ఎలా వస్తాడు? ఎప్పుడొస్తాడు?”
అని ఆలోచిస్తూ, తన చిన్న కుటీరాన్ని శుభ్రపరిచి, కడిగి, ముగ్గులు వేసి అలంకరించాడు.
తెల్లవారుఝామునే స్నానం చేసి, ఛప్పన్ భోగ్ సిద్ధం చేశాడు. సువాసనగల పూలమాలలు కట్టి సిద్ధం చేశాడు.
గుమ్మం దగ్గర నిలబడి ఎదురు చూస్తున్నాడు.
సూర్యుడు ఉదయించి అరుణ కాంతుల నుంచి క్రమంగా తీక్ష్ణ కాంతిని విరజిమ్ముతున్నాడు… కానీ స్వామి రాలేదు.
“ఏమో… నందుడు ఏదైనా పని చెప్పాడేమో… యశోదమ్మ ఆపిందేమో… ఇంకొంచెంలో వస్తాడు…”
అని తనను తాను ఓదార్చుకున్నాడు.
మధ్యాహ్నం సమీపించింది.
“ఈ ఠాకూర్‌కి ఎక్కడలేని రాచకార్యాలుంటాయి… ఎవరైనా కష్టంలో ఉంటే వెంటనే సహాయం చేయాలి కదా…”
అని ప్రేమతో కూడిన కోపంతో అనుకుంటున్నాడు.
మధ్యాహ్నం దాటింది… అలక పెరిగింది… కోపం మరింత ఉద్ధృతమైంది:
“అవున్లే! ఈ కృష్ణుడికి ఇప్పుడు రాచరికాలు ఎక్కువైపోయాయి!
పన్నెండేళ్లు సేవ చేశాను… ఒక్కరోజు రమ్మంటే రాడా?”
సాయంత్రం సమీపించింది.
ఇక రాడని నిర్ణయించుకున్నాడు.
వండిన ఛప్పన్ భోగ్, పూలమాలలు మూటకట్టుకుని,
“ఈ కృష్ణుడు మాట మీద ఉండడు! సేవ చేయించుకుంటాడు కానీ సేవకుల మనసులోని కోరికలు నెరవేర్చడు! ఏం తనని దర్శించడానికి వచ్చిన పెద్ద పెద్ద భక్తుల కోరికలే తీరుస్తాడా, వాళ్ళమాటలే విని వాళ్ళనే పట్టించుకొని, వాళ్ళకి కావలసినవి తీరుస్తాడా? మరి నేను వెర్రివాణ్ణా ఇన్నేళ్లు సేవచేసాను, నన్ను పట్టించుకోడా?నేనంటే అసలు లెక్కలేదా” అని కోపంతో, అలకతో, బృందావనాన్ని వదిలి, బర్సానాకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
ఇల్లు తాళం వేసి, మూటముల్లె నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు… లోలోపల మాత్రం — “పన్నెండేళ్ల వ్రతం ఫలించలేదే?” అనే వేదన, రోషం.
అప్పుడే వెనకనుండి ఒక గోపాలుడు కేక వేశాడు:
“బాబా! పక్కకు జరుగు! గోవుల మంద వస్తోంది!”
కృష్ణదాస్ పక్కకు జరిగి చూస్తే — వందలాది, వేలాది గోవులు మందలుగా వస్తున్నాయి.
“ఎవరివి ఇవి?” అని అడిగాడు.
“నందబాబావి!” అన్నాడు ఆ బాలుడు.
కొద్దిసేపటికి బాలుడు దగ్గరకు వచ్చి,
“బాబా! నీ దగ్గర ఎంతో మంచి వంటల వాసన వస్తోంది. ఏముంది మూటలో?” అని అడిగాడు.
కృష్ణదాస్ విసుగుతో జరిగిందంతా చెప్తూ
“కృష్ణుడి కోసం సిద్ధం చేసినవి. కానీ అతను రాలేదు!” అన్నాడు
బాలుడు మృదువుగా అన్నాడు:
“నాకు చాలా ఆకలేస్తోంది బాబా… పొద్దున్నుంచి గోవులు కాస్తూ ఏమీ తినలేదు… నువ్వూ తినలేదు కదా… ఇద్దరం కలిసి తిందామా?”
కృష్ణదాస్ కోపంతోనే:
“అవును! నేనూ తినలేదు! రాని కృష్ణుడి కోసం ఎందుకు ఆకలితో ఉండాలి?”అని మూట విప్పాడు.
అప్పుడు బాలుడు అన్నాడు:
“బాబా! నువ్వొక ముద్ద తిను… నాకు ఒక ముద్ద పెట్టు… ఇద్దరం కలిసి తిందాం.”
కృష్ణదాస్ చిరాకు పడ్డాడు:
“నీకు భోజనం పెట్టడం కాకుండా నోట్లో పెట్టాలా? ఈ నందగావ్ పిల్లలందరికీ ఇదే అలవాటా!”
బాలుడు అమాయకంగా తన చేతులు చూపించాడు:
“చూడూ బాబా… గోవుల సేవ చేస్తూ చేతులు అన్నీ పేడతో నిండిపోయాయి… నేను ఎలా తినగలను? నువ్వే తినిపించవా?”
అది చూసి కృష్ణదాస్ " మీ నందగావ్ పిల్లలకి ఏదో మాయ మాటలు చెప్పి సేవ చేయించుకోవడం బాగా అలవాటు, ఆ కృష్ణుడు అలవాటు చేసాడా?" అంటూ దెప్పుతూ ఒక ముద్ద అతనికి పెట్టి, ఒక ముద్ద తాను తినసాగాడు.
అలా కొద్దిసేపటికి బాలుడి కళ్ళలో నీళ్లు తిరిగాయి.
“ఏమైంది?” అని అడిగాడు.
బాలుడు ఏడుస్తూ అన్నాడు:
“బాబా… మాల ఎందుకు వేయలేదు? మాల వేయి బాబా!”
అప్పుడే కృష్ణదాస్ ఆశ్చర్యపోయి:
“నువ్వెవరు?” అని అడిగాడు.
క్షణంలోనే ఆ బాలుడు పెద్ద పెద్ద కళ్ళతో, గిరజాల జుట్టుతో, ముత్యాలసరాలు, నెమలి పింఛంతో, పీతాంబరధారియై శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు:
“బాబా! ప్రతిరోజూ నువ్వు నీ చేతులతో నాకు మాల వేస్తుంటే, అది నీ ఆలింగనం లాంటిది. పన్నెండేళ్లుగా ఆ ప్రేమకు నేను అలవాటు పడ్డాను. నేను నీ ఇంటికి వచ్చి నేనే మాల ఎలా వేసుకుంటాను? నువ్వే వేయాలి కదా!”
భక్తులు దేవుని యెదుట పొంగిన భక్తి వల్ల అమాయకంగానూ, ఒక్కోసారి గడుసుగానూ ప్రవర్తిస్తారు, భగవంతుడు ఆ చేష్టలు చూసి మురిసిపోతాడు.
ఇది విని కూడా కృష్ణదాస్ గడుసుగా అన్నాడు:
“అది కాదు! నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు! నేను బర్సానా వెళ్లి అక్కడ సర్కార్ కి (రాధారాణికి) ఫిర్యాదు చేస్తానని భయపడి వచ్చావు! నాకోసం కాదులే ! ఈ మాలను నేను మా లాడ్లీ రాధారాణికే ఇస్తాను!”
అని మూటలు సర్దుకుని వేగంగా బర్సానా వైపు బయలుదేరాడు.
వెనక కృష్ణుడు ఆత్రంగా పిలుస్తూ:
“బాబా! ఆగు! నా మాట విను, చెప్పేది విను!” అంటూ వడిగా వస్తున్నాడు
కానీ కృష్ణదాస్ వినలేదు:
“నేనాగను! ఇకపై నా పేరు కృష్ణదాస్ కాదు… రాధాదాస్!”
అని వెనక్కి చూడకుండా ముందుకు సాగిపోయాడు.
తన వెనక కృష్ణుడు "బాబా! ఆగు, ఆగు! అని అరుస్తూ వెంటపడి, వెంటపడి వస్తున్నాడు"
కృష్ణదాస్ పట్టించుకోకుండా నేను లాడ్లీ దగ్గరకెళ్ళిపోతానని వడివడిగా వెనక్కి చూడకుండా వెళ్తున్నాడు.
కాసేపటికి కృష్ణదాస్ బర్సానాకు చేరుకుని రాధారాణి సన్నిధిలో చూసే సరికి — అక్కడ కృష్ణుడు నిలబడి చిలిపి నవ్వులు రువ్వుతూ ఉన్నాడు!
ఆశ్చర్యంతో వెనక్కి తిరిగి చూస్తే — వెనుకనుండి వస్తున్నది కృష్ణుడు కాదు గారాలపట్టి తన సర్కార్ రాధారాణి!
ఆ దివ్యలీల చూసి కృష్ణదాస్ కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు.
ఆ ఇద్దరూ వేరు కాదు
కిశోరీయే కిశోర్ - కిశోరే కిశోరీ,
లాడ్లీయే లాలా -'లాలాయే లాడ్లి,
ఠాకూరే సర్కార్, సర్కారే ఠాకూర్,
రాధాకృష్ణులు వేర్వేరు కాదు ఇద్దరూ ఒకటే అని తెలుసుకొని, భక్తి పరవశంలో నామం చేస్తూ, పాటలు పాడుతూ నృత్యం చేస్తూ, ఇద్దరికీ తాను చేసిన వంటలు ప్రేమతో సమర్పించి, ఇద్దరికీ పూలమాలలు తానే స్వయంగా అర్పించాడు.
పన్నెండేళ్ళూ తాను పూమాలలు సమర్పిస్తున్నాననుకున్నాడు, కానీ పూమాలలు వేస్తూ రోజూ ఠాకూర్ని ఆలింగనం చేస్కుంటున్నానని గమనించలేకపోయాడు. పన్నెండేళ్లలో ప్రతిదినం కృష్ణదాస్ వల్ల పొందిన ఆలింగన సాంత్వనను శ్రీ కృష్ణుడు వదలలేకపోయాడు... అది కృష్ణుడికి తదేక వ్రతమైంది, కృష్ణదాస్ పుష్కర కాలం తదేక దీక్షతో చేసిన కార్యం ఇలా సిద్ధించి వ్రతం సంపూర్ణంగా సాఫల్యమైంది.
ఆవిధంగా కృష్ణదాస్… రాధాదాస్ అయ్యాడు.
తుమ్ కృపాళు సర్కార్ హమారీ!
పార్ కరో యా మారోరీ కిశోరీ రాధే!!
-శంకరకింకరః
Monday, May 18, 2026
బృందావన కథలు - 3 (బిహారిన్దాస్ తిలకం)
జై రాధే కృష్ణ
బృందావనంలో శ్రీకృష్ణుడితో కూడి, బరసానాలో విరాజిల్లే లాడ్లీ రాధారాణి లీలలు అమోఘమైనవి, అనిర్వచనీయమైనవి. నేటికీ ఆ లాడ్లీ (గారాల పట్టి) తన భక్తులను ప్రేమతో కాపాడుతూ, అనేక లీలలతో వారిని ఆనందింపజేస్తూనే ఉంది.
పూర్వం అన్యమత రాజులు పాలించిన కాలంలో, ఒక పాదుషా ఇలా ఫర్మానా జారీ చేశాడు:
“రేపటి నుండి రాజోద్యోగులెవరూ తిలకం, చందనం, విభూది, బొట్టు వంటి ధార్మిక చిహ్నాలు ధరించకూడదు. ఎవరైనా తమ ఇష్టదేవతా చిహ్నాలతో వస్తే, వారికి కఠినమైన మరణ శిక్ష విధించబడుతుంది.”
అక్కడ రాజసేవలో ఉన్న రాధారాణి భక్తుడు బిహారిందాస్ ఈ వార్త విని తీవ్రంగా కలత చెందాడు. ఈ రాజాజ్ఞ రాజ్యమంతా ప్రకటించారు. బిహారిన్దాస్ ఇంటికి చేరగానే అతని తల్లి ప్రేమతో, “నాయనా, ఇకపై తిలకం ధరించకు; ప్రాణాపాయం ఉంది” అని హెచ్చరించింది.
బిహారిందాస్ బాధతో ఏమీ పలకకుండా ధ్యానంలో మునిగిపోయాడు. కళ్లలో కన్నీళ్లు ధారగాపోతూనే ఉన్నాయి. ఆ వేళ రాధారాణి ప్రత్యక్షమై, “ఏమిటి ఈ బాధ? ఎందుకు ఇంత వేదన?” అని మృదువుగా అడిగింది.
అప్పుడు బిహారిందాస్ వినమ్రంగా అన్నాడు:
“అమ్మా! ప్రియురాలి అలంకారం ప్రియునికోసం అయినట్లే,
పతివ్రతా స్త్రీ అలంకారం తన భర్తకోసం అయినట్లే,
భక్తుని అలంకారం భగవంతునికోసమే కదా!
నేను ప్రతిరోజూ నీకోసం చందనం తిలకం ధరిస్తాను. ఇక అది చేయలేనని బాధపడుతున్నాను.”
రాధారాణి సానుభూతితో, “ఎందుకు చేయలేవు?” అని అడిగింది. బిహారిందాస్ పాదుషా ఆజ్ఞను వివరించి కన్నీళ్లతో తన బాధను తెలియజేశాడు.
అప్పుడు రాసేశ్వరి రాధారాణి తన కుడికాలి బ్రొటనవేలితో అతని నుదుటిపై, ఆజ్ఞా చక్రం నుండి నొసటిపైవ్వరకూ ఉన్న చందన తిలకాన్ని ముక్కు చివరి వరకు పొడవుగా లాగి చందన తిలకం దిద్దింది.
“ఇప్పుడు ఇది ఇంతకుముందు కంటే మరింత విశిష్టంగా రెండింతలు పొడవుగా ఉంది. ధైర్యంగా వెళ్ళు— ప్రేమాస్పదమైన నీ భక్తిని ఎవరూ అడ్డుకోలేరు” అని ఆశీర్వదించి అంతర్ధానమైంది.
బిహారిందాస్ కళ్లుతెరిచి చూసినప్పుడు, అది కల కాదని గ్రహించాడు. తన నుదుటిపై అద్భుతమైన చందన తిలకం ప్రకాశిస్తోంది. రాధారాణి ప్రత్యక్షమై తన కాలి బ్రొటనవేలితో తన నుదురు స్పర్శించిన అనుభూతి మళ్ళీ మళ్ళీ నెమరువేసుకోసాగాడు. అతని కళ్లలో కన్నీళ్లు ఇంకా ఉన్నప్పటికీ, అవి ఇప్పుడు భయం వల్ల కాదు—ఆనందం, ప్రేమ, ధైర్యం వల్ల.
మరుసటి రోజు ఉదయం, అదే తిలకంతో రాజసభకు వెళ్లగా, భటులు అతన్ని పట్టుకొని పాదుషా ముందుకు తీసుకువచ్చారు. పాదుషా గంభీరంగా, “నా ఆజ్ఞను ఎందుకు అతిక్రమించావు?” అని ప్రశ్నించాడు.
బిహారిందాస్ తన అనుభవాన్ని భక్తి పరవశంతో వివరించాడు.
అది విన్న పాదుషా నవ్వుతూ అన్నాడు:
“ఇదే నిజమైన భక్తి! మేము భగవంతుని పట్ల మీ అందరి నిష్ఠను పరీక్షించడానికి మాత్రమే ఈ ఫర్మానా జారీ చేశాము. మీరు అందరూ మీ ఇష్టదేవతా చిహ్నాలను భగవంతుని ప్రీతికోసం ధరించండి—ఆడంబరం కోసం, మీ అలంకారం కోసం కాదు.” అని చెప్పి బిహారిందాస్‌ను ఘనంగా సత్కరించి పంపించాడు.
బిహారిందాస్ గోస్వామికి జై!
(ఈ రోజుకూడా ఆయన పరంపరలోని భక్తులు నుదుటంతా చందనం అలంకరించి, ముక్కు వరకు విస్తరించే తిలకాన్ని రాధారాణి కృపగా ధరిస్తుంటారు.)
జై శ్యామా ప్యారీ కుంజ్ బిహారీ
-శంకరకింకరః