Pages

Saturday, May 30, 2026

బృందావన కథలు – 21 ( శ్యామానంద ప్రభు)

జై రాధే! జై జై శ్రీ రాధే!

బృందావనంలో ప్రతి ఇసుకరేణువూ ఒక కథ చెబుతుంది.
ప్రతి కుంజమూ ఒక రహస్యాన్ని దాచుకుంటుంది.
ప్రతి పుష్పమూ ఒక ప్రేమగీతాన్ని ఆలపిస్తుంది.
యమునా అలలు తీరాన్ని ముద్దాడుతూ ప్రవహిస్తున్నాయి.
కదంబవృక్షాలు మృదువైన గాలికి తలలూపుతున్నాయి.
నెమళ్లు తమ పించాలను విప్పి నాట్యం చేస్తున్నాయి.
అలాంటి పవిత్రమైన ధామంలో ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన పేరు కృష్ణదాస్, ముభావంగా ఉండడంతో ఆయనను "దుఃఖీ కృష్ణదాస్" అనేవారు.
పేరు దుఃఖీ అయినా, అతని హృదయంలో మాత్రం దుఃఖానికి చోటు లేదు.అక్కడ నిండుగా ఉన్నది ఒక్కటే — రాధాకృష్ణుల పట్ల అపారమైన ప్రేమ - భక్తి.
అతని కన్నులు ఎప్పుడూ రాధా-కృష్ణుల లీలల కోసం వెతికేవి.
అతని నాలుక ఎప్పుడూ "రాధే... రాధే..." అనే నామాన్ని జపించేది.
అతని చేతులు ఎప్పుడూ భక్తి, భజన, సేవలో నిమగ్నమై ఉండేవి.
ఒకసారి బృందావనానికి వచ్చిన అతడు,
"ఈ జన్మలో నాకు ఇంకేమీ వద్దు. రాధారాణి ధామంలో ఒక ధూళిరేణువుగా ఉండగలిగితే చాలు"అని ప్రార్థించాడు.
భక్తుని హృదయంలోని ఆ వినయాన్ని చూసి బృందావనమే అతనిని తన ఒడిలో చేర్చుకుంది.
రాధే జయ జయ మాధవ దయితే !
గోకుల తరుణీ మండల మహితే !!
రోజులు గడుస్తున్నాయి...
ప్రతి రోజు బ్రహ్మముహూర్తాన లేచి,
నిధివనానికి వెళ్లి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయడం అతని నిత్యసేవ. చీపురు చేతిలో ఉన్నా, మనస్సులో మాత్రం రాధా-కృష్ణుల రాసలీలలు తలుచుకుంటుండేవాడు.
అతను ఊడుస్తున్నది ఆకులను కాదు.
తన హృదయంలోని అహంకారాన్ని.
అతను తొలగిస్తున్నది చెత్తను కాదు.
జన్మజన్మల వాసనలను.
అందుకే అతని సేవ రోజురోజుకూ మరింత పవిత్రమవుతోంది.
ఎందుకంటే బృందావనంలో చేసిన చిన్న సేవ కూడా రాధారాణి దృష్టిని ఆకర్షిస్తుంది.
యాహి మాధవ! యాహి కేశవ!
మా వద కైటవ వాదమ్!!
అలా గడుస్తుండగా ఒక నాడు..
అది సాధారణ ఉదయం కాదు. రాత్రి రాసలీలల సుగంధం ఇంకా నిధివన్ గాలిలో తేలియాడుతోంది. చంద్రుడు ఇంకా ఆకాశంలో తన వెన్నెలను చిందిస్తున్నాడు.దుఃఖీ కృష్ణదాస్ ఎప్పటిలాగే నిధివనాన్ని శుభ్రం చేస్తున్నాడు.
అకస్మాత్తుగా... ఒక అపూర్వమైన కాంతి అతని దృష్టిని ఆకర్షించింది. నేలపై ఏదో ప్రకాశిస్తోంది. మొదట అది చంద్రకిరణం అనుకున్నాడు.
కానీ కాదు. అది ఒక అద్భుతమైన దివ్య నూపురం. రత్నాల కాంతితో మెరిసిపోతోంది. దానిని చూడగానే అతని గుండె వేగంగా కొట్టుకుంది. చేతులు వణికాయి. కన్నులు విస్తారంగా తెరుచుకున్నాయి.
"ఇది ఎవరిది?" అని ఆశ్చర్యపోయాడు. దానిని చేతిలోకి తీసుకున్న క్షణంలోనే ఒక అపూర్వమైన ఆనంద తరంగం అతని శరీరమంతా వ్యాపించింది.
ఆనందబాష్పాలు అతని కన్నుల నుంచి జాలువారాయి. "ఇది ఈ లోకానికి చెందినది కాదు...
ఇది తప్పకుండా రాధారాణి పరివారానికి చెందినదే..." అని అతని హృదయం చెప్పింది.
స్మర గరళ ఖండనం
మమ శిరసి మండనం
దేహి పద పల్లవ ముదారమ్!!
కొద్దిసేపటికి ఒక అపూర్వ సౌందర్యవతి అక్కడికి వచ్చింది. ఆమె ముఖం చంద్రబింబంలా ప్రకాశిస్తోంది. ఆమె మృదువుగా అడిగింది. "భక్తా! నీ చేతిలో ఉన్న నూపురం మాకు చెందింది. దానిని తిరిగి ఇవ్వగలవా?"
దుఃఖీ కృష్ణదాస్ వినయంగా నమస్కరించి "అమ్మా! ఇది సాధారణ నూపురం కాదు. దీని యజమాని మీరా? మీరే ఐతే ఇస్తాను లేదా దాని నిజమైన యజమాని స్వయంగా వచ్చి తీసుకుంటేనే నేను ఇస్తాను." అన్నాడు.
ఆ యువతి చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వులో ఒక రహస్యం ఉంది. ఆమె వెళ్లిపోయింది.
కొద్దిసేపటి తరువాత...
ఆమె మళ్లీ వచ్చింది. కానీ ఈసారి ఒంటరిగా కాదు. ఆమె వెనుక నడుస్తూ వస్తున్న ఒక దివ్య రూపాన్ని చూసిన క్షణంలోనే దుఃఖీ కృష్ణదాస్ శ్వాస ఆగిపోయినట్టైంది. కోటి చంద్రుల కాంతి ఒక్క రూపంగా అవతరించినట్లుంది. అనంత కరుణకు రూపముంటే అది ఇదేనేమో అనిపించింది.
ఆమె నేత్రాలు ప్రేమసాగరాలు.
ఆమె చిరునవ్వు అమృతవర్షం.
ఆమె నడక సంగీతం.
ఆమె దర్శనం ముక్తి.
ఎవరో కాదు...
సాక్షాత్తు రాధారాణి!
ప్రియే చారుశీలే!
ముంచ మయి మానమనిదానం!!
ఆ దివ్యరూపాన్ని చూసిన క్షణంలోనే దుఃఖీ కృష్ణదాస్ నేలపై సాష్టాంగంగా పడిపోయాడు. అతని శరీరం వణుకుతోంది. కన్నీళ్లు ఆగడం లేదు. మాటలు రావడం లేదు. రాధారాణి మృదువుగా .
"దుఃఖీ... నా నూపురం నీ వద్ద ఉందని విన్నాను." అని పలికింది.
ఆ స్వరం వినగానే అతని హృదయం కరిగిపోయింది.
"అమ్మా! ఈ నూపురం మీదే.
ఇది నాకు దొరికిన అదృష్టం కాదు.
మీ దర్శనం లభించడం నా జన్మల పుణ్యం." అంటూ కన్నీటి కళ్లతో నూపురాన్ని సమర్పించాడు.
రాధారాణి ప్రేమగా ఆ నూపురాన్ని తీసుకుంది.
ఆ తరువాత అక్కడ జరిగినది ఆభక్తుని చరిత్రలో ఒక అద్భుతం.
ఆమె ఆ నూపురాన్ని అతని నుదుటికి తాకించింది.
ఆ స్పర్శతో అతని అంతరంగం దివ్యప్రేమతో నిండిపోయింది.
వేల జన్మల తపస్సు ఒక్క క్షణంలో ఫలించినట్లైంది.
అతని నుదుటిపై ఒక ప్రత్యేక తిలకచిహ్నం ప్రత్యక్షమైంది.
అది కేవలం తిలకం కాదు.
రాధారాణి కృపాముద్ర.
కురు యదు నందన!
చందన శిశిరతరేణ కరేణ పయోధరే!!
రాధారాణి ప్రేమగా వాత్సల్యంతో
"ఇక నుంచి నీవు దుఃఖీ కాదు. నా శ్యామసుందరుని ప్రేమానందాన్ని పొందినవాడివి. ఇక పై నుండి నీ పేరు శ్యామానంద" అని పలికింది.
ఆ మాట వినగానే దుఃఖీ కృష్ణదాస్ హృదయం ప్రేమ-భక్తి సాగరంలో మునిగిపోయింది.
రాధారాణి స్వయంగా ప్రసాదించిన పేరు!
రాధారాణి స్వయంగా ప్రసాదించిన తిలకం!
రాధారాణి స్వయంగా ప్రసాదించిన కృప!
ఇంతకంటే గొప్ప సంపద మరొకటి ఉందా?
ఆ రోజు నుంచి ఆయన శ్యామానంద ప్రభుగా ప్రసిద్ధి చెందారు.
కానీ ఆయనలో గర్వం రాలేదు.
"నేను రాధారాణి దాసుడిని మాత్రమే"
అనే భావం మరింత పెరిగింది.
అదే నిజమైన భక్తుని లక్షణం.
దైవానుగ్రహం పెరిగే కొద్దీ వినయం పెరగాలి.
పుష్పంలో సుగంధం పెరిగే కొద్దీ తల వంచినట్లే,
భక్తి పెరిగే కొద్దీ భక్తుడు మరింత నమ్రుడవుతాడు.
"కృష్ణుడు ధర్మం న్యాయం చూస్తాడు...
రాధారాణి ప్రేమను చూస్తుంది."
ఈ రోజు కూడా నిధివనం ధూళిలో నడుస్తూ "రాధే... రాధే..." అని పిలిచే ప్రతి భక్తుడి హృదయంలో
శ్యామానంద ప్రభువు కథ ఒక మధుర గీతంలా వినిపిస్తూనే ఉంటుంది.
రాధారాణి నూపురం దొరికింది కాబట్టి ఆయన మహానుభావుడు కాలేదు.
ఆ నూపురానికి అర్హమైనంత వినయం ఆయనలో ఉండింది కాబట్టే రాధారాణి ప్రత్యక్షమైంది.
జై శ్రీ రాధే రాధే!
జై శ్రీ శ్యామానంద ప్రభు!
-శంకరకింకరః

No comments:

Post a Comment