జై రాధే! జై శ్యామ్!
బృందావనం...
అది ప్రేమకు రూపం వచ్చిన ధామం. అక్కడ ప్రతి గాలి "రాధే... రాధే..." అని జపిస్తుంది. ప్రతి పక్షి "శ్యామ్... శ్యామ్..." అని ఆలపిస్తుంది. యమునమ్మ అలలు కూడా యుగళనామస్మరణతోనే ప్రవహిస్తాయి. కదంబవృక్షాలు తమ కొమ్మలను భూమివైపు వంచి, రాధా-మాధవుల మధురలీలలను దర్శించాలనే తపనతో నిలిచి ఉంటాయి.
అటువంటి ఒక మధురసాయంత్రం...
ఆకాశమంతా నల్లని మేఘాలతో నిండిపోయింది. చల్లని గాలి వీస్తోంది. దూరాన మేఘగర్జనలు వినిపిస్తున్నాయి. వర్షదేవుడు భూమిని ఆలింగనం చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లుగా ప్రకృతి అంతా ఒక మధుర నిరీక్షణలో ఉంది.
కానీ ఆ మేఘాల కంటే ఎక్కువ అలజడి ఒక చిన్న హృదయంలో ఉప్పొంగుతోంది.
అది మన రాధమ్మ హృదయం.
ఆ రోజు ఉదయం నుంచీ శ్యామసుందరుని దర్శనం కాలేదు. ప్రతి క్షణం యుగంలా అనిపిస్తోంది. ప్రతి శ్వాసలో ఆయన పేరే ఉన్నా, ప్రతి చూపు ఆయన కోసం వెతుకుతోంది.
అంతలో కీర్తిదామాత పిలిచింది.
“లాలీ! ఈ రోజు బయటకు వెళ్లకు. ఆకాశమంతా మేఘాలతో నిండిపోయింది. ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలియదు.”
రాధమ్మ తల ఊపింది. కానీ మనసు మాత్రం యమునాతీరం వైపు ఎగిరిపోయింది.
"ఈ నల్లని మేఘాలను చూస్తుంటే నా శ్యాముడే గుర్తుకు వస్తున్నాడు. ఆయన మేఘశ్యాముడు కదా! నేనిలా తపిస్తున్నట్లే ఆయన కూడా నన్ను తలుచుకుంటూ ఉండి ఉంటాడు. నేను వెళ్లకపోతే ఎంత బాధపడతాడో!"
అని మనసులో అనుకుంది.
కొద్దిసేపటికి తల్లి గాఢనిద్రలోకి జారుకుంది. రాధమ్మ మెల్లగా లేచింది. ద్వారం నెమ్మదిగా తెరిచింది. బయటకు అడుగుపెట్టబోతూ తన పాదాలవైపు చూసింది.
అక్కడ గజ్జెలు మెరుస్తున్నాయి.
వాటిని చూసి చిరునవ్వు నవ్వింది.
“ఈ రోజు మీరు శబ్దం చేయకూడదు. మన రహస్యం బయటపడకూడదు.”
అని మెల్లగా చెప్పింది.
గజ్జెలు కూడా తమ స్వామినీ ఆజ్ఞను శిరసావహించిన భక్తుల్లా నిశ్శబ్దంగా నిలిచిపోయాయి.
రాధమ్మ వేగంగా యమునాతీరానికి చేరుకుంది.
దూరంగా ఒక కదంబవృక్షం నీడలో శ్యామసుందరుడు కూర్చొని ఉన్నాడు. చేతిలో వేణువు. ముఖంలో మధురమైన చిరునవ్వు. మేఘాల మధ్య మెరిసే నీలమణిలా ఆయన రూపం ప్రకాశిస్తోంది.
ఆ దృశ్యం చూసి రాధమ్మ హృదయం ఆనందంతో నిండిపోవాలి.
కానీ...
అలా కాలేదు.
ఎందుకంటే...
శ్యాముడి పక్కనే ఒక గోపిక కూర్చొని ఉంది!
ఇద్దరూ నవ్వుకుంటూ ఏదో మాట్లాడుకుంటున్నారు.
అంతే...
రాధమ్మ హృదయంలో ప్రేమతో కూడిన అలక మేఘంలా కమ్ముకుంది.
"హ్మ్! నేను ఇక్కడ ఆయన కోసం ప్రాణం పెట్టి తపిస్తున్నాను. ఆయన మాత్రం ఎంతో సంతోషంగా ఉన్నారు. నా కోసం ఎదురు చూస్తున్నారనుకున్నాను. కానీ ఆయనకు నా జ్ఞాపకమే లేదేమో!"
అని అనుకుంది.
ఆలోచనతోనే ఆమె నేత్రాలు కన్నీటితో నిండిపోయాయి. బొటబొటా కన్నీటి బిందువులు చెక్కిళ్లపై జారాయి. కంటినిండా పెట్టుకున్న కాటుక కూడా కరిగి ఆ కన్నీటి ప్రవాహంలో కలసి నల్లని రేఖల్లా చెక్కిళ్లపై విరిసింది.
గులాబీ వర్ణమున్న ముఖం అలకతో మరింత ఎర్రబడింది.
ముంజేతులతో చెక్కిళ్లను తుడుచుకుంటూ వేగంగా అక్కడికి చేరుకుంది.
ఆ గోపికను చూస్తూ,
“అమ్మాయి! నువ్వు ఇక్కడే ఉన్నావా? నీ ఇంట్లో అందరూ నిన్ను వెతుకుతున్నారు. వెంటనే వెళ్లమన్నారు.”
అంది.
ఆ మాట వినగానే ఆ గోపిక కంగారుగా లేచి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
ఇప్పుడు అక్కడ శ్యాముడు... రాధమ్మ మాత్రమే.
రాధమ్మ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
తలను వంచి, పాదబొటనవేలితో నేలను గీస్తూ మౌనంగా కూర్చుంది.
ఆ మౌనంలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి.
ఎన్నో అలకలు ఉన్నాయి.
ఎన్నో ప్రేమలు ఉన్నాయి.
శ్యామసుందరుడు మెల్లగా ఆమెవైపు వంగాడు.
తన వేణువు చివరితో ఆమె చెక్కిలిని తాకుతూ చిరునవ్వుతో అడిగాడు—
“రాధే! ఈ రోజు చాలా ఆలస్యమైంది. మా జ్ఞాపకం రాలేదా?”
అంతే...
రాధమ్మ ఒక్కసారిగా ఆయన చేతిలోని వేణువును లాక్కుంది.
“ఆహా! మీకు మా జ్ఞాపకం ఎందుకు వస్తుంది? మీతో నవ్వుతూ మాట్లాడేందుకు ఎంతోమంది గోపికలు ఉన్నారు కదా! వారితోనే ఉండండి. మేమెందుకు?”
అంది.
ఆ మాటల్లో కోపం కంటే ప్రేమ ఎక్కువ.
అలక కంటే ఆరాధన ఎక్కువ.
శ్యామసుందరుడు నవ్వాడు.
ఆ నవ్వు యమునా అలలను సైతం పరవశింపజేసింది.
“రాధే! ఈ లోకంలో నీ స్థానాన్ని ఎవ్వరూ తీసుకోలేరు. నీవు నా ప్రాణం. నీవు నా ఆనందం. నీవు నా హృదయసామ్రాజ్ఞి. నీ ప్రేమ ఎంత లోతైనదో చూడాలని కొంచెం సరదాగా అలా చేశాను. నీవు ఇలా అలిగి నీ ప్రేమను వ్యక్తం చేసినప్పుడు నా హృదయం మరింత పరవశిస్తుంది.”
అన్నాడు.
ఆ మాటలు వినగానే రాధమ్మ పెదవులపై మధురమైన చిరునవ్వు వికసించింది.
“అయితే... మేమూ సరదాగానే అలిగాము!”
అని చెప్పి వేణువును చేతిలో పట్టుకుని యమునా తీరం వైపు పరుగెత్తింది.
నీలి దుపట్టా గాలిలో ఎగురుతోంది.
నల్లని ముంగురులు మేఘాలతో పోటీ పడుతున్నాయి.
పాదాల గజ్జెలు శబ్దం చేయలేకపోయినా ఆనందంతో నాట్యం చేస్తున్నాయి.
వెనక నుంచి శ్యాముడు పరుగెత్తుతున్నాడు.
“రాధే! నా వేణువు ఇవ్వు. గోవులను ఇంటికి పిలవాలి!”
అని వేడుకుంటున్నాడు.
కానీ రాధమ్మ ఆగడం లేదు.
మధ్య మధ్యలో వెనక్కి తిరిగి చూసి కిలకిలా నవ్వుతోంది.
ఆ నవ్వు వినడానికి దేవతలు కూడా ఆకాశం నుంచి తొంగిచూస్తున్నారు.
అంతలో...
ఒక పెద్ద ఉరుము!
ఆకాశమంతా మెరుపులతో నిండిపోయింది.
క్షణాల్లో కుండపోత వర్షం ప్రారంభమైంది.
ఇప్పటి వరకు శ్యాముడి నుంచి పారిపోయిన రాధమ్మ ఒక్కసారిగా తిరిగి ఆయనవైపు పరుగెత్తింది.
దగ్గరకు వచ్చి గట్టిగా ఆయనను ఆలింగనం చేసుకుంది.
భయంతో కాదు...
ప్రేమతో.
విరహంతో కాదు...
విలీనంతో.
శ్యాముడు తన పీతాంబరాన్ని విప్పి ఆమెను కప్పాడు.
ఇద్దరూ ఒక విశాలమైన కదంబవృక్షం క్రింద ఆశ్రయం పొందారు.
వర్షపు చినుకులు చుట్టూ ముత్యాలహారాల్లా జారుతున్నాయి.
యమునమ్మ ఆనందంతో ఉప్పొంగుతోంది.
గాలి మల్లెపూల పరిమళంతో నిండిపోయింది.
ఆ క్షణంలో ప్రకృతి మొత్తం నిశ్చలమైపోయింది.
ఎందుకంటే...
సమస్త జగత్తుకు ఆశ్రయమైన పరమాత్మ...
సమస్త ప్రేమకు మూలమైన పరాశక్తి...
ఒకరినొకరు ఆలింగనం చేసుకొని నిలిచిన ఆ దివ్యదృశ్యాన్ని దర్శించే మహాభాగ్యం ప్రకృతికి లభించింది.
ఆ రోజు వర్షం కేవలం ఆకాశం నుంచే కురవలేదు.
రాధా-శ్యాముల ప్రేమామృతం కూడా బృందావనమంతా కురిసింది.
అందుకే వ్రజవాసులు అంటారు—
“కృష్ణుడు ప్రేమ అయితే, ఆ ప్రేమకు ప్రాణం రాధమ్మ.”
“రాధా నామం లేని కృష్ణుడు అసంపూర్ణుడు; కృష్ణస్మరణ లేని రాధమ్మ అసంపూర్ణురాలు.”
“ఇద్దరూ కలిసే పరిపూర్ణ ప్రేమ.
ఇద్దరూ కలిసే పరబ్రహ్మ తత్త్వం.”
అందుకే భక్తుల హృదయాలలో నిత్యం మారుమోగే గానం—
రాధే జయ జయ మాధవ దయితే!
గోకుల తరుణి మండల మహితే!
రాధే రాధే!
రాధే కృష్ణ!
రాధే శ్యామ్!
— శంకరకింకరః
No comments:
Post a Comment