Pages

Showing posts with label శాంతి. Show all posts
Showing posts with label శాంతి. Show all posts

Tuesday, January 29, 2019

గురువులు మార్గం మాత్రమే చూపుతారు


శ్రీ గురుభ్యోనమః
ఒకనికి మరొకరు దేవుణ్ణి చూపడమేమిటి? అసంబద్ధం కాకపోతే... 

ఆత్మబోధలో శంకరులంటారూ మెడలో ఆభరణం వేసుకుని దాని గురించి ఇల్లంతా ఎక్కడెక్కడో వెతికి చివరికి తనమెడలోనే ఉన్నదని తెలుకొనిన స్వకంఠాభరణంలా... అని...,
ఆత్మాతు సతతంప్రాప్తోపి అప్రాప్తవదవిద్యయా
తన్నాశే ప్రాప్తవద్భాతి స్వకంఠాభరణం యథా!!
గురువులు మార్గం మాత్రమే చూపుతారు, ఎక్కడో నూటికో కోటికో ఒక్కరు (పరమహంస వివేకానందునికి లాగా) అవతార ప్రయోజనార్థం అటువంటివి చూపగలరు. లేదా మోళి, ఇంద్రజాలం చేసేవారు అలా భ్రమింపజేస్తారు చేస్తారు తప్ప. భగవంతుడేం సినిమానో నాటకమో కాదు టిక్కెట్లిచ్చి ధ్యానంలో చూపడానికి. ఇలా చేసేవాళ్ళందరూ పరమహంసలూ కారు టిక్కెట్లు కొనుక్కున్నవాళ్ళు వివేకానందులూ కారు.

-శంకరకింకరః (17-May-16)


Saturday, November 17, 2018

ధీరుడెప్పుడూ స్వశక్తిపైనే నిలబడతాడు


శ్రీగురుభ్యోనమః

శ్రీరాముడికన్నా అవమానం పొందినవారూ, కష్టపడ్డవారూ లేరు. ఆఖరికి వెలివేయబడి నలుగురు మంత్రులతో కలిసి కాలం వెళ్ళదీస్తున్న వానర నాయకుడు సుగ్రీవుడు కూడా శ్రీరాముని పరాక్రమానికి ప్రజ్ఞకి పరీక్ష పెట్టాడూ. అది నాస్థాయి కాదని అలగలేదు, రాముడు. రావణుడైతే మరీ ఘోరంగా పిరికివాడు, మనికిమాలిన రాముడన్నాడు  నీ ప్రజ్ఞ, నీ విశేషం, నీ ప్రతిభ, నీ నేర్పరితనం లోకులెరగకపోవచ్చు, తెలియక నిన్ను తక్కువగా ఎంచవచ్చు నిర్లిప్తత పొందక, ఓ నవ్వు నవ్వుకుని, నిన్ను నువ్వు మెఱుగు పెట్టుకునే అవకాశంగా తీసుకో..  గుర్తింపు కతీతంగా ధీరుడెప్పుడూ స్వశక్తిపైనే నిలబడతాడు, మార్గదర్శకుడౌతాడు.

-శంకరకింకర


Thursday, December 29, 2016

కోపాయుధం


గురుభ్యోనమః

"క్రుద్ధో హన్యాద్ గురూనపి"

కోపానికి మనం ఆయుధంగా కాక, కోపాన్ని మన ఆయుధంగా మలచుకోవడం సాధకులైన వారికి ప్రతి ఒక్కరికీ  అవసరం.

----

ధన్యాస్తే పురుషశ్రేష్టా యే బుధ్యా కోపముత్థితమ్ !
నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్నిమివాంభసా !!
క్రుద్ధః పాపం న కుర్యాత్ కః "క్రుద్ధో హన్యాద్ గురూనపి" !
క్రుద్ధః పరుషయా వాచా నరస్సాధూనధిక్షిపేత్ !!
వాచ్యా వాచ్యం ప్రకుతోపి న విజానాతి కర్హిచిత్ !
నాకార్యమస్తి క్రుద్ధస్య నావాచ్యం విధ్యతే క్వచి !!
య స్సముత్పతితం క్రోధం క్షమయేవ నిరస్యతి !
యథోరగస్త్వచం జీర్ణాం స వై పురుష ఉచ్యతే!!
(సుందరకాండ)

తా!! మహాత్ములైన ధీరులు తమలో పెల్లుబిక్కిన ఆగ్రహావేశములను ఎగయుచున్న మంటలను నీటితో చలార్చినట్లు నిశ్ఛయాత్మక బుద్ధితో నిగ్రహించుకొందురు. వారు నిజముగా ధన్యాత్ములు. కోపావేశమునకు లోనైనవాడు ఎట్టిపాపములకైననూ ఒడిగట్టును. కోపావేశమునకు లోనైనవాడు గురువుని కూడా హత్యచేయగలడు. కోపావేశమునకు లోనైనవాడు సజ్జనులను సైతము నిందించును.
కోపమునకు లోనైనవాడు మంచి చెడ్డల విచక్షణాజ్ఞానము కోల్పోవును. ఆట్టివానికి చేయగూడని పని అనగూడని మాట యుండదు. సర్పము కుబుసమును విడిచినట్లు క్రోధములో జనించిన ఉద్రేకమును ఒర్పుతో అణిచికొనినవాడే నిజమైన పురుషుడు.

క్రుద్ధః పాపం న కుర్యాత్ కః "క్రుద్ధో హన్యాద్ గురూనపి" ! హనుమ ముఖ్యంగా ఈ మాటని పైశ్లోకంలో గట్టిగా చెప్తారు. కోపమో, క్రోధమో, క్షణికావేశమో ఏదైనా సరే కోపమునకు వశమైనవాడు ఏ పాపానికైనా ఒడిగడతాడు. అసలు చేయకూడని పాపం గురువుని నిగ్రహించడం. ఎదిరించడం, అధిక్షేపించడం వంటివి. ఏదో కారణానికి కోపించి గురువుమీద కూడా కినుక వహించేలా చేస్తుంది ఆ పరిస్థితి, అందుకే కోపం రాగానే పరిశీలించుకునేలా మనకి మనం తర్ఫీదిచ్చుకోవాలి. అసలు కోపం దేనికీ అని. గురువు మాట్లాడితే అదృష్టం. మాట్లాడకపోతే అదో అదృష్టం, తిడితే ఇంకా అదృష్టం. దగ్గరకు తీసుకుంటే అదో అదృష్టం. అసలు గురి ఉన్నవారు గురువు దగ్గరలో ఉన్నా లేకున్నా గురువు నాకన్నా దూరంగా ఎప్పుడున్నారు అన్న తృప్తితో ఉంటాడు. లేకపోతే నన్నలా మర్యాదించలేదు ఇలా పొగడలేదు గురువుగారి పక్కవాళ్ళు చూడలేదు వంటి భావనలు చుట్టుముడతాయి. లేదా నేను చెప్పిందెవరూ వినట్లేదు, నేను చెప్పిందెప్పుడూ తప్పంటున్నారు, లేదా నేను చెప్పినవాటికన్నా ఇంకోరు చెప్పినవి సరి అంటున్నారు ఇలా... ఏవేవో నిప్పు కణాలు అగ్నిలోంచి పుట్టినట్లు అసహన రూపంగా బయటికొస్తాయి. ఇవన్నీ కోపంలోంచి పుట్టేవే... కోపానికి మనం ఆయుధంగా కాక, కోపాన్ని మన ఆయుధంగా మలచుకోవడం సాధకులైన వారికి ప్రతి ఒక్కరికీ అవసరం.

-శంకరకింకర


Tuesday, June 14, 2016

పరిణతి


గురుభ్యోనమః
పరిణతి పొందడం చాలా గొప్ప విషయం, కానీ ఆస్థాయి పొందనివారిని లేక నిజాయితీతో భగవంతుణ్ణాశ్రయించేవారిని వెర్రివారిలాగానో, అవివేకిగానో, మూర్ఖుడిగానో మరోటిగానో కించపరచడానికి కాదుగా.. పరిణతి, జ్ఞానం సంపాదించేది లోకుల్ని ఎంచడానికి కాదు, లోక ప్రియత్వం అలవర్చుకోవాలి. భగవంతునియెడ వారినమ్మకాన్ని గౌరవించగలగాలి. అందరినీ ఒక గాట గట్టడానికీ, తక్కువ చేసి నవ్వుకోడానికో, గేలి చేసి లూజ్ వర్డ్స్ వాడటానికో కాదు జ్ఞానం సముపార్జించాల్సింది. వీలుంటే అనునయించి చెప్పాలి. పండితుడన్న అహంకారం వదిలి జ్ఞానం పంచాలి. పండావు అన్నదానికి గుర్తేమిటంటే నోటికొచ్చినట్లు మాట్లాడడం కాదు. ఆ మాటల్లో కరకుదనంలేక ఎంత విజ్ఞతతో 'పండు'తనంతో మాట్లాడావా అన్నది కొలబద్ద.

-శంకరకింకర

Friday, May 13, 2016

ఓ హిందువా! మేలుకో!


శ్రీ గురుభ్యోనమః
శంకరాచార్యుల అవతరణకు ముందు దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, ఇప్పుడే అవే పరిస్థుతులున్నాయి. అప్పుడు ఒక శంకరులే అవతరించారు. ఇప్పుడు హిందువులందరూ తమలో నిద్రాణమై ఉన్న ఆదిశంకరులను జాగృతం చేయాలి. ప్రతి హిందువు ఒక శంకరుడవ్వాలి. ఆయనే మనకిప్పుడు స్పూర్తి. ఆయన ఇప్పటికి మనలోనే, మనతోనే ఉన్నారు. అందుకే మనమీ ధర్మంలో జన్మజన్మలుగా పుడుతూనే ఉన్నాం. మన మాతృ ఋణం తీర్చుకోవలసిన సమయం ఆసన్నమైంది. సనాతనధర్మం మన తల్లి. మన గ్రంధాల మీద వేరేవాడు అధికారం చెలాయించడం ఏమిటి? మన గురించి వాడు పిచ్చిరాతలు రాయడమేమిటి?

ఓ హిందువా! మేలుకో! అంతర్ముఖమై నీలో ఉన్న శంకరుల ఆర్తిని విను. ధర్మాన్ని తెలుసుకుని, ఆచరించి, శక్తి సంపాదించి, స్పూర్తి పొంది, నీ మీద, ధర్మం మీద స్పష్టతతో మరో శంకరుడివై, ధర్మంపై జరుగుతున్న దాడిని తిప్పి కొట్టు. ధర్మాన్ని పునః ప్రతిష్టించు. కర్తవ్యాన్ని విస్మరిస్తే, నీవు అధోగతి పాలుగాక తప్పదు. గుర్తుంచుకో. శంకరులు మనల్ని విడిచి పోలేదు. మేలుకో భారతీయుడా! కలియుగ గురువైన ఆ ఆదిశంకరుల రక్ష నీకు సదా ఉన్నది.

శంకర జయంతి శుభాకాంక్షలు.

మన్నాథః శ్రీజగన్నాథః మద్గురుః శ్రీజగద్గురుః !
మదాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీగురవే నమః !!

జయ జయ శంకర హర హర శంకర
-శంకరకింకర


Wednesday, February 4, 2015

’కొత్తపలుకు’ పేర సనాతన ధర్మం పై చిమ్మిన 'విష భంజనం ' 4

Continuation
భగవంతుని పై భక్తీ, భయమూ రెండూ శ్రేయోదాయకమే. భయం, స్వీయ నియంత్రణ, క్రమశిక్షణ లేకపోతేనే తంటా..
//భక్తిలో కూడా ఆత్మ వంచన ఉంటుందా? అని మనకు అనిపించవచ్చు గానీ, ఇప్పుడు భక్తిలోనే ఆత్మ వంచన ఎక్కువగా ఉంటోంది. గుళ్లకు వెళ్లకపోయినా, స్వాములకు నమస్కరించకపోయినా కీడు `దండం పెట్టుకుంటున్నారు. నిజం చెప్పాలంటే, ప్రస్తుత సమాజంలో వెల్లివిరుస్తున్న భక్తిలో అధిక శాతం భయంతో, ఆశతో కూడినది మాత్రమే!
పాపం దేవుళ్లు! మనుషుల్లో పేరుకుపోతున్న స్వార్థచింతన దైవ చింతనగా మారి దేవుళ్లను ఊపిరి కూడా తీసుకోకుండా చేస్తోంది. ఆంగ్ల నామ సంవత్సరంతోపాటు వైకుంఠ ఏకాదశి కూడా ఒకేరోజు రావడంతో తెలుగు రాష్ర్టాల్లోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. గతంలో ఎన్నడూ లేనంతగా దేవాలయాలు భక్తులతో పోటెత్తాయి. నూతన సంవత్సర వేడుకలను విందు, మందు, చిందుతో ఆనందించి, ఆస్వాదించి ఇళ్లకు చేరుకునేవారు కొందరైతే, స్నానాలు చేసి భక్తిశ్రద్ధలతో గుళ్లకు బయలుదేరిన వారు మరికొందరు. ఒకే సమాజంలో ఎంత వైరుధ్యం! మొత్తంమీద తెలుగునాట భక్తిరసంలో మునిగి తేలుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఎంతలా అంటే.. దేవుళ్లకు ఊపిరి సలపనంతగా! //
దీని వల్ల సనాతన ధర్మానికి భావితరాలకి నష్టమెంతో భవిష్యత్కాలం నిర్ణయిస్తుంది కానీ, సనాతన ధర్మంలో ( హిందూ మతంఅని పిలువబడే) ఏదో ఐపోతోంది అనుక్కునే మీకు బెంగేమీ అక్కర్లేదు మీకంత ప్రేమ కారిపోతుందనీ మేము నమ్మలేదు. విందు వినోదాల పేర్ల మీద మత్తులో అర్థరాత్రిఅపరాత్రులు తేలియాడే వారికన్నా, భయంతోటో మరేదానితోటో దానికి దూరంగా ఉండి భగవంతునికి భాగవతులకి దగ్గరగా ఉండడమే శ్రీరామ రక్ష. నిజంగా తెలివుండి సమాజం మీద అతిప్రేమ దాన్ని రక్షించాలనే తపనే ఉంటే ఆ విందు చిందు వినోదాలరూపంలో జరిగే సామాజిక అవలక్షణాలను ఖండించడంకోసం డిసెంబరు నెలాఖరునుండి జనవరి ఒకటి రెండు తారీఖులలో ఒక్క ఆర్టికలూ రాయలేదెందుకనో అన్యమతస్థులు బాధపడతారనో లేక సానుభూతో ఆసంపాదకవర్గానికే తెలియాలి. భక్తిలో ఆత్మ వంచన ఉందోలేదో ఆయా భక్తుల వ్యక్తిగత విషయం కానీ ఈ పత్రికా వ్యాసంగాలలో ఖచ్చితంగా ఆత్మవంచన, సనాతన ధర్మంపై ద్రోహపురిత విద్వేషపూరితమైన సంపాదకుల మనోభావాలు సుస్పష్టం.

//ఇటీవలే ఒక టీవీలో విన్నాను. సారాంశం ఏమిటంటే, మీరు ఎన్ని పాపాలు చేసినా ఫర్వాలేదు. కార్తీక పౌర్ణమి నాడో, వైకుంఠ ఏకాదశి నాడో దీపాలు వెలిగించి దేవుడిని వేడుకుంటే చాలునట! అలా అని ఆయనకు ఏ దేవుడు చెప్పాడో మాత్రం చెప్పలేదు.//
ఇలా ఎవరూ చెప్పలేదు చెప్పరు. సాంతం వినకుండా బిట్వీన్ ద లైన్స్ లాగా టెంపరరీ భక్తిలాగానో లేక గేలి చేయడానికో లేదా దీపాలు పెట్టేవేళగి గ్లాసులో రంగునీళ్ళు తాగుతూ వింటే (దొరల సావాసాలతో దొరలవాట్లేగా ఉండేది) ఇదిగో ఇలాగే వినిపిస్తుంది అనిపిస్తుంది. సనాతన ధర్మంలో దీపానికున్న ప్రాధాన్యత తెలుసుకుని ఆ విషయం చెప్పిన పెద్దాయన ప్రసంగం సాంత వింటే తెలుస్తుంది అరకొరగావిన్న మిడిమిడి జ్ఞానంతో కాదు. పోనీ వారమంతా పాపా కార్యాలు చేసి వారానికోసారి ముసుగుచాట్లో చెప్తే పాపాలు పోతాయని చెప్పడంలో కనబడని వింత దీపం విషయంలో ఎందుకు సదరు సంపాదకీయులకి కలిగిందో నాకు అవగతం కాలేదు ... ‘ముసుగుచాట్లో చెప్తే పాపాలు పోతాయని’ దాన్ని ప్రశ్నిస్తూ ఒక్క ఆర్టికలూ రాయడానికి చేతులు రావు... ఇష్టమైన డ్యాష్ ఇంగువతో సమానమని చిన్నప్పుడు ఎవరో అంటుంటే విన్నా....

//‘దేవుడు చేసిన మనుషుల్లారా- మనుషులు చేసిన దేవుళ్లారా’ అని ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రంలో ఎన్‌.టి.ఆర్‌ పాడతారు. దేవుళ్లను వ్యాపార వస్తువుగా మార్చారని దశాబ్దాల క్రితమే ఆ పాట రాసిన శ్రీశ్రీ గుర్తించారు. ఇప్పుడు ఈ విషయంలో మరింత పురోగతి సాధించాం. దేవుడు మనుషులను సృష్టించడం ఏమో గానీ, మనుషులే దేవుళ్లను ఎడాపెడా సృష్టించి పారేస్తున్నారు.//
సినిమా సాహిత్యం మనకాదర్శం అయ్యింది మరి!!! శ్రీశ్రీ రాసిన పాటసంగతేమోకానీ ఉట్టికెగరలేనమ్మ ఆకాశానికెగురుతానందట, ఆయన చెప్పిన మాటలు ఆయన శ్రీమతినే మార్చలేకపోయానని చదువుకున్నాం ఆయనగురించి చదివినప్పుడు. నేనూ కాలేజీలో ఆయన అభిమానినే. అసలు విషయమ్ తరవాత తెలిసింది. అంత ప్రక్షాళనే చేయలనే తలపు నియతి ఉంటె సదరు సంపాదకులవారు దైవదూతనే దేవుడుగా మార్చి డబ్బాశ చూపి అవినీతిని భక్తిలోనూ మతవిశ్వాసాలలోనూ లంచాలని ప్రేరేపించి ప్రచారం చేస్తున్న మతాన్ని నిలదీయవలసి ఉన్నది.

నాకనిపించిందేమంటే సంపాదకుల సహజ అహంభావమువల్లనూ, ఆభిజాత్యా పోకడలవల్లనూ  ఈ స్వయం ప్రకటిత ఆధ్యాత్మ విద్వాన్, హైందవ ధర్మ సంస్కర్తని ఎవరూ గుర్తించక ఆధ్యాత్మిక సభల్లో ప్రత్యేక గౌరవాదులు అగ్ర తాంబూలాలూ ఇవ్వకపోవడం వల్ల ఎక్కడో సదరు పత్రిక సంపాదకుల అహానికి తగిలిన  దెబ్బవల్లనో లేక ఇందాక నా అనుమానం (అనుమానమే సుమీ) లాగా సనాతన ధర్మేతర మతానుయాయుల ప్రాపకానికో లేక వారితో పడ్డ కక్కుర్తి, లాలూచీలకో (మళ్ళీ ఇది నా అనుమానమే సుమీ) ఈ సంస్కరణ ముసుగులో రాసిన అజ్ఞానపు రాతలు అని. ఏతావాతా మరి వీరి వెనకుండి విషం చిమ్మిస్తున్నదెవరో లేక ఆ పత్రికా యజమానులు సంపాదకులు దేనికి కొమ్ముకాస్తున్నారో అర్థం చేసుకోలేనంత వారుకాదు ప్రజలు. ఈయన ప్రస్తుతించిన సినిమాకీ సమాధానాలిందులోనే ఉన్నాయి దాన్ని ప్రత్యేకంగా ఉటంకించనక్కర్లేదు. ఇంతకుముందే ఎందరో చెప్పారు కూడా. చేతిలో పత్రికలు, ఇతర ప్రచురణ, ప్రసార మాధ్యమాలు అనువుగా అందుబాటులో ఉన్నాయని మన భావ దారిద్ర్యాన్ని ఇతరుల భావాలుగా రుద్ది మాట్లాడడం అవివేకం, మూఢత్వం. భారతజాతిలో ఇటువంటి విషయాలు విషాలు కొత్తేమీకాదు, విషం పుట్టడం దాన్ని గ్రసించడం పురాణోక్తమే.
click below link to the original article in the paper 
 http://www.andhrajyothy.com/Artical.aspx?SID=73429&SupID=26

శంద్విపదే శం చతుష్పదే

లోకా సమస్తాసుఖినోభవన్తు

’కొత్తపలుకు’ పేర సనాతన ధర్మం పై చిమ్మిన 'విష భంజనం ' 3

Continuation
////ఊ కొత్త వ్యాపారం.. భక్తి!
దేవుళ్లు మాత్రమే కాదు- ఆధ్యాత్మిక బోధనలు, ప్రవచనాలు చెప్పే నయా దేవుళ్లు కూడా పెరుగుతున్నారు. వారికి కూడా వారి వారి శక్తిసామర్థ్యాలను బట్టి సొంత అనుచర గణం, భక్తులు ఏర్పడుతున్నారు. మొత్తంమీద తెలుగు రాష్ర్టాలలో ఇప్పుడు భక్తి కూడా ఒక వ్యాపారంగా మారిపోయింది. వ్యాపారం అని ఎందుకు అనవలసివస్తున్నదంటే- దేవుళ్లకు, ఆయా దేవాలయాల్లో జరిగే కార్యక్రమాలకు ఇటీవలి కాలంలో విశేష ప్రచారం కల్పిస్తున్నారు. ఫలానా రోజు మా దేవుడిని దర్శించుకుంటే మీ పాపాలన్నీ పోయి, మీరు పునీతులు అవుతారంటూ ప్రకటనలు చేస్తుంటారు. అంటే, మామూలు రోజుల్లో దేవుడిని దర్శించుకుంటే ఏమీ లాభం లేదన్నమాట! ప్రలోభాలకు లోనుకాకుండా, మనసును ప్రశాంతంగా, నిర్మలంగా ఉంచుకోవడానికై గతంలో దేవాలయాలకు వెళ్లి కొద్దిసేపు గడిపేవారు. ఇప్పుడు గంపెడు కోర్కెలతో దేవాలయాలకు వెళుతున్నారు. భక్తుల ఈ కోర్కెల చిట్టాలను ఓపిగ్గా వినలేక, దేవుళ్లకు తలపోటు వస్తూ ఉండి ఉండవచ్చు. కానీ, మనలా దేవుళ్లు ఆ విషయం బయటకు చెప్పుకోలేరు. అమృతాంజనం గట్రా పట్టించుకోలేరు. ప్రచార హోరు పెంచి దేవుడిని కూడా వ్యాపార వస్తువుగా మార్చిన వాళ్లను ఏమనాలి? ఫలానా గుడిలో వెలిసిన దేవుడు పవర్‌ఫుల్‌ అంటారు. దేవుడంటే ఎక్కడైనా దేవుడే కదా! ఫలానా గుడిలోనే ఆయన పవర్‌ ఫుల్‌గా ఎందుకుంటారు? అంటే, తమ గుడికి ఆదరణ పెరగాలని ఆయా గుళ్లను కట్టించినవారు కల్పిస్తున్న ప్రచారమే కారణం.//
//ఇప్పుడు లెక్కలేనన్ని పీఠాలు, ఆశ్రమాలు. వీరికితోడు, భక్తులను ఉద్దేశించి ఉపన్యాసాలు చేసేవారు మరికొందరు. వారికి ప్రచారం కల్పించేవారు ఇంకొందరు! మొత్తంమీద వీరంతా ఒక ముఠాగా ఏర్పడి స్వార్థపూరిత భక్తిని మనలో నింపుతున్నారు. పేరు రాస్తే నొచ్చుకుంటారు కనుక ఆ వ్యక్తి పేరు ఇక్కడ ప్రస్తావించడం లేదు. కానీ, ఆయన ప్రసంగాన్ని ఇటీవలే ఒక టీవీలో విన్నాను. సారాంశం ఏమిటంటే, మీరు ఎన్ని పాపాలు చేసినా ఫర్వాలేదు. కార్తీక పౌర్ణమి నాడో, వైకుంఠ ఏకాదశి నాడో దీపాలు వెలిగించి దేవుడిని వేడుకుంటే చాలునట! అలా అని ఆయనకు ఏ దేవుడు చెప్పాడో మాత్రం చెప్పలేదు. ఇక్కడ ఇంకో మతలబు ఉంది. దేవుడి పేరిట ఉపన్యాసాలు ఇస్తున్న ఇలాంటి వాళ్లంతా దేవుళ్లుగా మారిపోతున్నారు. అమాయక భక్తులు వారి కాళ్లకు మొక్కుతున్నారు. వారి చిత్రపటాలను తమ పూజా మందిరాల్లో పెట్టుకుని పూజలు చేస్తున్నారు. అంటే, గాడ్‌మెన్‌ సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోందన్నమాట! భక్తి అనేది ఒక బలహీనతగా మారడంతో, భక్తి పేరిట వివిధ కార్యక్రమాలు నిర్వహించి లాభాలు గడించేవారి సంఖ్య కూడా క్రమేపీ పెరుగుతోంది. ఇప్పటి దాకా విద్యా వ్యాపారం, వైద్య వ్యాపారం గురించి విన్నాం. ఇకపై భక్తి వ్యాపారం గురించి వినబోతున్నాం. భక్తి వ్యాపారానికి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని, నాస్తికులుగా ఉన్నవారు సైతం ఆస్తికులుగా మారి భక్తి వ్యాపారానికి బృహత్‌ ప్రణాళికలు రచిస్తున్నారు.//

పీఠాలు ఆశ్రమాలు ప్రవచనకర్తలు పెరిగితే పెరిగేది సనాతన ధర్మ ప్రచారము దాని భక్తులు, దానికి అన్య మతాలు వారి అనుయాయులు ఉలిక్కి పడాలిగానీ సదరు పత్రిక/ మీడియా వారికి కలిగిన ఇబ్బంది ఏమిటో అర్థం కాలేదు, సనాతనధర్మాన్ని వ్యతిరేకించే మతాలతో లాలూచీ ఉందా లేదా ఎక్కడైనా కక్కుర్తి పడ్డారా అన్న అనుమానమూ ఉంది. సడెన్గా నలుపు తెలుపు పేపరు కలర్ లోకి మారింది అదీ రెండు రాష్ట్రాలలో ఒక రాష్ట్రంలో తక్కువ వ్యాపరం చేస్తూ..... సరే అవి వారి రాజకీయ వ్యాపార విషయాలు అది మన సబ్జెక్టూ కాదు.

ఇక ఈ దేశంలో రాజ్యాంగ పరిథిలోనే ఉన్నతమైన గ్రంథంగా పరిగణింపబడుతూ కోర్టులలో ప్రమాణం చేయించే భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పిన శ్లోకమిది.
చతుర్విధా భజన్తే మాం జనాస్సుకృతినోర్జున,
ఆర్తో జిజ్ఞాసు రర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ.
భరతవంశ శ్రేష్ఠుడవగు ఓ అర్జునా! ఆపత్తునందున్నవాడు, (భగవంతుని) తెలిసికొనగోరువాడు, ధనము(సంపత్తు) నభిలషించువాడు, (ఆత్మ) జ్ఞానముకలవాడు అను నీ నాలుగు విధములైన పుణ్యాత్ములగు జనులు నన్ను సేవించుచున్నారు. (భజించుచున్నారు.)
భగవంతుడే చెప్పాడు అర్థార్థి అంటే డబ్బుకావాలన్నవాడు  కూడా నన్నే శరణువేడుతున్నాడు అని మరి ఈ కొత్తపలుకుల రచయితగారికెందుకో ఇంత కండూతితో కూడిన నొప్పి. ఈయనేవన్నా గీతాచార్యుడికన్నా గొప్పవారేమో మరి లేదా ఈ పత్రికవారు డబ్బుకోసం భగవంతుని కాక మరెవరిని ఎక్కడెక్కడ ప్రాధేయపడుతున్నారో ఆ భగవంతునికే తెలియాలి. పైగా అందరి కోర్కెలూ  గంటల కొద్దీ విని తీర్చడం సాధ్యంకాదని వీరి తీర్పున్నూ. చూసారా వీరి స్థాయి భగవంతునికే సాధ్యాసాధ్యాలు నిర్ణయించే గొప్ప స్థాయి సదరు సంపాదకీయులవారిది.

భక్తిని వ్యాపారం చేయడం ఎక్కడైనా తప్పే. ఒప్పని మెడకాయమీద బుర్రకాయ ఉన్న ఎవరూ చెప్పరు. భక్తి పేరిట పీఠాధిపతులు, ప్రవచనకర్తలు భక్తి ప్రచారం చేసేవారు ఒక ముఠాగా ఏర్పడ్డారు అని ఒక విపరీత వ్యాఖ్య చేయడం ఈ వ్యాసకర్త కళ్ళు మూసుకుపోయిన విషయాన్ని నిలువెత్తు మూఢపుటాలోచనలకు మానసిక వైక్లవ్యానికి ప్రతీక మూర్తీభవించిన అహంకార స్వరూపం. పాత్రికేయ ముఠాలలాగా భక్తిలో, ధర్మ ప్రచారంలో ముఠాలుండవు. వార్త సేకరించి ప్రచురించడానికి ప్రచురించకుండా ఉండటానికి ఎందరినో బ్లాక్ మెయిల్ చేసిన పాత్రికేయులు ఎందరో పత్రికా యజమానులమీదా ఈ ఆరోపణలు లేకపోలేదు. ఎదుటివాణ్ణి మోసం చేసే ఒక వర్గానికి కాపుకాసి డబ్బులు సంపాదించే కుహనా మీడియా ముఠాలున్నవన్నది ప్రత్యక్షంగా జగమెరిగిన సత్యం. ఆ పత్రికలోనే సత్యం ఒకచోట ఒప్పుకున్నారు అవినీతికి ఆధారాలుంచరుగా అని. ఐనా అందరూ తమలాగే ఉంటారనుక్కునేవారు కొందరుంటారు అందులో వీరూ ఒకరేమో... ఐనా అందరూ తమలాగే ఉంటారనుక్కునేవారు కొందరుంటారు అందులో వీరూ ఒకరేమో... అన్ని వ్యవస్థల్లోనూ, పత్రికల్లోనూ కక్కుర్తి పడే వాళ్ళున్నట్లే అక్కడక్కడా ఒకరిద్దరు మురికివారుండవచ్చు. వాళ్ళను చూపి సాంతం అంతే అనం కదా.. ఎవరైనా అంటే అంతకన్నా అవివేకి అజ్ఞాని ఎవరూ ఉండరు.


గత సంవత్సరం దేశంలోకి భక్తిపూర్వక దక్షిణ రూపేణా (డొనేషన్స్) వచ్చిన వందల కోట్ల రూపాయలలో90 % పైగా మిషనరీస్ కి సంబంధించినవి అందులో సింహభాగం రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న సంస్థలవి. పైగా ఇవి CBIకి లెక్కలప్పజెప్పనివి. ఎక్కడ భక్తి వ్యాపారముంది? కళ్ళుజోడు మకిలి వదిలించి చూస్తే తెలుస్తుంది. దేవుణ్ణి, మతాన్ని ఎవరమ్ముతున్నారు? కళ్ళుమూసుకుపోయాయో లేక లాలూచీయో... (contd...)

’కొత్తపలుకు’ పేర సనాతన ధర్మం పై చిమ్మిన 'విష భంజనం ' 2

Continuation
ఏం తెలీకుండా ఏదో ఓటి పేలడం తన అజ్ఞానాన్ని బయట పెట్టుకోవడమే...
//‘‘చర్చి ఫాదర్‌ నా పుండును ఆప్యాయంగా కడిగి శుభ్రం చేస్తాడు- హిందూ మతానికి చెందిన స్వాములు నన్ను స్పృశిస్తారా?’’ అని ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య ప్రశ్నించారు. చర్చి ఫాదర్‌లలో కూడా అవలక్షణాలు ఉన్నవారు ఇటీవలి కాలంలో ప్రవేశిస్తున్నారనుకోండి. ఆ విషయం పక్కన పెడితే సాటి మనిషిని అంటరానివాడిగా పరిగణించాలని హిందూ మతంలో ఎక్కడ చెప్పారో సదరు స్వాములు, పీఠాధిపతులు చెప్పాలి. కొంతకాలం క్రితం ఒక కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన నిర్వాహకులు, అక్కడికి వచ్చిన ఒక పీఠాధిపతిని పూలమాల, శాలువాతో సత్కరించాలని కోరారు. నేను ఆ పని చేయడానికి ఉపక్రమించగానే, సదరు పీఠాధిపతి శిష్యుడు అడ్డుకుని, ‘‘మీరు స్వామిని అంటుకోకుండా వాటిని చేతుల్లో పెట్టండి’’ అని అన్నారు. సాటి మనిషిని అంటుకోవడానికి కూడా ఇష్టపడని సదరు స్వామి మనుషుల మధ్య తిరగడం ఎందుకు? ఏ అడవుల్లోనో ముక్కు మూసుకుని తపస్సు చేసుకోవచ్చు కదా? మరో స్వామి విషయానికి వద్దాం. ఆయన ప్రయాణిస్తున్న కారులో ఆయన శిష్యుడు కూడా పక్కన ఖాళీగా ఉన్న సీట్లో కూర్చోకూడదు. ముందు సీటు- వెనక సీటుకు మధ్య ఉన్న ఖాళీ స్థలంలో స్వామిగారి పాదాల చెంత కూర్చోవాలి. ఇలాంటి దృశ్యాలను చూసిన నాబోటివాళ్లకు సదరు స్వాములను గౌరవించాలని ఎందుకు అనిపిస్తుంది? తాము చేసేదంతా మానవాళి శ్రేయస్సు కోసమని చెప్పే ఈ స్వాములు, సాటి మానవులనే అంటరానివారుగా పరిగణించడం ఏమిటి? మరే ఇతర మతంలోనూ ఈ దురాచారం లేదు.//
హిందువునే కానని ప్రకటించుకున్న ప్రొఫెసర్ గురించి ఈయన కెందుకంత ఉబలాటమో అర్థం కాని విషయం. (birds of same feather fly together….aaa?) సరే ఆ సదరు మేధావి ప్రొఫెసర్ విషయానికి దాన్ని సమర్థించే ఈ మేథావికి ఈ చిన్న విషయం తెలియదేమో మరి.. పుండు వస్తే కడగడానికి రోగం వస్తే సేవచేయడానికి వైద్యులుంటారు. సమాజంలో వైద్యుడు అర్చకుడు అని రెండు వేరు వేరు వృత్తులున్నాయన్న విషయమూ తెలీదు. పాశ్చాత్య దేశాలలోచర్చిలలో ఫాదర్ తప్ప ఇతర వైద్యులుండేవారు కాదేమో మరి... ఐనప్పటికీ భారతదేశంలో చాలా గ్రామాలలో ఉన్న ఆలయాలలో అర్చకులే అవసరార్థం వైద్య వృత్తిని నిర్వహిస్తూ వైద్యులుగా ఉంటూ ఊరిలోని ప్రజలకి వైద్యం చేసేవారన్న సంగతీ తెలీకపోవడం గుర్తించకపోవడం వారి మేధావి తనానికి నిదర్శనమేమో...!!!

ఇక పీఠాధిపతులను ముట్టుకోవాల్సిన అవసరమేమిటి? మనిషిని మనిషి ముట్టుకోవాల్సిన అవసరమేమిటో అవగతం కాలేదు? సదరు పత్రికా యజమాని ఈ ప్రశ్న చాలా సార్లు అడగడం చూశాం. ఒక మనిషిని మనిషి ఎందుకు ముట్టుకోవాలి? చిన్నప్పుడు తల్లిదండ్రులు ఎత్తుకొని లాలించడానికి, కొడుకు కూతురు కాబట్టి దగ్గర తీసుకొని ఆప్యాయంగా పలకరించడానికి, అలా చూస్తే శరీర సంబంధంగా ఉన్న కొన్ని అనుబంధాల నేపథ్యం తప్ప మరో మనిషిని ఏమనిషి ఎందుకు తగలాలి? రామాయణంలో చెప్తారు రాక్షసుల గురించి ’అవతల వారి మీద ఇవతల వారు తమ శరీరాన్ని ఆనించారు, పడేశారు’ అని అందుకనా?  సదరు వ్యక్తి పత్రికా యజమాని కాబట్టి తగలాలా? ఆయన కార్యాలయంలో ఆయన ఎంతమందిని రోజూ తాకుతూ ఉంటారు. దానికి ఆయన జవాబు అవసరాన్ని బట్టి అని, ఇక్కడా అంతే అవసరాన్ని బట్టి ఎవరు ఆయా పీఠాధిపతులకి, జగద్గురువులైన వారికి ప్రత్యక్ష శిష్యుడుగా ఉంటారో వారు అవసరాన్ని బట్టి ముట్టుకుంటారు. అసలు గురుశిష్య సంబంధాలు, మర్యాదలు, ఆచారసాంప్రదాయాలు తెలుసా పత్రిక వారికి? అసలు సన్యాస ధర్మం తెలుసా ఈ మేతావికి, ఏం తెలీకుండా ఏదో ఓటి పేలడం తన అజ్ఞానాన్ని బయట పెట్టుకోవడం..  సన్యాసిని సన్యాసి కానివాడు తగలడం సన్యాసికానివాడికి శ్రేయోదాయకం కాదు అని శాస్త్రవాక్కు, అంత దూల ఉంటే ముట్టుకో జరిగేదాన్ననుభవించు. సన్యాసి అవ్యాజ కరుణతో ఎవరినైనా దీవించడానికో, దీక్ష ఇవ్వడానికో మాత్రమే తగలవచ్చు తమ తపస్సును ఇవ్వవచ్చు. నీకంటికి కనబడనిది అశాస్త్రీయం అంటే, నీప్రాణం నీ కంటికి కనబడదు కాబట్టి నువ్వు బతికున్నావనేదీ అశాస్త్రీయం కాబట్టి నువ్వో శవం అంటే ఒప్పుకుంటానా? తెలీని విషయం కాబట్టి దీనికి అంటరానితనం అని ముద్ర వేయడం ఆయనకున్న అజ్ఞానం, పైత్య ప్రదర్శనం. నమ్మకాలని మూఢనమ్మకాలుగా చిత్రీకరించే అన్యాయమైన అత్యంత హేయమైన విషయమిది. అంటరాని తనం శారీరకమొక్కటే కాదు అది మానసికంగా ఉండకూడదు. సర్వాత్మకత్వ భావన ఈ సనాతనధర్మంలోది, మనిషి పుండే కాదు అవసరమైతే కుక్క, పంది వంటి జీవుల పుండూ కడిగే స్వభావం ఈ ధర్మంలో వారిది. (contd...)

’కొత్తపలుకు’ పేర సనాతన ధర్మం పై చిమ్మిన 'విష భంజనం ' 1

శ్రీ గురుభ్యోనమః
నమస్తే

పత్రికా యజమానులు పాత్రికేయులు మీడియ స్వాతంత్ర్యం హక్కులు ఇత్యాది ముసుగులలో దాక్కుని తమ స్వంత ఉద్దేశ్యాలను, అభిప్రాయాలను ప్రజల అభిప్రాయాలుగా లేదా మెజారిటీ ప్రజల అభిప్రాయాలుగా వ్యక్తీకరించి ప్రచురించడం మారిన పత్రికా విలువలకు (అనడం కన్నా కుపాత్రికేయ విలువలు అనడం సబబు అని నా అభిప్రాయం) నిదర్శనం. అన్ని విషయాలలోనూ తమ స్వంత అభిప్రాయాలని చేతిలో పత్రిక/ మీడియా ఉన్నదని ప్రజాభిప్రాయంగా ప్రచురించడం దురలవాటుగా మారింది. కుహనా రాజకీయ క్రీడలలో దాని పాత్ర ఎంతైనా ఉండవచ్చుగాక దాన్ని ప్రతిఘటించడానికి అంతే స్థాయిలో రాజకీయ వ్యవస్థా ఢీ అంటే ఢీ అనే స్థాయిలో ఉన్నది. మొత్తానికి రాజకీయాలలో విలువలతో సమాంతరంగా పాత్రికేయ /పత్రికా విలువలున్నాయనడంలో ఏ సందేహమూ నాకు లేదు. ఒకింత ముందుకెళితే రెండూ ఒకటినొకటి సమర్థించుకుంటూనే ఒకదానికొకటి విరోధమూ ప్రకటించుకుంటాయి. మొత్తానికి ఆ రెండు వ్యవస్థలూ లేదా ఆ వ్యవస్థలలో ఉన్న పెద్దలు ప్రజలను మభ్యపెట్టడంలో సమానంగా సిద్ధహస్తులే. అటువంటి దాంట్లో అత్యుత్తమ అవార్డులేమైనా ఉంటే వారిద్ధరికీ జాయింట్ గా ఇవ్వవచ్చు.

ఇక ఈ టపా అసలు విషయానికి వస్తే, ’కొత్తపలుకు’లు పలుకుతున్న ప్రముఖ ప్రెస్ / మీడియా యజమాని కం సంపాదకుడు చాలాకాలంగా అవకాశం చిక్కినప్పుడల్లా ఆధ్యాత్మిక విషయాలపై తనదైన శైలిలో వితండవాదంతో విరుచుకుపడడం గమనిస్తున్నాం. ఈయన చందం ఏమిటంటే ఈయన స్వయం ప్రకటిత మేధావి / సంస్కర్త / ఇదీ అదీ అని లేకుండా అన్ని వ్యవస్థలలో ఉండే కుళ్ళును కడిగే మహానుభావుడు. ఎంతవాడినైనా ’నువ్వు’ అని ఏకవచనంతో సంబోధించగలిగేంత గొప్ప మనీషి. మూర్తీభవించిన ఆభిజాత్యానికి నిలువెత్తు ఉదాహరణ. దొరల సావాసగాడు కదా ఆ వాసనలు పొవుగా. ఐతే ఈయన మీద ఉన్న అవినీతి వ్యాపార సామ్రాజ్య విషయాలపై ఉలకడు పలకడు. అదేదో గురివింద గింజ సామెత చందం.

తెలిసినదైనా తెలీనిదైనా అన్ని విషయాల్లో తలదూర్చటం కొందరికి అలవాటు, తమకు తాము అన్నీ తెలుసనుక్కునే బాచ్ అన్నమాట. ఆ దురలవాట్లో భాగంగా అన్నింట్లో వేలుపెట్టే కండూతి ఎక్కువ. కండూతి అంటే అదే మామూలుగా చెప్తే దురద / గోకుడు అని కాస్త డోసు పెంచి సినిమా / మీడియా లాంగ్వేజిలో చెప్తే ’దూల’ అని.  ఆధ్యాత్మిక విషయాలలో ఈయనది జగద్గురువులు, పీఠాధిపతులు, ఆచార్యులు, వేద విద్వాంసుల స్థాయికన్నా పైనది అని ఈయన భావన. ఈయన మీడియాలోనూ, పత్రికలో ఆధ్యాత్మిక కాలంలో వ్రాసేవారిలోనూ ఆ భావన జొప్పిస్తుంటారు. వీరందరూ కలిసి జగద్గురువులు, పీఠాధిపతులు, వేదవిదులు ఆచార్యులు ఏంచేయాలో నిర్ణయించి, వారు ప్రస్తుతం చేస్తున్న పనులను విమర్శించి వారి పత్రికా ముఖంగా వారికి ఉద్బోధ చేస్తారన్నమాట.

ఈయన ఛానెల్లో జరిగే ఆధ్యాత్మిక వేత్తల ఇంటర్వ్యూలలోనూ, చర్చలలోనూ ఈయన సంపాదకీయంలోనూ తరచూ ఒక విషయం చెప్తూంటారు. ముఖ్యంగా సనాతన ధర్మంని ఉద్దేశిస్తూ డాక్టరు దగ్గరకెళ్ళి రోగం చెప్పకపోతే నష్టపోయేది రోగే, మీ హిందూ/సనాతన ధర్మంలో లోపాలు ఒప్పుకోండి అని //శరీరంలో రోగాలను పెట్టుకుని ఏ రోగం లేదని డాక్టర్‌ వద్ద బుకాయిస్తే కుళ్లిపోయేది శరీరమే! హిందూ మతంలో ఉన్న అవలక్షణాలను ప్రక్షాళన చేయవలసింది పోయి, లోపాలను ఎత్తిచూపిన వారిపై దాడులు చేస్తామని ప్రకటనలు చేయడం వల్ల మొదటికే మోసం వస్తుంది.// గత నెల వీరి వ్యాసంలోది ఈవాక్యం. ఈయనకి ఈయన ఒక వైద్యుడు, ధర్మ సంస్కర్త (స్వయం ప్రకటితమన్నమాట)  అని ఈయన ఉద్దేశ్యం. ఇది ఈయన వ్యక్తిగత అభిప్రాయమైతే ఆయన దగ్గరే ఉంచుకోవచ్చు ప్రజాభిప్రాయంగా పరిగణించి అందరిమీదా ఆయన అభిప్రాయాన్ని రుద్దే హక్కు పారలౌకికంగా కానీ లేదా రాజ్యాంగ పరంగా కానీ వ్యక్తిగా ఆయనకి లేదు. లేదు ఇది ప్రజాభిప్రాయమే అని రుద్దడానికి ప్రయత్నిస్తే అటువంటి పైత్య ప్రకోపం తగ్గించుకోవడానికి ముందు వైద్యుని దగ్గరకెళ్లాల్సింది ఆయనే. (contd...)