Pages

Thursday, December 29, 2016

కోపాయుధం


గురుభ్యోనమః

"క్రుద్ధో హన్యాద్ గురూనపి"

కోపానికి మనం ఆయుధంగా కాక, కోపాన్ని మన ఆయుధంగా మలచుకోవడం సాధకులైన వారికి ప్రతి ఒక్కరికీ  అవసరం.

----

ధన్యాస్తే పురుషశ్రేష్టా యే బుధ్యా కోపముత్థితమ్ !
నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్నిమివాంభసా !!
క్రుద్ధః పాపం న కుర్యాత్ కః "క్రుద్ధో హన్యాద్ గురూనపి" !
క్రుద్ధః పరుషయా వాచా నరస్సాధూనధిక్షిపేత్ !!
వాచ్యా వాచ్యం ప్రకుతోపి న విజానాతి కర్హిచిత్ !
నాకార్యమస్తి క్రుద్ధస్య నావాచ్యం విధ్యతే క్వచి !!
య స్సముత్పతితం క్రోధం క్షమయేవ నిరస్యతి !
యథోరగస్త్వచం జీర్ణాం స వై పురుష ఉచ్యతే!!
(సుందరకాండ)

తా!! మహాత్ములైన ధీరులు తమలో పెల్లుబిక్కిన ఆగ్రహావేశములను ఎగయుచున్న మంటలను నీటితో చలార్చినట్లు నిశ్ఛయాత్మక బుద్ధితో నిగ్రహించుకొందురు. వారు నిజముగా ధన్యాత్ములు. కోపావేశమునకు లోనైనవాడు ఎట్టిపాపములకైననూ ఒడిగట్టును. కోపావేశమునకు లోనైనవాడు గురువుని కూడా హత్యచేయగలడు. కోపావేశమునకు లోనైనవాడు సజ్జనులను సైతము నిందించును.
కోపమునకు లోనైనవాడు మంచి చెడ్డల విచక్షణాజ్ఞానము కోల్పోవును. ఆట్టివానికి చేయగూడని పని అనగూడని మాట యుండదు. సర్పము కుబుసమును విడిచినట్లు క్రోధములో జనించిన ఉద్రేకమును ఒర్పుతో అణిచికొనినవాడే నిజమైన పురుషుడు.

క్రుద్ధః పాపం న కుర్యాత్ కః "క్రుద్ధో హన్యాద్ గురూనపి" ! హనుమ ముఖ్యంగా ఈ మాటని పైశ్లోకంలో గట్టిగా చెప్తారు. కోపమో, క్రోధమో, క్షణికావేశమో ఏదైనా సరే కోపమునకు వశమైనవాడు ఏ పాపానికైనా ఒడిగడతాడు. అసలు చేయకూడని పాపం గురువుని నిగ్రహించడం. ఎదిరించడం, అధిక్షేపించడం వంటివి. ఏదో కారణానికి కోపించి గురువుమీద కూడా కినుక వహించేలా చేస్తుంది ఆ పరిస్థితి, అందుకే కోపం రాగానే పరిశీలించుకునేలా మనకి మనం తర్ఫీదిచ్చుకోవాలి. అసలు కోపం దేనికీ అని. గురువు మాట్లాడితే అదృష్టం. మాట్లాడకపోతే అదో అదృష్టం, తిడితే ఇంకా అదృష్టం. దగ్గరకు తీసుకుంటే అదో అదృష్టం. అసలు గురి ఉన్నవారు గురువు దగ్గరలో ఉన్నా లేకున్నా గురువు నాకన్నా దూరంగా ఎప్పుడున్నారు అన్న తృప్తితో ఉంటాడు. లేకపోతే నన్నలా మర్యాదించలేదు ఇలా పొగడలేదు గురువుగారి పక్కవాళ్ళు చూడలేదు వంటి భావనలు చుట్టుముడతాయి. లేదా నేను చెప్పిందెవరూ వినట్లేదు, నేను చెప్పిందెప్పుడూ తప్పంటున్నారు, లేదా నేను చెప్పినవాటికన్నా ఇంకోరు చెప్పినవి సరి అంటున్నారు ఇలా... ఏవేవో నిప్పు కణాలు అగ్నిలోంచి పుట్టినట్లు అసహన రూపంగా బయటికొస్తాయి. ఇవన్నీ కోపంలోంచి పుట్టేవే... కోపానికి మనం ఆయుధంగా కాక, కోపాన్ని మన ఆయుధంగా మలచుకోవడం సాధకులైన వారికి ప్రతి ఒక్కరికీ అవసరం.

-శంకరకింకర


Monday, December 19, 2016

గుర్తింపు!


వాళ్లకి గుర్తింపు రాలేదు వీళ్ళకి గుర్తింపు రాలేదు, వాళ్ళెవరో అర్హతలేకున్నా గొప్పోళ్ళైయ్యారు వీళ్ళకు అర్హతున్నా ఇలా ఉండిపోయారు. వాళ్ళకి డబ్బులు రాలేవు వీళ్ళకి డబ్బులొచ్చాయి, వాళ్ళూ వీళ్లూ సరే... నీ సంగతేంది.. నిజానికెవరైనా, ఎందుకైనా బాధపడాల్సి వచ్చినా, జాగ్రత్తపడాల్సి వచ్చినా, వారికోసం వాళ్ళు. నీ గురించి నీ బాధ గురించి చెప్పుకో భయ్యా.. వీలైతే పక్కోడికి సాయంచెయ్ వాడెవడో నీ పక్కోడికి సాయం చేయలేదని లాభం కూర్చలేదని వాడి మీద పడిపోకు...  రేపొద్దున్న ఒన్ ఫైన్ డే మార్నింగ్ నీ లెక్కలు చెప్పేటయానికి... నీ సంగతేందో అది కూడా చూసుకో...

దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాతః!
కాలః క్రీడతి గచ్ఛత్యాయుః తదపి న ముంచత్యాశావాయుః!!

- శంకరకింకర