జై గురు దత్త! జై గురు దత్త!
భక్తవత్సలా! మాం పాహి!జీవితంలో ఎన్నిసార్లు మనం దారి తప్పుతాము.
కొన్నిసార్లు అడవిలో...
మరికొన్నిసార్లు మనసులో...
మరికొన్నిసార్లు జీవితంలో...
కానీ గురుదత్తుని నమ్మిన భక్తుడు ఒంటరివాడు కాదు.
సమయం వచ్చినప్పుడు...
అవసరం వచ్చినప్పుడు...
ఎదో ఒక రూపంలో...
ఎదో ఒక వ్యక్తి రూపంలో...
ఎదో ఒక మార్గంగా...
గురుదత్తుడు వచ్చి రక్షిస్తాడు.
"గురుదత్తుని అభయహస్తం ఉన్నవారికి భయం ఉండదు."
----
సహ్యాద్రి పర్వతాల మధ్యలో దట్టమైన అరణ్యాలు విస్తరించి ఉండే రోజులవి
పగలు కూడా సూర్యకాంతి పూర్తిగా నేలను తాకలేని విధంగా ఎత్తైన వృక్షాలు ఆకాశాన్ని కప్పి ఉంచే చిక్కని అడవులు.
ఆ అడవుల్లో అక్కడక్కడా సన్యాసులు, యోగులు, భక్తులు తపస్సు చేసేవారు.
ఆ కాలంలో గోవిందుడనే ఒక యువకుడు ఉండేవాడు.
చిన్నప్పటి నుంచీ అతనికి దత్తాత్రేయ స్వామివారి మీద అపారమైన భక్తి.
ఇంట్లో ఏ పని మొదలుపెట్టినా... "దత్తా!" అని మొదలుపెట్టేవాడు.
నిద్రపోయే ముందు... "దత్తా!" అని జపించేవాడు.
కష్టంలో ఉన్నప్పుడు... "దత్తా!" అని పిలిచేవాడు.
అతని జీవితం మొత్తం గురుదత్త నామస్మరణతో నిండిపోయి ఉండేది.
ఒక రోజు అతనికి సహ్యాద్రి పర్వతాల్లో సంచరించే అవధూత దత్తుని క్షేత్రాలను, దత్త భక్తులను, సాధు సంతులను దర్శించాలి అనే కోరిక కలిగింది. ఇక బయలుదేరదామని నిర్ణయించుకుని, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని "జై గురు దత్తా మాంపాహి! జై గురుదత్తా మాంపాహి!" అంటూ ప్రయాణం ప్రారంభించాడు.
అలా దత్త భక్తులను, సాధుసంతులను దర్శిస్తూ, దత్తక్షేత్రాలు దర్శిస్తూ కొన్ని రోజులు గడిచాయి.
ఆ అడవుల్లోని, సెలయేళ్ళలో, నదుల్లో స్నానం చేశాడు.
సాధువుల ఆశీర్వాదం పొందాడు.
అతని మనసు భక్తి పారవశ్యంతో నిండిపోయింది.
అలా ఇంకా కొనసాగుతూ ఒకనాటి సాయంత్రం... సూర్యుడు అస్తమించబోతున్న సమయంలో ఒక కొండల మధ్య లోయదారిలో ప్రయాణిస్తూ ఉండగా అతను దారి తప్పిపోయాడు.
మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు, ఇంకొద్దిగా వెళితే ఏ గూడేనికో, భక్తుల ఆశ్రమానికో చేరుకుంటాన్లెమ్మని అలాగే నడవసాగాడు... రాత్రౌతోంది... మరింత చీకటి అలుముకుంటోంది ఐనా " ఇంకొద్దిసేపట్లో దారి దొరుకుతుంది." అనుకున్నాడు.
కానీ చీకటి వేగంగా కమ్ముకుంది. అడవి నిశ్శబ్దంగా మారింది, పక్షుల కిల కిలారావాలు ఆగిపోయి, అక్కడక్కడ ఒకటిరెండు పక్షిల కూతలు మాత్రమే వినిపిస్తున్నాయి దూరంగా గుడ్లగూబ అరుపులు వినిపిస్తున్నాయి. మరింత దూరంగా, తమ స్థావరాలు చేరిన జంతువుల అరుపులు వినిపిస్తున్నాయి. చెట్ల కొమ్మలు గాలికి ఊగుతూ భయంకరమైన శబ్దాలు చేస్తున్నాయి. కీచురాళ్ళ రొద ఎక్కువౌతోంది.
గోవిందుడి గుండెల్లో భయం మొదలైంది.
ఎటు చూసినా చీకటే.
దారి కనిపించడం లేదు.
మనిషి కాదు కదా దగ్గర్లో ఏజీవి జాడ కూడా లేదు.
కొంతసేపటికి వాన చినుకులు మొదలై, అది భారీ వర్షంగా మారింది.
మెరుపులు మెరుస్తున్నాయి - ఉరుములు గర్జిస్తున్నాయి. అడవి మరింత భయంకరంగా కనిపిస్తోంది. గోవిందుడు ఒక చెట్టు క్రింద నిలబడి వణికిపోయి, బిక్కు బిక్కుమంటున్నాడు...
"దత్తా! నన్ను కాపాడు. నాకు దారి చూపించు అంటూ జైగురుదత్తా! మాం పాహి!జైగురుదత్తా! మాం పాహి! " అని ప్రార్థించడం ప్రారంభించాడు.
సమయం గడుస్తోంది.
వర్షం తగ్గడం లేదు.
ఆకలి వేస్తోంది.
అలసట పెరుగుతోంది.
భయం మరింత ఎక్కువవుతోంది.
తాను ఉన్న చెట్టును ఆనుకుని మరింత అనువైన ప్రదేశంకోసం ఆ పెద్ద మాను చుట్టూ తిరుగుతూ వెనకకు చేరుకున్నాడు అప్పుడే...
దూరంలో ఒక చిన్న దీపం వెలుగుతున్నట్లు కనిపించింది.
"ఈ అడవిలో, ఇంత రాత్రిలో, ఇంత హోరువానలో దీపపు వెలుగా!?" అని ఆశ్చర్యపోయాడు.
కింద పడ్డ ఓ కర్ర ఊతంగా తీసుకొని జాగ్రత్తగా ఆ వెలుగు వైపుకు అడుగులో అడుగు వేసుకుంటూ నడిచాడు. కొద్దిదూరం వెళ్లగానే ఒక చిన్న కుటీరం కనిపించింది.
ఆ కుటీరం ముందు ఒక వృద్ధ సన్యాసి కూర్చున్నాడు.
తెల్లని గడ్డం.
ప్రశాంతమైన ముఖం.
కళ్లలో అపారమైన దయ వర్షిస్తున్నాయి.
గోవిందుడు ఆనందంతో గబ గబా వెళ్లాడు "స్వామీ! నేను దారి తప్పిఈ అడవిలో చిక్కుకుపోయాను. మీరెవరో ఆపద్బాంధవుడిలా కనపడ్డారు" అన్నాడు.
సన్యాసి చిరునవ్వు నవ్వి "నాయనా! ముందు లోపలికి రా." అని పిలిచాడు. గోవిందుడు ఒళ్ళు తుడుచుకోడానికి వేడినీళ్ళిచ్చాడు, కట్టుకోడానికి పొడి బట్టలు ఇచ్చాడు. ఆ తరావత తాగడానికి వేడి వేడి పాలు ఇచ్చాడు. కొన్ని పళ్ళముక్కలు, రొట్టెలు దుంపలు మొదలైన ఆహారం పెట్టాడు. గోవిందుడు ఆ సన్యాసికి మనసారా నమస్కరించాడు.
ఆ రాత్రంతా గోవిందుడితో ముసలాయన సన్యాసి అతనితో ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడాడు.
ధర్మం గురించి చెప్పాడు.
భక్తి గురించి చెప్పాడు.
గురుభక్తి గురించి చెప్పాడు.
జీవితం గురించి చెప్పాడు.
ఇలా ఎన్నో విషయాలు...
గోవిందుడు ఆ సన్యాసికి కాళ్లు పడుతూ ఆ మాటలు వింటూ గడిపాడు, గోవిందుడికి ఆ రాత్రి ఒక వింతైన ఆత్మ శాంతి కలిగింది, మనసులోని అలజడి తగ్గింది. అతను తన జీవితంలో ఎప్పుడూ అనుభవించని ఏదో అలౌకిక ఆనందాన్ని పొందాడు.
తెల తెలవారుతుండగా వర్షం ఆగిపోయింది
సూర్యోదయం అయ్యింది .
గోవిందుడు స్నానాదికాలు ముగించుకున్నాడు,
సన్యాసి బయటకు వచ్చి ఒక దారిని చూపించి "ఈ దారిలో వెళ్తే ఒక గ్రామం వస్తుంది. అక్కడనుంచి నువ్వు చేరాల్సిన నీ వూరికి వెళ్లడం తేలకౌతుంది" అన్నాడు.
గోవిందుడు అటుచూసి "జైగురు దత్తా! మాంపాహి! జైగురు దత్తా! మాంపాహి!" అంటూ బయలుదేరాడు.
కొన్ని అడుగులు వేసాక, ఒక్కసారిగా గుర్తొచ్చింది. "స్వామివారికి సరిగా కృతజ్ఞత చెప్పలేదు. ఆయన దారి చూపగానే బయలుదేరిపోయాను, అయ్యో" అని వెనక్కి తిరిగి చూశాడు.
కానీ...
అక్కడ కుటీరం లేదు!
సన్యాసి లేడు!
దీపం లేదు!
ఏమీ లేదు!
అక్కడ ఒక పెద్ద రావిచెట్టు మాత్రమే ఉంది.
గోవిందుడు ఆశ్చర్యంతో నిలిచిపోయాడు.
తాను రాత్రంతా ఉన్న కుటీరం ఎక్కడ?
ఆ సన్యాసి ఎక్కడ?
అప్పుడే అతని దృష్టి చెట్టు కింద ఉన్న ఒక రాతిపై పడింది.
అందులో ఇలా చెక్కి ఉంది " జై శ్రీ గురు దత్త"
అతనికి అర్థమైంది.
ఆ రాత్రి తనను రక్షించిన వృద్ధ సన్యాసి మరెవరో కాదు...
సాక్షాత్తు శ్రీ దత్తాత్రేయ స్వామివారే!
ఆ క్షణంలో అతని హృదయం ఉప్పొంగిపోయింది.
కళ్లలో ఆనందబాష్పాలు నిండిపోయాయి.
"దత్తా! నువ్వే వచ్చావా?" అని ఏడుస్తూ నమస్కరించాడు.
ఆ రోజు నుండి గోవిందుడి భక్తి మరింత పెరిగింది.
ఎక్కడికి వెళ్లినా...
ఎవరిని కలిసినా...
ఒకటే చెప్పేవాడు:
"దత్తుణ్ణి నమ్మినవాడిని దత్తుడు ఎప్పుడూ విడిచిపెట్టడు."
---
దత్త భక్తులు ఈ కథ చెప్పుకుంటూ "భక్తుడు ఒక అడుగు వేస్తే... దత్తుడు వంద అడుగులు ముందుకు వస్తాడు." అని అంటూంటారు.
జై గురు దత్త! జై గురు దత్త!
భక్తవత్సలా! మాం పాహి!
-శంకరకింకరః
No comments:
Post a Comment