Pages

Friday, June 19, 2026

బృందావన కథలు – 15 (మాధవ దాస్ — ఉచ్చిష్ఠ భోజనం)

జై రాధే కృష్ణ

బృందావనంలోని లతా కుంజాలలో మాధవ దాస్ అనే ఒక మహాభక్తుడు నివసించేవాడు. ఆయనకు శ్రీకృష్ణుడంటే అపారమైన ప్రేమ. ఆయన కంటికి ఎక్కడ చూసినా కృష్ణుడే కనిపించేవాడు. అందుకే లోక వ్యవహార-వ్యాపారాలన్నిటిని వదిలి, యమునాతీరంలోని కుంజవనాలలో నివసిస్తూ, రాత్రింబవళ్ళూ భగవన్నామ స్మరణలోనే మునిగిపోయేవాడు.
ఆయన జీవన విధానం చాలా విభిన్నంగా ఉండేది. బృందావనంలోని ఆశ్రమాలకు వచ్చిన సాధుసంతులందరూ భోజనం చేసిన తరువాత, వారి విస్తరాకులలో మిగిలిన ఉచ్చిష్ఠాన్ని — ఎంగిలి అన్నం మెతుకులను — ఎంతో భక్తితో, శ్రీకృష్ణుని ఉచ్చిష్ఠంగానే భావించి సేకరించేవాడు. ఆ ప్రసాదమంతా ఒకచోట చేర్చి, ముందుగా శ్రీకృష్ణునికి నైవేద్యంగా సమర్పించేవాడు. తరువాత దానినే మహాప్రసాదంగా భావించి భుజించేవాడు.
ఎందుకంటే మాధవ దాస్‌కు సాధుసంతులందరిలోనూ కృష్ణుడే దర్శనమిచ్చేవాడు.
ఒకరోజు సాధుసంతుల భోజనం, భజనలు, సత్సంగాల కారణంగా ఆయనకు తీవ్రమైన ఆకలి వేసింది. ఆతురతతో సాధువుల ఉచ్చిష్ఠాన్ని త్వరగా సేకరించి, విస్తరాకులో వేసుకొని ఒక ముద్ద నోట్లో పెట్టుకున్నారు. కానీ ఆ ముద్ద నోట్లో పడగానే ఒక్కసారిగా ఆయనకు గుర్తొచ్చింది—
“అయ్యో! ఈరోజు నా కృష్ణుడికి నైవేద్యం పెట్టలేదు!”
ఆ ఆలోచన వచ్చిన వెంటనే ఆయన హృదయం కలవరపడిపోయింది.
ఇప్పుడు నోట్లో ఉన్న ముద్దను బయటకు ఉమ్మలేరు. ఎందుకంటే అది సాధువుల ప్రసాదం. సాధువులలో ఆయనకు కృష్ణుడే కనిపిస్తాడు.
“నా ప్రభువుకే సంబంధించిన ఈ ప్రసాదాన్ని ఎలా బయటకు ఉమ్మగలను? అలాగని నైవేద్యం చేయకుండా దానిని ఎలా మింగగలను?” అని తీవ్ర వేదన చెందారు.
అలా అయోమయంలోనే కూర్చున్నారు.
సాయంత్రం అయింది… రాత్రి దాటింది… అయినా ఆయన నోట్లోని ముద్దను మింగలేదు, బయటకు కూడా వేయలేదు. కన్నీరుతో కృష్ణుణ్ణి తలుచుకుంటూ రాత్రంతా విలపించారు.
ఆ భక్తి… ఆ తపన చూసి చివరకు శ్రీకృష్ణుడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు.
ముగ్ధమోహనమైన చిరునవ్వుతో భగవంతుడు అడిగాడు—
“మాధవా! ఎందుకు ఇలా ఏడుస్తున్నావు?”
నోట్లో ముద్ద ఉండటంతో మాధవ దాస్ మాటలాడలేక, సైగలతో తన బాధను వివరించసాగాడు.
అప్పుడు శ్రీకృష్ణుడు ప్రేమగా అన్నాడు—
“సరే మాధవా! ఆ ముద్దను నా చేతిలో పెట్టు.”
మాధవ దాస్ వెంటనే తల ఊపుతూ,
“ప్రభూ! ఇది నా ఎంగిలి ముద్ద. దాన్ని మీకు ఎలా ఇవ్వగలను?” అని సైగలతో సంకోచంగా తెలియజేశాడు.
భగవంతుడు నవ్వుతూ అన్నాడు—
“అయ్యో మాధవా! ప్రతిరోజూ ఇదే ఉచ్చిష్ఠాన్ని నాకే నైవేద్యంగా సమర్పిస్తావు కదా! మరి ఈరోజు ఎందుకు సంకోచిస్తున్నావు?”
కానీ మాధవ దాస్ ఇంకా బాధతోనే,
“ప్రభూ! అది ఇతర సాధుసంతుల ప్రసాదం. కానీ ఇది మాత్రం నా ఎంగిలి. నేను ఈ అపచారం చేయలేను” అని సైగ చేశాడు.
అప్పుడు కృష్ణుడు అపారమైన కరుణతో ఇలా అన్నాడు—
“మాధవా! నువ్వు ఎవరి ఉచ్చిష్ఠాన్ని నాకు సమర్పిస్తున్నావో, వారందరికంటే నువ్వే నాకు అత్యంత ప్రియమైనవాడివి.”
ఆ మాటలు విన్న మాధవ దాస్ మరింత భావవివశుడై వెక్కి వెక్కి ఏడవసాగాడు. ఎంతోసేపు ఏడుస్తూ ఉండగా, ఆయన నోరు కొద్దిగా తెరుచుకుంది. అప్పుడు నోటిలోని ఒక చిన్న అన్నం మెతుకు కింద పడింది.
శ్రీకృష్ణుడు వెంటనే దానిని తీసుకుని పరమానందంతో భుజించాడు.
ఆ తరువాత క్షణంలోనే భగవంతుడు అంతర్ధానమయ్యాడు.
ఈ సంఘటన ద్వారా మాధవ దాస్‌కు శ్రీకృష్ణుడు ప్రత్యక్ష దర్శనం ఇచ్చాడు.
ఈ కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది—
భగవంతునికి కావలసింది ఆడంబరాలు కాదు… అర్పణల వైభవం కాదు…
“నిజమైన భక్తి భావం మాత్రమే.”
భక్తుని హృదయంలోని నిర్మలమైన ప్రేమకు భగవంతుడు ఎల్లప్పుడూ లొంగిపోతాడు.
భగవంతుడు కుప్పలు తెప్పలుగా పెట్టే రకరకాల మహా నైవేద్యాలకోసం ఆకలితో ఉండడు…
ఆయన ఆకలి కేవలం నిర్మలమైన ప్రేమ భక్తిభావంతోనే తీరుతుంది...
రాధే రాధే
వనజాక్ష భక్తవత్సల
ఘనులగు త్రైమూర్తులందుఁ గరుణానిధివై
కన నీ సద్గుణజాలము
సనకాది మునీంద్రు లెన్నఁ జాలరు కృష్ణా.
- శంకరకింకరః

No comments:

Post a Comment