Pages

Showing posts with label వ్రతాలు. Show all posts
Showing posts with label వ్రతాలు. Show all posts

Friday, August 21, 2020

వినాయక వ్రతం సాయంత్రమే చేయాలా? చర్చ

 వినాయక చవితి నక్త వ్రతమా (అంటే సాయంత్రం నక్షత్రోదయంలో చేయవలసిన వ్రతమా  ? మరో ముఖ్య మీమాంసపై చర్చ

వ్రతంలొ చెప్పిన పురాణోక్త కథ ప్రకారం (వ్రతకల్పం) 


పూర్వపక్షం: - విశేషేణ "నక్తం" కుర్యాచ్చ తద్వ్రతమ్ .... అని స్కాందంలో ఉంది కాబట్టి ఇది నక్త వ్రతం సాయంత్రం నక్షత్రోదయ సమయంలో చేయాలి.


వివరణాత్మక చర్చ:


స్కాంద పురాణం ప్రకారం  చెప్పబడిన శ్యమంతకోపాఖ్యానం లో  "సదా కృష్ణపక్ష చతుర్థి వ్రతం - నక్త్ర వ్రతం" అంటే "సంకష్ట చతుర్థి వ్రతము నక్త వ్రతం" అని చెప్పబడింది


పితామహ ఉవాచ:- చతుర్థ్యాం దేవ దేవోఽసౌ పూజనీయస్సదైవ హి, కృష్ణపక్షే విశేషేణ "నక్తం" కుర్యాచ్చ తద్వ్రతమ్ అపూపైర్ఘృతసంయుక్తమ్......


భాద్రపద శుక్ల చతుర్థి నాటి వ్రతం గురించి చెప్తూ మృణ్మయ మూర్తిని బంగారు మూర్తిగా భావన చేసి పూజించమని చెప్పబడింది తప్ప ప్రత్యేకంగా నక్త వ్రతం అని చెప్పబడలేదు.


ఇక వ్రత కల్పంలో మూలము ముఖ్యమైనదైన భవిష్యోత్తర పురాణంలో వినాయ వ్రత కల్పంలో ఏం చెప్పారో చూద్దాం


శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఉపదేశిస్తున్న వ్రత విధానం:-

ప్రాతశ్శుద్ధతిలైస్నాత్వామధ్యాహ్నేపూజయేన్నృప, నిష్కమాత్రసువర్ణేన, తదర్థార్థేన వాపునః స్వశక్త్యా గణనాథస్య స్వర్ణరౌప్యమయం కృతం, అథవా మృణ్మయం కుర్యాద్విత్తశాఠ్యం నకారయేత్... 


పొద్దున్నే లేచి తెల్లనువ్వులు కలిపిన నీటితో స్నానం చేసి, మధ్యాహ్నం వరసిద్ధివినాయకుణ్ణి పూజించాలి. నిష్కమాత్రం బంగారం లేదా అందులో సగంతోమూర్తిని చేయాలి లేదా వెండితోనైనా
. ఈ రెండూ కుదరకుంటే మట్టితోనైనా చేయాలి. లోభం మాత్రం చూపకూడదు... అని ఇలా వ్రత విధానం మొత్తం ఉపదేశిస్తారు...

నిర్ణయ సింధు:-

యత్ర భాద్రశుక్ల చతుర్థ్యాదౌ గణేశవ్రత విశేషే మధ్యాహ్న పూజోక్తా...

సంకష్ట చతుర్థీతు చంద్రోదయ వ్యాపినీ గ్రాహ్యా....


భాద్రపద శుక్ల చతుర్థి శ్రీ వరసిద్ధివినాయక వ్రతమందు మధ్యాహ్న పూజ విశేషము

సంకష్ట చతుర్థి వ్రతమునకు చంద్రోదయము పూజాసమయము అని నిర్ణయసింధు స్మృతికారులచే సిద్ధం


నిర్ణయం:-

కాబట్టి ఇది నక్త వ్రతం కాదు, మధ్యాహ్నమే చేయవలసిన వ్రతం అని వ్రతకల్పం ప్రకారం సశాస్త్ర సిద్ధము.


(సాధారణ గృహస్థులందరికీ, స్మార్తులకూ ఇదే వర్తింపు)

-శంకరకింకర



21 పత్రాల ప్రమాణం - ముఖ్య విషయం

నమస్తే

21 పత్రాల ప్రమాణం - ముఖ్య విషయం.


వినాయకుడికి ఏయే పత్రాలతోపూజించాలి అన్న మీమాంసలో కొన్ని కొన్ని చోట్ల కొందరు కొందరు పెద్దలు కొన్ని సంప్రదాయాలలో చేసుకుంటున్న వ్రత విధానం ప్రకారం  రెండు మూడు పత్రాలలో వ్యత్యాసం ఉంది. ఐతే మరి మేము ఏవి వాడాలి ఏపత్రాలతో పూజించాలి. ప్రముఖంగా తులసిపత్రంపైన ఈ సందేహం ఎక్కువ. శైవ సంప్రదాయస్తులు ఒకానొక పురాణోక్త మైన గణేశ తులసీ సంవాదాన్ని దృష్టిలో ఉంచుకొని తులసీ పత్రంతో పూజించరాదని చెప్తారు. కొందరు నేరేడు ఆకులతో పూజిస్తారు. ఔత్తరాహికులు కేతకీపత్రం అంటే మొగలి ఆకులతోపూజిస్తారు, అలాగే కొన్ని చోట్ల శ్వేత దూర్వ అంటే తెల్లగడ్డి, ఆగస్త్య పత్రం ఇలా వేర్వేరు పత్రాల మార్పులతో ఉంటుంది.  ఉత్తరభారతంలోనూ చలి దేశాల్లోనూ దేవదారు దొరుకుతుంది మనకి లభ్యంలో ఉండదు.


అలాగే ప్రాంతాలవారీగా బీజాపూరఫలం ఇష్టమని గింజలు ఎక్కువగా ఉండే జామ, దోసపండు, దోసకాయ, చిట్టడవులదగ్గర ఉండే ప్రాంతం వారు పంపరపనాస, మాదీఫలం వంటివి కూడా వాడడం కద్దు. కొన్ని చోట్ల దొరికితే పనస కూడా నివేదిస్తారు. తెలుగులో కుడుములు, ఉండ్రాళ్ళు, బూరెలు, ఔత్తరాహికుల మోదకాలు ఇవన్నీ ప్రాంతాచారాలను బట్టి మారిన ఒకే వంటయొక్క రూపాలు


ఐతే ఇవన్నీ మన శ్రద్ధ ప్రకటించడానికే. పైగా ఏ కల్పంలోనూ 21పత్రాలు అంటే ఇవే అని రూఢి లేదు. 

21 పత్రాలు

21 నామాలతో దూర్వాయుగ్మ పూజ

21 నేతి కుడుములతో (ఉండ్రాళ్ళ) నివేదన


//దైవీ గుణ సంపత్తి కలిగి 21 దోషాలను తొలగించి తద్వారా పాపఫలితాన్ని తీసి 21 రకాల నరకలోక బాధలను పడకుండా కాపాడమని. సాత్విక బుద్ధినిమ్మని, ప్రకృతి యెడల దైవీ భావనతో వ్యవహరిస్తామని, నివేదన బుద్ధితో వ్యవహరిస్తామని భగవంతుని దగ్గర చెప్పుకోవడమే ఈ 21 నామాలతో 21 దైవీ గుణ సంపత్తి కలిగిన పత్ర పూజ అంతరార్థం.//


పరంపరాగతంగా మీ ఇళ్ళలో మీ సంప్రదాయం ప్రకారం ఏయే పత్రాలతో పూజిస్తున్నారో వాటితోనే పూజించాలి. మీ ఇంటి ఆచారాన్ని వంశఆచారాన్ని అనుసరించి గతంలో మీపెద్దలు చేసిన విధంగా లేదా మీ ఇంటి పురోహితుడు సూచించిన విధంగా లేదా మీరు ఆశ్రయించిన స్వగురువు సూచన మేరకు ఆచరించాలి. ఇవేమీ మాకు తెలియదు అనుకుంటే, తేలిగ్గా స్కాంద పురాణాంతర్గతంగా వివరించి వ్రతకల్పంగా రూపొందించబడిన వ్రత విధానాన్ని వ్రతచూడామణి ఇత్యాది గ్రంథాలలో ప్రకటించారు దాని అనుసరించి చేసుకోవచ్చు. దీని గురించి పెద్ద అల్లరి పడనవసరంలేదు, మన ఆచారంలోలేని ఇతర ప్రాంత, సంప్రదాయ విషయాలను మనవాటిలో జొప్పించుకోనవసరంలేదు. తండ్రి యైన శివుడు ఆచార ప్రియుడు అని శివపురాణం చెప్తుంటే కొడుకైన గణపతి అదే పరంపరాగతమైన మార్గంలో చరిస్తే ఆనందిస్తాడు, బావుందనో, అందంగా చెప్పబడిందనో మరోమార్గంలోకి మళ్ళడం మంచిది కాదు.


-శంకరకింకర



Thursday, August 24, 2017

చంద్రశాపానుగ్రహ ఆఖ్యానము (శ్రీ గణేశ పురాణo)

గణేశావిర్భావమును గూర్చి కొన్ని పిట్టకథలు, సినిమా కథలు విరివిగా ప్రచారముననున్నవి. గణేశుడి బాగా ఉండ్రాళ్ళు ఇతర పదార్థాలు తిని తన తల్లి దండ్రులకు నమస్కరించబోగా ఏదో ఉయ్యాల ఊగినట్లు కాళ్ళు నేలకానితే చేతులానవనీ, చేతులానితే కాళ్ళు ఆనవనీ హాస్య స్ఫోరకమైన తప్పుడు కథలల్లి వినాయక వ్రత కథలందు జొప్పించడం జరిగింది. అంత అసంబద్దమైన కథలు పురాణమునందు కానీ, ప్రామాణిక వ్రతకథయందుకానీ లేవు అని గమనించి పురాణోక్తమైన కథలను చదివి వివరము తెలిసి, వ్రత ఫలితమును పొందగలరు. గణేశ పురాణమునుండి చంద్రశాపానుగ్రహమను మూలమునకు తెలుగు అనువాదము మనందరికొరకు  -శంకరకింకర

చంద్రశాపానుగ్రహ ఆఖ్యానము (శ్రీ గణేశ పురాణo)
బ్రహ్మగారు నారదుని కోరిక మేరకు చంద్రునికి కలిగిన శాప వృత్తాంతము, ఆ శాప విమోచనమును గూర్చి వివరిస్తూ ఇట్లు పలికెను "ఒకానొక సమయమున  పరమశివుడు నివసించు కైలాసము శిఖరమున సభలో నారదాది మునిముఖ్యులుండే సభకు వెళ్ళి, పరమశివుని అర్చించి శివునకు, శివుని కుమారుడైన గణపతికి ఫలాదులు సమర్పించిన పిమ్మట సభాంతమున బ్రహ్మ మరియు ఇతరులు ఎవరి గృహమునకు వారు వెళ్ళిరి. ఆ సమయమున వినాయకుడు కైలాసము నుండి చంద్రలోకమునకు వెళ్లగా, ఆ చంద్రుడు, ఉత్తముడు లోకోపకారిఐన వినాయకుని యొక్క బాహ్య ఆకారమును అనగా ఏనుగు మొఖము, జారిన బొజ్జను చూసి పరిహసించాడు. లోకమంతా, శిష్ఠులంతా యెవరిని "సుముఖుడు" అని ప్రశంసిస్తారో అటువంటి గణేశుని చంద్రుడు చూసి పరిహసించాడు. అది చూసిన వినాయకుడు క్రోధమును పొంది. అందముగా ఉన్న కారణముచేత లోకములో అందరూ నిన్ను పొగడుతున్నారన్న అహంకారంతో ఉన్నావు. ఉచ్ఛనీచాలు మరచి ప్రవర్తించావు కాబట్టి ఈ నాటి నుండి నీవు మలినుడవు, నిన్ను చూచిన వారికి నీలాపనిందలు కలుగుతాయి" అని శాపమును ఇచ్చి తన గృహానికేగెను.


ఈ విషయం సర్వ లోకములలో పాకి ఆనాటి నుండి చంద్రుని ఎవ్వరూ చూడటం మానేశారు. చంద్రుని అతిశయం, బాహ్య సౌందర్యంతో మిడిసి పడి లోకోపకారం చేస్తూ సుముఖుడుగా ప్రసిద్ధికెక్కిన వినాయకునే పరిహసించి శాపవాక్కు పొందిన విషయం సర్వలోకాలలోని వారికి తెలిసింది.  తాను అందరికీ ఆదర్శుడైన వినాయకునిచే శాపం పొందినందుకు చంద్రుడు సిగ్గుతో వివర్ణుడైనాడు. ఎంత అందమైన స్వరూపమైతే నేమి తన ముఖము ఎవ్వరూ చూడటానికి ఇష్టపడడంలేదని కృంగ సాగాడు.


చంద్ర శాప వృత్తాంతాన్ని తెలుసుకున్న ఇంద్రాది దేవతలు గజాననుని వద్దకు వెళ్ళి నమస్కరించి ఈ విధముగా విజ్ఞప్తి చేశారు " ఓ దేవ దేవా! సర్వ జగద్వందితా! నీవు స్వతంత్రుడవు, నీయిచ్ఛ వచ్చినట్లు పరిపాలించే నియంతవు. నిర్గుణుడవు, సగుణుడవు, అన్ని గుణములు నీ యందే కలవు. ఓ ఈశ్వరా ! పాహి పాహి! నిన్నే శరణు కోరుతున్నాము. చంద్రుడు చేసిన అపరాధమునకు వేసిన శిక్ష లోకమునంతకూ శిక్ష అగుచున్నది కాబట్టి చంద్రుడు పొందిన ఆ శాపమునకు విమోచనము ఇచ్చి చంద్రుని క్షేమమును, లోక క్షేమమును చూడవలసినది. లోకములు చంద్రుడు కనపడక, చూడక కష్టములలో ఉన్నవి. మరల అన్ని లోకములకు చంద్రుని దర్శనము , చంద్రుని తో భాషణము చేయు సౌలభ్యము కలుగజేయుము. ధర్మార్థకామ మోక్షములను ప్రసాదించు వినాయకుడు అది విని ప్రసన్నుడయ్యి ఇట్లు పలికెను " ఓ దేవతలారా! మీ స్తోత్రమునకు సంతుష్టుడనైతిని. కానీ మీరు కోరిన కోరిక మూడులోకములలోనూ అసాధ్యమైనది. చంద్రుడు చేసిన పనికి  శాప విమోచనము కుదరదు" అని పలికెను. అంత దేవతలు గణపతితో " ఓ దేవా! చంద్రుడు వివర్ణుడై ప్రకాశ హీనుడవ్వడం వలన, చంద్రుని అమృత కిరణములు పడక ఓషధులు ప్రకాశించుటలేదు లోకములు ఆపదలో ఉన్నవి కనుక ఆగ్రహింపక చంద్రుణ్ణి ఈ ఆపదనుంచి గట్టెక్కించు" మని ప్రార్థన చేసిరి.

దేవతల ప్రార్థన విన్న వినాయకుడు " ఓ దేవతలారా! లోకములో ఆదర్శనీయులను, మహాత్ములను నేరుగా కానీ అన్యాపదేశంగా కానీ కించపరిస్తే శిక్ష తప్పదు. చంద్రుడు అటువంటి అపరాధమే చేశాడు. ఉద్దేశ్యపూర్వకంగా వికటా అని పరిహాసం చేసి ఆపదలపాలయ్యాడు. అగ్ని, సూర్యూడూ చల్లగా ఐననూ, సముద్రము ఇంకిననూ నా వాక్కు ఫలించకతప్పదు. ఓ సుర సంఘములారా, నేటినుండి భాద్రపద శుక్ల చవితి తిథినాడు తెలిసి కానీ, తెలియక కానీ శాపముపొందిన ఈ చంద్రుని చూసినవారి ఎన్నో కష్టములను పొందెదరు." అదివిన్న దేవతలు "ఓం" అనుచూ ప్రణిపాతం చేసి పుష్ప వృష్టి కురిపించిరి తమ ఇండ్లకు వెళ్ళి చంద్రునికి చెప్పగా, అంత చంద్రుడు " నేను మూఢుడను, లోకములకు ఆదర్శుడైన గజాననునిచూచి పరిహాసమాడి కించ పరచినందుకు నాకే కాక మూడులోకములకు ఆపదలు తెచ్చిన అపరాధిని.  త్రైలోక్యనాయకుడు! దేవుడు! మూడులోకములు పాలించువాడు! అవ్యయుడు!నిర్గుణుడు ! నిత్యుడు! పరబ్రహ్మ స్వరూపమైన! గజాననుని! సమస్త లోకములకు గురువైనవానికి! నావల్ల అపరాధం జరిగినది. సర్వలోకముయొక్క హితము కొరకు నియమించబడినవాడినైనా నావల్ల అపరాధం జరిగినది. భాద్రపద శుక్ల చతుర్థినాడు మాత్రమే నన్ను చూడరాదన్న శాపమునకు విమోచనము ఎట్లు కలుగగలదు" అని పశ్చాత్తాపపడుతూ "ఆ గజాననునే శరణు వేడెదను, ఆయన ప్రసాదముగానే తిరిగి నేను ఖ్యాతిని ఆర్జించగలను" అని పల్కి దేవతల వద్ద సెలవు తీసుకొని గంగా నది దక్షిణ తీరమైన కాశీయందు గణేశుని కొరకై తీవ్ర తపస్సు చేసెను. ఆ ప్రదేశంలో చంద్రుడు ఇరవైరెండు సంవత్సరాలు కఠిన తపస్సు చేసాడు.


చంద్రుని తపస్సుకు మెచ్చిన గజాననుడు ఎర్రని వస్త్రములు కట్టుకున్నవాడై, ఎర్రని మాలలు ధరించినవాడై చతుర్భుజములతో, మహా కాయముతో, సింధూరవర్ణంతో, కోట్లాది సూర్యుల ప్రకాశంకన్నా ఎక్కువైన కాంతిపుంజపు ప్రకాశంతో చంద్రుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అంత కాంతిపుంజం చూసిన చంద్రుడు కళ్ళుతెరచి స్వామిని చూసి దోసిళ్ళొగ్గి నమస్కరిస్తూ తన మనసులో ఉన్న కోరికను కోరడానికై పరమ భక్తియుతుడై గజాననునితో " ఓ దేవా ! ఓ విఘ్ననాశకా! సర్వులకూ ధర్మార్థకామములనొసగడంలో విఘ్నములను హరించువాడా! దయా సముద్రుడా! పరబ్రహ్మా! విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడా! సమస్త విశ్వమూ నీయందే ఉన్నవాడా! జగత్తు యందు మాయగా ఉన్నవాడా! మూడులోకాలనూలయించు శక్తి కలవాడా! నీకు పునః పునః నమస్కారములు. బుద్ధిని ప్రకాశింపజేసి ప్రచోదనం చేయు దేవా! దేవతలకు అధిపతీ! నిత్యము సత్యమూ ఐన పరబ్రహ్మమా! నీకు నిత్యమూ నమస్కారములు. అజ్ఞానముతో చేసిన అపరాధమును మన్నించి దయను వర్షించి నన్ను దోష రహితుని చేయవలసినది." అని వేడుకొన్నాడు.


చంద్రుని స్తోత్రము, అతని కోరిక విన్న గజాననుడు " ఓ చంద్రా! నేను నీతపస్సుకు సంతోషించాను. నీకు ఇక పూర్వ వైభవం పూర్వ రూపం కలుగుగాక. భాద్రపద శుక్ల చవితి నాడు నావ్రతం చేసిన వారికి భాద్రపద శుక్లచవితినాడు చంద్రుని చూసిన ఎటువంటి దోషము కలుగదు." అని పలికి చంద్రునిలోని ఒక కళను తన తలమీద పెట్టుకుని చంద్రునికి తిరిగి సముచిత స్థానాన్ని కలిగించాడు. ఆనాడు గజాననుడు "ఫాల చంద్రుడు" అన్న నామాన్ని పొంది, దేవతలందరిచేతా షోడశోపచార పూజలందుకొని చంద్రుడు తపస్సు చేసిన క్షేత్రము సిద్ధి క్షేత్రము కాగలదని వరమిచ్చి అక్కడ చేసిన అనుష్ఠానాది కార్యములు త్వరగా సిద్ధించగలవని పలికెను. అంత దేవతలు మునులు సంతోషం చెందినవారై వారి వారి స్వగృహములకేగిరి. గజాననుడు శుక్ల పక్ష ప్రతిపత్తిథి నాటి చంద్రరేఖను ఎంతో ఉల్లాసంగా, ప్రహృష్ఠ వదనంతో తల మీద ధరించి తన గృహమునకేగెను.

శ్రీ గణేశ పురాణమందలి ఉపాసనా ఖండములోని చంద్ర శాపానుగ్రహము అనే ఆఖ్యానం సమాప్తము
-శంకరకింకర