జై రాధే కృష్ణ
బృందావనంలోని ఆ ఉదయం ఎంతో దివ్యంగా, మధురంగా ఉంది. యమునా తీరాలపై చల్లని మలయమారుతం మెల్లగా వీస్తోంది. కదంబ వృక్షాలపై వికసించిన పుష్పాలు తమ సుగంధాలను గాలిలో చల్లుతూ ఆ వాతావరణాన్నంతా ప్రేమరసంతో నింపుతున్నాయి. బృందావనపు వీధుల్లో గోపికల గానాలు మృదువుగా ప్రతిధ్వనిస్తున్నాయి. పక్షులు కూడా తమ కిలకిలారావాలతో ఆ మాధుర్యానికి స్వరాలద్దుతున్నాయి.
దూరంలో మురళీనాదం వినిపించింది… అది సాధారణ సంగీతం కాదు — అది రాధా నామాన్ని జపించే ప్రేమ గానం.
"శ్యామ్ నీ వేణువు పలుకుతోందే రాధా నామమే,
నీ స్వరములలో వినిపించేదే నా ప్రాణ నామమే…"
"నీ మురళి మాధుర్యములో నా మనసు మునిగెనయ్యా,
నీ రాధా నామ స్మరణలో నా హృదయం నిలిచెనయ్యా…"
ఆ ప్రేమనాదాల మధ్య, రాధారాణి తన వంటశాలలో ఎంతో శ్రద్ధగా భోజనం సిద్ధం చేస్తోంది. ఆమె చేతులు వంట చేస్తున్నాయి, కానీ మనసంతా కన్నయ్య స్మరణలోనే ఉంది.
ప్రతి పాత్రలో ప్రేమను కలుపుతోంది, ప్రతి వంటకంలో భక్తిని జోడిస్తోంది. అయితే ఎంతోసేపు పనులు చేస్తూ చేస్తూ అలసిపోయింది. ఆమె నుదుటిపై చిన్న చిన్న చెమట బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి.
అంతలో వెనుకనుంచి మెల్లగా రెండు చేతులు వచ్చి ఆమె కళ్లను మూసేశాయి.
రాధ స్వల్పంగా నవ్వుతూ—
"కృష్ణా... నీ స్పర్శను గుర్తుపట్టడానికి నాకు కళ్ల అవసరమా?" అంది.
ఆ మాట విన్న కన్నయ్య చిరునవ్వుతో ఆమె ఎదుటికి వచ్చాడు. నెమలిపింఛం కొంచెం వంగి ఉంది, కళ్లలో అల్లరి నిండిపోయి ఉంది.
"రాధే!" అని ఎంతో మృదువుగా పిలిచాడు.
"ఏమైంది కృష్ణా?"
కృష్ణుడు కొంచెం బాధగా ఆమె ముఖాన్ని చూస్తూ అన్నాడు—
"రాధే! నువ్వు అందరి కోసం ఎంతగా శ్రమిస్తున్నావో చూస్తుంటే నా మనసుకు బాధగా ఉంది. నీ చేతుల్లో అలసట కనిపిస్తుంటే నా హృదయం నిశ్చలంగా ఉండలేకపోతోంది. ఈరోజు నువ్వు విశ్రాంతి తీసుకో. భోజనం నేను తయారు చేస్తాను."
రాధ నవ్వుతూ—
"కృష్ణా! నీకు వెన్న దొంగిలించడం, గోపికలను ఆటపట్టించడం, మురళి ఊదటం మాత్రమే తెలుసు. వంట చేయడం కూడా వచ్చా?" అంది.
అది విన్న కన్నయ్య చిన్నపిల్లాడిలా పెదవులు ముడుచుకున్నాడు.
"రాధే! ప్రేమ ఉన్న చోట అసాధ్యం అనేదే ఉండదు." అన్నాడు.
అంటూనే రాధ చుట్టూ తిరుగుతూ అల్లరిగా పాడసాగాడు—
"రాధే రాధే బర్సానా రాధే,
నా హృదయం పలికేదంతా రాధే…"
"నీ పేరే నా శ్వాస...నీ ప్రేమే నా లోకం…"
రాధారాణి ఆ పాటలు విని మురిసిపోతూ,నవ్వుతూ తల ఊపింది.
"సరే కృష్ణా! చూద్దాం నీ మహా వంటలీల!" అని కొంటెగా కన్నుగీటింది
కృష్ణుడు ఆనందంగా వెంటనే వంటగదిలోకి అడుగుపెట్టాడు.
కానీ జగన్నాటక సూత్రధారికి కూడా ఆ రోజు వంటగది చిన్న యుద్ధరంగంలా మారిపోయింది.
ముందుగా పిండిని కలపడం మొదలుపెట్టాడు. ఒకసారి నీళ్లు ఎక్కువ పోశాడు. పిండి చాలా మెత్తగా అయిపోయింది. మళ్లీ పిండి వేసి కలిపాడు — ఇప్పుడు అది రాయిలా గట్టిగా తయారైంది.
"అయ్యో! కాళీయమర్దనం చేయడం కంటే ఇదే కష్టంగా ఉందే!" అని తల గోక్కున్నాడు.
కూరలు కోయడం మొదలుపెట్టాడు. కొన్ని ముక్కలు చాలా పెద్దవి, కొన్ని చాలా చిన్నవి అయ్యాయి.
బయట దాక్కొని చూస్తున్న గోపికలు నవ్వులు ఆపుకోలేకపోయారు.
"అయ్యయ్యో! వెన్న దొంగ ఈరోజు వంటవాడయ్యాడే!"
మరొక సఖి నవ్వుతూ—
"ఇది కొత్త బృందావన లీలా!" అంది.
అంతలో కన్నయ్య రొట్టెలు చేయడం మొదలుపెట్టాడు.
అవి గుండ్రంగా రావాలని ప్రయత్నించాడు. కానీ కొన్ని కృష్ణ పక్షంలోని చంద్రుని ముక్కల్లా, కొన్ని మేఘాల్లా, కొన్ని యమునా అలల్లా వంకరటింకరగా తయారయ్యాయి.
కొన్ని చోట్ల కాలిపోయాయి, మరికొన్ని చోట్ల పచ్చిగానే ఉన్నాయి.
అవి చూసి కృష్ణుడు తానే నవ్వుకున్నాడు.
"రాధే! ఇవి రొట్టెలా? లేక నేను పగలగొట్టిన ఉట్టికుండల ముక్కలా?" అని మెల్లగా అన్నాడు. తనకు తానే నవ్వుకున్నాడు.
చివరకు సంకోచంతో భోజనప్పళ్లెం రాధారాణి ముందుంచాడు.
"రాధే... నాకు వంట చేయడం రాదు. కానీ నీ కోసం నా హృదయం మొత్తం పెట్టి చేశాను."
రాధ ప్రేమగా ఒక రొట్టె ముక్క తీసుకుంది, కూరతో కలిపి ఆమె నోట్లో పెట్టుకున్న క్షణంలోనే ఆమె కళ్ళలో ప్రేమాశ్రువులు మెరిశాయి.
ఎందుకంటే ఆ రుచిలో నెయ్యి రుచి లేదు... పంచదార తీపి లేదు... తేనె రుచి లేదు... కానీ అక్కడ అపారమైన ప్రేమ ఉంది.
ఆమె ఆశ్చర్యంగా అడిగింది—
"కృష్ణా! ఈ రొట్టెలో ఇంత మాధుర్యం ఎలా వచ్చింది?"
కృష్ణుడు ఆమె కళ్లలోకి ప్రేమగా చూస్తూ మెల్లగా అన్నాడు—
"రాధే! నా చేతులు పిండిని కలిపాయి. కానీ నా హృదయం మాత్రం నీ నామాన్ని జపించింది."
"రాధే... రాధే... అని ప్రతి శ్వాస పలికింది,
నీ ప్రేమతో నా మనసంతా నిండిపోయింది…"
"రాధా నామమే నా జీవన గీతం,
నీ ప్రేమే నా జీవిత సత్యం…"
ఆ తరువాత కన్నయ్య మృదువుగా అన్నాడు—
"ప్రేమతో చేసిన సేవలో లోపాలు కనిపించవు రాధే... ప్రేమే రుచిగా మారుతుంది... భక్తే భోజనంగా మారుతుంది."
రాధారాణి కన్నయ్య భుజంపై తల ఆనించింది. కృష్ణుని చుట్టూ తన చేతిని వేసింది. ఇంకో చేతితో కృష్ణుని చేతిని మృదువుగా స్పృశించింది... కృష్ణుడు రాధవంక చూసాడు.. రాధ తల యెత్తి కృష్ణుని కళ్ళలోకి అనురాగంతో చూసింది.. ఒకరి కళ్లలో ఒకరి మొఖం ప్రతిబింబిస్తోంది....
ఆ క్షణంలో యమునా తరంగాలు కూడా మెల్లగా ఆలపిస్తున్నట్లనిపించింది—
"రాధే గోవిందా... రాధే గోపాలా,
ప్రేమరసామృతమయము నీవే గోపాలా..."
"రాధా కృష్ణుల ప్రేమే యమృత మాధుర్యం,
ఆ ప్రేమలోనే దాగియున్నది జగత్సౌందర్యం..."
ఆ నాటి సాయంత్రం బృందావనం మొత్తం పులకరింత కొత్తందాలు పులుముకుంది..
ప్రేమతో చేసిన చిన్న సేవ కూడా, భగవంతునికి సమర్పించిన మహాయజ్ఞంలోని పూర్ణాహుతియే. అది రాధాకృష్ణులు నేటికీ మనకు నేర్పిస్తున్న రసస్ఫోరక భావ సహిత ప్రేమ పాఠాలు, భక్తి గీతాలు.
రాధే రాధే!
— శంకరకింకరః
గాయతి వనమాలీ మధురం
గాయతి వనమాలీ!
పుష్పసుగంధి సుమలయ సమీరే
మునిజన సేవిత యమునాతీరే! (గాయతి...)
కూజిత శుకపికముఖ ఖగకుంజే
కుటిలాలక బహునీరదపుంజే! (గాయతి...)
తులసీదామ విభూషణ హారీ
జలజభవస్తుత సద్గుణ శౌరీ! (గాయతి...)
పరమహంస హృదయోత్సవకారీ
పరిపూరిత మురళీరవధారీ! (గాయతి...)
(- సదాశివబ్రహ్మేంద్ర సరస్వతీ స్వామి)
No comments:
Post a Comment