Pages

Showing posts with label బృందావన కథలు. Show all posts
Showing posts with label బృందావన కథలు. Show all posts

Saturday, June 20, 2026

బృందావన కథలు – 20 (కదంబవృక్షం చెప్పిన ప్రేమకథ)

జై రాధే! జై శ్యామ్!

బృందావనం…
అది ఒక ప్రదేశం కాదు…
అది ప్రేమ శ్వాసించే లోకం...
ప్రతి వృక్షం ఒక గోపికలా నిలుస్తుంది…
ప్రతి పువ్వు ఒక ప్రేమలేఖలా వికసిస్తుంది…
అక్కడ గాలి కూడా “రాధే… రాధే…” అని జపిస్తుంది.
యమునా అలలు కూడా “శ్యామ్… శ్యామ్…” అని గానం చేస్తాయి.
యమునా తీరం…
సాయంత్రపు మబ్బులు బృందావనాన్ని నీలిరంగు ముసుగుతో కప్పుకున్న వేళ…
వాయువులో మల్లెల పరిమళం తేలుతూ ఉంది...
వేణుగాన స్వరాలు దూరాన్నుంచి అలలలా వచ్చి వృక్షాల కొమ్మలను తాకుతున్నాయి...
ఆ యమునా ఒడ్డున ఒక పురాతన కదంబవృక్షం నిలిచి ఉంది!
అది సాధారణ చెట్టు కాదు…
రాధా కృష్ణుల ప్రతి చూపుకూ, ప్రతి చిరునవ్వుకూ, ప్రతి మౌనానికీ సాక్షిగా నిలిచిన ప్రేమసాక్షి!
ఎన్నో వేల సంవత్సరాలుగా అది అక్కడే నిలబడి ఉంది.
వర్షాలు వచ్చాయి…
గాలులు వీచాయి…
యమునా ప్రవాహం మారింది…
కాని ఆ చెట్టు గుండెలో మాత్రం ఒకే జ్ఞాపకం ఎప్పటికీ పచ్చగా నిలిచింది, adE "రాధా మాధవుల ప్రేమ" - "కృష్ణ రాసలీలలు"
ఒకరోజు యమునమ్మ అలలు ఆకదంబ వృక్షాన్ని చూసి మెల్లగా కదులుతూ “ఓ కదంబమా… నువ్వెందుకు ఎప్పుడూ ఇలా పులకించి ఉంటావు?” అని అడిగాయి
అప్పుడు కదంబవృక్షం తన ఆకులను కొద్దిగా కదుపుతూ సన్నగా నవ్వింది.
“నా కొమ్మలపై నిలబడి, పడుకొని
శ్యామసుందరుడు వేణువు ఊదాడు,
నా నీడలో రాధారాణి తన మనసును దాచుకుంది,
వాళ్లిద్దరూ నన్ను ఆనుకుని కూర్చున్నారు,
నా చుట్టూ తిరుగుతూ ఆడుకున్నారు,
విరహం భరించారు... ప్రేమించుకున్నారు,
గోపికలంతా ఇక్కడచేరి గోవిందునితో రాసలీలలాడారు,
అన్నిటికీ నేను సాక్షిని,
ఆ మధుర జ్ఞాపకాలలో జీవిస్తుంటాను,
అందుకే నా ప్రతి ఆకు ప్రేమగీతం పాడుతుంది…”
అంటూ తన జ్ఞాపకాల తలుపులు తెరిచింది
---
ఒక పౌర్ణమి సాయంత్రం…
వెండి వెలుగుతో యమునా మెరిసిపోతోంది.
యమునమ్మ నీలిరంగు చీర కట్టుకున్న వధువులా నెమ్మదిగా ప్రవహిస్తోంది.
ఆకాశమంతా వెండి మబ్బులు తేలుతున్నాయి.
మల్లెల పరిమళం గాలిలో కలిసిపోయింది.
గోకులం నిశ్శబ్దంగా ఉంది.
నావద్దకు చేరిన గోపికల కళ్లలో ఆత్రుత.
దూరంగా వాయువులో మురళీనాదం.
ఆ స్వరం వినగానే,
నా ఆకులన్నీ ఒక్కసారిగా కంపించాయి.
ఎందుకంటే ఆ స్వరం ఎవరిదో నాకు తెలుసు...
అప్పుడు కృష్ణుడు వచ్చాడు…
నీలమేఘ శ్యాముడు…
తలపై నెమలిపింఛం…
అధరాలపై చిరునవ్వు…
కళ్లలో చిలిపి చంద్రకాంతి…
చేతిలో వేణువు...
కృష్ణుడు నా దగ్గరికు నడిచి వచ్చాడు,
నా కొమ్మను ఆనుకుని నిలబడ్డాడు.
ఆ స్పర్శ తగిలిన క్షణంలో నా వేర్లనుంచి - చిటారుకొమ్మ చిగురాకు వరకూ అమృతం ప్రవహించినట్లైంది.
వేణువును పెదవులకు చేర్చిన క్షణంలో…
బృందావనం అంతా ఒక కొత్త ప్రాణం పోసుకున్నట్లు ప్రకాశించింది.
ఆ స్వరాలు వినగానే...
ఆహాఁ!
అది సంగీతం కాదు…
అది ప్రేమకు రూపం కల్పించిన మధురమైన రాగం...
ఆ స్వరం వినగానే యమునమ్మ అలలు ఆగిపోయాయి…
చంద్రుడు మబ్బుల వెనుకనుంచి తొంగిచూశాడు…
గాలే మత్తెక్కినట్టు నెమ్మదిగా వీచింది…
వెన్నెలలో వికసించిన తెల్ల కలువలా…
మల్లెల పరిమళంలా…
కన్నుల్లో అనంతమైన ప్రేమతో…
రాధారాణి పరుగెత్తుకుంటూ వచ్చింది. ఆమె అడుగులు నేలను తాకుతున్నాయో లేదో కూడా తెలియలేదు.
ఆమె వచ్చి నా నీడలో నిలిచింది,
శ్రీకృష్ణుడు చిరునవ్వుతో చూశాడు.
ఆ చూపు…
అది మాట కాదు…
అది వేదం కాదు…
అది మంత్రం కాదు...
అది ప్రేమకు అర్థం చెప్పలేని మౌనసంగీతం.
ఆ చూపు…
అది రెండు కళ్ల కలయిక కాదు…
అది రెండు ఆత్మలు ఒకటైపోయిన క్షణం.
రాధా మెల్లగా తలవంచింది.
ఆమె చెంపలు సిగ్గుతో ఎర్రబడ్డాయి.
ఆమె జడలోని మల్లెలు జారిపడి నా వేర్లపై పడ్డాయి.
ఆ రోజు నుంచి నా వేర్లలో కూడా ప్రేమ పరిమళిస్తోంది.
---
కొన్నిసార్లు ఇద్దరూ నా చుట్టూ తిరుగుతూ చిలిపిగా మాటలాడేవారు.
కృష్ణుడు నా కొమ్మల వెనుక దాక్కుని రాధను ఆటపట్టించేవాడు.
“రాధే! నన్ను కనుక్కోగలవా?” అని నవ్వుతుండగా
రాధారాణి కోపంగా నటిస్తూ “కాన్హా! చాలింక బయటకు రా… నీ వేణువు నిన్ను దాచలేదు!” అనేది.
కానీ ఆమె కోపంలో కూడా ప్రేమే ఉండేది.
అతని చిలిపితనంలో కూడా ఆరాధనే ఉండేది.
అప్పుడు గాలి కూడా నవ్వేది…
నా ఆకులు కూడా సంతోషంగా ఊగేవి…
---
ఒకసారి రాధారాణి అలిగింది.
కృష్ణుడు ఆలస్యంగా వచ్చాడు.
రాధ వచ్చి నా కింద కూర్చుంది.
ఆమె కళ్లలో విరహం నిండిపోయింది.
ఆ విరహపు కన్నీటి చుక్కలు నా వేర్లపై పడ్డప్పుడు
నా గుండెలో ఏదో విరిగినట్టు అనిపించింది.
కొద్దిసేపటికి కృష్ణుడు వచ్చాడు, మాట్లాడలేదు.
నిశ్శబ్దంగా వచ్చి రాధ పాదాల దగ్గర కూర్చున్నాడు.
తర్వాత తన వేణువులో ఒక మృదువైన రాగం పలికించాడు.
ఆ రాగం వినగానే రాధ కళ్లలోని అలక వెన్నలా కరిగిపోయింది.
ఆమె మెల్లగా “శ్యామా… నీ వేణుగానంలో ఏముంది? ఎందుకు నాకోపం కూడా దానిముందు నిలువలేకపోతోంది?" అని అడిగింది.
అప్పుడు కృష్ణుడు నవ్వుతూ “రాధే… నీ ప్రేమ ముందు నేనూ ఓడిపోయినవాడినే కదా…” అని అన్నాడు
ఆ మాట విన్న క్షణంలో నా కొమ్మలన్నీ పూలతో నిండిపోయాయి. నిట్టనిలువునా పులకించిపోయాను...
---
రాసలీల రాత్రుల్లో..
అవి మాటల్లో చెప్పలేని దివ్య క్షణాలు...
నా కొమ్మలపై చంద్రకాంతి జారుతూ ఉండేది.
గోపికల నూపుర ధ్వనులు గాలిలో తేలేవి.
కృష్ణుడు ప్రతి గోపికతో నృత్యం చేస్తున్నా
ఆయన చూపు మాత్రం రాధపై నిలిచి ఉండేది.
ఎందుకంటే —
“రాధా హృదయం లేకుండా
కృష్ణుడి వేణువుకు స్వరం లేదు…”
“రాధ లేకుండా కృష్ణుడు సంపూర్ణుడు కాదు…
కృష్ణుడు లేకుండా రాధకు శ్వాస లేదు…”
ఆ రాత్రుల్లో నా ఆకులన్నీ తాళం వేస్తూ ఊగేవి.
యమునమ్మ అలలు కూడా నృత్యం చేసేవి.
చంద్రుడు కూడా ఆ లీల చూడటానికి కదలకుండా నిలిచిపోయేవాడు
---
కాలం గడిచింది…
ద్వాపరయుగం ముగిసింది…
కృష్ణుడు మథురకు వెళ్లిపోయాడు…
ఆ రోజు బృందావనం ఏడ్చింది.
యమునమ్మ అలలు నిశ్శబ్దమయ్యాయి.
నా ఆకులు గాలికి కూడా కదల్లేదు
ఆ రోజు గోపికలు, సఖులతో సహా రాధారాణి నెమ్మదిగా నా దగ్గరకు వచ్చింది.
ఆమె కళ్లలో యమునానది అంత లోతైన విరహం.
ఆమె నా కొమ్మను హత్తుకుని మెల్లగా ఏడ్చింది.
“ఓ కదంబమా… ఇక ఈ నీడలో వేణుగానం వినిపించదా?”
నేను సమాధానం చెప్పలేక నిశ్శబ్దంగా నిలిచిపోయాను.
ఎందుకంటే ఆ రోజు గాలి కూడా ఏడ్చింది…
యమునమ్మ అలలు కూడా నిశ్శబ్దమయ్యాయి…
కానీ అప్పుడే నాకు ఒక సత్యం తెలిసింది...
కృష్ణుడు బృందావనం విడిచిపెట్టలేదు…
ఆయన రాధ హృదయంలోనే నిలిచిపోయాడు.
అందుకే నేటికీ,
ఎవరైనా “రాధే… రాధే…” అని పిలిస్తే
నా ఆకులు పులకరిస్తాయి…
యమునా అలలు చిరునవ్వు నవ్వుతాయి…
వేణుగానం గాలిలో మళ్లీ వినిపిస్తుంది…
ఎందుకంటే
"రాధాకృష్ణుల ప్రేమ కథ కాదు… అది బృందావన శ్వాస…
రాధాకృష్ణుల ప్రేమ కథ కాదు… అది శ్వాస… అది భక్తి… అది ఎన్నికాలాలకూ చెదరని దివ్యానురాగం"
-----
రాధే రాధే
“కదంబ నీడలో మొదలైన ఆ ప్రేమ
కాలాన్ని దాటి నేటికీ పరిమళిస్తుంది…
రాధా నామం పలికిన ప్రతి హృదయంలో
కృష్ణుడి వేణువు ఇంకా మ్రోగుతూనే ఉంది…”
జై రాధే కృష్ణ
-శంకరకింకరః

Friday, June 19, 2026

బృందావన కథలు - 19 (తాజ్‌బీబీ)

జై రాధే కృష్ణ!

బృందావన ధూళిలో ఒక విచిత్రమైన మహిమ దాగి ఉంటుంది.
ఆ ధూళిని హృదయంతో స్పృశించినవారి జీవితాలు మారిపోతాయి.
యమునా తీరాన వీచే ప్రతి గాలి రాధామాధవుల ప్రేమసందేశాన్నే మోస్తుంది.
ప్రతి కుంజం ఒక విరహగీతాన్ని ఆలపిస్తుంది.
ప్రతి వృక్షం ఒక భక్తుని కన్నీటి కథకు సాక్షిగా నిలుస్తుంది.
ఈ వ్రజభూమి ఎన్నో మహాభక్తులను చూసింది.
రాజ్యాలను త్యజించి “కృష్ణ” అనే ఒక్క నామంలో మునిగిపోయిన రాజులను చూసింది…
వేదాలు వల్లించిన పండితులు చివరకు “రాధే… రాధే…” అంటూ కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలను చూసింది…
కానీ వీరందరిలో ఒక భక్తురాలి కథ మాత్రం ఎంతో అపూర్వమైనది… ఎంతో హృదయ విదారకమైనది…
ఒక ముఘల్ రాచకన్య…
ఒక మహారాజభవనంలో పెరిగిన సౌందర్యరాశి…
చివరకు వ్రజ ధామంలో “శ్యాముని దాసి”గా ఎలా కరిగిపోయిందో తెలిపే ప్రేమగాథ ఇది.
ఆమె పేరు "తాజ్‌బీబీ"
ముఘల్ సామ్రాజ్యం తన వైభవశిఖరంలో ఉన్న కాలం అది.
రాజమహళ్లలో ముత్యాల దీపాలు రాత్రంతా మెరిసేవి…
పర్షియా దేశపు అత్తర్లు గాలిలో పరిమళించేవి…
వీణలు, సితార్లు, నృత్యాలు, దాసదాసీల సేవలు — సుఖాలకు ఎక్కడా కొదువలేదు.
తాజ్‌బీబీ చుట్టూ ప్రపంచం మొత్తం వైభవంతో నిండిపోయి ఉండేది.
కానీ…
ఆమె హృదయంలో మాత్రం ఒక అంతులేని శూన్యం.
రాత్రివేళ రాజభవనపు జన్నెల దగ్గర నిలబడి చంద్రుణ్ని చూస్తూ ఆమె మౌనంగా కన్నీళ్లు పెట్టుకునేది.
ఎందుకో తెలియని ఒక విరహం ఆమె గుండెను కాల్చేది.
ఆమె మనసు తరచూ తనను తాను ప్రశ్నించేది—
“ఎవరి కోసం నా ప్రాణం ఇలా విలవిలలాడుతోంది…?
ఎవరి కోసం ఈ హృదయం ఎదురుచూస్తోంది…?
ఈ ప్రపంచంలో నాకు తెలియని ఇంకెవరో ఉన్నారా…?”
ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగేది ఒక్క వ్రజచంద్రుడే.
ఒకరోజు ఆమె రాజమహల్ వెలుపల విహారయాత్రకు వెళ్లింది.
దిల్లీ వీధుల్లో సాయంత్రపు చల్లని గాలి వీచుతోంది.
అప్పుడే ఒక వీధి మూలన తులసీమాలను ధరించిన ఒక వృద్ధ వైష్ణవ సాధువు కన్నులు మూసుకుని పరవశంగా కీర్తన పాడుతున్నాడు.
ఆ స్వరం వినగానే తాజ్‌బీబీ అడుగులు ఆగిపోయాయి.
ఆ కీర్తనలో ఒక వింత మాధుర్యం ఉంది…
ఆ స్వరంలో ఒక అపూర్వమైన ఆర్తి ఉంది…
సాధువు ఇలా ఆలపిస్తున్నాడు—
“శ్యామ్ తేరీ బంసీ పుకారే రాధా నామ్…
లోగ్ కరే భక్తోం కో యూన్ హీ బద్నామ్…”
మరలా ఆయన కళ్లలో నీళ్లు నిండగా ఇలా పాడసాగాడు—
“నల్లని మేఘశ్యాముడు…
తలపై నెమలిపింఛం…
అధరాలపై మురళి…
చిరునవ్వుతో జగత్తును మోహింపజేసే వ్రజసుందరుడు…”
ఆ మాటలు వినగానే తాజ్‌బీబీ గుండెలో ఏదో విరిగిపోయింది.
ఆమెకు తెలియని ఆనందం… తెలియని బాధ… తెలియని ప్రేమ… ఒక్కసారిగా హృదయమంతా నింపేశాయి.
ఆ క్షణంలోనే ఆమెకు అర్థమైంది.
“ఆయనే…! నా హృదయం వెతుకుతున్నవాడు ఆయనే…! నా ప్రాణం ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న వాడు ఆ మురళీమోహనుడే…!”
ఆ రోజు నుండి తాజ్‌బీబీకి నిద్ర లేకుండా పోయింది.
రాజమహళ్లలోని అద్దాల్లో తన ముఖం కనిపించలేదు…
అందులో ఆమెకు నెమలిపింఛం ధరించిన శ్యామసుందరుడే కనిపించసాగాడు.
ప్రతి గాలిలో మురళీనాదం వినిపించింది.
ప్రతి పుష్పంలో కృష్ణుని సుగంధం అనిపించింది.
రాత్రివేళల్లో ఆమె గుండె ఒక్కటే పేరును జపించేది—
“కృష్ణా… శ్యామా… మురారీ…”
చివరకు ఒక రాత్రి…
రాజవైభవాన్ని… ఆభరణాలను… రత్నఖజానాలను… అన్నింటినీ వదిలేసి, కేవలం “శ్యాముని దర్శనం” కోసం ఆమె బృందావనానికి బయలుదేరింది.
ఆమె బృందావన ధామంలో అడుగుపెట్టిన క్షణం…
యమునా గాలి ఆమెను ఆలింగనం చేసుకున్నట్టనిపించింది.
వృందావన ధూళి ఆమె పాదాలను తాకగానే ఆమె కన్నీళ్లు ఆగలేదు.
ఆమె నేలను హృదయానికి హత్తుకుని ఏడుస్తూ ఇలా పలికింది—
“ఇదేనా నా ప్రాణవల్లభుడు విహరించిన నేల…!
ఇదేనా రాధారాణి అడుగులు తాకిన పవిత్ర భూమి…!
ఓ మధుర వ్రజమా! ఇక నన్ను నీ ఒడిలోనే దాచుకో…”
కానీ లోకం ప్రేమను ఎప్పుడూ సులభంగా అర్థం చేసుకోదు.
ఒక ముఘల్ రాచకన్య హిందూ వేషంలో ఆలయాలకు రావడం చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. కొంతమంది ఆమెను అపహాస్యం చేశారు. ఆలయ ద్వారాలు మూసివేశారు.
“నీవు అన్యమతస్థురాలు… ఆలయంలోనికి ప్రవేశం లేదు…” అని ఆమెను ఆపివేశారు.
ఆ మాటలు తాజ్‌బీబీ హృదయాన్ని ఛిద్రమయ్యేలా చేశాయి.
ఆమె నెమ్మదిగా యమునా ఒడ్డునకు వెళ్లింది.
ఒక కడిమిచెట్టు క్రింద కూర్చుంది.
అన్నపానాలు మానేసింది.
రాత్రింబగళ్లు ఒక్కటే ప్రార్థన—
“కన్నయ్యా… ఈ లోకం నన్ను నీ దరి చేరనివ్వకపోయినా, నా ప్రాణం మాత్రం నిన్నే చేరుకుంది… నిన్ను చూడకుండా నేను బ్రతకలేను… ఒక్కసారి… ఒక్కసారి దర్శనమివ్వు శ్యామా…”
ఆమె కన్నీళ్లు యమునా అలల్లో కలిశాయి.
ఆమె విరహం బృందావన గాలిలో వ్యాపించింది.
రోజులు గడిచిపోయాయి…
ఒక అర్ధరాత్రి…
బృందావనమంతా గాఢనిద్రలో మునిగిపోయిన వేళ, యమునా తీరాన ఒక్కసారిగా ఒక దివ్యకాంతి ప్రసరించింది.
ఆ కాంతిలోనుండి నెమ్మదిగా ఒక దివ్యమూర్తి బయటకు వచ్చింది.
పీతాంబరం…
వనమాల…
తలపై నెమలిపింఛం…
అధరాలపై మురళి…
ముఖంలో అనంత కరుణతో కూడిన చిరునవ్వు…
ఆయనే…
వ్రజేంద్రనందనుడు…
శ్యామసుందరుడు…
రాధావల్లభుడు…
ఆ రూపాన్ని చూసిన క్షణం తాజ్‌బీబీ శ్వాస ఆగిపోయినట్టైంది.
“శ్యామా…!” అని ఒక్క మాట పలికి ఆయన పాదాలపై కుప్పకూలిపోయింది.
శ్రీకృష్ణుడు తన మృదువైన హస్తాలతో ఆమె కన్నీళ్లను తుడిచాడు.
అపారమైన ప్రేమతో “తాజ్… నీవు నన్ను ఆలయ ద్వారాల వెనుక వెతికావు… కానీ నేను నీ ప్రేమలోనే నివసిస్తున్నాను. భక్తికి సరిహద్దులు లేవు…” అని అన్నాడు
మరలా ఆమె తలను తన హృదయానికి ఆనించి మృదువుగా “ఇప్పటివరకు నీవు ముఘల్ రాచకన్యవు… ఇకపై నీవు నా వ్రజభక్తురాలు… నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే ‘భక్త తాజ్‌బీబీ’వి…” అని పలికాడు.
అని చెప్పి తన చేతుల్లోనుండి ఒక చిన్న శ్యామసుందరుని విగ్రహాన్ని ఆమెకు అందించాడు.
ఆ క్షణంలో తాజ్‌బీబీ విరహాగ్ని చల్లారిపోయింది.
ఆమెకు ప్రపంచం కనుమరుగైపోయింది.
మిగిలింది కేవలం కృష్ణప్రేమ మాత్రమే.
ఆ తర్వాత ఆమె బృందావనాన్ని విడిచిపెట్టలేదు.
యమునా తీరాన కూర్చుని కన్నయ్య గుణగణాలను పాడేది…
విరహంతో రోదించేది…
కొన్నిసార్లు కృష్ణుని విగ్రహాన్ని ఒడిలో పెట్టుకుని బాలికలా నవ్వేది…
ఆమె రచించిన పదాలలో మతభేదం లేదు…
కేవలం ప్రేమ మాత్రమే ఉంది.
ఆమె గీతాలలో రాజసత్తా లేదు…
కేవలం దాస్యభక్తి మాత్రమే ఉంది.
ఈనాటికీ బృందావనంలోని రమణరేతి సమీపంలో “తాజ్‌బీబీ సమాధి” భక్తులకు దర్శనమిస్తుంది.
అక్కడికి వెళ్లినవారికి ఇప్పటికీ ఒక అపూర్వమైన శాంతి అనుభూతి అవుతుంది.
తాజ్‌బీబీ కథ మనకు ఒక శాశ్వత సత్యాన్ని నేర్పుతుంది—
భగవంతుడు నీ జన్మను చూడడు…
నీ హృదయాన్ని మాత్రమే చూస్తాడు.
ప్రేమతో ఒక్కసారి “కృష్ణా!” అని పిలిస్తే,
ఆయన నీ వద్దకు పరుగెత్తుకుంటూ వస్తాడు.
జై రాధే!
జై శ్యామసుందర!
— శంకరకింకరః

బృందావన కథలు - 18 (నెమలి పించం – రాధా నామం)

జై శ్రీరాధే! జై శ్రీకృష్ణ!

బృందావనంలోని యమునా తీరం…
సాయంత్రపు అరుణ కాంతులు యమునా అలలపై వెండి తరంగాల్లా మెరిసిపోతున్న వేళ…
ఆకాశమంతా నీలిమతో నిండిపోయి, మొదటి నక్షత్రాలు మెల్లగా వెలుగులు చిందిస్తున్నాయి.
యమునా తీరాన కదంబ, తామల వృక్షాలు గాలికి మృదువుగా ఊగుతూ, ఆ దివ్యసంధ్యకు స్వాగత గీతం పాడుతున్నట్లున్నాయి.
మందార, మల్లెల పరిమళాలతో గాలి మధురంగా నిండిపోయింది.
కదంబ వృక్షాల నీడలో గోపికల గానాలు మెల్లగా తేలుతున్నాయి.
ఆ మధుర వాతావరణంలో శ్రీకృష్ణుడు తన మురళిని ఆలపిస్తున్నాడు.
ఆ మురళీ నాదం వినగానే యమునా అలలు సైతం తమ ప్రవాహాన్ని నెమ్మదించాయి.
చుట్టూ ఉన్న జింకలు, నెమళ్లు, కోయిలలు పరవశంతో నిలిచిపోయాయి.
ఆ మురళీ నాదం వినగానే వృందావనంలోని ప్రతి ఆకూ పరవశిస్తోంది.
రాధారాణి ఆయన పక్కనే కూర్చొని, ఆ స్వరాల్లో తన హృదయాన్నే కలిపేసింది.
కృష్ణుడి తలపై మెరిసే నెమలి పించాన్ని చూస్తూ రాధమ్మ మృదువుగా నవ్వింది.
“కృష్ణా! నీ కిరీటంలో ఈ నెమలి పించం ఎప్పుడూ ఎందుకు ఉంటుంది? నీకు ఇది అంత ప్రియమా?”
కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు.
ఆ నవ్వులో రాధాప్రేమ యొక్క అనంతత్వం ప్రతిఫలించింది.
ఆ నవ్వులో యుగయుగాల ప్రేమ మెరిసింది.
ఆయన మెల్లగా అన్నాడు—
“రాధే… ఇది కేవలం అలంకారం కాదు… ఇది నా ప్రాణస్మరణ.”
రాధమ్మ ఆశ్చర్యంగా చూసింది. ఆమె కన్నులలో ప్రేమ, ఆశ్చర్యం, భక్తి అన్నీ కలిసిపోయి ఒక దివ్య కాంతిలా మెరిసాయి.
“నిర్జీవమైన ఈ పించం… నీ ప్రాణస్మరణమా?” అనడిగింది.
కృష్ణుడు మెల్లగా తన కిరీటంలోని నెమలి పించాన్ని తీసి రాధమ్మ చెవి దగ్గర ఉంచాడు. అంతే…
ఆ పించం లోనుండి మృదువైన, మధురమైన నాదం వినిపించింది “రాధే… రాధే… రాధే…”
ఆ శబ్దం వినగానే రాధమ్మ కళ్లలో విస్మయం పరచుకుంది.
ఆమెకు ఆ ధ్వని కేవలం శబ్దంలా అనిపించలేదు;
అది కృష్ణ హృదయం పలికిన ప్రేమమంత్రంలా అనిపించింది.
ఆమె హృదయం ఆనందంతో వణికిపోయింది.
ఆమె శరీరం పులకాంకురాలతో పులకించింది.
ఆమె తన కృష్ణుణ్ణి చూస్తూ సిగ్గులమొగ్గైంది.
కృష్ణుడు ప్రేమతో చెప్పసాగాడు
“రాధే! ఈ పించంలోని ప్రతి అణువు నీ నామాన్నే జపిస్తోంది. దీనికి ఒక అద్భుతమైన రహస్యం ఉంది…”
----
పూర్వం నందగావ్‌లో ఒక అందమైన నెమలి ఉండేది.
దాని రెక్కలు ఇంద్రధనుస్సులా మెరిసేవి.
ప్రతిరోజూ అది యమునా తీరాన ఒక చెట్టు కొమ్మపై కూర్చొని “కృష్ణా… కృష్ణా…” అని భక్తితో క్రేంకణాలు చేస్తూ ఆలపించేది.
ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు…
తామరలపై మంచుతుంపర్లు మెరిసే ప్రాతఃకాలం నుంచీ,
చంద్రకాంతులు విరిసే రాత్రివేళ దాకా…
వానైనా, గాలైనా…
దాని నాలుకపై కేవలం కృష్ణ నామమే ఉండేది.
“మురళీ గానమే నా శ్వాసయ్యా…
నీ నామమే నా జీవాధారం…”
కానీ…
రోజులు గడిచినా కృష్ణుడు దాని వైపు చూడలేదు.
నెమలి హృదయం బాధతో నిండిపోయింది.
దాని కన్నులలోని ప్రకాశం మసకబారింది.
కృష్ణుని దర్శనం కోసం తపించిన ఆ చిన్న హృదయం విరహాగ్నిలో కరిగిపోయింది.
“నేను ఇంత ప్రేమగా పిలుస్తున్నా… నా స్వామి ఎందుకు కరుణించదం లేదు?” అని కన్నీళ్లు పెట్టుకుంది.
ఆ సమయంలో అక్కడికి ఒక చిన్న మైనా పక్షి వచ్చింది.
“సోదరా! ఎందుకు ఇలా దుఃఖిస్తున్నావు?” అని మృదువుగా అడిగింది.
నెమలి తన బాధ అంతా చెప్పుకుంది.
మైనా చిరునవ్వు నవ్వి “నీకు తెలియదా? కృష్ణుణ్ని చేరాలంటే ముందుగా రాధమ్మ కృప కావాలి. రాధా అనుగ్రహం లేనిదే కృష్ణుడు దొరకడు.” అని అంది
ఆ మాటలు విన్న నెమలి ఒక్కసారిగా మేల్కొన్నట్లైంది.
ఇప్పటివరకు తాను కేవలం కృష్ణుని చేరాలని మాత్రమే కోరుకుందని,
కానీ కృష్ణ హృదయ ద్వారం రాధామాత చేతుల్లోనే ఉందని అది గ్రహించింది.
అది వెంటనే బర్సానాకు బయలుదేరింది.
బర్సానాలో రాధారాణి సన్నిధికి చేరిన నెమలి… ఈసారి “కృష్ణ” అని కాదు… కన్నీళ్లు కారుతుండగా ప్రేమతో... “రాధే… రాధే…" అని జపించడం ప్రారంభించింది.
ఆ పిలుపులో అహంకారం లేదు…
ఆర్తి మాత్రమే ఉంది…
ఆశ లేదు…
కేవలం శరణాగతి మాత్రమే ఉంది.
ఆ నామస్మరణ విన్న రాధారాణి హృదయం కరిగిపోయింది.
సాక్షాత్తు రాధమ్మ ప్రత్యక్షమై మృదువుగా “వత్సా! నీ భక్తి నన్ను ఎంతో మెప్పించింది. ఇప్పుడు నీవు తిరిగి నందగావ్‌కు వెళ్లు. కృష్ణుడు స్వయంగా నీ వద్దకు వస్తాడు.” అని పలికి నెమలిని తన చేతుల్లోకి తీసుకొని నిమిరి పంపింది
రాధమ్మ ఆశీర్వాదంతో నెమలి ఆనందాశ్రువులు కార్చింది.
ఆ కన్నీటి బిందువులు యమునా తీరంలోని ఇసుకపై పడగా, అవి సాక్షాత్తు భక్తి ముత్యాల్లా మెరిసాయి.
నందగావ్‌కు తిరిగి వచ్చిన నెమలి ఈసారి పరమానందంతో
“రాధే… రాధే… రాధా నామమే భక్తికి మార్గం… రాధా కృపలోనే కృష్ణ దర్శనం…” అని పాడసాగింది
అంతే!
ఇంతకాలం విననట్లు ఉన్న కృష్ణుడు… “రాధే” అన్న నామం వినగానే పరవశుడై అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు.
ఆయన ఆ నెమలిని తన హృదయానికి హత్తుకొని ప్రేమగా “ప్రియమైన నెమలీ! నాకు అత్యంత ప్రియమైన నామాన్ని నీవు ఆలపించావు. రాధా నామం వినగానే నేను నన్ను నేను మరిచిపోతాను.” అన్నాడు
అప్పుడే అక్కడికి రాధమ్మ వచ్చింది, కృష్ణుడి కన్నుల్లో ఆనందబాష్పాలు మెరిశాయి.
ఆ దివ్య క్షణంలో నెమలి పరవశంతో నాట్యం చేయసాగింది.
దాని ప్రతి అడుగులో ఆనందం ఉంది…
ప్రతి విరబూసిన రెక్కలో భక్తి ఉంది…
దాని రెక్కలు గాలిలో విరబూసి, భక్తి గంగలా ప్రవహించాయి.
రాధాకృష్ణుల ప్రేమస్వరూపాన్ని చూసి అది సంపూర్ణ భక్తిలో లీనమైంది. రాధాకృష్ణుల చుట్టూ నాట్యం చేస్తూనే ఉంది, ఆనందంతో ఎగురుతోంది, తిరుగుతోంది, పాటపాడుతోంది, పురి విప్పుతోంది...
చివరకు… అలసి పోయి తన ప్రాణాలనే రాధమ్మ చరణాల వద్ద సమర్పించింది.
ఆనక కృష్ణుడు ప్రేమతో ఆ నెమలి పించాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు.
ఆయన కన్నుల్లో కరుణ మెరిసింది.
“నీ భక్తి యుగయుగాల పాటు స్మరణీయంగా ఉండాలి. ఇకనుంచి నీ పించం నా కిరీటంలో శాశ్వతంగా ఉంటుంది.”
అని చెప్పి ఆ పించాన్ని తన శిరస్సుపై అలంకరించుకున్నాడు.
అప్పటి నుండి…
ఆ నెమలి పించంలోని ప్రతి అణువు
“రాధే… రాధే…”
అనే నామాన్ని జపిస్తూనే ఉంది.
---
ఈ నెమలి కథ గుర్తు చేయగానే...
రాధమ్మ కన్నీటి కళ్లతో కృష్ణుణ్ని చూసి మృదువుగా
“కృష్ణా! లోకానికి నువ్వు మురళీ గానాన్ని వినిపిస్తావు… కానీ నీ హృదయంలో మాత్రం ఎప్పుడూ నా నామమే నిండివుంటుంది కదా!” అని పలికింది
కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు.
ఆ నవ్వులో ప్రేమ ఉంది…
భక్తి ఉంది…
రాధాతత్త్వం ఉంది.
యమునా గాలి మళ్లీ మృదువుగా వీచింది…
కదంబవృక్షాలు ఆనందంతో ఊగాయి…
గోపికల హృదయాలు పరవశించాయి…
బృందావనం అంతా ఒక్క నామంతో మార్మోగిపోయింది—
గోపికల హృదయాల్లో…
యమునా అలలలో…
మురళీ స్వరాల్లో…
ప్రతి శ్వాసలో…
“రాధే… రాధే…”
కృష్ణుణ్ని చేరుకోవడానికి మార్గం భక్తి.
ఆ భక్తికి హృదయం రాధా నామం.
రాధా కృప లభించిన చోటే కృష్ణుని కరుణ ప్రవహిస్తుంది.
అందుకే భక్తులు అంటారు—
“రాధా నామం పలికితే… కృష్ణుడు స్వయంగా హృదయంలో ప్రత్యక్షమవుతాడు.”
“రాధే… రాధే…”
జై శ్రీ రాధేకృష్ణ
-శంకరకింకరః

బృందావన కథలు – 17 (తోటమాలి – వనమాలి)

జై రాధే శ్యామ్

బృందావనంలో ఆ ఉదయం స్వర్గం భూమిపైకి దిగివచ్చినట్లుగా విరాజిల్లుతోంది. యమునా తీరాల నుండి వీచే మృదుమారుతం పూల పరిమళాలను తన రెక్కలపై మోసుకొని వనమంతా చల్లుతోంది. కదంబ వృక్షాలు సున్నితంగా తమ కొమ్మలను రెమ్మలను ఊపుతున్నాయి. మల్లెలు తమ తెల్లని నవ్వులు చిందిస్తున్నాయి. మందారాలు, సంపెంగలు, పారిజాతాలు తమ అందాలతో వనరాజ్యాన్ని అలంకరిస్తున్నాయి.
పక్షులు మధురమైన రాగాలు ఆలపిస్తున్నాయి. తుమ్మెదలు పుష్పాలపై వాలుతూ ప్రేమగీతాలు పాడుతున్నాయి. యమునా తరంగాలు తీరాన్ని ముద్దాడుతూ మృదువుగా మురళీనాదానికి తాళం వేస్తున్నట్లున్నాయి.
ఆ దివ్యవేళలో, శ్రీమతి రాధారాణి తన ప్రియ సఖులతో కలిసి కుసుమసరోవర సమీపంలోని లతాకుంజాలలో విహరిస్తోంది.
ఆమె అడుగులు పడిన చోట భూమి పులకించిపోతోంది.
ఆమె నవ్విన చోట గాలికి చెక్కిలిగింతలు పుడుతున్నాయి.
ఆమె చూపులు తాకిన చోట పుష్పాలు వికసిస్తున్నాయి.
అప్పుడే రాధారాణి చూపులు ఒక అందమైన తీగసంపెంగ పువ్వుపై నిలిచిపోయాయి.
ఆ పుష్పం బంగారు కాంతులా మెరిసిపోతోంది. దాని పరిమళం గాలిలో కలసి మనసులను మత్తెక్కిస్తోంది.
రాధారాణి ఆ పువ్వును చూసి మనసులో అనుకుంది—
"ఈ సంపెంగ పుష్పాన్ని ధరించి నా కాన్హా ఎదుట నిలబడితే... ఆయన చూపులు ఎలా ఉంటాయో?"
ఆ ఆలోచన రాగానే ఆమె పెదవులపై ఒక చిరునవ్వు విరిసింది. చెక్కిళ్లపై సిగ్గు రంగులు పూశాయి.
మెల్లగా తన సుకుమారమైన హస్తాన్ని చాచి ఆ పుష్పాన్ని కోయబోయింది.
కానీ...
అనుకోకుండా ఆమె నీలవర్ణపు మేలిముసుగు పక్కనే ఉన్న ముల్లుల పొదలో చిక్కుకుంది.
రాధారాణి ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
మనసులో ఒక చిన్న ఆలోచన మెరిసింది—
"అయ్యో...! ఈ వెన్నదొంగ మళ్లీ దొంగతనంగా వచ్చి నా ముసుగు లాగుతున్నాడేమో?"
అని తలచుకొని చుట్టూ చూసింది.
అప్పుడే...
పూల తీగల వెనుక నుంచి ఒక మృదువైన స్వరం వినిపించింది
“ఓ సుందరీ! మీకు సహాయం చేయనా?”
రాధారాణి ఆశ్చర్యంగా ఆ వైపు చూసింది.
అక్కడ ఒక యువకుడు నిలబడి ఉన్నాడు.
నల్లని నొక్కుల కురులు...
మేఘశ్యామ వర్ణం...
తామర రేకులవంటి నేత్రాలు...
పెదవులపై మృదుస్మితం...
కానీ వస్త్రధారణ మాత్రం ఒక సాధారణ తోటమాలివాడిలా ఉంది.
అతడు చేతులు జోడించి వినయంగా నమస్కరిస్తూ
“నేను బృందాదేవి సేవకుడిని దేవీ. ఈ పుష్పవాటికను సంరక్షించే మాలిని. మీకు ఇబ్బంది కలిగిందని చూసి వచ్చాను.” అన్నాడు.
రాధారాణి కనుబొమ్మలు కొద్దిగా ముడిచింది.
“నీవు తోటమాలివాడివా? ఇక్కడ ఇంతకుముందు ఎప్పుడూ నిన్ను చూడలేదే?”
అని కొంచెం గద్దించినట్లుగా అడిగింది.
కానీ మనసులో మాత్రం
"ఎందుకో... ఈ స్వరం... ఈ చూపులు... ఈ చిరునవ్వు... నా హృదయానికి ఎప్పటినుంచో తెలిసినట్లుంది..."
అని అనుకుంది.
ఆ యువకుడు కళ్లతో కొంటెగా, పెదవులతో సన్నగా నవ్వాడు.
“కొన్ని పరిచయాలు కళ్లతో కాదు దేవీ... హృదయంతో దర్శిస్తే గుర్తుకొస్తాయి.”
అని చెప్పి మెల్లగా ఆమె దగ్గరకు వచ్చాడు.
ఆ ముల్లులలో చిక్కుకున్న ముసుగును ఎంతో జాగ్రత్తగా విడదీయసాగాడు.
అప్పుడు...
అనుకోకుండా ఆయన వేళ్లు రాధారాణి సుకుమార హస్తాన్ని తాకాయి.
ఆ స్పర్శతో—
కాలమే ఒక క్షణం ఆగిపోయింది.
గాలి వీచడం మరిచిపోయింది.
తుమ్మెదలు గానం నిలిపివేశాయి.
యమునా తరంగాలు సైతం నిశ్చలమయ్యాయి.
రాధారాణి హృదయంలో మాత్రం ప్రేమ తరంగాలు ఉప్పొంగసాగాయి.
ఆమె తలను వంచుకుంది.
ఆ సమయంలో గాలి మెల్లగా ఒక ప్రేమగీతాన్ని తీసుకొచ్చింది
"యమునా తీరమున
చల్లని గాలిలో
వేణువు మ్రోగెనే...
కృష్ణుని మురళి మ్రోగెనే"
మరలా—
"మురళీ గానమే మధురం...
మోహన రూపమే మనోహరం..."
రాధారాణి కళ్లలో ప్రేమ కాంతులు మెరవసాగాయి.
వేయి వేణువులు ఒకేసారి కృష్ణనామాన్ని ఆలపిస్తున్నట్లుగా ఆమె హృదయం తన్మయత్వం పొందింది.
కానీ...
ఆ రహస్యం లలితా, విశాఖల కళ్ల నుంచి దాగలేదు. కృష్ణుడు ఏ వేషం వేసినా లలిత-విశాఖ సఖులకు దొరికిపోతాడు...
ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు.
లలితా సఖి అంది—
“రాధే! ఈ తోటమాలివాడి కళ్లలో పూలకంటే ఎక్కువ చిలిపితనం కనిపిస్తోంది!”
విశాఖ నవ్వుతూ—
“ఇతడు పూలను కాపాడే మాలివాడు కాదు... హృదయ కుసుమాలను దోచుకునే దొంగవాడు!”
అందరూ ఒకేసారి నవ్వుతూ అన్నారు—
“ఇతడే మన శ్యామసుందరుడు! మురళీకృష్ణుడు! గోపీ మానసచోరుడు”
అప్పుడే సఖులు నవ్వుతూ ఆలపించారు—
"వనమాలీ వాసుదేవా
జగన్మోహన రాధారమణా
శశివదనా సరసిజనయనా..."
అంతే...
ఆ తోటమాలి పెదవులపై దాగి ఉన్న చిరునవ్వు మరింత విరిసింది.
రాధారాణి సిగ్గుతో కళ్లను దించి.
చిరుకోపంతో తల వంచింది.
ఆ సమయంలో ప్రేమగాలి మళ్లీ ఒక గీతాన్ని ఆలపించింది—
"రాధే రాధే జపో చలే ఆయేంగే బిహారీ,
కృష్ణుడు మాత్రం అమాయకంగా నిలబడి ఉన్నాడు. చేతితో మెల్లిగా రాధముఖం యెత్తి కళ్లలోకి చూస్తూ తన కళ్లతో "ముల్లులలో చిక్కుకుంది నీ ముసుగు మాత్రమే కాదు రాధే...
నీ ప్రేమ తీగలలో చిక్కుకున్నది నా హృదయం కూడా..." అంటూ గీతం ఆలపించసాగాడు... రాధ కృష్ణుని మొహంలోకి చూస్తూ మైమరచిపోయింది....
"రాధ అనే నామములో ప్రేమ ఉన్నది,
కృష్ణ అనే శబ్దములో ప్రాణమున్నది.
రాధ లేక శ్యాముడు అసంపూర్ణమే,
కృష్ణ లేక రాధ ప్రేమ నిర్జీవమే."
రాధే... రాధే...
– శంకరకింకరః