జై రాధే! జై శ్యామ్!
బృందావనం...
అది కేవలం ఒక ధామం కాదు...
కృష్ణప్రేమకు రూపం వచ్చిన దివ్యలోకం.
అక్కడ గాలి ప్రతి తరంగం వేణుగానాన్ని మోసుకొస్తుంది.
ప్రతి ధూళికణం కృష్ణపాదస్పర్శతో పవిత్రమైంది.
అక్కడ యమునా తరంగాలు కూడా "కృష్ణ... కృష్ణ..." అని జపిస్తాయి.
అక్కడి చెట్ల ఆకుల కదలికలు కృష్ణ నామాన్ని జపిస్తాయి.
అక్కడి ధూళి గోపికల భక్తిరాసలీలతో పవిత్రమైంది.
అటువంటి బ్రజభూమిలో ఒక అంధ భక్తుడు జీవించేవాడు. అతని పేరు "సూర్ దాస్".
ప్రపంచం అతనికి చీకటిగా కనిపించినా.
కానీ అతని హృదయంలో మాత్రం నిత్యం నందలాల వెలుగుతూనే ఉండేవాడు.
కళ్లతో చూడలేకపోయాడు...
కానీ ప్రేమతో తన కృష్ణుణ్ణి చూస్తూనే ఉండేవాడు.
ఒకసారి కొందరు గ్రామస్థులు "సూరదాసా! నీకు చూపు లేదు. ఈ అందమైన ప్రపంచం కనిపించదు. నీకు బాధగా ఉండదా?" అని అడిగారు.
సూరదాసు చిరునవ్వు నవ్వి ప్రకాశవంతమైన అతని ముఖంతో "నాకు ప్రపంచం కనిపించదు. అది నిజమే. కానీ నా కృష్ణుడు కనిపిస్తున్నాడు. కృష్ణుడు కనిపిస్తున్నప్పుడు ఇంకేమి కావాలి?" అన్నాడు.
అది విన్నవారు మౌనాన్నాశ్రయించారు, ఎందుకంటే...
వారికి ప్రపంచం కనిపిస్తోంది.
కానీ కృష్ణుడు కనిపించడం లేదు.
సూరదాసుకు ప్రపంచం కనిపించడం లేదు.
కానీ కృష్ణుడు కనిపిస్తున్నాడు.
---
ఒక సాయంత్రం...
యమునా నది నిశ్శబ్దంగా ప్రవహిస్తోంది.
పక్షులు గూటికి చేరుతున్నాయి.
ఆకాశం ఎరుపు పసుపు కాషాయ వర్ణంతో మెరిసిపోతోంది.
సూరదాసు యమునా తీరాన కూర్చున్నాడు.
అతని కళ్ల నుండి కన్నీళ్లు కారుతున్నాయి.
హృదయం మొత్తం కృష్ణవిరహంతో నిండిపోయింది.
అతను మెల్లగా ఆలపించడం ప్రారంభించాడు—
"అంఖియన్ హరి దర్శన్ కీ ప్యాసీ!
దేఖ్యో చాహత్ కమల నయన్ కో,
నిసదిన్ రహత్ ఉదాసీ!!
తెలుగు భావం "నా కళ్ళు హరి దర్శనం కోసం దాహంతో ఉన్నాయి. ఆ కమలనయనుడిని చూడాలని రేయింబవళ్లు తపిస్తున్నాయి."
పాట పాడుతుండగా... సూరదాసు గొంతు గద్గదమైంది.
కన్నీళ్లు మరింత ఉబికాయి.
"కృష్ణా!అందరికీ నువ్వు కనిపిస్తున్నావు.
నాకు మాత్రం ఎప్పుడు దర్శనమిస్తావు?"
అని బాధపడ్డాడు.
మళ్ళీ తమాయించుకొని బాల కృష్ణుని లీలలు పాడసాగాడు
"మయ్యా! మోరీ మై నహీ మాఖన్ ఖాయో!
ఖ్యాల్ పరే యే సఖా సభై మిలి,
మేరే ముఖ లపటాయో!!"
తెలుగు భావం: "అమ్మా! నేను వెన్న తినలేదు. ఈ స్నేహితులందరూ కలిసి నన్ను నిందిస్తున్నారు."
అని పాడుతుండగా సూరదాసుని హృదయంలో బాలకృష్ణుని ముద్దు రూపం నర్తించింది.
---
రాత్రి క్రమంగా ముసురుకుంది.
సూరదాసు తన ఇంటికి బయలుదేరాడు.
ఆ రోజు మార్గం నిర్మానుష్యంగా ఉంది.
ఎవరూ లేరు.
అతనికి తెలియకుండా దారి పక్కనే ఒక లోతైన గుంత ఉంది.
మరో రెండు అడుగులు వేస్తే...
సూరదాసు గుంతలో పడిపోవడం ఖాయం.
అప్పుడే... వెనుకనుండి ఒక మధురమైన స్వరం ఒక పిల్లవాడిది వినిపించింది.
"బాబా! ఆగు..." సూరదాసు ఒక్కసారిగా ఆగిపోయాడు.
ఆ స్వరం...
ఎంత మధురంగా ఉందో!
అది వినగానే అతని హృదయం ఎందుకో పులకించింది.
బాలుడు దగ్గరకు వచ్చి "బాబా! దారి చీకటిగా ఉంది. నేను నీ చేయి పట్టుకొని తీసుకెళ్తాను." అన్నాడు
సూరదాసు తన చేయి చాచాడు. బాలుడు పట్టుకున్నాడు.
ఆ స్పర్శ
ఆ క్షణం...
సూరదాసు శరీరమంతా ఒక విచిత్రమైన ఆనందం వెల్లువై ప్రవహించింది.
అది మానవ స్పర్శ కాదు.
అది ప్రేమ.
అది కరుణ-దయ.
అదొక దివ్యానుభూతి.
వాళ్లు నడుస్తున్నారు.
మార్గమంతా బాలుడు మధురంగా మాట్లాడుతున్నాడు.
కొన్నిసార్లు నవ్వుతున్నాడు.
ఆ మాటలు,
ఆ నవ్వు వింటుంటే...
వేణుగానం వినిపిస్తున్నట్లు ఉంది.
సూరదాసు హృదయం వేగంగా కొట్టుకుంటోంది. అతని అంతరంగం మెల్లగా "సూరదాసా... ఈ బాలుడు సాధారణ బాలుడు కాదు..." చెప్పసాగింది
కొద్దిసేపటికి వారు సూరదాసు కుటీరం ముందు చేరుకున్నారు. బాలుడు మృదువుగా "బాబా! నీ ఇల్లు వచ్చేసింది. ఇక నేను వెళ్తాను." అన్నాడు.
ఆ మాట విన్న సూరదాసు గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లైంది. ఎందుకో తెలియదు... ఈ బాలుణ్ణి వదలాలని అతని మనసు ఒప్పుకోలేదు.
వెంటనే బాలుడి చేతిని గట్టిగా పట్టుకున్నాడు.
కన్నీళ్లు ధారగా కారుతున్నాయి.
సూరదాసు వణుకుతున్న స్వరంతో
"లేదు... నువ్వెవరో నాకు తెలుసు...
ఈ స్పర్శ...
ఈ మాధుర్యం...
ఈ నవ్వు...
ఇవన్నీ నాకు తెలిసినవే..." అంటూ కళ్ళనీరు కారుతుండగా
"కృష్ణా! నువ్వే కదా!
ఎన్నాళ్లుగానో నిన్ను పిలుస్తున్నాను.
నువ్వే వచ్చావు కదా!" అని అన్నాడు
ఆ బాలుడు చిరునవ్వు నవ్వాడు.
ఆ నవ్వులో బ్రజభూమి అంతా వికసించింది.
ఆ నవ్వులో వేణుగానం వినిపించింది.
మెల్లగా "సూరదాసా! నువ్వు నా చేయి పట్టుకున్నావు. కానీ ఎంతో కాలంగా నేను నీ హృదయాన్నే పట్టుకొని ఉన్నాను." అన్నాడు బాల కృష్ణుడు.
ఆ మాటలు విన్న సూరదాసు ఆనందంతో పులకించిపోయాడు
అంతలో...
మల్లెపూల పరిమళం వ్యాపించింది.
దూరంగా వేణుగానం వినిపించింది.
సూరదాసు చేతిలో ఉన్న చేయి మెల్లగా జారిపోయింది.
"కృష్ణా!" అని గట్టిగా పిలిచాడు.
కానీ... బాలుడు దగ్గరలేడు.
సూరదాసు నేలపై మోకాళ్లపై కూర్చున్నాడు.
చేతులు ఆకాశం వైపు చాచాడు.
కన్నీళ్లు ధారగా కారుతున్నాయి.
బాలుడు కనుమరుగైన వెంటనే సూరదాసు నేలపై కూర్చొని విలపించాడు
"చరణ కమల బందౌ హరి రాయ్!
జాకీ కృపా పంగు గిరి లంఘై,
అంధే కో సబ్ కుచ్ దర్శాయ్!!
తెలుగు భావం: హరి పాదకమలాలకు నమస్సులు. ఆయన కృప ఉంటే కుంటివాడు కొండలను దాటగలడు. అంధుడికైనా సర్వ జగత్తును దర్శింపజేయగలడు."
సూరదాసు ఆకాశం వైపు చేతులు చాచి ఏడుస్తూ
"అంఖియన్ హరి దర్శన్ కీ ప్యాసీ!
దేఖ్యో చాహత్ కమల నయన్ కో,
నిసదిన్ రహత్ ఉదాసీ!!"
తెలుగు భావం "నా కళ్ళు హరి దర్శనం కోసం దాహంతో ఉన్నాయి. ఆ కమలనయనుడిని చూడాలని రేయింబవళ్లు తపిస్తున్నాయి."
అప్పుడు అతని హృదయంలో ఒక స్వరం వినిపించింది—
"సూరదాసా! కళ్ళతో నన్ను చూడలేకపోయావు.
కానీ ప్రేమతో నన్ను పొందావు.
అందుకే నేను నీ దగ్గరకు వచ్చాను."
సూరదాసు ముఖంపై దివ్యమైన చిరునవ్వు విరిసింది.
ఎందుకంటే... ఆ రోజు అతనికి కృష్ణుని రూపదర్శనం లభించలేదు.
కానీ...
కృష్ణుని చేయి లభించింది.
కృష్ణుని స్పర్శ లభించింది.
కృష్ణుని ప్రేమ లభించింది.
---
జై రాధే! జై శ్యామ్!
జై శ్రీకృష్ణ!
సూరదాస్ మహరాజ్ కీ జై!
No comments:
Post a Comment