Pages

Saturday, June 26, 2021

అహంకారం వల్ల తనకే నష్టం అని తెలిసినా ...

అహంకారం వల్ల తనకే నష్టం అని తెలిసినా దాన్ని వదులుకోరు, పైగా తనకే నష్టం జరిగినా, జరుగుతున్నాఇంకా ఇంకా అహంకారం పెరిగి విర్రవీగినాకేంటీ నష్టం అని బీరాలు పోతారు...

//అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయమృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః//

మొగుణ్ణి! నాకే మాడిన దోశ పెడతావా అని 3 రోజులు ఆలిమీద అహంకారంతో అలిగితే, నష్టం నీకే! మూడురోజులు అన్యోన్యంగా సుఖంగా ఉండే సమయం పోయింది.. పది నిమిషాల్లో ఇంకో మంచి దోశ వేసివ్వవోయ్ అంటే పోయేదానికి మూడ్రోజులు నష్టపోయింది నువ్వే..

అత్తగారినని తెలీదా?!, మీ పుట్టింటాళ్ళు నాముందే బంగారు జరీ కంచిపట్టు కట్టుకుని తైతక్కలాడతారా? ఏఁ వాళ్లకెక్కువుంది నాకులేదని లోకువా?!.. చచ్చినా వాళ్ళింటికి రాను, వాళ్ల మొహం చూడను!... అనే అహంకారం వల్ల కోల్పోయింది నువ్వే, గయ్యాళి అనే అవమానపు పేరు సంపాదించుకున్నది నువ్వే.. వియ్యాలవారంటే దేవుడు కలిపిన అన్నదమ్ములు, వదినామరదళ్ళు!.. చాలా బాగుందమ్మా ఈ చీర నీకు, కలకాలం ఇలాంటివి కట్టుకుంటూ ఆనందంగా ఉండమ్మా అని ఆశీర్వదిస్తే నీకెంత గౌరవం!

ఠాట్! ఇంత చదువుకుని సంపాదిస్తున్న కోడలిని, అత్తామావలకి కాఫీలూ, టీలూ ఇవ్వడానికి ఇంట్లో పనిమనిషినా? వంటమనిషినా? అని అహంకారంతో ఉంటే నువ్వు కోల్పోయేది నీ జీవితమే.. నీ కుటుంబమే..

ఇంత పెద్దవాణ్ణయ్యా 6 పుష్కరాలు చూసా నామాట వినరా ఏవనుకుంటున్నారు అని అహంకారంతో ఆవేశపడితే ఆ చూడవలసిన ఒకటో రెండో పుష్కరాలు చూడకుండా ఆ పుష్కరాల్లో నీకే కర్మ చేయవలసి రావచ్చు..

నేను ఇన్ని గుళ్ళుకట్టా, నేను ఇంత సమాజ సేవ చేసా, నా అంత సెలెబ్రిటీని నేను, బైటికెళితే అడుగులకు మడుగులొత్తుతారు నాకు.. పీఠాధిపతులు, మంత్రులకు, స్టార్లకు సేవ చేసినట్లు చేస్తారు నాకు... నేను చెప్పినట్లు వినవా ఎంత అహంకారం నీకు... ముందు ఆ నేను, నేను, నేను అని గుండెలు బాదుకునే అహంకారం పక్కనపెట్టు! ఈ నేను-నేను అని గుండెలు బాదుకోడంలోనే నీ సేవ, నీ జ్ఞానం, నీ ఇమేజ్ కరిగిపోతోంది.. కరిగిపోవాల్సింది నేను అనే నీ అహంకారం కదా.. అనవసరంగా జన్మ వృధా ఐపోతోంది కదా..

ఎవడికి పనికొచ్చే అహంకారమిది!? మనవారి దగ్గర ఒకమెట్టు కాకపోతే పది మెట్లు తగ్గి జీవితాన్ని ఆనందమయం చేసుకోలేమా.. అహంకారం వదిలి ఆత్మగౌరవం, కుటుంబ గౌరవం, మానవ జీవన సంబంధాలు, సాటి మనుష్యుల పట్ల సౌహార్థ్ర భావన ఉన్నతంగా ఉంచుకునేలా ప్రయత్నించలేమా..?!?!?!...



-శంకరకింకర

 

Wednesday, June 9, 2021

గురురిత్యభి ధీయతే

 శ్లో౹౹ 

*శాంతో దాంతః కులీనశ్చ వినీతః శుద్ధవేషవాన్*౹

*శుద్ధాచార సుప్రతిష్టః శుచిర్దక్షః సుబుద్ధిమాన్*౹౹

*ఆధ్యాత్మ జ్ఞాననిష్ఠశ్చ మంత్రతంత్ర విశారదః*౹

*నిగ్రహానుగ్రహేశక్తో గురురిత్యభి ధీయతే*౹౹


అనగా శాంతుడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, కులీనుడు, వినయవంతుడు, పరిశుద్ధుడు, ఆచార వంతుడు, మంచి వేషధారణగలవాడు, గౌరవనీయుడు, పవిత్రుడు, బుద్ధిమంతుడు, మంత్ర తంత్రములలో నిష్ణాతుడు, నిగ్రహానుగ్రహశక్తుడు అయినవాడు గురువు అనిపించుకుంటాడు.


-muddu pranava sharma గారి సేకరణ