Pages

Monday, June 15, 2026

బృందావన కథలు – 29 (రస్‍ ఖాన్ - కృష్ణుడి కోసం చెప్పులు)

జై శ్రీ రాధే! జై శ్రీకృష్ణ!

బృందావన భక్తుల చరిత్రలో ఒక పేరు ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది.
అతను గోపిక కాదు...
వ్రజవాసి కాదు...
హిందువుగా కూడా పుట్టలేదు...
అయినా శ్రీకృష్ణుని ప్రేమలో అంతగా మునిగిపోయాడు,
నేటికీ అతని పదాలు బృందావన వీధుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి.
ఆ మహాభక్తుడే "రస్ఖాన్".
16వ శతాబ్దంలో ఢిల్లీలో సయ్యద్ ఇబ్రాహీం అనే సంపన్న ముస్లిం యువకుడు జీవించేవాడు.
అరబీ, ఫార్సీ భాషల్లో గొప్ప పండితుడు.
సంపద ఉంది...
గౌరవం ఉంది...
విద్య ఉంది...
కానీ మనసుకు శాంతి లేదు.
ఏదో తెలియని వెలితి అతన్ని ఎప్పుడూ వెంటాడేది.
ఒక రోజు అతను ఎప్పటిలాగే ఒక పాన్ దుకాణానికి వెళ్లాడు. అక్కడ గోడపై వేలాడుతున్న ఒక చిన్న బాలుడి చిత్రం అతని దృష్టిని ఆకర్షించింది.
నీలమేఘ శ్యామవర్ణం...
గిరజాల జుట్టు...
చేతిలో మురళి...
ముఖంలో అమాయకమైన చిరునవ్వు...
ఆ రూపాన్ని చూసిన క్షణం నుంచి అతని చూపు మరలలేదు.
“భాయ్! ఈ బాలుడు ఎవరు?” అని అడిగాడు.
“ఇతడు శ్యామ్... బృందావన కృష్ణుడు.” అని దుకాణదారుడు చెప్పాడు.
చిత్రాన్ని మరింత జాగ్రత్తగా చూసిన రస్ ఖాన్ అకస్మాత్తుగా “ఈ బాలుడు ఎంత అందంగా ఉన్నాడు! కానీ ఇతను నిలబడి ఉన్న నేల ఎంత గరుకుగా ఉంది! ఇలా ఉంటే ఇతని పాదాలకు ముళ్లు గుచ్చుకోవా? ఇతనికి చెప్పులు ఎందుకు వేయరు?” అని అన్నాడు.
దుకాణదారుడు నవ్వి, “నీకు అంత ప్రేమ ఉంటే నువ్వే కొనిపెట్టు!” అన్నాడు.
ఆ మాట రస్ ఖాన్ హృదయంలో బలంగా నాటుకుంది.
ఒక రోజు అతని జీవితాన్ని మార్చేసిన సంఘటన జరిగింది.
కొంతమంది వైష్ణవ భక్తులు శ్రీకృష్ణుని లీలలు గానం చేస్తున్నారు.
వారు రాధాకృష్ణుల ప్రేమను, గోపికల భక్తిని, యశోదమ్మ వాత్సల్యాన్ని ఎంతో భావపూర్వకంగా వివరిస్తున్నారు.
రస్ ఖాన్ ఆ గానం వింటూ మైమరచిపోయాడు. ఆ పిల్లవాడెవరో చెప్పులు లేకుండా మట్టినేలపై నిల్చున్న చిత్రం గుర్తొచ్చింది.
మరుసటి రోజు చిన్న అందమైన చెప్పుల జత కొనుక్కొని వచ్చాడు. “ఇదిగో! నా శ్యామ్‌కు చెప్పులు తెచ్చాను.” అని పాన్ దుకాణదారుడితో అన్నాడు.
దుకాణదారుడు నవ్వుతూ “అతడు ఇక్కడ లేడు. బృందావనంలోని బాంకే బిహారి మందిరంలో ఉంటాడు.” అని చెప్పాడు.
ఆ మాట విన్న క్షణమే రస్ ఖాన్ జీవిత దిశ మారిపోయింది.
అతని హృదయంలో ఒకే కోరిక మిగిలింది. “నా శ్యామ్‌ను ఒక్కసారి చూడాలి!” అన్నీ వదిలేసి బృందావనానికి బయలుదేరాడు.
కొద్ది రోజుల్లో కావలసిన ఏర్పాట్లు చేసుకొని ప్రయాణం తరువాత యమునాతీరంలోని పవిత్ర బృందావన ధామానికి చేరుకున్నాడు.
మొదటిసారి బృందావన ధూళిని తాకిన క్షణం...
అతని కళ్లలో నీళ్లు నిండిపోయాయి.
“ఈ నేల మీదే నా కృష్ణుడు నడిచాడా?
ఈ యమునలోనే ఆడుకున్నాడా?
ఈ గోవర్ధన గిరినే ఎత్తాడా?”
అని భావిస్తూ భూమిపై ఆ భూమిపై సాష్టాంగపడ్డాడు.
తర్వాత బాంకే బిహారి మందిరానికి చేరుకున్నాడు. కానీ ఆలయ ద్వారం వద్ద అతన్ని ఆపేశారు.
“నీవు ముస్లింవి. లోపలికి రావడం కుదరదు.” అన్నారు.
రస్ ఖాన్ నిరాశ చెందలేదు. “నా శ్యామ్ నన్ను తప్పక కలుస్తాడు.” అని ఆలయ ద్వారం వద్దే కూర్చున్నాడు.
ఒక రోజు గడిచింది.
ఒక రాత్రి గడిచింది.
ఆకలి...
దాహం...
అలసట...
అన్నింటినీ మరిచి
“శ్యామ్... శ్యామ్...”
అంటూ వేచిచూశాడు.
తెల్లవారుజామున అకస్మాత్తుగా గజ్జెల శబ్దం వినిపించింది. అతను కళ్లు తెరిచాడు. చుట్టూ ఎవరూ కనిపించలేదు.
మళ్లీ గజ్జెల శబ్దం...
ఈసారి కొద్దిగా వంగి కిందకి చూశాడు.
అక్కడ ఒక బాలుడు నిలబడి ఉన్నాడు.
చేతిలో మురళి...
ముఖంలో చిరునవ్వు...
నీలమేఘ శ్యామవర్ణం...
గిరజాల జుట్టు...
జుట్టులో పించం...
సాక్షాత్తు కృష్ణుడే!
రస్ ఖాన్ ఆనందంతో ఉప్పొంగిపోయాడు.
కానీ వెంటనే అతని హృదయం బాధతో నిండిపోయింది.
ఎందుకంటే కృష్ణుని పాదాల నుంచి రక్తం కారుతోంది.
“బాబూ! నీ పాదాలకు ఏమైంది? నువ్వు ఆలయంలోంచే వస్తున్నావు కదా! అక్కడ గుచ్చుకోడానికి ఏమీలేవు కదా! ఎలా తగిలిందీ దెబ్బ” అని కన్నీళ్లు తుడుచుకుంటూ అడిగాడు.
కృష్ణుడు నవ్వుతూ “నేను ఆలయం నుంచి రాలేదు. గోకులం నుంచి నడుచుకుంటూ వచ్చాను. నువ్వు నా రూపాన్ని నీ హృదయంలో ప్రతిష్ఠించుకున్నావు. నీ ప్రేమ నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. అందుకే నీ దగ్గరకు కాలినడకన వచ్చాను. మార్గంలో ముళ్లు గుచ్చుకున్నాయి.” అని అన్నాడు.
ఆ మాటలు విన్న రస్ ఖాన్ శరీరం అంతా వణికిపోయింది.
తాను చిత్రంలో చూసిన బాలుడు...
తాను వెతికిన శ్యామ్...
సాక్షాత్తు పరమాత్ముడేనని గ్రహించాడు...
కాళ్ళకి రక్తం తుడిచాడు...
పక్కనున్న ఆకులతో ఏదో పసరు పూసాడు..
ఆయన పాదాలకు చెప్పులు తొడిగిస్తూ ఏడ్చేశాడు.
“ప్రభూ!
ఇక నుంచి నేను నీ వాడిని.
నీ ప్రేమనే పాడుతాను.
నీ మహిమనే వర్ణిస్తాను.”అని ప్రార్థించాడు.
కృష్ణుడు చిరునవ్వుతో అతన్ని ఆశీర్వదించాడు.
ఆ రోజు నుంచి రస్ ఖాన్ జీవితం పూర్తిగా మారిపోయింది.
యమునా తీరం...
గోవర్ధన గిరి...
నందగావ్...
బర్సానా...
అన్నీ అతని నివాసాలయ్యాయి.
రోజంతా కృష్ణనామం...
రాత్రంతా కృష్ణధ్యానం...
ఒకసారి గోవర్ధనగిరి వద్ద ఆవులు మేతకు వెళ్తుండగా చూసి అతని హృదయం మైమరచిపోయింది.
అప్పుడు అతని నోట అమరమైన పదాలు వెలువడ్డాయి:
"మానుష హౌం తో వహీ రస్ ఖాన్,
బసౌం బ్రజ్ గోకుల్ గావ్ కే గ్వారన్..."
“మళ్ళీ జన్మ వస్తే బ్రజ్‌లో గోపకుడిగా పుట్టాలి.
పక్షిగా పుడితే గోవర్ధనపై నివసించాలి.
జంతువుగా పుడితే కృష్ణుడు మేపిన ఆవులలో ఒకటిగా ఉండాలి.” అని పాడాడు.
మోక్షం కోరలేదు.
స్వర్గం కోరలేదు.
కృష్ణుని సమీపం మాత్రమే కోరుకున్నాడు.
అందుకే నేటికీ రస్ ఖాన్ పేరు బృందావనంలోని కృష్ణ భక్తుల చరిత్రలో నిలిచిపోయింది.
చివరివరకు బృందావనంలోనే అతని జీవితం గడిచింది.
అక్కడే కృష్ణనామం జపిస్తూ పరమపదించాడు.
నేటికీ గోవర్ధన సమీపంలో రస్ ఖాన్ సమాధి ఉంది.
కృష్ణుడి ప్రేమకు మతాలు, కులాలు, భాషలు అడ్డుకావని సాక్ష్యంగా అది నిలిచి ఉంది.
ప్రేమే భక్తికి మూలం.
ప్రేమే కృష్ణుడికి మార్గం.
శ్రీ రాధే! రాధే!
శ్రీ గోవింద! గోవింద!
భక్తశిరోమణి రస్ ఖాన్ కి జై!
-శంకరకింకరః


No comments:

Post a Comment