Pages

Wednesday, June 10, 2026

బృందావన కథలు - 26 (కుంభనదాసు)

కుంభనదాసు – శ్రీనాథుడి కోసం చక్రవర్తి ఇచ్చే కానుకలనే తృణప్రాయంగా చూసిన భక్తుడు

జై శ్రీకృష్ణ! జై శ్రీనాథజీ!
బ్రజభూమి...
అది కేవలం ఒక ప్రదేశం కాదు.
అది కృష్ణప్రేమకు రూపం వచ్చిన పుణ్యధామం.
అక్కడి ప్రతి ధూళికణం "రాధే... రాధే..." అని జపిస్తుంది.
ప్రతి చెట్టు "కృష్ణలీల"లను గుసగుసలాడుతుంది.
ప్రతి గాలి యమునాతీరపు మాధుర్యాన్ని మోసుకొస్తుంది.
అటువంటి బ్రజభూమిలో, గోవర్ధనగిరికి సమీపంలో ఉన్న జమునావతీ గ్రామంలో కుంభన్దాస్ అనే ఒక నిరుపేద రైతు నివసించేవాడు. అతను చూడడానికి సాధారణ మనిషి.
కానీ అతని హృదయంలో మాత్రం స్వయంగా కృష్ణుడు నివసించేవాడు.
అంత కృష్ణ భక్తి అతనికి.
అతనికి పాండిత్యం లేదు.
శాస్త్రజ్ఞానం లేదు.
తర్కాలు తెలియవు.
కానీ ఒకటి మాత్రం రూఢిగా తెలుసు
"నా శ్రీనాథుడే నా ప్రాణం!" అని...
ప్రతిరోజూ తెల్లవారక ముందే లేచేవాడు. ఆకాశంలో నక్షత్రాలు ఇంకా మెరవుతుండగానే బయలుదేరేవాడు.
పాదరక్షలు లేవు.
కాళ్లకు ముళ్లు గుచ్చుకునేవి.
ఎండ మండేది.
వాన తడిపేది.
కానీ అతని అడుగులు మాత్రం ఆగేవి కావు.
ఎందుకంటే అతని గమ్యం శ్రీనాథ్ జీ ఆలయం.
గోవర్ధననాథుని దర్శనం.
దేవాలయానికి చేరగానే...
శ్రీనాథుడిని చూడగానే...
అతని కళ్లలో నీళ్లు నిండిపోయేవి.
"స్వామీ! నిన్ను చూడకపోతే నేను బ్రతకలేను." అని మనసులోనే చెప్పుకునేవాడు. అప్పుడు శ్రీనాథుడు కూడా తన భక్తుడిని చూసి చిరునవ్వు నవ్వినట్టుగా తోచేదని అక్కడ ఉన్న భక్తులు చెబుతారు.
కుంభనదాసు చాలా పేదవాడు. కొన్నిసార్లు ఇంట్లో పిల్లలకు తినడానికి అన్నం కూడా ఉండేది కాదు. ఉన్న చిన్న భూమిలో ఎంత పండితే అదే వాళ్లకి మళ్లీ పంటవరకూ వాడుకునేవారు. భార్య ఎప్పుడూ ఆందోళన చెందేది. ఇరుగుపొరుగు వారు జాలి పడేవారు. కానీ కుంభనదాసు మాత్రం ఎప్పుడూ భగవంతుని వద్ద ధనం అడగలేదు.
"స్వామీ...
నువ్వు నాతో ఉంటే చాలు.
నీ దర్శనం దొరికితే చాలు.
నీ నామం నా నాలుకపై ఉంటే చాలు." అనేవాడు.
ఎందుకంటే అతనికి "కృష్ణుడు, ప్రపంచంలోని అన్ని సంపదలకంటే మించిన సంపద."
ఒక రోజు అతను ఆలయంలో పాడిన కీర్తన విని భక్తులు పరవశించారు. ఆ గానం గ్రామాలను దాటి పట్టణాలకు చేరింది.
చివరకు అది మొఘల్ చక్రవర్తి అక్బర్ చెవుల వరకు చేరింది. ఆ పాటల్లో ఏదో దివ్యమైన మాధుర్యం ఉంది. అక్బర్ ఆశ్చర్యపోయాడు. "ఇంత ప్రేమతో భగవంతుని పాడే వ్యక్తి ఎవరు?" అని అడిగాడు, వివరం తెలుసుకుని వెంటనే రాజదూతలను పంపించాడు.
రాజదూతలు వచ్చి "చక్రవర్తి మిమ్మల్ని పిలుస్తున్నారు." అన్నారు.
కుంభనదాసు హృదయం కలవరపడింది. ఎందుకంటే అతనికి రాజసభ అంటే ఇష్టం కాదు. అక్కడికి వెళ్తే ఒక రోజు శ్రీనాథుడి దర్శనం కోల్పోతాడు. ఒక రోజు సేవ ఆగిపోతుంది. అదే అతనికి భరించలేని బాధ. అయినా రాజాజ్ఞ కాబట్టి వెళ్లాడు.
రాజసభలో అక్బర్ అతన్ని ఎంతో గౌరవంగా ఆహ్వానించాడు. అతని గానం వినాలని కోరాడు. కుంభనదాసు పాడడం ప్రారంభించాడు. ఆ పాటలో స్వరాలు లేవు... అది హృదయం కరిగి ప్రవహించిన ప్రేమ. అది వినగానే సభ నిశ్శబ్దమైంది.
అక్బర్ కళ్లలో కూడా నీళ్లు మెరిశాయి. పాట పూర్తయ్యాక అక్బర్ "స్వామీ! మీకు కావలసినది అడగండి. బంగారం, భూములు, గ్రామాలు, ధనం... ఏంకావాలో అడగండి" అన్నాడు
కుంభనదాసు చిరునవ్వు నవ్వాడు.
ఆ నవ్వులో వైరాగ్యం ఉంది.
ఆ నవ్వులో కృష్ణప్రేమ ఉంది.
"మహారాజా...! నాకు కావలసింది మీ దగ్గర లేదు." అన్నాడు.
అక్బర్ ఆశ్చర్యపోయి "నా దగ్గర లేనిది ఏముంది?" అని అడిగాడు.
అప్పుడు కుంభనదాసు కళ్లలో నీళ్లు తిరిగాయి. గోవర్ధనగిరి వైపు చూసినట్లు దూరంగా చూస్తూ అన్నాడు:
"నాకు నా శ్రీనాథుడి దర్శనం కావాలి.
మీరు రాజ్యాలు ఇవ్వగలరు.
బంగారం ఇవ్వగలరు.
కానీ ఒక క్షణం శ్రీనాథుడి చిరునవ్వును ఇవ్వగలరా?
ఆయన పాదసేవను ఇవ్వగలరా?
ఆయన ప్రేమను ఇవ్వగలరా?"
సభ మొత్తం నిశ్శబ్దమైంది.
అప్పుడు అతని నోట హృదయాన్ని కదిలించే ఈ పదం వెలువడింది:
"భక్తన కో కహా సీకరీ సో కామ్?
ఆవత్ జాత్ పనహియా టూటీ,
బిసరి గయో హరినామ్..."
తెలుగులో అర్థం "భక్తుడికి ఫతేపూర్ సీక్రీతో ఏమి పని? ఇక్కడికి రావడం పోవడంలో చెప్పులు చిరిగిపోయాయి. ఆ ప్రయాణంలో హరినామ స్మరణ కూడా తగ్గిపోయింది. నాకు ఈ రాజసభ వల్ల ఏమి ప్రయోజనం?" ఆ పదాలు విని అక్బర్ తల వంచాడు. ఎందుకంటే అతను మొదటిసారి రాజ్యానికి మించిన సంపదను చూశాడు.
అది "భగవద్భక్తి".
కుంభనదాసు రాజు ఇచ్చిన బహుమతులన్నింటినీ తిరస్కరించాడు. తిరిగి బ్రజభూమికి బయలుదేరాడు. దూరంలో గోవర్ధనగిరి కనిపించగానే... అతని కళ్లలో ఆనందబాష్పాలు పొంగాయి.
"స్వామీ! ఎట్టకేలకు వచ్చేశాను!"
అని పరుగెత్తుకుంటూ ఆలయానికి చేరాడు.
ఆ రోజు శ్రీనాథుడి దర్శనం చేసుకుంటూ చిన్న పిల్లాడిలా ఏడ్చాడట.
ఎన్నో రోజుల తర్వాత తల్లిని చూసిన బిడ్డలా...
ఎన్నో జన్మల తర్వాత భగవంతుడిని పొందిన జీవిలా...
అతను ఏడ్చాడు.
అప్పుడు శ్రీనాథుడు తన భక్తుడిని చూసి మనసులో ఇలా అన్నాడట—
"కుంభనదాసా! నువ్వు రాజ్యాన్ని వదిలి నా దగ్గరకు వచ్చావు. కానీ నీ ప్రేమకు నేను నా హృదయాన్నే ఇచ్చేశాను."
---
భగవంతుడు ధనం చూసి ప్రసన్నుడు కాడు. పాండిత్యం చూసి కూడా కాదు.
"అవ్యాజమైన ప్రేమను, భక్తిని చూసి పరవశిస్తాడు."
రాజులు లక్షల మందిని పాలించగలరు.
కానీ ఒక నిజమైన భక్తుడు మాత్రం భగవంతుని హృదయాన్నే పాలిస్తాడు.
అందుకే కుంభనదాసు జీవితం మనకు చెబుతున్నదేమంటే...
"కృష్ణుడిని పొందినవాడికి ప్రపంచం చిన్నది.
కృష్ణుడిని కోల్పోయినవాడివెనక ప్రపంచమంతా ఉన్నా మిగిలేది శూన్యమే."
జై శ్రీనాథ్జీ!
జై జై శ్రీరాధే!
జై శ్రీకృష్ణ!
-శంకరకింకరః

No comments:

Post a Comment