Pages

Friday, June 19, 2026

బృందావన కథలు – 30 ( రాధారాణి - యమున)

జై రాధే! జై శ్యామ్!

బృందావనం…
అది కేవలం ఒక ధామం కాదు…
ప్రేమను నిత్యం శ్వాసించే మరో దివ్య లోకం.
అక్కడ ప్రతి గాలి రాధానామమే జపిస్తుంది…
ప్రతి పువ్వు కృష్ణస్మరణతో వికసిస్తుంది…
యమునమ్మ అలలు కూడా “రాధే… శ్యామ్…” అనే రాగంతోనే ప్రవహిస్తుంటాయి.
ఆ రోజు ఉదయం…
ఆకాశం ముదురు నీలిరంగు మబ్బులతో అలంకరించుకుంది.
సూర్యుడు ఇంకా పూర్తిగా మేల్కోలేదు.
యమునమ్మ తీరం వెండి పొగమంచుతో కప్పబడి ఉంది.
తామరపూలపై మంచుబిందువులు వజ్రాల్లా మెరిసిపోతున్నాయి.
కానీ ఆ ఉదయం
యమునమ్మ ప్రవాహం చాలా వేగంగా ఉంది.
అలలు ఉప్పొంగుతూ తీరాన్ని గట్టిగా తాకుతున్నాయి.
జలకాలాడడానికి, నీరు తీస్కెళ్ళడానికి వచ్చిన గోపికలందరూ అది చూసి ఆశ్చర్యపోయారు. “ఈరోజు యమునమ్మ ఎందుకింత ఆత్రుతగా ప్రవహిస్తోంది?” అని గోపికలందరి మనసులో ప్రశ్న...
అప్పుడే దూరాన్నుంచి ఒక మంత్రముగ్ధుల్ని చేసే ఒక మధురమైన స్వరం వినిపించింది “రాధే… రాధే…”
ఆ స్వరం గాలిలో తేలింది.
కదంబవృక్షాలపై ఆకులపై జారింది.
యమునమ్మ అలలను తాకింది.
ఆహాఁ!
ఆ క్షణంలో ఒక అద్భుతం జరిగింది.
ఇప్పటివరకు ఉప్పొంగుతూ ప్రవహించిన యమునమ్మ
ఒక్కసారిగా నెమ్మదించింది.
ఉధృతంగా తీరాన్ని తాకే అలలు మందగించాయి.
అలలు మృదువుగా మారిపోయాయి.
సెలయేటి సున్నితమైన గలగలలైపోయాయి
ప్రవాహం ప్రశాంతమైంది.
యమునమ్మ ఒడిలో వెన్నెల జారినట్టుగా
సూర్యుని బింబాలతో నీరు నిశ్శబ్దంగా మెరిసింది.
అప్పుడే మళ్ళీ అక్కడనుంచే మురళీనాదం వినిపించింది.
గోపికలందరూ వెంటనే అర్థం చేసుకున్నారు కృష్ణుడు వచ్చాడని.
యమునా తీరం మీదుగా నీలమేఘ శ్యాముడు నడుచుకుంటూ వచ్చాడు.
తలపై నెమలిపింఛం…
చేతిలో మురళీ…
ముఖంలో చిలిపి చంద్రకాంతి…
గోపికలందరూ ఆశ్చర్యంతో ఒకరినొకరు చూశారు.
“ఇది ఏమిటి, కృష్ణుడు రాధే అని పిలవగానే యమునమ్మ ప్రవాహం మందగించింది ?” అని మెల్లగా మాట్లాడుకున్నారు.
అప్పుడే కదంబవృక్షం నీడనుంచి
రాధారాణి బయటకు వచ్చింది.
ఆమె చేతిలో చిన్న తామరపువ్వు ఉంది.
ముఖంలో వెన్నెలవంటి ప్రశాంతత.
కళ్లలో కురిసే అనంతమైన ప్రేమ.
ఆమె నడుస్తూ మెల్లగా
“శ్యామ్… శ్యామ్… కృష్ణా... కృష్ణా... కాన్హా... కాన్హా...” అని జపిస్తోంది
ఆమె చేసే నామస్మరణను గాలి కూడా ఆగి వినసాగిందా అన్నట్లు చల్ల గాలి నెమ్మదిగా వీస్తోంది.
గోపికలందరిలో ఒక గోపిక ఆశ్చర్యంగా రాధను చూస్తూ కృష్ణుణ్ణడిగింది “శ్యామా… నువ్వు ‘రాధే’ అని పలికిన వెంటనే యమునమ్మ ఎందుకు నెమ్మదించింది?”
రాధ చిరునవ్వు నవ్వింది.
ఆ ప్రశ్న విని సిగ్గుపడింది.
తన శ్యామ్ ఏమిచెప్తాడా అని కృష్ణుణ్ణి ఓరచూపు చూస్తోంది.
కానీ, కృష్ణుడు వెంటనే సమాధానం చెప్పలేదు.
రాధమ్మ యమునమ్మ దగ్గరకు వెళ్లి చేతితో నీటిని మెల్లగా తాకింది, అటూ ఇటూ నీటిని కదిపి ఆడసాగింది.
ఆశ్చర్యం! ఆ స్పర్శతో యమునమ్మ అలలు మరింత ప్రశాంతమయ్యాయి. ఒక సరస్సులోని నీటిలా స్థిరత్వాన్ని పొందుతున్నాయి.
యమునలోని అలలు చిన్న చిన్న పిల్లల్లా రాధ పాదాలను తాకేందుకు ముందుకు వచ్చాయి.
శ్యామ్ తన రాధను చూసి చిరునవ్వు నవ్వాడు.
కృష్ణుడు యమునమ్మ వైపు చూసి మెల్లగా “రాధే…ఈరోజు యమునమ్మ కూడా నీ నామంలోని మధురమైన ప్రేమరసంలో మునిగిపోయింది…” అని అన్నాడు.
రాధ సిగ్గుతో తలవంచుకుంది.
ఒక గోపిక వెంటనే “కాన్హా! నిజంగా రాధా నామం వినగానే యమునమ్మ ప్రవాహం నెమ్మదించిందా? నువ్వేమైనా మాయ చేశావా” అనడిగింది. కృష్ణుడు చిరునవ్వుతో తన చేతిలోని మురళిని తీసి కాదన్నట్లుగా అడ్డంగా తిప్పాడు.
తర్వాత మెల్లగా “యమునమ్మ కేవలం నది కాదు… అది ప్రేమకు సాక్షి… రాధాకృష్ణుల ప్రేమకు సాక్షి.” అన్నాడు.
గోపికలందరూ నిశ్శబ్దంగా వినసాగారు.
కృష్ణుడు రాధ వైపు చూస్తూ మెల్లగా “రాధా నామం అనేది కేవలం ఒక పేరు కాదు… అది ప్రేమ స్వరూపం…”
తర్వాత యమునమ్మను చూపిస్తూ “ఈ యమునా ప్రవాహం కూడా ఆ ప్రేమను వినగానే తన ఆత్రుతను మరిచిపోయింది… నిశ్శబ్దమై ప్రశాంతతను పొందింది” అని అన్నాడు.
ఆ మాటలు విన్న క్షణంలో గోపికల హృదయాలు పులకించిపోయాయి.
రాధ మెల్లగా యమునమ్మ అలలను చూస్తూ “శ్యామా…ప్రేమ నిజంగా అంత శక్తివంతమా?” అన్నది.
కృష్ణుడు చిరునవ్వుతో రాధ ఉన్న చోటుకు దగ్గరకు వచ్చాడు “రాధే… ప్రేమ అనేది ప్రవాహాన్ని కూడా ఆపగలదు… హృదయాన్ని కూడా కరిగించగలదు… దేవుడిని కూడా భక్తుడి దగ్గరకు పరుగెత్తించగలదు…” అన్నాడు.
అప్పుడే యమునమ్మ అలలు మెల్లగా రాధాకృష్ణుల పాదాలను తాకాయి.
అది కేవలంగా సాధారణ అల కాదు…
అది భక్తితో యమునా తరంగాలు చేసే నమస్కారం.
ఎందుకంటే యమునమ్మకు తెలుసు…
“రాధా నామం వినిపించే చోట
కృష్ణుడు తప్పక ఉంటాడు…”
ఆ తర్వాత
కృష్ణుడు మురళీని పెదవులకు చేర్చాడు.
ఆ రాగం యమునమ్మపై తేలింది.
అలలు తాళం వేయసాగాయి.
గాలి పరిమళించింది.
కదంబవృక్షాలు పూలు రాల్చాయి.
రాధ మెల్లగా కళ్లుమూసుకుంది.
ఆమె అధరాలపై మళ్లీ అదే నామం...“శ్యామ్…”
కృష్ణుని పెదవులపై అదే నామం... "రాధా..."
ఆ నామస్మరణ వినగానే
యమునమ్మ ప్రవాహం మరింత మృదువైంది.
రాధా నామం అనేది కేవలం శబ్దం కాదు…
ప్రేమ అంతర్వాహినిగా ప్రవహించే దివ్యమంత్రం.
“రాధా నామం వినగానే
యమునమ్మ అలలు కూడా మౌనమయ్యాయి…
ఎందుకంటే ఆ నామంలో
కృష్ణుడి హృదయం ప్రవహిస్తోంది…”
----
యమునా తట్ బైఠే హరీ, బజావత్ మధురీ బాన్స్ ।
రాధే నామ సుమిరతే, నాచే ప్రేమ్ కే హంస్ ॥
భావం: యమునా తీరంలో కృష్ణుడు తన మురళి వాయిస్తుంటే, రాధా నామస్మరణ చేసే భక్తుల హృదయాలు మరింత ఆనందంతో నర్తిస్తుంటాయి
జై శ్రీ రాధే! జై శ్రీకృష్ణ!
రాధే రాధే బోలో, శ్యామ్ మిలేంగే!
-శంకరకింకరః



No comments:

Post a Comment