జై రాధే కృష్ణ
Thursday, April 30, 2026
బృందావన కథలు - 2 (యమునా తటిలో పూలవనం - గర్భగృహంలో శునకం)
Wednesday, April 29, 2026
శ్రీకృష్ణస్తోత్రం రాధాకృతం
శ్రీకృష్ణస్తోత్రం రాధాకృతం
గోలోకనాథ గోపీశ మదీశ ప్రాణవల్లభ .
హే దీనబంధో దీనేశ సర్వేశ్వర నమోఽస్తు తే .. 1..
గోపేశ గోసమూహేశ యశోదాఽఽనందవర్ధన .
నందాత్మజ సదానంద నిత్యానంద నమోఽస్తు తే .. 2..
శతమన్యోర్భగ్నమన్యో బ్రహ్మదర్పవినాశక .
కాలీయదమన ప్రాణనాథ కృష్ణ నమోఽస్తు తే .. 3..
శివానంతేశ బ్రహ్మేశ బ్రాహ్మణేశ పరాత్పర .
బ్రహ్మస్వరూప బ్రహ్మజ్ఞ బ్రహ్మబీజ నమోఽస్తు తే .. 4..
చరాచరతరోర్బీజ గుణాతీత గుణాత్మక .
గుణబీజ గుణాధార గుణేశ్వర నమోఽస్తు తే .. 5..
అణిమాదికసిద్ధీశ సిద్ధేః సిద్ధిస్వరూపక .
తపస్తపస్వింస్తపసాం బీజరూప నమోఽస్తు తే .. 6..
యదనిర్వచనీయం చ వస్తు నిర్వచనీయకం .
తత్స్వరూప తయోర్బీజ సర్వబీజ నమోఽస్తు తే .. 7..
అహం సరస్వతీ లక్ష్మీర్దుర్గా గంగా శ్రుతిప్రసూః .
యస్య పాదార్చనాన్నిత్యం పూజ్యాస్తస్మై నమో నమః .. 8..
స్పర్శనే యస్య భృత్యానాం ధ్యానే చాపి దివానిశం .
పవిత్రాణి చ తీర్థాని తస్మై భగవతే నమః .. 9..
ఇత్యేవముక్త్వా సా దేవీ జలే సన్న్యస్య విగ్రహం .
మనఃప్రాణాంశ్చ శ్రీకృష్ణే తస్థౌ స్థాణుసమా సతీ .. 10..
రాధాకృతం హరేః స్తోత్రం త్రిసంధ్యం యః పఠేన్నరః .
హరిభక్తిం చ దాస్యం చ లభేద్రాధాగతిం ధ్రువం .. 11..
విపత్తౌ యః పఠేద్భక్త్యా సద్యః సంపత్తిమాప్నుయాత్ .
చిరకాలగతం ద్రవ్యం హృతం నష్టం చ లభ్యతే .. 12..
బంధువృద్ధిర్భవేత్తస్య ప్రసన్నం మానసం పరం .
చింతాగ్రస్తః పఠేద్భక్త్యా పరాం నిర్వృతిమాప్నుయాత్ .. 13..
పతిభేదే పుత్రభేదే మిత్రభేదే చ సంకటే .
మాసం భక్త్యా యది పఠేత్సద్యః సందర్శనం లభేత్ .. 14..
భక్త్యా కుమారీ స్తోత్రం చ శృణుయాద్వత్సరం యది .
శ్రీకృష్ణసదృశం కాంతం గుణవంతం లభేద్ధ్రువం .. 15..
ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే
గోపికావస్త్రహరణప్రస్తావోనామ సప్తవింశోఽశ్యాయే
రాధాకృతం శ్రీకృష్ణస్తోత్రం సంపూర్ణం .
Tuesday, April 28, 2026
బృందావన కథలు - 1 - మామ్మ రెండు పేడాలు
(హిందీలో విన్న కథలకు తెలుగులో అనువాదం)
జై శ్రీ రాధే గోవింద
ఒక వృద్ధ మహిళ రైలులో ప్రయాణిస్తూ నిశ్శబ్దంగా కన్నీళ్లు కారుస్తూ కూర్చుంది. ఆమె పక్కన కూర్చున్న ఒక యువకుడు ఆవిడ బాధను గమనించి, ఏమైందో తెలుసుకోవాలని వినయంగా పలకరించాడు.
ఆమె మాత్రం సమాధానం చెప్పకుండా అతని వైపు చూసి మరింతగా ఏడుస్తూనే ఉంది. యువకుడు మరోసారి, దగ్గరగా కూర్చుని, “అమ్మా, ఎందుకు ఏడుస్తున్నారు? మీ బాధకి కారణమేమిటి?” అని సానుభూతితో అడిగాడు.
అయినా ఆవిడ మాటాడలేదు. ఇంకా కన్నీళ్లు ఆపుకోలేక కొంగుతో ముఖం మూసుకుని ఏడుస్తూనే ఉంది. యువకుడు ఓర్పుగా మళ్లీ అడిగాడు:
“అమ్మా, చెప్పండి. నేను ఏమైనా సహాయం చేయగలిగితే తప్పకుండా చేస్తాను. దయచేసి ఏడవకండి.”
అప్పుడు ఆ ముదుసలి తన చేతిలో ఉన్న చిన్న సంచిని చూపిస్తూ, దాన్ని తెరవమని సైగ చేసింది. యువకుడు సంచిని తెరిచి చూడగా, అందులో సువాసన వెదజల్లుతున్న ఒక వస్త్రం, నాలుగు పేడాలు, రెండు వందల రూపాయలు, అలాగే ఒక చీటీ కనిపించాయి. అతనికి ఏమీ అర్థం కాక ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు.
ఆమె చీటీని చదవమని సూచించింది. యువకుడు చీటీని తెరిచి చూడగా, విషయం అర్థం కాక మళ్లీ ఆమె వైపు చూసాడు. అప్పుడు ఆ వృద్ధ మహిళ తన కథను చెప్పడం ప్రారంభించింది:
“నేను వృద్ధురాలిని. మా ఊరినుంచి ఒంటరిగా బాంకే బీహారి (శ్రీకృష్ణ) దర్శనం కోసం బృందావనానికి వెళ్లాను. ఆలయ మెట్లు ఎక్కి హుండీలో రెండు వందల రూపాయలు సమర్పించాను. దర్శనం పూర్తయ్యాక అక్కడి గోస్వామి (పూజారి) ప్రసాదంగా ఒక పేడా ఇచ్చారు.
నేను మరొకటి ఇవ్వమని అడిగితే, ‘అమ్మా, అలా కుదరదు. అందరికీ ఒక్కొక్కటే ఇస్తాం’ అన్నారు. దాంతో కోపంగా ‘నాకు ఇది కూడా అవసరం లేదు’ అని తిరిగి ఇచ్చేసి బయటకు వచ్చేశాను.
బయటకు వచ్చాక కోపంతోనే ‘ఇంత దూరం నుంచి వచ్చాను, రెండు పేడాలు కూడా ఇవ్వలేదు’ అని అనుకుంటూ బాధతో ఒకచోట కూర్చున్నాను.
అప్పుడే ఒక చిన్న పిల్లవాడు ఒక సంచి పట్టుకుని వచ్చి, ‘మామ్మా, ఇది కాసేపు పట్టుకోండి, నేను వెంటనే వస్తాను’ అని చెప్పి వెళ్లిపోయాడు. కానీ అతను తిరిగి రాలేదు.
చాలా సేపు ఎదురు చూసి, ఆ సంచీలో ఏముందో చూడాలని తెరిచి చూడగా—అందులో రెండు వందల రూపాయలు, నాలుగు పేడాలు, సువాసనతో నిండిన ఠాకూర్ వస్త్రం, అలాగే ఈ చీటీ కనిపించాయి…”
అంటూ ఆమె కన్నీళ్లతో ఆ చీటీని చూపించింది.
ఆ యువకుడు ఆ చీటీని చదివాడు. అందులో ఇలా వ్రాయబడి ఉంది:
“మామ్మా, నీకు ఎన్ని కావాలంటే అన్ని పేడాలు ఇస్తాను. కానీ నా మీద కోపపడకూ. మళ్లీ మళ్లీ నన్ను చూడడానికి రావాలి.”
ఆ మాటలు చదివిన వెంటనే, ఆ యువకుడికి కూడా కళ్లలో నీళ్లు తడిశాయి. ఆ వృద్ధ మహిళ మాత్రం “కృష్ణా… కన్నయ్యా… ఠాకూర్…” అని భక్తితో పిలుస్తూ, ఆనందభాష్పాలతో కూర్చుంది.
జై శ్రీ బృందావన విహారీ కీ జై
-శంకరకింకరః