Pages

Friday, August 14, 2026

బృందావన కథలు – 51 (బృందావనంలో మీరాబాయి)

జయ శ్రీరాధేకృష్ణ!

ఈ అనంత విశ్వంలో కొందరు భగవంతుని దివ్య సాక్షాత్కారం కోసం అన్వేషిస్తారు...

మరికొందరు ఆ దేవదేవుని షోడశోపచారాలతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు...

ఇంకొందరు తమ కోర్కెలు, ఆపదల నివారణకై ఆర్తితో ప్రార్థిస్తారు...


కానీ…

తమ ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని ఆ భగవన్నామ సంకీర్తనగా మార్చుకున్న పుణ్యాత్ములు కొందరే!

తమ కనుల నుండి జాలువారే ప్రతి ఆనందబాష్పాన్ని, విరహ కన్నీటిని స్వామి పాదాలకు సమర్పించే దివ్య అభిషేకంగా మార్చుకున్నవారు కొందరే!

తమ అంతరంగాన్నే సాక్షాత్ గర్భగుడిగా మలచుకుని, పరమాత్ముని నిలుపుకున్న అపురూప భక్తులు కొందరే!


అటువంటి నిరతిశయ మధురభక్తికి ప్రత్యక్ష ప్రతిరూపం “భక్తశిరోమణి మీరాబాయి!”

ఆమెకు శ్రీకృష్ణుడు కేవలం ఆరాధించే ఒక దేవతామూర్తి మాత్రమే కాదు.

ఆమెకు కృష్ణుడు పురాణేతిహాసాల్లో చదివే ఒక దివ్య పురుషుడు మాత్రమే కాదు.

ఆమె భావనలో శ్రీకృష్ణుడు…

తన ప్రాణం...

తన ప్రేమ...

తన ప్రాణేశ్వరుడు...

తన సమస్త జీవన సర్వస్వం!


అందుకే ఆమె అమృత హృదయం నుండి జాలువారిన దివ్య అమృతవాణి “మేరే తో గిరిధర్ గోపాల్, దూసరో న కోయీ...” -ఆ గిరిధర గోపాలుడే నా వాడు... ఆయన తప్ప ఈ జగత్తులో నాకు అన్యులెవరూ లేరు!" అది కేవలం నోటి నుండి వెలువడిన భజన పంక్తి మాత్రమే కాదు; తన జన్మజన్మల బంధానికి మీరా తన అంతరాత్మతో చేసుకున్న పరమోన్నత ప్రతిజ్ఞ!


మీరా రాజవంశపు మణిదీపమై జన్మించింది. ఆమె చుట్టూ అమితమైన రత్నవైభోగాలు, స్వర్ణమయ ప్రాసాదాలు, భోగభాగ్యాలు, పరిచారికల కొలువులు, అఖండ రాజ్యాధికారాలు విస్తరించి ఉన్నాయి. కానీ ఆ భౌతిక భోగాలేవీ ఆమెను బంధించలేకపోయాయి.  ఆమె అంతఃకరణంలో ఒక పవిత్రమైన చిన్ని గోకులం నిత్యం కొలువై ఉండేది.


ఆ మానస గోకులంలో…

నవనీతచోరుడై ముద్దులొలికే బాలకృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూ తిరిగేవాడు.

బ్రహ్మాండాలనే సమ్మోహింపజేసే నెమలిపింఛాన్ని శిరస్సున ధరించి మధురంగా వేణువు ఊదేవాడు.

గోపికల భక్తిభావాల నడుమ నిలబడి అమృత మురళీగానం వినిపించేవాడు.

శ్రీరాధాదేవితో కలిసి పావన యమునాతీరంలో లీలావిహారాలు చేసేవాడు.


కృష్ణం కలయ సఖి సుందరం

కృష్ణం కలయ సఖి సుందరం

నందనందనం మునిజనవందితం

బృందావన భువి విహరంతం...


అందుకే మీరా కన్నులకు ఆ రాజప్రాసాదాలు కనిపించలేదు... సాక్షాత్ బృందావనమే గోచరించింది!

ఆమె వీనులకు రాజసభలలోని నాట్యసంగీతాలు వినిపించలేదు... ఆ శ్రీకృష్ణుని వేణునాదమే ప్రతిధ్వనించింది!

ఆమె హృదయం రాజ్యాధికారాలను, వైభవాలను కోరలేదు... కేవలం ఆ గిరిధర గోపాలుని పాదపద్మాల సేవాభాగ్యాన్ని మాత్రమే నిరంతరం అభిలషించింది!

కుటుంబ సభ్యులే ఆమెను విషం ఇచ్చి చంపాలని చూసినా ఆమె నమ్ముకున్న స్వామి ఆమెను కాపాడుకున్నాడు. 


ఒకనాటి ఏకాంత వేళ... మీరా తన ఆరాధ్య దైవమైన గిరిధర గోపాలుని విగ్రహాన్ని ఎదుట ఉంచుకుని నిశ్చలంగా, మౌనముద్రలో కూర్చుండిపోయింది. ఆమె కన్నుల వెంట ఆనందభాష్పాలు ధారగా కారుతున్నాయి. పెదవులపై అమృతమయమైన చిరునవ్వు విరబూసింది. అంతరంగమంతా అపరిమితమైన ప్రేమ తరంగాలు ఉప్పొంగుతున్నాయి.

ఆమె అత్యంత మృదుమధుర స్వరంతో స్వామిని ఉద్దేశించి 

"ఓ గిరిధరా! నిన్ను విడచి ఈ లోకంలో నాకు ఏ ఇతర ఆశ్రయమూ లేదు..."

అప్పుడు ఆమె నోట జాలువారిన అమృత భజన అంతరార్థం

"మేరే తో గిరిధర్ గోపాల్... నాకు నీవొక్కడివే సమస్తమూ స్వామీ! నీవే నా బంధువువు, నీవే నా ప్రాణసఖుడవు, నీవే నా సద్గురువువు, నీవే నా ప్రాణనాథుడవు, నీవే నా జీవన గమ్యానివి!"


మేరే తో గిరిధర్ గోపాల్, దూసరో న కోయీ !

జాకే సిర్ మోర్ ముకుట్, మేరో పతి సోయీ !!

నాకు గిరిధర గోపాలుడొక్కడే ఉన్నాడు; ఆయన తప్ప మరొకరు లేరు. నెమలిపింఛపు కిరీటం ధరించిన ఆ కృష్ణుడే నా ప్రభువు, నా ప్రాణేశ్వరుడు.


భాయీ ఛోఢీ, బంధు ఛోఢీ, ఛోఢీ సకల సగాయీ !

సంతన్ ఢింగ బైఠి బైఠి, లోకలాజ్ ఖోయీ !!

సోదరులను వదిలాను, బంధువులను వదిలాను, లోకసంబంధాలన్నిటినీ వదిలాను. సంతుల సాంగత్యంలో కూర్చుంటూ లోకలజ్జను కూడా విడిచిపెట్టాను.


భగత దేఖీ రాజీ హుయీ, జగత్ దేఖీ రోయీ !

దాసీ మీరా లాల్ గిరిధర్, తారో అబ్ మోహీ !!

భక్తులను చూస్తే నా హృదయం ఆనందిస్తుంది; ఈ లోకాన్ని చూస్తే నా హృదయం దుఃఖిస్తుంది. ఓ గిరిధర లాలా! నీ దాసురాలినైన మీరాను ఇక నీవే రక్షించు.

ఇది మీరాబాయి భక్తితత్త్వంలోని పరమ పవిత్రమైన రహస్యం!


“సఖీ! ఆ సుందరుడైన కృష్ణుణ్ణి దర్శించు. నందుని కుమారుడైన, మునులు సైతం వందించే ఆ శ్యామసుందరుడు బృందావనంలో విహరిస్తున్నాడు.”


ఆమె కృష్ణుని నుండి ఏ లౌకిక సంపదలనూ కోరలేదు... సాక్షాత్ శ్రీకృష్ణుడినే కోరుకుంది!

స్వామిని ధనధాన్యాల కోసం అర్థించలేదు... ఆ కృష్ణుని నిత్య సాన్నిధ్యాన్ని మాత్రమే యాచించింది!

తన జీవితంలోని కష్టనష్టాలను తొలగించమని వేడుకోలేదు... ఎంతటి కష్టాలలోనైనా శ్రీకృష్ణస్మరణను మరువని అనన్య భక్తిని మాత్రమే ప్రసాదించమని వేడుకుంది!


కాలప్రవాహం సాగింది. ఒక శుభవేళ మీరాబాయి రాజభవనపు బంధాలన్నింటినీ తృణప్రాయంగా విడనాడి బృందావనం వైపు ప్రయాణమైంది. ఆమె దగ్గర ఏ రాజరికపు గుర్తింపూ లేదు; రక్షణగా సైన్యబలాలూ లేవు; ఆర్భాటపు రథమూ లేదు.


ఆమె వెంట ఉన్నదల్లా

ఎదకు హత్తుకున్న చిన్నారి కృష్ణవిగ్రహం...

నాలికపై నిరంతరం నర్తించే పవిత్ర కృష్ణనామ రసధార...

మరియు ఆ దేవదేవునిపై కొండంత అచంచల విశ్వాసం!

ఆమె అడుగులు ఆనందంగా బృందావన పుణ్యభూమి వైపు సాగాయి.


మార్గమధ్యంలో పాదాలకు అంటుకున్న ధూళి ఆమెకు సామాన్యమైన మట్టిగా తోచలేదు... అది సకల పాపహరమైన వ్రజరజస్సు!

యమునా తరంగాల నుండి వీచిన పిల్లగాలులు ఆమె ముఖాన్ని తాకినప్పుడు... అది గాలి కాదు, సాక్షాత్ శ్రీకృష్ణుని అధరామృత వేణుగాన పరిమళం!

మార్గంలో కదంబవృక్షాల నీడలు సోకినప్పుడు... అవి సాధారణ వృక్షచ్ఛాయలు కావు, ఆ స్వామి పరమ కరుణా ఛత్రాలు!


చివరకు ఆమె పరమ పావన బృందావన ధామాన్ని చేరుకుంది.

యమునా నదీ ప్రవాహాన్ని దర్శించిన మరుక్షణమే మీరా కన్నులు ఆనందబాష్పాలతో నిండిపోయాయి.

"ఆహా! ఇదేనా నా ప్రాణనాథుడు పాదస్పర్శ చేసి నడయాడిన పవిత్ర నేల?" అంటూ పరవశించి ఆ పుణ్యభూమిపై సాష్టాంగపడింది. ఆ వ్రజధూళిని భక్తితో చేతుల్లోకి తీసుకుని కనులకద్దుకుంది.

"ఈ దివ్య భూమి తాకిన నా పాదాలు, నా జన్మ ఎంతటి ధన్యమైనవి!" అంటూ ఆత్మానందంతో మురిసిపోయింది.


బృందావనంలోని ఒక ప్రశాంతమైన ఆలయంలో మీరాబాయి కొలువుతీరింది.

ఎదురుగా మనోహరమైన శ్రీకృష్ణ విగ్రహం... 

చేతిలో లయబద్ధంగా మ్రోగే చిడతలు... 

కన్నులలో అమితమైన అనురాగం... 

పెదవులపై అవిశ్రాంత నామసంకీర్తన.

అంతలోనే ఆమె తన పాదాలకు ఘల్లుఘల్లుమనే గజ్జెలు కట్టుకుంది.

అది చూసి అక్కడున్న కొందరు లోకులు ఆశ్చర్యంతో "మీరా! రాజవంశపు స్త్రీవై ఉండి ఏమిటీ విపరీతం?" అని ప్రశ్నించారు.

ఆమె నవ్వుతూ "నా సర్వేశ్వరుడు, నా ప్రాణనాథుడు ఎదుట ఉండగా నా హృదయం, నా శరీరం ఎలా నిశ్చలంగా ఉండగలవు?" అంటూ తన్మయత్వంతో నర్తించడం ప్రారంభించింది.


ఆమె నోటి నుండి జాలువారిన సుప్రసిద్ధ గీతం.. "పగ్ ఘుంఘ్రూ బాంధ్ మీరా నాచీ రే... పాదాలకు గజ్జెలు కట్టుకుని మీరా తన ప్రభువు సముఖంలో నాట్యమాడుతోంది!”

లోకంలోని కొందరు ఆమెను పిచ్చిదని హేళన చేశారు; 

మరికొందరు రాజకుటుంబ మర్యాదలను విస్మరించిందని నిందించారు; 

ఇంకొందరు అపహాస్యం చేశారు.

కానీ మీరా వాటన్నింటినీ చిరునవ్వుతో దాటిపోయింది.

ఎందుకంటే… ఈ భౌతిక లోకం కేవలం ఆమె రూపాన్ని చూసి విమర్శిస్తే... మీరా మాత్రం సర్వత్రా ఆ శ్రీకృష్ణ పరమాత్ముని విశ్వరూపాన్నే దర్శించింది!


రాత్రివేళ ఆలయంలోని దీపాలు ఒక్కొక్కటిగా కొండెక్కి నిశ్శబ్దం ఆవరించింది. భక్తులందరూ తమ ఇళ్లకు వెళ్లిపోయారు.

కానీ మీరా మాత్రం కదలలేదు. ఆ చిమ్మచీకటిలో, నిశ్శబ్దంలో శ్రీకృష్ణుని విగ్రహం ఎదుట ఏకాంతంగా మోకాళ్లపై కూర్చుండిపోయింది. కన్నీటిధారలతో స్వామిని చూస్తూ ఆర్తిగా పలికింది… "కృష్ణా! ఈ లోకంలో నన్నెవరూ అర్థం చేసుకోవడం లేదు స్వామీ! కానీ సర్వాంతర్యామివైన నీవు మాత్రం నా హృదయాన్ని అర్థం చేసుకుంటావు కదా?"


ఆమె చేతులు జోడించి వేడుకుంది "నాకు రాజ్యభోగాలు వద్దు... లోకపు గౌరవమర్యాదలు వద్దు... కీర్తిప్రతిష్టలు వద్దు... లౌకిక సుఖాలు ఏమాత్రమూ వద్దు... నన్ను సదా నీ పాదసేవలోనే ఉంచుకో ప్రభూ!"


ఆమె అంతరంగపు వేదన ఒక అమర భజనగా రూపుదిద్దుకుంది "చాకర్ రాఖో జీ, గిరిధారీ లాల్... ఓ గిరిధారీ! నన్ను నీ సేవకురాలిగా స్వీకరించు తండ్రీ! నీ దివ్యసేవ చేసుకుంటూ, ప్రతిరోజూ ఉదయాన్నే నీ ముఖారవిందాన్ని దర్శించుకుంటూ నా జీవితాన్ని ధన్యం చేసుకోనివ్వు! "


ఎంతటి ఉదాత్తమైన కోరిక!

ఈ ప్రపంచం రాజ్యాధికారాలను, సంపదలను యాచిస్తే...

మీరాబాయి మాత్రం సమస్త లోకాలకే రాజాధిరాజైన ఆ పరమాత్ముని దాస్యభావాన్ని, పాదసేవను పరమభాగ్యంగా కోరింది!

బృందావనంలో శ్రీకృష్ణుడు లీలలు సాగించిన ప్రతి స్థలాన్నీ దర్శిస్తున్న కొద్దీ మీరా హృదయంలో భక్తిభావం అమితంగా పెరిగింది.


కానీ ప్రేమ ప్రగాఢమైన కొద్దీ… ఆమెలో కృష్ణ విరహవేదన కూడా అంతే తీవ్రరూపం దాల్చింది.

కృష్ణుడు ప్రత్యక్షంగా కంటిముందు కనిపించడం లేదనే భావన ఆమె అంతరంగాన్ని క్షణక్షణం దహించివేసేది.

యమునానదీ తీరంలో కూర్చుని, ఒంటరిగా నిలచిన కదంబవృక్షాన్ని కౌగిలించుకుని”ఓ కదంబమా! ఇక్కడే కదా నా స్వామి నిలబడి వేణువు పూరించింది? ఎక్కడ ఉన్నాడమ్మా నా శ్యామసుందరుడు?” అని వెక్కివెక్కి ఏడ్చేది. పిల్లగాలిలో వేణువు స్వరం వినిపించినట్లు భ్రమ కలిగితే “కృష్ణా! వచ్చావా ప్రభూ!” అంటూ ఆశగా పరుగులు తీసేది.

కానీ బాహ్యనేత్రాలకు కృష్ణుడు కానవచ్చేవాడు కాదు.


అప్పుడు ఆమె కన్నీళ్లే అమర భజనలై ఆకాశాన్ని తాకేవి. ఆమె హృదయస్పందన ఇలా ఆర్తిగా ఘోషించేది “హరిని విడిచి నేను ఒక్క క్షణమైనా జీవించలేను...” శ్రీహరి స్మరణ లేని జీవనం ఆమె దృష్టిలో బ్రతుకు కాదు... అది శ్వాస ఆడుతున్న ఒక జీవచ్ఛవం వంటిది!


ఒకనాడు బృందావనంలోని సాధుసంతుల సత్సంగంలో మీరాబాయి ప్రశాంతంగా కూర్చుని ఉంది.

అక్కడున్న వారిలో ఒకరు కుతూహలంతో "మీరాజీ! సమస్త రాజభోగాలను, ఐశ్వర్యాలను తృణప్రాయంగా విడిచిపెట్టి సాధువులా మారి చివరికి నీవు పొందిందేమిటి?" అని అడిగారు. మీరా నిర్మలమైన చిరునవ్వు చిందిస్తూ సవినయంగా  “నేను కోల్పోయింది కేవలం కాలగర్భంలో కలిసిపోయే లౌకిక సంపదను మాత్రమే. కానీ నేను పొందిందో… ఈ సృష్టిలో ఏ దొంగలూ దోచుకోలేని, ఏ శక్తులూ హరించలేని శాశ్వతమైన పరమ సంపద!” అని చెప్పింది


అంటూ ఆనందలహరిలో గానం చేసింది “పాయో జీ మైనే రామ్ రతన్ ధన్ పాయో... నేను భగవన్నామమనే అమూల్యమైన రత్నభాండాగారాన్ని సంపాదించుకున్నాను!”


ఆమె దృష్టిలో…

భగవన్నామమే అసలైన సంపద!

నిష్కల్మష భక్తియే అత్యుత్తమ ఆభరణం!

కృష్ణస్మరణమే నిత్య జీవన విధానం!

ఆ కృష్ణపాదారవిందాల సేవే మోక్షసామ్రాజ్యం!


అదొక అద్భుతమైన సంధ్యాసమయం.

పడమటి సంధ్యారాగంలో యమునానది బంగారు కాంతులీనుతూ ప్రవహిస్తోంది. కదంబవనాల మధ్యనుండి కమ్మని మలయమారుతం వీస్తోంది.

అంతలోనే... ఎక్కడో సుదూర తీరాల నుండి దివ్యమైన మోహన వేణుగానం స్పష్టంగా ప్రతిధ్వనించింది.

మీరా ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచింది. ఆమె హృదయ స్పందనలు వేగవంతమయ్యాయి.

"అది... నా ప్రాణనాథుని వేణుగానమే కదా!" అంటూ ఆత్రుతగా పరిసరాలన్నీ పరికించి చూసింది.

బాహ్యంగా అక్కడ ఎవరూ లేరు. కానీ ఆ అమృత స్వరం ఆమె అంతరాత్మలో అనంతంగా మార్మోగుతూనే ఉంది.


ఆమె ప్రశాంతంగా కన్నులు మూసుకుంది.

ఆ దివ్య క్షణంలో…

సమస్త బృందావనం సాక్షాత్ నీలమేఘశ్యామమయమై దర్శనమిచ్చింది!

ప్రవహించే యమునా తరంగాలు… ఆయన పాదాల చెంత నిరంతరం ప్రవహించే ప్రేమధారలుగా గోచరించాయి!

గాలికి ఊగుతున్న కదంబవృక్షాలు… స్వామి రాకకై తపించే గోపికా సమూహాలుగా దర్శనమిచ్చాయి!

ఆ పవిత్ర వ్రజధూళి… ఆ పరమాత్ముని నిత్య పాదస్పర్శగా అనుభూతినిచ్చింది!


మీరా కనుల నుండి జాలువారిన ఆనందబాష్పాలతో చిరునవ్వు చిందిస్తూ అంతరంగంలో పలికింది"ఓ కృష్ణా! నీవు బాహ్య నేత్రాలకు కనిపించకపోయినా... నా హృదయ మందిరాన్ని విడిచి ఎక్కడికి వెళ్లగలవు స్వామీ?"


మీరాబాయి జీవితాన్ని పరిశీలిస్తే ఒక పరమోన్నతమైన సత్యం ఆవిష్కృతమవుతుంది: ఆమె కృష్ణుని ఎక్కడో బయట వెతికి పొందడానికి బృందావనానికి రాలేదు... ఆ కృష్ణుడే తన అంతరంగంలో నిండి ఉన్నాడన్న అద్వైత ప్రేమసత్యాన్ని సాక్షాత్కరించుకోవడానికే బృందావనానికి వచ్చింది!


ఆమె భక్తి

భయంతో చేసిన ప్రార్థన కాదు!

కోరికలు తీర్చుకోవడానికి చేసిన పూజ కాదు!

స్వర్గసుఖాల కోసం చేసిన ఉపాసన కాదు!

అది కేవలం నిస్వార్థమైన, పరమ పవిత్రమైన అనన్య ప్రేమ!


అందుకే ఆమెకు…


కృష్ణుడు ఎదుట కనిపించినా కృష్ణుడే... కనిపించకపోయినా కృష్ణుడే!

ఆనందంలోనూ కృష్ణుడే... విరహవేదనలోనూ కృష్ణుడే!

కన్నీటిలోనూ కృష్ణుడే... నర్తనంలోనూ కృష్ణుడే... నిశ్శబ్దంలోనూ కృష్ణుడే!


ఆమె తుదిశ్వాస వరకు పలికిన ఏకైక తారకమంత్రం…

"గిరిధర! గిరిధర! గిరిధర!"


ఈ అనంత కాలవాహినిలో, బృందావనపు పుణ్యభూమిపై నడిచిన కోట్లాది భక్తుల పాదముద్రలలో... మీరాబాయి అడుగుజాడలు నేటికీ ఎందుకు చెరిగిపోకుండా నిలిచి ఉన్నాయి?

ఎందుకంటే… ఆమె పాదాలు కేవలం నేలను మాత్రమే తాకలేదు... నిష్కల్మషమైన భక్తిప్రేమను తాకాయి!


ఆమె కన్నీటి బిందువులు పావన యమునా నదిలో అంతర్వాహినిగా కలిసిపోయాయి.

ఆమె మధుర కీర్తనలు బృందావన మందమారుతాల్లో నిత్య సుగంధాలై లీనమయ్యాయి.

ఆమె నాట్యపు గజ్జెల సవ్వడులు కదంబవనాలలో నేటికీ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి.

ఆమె కృష్ణప్రేమామృతం తరతరాల భక్తకోటి అంతరంగాలలో భక్తిజ్యోతియై దేదీప్యమానంగా వెలుగుతూనే ఉంది!


అందుకే ఆ దివ్యభూమిపై ఇప్పటికీ మీరా దివ్యవాణి అమరనాదమై వినిపిస్తూనే ఉంది:

"మేరే తో గిరిధర్ గోపాల్, దూసరో న కోయీ... నాకు ఆ గిరిధర గోపాలుడొక్కడే సర్వస్వం... ఆయన తప్ప మరొకరు లేరు!"

---

జయ జయ శ్రీరాధే!

జయ జయ శ్రీగిరిధారీ!

జయ భక్తశిరోమణి మీరాబాయి!

జయ దివ్య బృందావన ధామం!


- శంకరకింకరః (శ్రీ అయ్యగారి నాగేంద్ర కుమార్)






శ్రీమాత లీలామృతం – 7 (లోపాముద్రాగస్త్యుల కరవీరపుర యాత్ర )

శ్రీ గురుమూర్తే త్వాం నమామి కామాక్షి!


దక్షిణ దిక్కున ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ, పవిత్ర తీర్థాలను సేవిస్తూ, ఎన్నో దివ్యస్థలాల మహిమను అనుభవిస్తూ అగస్త్య మహర్షి తన ధర్మపత్నియైన లోపాముద్రతో కలిసి యాత్ర సాగిస్తున్నాడు. ఎన్నో పుణ్యక్షేత్రాల ధూళిని తమ పాదాలకు తాకించుకున్న ఆ మహాతపస్వి దంపతులు, అనేక తీర్థాల పవిత్ర జలాలను స్పృశిస్తూ సాగిపోతూ, ఒకానొక రోజు కరవీరపుర పావన భూమికి చేరుకున్నారు.


కరవీరపుర సరిహద్దుల్లోకి అడుగుపెట్టగానే అగస్త్యుని అడుగులు నెమ్మదించి ఒక్క క్షణం ఆగిపోయాయి. పరిసరాల వైపు చూస్తే బాహ్యంగా ఏ విశేషమూ కనిపించలేదు. అదే ఆకాశం, అదే నేల, అవే చెట్లు, అదే గాలి. అయినా ఆ నేలలో ఏదో చెప్పలేని పవిత్రత తొణికిసలాడుతోంది. కంటికి కనిపించని ఏదో ఒక దివ్యశక్తి ఆ ప్రాంతమంతటినీ తన వాత్సల్యపుటొడిలోకి తీసుకున్నట్లు అనిపించింది. ఎన్నో పుణ్యతీర్థాలను దర్శించిన ఆ మహర్షి అంతరంగానికే ఆ అనుభూతి ఎంతో అపురూపంగా, కొత్తగా తోచింది.


మంత్రద్రష్టయైన లోపాముద్ర కూడా ఆ నిశ్శబ్దంలో దాగివున్న మాధుర్యాన్ని గ్రహించింది. కొద్దిసేపు నిశ్చలంగా నిలబడి, తన చుట్టూ ఉన్న ఆ దివ్య వాతావరణాన్ని ఆస్వాదిస్తూ భర్తతో మెల్లగా అన్నది:


“నాథా! మనం ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శించాం. ఎందరో మహర్షుల తపోభూములను చూశాం. ఎన్నో దేవాలయాల్లో సాక్షాత్తు దైవసాన్నిధ్యాన్ని అనుభవించాం. కానీ ఇక్కడ అడుగుపెట్టిన క్షణం నుంచే నా హృదయంలో ఏదో తెలియని ప్రశాంతత అలుముకుంది. ఈ గాలిలోనే ఏదో ఒక పవిత్రమైన పరిమళం ఉంది. ఈ నేల మన పాదాలను తాకడం కాదు... మన అంతరంగాన్నే తాకుతున్నట్లుంది. ఈ భూమి సాధారణమైనది కాదనిపిస్తోంది.”


అగస్త్య మహర్షి ఆమె మాటలు విని చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వులో చిరపరిచితమైన ఆనందం కనిపించింది. ఎన్నాళ్లుగానో వెతికిన తనవారి సన్నిధిని తిరిగి చేరుకున్న భక్తుడి ప్రశాంతత ఆయన ముఖంలో మెరిసింది.


“లోపాముద్రా! నీ హృదయం ఈ నేల మహిమను ముందే గుర్తించింది. కొన్ని క్షేత్రాలను మనం వెతుక్కుంటూ వెళ్లి దర్శిస్తాం; కానీ కొన్ని దివ్యక్షేత్రాలు మాత్రం మన అంతరంగాన్ని తామే దర్శించి, తమ వైపునకు ఆకర్షించుకుంటాయి. ఈ కరవీరపురం అలాంటి పుణ్యభూమి,” అంటూ కొద్దిసేపు మౌనంగా ఉండి, భక్తితో ఆ నేలను చూస్తూ కొనసాగించాడు:


“ఇది కేవలం మట్టితో కూడిన సాధారణ భూమి కాదు లోపాముద్రా. దేవతలకూ, మహర్షులకూ, భక్తులకూ పరమపావనమైన కరవీర క్షేత్రమిది. ఇక్కడ జగన్మాత శ్రీ మహాలక్ష్మి స్వయంగా కొలువై తన దివ్యసాన్నిధ్యాన్ని ప్రసాదించింది. ఆమె పాదస్పర్శతో పునీతమైన ఈ నేలలోని ప్రతి రేణువులోనూ, వీచే ప్రతి గాలివీచికలోనూ ఆమె కరుణ నిండివుంది. ఈ క్షేత్రాన్ని ఆశ్రయించే ప్రతి భక్తుని హృదయంలోనూ ఆమె మౌనంగా ఏదో ఒక దివ్య భావాన్ని పలికిస్తూనే ఉంటుంది.”


లోపాముద్ర పరమభక్తితో, వినమ్రంగా ఆ పుణ్యక్షేత్రానికి తలవంచి “అయితే నాథా... ఈ కరవీరానికి ఇంతటి మహిమ ఎలా కలిగింది? జగజ్జననియైన ఆ మహాలక్ష్మి తల్లి ఇక్కడే ఎందుకు కొలువైందో నాకు వివరంగా చెప్పండి,” అని కోరింది.


అగస్త్యుని చూపు విశాలంగా విస్తరించి ఉన్న ఆ పవిత్ర క్షేత్రం వైపు మళ్లింది.


“అది ఒక మహత్తరమైన కథ లోపాముద్రా. ఒకప్పుడు ఈ నేలపై అహంకారం తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది. అదే అహంకారం చివరకు తల్లి పాదాల వద్ద నిండు శరణాగతిగా మారింది. ఆ శరణాగతికి సాక్షిగా నిలిచిన ఈ కరవీర భూమినే తల్లి తన నివాసంగా స్వీకరించింది.”


లోపాముద్ర ఎంతో ఆసక్తిగా అగస్త్యుని ముఖం వైపు చూస్తూ వినసాగింది.


అగస్త్యుడు ప్రశాంతమైన స్వరంతో “విను లోపాముద్రా... కరవీరంలో తల్లి ఎలా కొలువైందో చెబుతాను. పూర్వకాలంలో ఈ ప్రాంతాన్ని కొల్హాసురుడు అనే రాక్షసుడు పరిపాలించేవాడు. అతడు ఘోర తపస్సు చేసి ఎన్నో వరాలను పొందాడు. కానీ శక్తి చేతికి వచ్చినప్పుడు అహంకారానికి లోనయ్యాడు. బలం పెరిగినప్పుడు వివేకం నశిస్తుంది. లోకంలో తనకు ఎదురునిలబడగలవారు ఎవరూ లేరని భావించాడు. దేవతలను, మునులను, ప్రజలను నానా బాధలకు గురిచేయడం మొదలుపెట్టాడు. అతని పేరు వింటేనే లోకాలు భయంతో వణికిపోయేవి.”


లోపాముద్ర ఆశ్చర్యంతో, “అంతటి అధర్మాన్ని చూస్తూ దేవతలు ఊరుకున్నారా నాథా? వారేమీ చేయలేకపోయారా?” అని అడిగింది.


“తమ తమ శక్తులన్నీ ఒడ్డి ప్రయత్నించారు లోపాముద్రా. కానీ కొన్నిసార్లు సమస్యను స్వశక్తితో ఎదుర్కోవడం సాధ్యం కాదు. అటువంటి విపత్కర సమయాల్లో సర్వశక్తులకూ మూలమైన ఆ జగన్మాతనే శరణువేడాలి,” అని అగస్త్యుడు చెప్పాడు.


“అంటే దేవతలందరూ ఆ శక్తిస్వరూపిణియైన జగజ్జననిని ప్రార్థించారా?” అని ఉపాసనా ముద్రల అంతరార్థాన్ని ఎరిగిన లోపాముద్ర కళ్ళు విప్పార్చి అడిగింది.


“అవును. వారి ప్రార్థనలో ఎలాంటి కపటమూ లేదు. తమ పదవులపై గర్వం లేదు, తమ శక్తిపై అహంకారం లేదు. తమ చేతులతో సాధ్యం కాని లోకరక్షణ భారాన్ని తల్లి చేతుల్లో పెట్టారు. వారి హృదయాల నుంచి ఒకే ఆర్తనాదం వినిపించింది—‘అమ్మా! దుష్టశిక్షణ చేసి ధర్మాన్ని రక్షించు, లోకాలను కాపాడు!’ అని.”


అగస్త్యుని స్వరం మరింత గంభీరమైంది.


“ఆ పిలుపు తల్లి హృదయానికి చేరడానికి ఎంతో సమయం పట్టలేదు. జగన్మాత శ్రీ మహాలక్ష్మి రూపంలో కరవీరపురానికి తరలివచ్చింది. ఆమె రాక చిమ్మచీకట్లను తరిమివేసే ఉదయసూర్యుడి కాంతిలా ప్రకాశించింది. కొల్హాసురుడు అహంకారంతో తన బలాన్ని నమ్ముకున్నాడు; తల్లి మాత్రం ముల్లోకాల సాధుజీవుల రక్షణే ధ్యేయంగా ధర్మబలంతో నిలిచింది. యుద్ధం భీకరంగా జరిగింది. చివరకు మహాలక్ష్మి చేతిలో కొల్హాసురుడు నేలకూలాడు.”


లోపాముద్ర కళ్లు మూసుకుని ఆ దృశ్యాన్ని మనసులో ప్రత్యక్షంగా జరుగుతున్నట్లు ఊహించుకుంది.


“అంతటితో కథ ముగిసిందా నాథా?” అంది ఒక ఊరటతో కూడిన నిట్టూర్పు విడుస్తూ...


అగస్త్యుడు తల ఊపుతూ, “లేదు లోపాముద్రా. అసలైన కథ అక్కడే మొదలైంది,” అన్నాడు.


“అదేమిటి నాథా? అలా ఎలా?” అంది లోపాముద్ర.


“ప్రాణాలు పోయే చివరి క్షణంలో కొల్హాసురుని హృదయంలో అనూహ్యమైన మార్పు వచ్చింది. జీవితమంతా తాను ఏ అహంకారంతో విర్రవీగాడో, ఏ అధర్మ పనులు చేశాడో అన్నీ గుర్తొచ్చాయి. తాను ఏ ధర్మాన్నైతే ఎదిరించాడో, ఆ ధర్మస్వరూపమే ఇప్పుడు జగన్మాతగా తన ఎదుట నిలిచివుందని అతడు గ్రహించాడు. తన బలం, తన గర్వం, తన వరాలు అన్నీ ఒక్క క్షణంలో నిరర్థకమైపోయాయి.”


అగస్త్యుడు కాసేపు మౌనంగా ఉండి, ఆ దృశ్యాన్ని అనుభూతి చెందుతూ మళ్లీ ప్రారంభించాడు:


“నేలపై సత్తువలేక పడివున్న కొల్హాసురుడు తల్లి వైపు చూశాడు. ఆ చూపులో ఇక క్రూరత్వం లేదు; పోరాడాలనే ఆలోచన లేదు; గర్వం, అహంకారం సమసిపోయాయి. కేవలం హృదయపూర్వకమైన పశ్చాత్తాపం మాత్రమే మిగిలింది.”


లోపాముద్ర ఆర్ద్రతతో, “అప్పుడు తల్లి ఏమి చేసింది నాథా? అతనితో ఏమంది?” అని అడిగింది.


“తల్లి కరుణ నిండిన కళ్లతో మౌనంగా అతని వైపు చూసింది.”


“అప్పుడతడు?”


“‘అమ్మా! జీవితమంతా అహంకారంతో దేవతలను, మానవులను పీడించాను. ధర్మస్వరూపిణివైన నిన్నే ఎదిరించాను. నా బలం నన్ను కాపాడుతుందని విర్రవీగాను. కానీ ఇప్పుడు ప్రాణం పోయే సమయంలో తెలిసొచ్చింది... నీ ముందు నా బలమంతా సాయంత్రపు నీడ లాంటిది. నిన్ను జయించగలననుకున్న నా అహంకారమే నా అసలైన శత్రువు. నా చేతులతో చేసిన పాపాలకు తగిన ఫలితం అనుభవించాను. ఇప్పుడు నిన్ను వేడుకునే అర్హత కూడా నాకు లేదు. జీవితమంతా నీకు దూరంగా పరుగెత్తాను; చివరకు మరణం నన్ను నీ పాదాల దగ్గరకే తీసుకొచ్చింది. అయినా... నీవు విశ్వానికే తల్లివి కదా! తల్లి ముందు నిలిచిన బిడ్డకు అర్హతలతో పనేముంటుంది? నన్ను కరుణించు!’ అని వేడుకున్నాడు.”


లోపాముద్ర కళ్లలో నీళ్లు తిరిగాయి. శ్రద్ధగా వినసాగింది.


అగస్త్యుడు కొనసాగిస్తూ “కొల్హాసురుడు ఒక వరాన్ని కోరాడు: ‘అమ్మా! నన్ను క్షమించమని అడగడం లేదు. నా పాపాలకు తగిన శిక్ష నాకు లభించింది. కానీ ఒక వరం మాత్రం అనుగ్రహించు. నీవు ఈ భూమిని విడిచి వెళ్లవద్దు. నా పేరు ఈ క్షేత్రంతో శాశ్వతంగా కలిసిపోవాలి. నీవు ఇక్కడే కొలువై ఉండి, నీ దర్శనానికి వచ్చే భక్తులందరినీ కరుణించు’ అని ప్రార్థించాడు.”


“తల్లి ఆ కోరికను అంగీకరించిందా నాథా?”


అగస్త్యుని ముఖంలో చిరునవ్వు విరిసింది. “అదే కదా జగజ్జననియైన శ్రీ మహాలక్ష్మి తల్లి అపార మహిమ! ఆ తల్లి అతని పూర్వపాపాలను, క్రౌర్యాన్ని సమర్థించలేదు. కానీ చివరి క్షణంలో అతని హృదయంలో పుట్టిన నిష్కల్మషమైన పశ్చాత్తాపాన్ని మాత్రం తిరస్కరించలేదు. నిజమైన పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం మరొకటి ఉండదు. తల్లి అతని కోరికను మన్నించింది. అప్పటి నుంచి ఈ పుణ్యభూమి ‘కొల్హాపురం’గా ప్రసిద్ధి చెందింది. ఆ దేవి కరవీరనివాసినిగా, కొల్హాపుర మహాలక్ష్మిగా భక్తుల హృదయాల్లో శాశ్వతంగా కొలువైంది.”


లోపాముద్ర నెమ్మదిగా, “నాథా! ఎంతటి విచిత్రమైన మాతృహృదయం! ఒక చేత్తో దుష్టశిక్షణ చేస్తూనే, మరొక చేత్తో అభయకరుణలను కురిపించే వరదాభయ ప్రదాయిని జగన్మాత!” అంది.


అగస్త్యుడు నవ్వుతున్న కళ్ళతో ఆమె వైపు చూశాడు. “నిజమే లోపాముద్రా. మాతృత్వం అంటే బిడ్డలు చేసిన తప్పులను సమర్థించడం కాదు. దారితప్పిన బిడ్డ తిరిగి తన వైపు వచ్చినప్పుడు, ఆ బిడ్డను హృదయానికి హత్తుకుని అక్కున చేర్చుకోవడం.”


కొద్దిసేపు అక్కడ దివ్యమైన నిశ్శబ్దం ఆవరించింది. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ “అందుకే తల్లి ముందు మనం మన గొప్పతనాన్ని చూపించాల్సిన అవసరం లేదు. మన హృదయం ఎలా ఉందో అలాగే ఆమె ఎదుట ఉంచాలి. సర్వాంతర్యామి అయిన ఆమె ముందు మనం నటించలేం. మన నోటి మాటలు ఆమెకు వినిపించకముందే మన అంతరంగం స్పష్టంగా కనిపిస్తుంది,” అన్నాడు అగస్త్యుడు.


లోపాముద్ర తదేకధ్యానంతో వింటోంది. 


“తల్లి వద్దకు రావడానికి ఎంత ఆలస్యమైనా ఫర్వాలేదు... తన గడప దాకా వచ్చిన బిడ్డను ఏ తల్లీ గుమ్మం దగ్గరే నిలబెట్టి ఉంచదు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి ‘తల్లి ఎలాగూ క్షమిస్తుంది కదా’ అని తెలిసి తెలిసి తప్పు చేస్తూ ఉండటం భక్తి అనిపించుకోదు. తల్లి పాదాల దగ్గర నిజంగా నిలబడినప్పుడు, మనలోని తప్పే మనకు భారంగా అనిపించాలి. కొల్హాసురునికి చివరి క్షణంలో అదే జరిగింది. అందువల్లే అతని పేరుతో ఇంతటి గొప్ప క్షేత్రం నిలిచింది.”


---


ఇద్దరూ అడుగులు వేస్తూ ఆలయానికి చేరువయ్యారు.

ఆలయం సమీపిస్తున్న సంకేతంగా దూరంగా ఘంటానాదం వినిపిస్తోంది. వేదఘోష గాలిలో తేలుతూ చెవులను తాకుతోంది. భక్తుల నోళ్లలో “అంబాబాయి... అంబాబాయి...” అనే నామస్మరణ చిన్న అలల తాకిడిలా ఎంతో మధురంగా వినిపిస్తోంది.


ఆలయం చేరి గర్భగుడికి చేరుకున్న అగస్త్య మహర్షి లోపాముద్రతో కలిసి నిశ్చలుడై నిలబడి అమ్మవారిని దర్శించాడు. ఆ దివ్య మంగళమూర్తిని చూసిన క్షణంలో ఆయన కళ్లు చెమ్మగిల్లాయి; తీవ్రమైన భావోద్వేగం ఆయన్ను ముంచెత్తింది.


లోపాముద్ర భర్తను అనునయిస్తూ ఆయన చేతిని పట్టుకుని, “నాథా...?” అంది. అగస్త్యుడు బదులు చెప్పలేదు. ఆయన చూపు జగన్మాత ముఖంపైనే నిలిచిపోయింది.


ఆ ముఖంలో అంతులేని కరుణ ఉంది.

ఆ నేత్రాల్లో అనంతమైన శాంతి ఉంది.

ఆ చేతుల్లో విశ్వాన్ని నడిపించే శక్తి ఉంది.

ఆమె సన్నిధిలో చెప్పలేనంత గంభీరమైన మాధుర్యం ఉంది.

అగస్త్యునికి ఒక్కసారిగా ‘ఈ సమస్త సృష్టినీ తన శక్తితో నడిపించే తల్లి, భక్తుల కోసం తన వైభవాన్నంతా పక్కన పెట్టి ఒక సాధారణ తల్లిలా ఇక్కడ ఎందుకు కూర్చుంది?’ అనిపించింది.


వెంటనే "అమ్మ" అనే పదం స్ఫురించింది. ఆ స్ఫురణ రాగానే ఆయన చేతులు వాటంతట అవే జోడించబడ్డాయి. “అమ్మా!” అన్న ఒక్క పిలుపుతో మహర్షి తన సర్వస్వాన్నీ ఆ తల్లి పాదాల వద్ద సమర్పించుకున్నాడు.


లోపాముద్ర కూడా అమ్మవారి ముందు నిలిచింది. ‘తాను తల్లిని చూడడం కాదు; ఆ తల్లే తనను చూస్తోందన్న’ అనిర్వచనీయమైన భావన ఆమెలో కలిగింది.


కొంతసేపటి తర్వాత అగస్త్యుడు మెల్లగా “లోపాముద్రా! మనం తల్లిని చూడడానికి వచ్చాం అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తోంది... మనం ఎప్పుడూ ఆమె చూపుల పరిధిలోనే ఉన్నామని. తల్లి దృష్టి ఎప్పుడూ బిడ్డల మీదే ఉంటుంది కదా!” అన్నాడు.


“మీరెలా గుర్తించారు నాథా!” అంది లోపాముద్ర.


“మనిషి దేవుణ్ణి దర్శించడానికి వెళ్తాడు. కానీ దేవుని ఎదుట నిలబడిన క్షణంలో తన అసలు స్వరూపం తనకే కనిపిస్తుంది. తల్లి చూపు నిర్మలమైన అద్దం లాంటిది. అందులో మన బాహ్య ముఖం కాదు, మన హృదయం కనిపిస్తుంది.”


అగస్త్యుడు అమ్మవారికి భక్తితో నమస్కరించాడు. ఆయన హృదయంలో మహాలక్ష్మి స్తుతి ఉప్పొంగింది:


జయ పద్మపలాశాక్షి జయ త్వం శ్రీపతిప్రియే!

జయ మాతర్మహాలక్ష్మి సంసారార్ణవతారిణి !!

మహాలక్ష్మి నమస్తుభ్యం నమస్తుభ్యం సురేశ్వరి !

హరిప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే !!

పద్మాలయే నమస్తుభ్యం నమస్తుభ్యం చ సర్వదే!

సర్వభూతహితార్థాయ వసువృష్టిం సదా కురు!!

జగన్మాతర్నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే!

దయావతి నమస్తుభ్యం విశ్వేశ్వరి నమోఽస్తు తే !!

నమః క్షీరార్ణవసుతే నమస్త్రైలోక్యధారిణి !

వసువృష్టే నమస్తుభ్యం రక్ష మాం శరణాగతం!!


అంటూ స్తుతించి, అగస్త్యుడు కళ్లు మూసుకుని “అమ్మా! లోకమంతా నీ దగ్గరకు ఏదో ఒకటి అడగడానికే వస్తుంది. కొందరు ధనం అడుగుతారు, కొందరు సంతానం కోరుతారు, కొందరు ఆరోగ్యం అడుగుతారు, కొందరు కష్టాలు తీరాలని వేడుకుంటారు. వారి కోరికలన్నీ నీవు వింటావు. కానీ తల్లీ! నీ సన్నిధిలో కొంతసేపు నిలబడిన తర్వాత, మనిషి తన కోరికలనే మరిచిపోతాడు. ఎందుకంటే నీ ముఖంలో కనిపించే ఆ మాతృవాత్సల్యం ముందు మేం అడగబోయే వరాలన్నీ చాలా చిన్నవైపోతాయి.” అన్నాడు.


లోపాముద్ర కళ్లలో నీళ్లు నిండాయి “అమ్మా! నాకేం కావాలో కూడా నాకు తెలియడం లేదు. నాకు సుఖం కావాలో, ఐశ్వర్యం కావాలో, శాంతి కావాలో ఏదీ తేల్చుకోలేకపోతున్నాను. ఇప్పుడు నిన్ను చూసిన తర్వాత నాలో ఒకటే కోరిక కలుగుతోంది ‘శ్రీమాతవైన నిన్ను మరచిపోయే జీవితం మాత్రం నాకు ఇవ్వవద్దు తల్లీ!’”


అగస్త్యుడు చిరునవ్వు నవ్వి, “లోపాముద్రా! నీవు అడిగినదే అన్నిటికన్నా గొప్ప వరం. ధనం అడిగితే అది ఒక జన్మకే తోడుంటుంది; సుఖం కోరితే అది కాలంతో పాటు మారిపోతుంది. కానీ తల్లి స్మరణను వేడుకుంటే, జీవుడు ఎక్కడ ఉన్నా ఆ తల్లి రక్షణ అతనితోనే ఉంటుంది.”


ఆ సమయంలో ఆలయంలో మంగళహారతి ప్రారంభమైంది.

కర్పూర జ్యోతి వెలిగింది.

ఆ చిన్న జ్వాల అమ్మవారి ముఖం ముందు దేదీప్యమానంగా వెలుగుతోంది.

అమ్మవారి కళ్లలో ఆ హారతి కాంతి మెరిసింది.

లోపాముద్ర ఆ దృశ్యాన్ని చూస్తూ మైమరచిపోయింది.

“నాథా... లోకాలన్నిటికీ వెలుగునిచ్చే తల్లికి, మనిషి చేతిలోని ఈ చిన్న దీపం ఎంత స్వల్పమైన హారతి కదా!” అన్నది.


అగస్త్యుడు మృదువుగా నవ్వి “తల్లికి ఆ హారతి దీపం వెలుగు అవసరం లేదు లోపాముద్రా. ఆ హారతి దీపం వెలిగించే మన మనసులకే ఆ జ్ఞానపు వెలుగు కావాలి,” అన్నాడు.


ఆ మాట లోపాముద్ర హృదయంలో లోతుగా నాటుకుపోయింది.


శరణ్యే త్వాం ప్రపన్నోఽస్మి కమలే కమలాలయే!

త్రాహి త్రాహి మహాలక్ష్మి పరిత్రాణపరాయణే !!

పాండిత్యం శోభతే నైవ న శోభంతి గుణా నరే !

శీలత్వం నైవ శోభేత మహాలక్ష్మి త్వయా వినా!!


ఆ తర్వాత అగస్త్యుడు కొల్హాపుర మహాలక్ష్మి క్షేత్రంలో జరిగే కిరణోత్సవం గురించి కూడా అగస్త్యుడు ఆమెకు వివరించాడు:


“ఇక్కడ ఒక అద్భుతం ఉంది లోపాముద్రా. సంవత్సరంలోని కొన్ని నిర్దిష్ట రోజుల్లో సూర్యుని కిరణాలు ఆలయ నిర్మాణంలోని ప్రత్యేక మార్గం గుండా ప్రయాణించి, గర్భగుడిలోని తల్లి పాదాలను తాకుతూ మొత్తం మంగళమూర్తిని బంగారు కాంతులతో అలంకరిస్తాయి.”


లోపాముద్ర ఆశ్చర్యంతో, “ఆకాశంలో ఉన్న సూర్యుని కిరణాలే స్వయంగా వచ్చి తల్లి పాదాలను తాకుతాయా?” అంది.


“అవును. ఆ దృశ్యాన్ని చూసినప్పుడు భక్తులు పరవశించిపోతారు. సూర్యుడు ప్రతిరోజూ ఉదయిస్తాడు, ప్రతిరోజూ అస్తమిస్తాడు. కానీ ఆ రోజుల్లో మాత్రం ఆయన ప్రయాణమే ఒక నిశ్శబ్ద పూజగా మారుతుంది. ఆకాశం నుంచి జారిన బంగారు కిరణాలు ఆలయ ద్వారాల గుండా, రాతి నిర్మాణాల మధ్యగా ప్రయాణించి, చివరకు తల్లి దివ్యమూర్తిని తాకుతాయి.


అది చూసిన భక్తునికి—‘తల్లీ! పూలు తెచ్చే స్తోమత లేని భక్తుడికి నీవు పువ్వును ఇచ్చావు. దీపం వెలిగించలేని వాడికి నీవే సూర్యుడిని ఇచ్చావు. మేము చేతిలో చిన్న దీపంతో నీకు హారతి ఇస్తుంటే, నిన్ను దర్శించడానికి ఆకాశమే తన బంగారు కిరణాలను పూలదండగా అల్లుకుని పంపుతోందా!’ అనే సహజ భావన కలుగుతుంది.


సూర్యకిరణం తల్లి మూర్తిని తాకిన ఆ క్షణం కేవలం వెలుగు కాదు; తన తల్లిని సేవించడానికి సూర్యుడు వచ్చి పాదసేవ చేస్తూ జరిపే సంభాషణలా అనిపిస్తుంది.


సూర్యుడు—తన వెలుగుతో,

భక్తుడు—తన కన్నీటితో,

పూజారి—తన మంత్రంతో,

పువ్వు—తన పరిమళంతో,

దీపం—తన జ్యోతితో...


అందరూ తమకు చేతనైన రీతిలో ఆ ఒక్క తల్లినే చేరుకుంటున్నారు.


లోపాముద్రా! ప్రకృతిలోని ప్రతి కణమూ తల్లి సన్నిధిలో తనదైన భాషలో పూజ చేస్తోంది. మనిషి మాత్రం తన హృదయపూర్వకమైన భావంతో పూజ చేయడం నేర్చుకోవాలి,” అని అగస్త్యుడు ఉపదేశించాడు.


---


సూర్యుడు పడమటి ఆకాశంలోకి వాలుతుండగా.

కరవీరంపై సాయంత్రపు కాంతి పరుచుకుంది.

అగస్త్యుడు, లోపాముద్ర ఇద్దరూ ఆలయం బయటకు వచ్చారు.

కొంతదూరం వెళ్లిన తర్వాత లోపాముద్ర వెనక్కి తిరిగి చూసింది.

“నాథా! మనం ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక క్షేత్రాన్ని చూడాలని వచ్చాము. ఇప్పుడు వెళ్తుంటే... ఏదో మనలో వదిలిపెట్టి, మనసు నిండుగా వెళ్తున్నట్లుంది,” అన్నది.


అగస్త్యుడు చిరునవ్వు నవ్వి, “అదే తల్లి ప్రసాదం లోపాముద్రా!” అన్నాడు.

“ఏమిటది నాథా?” అన్నది లోపాముద్ర.

“తల్లి మన చేతిలో ఏదో ఒక వస్తువును పెట్టి పంపాల్సిన పనిలేదు. కొన్నిసార్లు ఆమె మన హృదయంలో పేరుకుపోయిన భారాన్ని తీసుకుపోతుంది.” అన్నాడు అగస్త్యుడు

“ఏమి తీసుకుపోతుంది?” అని అడిగింది లోపాముద్ర.

“భయం, అహంకారం, ‘నేనే చేశాను, నా అంతటివాడు లేడు’ అనే భావాన్ని తీసుకుపోతుంది.” అని చెప్పాడు అగస్త్యుడు

“మరి దానికి బదులుగా ఏమిస్తుంది నాథా?” అనడిగింది లోపాముద్ర.


//“‘అమ్మ ఉంది’ అనే ఒక్క తిరుగులేని నమ్మకాన్ని ఇస్తుంది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే ” అన్నాడు అగస్త్యుడు//


ఆ మాట విన్న లోపాముద్ర కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆమె చేతులు జోడించి వెనక్కి తిరిగి కరవీర మహాలక్ష్మికి నమస్కరిస్తూ “అమ్మా! మేము నీ వద్దకు వచ్చి ఎన్నో విషయాలు అడగాలని అనుకున్నాము. నువ్వు మాత్రం మేము ఏమీ అడగకుండానే మా హృదయాన్ని పరిపూర్ణమైన శాంతితో నింపావు,” అని వేడుకుంది.


అగస్త్యుడు మృదువుగా “తల్లిని దర్శించిన తర్వాత మనం కోరుకున్నది లభించిందా లేదా అని చూడకూడదు; మన ఆలోచనల్లో మార్పు వచ్చిందా లేదా అని చూసుకోవాలి. అదే నిజమైన దర్శనఫలం,” అన్నాడు.


---


కరవీరపురంలో వెలసిన కొల్హాపుర మహాలక్ష్మి కథ అందుకే కేవలం ఒక రాక్షసుని సంహారగాథ కాదు.

అది అహంకారం చివరి క్షణంలో శరణాగతిగా మారిన కథ.

అది ఒకేసారి తల్లి చేతిలోని శక్తిని, అదే చేతిలోని కరుణను రెండింటినీ చూపించిన కథ.

అది ఒక మహర్షి కళ్లలో తల్లి దివ్యరూపాన్ని నిలిపిన కథ.

అది ఒక భక్తురాలి హృదయంలో “నీవే చాలు” అనే భావాన్ని మేల్కొల్పిన కథ.

అందుకే కొల్హాపురానికి వెళ్లే ప్రతి భక్తుడు తల్లి ముందు నిలబడి ఒక్కసారైనా “అమ్మా! నేను ఎన్నో అడగడానికి వచ్చాను. కానీ ఇప్పుడు ఏమి అడగాలో తెలియడం లేదు. నా గురించి నాకంటే నీకే బాగా తెలుసు. నాకు నీవు ఇవ్వదలచుకున్నదే ఇవ్వు. నాలోంచి నీవు తీసివేయవలసినదేదైనా ఉంటే తీసివేయి. కానీ నీ స్మరణను మాత్రం నా హృదయం నుంచి ఎన్నడూ దూరం చేయకు తల్లీ!” అని ప్రార్థించాలి. అలా మనసారా వేడుకోగలిగిన క్షణంలో, భక్తుని ప్రార్థనకు మాటలతో పని ఉండదు.


అమ్మ చూస్తుంది.

అమ్మ వింటుంది.

అమ్మ అర్థం చేసుకుంటుంది.

ఎందుకంటే...


అమ్మ ముందు పలికిన వేయి మాటల కంటే,

అమ్మ ముందు రాలిన ఒక్క కన్నీటి బొట్టుకే ఎక్కువ భాష ఉంటుంది... ఎంతో అర్థం ఉంటుంది!


దీనార్తిభీతం భవతాపపీడితం ధనైర్విహీనం తవ పార్శ్వమాగతం!

కృపానిధిత్వాన్మమ లక్ష్మి సత్వరం ధనప్రదానాద్ధన్నాయకం కురు!!

మాం విలోక్య జనని హరిప్రియే నిర్ధనం త్వత్సమీపమాగతం!

దేహి మే ఝటితి లక్ష్మి కరాగ్రం వస్త్రకాంచనవరాన్నమద్భుతం!!

త్వమేవ జననీ లక్ష్మి పితా లక్ష్మి త్వమేవ చ!

భ్రాతా త్వం చ సఖా లక్ష్మి విద్యా లక్ష్మి త్వమేవ చ!!

త్రాహి త్రాహి మహాలక్ష్మి త్రాహి త్రాహి సురేశ్వరి!

త్రాహి త్రాహి జగన్మాతర్దరిద్రాత్త్రాహి వేగతః!!

నమస్తుభ్యం జగద్ధాత్రి నమస్తుభ్యం నమో నమః!

ధర్మాధారే నమస్తుభ్యం నమః సంపత్తిదాయినీ!!

దరిద్రార్ణవమగ్నోఽహం నిమగ్నోఽహం రసాతలే!

మజ్జంతం మాం కరే ధృత్వా సముద్ధర త్వం రమే ద్రుతం!!

కిం లక్ష్మి బహునోక్తేన జల్పితేన పునః పునః !

అన్యన్మే శరణం నాస్తి సత్యం సత్యం హరిప్రియే!!



కరవీరంలో కొలువైన అంబాబాయీ!

శ్రీమహావిష్ణు హృదయకమలవాసినీ!

కొల్హాసురుని అహంకారాన్ని సంహరించి, అతని చివరి శరణాగతిని కూడా కరుణతో స్వీకరించిన తల్లీ!

మా హృదయంలోని అహంకారాన్ని తొలగించు.

మా చేతిలో సంపద ఉంటే దానికి ధర్మాన్ని జోడించు.

మా జీవితంలో సుఖం ఉంటే దానికి వినయాన్ని జోడించు.

మా జీవితంలో కష్టం వస్తే దానికి ధైర్యాన్ని జోడించు.

మా కోరికలు నెరవేరకపోయినా, నీపై నమ్మకం సడలిపోని హృదయాన్ని ప్రసాదించు.

సూర్యుడు తన కిరణాలను నీ సన్నిధిలో సమర్పించినట్లే, మేమూ మా జీవితాన్నంతటినీ నీ పాదపద్మాల వద్ద సమర్పించగలిగే సద్బుద్ధిని ఇవ్వు తల్లీ.

మా చేతిలో పూజకు పువ్వు లేకపోయినా ఫర్వాలేదు,

మా ఇంట్లో భౌతిక ఐశ్వర్యం లేకపోయినా ఫర్వాలేదు,

మా కోరికలన్నీ తీరకపోయినా ఫర్వాలేదు...

కానీ నీ పాదాలను మరచిపోని భక్తిని మాత్రం మాకు ఎల్లప్పుడూ ప్రసాదించు.

అదే మా మహాలక్ష్మి.

అదే మా అసలైన ఐశ్వర్యం.


లక్ష్మీర్భూషయతే రూపం లక్ష్మీర్భూషయతే కులం!

లక్ష్మీర్భూషయతే విద్యాం సర్వాల్లక్ష్మీర్విశిష్యతే!!


జయ జయ కరవీరవాసినీ!

జయ జయ కొల్హాపుర మహాలక్ష్మీ!

జయ జయ అంబాబాయి!

జయ జయ శ్రీమాత!


జయదుర్గే శివదుర్గే హరదుర్గే

అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే!


జయ జయ జయ జయ కామాక్షీ!

జయ జయ జయ జయ కామాక్షీ!


— శంకరకింకరః (శ్రీ అయ్యగారి నాగేంద్ర కుమార్)


Thursday, August 13, 2026

శ్రీమాత లీలామృతం -5 (అభిరామి భట్టార్ — అమ్మపై నమ్మకం)

శ్రీగురుమూర్తే త్వాం నమామి కామాక్షి.


//సాన్నిధ్యం కురు కళ్యాణీ మమ పూజాగృహే శుభే

బింబే దీపే తథా పుష్పే హరిద్రా కుంకుమే మమ!!


ఓ కళ్యాణీ! శుభప్రదమైన నా పూజాగృహంలో, నేను పూజించే బింబంలో, దీపంలో, పుష్పంలో, పసుపులో, కుంకుమలో నీ సాన్నిధ్యాన్ని ప్రసాదించు.//


కావేరీ నదీమతల్లి సాగరసంగమానికి అడుగులు వేసే పవిత్రమైన చోళమండల తీరాన, సముద్రపు చల్లని గాలులు వేదమంత్రాల గుసగుసలతో ముచ్చటించే ఒక దివ్యక్షేత్రం ఉంది. అదే 'తిరుక్కడైయూర్'. చూడ్డానికి అదొక చిన్న పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న పట్టణంగానే తోచవచ్చు; కానీ ఆ నేల యుగయుగాలుగా పరమభక్తుల పాద ధూళితో, వారి ఆర్ద్రతనిండిన కన్నులనుండి జాలువారిన స్వచ్చమైన అశ్రుబిందువులతో, అగ్నిహోత్రాల భస్మంతో, పునీతమైన తపస్సుతో, వేద ఘోషలతో, మంత్ర జపాలతో కలగలిసిన భక్తి రససిద్ధమైన పుణ్యరేణువుల సమాహారమని బోధపడుతుంది. 


నాదస్వర శ్రుతిలో, గర్భగుడి నీరాజనాల వెలుగులో అక్కడ శతాబ్దాల - సహస్రాబ్దాల భక్తిపరిమళం తెలుస్తూనే ఉంటుంది. ఆ క్షేత్రంలో, ఆయుష్షును ప్రసాదించే అమృతఘటేశ్వరుడు ఒకవైపైతే, సమస్త విశ్వాన్ని తన కరుణాకటాక్షంతో బ్రోచే జగన్మాత అభిరామి అమ్మవారు మరొకవైపు కొలువై ఉంటారు. మృత్యుదేవతనే శాసించిన మార్కండేయుని మృత్యుంజయ గాథకు, అమ్మవారి అనుగ్రహాన్ని అమృతకావ్యంగా మలిచి తన మరణశిక్షను పోగొట్టుకున్న అభిరామి భట్టార్ చిత్తశుద్ధికి ఆ తిరుక్కడైయూర్ అమరసాక్షిగా నిలిచింది.


పూర్వం మృకండు మహర్షి, మరుద్మతి దంపతుల నిష్కామ తపస్సుకు ప్రసన్నుడైన పరమేశ్వరుడు అల్పాయుష్కుడైనా జ్ఞాననిధియైన కుమారుడు కావాలా, లేక దీర్ఘాయుష్కుడైనా అజ్ఞానియైన సంతానం కావాలా అని అడిగినప్పుడు, వారు జ్ఞానానికే పట్టంగట్టారు. అలా లభించిన సత్పుత్రుడే మార్కండేయుడు. పదహారేళ్ల పసివయసులోనే కాలం ముంచుకొస్తున్నా, ఆ బాలుని భక్తి చలించలేదు. యముడు పాశంతో ఎదురుగా నిలిచిన వేళ, భయంతో వణకిపోక, గర్భగుడిలోని శివలింగాన్ని పెనవేసుకుని 'మహాదేవా!' అని ఆక్రందన చేశాడు, చన్ద్రశేఖరమాశ్రయే మమకింకరిష్యతి వై యమః అని ధిక్కరించాడు. భక్తుడి ఆక్రందనకు శివుడు సాకారమై లింగం నుంచి కాలాంతకుడిగా ఉద్భవించి యముణ్ణి నిగ్రహించిన పరమ పవిత్రస్థలమిది. కాల గమనాన్ని మార్చగల శక్తి ఒక్క దైవభక్తికే ఉందనే అక్షరసత్యానికి ఈ నేల తొలి తార్కాణం అనవచ్చు.


కాలచక్రం తిరిగింది. మృత్యువును జయించిన ఆ శివక్షేత్రంలోనే, అమ్మవారి ప్రేమతో కాలపు చీకట్లను వెన్నెలగా మార్చి తన మృత్యువును దాటిన మరో అద్భుత ఘట్టానికి కావేరీ తీరం వేదికైంది. అక్కడ, ఆలయ అర్చకత్వమే జీవితంగా భావించే "అమృతలింగ అయ్యర్" ఇంట ఒక ముద్దులొలికే బాలుడు జన్మించాడు. అతడి పేరు "సుబ్రహ్మణ్య అయ్యర్" అని పెట్టారు. 


సూర్యోదయానికంటే ముందే మేల్కొనే ఆ ఇంట, పాలు త్రాగే వయసు నుంచే అతనికి మంత్రోచ్చారణలు, గుడిలోని నాదస్వర విన్యాసాలు, ధూపదీపాల పరిమళాలు ఆశ్చర్యమైన అనుభవాలుగా మారి అతణ్ణాకర్షించాయి. పసిపిల్లలు ఆటబొమ్మల కోసం ఆరాటపడితే, ఈ బాలుడు మాత్రం గర్భగుడిలోని దివ్యదీప కాంతుల వైపు, అభిరామి అమ్మవారి నయనాల వైపు అమాయకంగా, నిశ్చలంగా చూస్తూ ఉండిపోయేవాడు. "అమ్మా! నన్ను ఎందుకు అలా చూస్తున్నావు?" అని చిరు పెదవులతో మురిసిపోతుంటే, ఆ తండ్రి అమృతలింగ అయ్యర్ తన కొడుకులో అసాధారణమైన భక్తిబీజాన్ని గమనించాడు. ఆయన ఆ బాలుడికి కేవలం వేదశాస్త్రాలు, సంగీతసాహిత్యాలే కాదు, దేవీతత్వాన్ని గుండెల్లో నింపుకునే అనురాగాన్ని కూడా దీక్షా పరంగా వారసత్వంగా అందించాడు.


సుబ్రహ్మణ్యుడి బాల్యం దాటి యౌవనంలోకి అడుగుపెడుతున్న కొద్దీ, అతని విద్య అంతా అమ్మవారి పాదాల చెంత సమర్పించే సుగంధ పుష్పంగా మారిపోయింది. లోకం చూపులో సిరిసంపదలు, హోదాలు కోరుకునేవిగా కనిపిస్తే, సుబ్రహ్మణ్యుడి కళ్లకు మాత్రం అభిరామి అమ్మవారి కిరీటంలో మెరిసే చిన్న రత్నం సమస్త విశ్వం కన్నా అందంగా కనిపించేది. ఆ తల్లి చిరునవ్వు అతనికి వెన్నెల ప్రవాహంలా, ఆ కరుణాకటాక్షం పాపాలను కడిగే గంగాలా అనిపించేవి. క్రమంగా అతని భక్తి ఒక దివ్యానుభూతిగా మారడంతో, బాహ్య ప్రపంచంతో అతనికి సంబంధ తెగిపోయింది. గర్భగుడి ముందర నిలబడి దేవితో ఏకాంతంగా సంభాషించేవాడు; హఠాత్తుగా ఆనందబాష్పాలు రాల్చేవాడు; మరుక్షణంలోనే జగన్మాతతో అమాయకంగా నవ్వుతూ మాట్లాడేవాడు. 


చంద్రమండల మధ్యస్థే మహాత్రిపుర సుందరి

శ్రీ చక్ర రాజనిలయే అభిరామి నమోస్తుతే!


ఈ లోకంలో లౌకిక కొలమానాలతో మనుష్యులనుకూడా కొలిచే వారికి అతడొక 'పిచ్చివాడిలా' కనిపించాడు. కానీ, అహంకారాన్ని వదిలేసి దైవంలో నిశ్శబ్దంగా లీనమైన ఆ చిత్తమే అమ్మవారి దృష్టిలో నిజమైన అమృతత్వమని వారికి బోధపడలేదు.


ఇలాంటి సమయంలోనే, తంజావూరు మహారాజు శరభోజి-2 /సర్ఫోజి-2 తిరుక్కడైయూర్ ఆలయ సందర్శనానికి వచ్చాడు. రాజపరివారం, అధికారులు, జనులు గౌరవప్రపత్తులతో నమస్కరిస్తుంటే, సుబ్రహ్మణ్య అయ్యర్ మాత్రం ఆ ఆడంబరాన్ని, పటాటోపాన్ని ఆ సమూహాన్ని చూడ ఇచ్చగించలేదు. అతని కంటిపాపల్లో కేవలం జగజ్జనని అభిరామి దేవి పూర్ణరూపమే ప్రకాశిస్తోంది. అంతరాలయంలో విడిగా ఒక మూల కూర్చుని నవ్వుతూ అమ్మతో ఏదో మాట్లాడుకుంటున్నాడు.

 

అది గమనించిన సర్ఫోజీ "ఇతడెవరు?" అని ప్రశ్నించగా, కొందరు ప్రాపంచికులు "ఇతనికి పిచ్చి పట్టింది" అని సుబ్రహ్మణ్యం గురించి నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. సర్ఫోజీ అతని వద్దకు వచ్చి చూస్తే అతని కళ్లలో గొప్పతేజస్సు గోచరమైంది, పరిక్షించే ఉద్దేశంతో—"ఓయ్ భట్టర్! ఈ రోజు ఏ తిథి?" అని అడిగాడు. అది అమావాస్య రాత్రికి ముందు సమయం. కానీ, ఆ క్షణంలో సుబ్రహ్మణ్యుడి అంతరంగంలో అమావాస్య చీకట్లు లేవు; అమ్మవారి దివ్యప్రసన్న ముఖారవిందమనే కోటి సూర్యచంద్రుల వెలుగులు విరబూస్తున్నాయి. ఆ అమ్మవారిని చూసి నవ్వుతూ మాట్లాడుకునే భావావేశంలో, తానెక్కడున్నాడో మరిచి, నోరుజారి "ఈ రోజు పౌర్ణమి" అని నవ్వుతూ పలికాడు.


సర్ఫోజీకి  తనను భట్టర్ గేలి చేస్తున్నాడనే భావన కలిగి తీవ్రమైన ఆగ్రహం వచ్చింది. "అమావాస్య నాడు పౌర్ణమి అని నాతోనే బొంకుతావా! నీ మాట నిజమైతే ఈ రాత్రి నింగిలో నిండు చంద్రుడు ఉదయించాలి. లేదంటే నిన్ను అగ్నికుండంలో తగలేసి ప్రాణదండన విధిస్తాను" అని అరిచి తన అధికారులకు తగు ఉత్తరువులిచ్చి ఏర్పాట్లకై ఆజ్ఞాపించాడు. 


ఆసాయంత్రం, అధికారులు ఒక గొయ్యి తీసి, కింద రగిలే అగ్నిజ్వాలలు ప్రజ్వరిల్లుతుండగా , దానిపై వంద తాళ్లతో అల్లిన పీఠంపై సుబ్రహ్మణ్యుడిని వేలాడదీశారు. సుబ్రహ్మణ్య భట్టర్ అమ్మవారిని గురించి స్తుతించి పౌర్ణమి చంద్రుణ్ణి తెప్పించాలి అలా నూరు పద్యాలకి అవకాశం ఇచ్చారు. ఆ అమావాస్యరాత్రిపూట పౌర్ణమి చంద్రుడు కనిపించే వరకూ ప్రతీ పద్యానికి ఒక తాడు చొప్పున కోసివేస్తూ, వంద పద్యాలు పూర్తయ్యేలోపు చంద్రుడు రాకపోతే అగ్నికి ఆహుతి చేయడమే రాజశిక్ష! సూర్యుడు అస్తమించాడు. కాలమేఘాల్లాంటి నల్లటి అమావాస్య చీకటి లోకాన్ని ఆవరించింది. కానీ అగ్నిజ్వాలల మధ్య వేలాడుతున్న భట్టర్ హృదయంలో మాత్రం అచంచలమైన భక్తి అఖండదీపమై వెలుగుతోంది. భయం అతని ఛాయలకు కూడా రాలేదు. తానొక భౌతికదేహమనే స్పృహే అతనికి లేదు; అతనికి ఉన్నదల్లా 'అమ్మ నన్ను వీడదు' అన్న విశ్వాసం అదే కొండంత అండ. 


తన ఆర్తిని, అమ్మవారి దివ్యరూపాన్ని అక్షర మాలికలుగా అల్లుతూ ఆ అగ్నిగుండం సాక్షిగా అతడు గళమెత్తాడు. ఒక పద్యం చివరి పదం, తదుపరి పద్యానికి మొదలయ్యే 'అంతాది' శైలిలో కవిత్వ ధార అమృత ప్రవాహంలా జాలువారింది. అందులోనే పుట్టుకొచ్చింది అమరకావ్యం 'అభిరామి అంతాది'. అలా ఒక్కొక్క తాడు తెగుతుండగా, అమ్మవారి దివ్యసౌందర్యాన్ని తన హృదయఫలకంపై నిలుపుకుంటూ 78వ పద్యాన్ని గానం చేశాడు:


సెప్పుం కనక కలశముం పోలుం తిరుములైమేల్

అప్పుం కళభ అభిరామ వల్లీ, అణి తరళక్

కొప్పుం, వయిరక్ కుళైయుం, విళియిన్ కొళుంగడైయుం,

తుప్పుం, నిలవుం ఎళుదివైత్తేన్, ఎన్ తుణై విళిక్కే.


"బంగారు కలశాలవలె శోభిల్లే నీ దివ్య వక్షస్థలానికి పూసిన సుగంధ చందన పరిమళాలు, చెవులకు మెరిసే ముత్యాల ఆభరణాలు, వజ్రఖచిత కుండలాలు, కరుణను వర్షించే నీ దివ్య నయనాల చూపులు, పగడాలవంటి నీ దంతకాంతులు, పెదవులపై నటించే చంద్రబింబంలాంటి మృదువైన చిరునవ్వు—ఇవన్నీ నా నేత్రాలకు, నా హృదయంలో అమరచిత్రంలా లిఖించుకున్నానమ్మా!" అని తన్మయత్వంతో అమ్మ రూపాన్ని కొనియాడాడు. ఆపై, ఏమాత్రం చలించని అనన్య శరణాగతితో 79వ పద్యంలోకి అడుగుపెట్టాడు:


విళిక్కే అరుళుండు, అభిరామ వల్లిక్కు, వేదం సొన్న

వళిక్కే వళిపడ నెంజుండు ఎమక్కు, అవ్వళి కిడక్క,

పళిక్కే సుళన్రు, వెం పావంగళే సెయ్దు, పాళ్ నరకక్

కుళిక్కే అళుందుం కయవర్ తమ్మోడు, ఎన్న కూట్టు ఇనియే?


"ఓ అభిరామవల్లీ! నీ దివ్య నేత్రాలలో అపారమైన కరుణ నిండి ఉంది. వేదాలు మార్గనిర్దేశం చేసిన దివ్య పథంలో శ్రీవిద్యామార్గంలో నిన్ను నిశ్చలమైన హృదయంతో ఆరాధించే భాగ్యం నాకు దక్కింది. అంతటి దివ్యమార్గం నా కళ్లముందు వెలుగుతుండగా, అధికారమదంతో, అధర్మపు దారుల్లో తిరుగుతూ, పాపకూపాల్లో పడి, నరకానికి చేరువయ్యే దుర్మార్గుల సాంగత్యంతో నాకేమి పని తల్లీ?" అంటూ తన సర్వస్వాన్నీ దేవి పాదాల చెంత ఆత్మనివేదన చేసుకున్నాడు. ఆ పద్యంలో 'నేను గొప్ప భక్తుడిని' అనే అహంకారం లేదు; 'తల్లి పాదాలు తప్ప ఈ లోకపు నిందలు, శిక్షలు నాకేమీ కావు. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే...' అన్న సంపూర్ణ శరణాగతి మాత్రమే ప్రస్ఫుటమైంది.


అది 79వ తాడు తెగిపడే క్షణం! అగ్నిజ్వాలల వేడి అతడి పాదాలను తాకుతోంది. జనుల గుండెల్లో ఆందోళన, అయ్యో అనే బాధ. సరిగ్గా అదే సమయంలో సన్నాయి, భజంత్రీలు మ్రోగాయి, ఆకాశంనుండి తూర్యఘోషలు వినిపిస్తుండగా, అమ్మవారి ఆలయంలో మహామంగళ నీరాజనాలు అకస్మాత్తుగా మొదలైయ్యాయి..  దేవీ కరుణ భూమ్యాకాశాలను ఏకం చేస్తూ భక్తపరాధీనతను చాటిచెప్పింది. గర్భగుడిలోని అభిరామి అమ్మవారు తన చెవికున్న రత్నఖచిత తాటంకాన్ని (కమ్మను) తీసి ఆకాశంలోకి విసిరింది. ఆ తాటంకం గగనతలంలో నిలిచి, అమావాస్య కటిక చీకట్లను పటాపంచలు చేస్తూ, నిండు పౌర్ణమి చంద్రబింబంలా ప్రకాశించింది! రాత్రికి రాత్రే అమావాస్య ఆకాశం కాస్తా వెన్నెల సముద్రమై మునిగిపోయింది. ఆ అద్భుతాన్ని చూసిన రాజు శరభోజి  భట్టార్ పాదాలపై పడి క్షమాపణలు కోరాడు. కానీ భట్టార్ కళ్లలో గెలుపు గర్వం లేదు; "ఇది నా పాండిత్యం కాదు, ఇది నా తల్లి వాత్సల్యం!" అంటూ ఆనందభాష్పాలతో అమ్మవారి పాదాలకే ప్రణమిల్లాడు. నాటి నుండి అతడు 'అభిరామి భట్టార్' గా జగత్ప్రసిద్ధుడయ్యాడు.


తిరుక్కడైయూర్ క్షేత్రం మనకు రెండు గొప్పసత్యాలను నొక్కిచెబుతుంది. ఒకవైపు, మృత్యుంజయుడైన శివుడు మార్కండేయుని కోసం కాలాన్ని ఆపి భక్తుడి ఆయుష్షును శాశ్వతం చేశాడు; మరొకవైపు, జగన్మాత అభిరామి దేవి తన భక్తుడి నోటి మాటను సత్యం చేయడానికీ, మృత్యువునుండి కాపాడడానికీ విశ్వంలోని కాలనియమాన్నే నియమాన్నే ఏమార్చి అమావాస్యను పౌర్ణమిగా మార్చింది. 


భక్తి అంటే కేవలం పూజలు చేయడం, ఆచారాలు పాటించడం మాత్రమే కాదు.

సర్వస్వాన్నీ కోల్పోయే పరిస్థితి ఎదురైనా "నా తల్లి నన్ను చేయివిడవదు" అని అచంచలమైన విశ్వాసంతో నిలబడటమే నిజమైన భక్తి. 

అభిరామి భట్టార్ హృదయంలో వెలిగిన ఆ అంతరంగ పౌర్ణమి కాంతి, యుగాలు మారినా, తరాలు గడిచినా మానవజాతికి భగవద్బక్తి, జగదంబ ప్రేమయొక్క సాధికారతను చాటిచేప్తూ దివ్యజ్యోతిలా వెలుగుతూనే ఉంటుంది!


అభిరామి అమ్మవారి పాదాలే శరణం

అమృతఘటేశ్వర స్వామి పాదాలే శరణం

జయ మార్కండేయ మహర్షి 

జయ అభిరామి భట్టార్


అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే

జయ దుర్గే శివ దుర్గే హర దుర్గే


జయ జయ జయ జయ్ కామాక్షి

జయ జయ జయ జయ కామాక్షి


- శంకరకింకరః (శ్రీ అయ్యగారి నాగేంద్ర కుమార్)

Wednesday, August 12, 2026

పండితుల పుత్రులు

 కేచిత్ పండితపుత్రాః శుణ్ఠాః,

కేచిచ్చ మూర్ఖాః భవంతి!
కొందరు పండితుల పుత్రులు శుంఠలు మరికొందరి పండితుల పుత్రులు మూర్ఖులు...
తాతలు ​తండ్రులు గొప్ప పండితులు, జ్ఞానులు అయినంత మాత్రాన వారి పిల్లలందరూ పండితులు కావలసిన అవసరం లేదు. కొందరు ఏమాత్రం పరిజ్ఞానం లేని మొద్దులుగా మారితే, మరికొందరు మంచిచెడుల విచక్షణ, వివేకం లేని మూర్ఖులుగా తయారవుతారు.
"మూర్ఖుడు కాశీ కెళ్ళినా, గాడిద తీర్థం కెళ్ళినా... వాళ్ల బుద్ధి మారదు" అని తెలుగు నానుడి పెద్దలు ఊరికెనే చెప్పలేదు.
-శంకరకింకరః

మూర్ఖస్య నాస్త్యౌషధమ్

 "మూర్ఖస్య నాస్త్యౌషధమ్" - మూర్ఖుడికి, మూర్ఖత్వానికి ఏ శాస్త్రంలోనూ మందు లేదు.

శక్యో వారయితుం జలేన హుతభుక్, ఛత్రేణ సూర్యాతపో
నాగేంద్రో నిశితాంకుశేన సమదో, దండేన గౌర్గర్దభః!
వ్యాధిర్భేషజ సంగ్రహైశ్చ వివిధైర్మన్త్రప్రయోగైర్విషం
సర్వస్యౌషధ మస్తి శాస్త్ర విహితం,"మూర్ఖస్య నాస్త్యౌషధమ్"!!
అగ్నిని నీటితో ఆర్పవచ్చు.
ఎండవేడిని గొడుగుతో తప్పించుకోవచ్చు.
మదించిన ఏనుగును అంకుశంతో అదుపు చేయవచ్చు.
ఆవునైనా, గాడిదనైనా, ఏ పశువునైనా కర్రతో అదుపులోపెట్టవచ్చు.
వ్యాధులకు వివిధ ఔషధాలు ఉన్నాయి.
విషానికి కూడా విరుగుడు ఉంది.
కానీ...
తనకు తెలియకపోయినా తెలుసన్న అహంకారంతో, మంచి మాట వినకుండా, సత్యాసత్యాలు తెలియకుండా అన్నీ తనకే తెలుసుననే కుపాండిత్యం ఉన్న "మూర్ఖుడిని మార్చడానికి మాత్రం ఈ శాస్త్రంలో ఏ ఔషధమూ లేదు."
ప్రతి సమస్యకూ ఒక పరిష్కారం ఉంటుంది. కానీ సత్యాసత్య విచారాన, సమయాసమయ సందర్భం లేని, మంచి సలహా వినని, అహంకారంతో ఉండే మూర్ఖత్వానికి మందు లేదు. ఆ ముర్ఖుడిని ఎవరూ బాగు చేయలేరు

బృందావన కథలు – 50 (స్వామి హరిదాస్)

జయ శ్రీరాధేకృష్ణ!

లోకంలో గాయకులనేకులు
ధనాన్ని కోరేవారుంటారు...
కీర్తిని కోరేవారుంటారు...
సుఖసంతోషాలను కోరేవారుంటారు.
రాజుల మెప్పును కోరేవారుంటారు...
కానీ...
తన గానంతో దేవుడినే తన వద్దకు రప్పించిన భక్తుడు ఒకరున్నారు!
ఆయనకు సంగీతం కేవలం ఒక కళ కాదు - అది ఒక ఆరాధన.
ఆయనకు రాగం ఒక స్వర సమ్మేళనం కాదు.
అది రాధాశ్యాముల పాదపద్మాలకు సమర్పించిన పుష్పం.
ఆయనకు తంబురా మీటే ఒక వాద్యపరికరం కాదు.
అది ఆయన హృదయంతో పలికించే ప్రార్థన.
ఆ మహాభక్తుడు బృందావన నికుంజాలలో తన ప్రాణనాథుడైన శ్రీకృష్ణుని కోసం పాడిన సిద్ధపురుషుడు సంగీత సమ్రాట్ "స్వామి హరిదాస్!"
---
బృందావనం...
యమున ఒడ్డున వెన్నెల పరుచుకుంది.
కదంబ వృక్షాలు మౌనంగా నిలబడి ఉన్నాయి.
నిధివనంలోని తీగలు గాలికి ఊగుతూ, ఏదో రహస్యాన్ని ఒకదానికొకటి చెప్పుకుంటున్నాయి.
ఎక్కడో ఒక కోయిల కుహూ రాగాలు, నెమళ్ల ఖ్రేంకణాలు...
“రాధే... రాధే...” అంటున్నట్లు వినిపిస్తున్నాయి.
అ ప్రాంతంలోనే ఒక చిన్న కుటీరం.
ఆ కుటీరం అతి సాధారణం, వైభోగాలు ఏం లేవు.
బంగారు సింహాసనాలు లేవు.
వెండి పాత్రలు లేవు.
సేవకులు లేరు.
ప్రముఖంగా ఉన్నది ఒక్కటే ఒక పాత తంబురా...
వినపడుతున్నది ఒక్కటే రాధానామం...
కనిపిస్తున్నది ఒక్కటే శ్యామసుందరునిపై అంతులేని ప్రేమ.
స్వామి హరిదాస్ తన గానాన్ని ఎవరికో వినిపించడానికి పాడేవారు కాదు.
ఆయన పాడేది తనకు కనిపిస్తున్న రాధేశ్యామసుందరుని కోసం!
అందుకే ఆయన గానం విని మనుషులే కాదు ప్రకృతే పరవశించేది.
---
ఒకరోజు అక్బర్ చక్రవర్తి తన ఆస్థాన గాయకుడు తాన్సేన్ గానం విని ముగ్ధుడయ్యాడు. “తానసేన్! నీ గానంలో ఇంత మాధుర్యం ఉంటే, నీకు ఈ సంగీతం నేర్పిన గురువు గానం ఇంకెంత అద్భుతంగా ఉండాలి! ఆయనను నా ఆస్థానానికి తీసుకురా. నేను ఆయన గానం వినాలి.” అని అన్నాడు.
తాన్సేన్ సన్నగా నవ్వి “రాజా! నా గురువుగారు బృందావనంలో ఉంటారు. ఆయన రాజుల కోసం పాడరు. బంగారం కోసం పాడరు. కీర్తి కోసం పాడరు. ఆయనకు ఉన్న ఒకే ఒక్క ప్రముఖ శ్రోతఉన్నాడు ఆయనకోసమే పాడతారు మా గురువుగారు, ఆ ప్రముఖ శ్రోత నికుంజ బిహారి శ్రీకృష్ణుడు. మీరు నిజంగా ఆయన గానం వినాలనుకుంటే... రాజుగా వెళ్లకండి. ఒక భక్తుడిగా వెళ్లండి.” అని చెప్పాడు
అక్బర్ ఆ మాటను ఆశ్చర్యపోయి సరే చూద్దాం అని బయలుదేరాడు.
రాజవస్త్రాలను విడిచాడు.
రాజభటులను దూరంగా ఉంచాడు.
సామాన్య భక్తుని వేషంలో తాన్సేన్వెంట బృందావనానికి బయలుదేరాడు.
నిధివన సమీపంలో స్వామి హరిదాస్ తన సాధనలో ఉన్నారు.
తాన్సేన్ తన గురువు నమస్కరించి పక్కన కూర్చున్నాడు. అదిగమనించిన స్వామి హరిదాస్ తాన్సేన్ ను పాడమన్నారు. తాన్సేన్ అద్భుతంగా పాడసాగాడు. మధ్యలో ఒక స్వరాన్ని తప్పుగా ఆలపించాడు...
ఆ క్షణం స్వామిహరిదాస్ తలెత్తి చూసి ఆపమన్నట్లు సైగ చేసారు.
తంబురాను చేతిలోకి తీసుకున్నారు.
ఒక్కసారి శ్రుతిని సరిచేసి.
గానం మొదలు పెట్టారు.
ఆ రాగ తాళ స్వరాల లయ విన్యాసం...
చుట్టూ ఉన్న భక్తులందరి హృదయాలను కరిగించింది.
మరో స్వరం, మరో రాగం, మరో గానం...
అది యమునా అలలపై సున్నితంగా తేలుతున్న ఆకులా అందరి మనసులలో ఊగుతోంది.
మరో రాగం విరిసింది.
అది కదంబ పుష్పాల పరిమళంలా నిధివనమంతా వ్యాపించింది.
కోయిల తన గానాన్ని ఆపింది.
నెమలి తన నాట్యాన్ని ఆపింది.
యమునా ప్రవాహం సైతం నెమ్మదించినట్లు అనిపించింది.
తాన్సేన్ తలవంచాడు.
అక్బర్ కళ్లను మూసుకున్నాడు.
ఆయన చెంపలపై కన్నీటి బిందువులు జారాయి.
"అది సంగీతం కాదు - అది భక్తి స్వస్వరూపం."
గానం ముగిసిన తరువాత అక్బర్ నిశ్శబ్దంగా నిలబడ్డాడు.
కొంతసేపటికి తాన్సేన్ వైపు తిరిగి “ఇంతటి గానం నేను ఎప్పుడూ వినలేదు. నువ్వు ఇంత అద్భుతంగా పాడగలిగితే, నీ గురువు గానం నీకంటే ఎందుకు ఇంత గొప్పగా ఉంది? అంత గొప్పగా నువ్వెందుకు పాడలేకపోతున్నావు” అని అన్నాడు
తాన్సేన్ చిరునవ్వు నవ్వి
“షెహన్ షాహ్! నేను మీ కోసం పాడుతాను.
నా గురువుగారు సమస్తలోకాలకీ షెహన్ షాహ్ ఐన శ్రీకృష్ణుని కోసం పాడుతారు.
మీరు నా గానానికి బహుమతి ఇస్తారు.
కానీ నా గురువు గానానికి స్వయంగా శ్రీకృష్ణుడు తనను తానే అర్పించుకుంటాడు.” అన్నాడు.
ఔను ఆమాట సత్యం, గతంలో కొంత కాలం క్రితం జరిగిందదే!
స్వామి హరిదాస్ గానం చేసేటప్పుడు కొన్నిసార్లు ఎవరో ఎదురుగా నిలబడి ఉన్నట్లుగా చిరునవ్వేవారు.
ఎవరో అదృశ్య అతిథితో మాట్లాడుతున్నట్లుగా కనిపించేవారు.
భక్తులకు, శిష్యులకు ఆశ్చర్యంగా ఉండేది, ఆయనలో ఆయనే ఏమైనా మాట్లాడుకుంటున్నారా లేక నిజంగానే దివ్య స్వరూపాలేమైనా ఆయనకు కనపడుతున్నాయా అని సందేహించేవారు.
ఒకరోజు ధైర్యం చేసి “గురుదేవా! అక్కడ ఎవరూ లేరు కదా? మీరు ఎవరితో మాట్లాడుతున్నారు?” అని అడిగారు
స్వామి హరిదాస్ నవ్వి...
“ఎవరితోనా?
నా శ్యాముడితో!
పక్కనున్న రాధమ్మతో!
మీకు కనిపించడంలేదా?” అని అడిగారు.
శిష్యులు ఒకరినొకరు చూసుకున్నారు.
వారికి ఏమీ కనిపించలేదు.
స్వామి హరిదాస్ మాత్రం మళ్లీ తన గానంలో మునిగిపోయారు.
ఆయనకు కనిపించేది ఏదో అదృశ్య స్వరూపం కాదు "మన కళ్లకు కనిపించని సత్యం" .
“గురుదేవా! మీరు దర్శిస్తున్న ఆ దివ్యరూపాన్ని మాకూ చూపించండి.” అని శిష్యులు రోజూ ప్రార్థించసాగారు.
ఒకరోజు అదే అదే విషయం అడిగారు శిష్యులు. ఆ కోరిక విని స్వామి హరిదాస్ కొంతసేపు మౌనంగా ఉన్నారు.
తరువాత శిష్యులను వెంటబెట్టుకుని నిధివనంలోని ఒక పవిత్ర ప్రదేశంలో ఆసీనులయ్యారు.
తంబురాను చేతిలోకి తీసుకున్నారు.
కళ్లను మూసి
“రాధే...”
మరోసారి...
“శ్యామా...”
ఈసారి...
“రాధే... శ్యామా...”
అంటూ నామాన్ని రాగయుక్తంగా పాడసాగారు...
ఆ స్వరం నిధివనాన్ని తాకింది.
కదంబ వృక్షాలను తాకింది.
యమునను తాకింది.
ఆకాశాన్ని తాకింది.
అప్పుడు..
ఒక అపూర్వమైన పరిమళం వ్యాపించింది.
వెన్నెల మరింత తెల్లగా మారింది.
గాలి ఒక్కసారిగా నిశ్చలమైంది.
శిష్యులు కళ్లెత్తి చూశారు.
అక్కడ...
రాధారాణి!
ఆమె పక్కన...
శ్యామసుందరుడు!
వర్ణించలేని సౌందర్యం.
చూడలేనంత మాధుర్యం.
శిష్యుల నోటి నుంచి మాట రాలేదు.
కళ్ల నుంచి మాత్రం కన్నీళ్లు ఆగలేదు.
స్వామి హరిదాస్ మాత్రం వారిని చూసి ఆశ్చర్యపడలేదు.
ఎందుకంటే ఆయనకు వారు కొత్తవారు కాదు.
ప్రతిరోజూ తన గానంలో ఆయన వారినే పిలిచేవారు. వారిముందే, వారికోసమే పాడేవారు.
ఆ రోజు మాత్రం
బృందావనం మొత్తం స్వామి హరిదాస్ కి శ్రీ యుగళం ఇచ్చే దర్శనానికి సాక్షిగా నిలిచింది.
స్వామి హరిదాస్ తన గానం ఆపి చేతులు జోడించి
“ప్రభూ!
మీరు నా కోసం వచ్చారు.
కానీ నా కోరిక నా కోసం కాదు.
ఈ కలియుగంలో ప్రతి ఒక్కరికీ ఇలాంటి దివ్యదర్శనం సాధ్యం కాదు.
నా బృందావనానికి వచ్చే ప్రతి దీనుడికీ...
ప్రతి కన్నీటి భక్తుడికీ...
ప్రతి నామస్మరణ చేసే హృదయానికీ...
మీ కరుణ లభించాలి.
మీరు ఇక్కడే ఉండండి.
మమ్మల్ని విడిచి వెళ్లవద్దు.” అని కోరాడు
రాధారాణి చిరునవ్వు నవ్వింది.
శ్యామసుందరుడు తన భక్తుని వైపు చూశాడు.
ఆ దివ్యరూపాలు క్రమంగా ఒకదానిలో ఒకటి లీనమయ్యాయి.
రాధా...
శ్యామ...
రెండు రూపాలు...
ఒకే మాధురమైన రూపంగా మారాయి.
ఆ రూపమే "శ్రీ బాంకే బిహారీ!"
అది కేవలం ఒక మూర్తి ప్రకటింపబడడం కాదు.
భక్తి పిలిస్తే భగవంతుడు వస్తాడనే సత్యానికి బృందావనం ఇచ్చిన సజీవ సాక్ష్యం.
కాలం గడిచింది స్వామి హరిదాస్ బాంకే బిహారీలో లీనమైయ్యారు.
ఆయన సంగీతం ముగిసింది...
కానీ గానం ఇంకా వినిపిస్తూనే ఉంది
ఈరోజు కూడా నిధివనం వైపు గాలి వీచినప్పుడు...
చాలా జాగ్రత్తగా చెవులు రిక్కించి భక్తితో వింటే ఎవరికైనా వినిపించవచ్చు..
ఆ తంబురా నాదం...
ఆ మృదువైన ఆలాపన...
ఆ హృదయాన్ని కట్టేసే కృష్ణ నామ గానం...
“రాధే... శ్యామా...”
అది స్వామి హరిదాస్ గానమో...
యమునా అలల గుసగుసో...
బృందావనపు గాలి పలికే నామమో...
విడిగా చెప్పడం కష్టం?
కానీ ఒక విషయం మాత్రం నిజం...
భగవంతుణ్ణి స్వార్థం లేకుండా ప్రేమించిన హృదయానికి,
భగవంతుడు ఎప్పుడూ దూరంగా ఉండడు.
ఆయనను వెతకడానికి అడవులకు వెళ్లవలసిన అవసరం లేదు.
ఆయనను చూడటానికి కళ్లను మూసుకోవలసిన అవసరం లేదు.
ఒక్కసారి హృదయం నిజంగా “రాధే... శ్యామా...” అని పిలిస్తే చాలు.
ఎందుకంటే...
భక్తుడు దేవుణ్ణి పిలిచినప్పుడు,
దేవుడు రావాలా వద్దా అని ఆలోచించడు.
భక్తుని ప్రేమే ఆయనకు ఆహ్వానం.
భక్తుని హృదయమే ఆయనకు బృందావనం.
---
బృందావన కథలకు మంగళం
ఇలా యభై వ కథతో మన “బృందావన కథలు” యాత్ర ప్రస్తుతానికి ముగుస్తోంది.
కళ్ళతోచూసిన పదాలు మనసులోకి చేరి నిశ్శబ్దమవుతాయి.
పుస్తకాల్లో దూరి పుటలు మూసుకుపోతాయి.
కథలన్నీ ముగుస్తాయి, ఎవరి గాథలైనా కంచికే చేరతాయి.
ఐతే...
బృందావనం ఎప్పుడూ భక్తులకై తెరిచే ఉంటుంది.
రాధానామం మాత్రం ఆగదు.
యమున ప్రవహిస్తూనే ఉంటుంది.
కదంబాలు ఊగుతూనే ఉంటాయి.
నిధివనం తన రహస్యాన్ని దాచుకుంటూనే ఉంటుంది.
బాంకే బిహారీ తన మధురమైన చిరునవ్వుతో భక్తులను కాస్తూనే ఉంటాడు.
మనం ఈ కథలను చదివింది కేవలం గతాన్ని తెలుసుకోవడానికి కాదు.
మన హృదయంలో ఒక చిన్న బృందావనం నిర్మించుకోవడానికి.
అక్కడ...
కోపానికి చోటుండకూడదు.
అహంకారానికి చోటుండకూడదు.
ద్వేషానికి చోటుండకూడదు.
ఉండవలసింది ఒక్కటే—
రాధా...
కృష్ణా...
అనే రెండు నామాలు.
ఆ రెంటిమధ్య ఉండే ప్రేమ...
చివరగా...
మన జీవితంలో ఎన్నో జన్మలు గడిచినా,
ఎన్నో మార్గాలు తిరిగినా,
ఎన్నో సాధనలు చేసినా,
నిత్యం మన శ్వాసలో ఖచ్చితంగా
“రాధే... కృష్ణా...”
అనే నామం ఉండాలి.
అప్పుడు...
మన హృదయం కూడా బృందావనమే.
మన కన్నీరు కూడా యమునే.
మన నిశ్వాసం కూడా వేణునాదమే.
మన జీవితం కూడా...
రాధాశ్యాముల పాదపద్మాలకు ఒక చిన్న సేవే!
గట్టివాడవని పట్టితి నీ చేయి
పట్టి విడువరాదు కృష్ణా!
పుట్టినప్పటినుండి పుణ్యములెరుగను
పాపపు పనులే చేసితిని అట్టే
నా కర్మము అణచగ జాలక
పట్టితి నీ పాద పద్మములు కృష్ణా!
గట్టివాడవని పట్టితి నీ చేయి
పట్టి విడువరాదు కృష్ణా!
ఎన్ని జన్మలనో ఎత్తి అలసితిని
ఇకనైనా నన్ను బ్రోవగదే
అన్యమెరుగని దాసుడనయ్యా
నన్ను నీ దరి చేర్చుకోరాదా కృష్ణా!
గట్టివాడవని పట్టితి నీ చేయి
పట్టి విడువరాదు కృష్ణా!
ఈకృతితో మంగళం చెప్పుకుంటూ
జయ శ్రీరాధే!
జయ శ్రీకృష్ణ!
జయ బృందావన్!
రాధే రాధే!
- శంకరకింకరః (శ్రీ అయ్యగారి నాగేంద్ర కుమార్)

చంద్ర సాచివ్యం - సుందరకాండ, రాసపంచాధ్యాయీ

 చంద్ర సాచివ్యం - సుందరకాండ, రాసపంచాధ్యాయీ

వాల్మీకి మహర్షి రచించిన సుందరకాండ 5వ సర్గలో, లంకలోకి ప్రవేశించిన ఆంజనేయస్వామికి ఆ రాత్రి చంద్రుడు అపూర్వమైన సహకారం అందిస్తాడు. తన శీతల కిరణాలను సర్వత్రా విరజిమ్మి, ప్రతి వీధిని, ప్రతి గృహాన్ని, ప్రతి దారిని స్పష్టంగా దర్శనమిచ్చేలా చేస్తాడు. సీతామాత అన్వేషణకు బయలుదేరిన హనుమంతునికి ఆ చంద్రప్రకాశమే మార్గదర్శిగా నిలుస్తుంది.
హంసో యథా రాజతపఞ్జరస్థః - సింహో యథా మన్దరకన్దరస్థః!
వీరో యథా గర్వితకుఞ్జరస్థః - చన్ద్రోఽపి బభ్రాజ తథామ్బరస్థః!!
(వాల్మీకి రామాయణం, సుందరకాండ 5వ సర్గ)
వెండి పంజరంలో ఉన్న హంసవలె, మందరపర్వత గుహలోని సింహంవలె, గర్విత గజంపై ఆసీనుడైన వీరునివలె, ఆకాశంలో చంద్రుడు అపూర్వ కాంతితో ప్రకాశించాడు.
తదనంతరం చంద్రుని శీతల కాంతి జగత్తును ఎలా ప్రకాశింపజేసిందో మహర్షి ఇలా వర్ణిస్తారు...
ప్రకాశచన్ద్రోదయ నష్టదోషః - ప్రవృత్త రక్షః పిశితాశ దోషః!
రామాభిరామేరిత చిత్తదోషః - స్వర్గప్రకాశో భగవాన్ ప్రదోషః!!

(వాల్మీకి రామాయణం, సుందరకాండ 5వ సర్గ)
చంద్రోదయంతో రాత్రి చీకట్లు తొలగిపోయాయి. చంద్రుని నిర్మల కాంతి సమస్త దిక్కులను ప్రకాశింపజేసి, సీతాన్వేషణకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించింది. ఈ చంద్రకాంతి కేవలం ప్రకృతిలోని వస్తువులను ప్రకాశింపజేయలేదు; హనుమంతుని కార్యసిద్ధికి సహాయకంగా మార్గదర్శకంగా నిలిచింది.
అదేవిధంగా, శ్రీమద్భాగవతం దశమ స్కంధంలోని రాసపంచాధ్యాయి (29-33 అధ్యాయాలు)లో, వేణునాదాన్ని ఆలకించి పరమప్రియుడైన శ్రీకృష్ణుని అన్వేషించేందుకు గోపికలు రాత్రివేళ బృందావనంలోకి ప్రవేశిస్తారు. ఆ సందర్భంలో కూడా వ్యాసమహర్షి శరద్ పూర్ణిమ చంద్రుని నిర్మల కాంతిని ఎంతో రమణీయంగా వర్ణిస్తారు.
భగవానపి తా రాత్రిః శరదోత్ఫుల్లమల్లికాః |
వీక్ష్య రన్తుం మనశ్చక్రే యోగమాయాముపాశ్రితః ||
(శ్రీమద్భాగవతం 10.29.1)
"శరదృతువులో వికసించిన మల్లెల పరిమళాలతో నిండిన ఆ పూర్ణిమ రాత్రిని దర్శించిన శ్రీకృష్ణుడు, యోగమాయను ఆశ్రయించి రాసలీలకు సంకల్పించాడు."
ఈ రెండు మహాగ్రంథాలలోనూ ఒక అద్భుతమైన అంతరార్థం దాగి ఉంది.
ఇక్కడ వెతుకుతున్నవారు సాధకులు.
వెతకబడేది పరమాత్మ.
ఎటువైపు నడవాలో, ఏ మార్గంలో సాగాలో, ఏమి గ్రహించాలో స్పష్టంగా చూపించే వెలుగే గురువు.
అజ్ఞానతిమిరాన్ధస్య జ్ఞానాఞ్జనశలాకయా !
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః !!
"అజ్ఞానాంధకారంలో మునిగిన శిష్యునికి జ్ఞానాంజనం అద్ది దృష్టిని ప్రసాదించేవాది గురువు."
సుందరకాండలో హనుమంతుడు లంకలోని గృహాలను పరిశీలిస్తూ, రత్నఖచిత కిటికీలను, వాటి అలంకారాలను ఎంతో నిశితంగా దర్శిస్తాడు.
భాగవతంలో గోపికలు శ్రీకృష్ణుని వెతుకుతూ వస్తున్నప్పుడు, ఆయన ముఖారవిందాన్ని, ముఖ్యంగా చెవులలో ఊగిసలాడుతున్న మకరకుండలాలను పరమాత్మ దగ్గరకు వచ్చేవారికి దారిచూపడానికి ఊగుతున్నాయా అన్నట్లు వ్యాసమహర్షి మనోహరంగా వర్ణిస్తారు.
మనిషి ముఖానికి ద్వారం నోరైతే, చెవులు జ్ఞానానికి కిటికీలు.
చెవుల ద్వారానే శ్రుతి, అంటే వేదం, మనలోకి ప్రవేశిస్తుంది.
రత్నాలతో అలంకరించిన కిటికీలు, మకరకుండలాలు - వేదాభరణాలు, వేదానికి ఆభరణం వేద విహిత ఆచరణకు సంకేతాలు.
వేదానికి ఆభరణం వేదవిహిత కర్మాచరణ, అదే జ్ఞానానికి పరమాత్మను పొణ్దడానికి మార్గం.
---
సుందరకాండలో హనుమంతుడు లంకలో సంచరిస్తూ ఎన్నో రకాల సాధకులను దర్శిస్తాడు. ఎవరో అగ్నిహోత్రం నిర్వహించడంలో నిమగ్నులై ఉంటారు. ఎవరో జపమాలను చేతబట్టి, దర్భకట్టలు మంత్రాలు చేస్తుంటారు. పూర్తిగా కర్మకాండలో లీనమై ఉంటారు.
ప్రతి ఒక్కరి మార్గం వేరు. ప్రతి ఒక్కరి సాధన వేరు. హనుమంతుడు మాత్రం వారందరినీ గమనిస్తూ, తన లక్ష్యమైన సీతామాత అన్వేషణను కొనసాగిస్తాడు.
అదేవిధంగా భాగవతంలో గోపికలందరూ బృందావనంలో శ్రీకృష్ణుని అన్వేషణలో పరుగులు తీస్తుంటారు. వారు ఒకరిని ఒకరు చూడరు; ఎవరి సాధనను వారు గమనించరు. ఎవరు ముందున్నారు, ఎవరు వెనుక ఉన్నారు అనే భావమే వారికి లేదు.
ఎందుకంటే
పరమాత్మను చేరే మార్గంలో పోటీ ఉండదు.
పోలిక ఉండదు.
ప్రతి సాధకుని ప్రయాణం అతనిదే.
నాయమాత్మా ప్రవచనేన లభ్యో
న మేధయా న బహునా శ్రుతేన!
యమేవైష వృణుతే తేన లభ్యః !!
(కఠోపనిషత్ 1.2.23)
"ఆత్మతత్త్వం వాక్చాతుర్యంతో కాదు, మేధస్సుతో కాదు, వినికిడితో మాత్రమే కాదు; తనను ఆశ్రయించినవారికి మాత్రమే పరమాత్మ తనను తాను అనుగ్రహిస్తాడు."
అందుకే వ్యాస వాల్మీకులిద్దరూ ఈ రెండు ఘట్టాలూ ఒకే విధంగా చెప్పారు.
సాధన మార్గాలు అనేకం కావచ్చు.
సాధకులు ఎందరో కావచ్చు.
ఎలాగైతే ఎవరి ఆకలి వారిదే,
ఎవరి నిద్ర వారిదే,
ఎవరి అనుభవం వారిదే... అదేవిధంగా...
కానీ, సాధకుల అంతిమ గమ్యం ఒక్కటే "పరమాత్మను పొందడం"
ఆ గమ్యానికి దారి చూపి, ఆ మార్గంలో నడిపించే "చంద్రకాంతి - స్వగురుకృపయే", ఆ ప్రయాణాన్ని సార్థకం చేసేది నిరంతర సాధన.
"గురుకృపా హి కేవలం - శిష్య పరమ మంగళం."
- శంకరకింకరః