జై గురు దత్త! జై గురు దత్త!
భక్తవత్సలా! మాం పాహి!
సహ్యాద్రి పర్వతాల సమీపంలో ఒక పట్టణం ఉండేది.
ఆ పట్టణంలో సోమశర్మ అనే గొప్ప పండితుడు నివసించేవాడు.
వేదాలు...
ఉపనిషత్తులు...
పురాణాలు...
శాస్త్రాలు...
ఏది అడిగినా అతనికి సమాధానం తెలుసు, అన్నీ అంత అవపోశన పట్టాడు. దేశం నలుమూలల నుండి ప్రజలు వచ్చి అతనితో శాస్త్రచర్చలు చేసేవారు. అతని పాండిత్యానికి అందరూ ఆశ్చర్యపోయేవారు.
కాలక్రమేణా ఆ జ్ఞానం, పాండిత్యం వల్ల అతనికి వినయం నిలవకపోగా అహంకారం చేరడం మొదలైంది. రాను రానూ తనకు తెలియనిదిలేదనే అహంకారం తారాస్థాయికి చేరింది.
"నాకంటే ఎక్కువ తెలిసినవాడు ఈ భూమిపై లేడు." అనే భావన అతని హృదయంలో బలపడింది.
ఎపుడైనా ఎవరైనా ఏ సాధువుపుంగవులు, యోగులు, అవధూతుల గురించి చెప్పినా వెటకారంగా నవ్వేవాడు. "చదువు సంధ్యా లేని వాళ్ళు అడవుల్లో తిరుగుతారు. వారికి జ్ఞానం ఏముంటుంది?" అని ఎగతాళి చేసేవాడు.
ఒక నాడు తమ తీర్థయాత్రలోభాగంగా ఆ పట్టణానికి వచ్చి బసచేసిన యాత్రికుల సత్సంగం చేస్తూ దత్తాత్రేయ స్వామి మహిమలను వివరిస్తున్నారు. "సహ్యాద్రి అరణ్యంలో ఒక అవధూత సంచరిస్తున్నాడు. ఆయన సామాన్యుడు కాదు. సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి." అన్నారు.
అది విన్న సోమశర్మ నవ్వాడు "ఈ రోజుల్లో కూడా ఇలాంటి కథలు నమ్మేవాళ్ళు ఉన్నారా?" అన్నాడు.
అప్పుడు ఒక వృద్ధ భక్తుడు లేచి "పండిత మహాశయా! మీరు ఆయనను కలవండి. మీ సందేహాలు అన్నీ తీరిపోతాయి." అన్నాడు.
ఆ మాటలు సోమశర్మ మనసును తాకాయి. అలాగే తన అహంకూడా రేగింది "చూద్దాం. ఆ అవధూత ఎంత గొప్పవాడో." అనుకుని మరుసటి రోజు సహ్యాద్రి సాణువుల్లోని అడవికి బయలుదేరాడు.
చాలా సేపు, ప్రయాణించి, అన్ని లోయలు, కోనలు వెతికిన తరువాత ఒక పెద్ద మర్రిచెట్టు క్రింద కూర్చున్న ఒక అవధూత కనిపించాడు.
చిరిగిన వస్త్రాలు.
చెరిగిన జుత్తు, బవిరిగడ్డం,
దాదాపు దింగబర స్వరూపం.
చుట్టూ నాలుగు వేట కుక్కలు.
పక్కనే కామధేనువులా ప్రకాశిస్తున్న ఆవు.
ముఖంలో అపారమైన ప్రశాంతత.
సోమశర్మ ఆ అవధూత దగ్గరకు వెళ్లి నమస్కారం కూడా చేయకుండా నిర్లక్ష్యంగా "నువ్వేనా ఆ గొప్ప అవధూత?" అనడిగాడు.
అవధూత చిరునవ్వు నవ్వాడు "ప్రజలు అలా అంటున్నారు నాయనా. నేనేంటో ఎవరెరుగు?"అన్నాడు.
"నీకేమైనా వేదాలు తెలుసా?" అని పండితుడు అడిగాడు.
"విన్నాను" అంటూ తనచుట్టూ ఉన్న నాలుగు వేటకుక్కలను నిమిరాడు.
"ఉపనిషత్తులు?"
"విన్నాను."
"షడంగాలు - శాస్త్రాలు?"
"అవికూడా"
"బ్రహ్మసూత్రాలు?"
"అవీనూ."
ఆ సమాధానాలు విని సోమశర్మ నవ్వేశాడు. "అంటే నీకు ఏమీ తెలియదన్న మాట." అన్నాడు.
అవధూత ప్రశాంతంగా అతని వైపు చూశాడు.
"నాయనా... నీకు ఈ లోకంలో అత్యంత గొప్ప జ్ఞానం ఏదో తెలుసా?" అని అడిగాడు.
"వేదజ్ఞానం." అని గర్వంగా చెప్పాడు పండితుడు.
"కాదు." అన్నారు అవధూత.
"అయితే?" అనడిగాడు సోమశర్మ
"తనకు తెలియనిది తెలుసుకోవడం." అన్నారు అవధూత.
సోమశర్మకు కోపం వచ్చింది. "నువ్వు నన్నే పరీక్షిస్తున్నావా?" అని గద్దించాడు.
అవధూత నవ్వాడు. "లేదు. ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను. నువ్వు వేదాలు, శాస్త్రాలు చదివావు కదా?"
"అవును."
"వేదాలు చదివిన 'నీవు' ఎవరు?" అనడిగాడు అవధూత
సోమశర్మ ఆశ్చర్యపోయాడు "నేనే." అన్నాడు.
"ఆ 'నేను' ఎక్కడ ఉంది?" అన్నాడు అవధూత
పండితుడు వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు.
"శరీరమా?" అన్నాడు
"కాదు. శరీరం మారిపోతుంది కదా." అన్నాడు అవధూత
"మనసా?" అన్నాడు పండితుడు
"కాదు. మనసు ప్రతి క్షణం మారుతోంది కదా." అదెలా చదువుతుంది అన్నాడు
"బుద్ధియా?" అన్నాడు పండితుడు
"కాదు. జ్ఞాపకాలు కూడా మారుతున్నాయి." అన్నాడు అవధూత
సోమశర్మ మౌనంగా నిలబడ్డాడు. ఇంత సులభమైన ప్రశ్నకు తాను సమాధానం చెప్పలేకపోతున్నాడని గ్రహించాడు.
అవధూత మళ్లీ "నాయనా... వేదశాస్త్రాలన్నీ చివరికి ఒకే విషయాన్ని బోధిస్తాయి. ఆ 'నేను' ఎవరో తెలుసుకోమని." అన్నాడు.
"కానీ నీవు పుస్తకాలను మాత్రమే చదివావు. నిన్ను నీవు చదవలేదు." ఆ మాటలు పిడుగులా పండితుడి హృదయంలో పడ్డాయి.
అతను జీవితాంతం శాస్త్రాలు చదివాడు. కానీ తనను తాను తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు.
అతని కళ్లలో కన్నీళ్లు తిరిగాయి.
"స్వామీ! అయితే నేను ఇప్పటి వరకు ఏమి నేర్చుకున్నాను?" అని అడిగాడు.
అవధూత ప్రేమగా నవ్వాడు. " వేద శాస్త్ర జ్ఞానం నేర్చుకున్నావు. కానీ జ్ఞానానికి ద్వారం అయిన వినయాన్ని మర్చిపోయావు, ఆ జ్ఞానాన్ని నీ అనుభవంలోకి తెచ్చుకోలేదు." అని అన్నాడు.
"అహంకారం వచ్చిన క్షణం నుంచి జ్ఞానం చీకటిగా మారుతుంది.
వినయం వచ్చిన క్షణం నుంచి జ్ఞానం వెలుగవుతుంది."
అప్పుడు ఒక్కసారిగా అవధూతుని రూపం మారడం ప్రారంభించింది.
మూడు ముఖాలు ప్రకాశించాయి.
చుట్టూ దివ్యకాంతి వ్యాపించింది.
నాలుగు కుక్కలు నాలుగు వేదాల ప్రతీకలుగా వెలిగాయి.
కామధేనువు దివ్యరూపంతో దర్శనమిచ్చింది.
సోమశర్మ ఆశ్చర్యంతో నేలపై పడిపోయాడు.
"దత్తాత్రేయ స్వామీ! పాహిమాం! పాహిమాం" అని కన్నీళ్ళు కారుతుండగా గట్టిగా చెప్తూ నేలమీద పడ్డాడు.
దత్త స్వామి ఆశీర్వదిస్తూ "నాయనా! పుస్తకాల్లోని జ్ఞానం మనిషిని పండితుణ్ని చేస్తుంది. వినయంతో కూడిన జ్ఞానం మనిషికి దాన్ని అనుభవంలోకి తెచ్చి ఋషిని చేస్తుంది."అన్నారు.
"ఎప్పుడూ గుర్తుంచుకో... తెలిసినదానికంటే తెలియనిది అనంతం." అని చెప్పి అంతర్ధానమయ్యారు.
---
ఆ రోజు నుండి సోమశర్మ పూర్తిగా మారిపోయాడు.
పాండిత్యాన్ని ప్రదర్శించడం మానేశాడు.
వినయాన్ని అలవర్చుకున్నాడు.
శాస్త్రాలను బోధించే ముందు భక్తిని బోధించసాగాడు.
అతను ఎప్పుడూ
"అహంకారం ఉన్న చోట దత్తుడు ఉండడు.
వినయం ఉన్న చోట దత్తుడు స్వయంగా నివసిస్తాడు." అని చెప్తూ తన పాండిత్యాన్ని, జ్ఞానాన్ని అందరికీ పంచి దత్తజ్ఞానాన్ని పొంది చివరిలో దత్తునిలోలీనమైయ్యాడు.
---
పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానం వస్తుంది.
కానీ వినయం లేకపోతే ఆ జ్ఞానం అహంకారంగా మారుతుంది.
అహంకారం పెరిగినప్పుడు మనిషి సత్యానికి దూరమవుతాడు.
వినయం పెరిగినప్పుడు దైవానికి దగ్గరవుతాడు.
అహంకారం జ్ఞానాన్ని నాశనం చేస్తుంది.
వినయం జ్ఞానాన్ని పరిపూర్ణం చేస్తుంది.
జై గురు దత్త! జై గురు దత్త!
భక్తవత్సలా! మాం పాహి!
-శంకరకింకరః
No comments:
Post a Comment