Pages

Friday, July 31, 2026

బృందావన కథలు – 46 (రామానంద రాయ – గోదావరి తీరంలోని రసతత్త్వ సంభాషణ)

జయ శ్రీరాధేకృష్ణ!

గోదావరి నది...
సాయంత్రపు సంధ్యారుణ కిరణాలు నదీతరంగాలపై నాట్యం చేస్తున్నాయి. ఆ నదీ తరంగాలపై పడ్డ కిరణాలు ఆ నీటికి బంగారు తాపడాన్ని అద్దినట్లు మెరుస్తున్నాయి. మెల్లగా వీచే గాలి ఒడ్డున ఉన్న తోటల్లోని పువ్వుల స్వచ్ఛమైన పరిమళాన్ని మోసుకొస్తోంది. నది ఒడ్డున ఉన్న ఊరిలోని వేదపారాయణ చేస్తున్న పండితులు నిత్యకర్మానుష్ఠానలకై ఉద్యుక్తులౌతున్న విషయం తెలుపుతూ వేదఘోషలు సాయం సంధ్యాసమయంలోకి క్రమంగా తగ్గుతూ కలిసిపోతుండగా, ప్రకృతి అంతా ఏదో దివ్యసంగమానికి సిద్ధమవుతున్నట్లు అనిపించింది.
ఆ సమయంలో...
బంగారువర్ణంతో ప్రకాశించే ఒక సన్యాసి గోదావరి తీరానికి వచ్చారు. ఆయన కన్నులలో అపారమైన కరుణ, ముఖంలో దివ్యమైన ప్రశాంతత.
ఆయనేశ్రీకృష్ణచైతన్య మహాప్రభు.
అదే సమయంలో...
ఒరిస్సా రాజు ప్రతాపరుద్రుని రాజ్యంలో ఉన్నతాధికారిగా ఉన్నప్పటికీ, తన అంతరంగంలో శ్రీరాధాకృష్ణుల ప్రేమరసంలో మునిగిపోయిన ఒక మహాభాగవతుడు అక్కడికి వచ్చాడు.
ఆయనేరామానంద రాయ.
ఇద్దరు మహానుభావులూ ఒకరినొకరు చూడగానే...
బాహ్యంలో చూసినవారికి తొలిసారి కలిసిన వారిలా కనిపించినా, అంతరంగంలో యుగయుగాల స్నేహితులు కలుసుకున్న విధంగా ఆనందం ఉప్పొంగింది.
రామానంద రాయ వినమ్రంగా నమస్కరించగానే, మహాప్రభువు వెంటనే లేచి ఆయనను ఆలింగనం చేసుకున్నారు.
ఆ క్షణంలో...
ఇద్దరి కన్నుల నుండి ప్రేమాశ్రువులు జాలువారాయి. అది చూస్తున్న భక్తులకు జరుగుతున్నది అర్థం కాలేదు. "ఒక సన్యాసి... ఒక రాజోద్యోగిని ఎందుకింత ప్రేమగా ఆలింగనం చేసుకున్నాడు?" అని ఆశ్చర్యపోయారు.
కానీ...
ఆ ఇద్దరి హృదయాలలో మాత్రం శ్రీరాధాకృష్ణుల ప్రేమరసం జీవనదియైన గోదావరీ నది నీటిలా ప్రశాంతంగా నిరంతరం పొంగి పొరలుతూనే ఉంది .
ఆ సాయంత్రం...
గోదావరి తీరంలోని ఇసుకపై ఇద్దరూ కూర్చున్నారు. మహాప్రభువు చిరునవ్వుతో "రాయా! జీవునికి పరమసాధ్యం ఏమిటి? దానిని ఎలా పొందాలి?" అని అడిగారు.
రామానంద రాయ ఎంతో వినయంతో సమాధానం చెప్పసాగారు. మొదట వర్ణాశ్రమధర్మం గురించి చెప్పాడు. మహాప్రభువు తల ఊపి
"ఏహో బాహ్య, ఆగే కహ ఆర్... ఇది ఇంకా బాహ్యమే... ఇంకా లోతైన తత్త్వాన్ని చెప్పు రాయా!." అన్నారు.
ఆ తర్వాత కర్మార్పణం, జ్ఞానం, వైరాగ్యం, భక్తి...ప్రతి మెట్టును రామానందుడు వివరించగా, మహాప్రభువు మళ్లీ మళ్లీ... "ఇది కూడా ఇంకా పూర్తికాదు... ఇంకా చెప్పు..." అని ప్రోత్సహించారు.
ఆ సంభాషణ ఒక ప్రశ్నోత్తరంలా కాదు...
ఒక హృదయం మరొక హృదయంలో దాగిన ప్రేమను వెలికితీస్తున్న గొప్ప సంవాదంలాగా ఉంది.
చివరకు...
రామానంద రాయ గంభీరంగా "జ్ఞానమూ కాదు... యోగమూ కాదు... స్వార్థరహితమైన శుద్ధభక్తియే పరమసాధ్యం.
ప్రేమ-భక్తి సర్వ-సాధ్య-సార్" "ప్రేమభక్తియే సమస్త సాధ్యాలకు సారభూతం." అని సమాధానం చెప్పారు.
అప్పుడు మహాప్రభువు ముఖంలో సంతోషం వికసించింది. "ఇంకా వివరించు... రాయా!" అని అన్నారు.
రామానందుడు ఇప్పుడు గోపికాభక్తిని వివరింస్తూ "భగవంతుణ్ణి భర్తగా, ప్రియుడిగా, ప్రాణసఖుడిగా ప్రేమించిన గోపికల ప్రేమకు సమానం మరొకటి లేదు.
గోపీ-భావామృతే యార లోభ హయ, వేద-ధర్మ త్యజి సే కృష్ణే భజాయ - గోపీభావామృతంపై లోభం కలిగినవాడు, బాహ్య ఆచారాలకే పరిమితం కాక, శ్రీకృష్ణుని అనన్యభక్తితో సేవిస్తాడు." అన్నాడు.
మహాప్రభువు కన్నులు మూసుకున్నారు. రామానంద రాయుని ఆ మాటలు వినగానే ఆయన శరీరం ఆపాదమస్తకం పులకించింది.
ఐనా... ఇంకా ఆయన ఆగలేదు. "దానికంటే గొప్పది ఏదైనా ఉందా?" అని అడిగారు.
రామానంద రాయ ఒక్క సారి కళ్ళు మూసుకొని...
ఆర్ధ్రతపొందిన స్వరంతో "ఉంది... అది... ’శ్రీరాధాదేవి ప్రేమ!’"
కృష్ణుడినే తన ప్రేమకు బంధించిన ప్రేమ...
తన సుఖాన్ని కాదు... కృష్ణుని సుఖాన్నే కోరుకునే ప్రేమ...
ప్రేమకు పరాకాష్ఠ...
అదే రాధాభావం." అని చెప్పగానే...
మహాప్రభువు ఒక్కసారిగా లేచి "ఆహా! ఆహా! ఏమి రసతత్త్వ వర్ణన రామానంద రాయా!" అంటూ గాఢంగా ఆలింగనం చేసుకున్నారు.
ఒక తండ్రి తన పుత్రుని ఆలింగనం చేసుకున్నట్లు...
ఒక గురువు తన శిష్యుని ఆలింగనం చేసుకున్నట్లు...
ఆ సాయంత్రం...
గోదావరి జలాలు కేవలం నదీజలాలు కాదు...
రాధాకృష్ణుల ప్రేమరసాన్ని మోస్తున్న అమృతప్రవాహాలయ్యాయి.
ఆ తరువాత అనేక సంధ్యా సమయాలు, రాత్రులు...
చంద్రకాంతిలో ఇద్దరూ గోదావరి తీరాన కూర్చుని శ్రీరాధాకృష్ణుల నిత్యలీలలు, గోపికల భావాలు, ప్రేమరహస్యాలు, భక్తి యొక్క అంతిమస్వరూపం గురించి సంభాషించారు. ఆ సంభాషణలే తరువాత "రామానంద సంభాషణం" గా గౌడీయ వైష్ణవ సంప్రదాయం సాహిత్యంలో అమూల్యమైన రత్నంగా నిలిచాయి.
ప్రేమాఞ్జనచ్ఛురితభక్తివిలోచనేన
సన్తః సదైవ హృదయేషు విలోకయన్తి !
యం శ్యామసున్దరమచిన్త్యగుణస్వరూపం
గోవిన్దమాదిపురుషం తమహం భజామి !!
(బ్రహ్మసంహిత)
ప్రేమ అనే దివ్య అంజనాన్ని పూసుకున్న భక్తి నేత్రాలతో ఉన్న మహాత్ములు, శ్యామసుందరుడైన శ్రీగోవిందుణ్ణి తమ హృదయంలో ఎల్లప్పుడూ దర్శిస్తారు. అనంతమైన దివ్యగుణాల స్వరూపుడైన ఆ ఆదిపురుషుడైన గోవిందుణ్ణి నేను భజిస్తున్నాను.
మహాప్రభువు స్వయంగా తన శిష్యులతో "రసతత్త్వాన్ని ఇంత లోతుగా వివరించగలవాడు రామానంద రాయ తప్ప మరొకడు లేడు." అని అనేవారు.
---
భక్తి అనేది కేవలం ఆచారం కాదు.
కేవలం జ్ఞానం కాదు.
కేవలం పూజ కాదు.
ఒక తంతు కాదు.
తన ఆనందాన్ని మరచి, భగవంతుని ఆనందంలో జీవించే హృదయభావమే నిజమైన భక్తి.
గోదావరితీరంలో రామానంద రాయ పలికిన 'ప్రేమభక్తియే సమస్త సాధ్యాలకు సారము' అనే అమృతవాక్యం, ఈ రోజుకీ రాధాకృష్ణ భక్తుల హృదయాలలో ప్రేమదీపాన్ని వెలిగిస్తూనే ఉంది.
మనమూ రాధారాణి చరణరజస్సును ఆశ్రయించి...
"నాకు ఏమి కావాలి?" అని అడగకుండా,
"శ్రీకృష్ణునికి ఏది ప్రీతికరం?" అని ఆలోచించడం ప్రారంభించిన రోజు...
మన హృదయంలోనూ ఆ రాధాకృష్ణ భక్తిపూర్వక రసతత్త్వ గోదావరి జీవనదిలా ప్రవహించడం మొదలవుతుంది.
---
జయ శ్రీరాధే!
జయ శ్రీకృష్ణ!
జయ జయ బృందావన్!
- శంకరకింకరః (శ్రీ అయ్యగారి నాగేంద్ర)

Thursday, July 30, 2026

శ్రీమాత లీలామృతం – 4 (గంగయ్య శ్రీశైల ప్రదక్షిణ)

(శ్రీశైల ఖండంలో వర్ణించబడిన గిరిప్రదక్షిణ మహిమను, పూర్వం అక్కడ భక్తులు చెప్పుకునే ఒక దివ్యమైన కథను ఆధారం చేసుకుని అందించే ప్రయత్నం)

---
నల్లమల దట్టమైన అరణ్యాల నడుమ...
అపర కైలాసంగా,
జ్యోతిర్లింగంగా,
అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా,
అనేక కోటి దేవతలు నిత్యం సంచరించే దివ్య భూమిగా,
మహర్షులు, సిద్ధులు, యోగులు తపస్సు చేసిన మహాతపోభూమిగా,
చెంచు జాతి అమాయక భక్తి నుంచి పరమయోగుల సమాధి వరకు సమానంగా ఆలింగనం చేసుకునే కరుణామయ క్షేత్రంగా,
శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివారి శ్రీశైల మహాక్షేత్రం
జ్యోతిర్లింగ క్షేత్రంగా - శక్తిపీఠంగా శ్రీశైల మహాక్షేత్రం నిత్యవిభూతిగా వెలుగొందుతోంది..
ఈ దివ్య క్షేత్ర ప్రాశస్త్యం గురించి స్కాంద పురాణంలోని శ్రీశైల ఖండంలో విశేషమైన మహిమ వర్ణించబడింది.
శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబా మల్లికార్జునులే కాక, అక్కడ కొలువైన ప్రతి దేవీదేవతలూ, అంతెందుకు... చివరికి అక్కడి దివ్య వృక్షాలూ అనుగ్రహ వృష్టిని కురిపిస్తాయి. బ్రహ్మేంద్రోపేంద్ర స్కంద గణపత్యాదులతో సహా సమస్త దేవకోటి శ్రీశైల క్షేత్రంలో అమ్మవారు, స్వామివార్ల సేవకై దివ్య రూపాల్లో, మారు రూపాల్లో వచ్చి వెళ్తుంటారు.
శ్రీశైలే శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే!
శ్రీశైలంలో అమ్మవారు, అయ్యవారే కాదు... ఆ శ్రీ పర్వతం పర్వతంగానే అత్యంత మహిమాన్వితమైనది!
ఇక కథలోకి వెళ్దాం...
రాయలసీమలోని ఒక చిన్న పల్లెటూర్లో గంగయ్య అనే రైతు ఉండేవాడు. పెద్దగా చదువు లేదు, సాధారణ మధ్యతరగతి కుటుంబీకుడు. కానీ, అతని మనసులో ఎప్పుడూ భ్రమరాంబ మల్లికార్జునులపైనా, శ్రీశైల క్షేత్రంపైనా అచంచలమైన భక్తినమ్మకాలు ఉండేవి.
"నా తల్లిదండ్రులు భ్రమరాంబ తల్లి, మల్లికార్జున స్వాములే! నా ఇల్లు శ్రీశైలమే! వాళ్ల కోసం నేను ఒక్క అడుగు వేస్తే... వాళ్లు నాకోసం వంద అడుగులు వేస్తారు! ఆ జగజ్జననీజనకులు ఉండగా నాకేం తక్కువ!" అనే అచంచలమైన విశ్వాసంతో అతడు జీవించేవాడు.
పుణ్య స్థలంబులు పుణ్య వనంబులు వాటమైన పూదోటలు మిక్కిలి,
మాటలు నేర్చిన మంచి మృగంబులు కామధేనువులు కల్పవృక్షములు,
క్షేమ కరంబగు చింతామణులు అమృత గుండంబులు,
కడు నైష్ఠికమును కలిగిన విప్రులు విడువక శంభుని వేడెటి రాజులు,
సంతత లింగార్చన గల శైవులు శాంతులైన వేదాంతులు సిద్ధులు,
గణగణ మ్రోగెటి ఘంటనాదములు విజయ ఘోషయగు శంఖ నాదములు,
వీర శైవులు వీరాంగంబులు సాధు బృందములు కామిత భక్తులు అగరు ధూపములు,
జపములు చేసెటి జంగమోత్తములు తపములు చేసెటి తాపసోత్తములు....
కంటిని శ్రీగిరి కన్నుల నిండా... వింటిని మహిమలు వీనుల నిండా!
ఒకసారి శ్రీశైల యాత్రకు వెళ్లి అమ్మవారు అయ్యవార్ల దర్శనం చేసుకున్నాక సాయంత్రం అక్కడ ఒక మంటపంలో ఒక వృద్ధ సన్యాసి శ్రీశైల మాహాత్మ్యాన్ని, శ్రీగిరి ప్రదక్షిణ మహిమను అనుగ్రహ భాషణం చేస్తూ "శ్రీశైల పర్వతానికి అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణ చేసేవారికి అనంత యజ్ఞాలు చేసినంత పుణ్యం లభిస్తుంది. భక్తుడు వేసే ప్రతి అడుగూ పాపక్షయానికి, పీల్చే ప్రతి శ్వాసా మోక్షమార్గానికి సోపానమవుతుంది. భక్తులారా! గిరిప్రదక్షిణ అంటే కేవలం పర్వతం చుట్టూ నడవడం కాదు. అహంకారాన్ని విడిచిపెట్టి, వేసే ప్రతి అడుగులోనూ, ఆ కొండలో, అడవిలో, ప్రతి చెట్టు, పుట్ట, జంతువు, జీవిలో శివశక్తులను దర్శించడం... వారి దివ్యనామాన్ని స్మరిస్తూ ప్రదక్షిణం పూర్తిచేయడం!" అని చెప్పారు.
ఆ మాటలు గంగయ్య మనస్సులో గట్టిగా నిలిచిపోయాయి.
ఒక సంవత్సరం మాఘమాసంలో గంగయ్య శ్రీశైల క్షేత్రానికి రాయలసీమ వైపున ఉన్న శ్రీశైల ద్వారమైన సిద్ధవటం క్షేత్రానికి చేరుకున్నాడు. శ్రీశైలానికి వెళ్లే యాత్రికులు ప్రాచీనకాలంలో తప్పక దర్శించాల్సిన నాలుగు మహాద్వార క్షేత్రాలలో సిద్ధవటం దక్షిణ ద్వారంగా ప్రసిద్ధి పొందింది. అక్కడ దైవ దర్శనం చేసుకుని, శ్రీశైలానికి పయనమై కొండమీదికి చేరుకుని బయలు సాక్షిగణపతిని, వీరభద్రుని దర్శించుకున్నాడు.
(శ్రీశైల క్షేత్రానికి నాలుగు వైపులా నాలుగు దివ్య ద్వారాలు ఉన్నాయి 1) ఉమామహేశ్వరం, 2) అలంపురం జోగులాంబ, 3)సిద్ధవటం, 4) త్రిపురాంతకం. శ్రీశైలానికి ఎటువైపు నుంచి వెళ్లేవారు ఆ దిశలో ఉన్న ద్వార క్షేత్రాన్ని దర్శించుకుని, ఆ తర్వాత శ్రీగిరి చేరుకోవడం సంప్రదాయం.)
మరుసటి రోజు బ్రాహ్మీముహూర్తంలో లేచి, పాతాళగంగలో స్నానం చేసి, మడి వస్త్రాలు ధరించి, విభూతి పుండ్రాలు, కుంకుమ బొట్టు పెట్టుకున్నాడు. మనసులోనే భ్రమరాంబ అమ్మవారికి ప్రణమిల్లి, మల్లికార్జున స్వామి దివ్యనామాన్ని జపిస్తూ ప్రదక్షిణ ప్రారంభించాడు.
...పాతాళ గంగలో తెప్పున తేలుచు తీర్థంబాడుచు
చెలగుచు మడి వస్త్రంబులు కట్టితి అనువుగ నుదుట విభూతి ధరిస్తిని
పొలుపుగ మెడ రుద్రాక్షలు దాల్చితి గురు కటాక్షమును గోప్యము చేసితి
గురు మంత్రంబును జపమును చేసితి అకళంకుడనై ఆశ జయిస్తిని
శివ పంచాక్షరి మనసున నిలిపితి...
ఎంతో ఉత్సాహంగా అడుగులు వేశాడు. ఎంతో రమణీయమైన ప్రకృతి!
కొండలు, గుట్టలు, వాటిపై నుంచి ప్రవహించే జలపాతాలు, చిన్న చిన్న సెలయేళ్లు... వాటి పక్కనే గుబురుగా పెరిగిన వట్టివేర్ల పొదలు! అడవిమామిడి, నేరేడు, పనస, సంపంగి, నాగలింగం, నాగమల్లి వంటి దివ్యమైన దేవతా వృక్షాలు... అక్కడక్కడా తెల్లమద్ది చెట్లు, వాటిని చుట్టుకున్న అడవి మల్లె తీగలు!
సంధ్యారంభ విజృంభితం శ్రుతిశిరస్థానాంతరాధిష్ఠితం
సప్రేమ భ్రమరాభిరామ మసకృత్సద్వాసనా శోభితమ్‌!
భోగీంద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం
సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితమ్‌!!
అలా ప్రకృతిలో భ్రమరాంబ మల్లికార్జునులను పరవశంతో దర్శిస్తూ తరిస్తుండటంతో గంగయ్య ఆలస్యమయ్యాడు. బాటలో ఉన్న మిగతా భక్తులు అతనిని దాటుకుని చాలా ముందుకు వెళ్ళిపోయారు.
సమయం గడుస్తున్న కొద్దీ ఎండ తీవ్రత పెరిగింది. దారంతా రాళ్లు, రప్పలు, ముళ్ల పొదలు ఉండే ప్రాంతానికొచ్చాడు. దారిలో సెలయేళ్లు లేవు, కనీసం నీటి కుంటలూ లేవు. దాహంతో పెదవులు ఎండిపోతున్నాయి. ఆకలితో కడుపు నకనకలాడుతోంది. కాళ్లకు బొబ్బలెత్తి ప్రతి అడుగూ వర్ణనాతీతమైన బాధగా మారింది.
"ఇంకా ఎంత దూరం నడవాలి?" అని మనసులో సందేహం కలిగిన మరుక్షణమే, తలవంచి ఆవేదనతో వేడుకున్నాడు "అమ్మా! నా కాళ్లు ఇక ముందుకు పడటం లేదు. నువ్వే నా చేయి పట్టుకుని నడిపించు తల్లి! నేనేదైనా తప్పు చేసి ఉంటే క్షమించమ్మా, మల్లయ్యా క్షమించు!" అని వేడుకుని, శక్తిని కూడదీసుకుని ముందుకు సాగాడు.
మిట్టమధ్యాహ్న సమయానికి తీవ్రంగా అలసిపోయిన గంగయ్య ఒక పెద్ద బండరాయి నీడన కూర్చున్నాడు. అక్కడ కూడా వాతావరణం ఎంతో వేడిగా ఉంది. దాహంతో ప్రాణం విలవిలలాడుతూ శోష వచ్చి పడిపోతాడేమో అనుకున్న సమయాన...
ఎరుపు అంచుగల ఆకుపచ్చని చీర ధరించి,
పైకెత్తి ముడివేసిన కొప్పులో అడవి మల్లెలు తురుముకుని,
ముఖంపైనా, చేతులపైనా తుమ్మెదల్లాంటి పచ్చబొట్లతో,
పసుపు పచ్చని కాంతితో ప్రకాశించే ముఖమండలంపై పెద్ద ఎర్రని బొట్టుతో,
కళ్లలో వాత్సల్యం, పెదవులపై చల్లని చిరునవ్వుతో,
మెడలో పచ్చని మంగళసూత్రం, కాళ్లకు పెద్ద పెద్ద కంకణాలు మెరుస్తుండగా...
ఒక చేతిలో మట్టికుండ, మరొక చేతిలో తీపి అడవి మామిడి, అడివి ఉసిరి, తునికి, పాలపండ్లు, వెలగ పండ్లున్న బుట్టతో ఒక వృద్ధ గిరిజన స్త్రీ అక్కడికి వచ్చింది.
ఉగ్రలోచన వధూమణి కొప్పుగల్గిన భామినీ
విగ్రహంబుల కెల్ల ఘనమై వెలయు శోభనకారిణీ
అగ్రపీఠమునందు వెలసిన ఆగమార్థ విచారిణీ
శీఘ్రమేకని వరములిత్తువు శ్రీగిరి భ్రమరాంబికా!!
ఆమె ఎంతో వాత్సల్యంతో చిరునవ్వు చిందిస్తూ — "బిడ్డా! ముందు ఈ నీళ్లు తాగు, ఈ పండ్లు తిను. ఆ తర్వాత నీ ప్రదక్షిణ పూర్తిచేయి" అంటూ గంగయ్య దగ్గరకు వచ్చి అందించింది.
ఆమె దగ్గరకు వచ్చిన వెంటనే చుట్టూ సంపెంగలు, మల్లెపూల పరిమళం వెదజల్లింది.
ఎక్కడినుంచో వచ్చిన తుమ్మెదలు ఆమె చుట్టూనే గిరగిరా తిరుగుతున్నాయి ఎగురుతున్నాఇ
గంగయ్య కృతజ్ఞతతో ఆ నీరు తాగి, పండ్లు తిన్నాడు. ఆశ్చర్యం! క్షణాల్లో అతని శరీరంలోకి క్రొత్త శక్తి ప్రవహించినట్లయింది. అలసటంతా మాయమైంది. కాళ్లలో ఎక్కడలేని సత్తువా వచ్చింది!
"అమ్మా! ఇంత అడవిలో నా దాహార్తి తీర్చావే, ఎవరమ్మా మీరు?" అని అడిగేలోపే... ఆమె మృదువైన చిరునవ్వుతో — "శ్రీశైలం ప్రదక్షిణ కోసం వచ్చి అలసిపోయిన భక్తులకు దారి చూపడం... ఒక తల్లి ధర్మం కాదా బిడ్డా? నీ అమ్మనే అనుకో!" అని చెప్పి అడవి దారిలోకి నడిచిపోయింది.
గంగయ్య ఆశ్చర్యంతో లేచి ఆమె వెనుక గబగబా వెళ్ళాడు. కానీ ఎక్కడా ఆమె కనిపించలేదు. ఆశ్చర్యకరంగా ఆ దారిలో కనీసం మనుషుల అడుగుజాడలు కూడా లేవు!
చివరకు గంగయ్య గిరిప్రదక్షిణ పూర్తి చేసుకుని భ్రమరాంబ అమ్మవారి ఆలయానికి చేరుకున్నాడు. గర్భగుడిలోకి అడుగుపెట్టి అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని చూడగానే అతని హృదయం ఒక్కసారిగా పులకించిపోయింది! గర్భగుడిలో దీపజ్యోతి ఒక్కసారిగా పెద్దకాంతితో మెరిసింది. అమ్మవారి కిరీటం పక్కన ఒక తుమ్మెద వచ్చి క్షణకాలం పరిభ్రమించి మళ్లీ ఎగిరిపోయింది. గంగయ్య హృదయం ఇక సందేహానికి తావివ్వలేదు.
ఆలయంలోని అమ్మవారి ముఖంలో... అదే చిరునవ్వు! అవె పెద్ద పెద్ద కళ్లు, అదే ఎర్రంచుల ఆకుపచ్చ చీర, అమ్మవారి ముఖాన పచ్చని పసుపు, పెద్ద కుంకుమబొట్టు, తుమ్మెద రెక్కల అలంకారం! అడవిలో తనకు నీళ్లు ఇచ్చి ఆదుకున్న ఆ గిరిజన స్త్రీ కళ్లలోని అదే మాతృవాత్సల్యం ఇక్కడ స్పష్టంగా అనుభవంలోకి వచ్చింది.
గంగయ్య ఆనందభాష్పాలతో అమ్మవారి ముందు సాష్టాంగపడ్డాడు. "అమ్మా! ఈ గిరిప్రదక్షిణ నేను చేయలేదు... నువ్వే నా చేయి పట్టుకుని నడిపించావు తల్లి!" అని భావోద్వేగంతో ఏడ్చేశాడు.
అది చూసిన అక్కడ ఉన్న వృద్ధ అర్చకుడు అతనిని లేవనెత్తి మృదువుగా అన్నాడు:
"బిడ్డా! శ్రీశైలంలో కొన్ని పరమ రహస్యాలు ఉన్నాయి. గొప్ప భక్తులు, సిద్ధులు, యోగులైన వారికి మల్లికార్జున లింగం బంగారు లింగంగా కనిపిస్తుంది. అమ్మవారు ప్రతిరోజూ ఇప్పటికీ సాయం సంధ్య వేళ శ్రీశైల ఆలయమంతా తన పరివారంతో కలిసి విహరిస్తుంది. ఈ శ్రీపర్వతంపై సంపూర్ణ భక్తిప్రపత్తులతో ప్రదక్షిణ చేసే ప్రతి భక్తుడితోనూ జగన్మాత అదృశ్యరూపంలో వెంట ఉండి నడుస్తుంది. కొందరికిది ఆత్మానుభూతిగా తెలుస్తుంది... నీలాంటి నిష్కల్మష భక్తులకు ప్రత్యక్ష దివ్య దర్శనంగా లభిస్తుంది! ఎవరి భక్తి ఎంత నిర్మలమో వారికి అంత స్పష్టంగా వారి అనుగ్రహం ప్రత్యక్షమవుతుంది"
కలియుగంబున మానవులకును కల్పతరువై యుండవా
వెలయగను శ్రీశిఖరమందున విభవమై విలసిల్లవా!
ఆలసింపక భక్తవరులకు అష్టసంపదలీయవా
జిలుగు కుంకుమ కాంతి రేఖల శ్రీగిరి భ్రమరాంబికా!!
ఆ మాటలతో గంగయ్య జన్మ ధన్యమైంది. ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం శ్రీశైలానికి వచ్చి గిరిప్రదక్షిణ చేయడం అతని జీవిత నియమంగా మారింది. ఎవరైనా శ్రీశైల యాత్రకు వెళ్తున్నారని తెలిస్తే వాళ్లతో కలిసి వెళ్లేవాడు. అతడు ఎప్పుడూ ఒకటే చెప్పేవాడు "ప్రదక్షిణలో కాళ్లు నొప్పిడితే భయపడకండి... ఆ నొప్పి మీది కాదు! ప్రతి అడుగులోనూ ఆ తల్లి మీ పాపభారాన్ని తగ్గిస్తోంది! అమ్మ మిమ్మల్ని అక్కున చేర్చుకుంటోంది. శ్రీశైలం ప్రదక్షిణలో భక్తుడు కొండ చుట్టూ తిరుగుతున్నానని అనుకుంటాడు... కానీ నిజానికి భ్రమరాంబికా అమ్మవారు అతని హృదయం చుట్టూ తన కరుణామయ వలయాన్ని పరిభ్రమింపజేస్తూ ఉంటుంది!"
గంగయ్య అనుకున్నట్లు తాను అమ్మను వెతుక్కుంటూ శ్రీశైలానికి వెళ్లడు...
తన పిల్లవాడిని అక్కున చేర్చుకోవాలని తల్లే కదిలివచ్చింది.
రెండుమూడు గంటలలో వెళ్లే అవకాశమున్నా అమ్మ-అయ్యల పిలుపు లేనిదే అక్కడికి చేరలేమంటారు భక్తులు.
అమ్మ-అయ్యల పిలుపు వినిపించినవారే శ్రీశైలానికి చేరతారంటారు పెద్దలు.
శ్రీగిరి ప్రదక్షిణ చేసే ప్రతి భక్తుని హృదయంలో నడిచేది భ్రమరాంబ తల్లే.
---
!!శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామినే నమః!!
అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే!
జయ దుర్గే! శివ దుర్గే! హర దుర్గే!
జయ జయ – జయ జయ కామాక్షీ!
జయ జయ – జయ జయ కామాక్షీ!
యాదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్!
తత్సర్వం క్షమ్యతాం దేవి కామాక్షి నమోస్తుతే!!
విసర్గ బిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ!
న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పరమేశ్వరి!!
-శంకరకింకరః (శ్రీ అయ్యగారి నాగేంద్ర)

Tuesday, July 28, 2026

శ్రీమాత లీలామృతం – 3 (సోమయాజులనే పేద ఉపాసకుడు)

 శ్రీమాత లీలామృతం – 3 (సోమయాజులనే పేద ఉపాసకుడు)

శ్రీ గురుభ్యో నమః
శ్రీమాత్రే నమః
"అమ్మా అని పిలిస్తేనే అమ్మ దగ్గరకు చేరగలం; అమ్మను తలిస్తేనే ఆమె లీలామృతాన్ని ఆస్వాదించగలం."
అమ్మను పిలిచే మనసు ఎన్నడూ ఒంటరిగా ఉండదు... ఆమె లీలలను స్మరించిన జీవితం ఎన్నడూ నిరాశ చెందదు. 'శ్రీమాత లీలామృతం'లోకి మరోసారి స్వాగతం.
---
అమ్మ కరుణకు హద్దులు లేవు. ఆమె అనుగ్రహానికి అర్హత సంపద కాదు, విద్య కాదు, ప్రాపంచిక శక్తి కాదు... కేవలం నిష్కపటమైన భక్తి మాత్రమే! జగజ్జనని కామాక్షిని హృదయపూర్వకంగా ఆశ్రయించిన వారిని ఆమె ఎన్నటికీ విడిచిపెట్టదు.
(ఈ కథ కాంచీ కామాక్షి అమ్మవారి భక్తి పరంపరలో ప్రచారంలో ఉన్న మహిమలను ఆధారంగా చేసుకుని, శ్రీచక్రోపాసన వైభవాన్ని ప్రతిబింబించే విధంగా రచించబడింది.)
కాంచీపురం...
మోక్షపురి...
శ్రీ కామకోటి పీఠం...
శ్రీచక్రనిలయ అయిన కామాక్షీ పరమేశ్వరి నిత్యం కొలువై ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం.
ఆ క్షేత్రంలో సోమయాజులు అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు.
అతడు వేదవేత్త, నిత్యాగ్నిహోత్రి, అత్యంత నిష్ఠాగరిష్ఠుడు.
అతని భౌతిక సంపద ఏపూటకాపూటే తప్ప దాచుకునేంత ధనం లేదు...
కానీ అతనికి ఒక అమూల్యమైన మహానిధి ఉంది!
అది... తన గురుదేవులు అనుగ్రహించిన దివ్య శ్రీచక్రం.
ప్రతిరోజూ బ్రహ్మముహూర్తాన లేచి, స్నానాదులు ముగించి, శ్రీచక్రాన్ని సుగంధ జలాలతో అభిషేకించి, కల్పసూత్రోక్తంగా ఆవరణ పూజ చేస్తూ, కుంకుమ పుష్పాలు సమర్పించి, శ్రీవిద్యా మహామంత్రాలను జపించేవాడు.
పూజ ముగిసాక ఆత్మసమర్పణ చేస్తూ "అమ్మా! నిన్ను ధనం కోసమో, లౌకిక సుఖాల కోసమో పూజించడం లేదు. నీవు నా గృహంలో కొలువై ఉంటే అదే నా పరమైశ్వర్యం. నన్ను ఎన్నడూ వదలకు తల్లీ!" అని నిత్యం వేడుకునేవాడు.
చంద్రాపీడాం చతురవదనాం చంచలాపాంగలీలాం
కుందస్మేరాం కుచభరనతాం కుంతలోద్ధూతభృంగాం!
మారారాతేర్మదనశిఖినం మాంసలం దీపయంతీం
కామాక్షీం తాం కవికులగిరాం కల్పవల్లీముపాసే!!
ఒకానొక సమయంలో, అనుకోకుండా అతని భార్య తీవ్ర అనారోగ్యానికి గురైంది. వైద్య చికిత్స కోసం, ఇంటి ఖర్చుల కోసం అతడు గ్రామంలోని ఒక ధనవంతుడి వద్ద అప్పు తీసుకోవాల్సి వచ్చింది.
కాలం గడిచింది. ఊరికి తీవ్రమైన కరువు వచ్చింది, పంటలు పండలేదు. ఎవరికీ సరైన ఆదాయం లేక దాన దక్షిణలు, సంభావనలు నిలిచిపోయాయి. అప్పు తీర్చే మార్గమే కనిపించలేదు.
ఒకరోజు అప్పిచ్చిన ధనవంతుడు కోపంతో ఇంటికి వచ్చి "రేపు సాయంత్రంలోగా నా అప్పు తీర్చు! లేకపోతే నీ ఇల్లు, నీ శ్రీచక్రం రెండింటినీ స్వాధీనం చేసుకుంటాను!" అని హెచ్చరించి వెళ్లాడు.
ఆ మాటలకు బ్రాహ్మణుడి గుండె బరువెక్కింది. అతని భార్య కన్నీళ్లతో "స్వామీ... మన శ్రీచక్రాన్ని తీసుకుపోతే మనకు ఇంకేమి మిగులుతుంది? అంతా నాకొచ్చిన రోగం వల్లనే కదా ఈ కష్టం..." అని బాధపడింది.
సోమయాజులు మాత్రం ప్రశాంతమైన చిరునవ్వుతో "సోమీ! శ్రీచక్రం మనది కాదు. అది ఆ మహాత్రిపురసుందరి కామాక్షి అమ్మవారి పరివారంతో తన దివ్య సింహాసనంతో పై కొలువుండే నెలవు . తన సింహాసనాన్ని, తన నిలయాన్ని కాపాడుకోవడం ఆ తల్లికి తెలుసు. ఆమె ఇచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది" అన్నాడు.
ఆ రాత్రి... అతడు ఎప్పటిలాగే లఘువుగా శ్రీచక్ర నవావరణ పూజ చేశాడు.
కానీ ఆ రోజు ప్రార్థన కొంచెం భిన్నంగా ఉంది "అమ్మా... నా అప్పు తీర్చమని నిన్ను కోరడం లేదు. కానీ నా విశ్వాసానికి, శ్రీచక్రారాధనకు అపకీర్తి రాకుండా చూడు. నీ భక్తుడు చేతకానివాడై, అప్పులపాలై శ్రీచక్రాన్ని వీధికీడ్చాడని లోకంలో నవ్వులపాలు కాకూడదు తల్లీ!" అని శ్రీచక్రం ముందు తలవంచి మౌన ధ్యానంలో ఉండిపోయాడు.
కష్ట నివారిణీ ఇష్ట విదాయినీ దుష్ట వినాశినీ కామాక్షీ!
గురు గుహ జననీ కురు కల్యాణం కుంజరీ జననీ కామాక్షీ!!
మరుసటి రోజు మధ్యాహ్నం వేళ...
ఆ ఇంటి ముందు ఒక గుర్రపు బండి ఆగింది.
చెన్నపట్టణంలో స్థిరపడిన ఉత్తర భారతదేశానికి చెందిన ఒక ధనిక వ్యాపారి బండి దిగి, తలుపు దగ్గర నిలబడి "సోమయాజులు గారున్నారా?" అని అడిగాడు.
సోమయాజులు "నేనేనండీ, రండి లోపలికి" అంటూ సాదరంగా ఆహ్వానించాడు.
ఆ వ్యాపారి లోపలికి వచ్చి నమస్కరించి "స్వామీ! నిన్న రాత్రి నాకు ఒక అద్భుతమైన దివ్య స్వప్నం వచ్చింది...
దివ్యమైన ఎర్రని వస్త్రాలు ధరించిన జగన్మాత స్వరూపం ఒక శ్రీచక్రం మధ్యలో ఆసీనురాలై కనిపించింది. ఆమె నాతో 'కాంచీపురంలో నా బిడ్డ ఒకడు ఇబ్బందిలో ఉన్నాడు. ఈ చిరునామాకు వెళ్లి అతనికి ఈ ధనం ఇవ్వవలసింది. అది నాకు సమర్పించే కానుకగా భావిస్తాను' అని ఆజ్ఞాపించింది" అని చెబుతూ ఒక బట్ట సంచిని బ్రాహ్మణుడి చేతిలో ఉంచాడు.
సోమయాజులు కంపించే చేతులతో ఆ సంచిని తెరిచి, అందులోని నాణేలను లెక్కపెట్టాడు.
ఆశ్చర్యం! తను తీర్చాల్సిన అప్పు ఎంత ఉందో... కచ్చితంగా అంతే మొత్తం!
ఒక్క నాణెం తక్కువ కాదు, ఒక్క నాణెం ఎక్కువ కాదు!
బ్రాహ్మణుడి కళ్ల నుండి ఆనందబాష్పాలు ధారగా ప్రవహించాయి.
అతడు శ్రీచక్రం ముందు సాష్టాంగపడి కళ్ళనీళ్ళ పర్యంతమైయ్యాడు...
"అమ్మా! నేను ధనం అడగలేదు... నా గౌరవాన్ని, నీ శ్రీచక్ర నిష్ఠను కాపాడమని మాత్రమే అడిగాను. నా లాంటి దీనుడి మాటను కూడా ఆలకించావా తల్లీ!" అని పరవశించిపోయాడు. అతని భార్య, ఆ వ్యాపారి అతడిని అనునయించగా కొంతసేపటికి కోలుకున్నాడు.
కామాక్షీం కరుణామయీం భగవతీం వందే పరాం దేవతాం!
సోమయాజులు వెంటనే వెళ్ళి ధనవంతుడి అప్పు పూర్తిగా తీర్చేశాడు. ఆ ధనవంతుడు ఆశ్చర్యపోయి "ఒక్కరోజులో ఇంత ధనం ఎక్కడి నుండి వచ్చింది?" అని అడిగాడు.
సోమయాజులు ప్రశాంతంగా చిరునవ్వు నవ్వి "అప్పు నేను తీసుకున్నాను... కానీ అది తీర్చింది మా ఇంటి యజమానురాలు!" అని ఒక్క మాటలో సమాధానమిచ్చి వచ్చేసాడు..
ఆ సాయంత్రం... సోమయాజులు కామాక్షి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నాడు.
గర్భగుడిలోని కామాక్షీ పరమేశ్వరిని చూసిన క్షణంలో... అమ్మవారి పెదవులపై మందహాసం, శ్రీచక్రంపై కుంకుమ ప్రకాశం తానెరిగిన పరమ సత్యాన్ని స్పష్టం చేశాయి.
శాంతాం చంచలచారునేత్రయుగలాం శైలేంద్రకన్యాం శివాం
వారాహీం దనుజాంతకీం త్రినయనీం సర్వాత్మికాం మాధవీం!
సౌమ్యాం సింధుసుతాం సరోజవదనాం వాగ్దేవతామంబికాం
కామాక్షీం కరుణామయీం భగవతీం వందే పరాం దేవతాం!!
జరిగిన వృత్తాంతాన్ని అర్చకస్వాములకు వివరించగా, వారు ఆనందంతో "నాయనా! శ్రీచక్రాన్ని పూజించేవారు చాలామంది ఉంటారు. కానీ శ్రీచక్రంలో కొలువై ఉన్న పరాశక్తిని నిజంగా నమ్మేవారు చాలా అరుదు. నువ్వు శ్రీచక్రాన్ని ఒక లోహంగా చూడలేదు... కామాక్షి పరివారంతో కొలువై తన సింహాసనంలో కూర్చునే తావుగా చూశావు! అందుకే తల్లి నీ గౌరవాన్ని తన గౌరవంగా భావించి అనుగ్రహించింది" అని చెబుతూ అమ్మవారి హారతి, కుంకుమార్చన ప్రసాదాలను అందించారు.
ఆ రోజు నుండి సోమయాజులు మరింత శ్రద్ధాభక్తులతో శ్రీచక్రారాధన కొనసాగించాడు. ఎవరైనా అతడి మహిమను కొనియాడితే "శ్రీచక్రం అద్భుతాలు చేయదు... శ్రీచక్రంలో నివసించే ఆ మహాత్రిపురసుందరి కామాక్షి తల్లే సమస్తం చేస్తుంది. మనం చేయాల్సింది ఒక్కటే... ఆమెపై సంపూర్ణ విశ్వాసం ఉంచడం!" అని చెప్పేవాడు.
...కంపాతీరరసాలమూలనిలయా కారుణ్యకల్లోలినీ
కల్యాణాని కరోతు మే భగవతీ కాంచీపురీదేవతా...
---
"తల్లి కృప కోరినవారికి దారి చూపుతుంది...
తల్లిని నమ్మినవారిని గమ్యం చేరుస్తుంది...
తల్లికి శరణాగతులైన వారిని తన ఒడిలో చేర్చుకుంటుంది."
శ్రీచక్రారాధన యొక్క అంతరార్థం — "గురుభక్తి, విశ్వాసం మరియు శరణాగతి". కామాక్షి తల్లిని నిస్వార్థంగా ఆశ్రయించిన భక్తుని యోగక్షేమాలను ఆమె స్వయంగా భరిస్తుంది. నిజమైన ఉపాసకుడు లౌకిక సంపదను కాదు, తల్లి సాన్నిధ్యాన్నే కోరుకుంటాడు. ఆ సాన్నిధ్యం లభించిన చోట అవసరమైనది ఆ జగన్మాత అనుగ్రహంతో సమయానికి సమకూరుతుంది.
అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే!
జయ దుర్గే! శివ దుర్గే! హర దుర్గే!
జయ జయ – జయ జయ కామాక్షీ!
జయ జయ – జయ జయ కామాక్షీ!
యాదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ !
తత్సర్వం క్షమ్యతాం దేవి కామాక్షి నమోస్తుతే !!
విసర్గ బిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ !
న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పరమేశ్వరి !!
- శంకరకింకరః (శ్రీ అయ్యగారి నాగేంద్ర)

Sunday, July 26, 2026

శ్రీమాత లీలామృతం – 2 (మీనాక్షి అమ్మాళ్ ఉపాసన)

శ్రీ గురుభ్యో నమః

శ్రీమాత్రే నమః
"అమ్మా అని పిలిస్తేనే అమ్మ దగ్గరకు చేరగలం; అమ్మను తలిస్తేనే ఆమె లీలామృతాన్ని ఆస్వాదించగలం."
కాంచీపురం...
సప్తమోక్షపురులలో ఒకటి...
వేదఘోషలు, నిత్యోపాసనలు, యజ్ఞయాగాదులు, నిత్యోత్సవాలతో భాసిల్లే పవిత్ర పుణ్యభూమి...
ఆ కంచి పుణ్యక్షేత్రానికి తలమానికం శ్రీ కామాక్షీ అమ్మవారి ఆలయం.
ఆ ఆలయంలోని ప్రతి రాయి ఒక మహాత్ముని తపస్సుకు సాక్షి...
ప్రతి మండపంలో ఉపాసకుల, భక్తుల దివ్యానుభూతులు నిక్షిప్తమై ఉన్నాయి...
ప్రతి ఘంటానాదం, ప్రతి దీపజ్యోతి, ప్రతి జయజయధ్వానం "ఇక్కడ జగజ్జనని సాక్షాత్తుగా కొలువై ఉంది" అని భక్తుల హృదయాలకు స్పష్టం చేస్తుంటాయి.
జయ జయ జగదంబ శివే జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే !
జయ జయ మహేశదయితే జయ జయ చిద్గగనకౌముదీధారే !!
(ఇక ఇప్పుడు మనం తెలుసుకోబోయేది, ఇది ఆ ప్రాంతంలో చెప్పుకునే కథ... పదండి కథలోకి వెడదాం!)
అటువంటి కామాక్షీ తల్లి సన్నిధిలో, తన జీవితంలో సింహభాగం గడిపిన ఒక మహాభక్తురాలు "మీనాక్షి అమ్మాళ్".
ఆమె ఒక సాధారణ కుటుంబీకురాలు...
ఆమెకు ధన-కనకాదులపై ఆశ లేదు...
పేరు ప్రఖ్యాతులు సంపాదించాలనే ఇచ్ఛ అంతకంటే లేదు...
"అమ్మా! నిన్ను కేవలం గుడిలోని మూర్తిగానే కాక... నీ పరమతత్త్వాన్ని దర్శించే భాగ్యాన్ని ప్రసాదించు. సంపూర్ణ శ్రీచక్రారాధనా యోగ్యతను, దాని అంతరార్థాన్ని నాకు బోధించు" అని నిత్యం వేడుకునేది.
అదే ఆమె శ్వాస... అదే ఆమె తపస్సు...
ప్రతిరోజూ బ్రహ్మముహూర్తాన లేచి, స్నానాదులు ముగించుకుని, మడి వస్త్రాలు ధరించి, ఇంటి పనులు పూర్తయ్యాక... ఇమ్ట్లో పూసిన పూలతో దండ కట్టి, కొన్ని విడిపూలతో కామాక్షీ ఆలయానికి చేరుకునేది. అమ్మవారి సన్నిధిలో గంటల తరబడి కూర్చొని లలితా సహస్రనామం, లలితా త్రిశతి, పూర్వులనుండి తనకు లభించిన మంత్రజపం చేసుకునేది.
జపం ముగిసినా ఇంటికి వెళ్లేది కాదు...
ఆలయ ఆవరణలోని పుష్కరిణి వద్దనో, మారేడు చెట్టు కిందనో, మండపంలోనో కూర్చొని కన్నులు మూసుకుని తల్లి పాదపద్మాలను ధ్యానిస్తూ ఉండేది. ఆలయ ద్వారాలు మూసే సమయానికి ఇంటికి వెళ్లి తన ఇంటి పనులు చక్కగా నిర్వర్తించేది.
లీనస్థితి మునిహృదయే ధ్యానస్తిమితం తపస్యదుపకంపం!
పీనస్తనభరమీడే మీనధ్వజతంత్రపరమతాత్పర్యం!!
అలా రోజులు... నెలలు... సంవత్సరాలు గడుస్తున్నాయి.
ఆమె భక్తి మరింత గాఢమవుతూ వచ్చింది.
ఒకానొక సంవత్సరం శరన్నవరాత్రి ఉత్సవాల సమయం...
అది ఒక శుక్రవారం రాత్రి వేళ...
ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని శుక్రవార మండపంలో ఉంచి ఉపచారాలు సమర్పించి, "తంగ తేరు" (బంగారు రథం)లో వేంచేపు చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మీనాక్షి అమ్మాళ్, పల్లవ రాజ మండపం మొదట్లో ఉన్న దూర్వాస మహాముని విగ్రహం ముందు ఓ పక్కగా కూర్చొని, అమ్మను ధ్యానిస్తూ మనసులోనే త్రిశతి జపం చేస్తోంది.
ఆలయంలోని దీపాల వెలుగు మాత్రమే చీకటిని చీల్చుతోంది.
అర్చకులంతా శుక్రవార మండపానికి వెళ్లారు. ఒకరిద్దరు సహాయకులు తప్ప ఆలయం వద్ద ఎవరూ లేరు. అడపా దడపా భక్తులు వచ్చి కామాక్షమ్మను దర్శించుకుని వెళ్తున్నారు...
మండపమంతా గొప్ప నిశ్శబ్దం.
కేవలం అఖండదీపపు జ్వాలలు మాత్రమే కదులుతున్నాయి.
త్రిశతి ధ్యానం పూర్తయ్యాక మీనాక్షి అమ్మాళ్ లేచి, గర్భగుడి ఎదురుగా ఎత్తుగా ఉన్న పల్లవరాజు మండపంపై ఆసీనురాలై, సంపూర్ణ ఏకాగ్రతతో అక్కడనుంచే అమ్మవారిని తిలకిస్తూ జపంలో లీనమైంది.
కుండలి కుమారి కుటిలే చండి చరాచరసవిత్రి చాముండే!
గుణిని గుహారిణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి!!
అప్పుడే... ఆమెకు కాలమే స్తంభించిపోయినట్లు తోచింది.
ఆలయంలోకి జనుల రాకపోకలు ఆగిపోయాయి...
ఆలయమంతా అపూర్వమైన దివ్య విభూతి పరిమళంతో నిండిపోయింది...
మీనాక్షీ అమ్మాళ్‌కు సమస్త లోకమూ అరుణ కాంతులలో మునిగిపోయినట్లు తోచింది...
అది వర్ణనాతీతమైన దివ్యసాన్నిధ్యపు పరిమళం... దివ్య సింధూర కాంతి!
ఆమె మెల్లగా కన్నులు తెరిచింది.
తన ఎదురుగా...
జటాజూటధారి... మహాతపోమూర్తి...
పుటము పెట్టిన బంగారం వలే దివ్యతేజస్సుతో ప్రకాశిస్తూ, చంద్రుని వంటి పవిత్రమైన చిరునవ్వుతో, శాంత స్వరూపుడైన ఒక మహర్షి నిలబడి ఉన్నారు.
రాగి తీగల వంటి ఎర్రని జటలు, పెద్ద మీసాలు, గడ్డంతో...
ఫాలభాగాన, ఒంటినిండా విభూతి రేఖలు భాసిస్తుండగా...
తీక్షణమైనవి, అపార కరుణను కురిపించేవి అయిన తెల్లని కళ్ళు...
సూటిగా మొనదేలిన నాసిక, పెదవులపై శాంతమైన చిరునవ్వు!
సాక్షాత్ శివస్వరూపంగా దర్శనమయ్యింది!
ఆ దివ్య దర్శనంతో మీనాక్షి అమ్మాళ్ శరీరం పులకరించింది.
ఎవరీ మహానుభావుడో తెలియదు... కానీ ఒక మహా ఉపాసకుడిని, మహర్షిని చూస్తున్న పవిత్ర భావన!
సొంత తండ్రిని చూస్తున్న అవ్యాజమైన గౌరవంతో కూడిన ప్రేమ... కళ్లల్లో ఆనందబాష్పాలు పొంగిపొర్లాయి.
వెంటనే పంచాంగ నమస్కారం చేసింది. ఏం మాట్లాడాలో, ఏం అడగాలో పాలుపోలేదు.
ఆ మహర్షి మృదువుగా "అమ్మా... ఎన్నో జన్మల సుకృతం ఉంటే తప్ప కామాక్షి సన్నిధిలో ఇంత నిశ్చలమైన ధ్యానం సాధ్యపడదు" అంటూ వాత్సల్యంతో ఆమెను చూస్తూ...
"నీవు చేస్తున్న ఉపాసనలో నీ భక్తి అనన్యం, నీ ధృడ చిత్తం అపారం. కానీ, నీవు కోరుకుంటున్న శ్రీచక్ర రహస్యాలు, అమ్మవారి తత్త్వం కేవలం మంత్రోచ్చారణలో మాత్రమే లేవు... ప్రతి ఆవరణలోనూ పరాశక్తిని సాక్షాత్కరించుకునే భావనలో ఉన్నాయి" అని శ్రీచక్రాన్ని చూపుతూ వివరించడం ప్రారంభించారు.
"ఈ తొమ్మిది ఆవరణలు కేవలం గీసిన గీతలు కావు... ఇవి భక్తుని హృదయం నుండి పరబిందువు వైపు తీసుకెళ్లే నవద్వారాలు. పరబ్రహ్మరూపిణి అయిన ఆ ప్రకృతిమాతలోని తత్త్వాలు ఇవి. ప్రతి ఆవరణ దాటేకొద్దీ మనలోని అహంకారం కరగాలి, లౌకిక మమకారం నశించాలి. నీ శరీరమే శ్రీచక్రం, నీ ఎదురుగా ఉన్నది దానికి సూచనాత్మకం. అన్ని ఆవరణల దేవతలనూ, తత్త్వాలనూ తెలుసుకున్నాక... అన్ని రూపాలూ తత్త్వాలూ లయమై, చివరకు మిగిలేది ఆ మహాత్రిపురసుందరి కామాక్షి మాత్రమే..."
అంటూ శ్రీవిద్యా సంప్రదాయంలో గురుపరంపరగా వచ్చిన భావనోపనిషత్తు జ్ఞానాన్ని, శ్రీచక్ర అంతరార్థాలను, ఉపాసన రహస్యాలను, 'ఆర్యాద్విశతి'లో దాచబడిన గుహ్య తత్త్వాలను ఉపదేశించారు.
మీనాక్షి అమ్మాళ్ ఆ దివ్యవాక్కులను శ్రద్ధగా ఆలకించింది.
యే సంధ్యారుణయంతి శంకరజటాకాంతారచన్రార్భకం
సిందూరంతి చ యే పురందరవధూసీమంతసీమాంతరే!
పుణ్యం యే పరిపక్కయంతి భజతాం కాంచీపురే మామమీ
పాయాసుః పరమేశ్వరప్రణయినీపాదోద్భవాః పాంసవః!!
ఆ క్షణం నుండి ఆమెకు శ్రీచక్రం కేవలం ఒక యంత్రంగా అనిపించలేదు... ఆమె దృష్టికోణం మారింది, తాత్త్విక దృష్టి అలవడింది. ప్రతి ఆవరణలోని యోగినీగణాలు, పరాశక్తి తత్త్వాలు విభిన్న రూపాలుగా దివ్యంగా సాక్షాత్కరించాయి.
చివరకు మధ్య బిందువులో...
అరుణోదయ కాంతిని మించిన ఎర్రని వర్ణం...
చంపక, పారిజాతాది దివ్య కుసుమాలతో అలంకరించిన ఘనజటాభారం...
నవరత్నమయ కిరీట ప్రకాశం...
ఓపక్కన పదహారవ కళతో అలరారే అమృతకాంతిపూరిత చంద్ర రేఖ...
పాపిట సంధ్యారుణ కాంతుల సిందూరంతో...
కస్తూరి తిలకంతో...
చీకటి వంటి నల్లని కాటుక దిద్దిన కళ్ళతో...
రత్న తాటంకాలు అలంకరించిన చెవులతో...
కిరీటం అంచులనుంచి చెవులపక్కగా ఊగుతున్న నొక్కు నొక్కు వెంట్రుకల సమూహంతో...
దొండపండు మెరుపును, చిలుకముక్కుల రంగును తలదన్నే ఎర్రని పెదవుల చిరు మందహాసంతో...
అద్దాల వంటి చెక్కిళ్లపై మహాకామేశ్వరుడి రూపం ప్రతిఫలిస్తుండగా...
ఎర్రని బంగారు జరీ పట్టుచీర కట్టుకొని...
పంచబ్రహ్మాసనస్థితయై,
రమావాణీ సేవితయై,
మహాకామేశ్వరాంకస్థితయై...
చెరకువిల్లు, పంచబాణాలు, పాశం, అంకుశాలను ధరించిన కరుణామయి మహాత్రిపురసుందరి శ్రీ కామాక్షీ పరమేశ్వరి సాక్షాత్కరించింది.
ఆ దివ్య మంగళ రూపాన్ని చూసిన మీనాక్షి అమ్మాళ్ ఆనందబాష్పాలతో తడిసిముద్దయింది. ఆమెకు బాహ్యస్మృతి నశించింది. అలా ఎంత సమయం గడిచిందో తెలీదు.
కైవల్యదాయ కరుణారసకింకరాయ
కామాక్షి కందలితవిభ్రమశంకరాయ!
ఆలోకనాయ తవ భక్తశివంకరాయ
మాతర్నమోఽస్తు పరతంత్రితశంకరాయ!!
కొద్ది సేపటికి... ఆ మహర్షి ఆమె తలపై హస్తముంచి " బిడ్డా! శ్రీవిద్యారహస్యం కేవలం గ్రంథాలలో సంపూర్ణంగా లభించదు. అది గురుకృపతో వికసిస్తుంది... జగదంబ మహాత్రిపురసుందరి కామాక్షి కటాక్షంతో పరిపూర్ణమవుతుంది" అని చెబుతూ, చరమ మంత్రాలను అంగోపాంగంగా ఉపదేశించారు.
"దీనిని అత్యంత పవిత్రంగా కాపాడుకో. కాలానుగుణంగా కామాక్షియే నీకు తదుపరి మార్గాన్ని చూపుతుంది. ఎందుకంటే... ఆమెయే పరమగురువు, గురుమండల రూపిణి" అని బోధించారు.
ఆ మాటలు ముగియగానే...
ఆ మహర్షి రూపం క్రమంగా దివ్యజ్యోతిగా మారి, నేరుగా కామాక్షీ అమ్మవారి విగ్రహంలో లీనమైపోయింది.
అది క్షణకాలమో... యుగకాలమో... ఆమెకు తెలియదు.
మళ్లీ భక్తుల సంచారం, గంటానాదం వినిపించేసరికి ఆమెకు బాహ్యస్మృతి వచ్చింది.
కానీ మీనాక్షి అమ్మాళ్ జీవితం శాశ్వతంగా మారిపోయింది.
మరుసటి రోజు ఆమె ఆలయ వృద్ధ అర్చకునికి జరిగినదంతా వివరించింది. ఆ అర్చకుడు ఆనందభాష్పాలతో — "మీనాక్షీ అమ్మాళ్! నీ అదృష్టం వర్ణనాతీతం. శ్రీచక్రారాధనా సంప్రదాయంలో దూర్వాస మహర్షికి అత్యున్నత స్థానం ఉంది. నిన్ను అనుగ్రహించినది సాక్షాత్తు దూర్వాస మహర్షులే! వారు మాకు ఆద్యులు. వారు సూచించిన మార్గంలోనే నేటికీ కామాక్షి అమ్మవారి అర్చన కొనసాగుతోంది. ఇలాంటి కటాక్షం కోట్లలో ఒకరికి దక్కడం కూడా అరుదు" అని ఆమెకు నమస్కరించారు.
ఆ రోజు నుండి మీనాక్షి అమ్మాళ్ జీవితం సంపూర్ణంగా మారిపోయింది.
ఆమె మాటల్లో మునుపటికన్నా సౌమ్యత్వం, ముఖంలో ప్రశాంతత, చూపులో కరుణ తాండవించాయి.
తాను గొప్ప ఉపాసకురాలిననే గర్వం లేశమాత్రం కూడా లేకుండా మరింత సౌమ్యంగా తయారైంది.
ఆమెను చూసినవారు "నిజమైన కామాక్షీ కటాక్షం పొందిన వాళ్ళు ఎలా ఉంటారో తెలుసుకోవాలంటే మీనాక్షి అమ్మాళ్‌ను చూడాలి" అని చెప్పుకునేవారు.
---
శ్రీవిద్యామార్గంలోనైనా మరే ఉపాసనా మార్గంలోనైనా పాండిత్యం కంటే నిర్మలమైన భక్తి, గ్రంథజ్ఞానం కంటే గురుభక్తి మిన్న.
భక్తుడు ఒక అడుగు వేస్తే, అమ్మ పది అడుగులు ముందుకు వస్తుంది.
భక్తుని కంటి నుండి జారే ఒక్క కన్నీటి బొట్టుకే అమ్మ హృదయం కరిగి అనంతమైన కరుణను వర్షిస్తుంది.
ఆమె కటాక్షం ఉంటే మహర్షులే గురువులై మార్గదర్శకులవుతారు...
జీవితమే ఒక దివ్యానుభూతిగా మారుతుంది.
"భక్తుని హృదయంలో ప్రేమ, వినయం, గురువాక్యంపై విశ్వాసం ఉంటే ఆ మహాత్రిపురసుందరి కామాక్షి నిశ్చయంగా అనుగ్రహిస్తుంది."
---
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే!
జయ దుర్గే! శివ దుర్గే! హర దుర్గే!
జయ జయ – జయ జయ కామాక్షీ!
జయ జయ – జయ జయ కామాక్షీ!
యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ |
తత్సర్వం క్షమ్యతాం దేవి కామాక్షి నమోస్తుతే ||
విసర్గ బిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ |
న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పరమేశ్వరి ||
- శంకరకింకరః (శ్రీ అయ్యగారి నాగేంద్ర)

Saturday, July 25, 2026

శ్రీమాత లీలామృతం – 1 (అమ్మ తాంబూల శేష విశేషం)

శ్రీ గురుభ్యోనమః

శ్రీమాత్రే నమః
కాంచీపురం...
అది కేవలం ఒక పురాతన నగరం కాదు...
బ్రహ్మవిద్యా సంస్థానం...
ఎందరో ఉపాసకులకు నెలవు...
ఏ ఆలయ గోపురమైనా జగదంబ వైభవాన్ని ఎలుగెత్తి చాటుతుంది...
దేవతలందరూ చిలుకలుగా మారి అమ్మ నెలవులో తిరుగాడే చోటు...
ప్రతి వీధిలో వేద పండితులు, శాస్త్ర పండితులు, శ్రీవిద్యోపాసకులు, వేదాంతులు, బ్రహ్మవిద్యోపాసకులు తారసపడే చోటు...
సాక్షాత్తూ ఆది శంకర భగవత్పాదులే పీఠ స్థాపన చేసి స్వయంగా అధిష్ఠించిన చోటు...
అన్ని కథలూ, అందరి కథలూ చేరే చోటు...
భరతభూమిలోని అన్ని నగరాలకూ తలమానికమైన చోటు...
"నగరేషు కాంచీ...."
ఆ నగరంలో అనేకానేక దేవాలయాలు, ఇటు విష్ణ్వాలయాలు, అటు శైవాలయాలు, మధ్యలో తామరపువ్వు దుద్దులా జగజ్జననీ "శ్రీ కామాక్షీ పరమేశ్వరి" అనంత కరుణాసముద్రాంతరంగయై కొలువై ఉంటుంది.
"కామాన్ అక్ష్ణోతీతి కామాక్షీ"
భక్తుల యోగ్యమైన కోరికలని తన ఒక్క కటాక్షం వీక్షణంతోనే నెరవేర్చే తల్లి.
ఆ తల్లి కరుణకు అసాధ్యమనే మాట లేదు.
ఆమె ఒక్క కటాక్షంతో అజ్ఞాని - జ్ఞానిగా మారుతాడు...
పాపి - పుణ్యాత్ముడవుతాడు…
దుర్బలుడు - మహాబలుడౌతాడు…
మూగవాడు - వాగ్ఝరితో మహాకవిగా వెలుగుతాడు.
అలాంటి దివ్యలీలకు సాక్ష్యంగా నిలిచిన మహనీయుడే మూకశంకరులు, జగత్తు "మూకకవి" అని గౌరవించిన భక్తశిరోమణి, ఆనక ఆయనే జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ మూకశంకరేంద్ర సరస్వతీ మహా స్వామి.
---
సామాన్య శకం నాలుగవ శతాబ్దంలో
కాంచీపురంలో జ్యోతిష్యంలోనూ, ఖగోళ శాస్త్రంలోనూ దిట్ట ఐన విద్వావతి అనే ఒక సద్బ్రాహ్మణునికి అతని భార్యకు వరాలరాశిగా ఓ కుమారుడు జన్మించాడు.
ఆ బిడ్డ అపూర్వమైన తేజస్సుతో జన్మించాడు.
కానీ...
నెలలు సంవత్సరాలుగా మారుతున్నా అతని నోట మాట పలకలేదు, అతడు ఏశబ్దం వినలేదు.
తల్లిదండ్రులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. వైద్యులను ఆశ్రయించారు. మంత్రాలు, హోమాలు, వ్రతాలు చేశారు.
బహుశా అమ్మ సంకల్పం వేరుగా ఉన్నట్లుంది.
ఆ బాలుణ్ణి అందరూ "మూకః - మూగవాడు" అని పిలవడం పరిపాటి అయ్యింది.
---
ఈ జగత్తు లేని అతని నోటిమాటను చూసింది...
కానీ ఆ జగజ్జనని కామాక్షి తల్లి అతని మనసుని చూసింది.
---
ప్రతి ఉదయం...
సూర్యుడు ఉదయించకముందే...
బ్రాహ్మీ ముహూర్తంలో నిత్య విధి నిర్వర్తించుకొని,
ఆ బాలుడు కంచి కామాక్షి ఆలయానికి చేరుకునేవాడు.
గాయత్రిమంటపంలో గర్భగుడి ముందు నిశ్శబ్దంగా కూర్చునేవాడు.
వినపడని కారణాన అతను ఎక్కువగా ఏ వేద మంత్రాలు, ఉపాసనా మంత్రాలు నేర్చుకోలేకపోయాడు.
శ్లోకాలు చదవలేడు, స్తోత్రాలు చేయలేడు, కీర్తనలు పాడలేడు.
కానీ...
అతని కన్నీళ్లు ప్రార్థనగా మారేవి.
అతని మౌనం జపంగా మారేది.
అతని హృదయం ఎప్పుడూ"అమ్మా… అమ్మా" అంటూ ఆర్ద్రతతో పిలిచేది.
రోజులు గడిచాయి...
నెలలు గడిచాయి...
సంవత్సరాలు గడిచాయి...
కానీ ఆ బాలుడి భక్తి మాత్రం తగ్గలేదు.
కామాక్షి సన్నిధి అతని ఇల్లు అయింది.
అమ్మవారి పాదాలు అతని ప్రపంచమయ్యాయి.
ఒకరోజు...
ఆలయంలో మహోత్సవం.
వేదఘోషలు మారుమ్రోగుతున్నాయి.
సన్నాయి భజంత్రీలు
ఢక్కాలు, తూర్యఘోషలు మిన్నంటాయి.
ఘంటానాదాలు గగనాన్ని తాకుతున్నాయి.
అర్చకులు మహామంగళహారతి సమర్పిస్తున్నారు.
ఎర్రని చీర అలంకారంలో...
రత్నాభరణాలు, రత్న కిరీటం ధరించి...
చెఱుకు విల్లు, పుష్పబాణాలు, పాశాంకుశాలు ధరించి..
చిలుక రూపంలో ఉన్న సాధక పండితులు అమ్మవారి చెవిలోకి వినపడేట్టుగా కీర్తిస్తుండగా…
ఆ మహా మంగళ హారతుల కాంతిలో గాయత్రి మంటపంలోని గర్భగుడిలో ఉన్న కామాక్షి అమ్మవారు కోట్ల చంద్రుల కాంతిని మించిన సౌందర్యంతో ప్రకాశిస్తున్నది.
భక్త కోటులు అమ్మ దర్శనానికి వెంపర్లాడుతూ వంగి వంగి అమ్మను చూస్తున్నారు.
కామాక్షి తావకకటాక్షమహేంద్రనీల-
సింహాసనం శ్రితవతో మకరధ్వజస్య!
సామ్రాజ్యమంగలవిధౌ ముణికుండలశ్రీః
నీరాజనోత్సవతరంగితదీపమాల!!
ఉత్సవాల్లో భాగంగా ఆ సాయంత్రం భద్రపీఠంపై అమ్మవారిని ఊరు ఏగించడానికి శుక్రవార మంటపంలో అమ్మవారిని భద్రపీఠం పై ఉంచి అర్చక స్వాములు షోడశోపచారాలతో పూజ చేసి భద్ర పీఠ వాహనంపై ఉన్న అమ్మను గుడి ఆవరణలో ప్రదక్షిణగా తీసుకెళ్ళి తూర్పు ద్వారంగుండా ఊరు ఏగింపుకు తీసుకువస్తున్నారు. ఆ భద్రపీఠవాహనానికి ముందు ఆదిశంకర సన్నిధిలోను శంకరుల మూర్తిని పల్లకీలో వేదపండితులు తీసుకొచ్చి బ్రహ్మరథం పట్టారు. ముందు శంకరుల బ్రహ్మరథం ఆ వెనక జగదంబ భద్రపీఠం ఊరేగింపుగా అర్చకులు, ఆలయ సిబ్బంది, భటులు, భక్త కోట్లు, పండితులు, సువాసినులతో కలిసి బయకుదేరారు.
ఆ సమయంలో… ఆలయ ప్రాంగణం అంతా నిశ్శబ్దంగా ఖాళీగా ఉంది. అతి కొద్ది మంది ఉన్నారు…
గాయత్రి మంటపంలో ఒక సాధకుడు కూర్చుని శ్రీవిద్యామంత్ర సాధన తపస్సులా చేస్తున్నాడు.
అక్కడే మరో ప్రక్క ఈ మూగబాలుడు కూడా కూర్చొని అమ్మను తదేకంగా చూస్తూ మనసులోనే ‘అమ్మా అమ్మా’ అని తలచుకుంటున్నాడు.
ఓ అద్భుతం సాకారమయ్యే వేళ అది... ఆ సమయంలో...
జగన్మాత సామాన్య స్త్రీ రూపాన్ని ధరించి ఆలయ మండపంలో ప్రత్యక్షమైంది.
సింధూరారుణ విగ్రహాం… ఎర్రని సింధూర కాంతిలో ఉన్న అమ్మ పాదాలపై దేవకాంతలు మరింత ఎరుపును ఆపాదించే పారాణి దిద్ది, నూపురాలు అలంకరించిన పాదాలతో నెమ్మదిగా నడుస్తూ.. క్షల్ క్షల్ అని గజ్జెలు మంద్రంగా చప్పుడు చేస్తుండగా…
సుపర్వస్త్రీలోలాలకపరిచితం షట్పదకులైః
స్ఫురల్లాక్షారాగం తరుణతరణిజ్యోతిరరుణైః !
భృతం కాంత్యంభోభిః విసృమరమరందైః సరసిజైః
విధత్తే కామాక్ష్యాః చరణయుగలం బంధుపదవీం !
ఘనమైన తన జుత్తుని జడవేసి కొప్పుకట్టి, చుట్టూ దమనంతో కలిపి మల్లెలు, కనకాంబరాలతో కట్టిన దండ చుట్టి, మధ్యలో సంపెంగలు దూర్చి ఉన్న సిగతో… వేదమాత పాపిట దిద్దిన సిందూరంతో… అష్టమినాటి చంద్ర బింబంలాంటి నొసలు పై ఉదయించే సూర్యుని వంటి కుంకుమ బొట్టుతో… ఎక్కుపెట్టిన విల్లులా ఉండే చక్కనైన కత్తిరింపబడని కనుబొమలతో(సుభ్రూః)… విప్పారిన తామరలవంటి కళ్లతో… సంపెంగ పువ్వు ఆకారంలోని ముక్కుతో, ముత్యాలు, పగడాలు వజ్రాల నత్తులు అడ్దబేసర్లతో…పద్మరాగమణులవంటి చెక్కిళ్లతో... ఎర్రని పెదవులతో స్మితముఖియై నడుస్తూ వస్తూంటే దివ్య చందన సువాసనలు గుప్పు గుప్పుమని వస్తుండగా.. తమలపాకుli, వక్కలు, కాల్చిన ముత్యంపొడి, పచ్చకర్పూరం, జాజికాయ జాపత్రి గుండ, ఎండిన ఖర్జూరాలు వేసిన తాంబూలం నోటి నిండా పెట్టుకుని నములుతూ…
వేదమయీం నాదమయీం బిందుమయీం పరపదోద్యదిందుమయీం!
మంత్రమయీం తంత్రమయీం ప్రకృతిమయీం నౌమి విశ్వవికృతిమయీం!!
ఆ మహా మాయ, జగజ్జనని మొదటగా ఆ మహాసాధకుని వద్దకు వెళ్లింది…
ఆమె నోట తాంబూలం ఉంది.
దివ్యసుగంధం వెదజల్లుతోంది.
తన నోటిలోని తాంబూలపు పిడచను ప్రసాదంగా అందించింది.
కానీ...
అతడు ఆమెను సామాన్య స్త్రీగా భావించాడు.
"ఎంగిలి తాంబూలమా?" అని సంకోచించి స్వీకరించలేదు. సౌమ్యంగా ఓ నవ్వు నవ్వి మళ్ళీ కళ్ళుమూసుకొని జపం చేయసాగాడు…
అమ్మ చిరునవ్వు నవ్వింది.
కోపం లేదు...
కరుణ మాత్రమే.
ఆమె నెమ్మదిగా ఇంకోవైపుకు తిరిగి...
మండపంలో ఇంకో మూలన కళ్ళుమూసి ధ్యానంలో కూర్చున్న మూగబాలుడి వద్దకు వచ్చింది.
చందనం, పువ్వులు, పారాణి, నోటి తాంబూలం సువాసనలు మేళవించి గుప్పున వచ్చిన వాసనకు ఆ
బాలుడు కళ్లు తెరిచాడు.
ఆ స్త్రీ ముఖంలో ఏదో అపూర్వమైన తేజస్సు.
ఆమె తన చేయి చాచి...
తాంబూల శేష ప్రసాదాన్ని అతని అరచేతిలో ఉంచింది.
అతడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు.
"ఇది అమ్మ ప్రసాదం" అనే భావంతో...
పరమభక్తితో తలవంచి స్వీకరించాడు.
ఆ మరుక్షణమే...
అత్యంత అబ్బురపోయే సంఘటన జరిగింది..
అది కేవలం తాంబూలం కాదు...
సాక్షాత్తు “వాగ్దేవి అనుగ్రహం”
అతని నాలుకపై నిద్రాణంగా ఉన్న సరస్వతి మేల్కొంది. వాగ్దేవతలందరూ ఒకేసారి అనుగ్రహించారు...
జన్మలో ఒక్క మాట పలకని ఆ నోటి నుండి...
గంగాప్రవాహంలా సంస్కృత కవిత్వం ఉబికి వచ్చింది.
ఆలయంలో ఉన్నవారంతా ఆశ్చర్యంతో నిలిచిపోయారు.
మూగవాడని అందరికీ తెలిసిన ఆ బాలుడు...
అనర్గళంగా కామాక్షి మహిమను గానం చేస్తున్నాడు...
రాకాచంద్రసమానకాంతివదనా నాకాధిరాజస్తుతా
మూకానామపి కుర్వతీ సురధునీనీకాశవాగ్వైభవం!
శ్రీకాంచీనగరీవిహారరసికా శోకాపహంత్రీ సతాం
ఏకా పుణ్యపరంపరా పశుపతేరాకారిణీ రాజతే!!
ఆ రోజు ప్రారంభమైన ఆ దివ్య కవితా ప్రవాహమే...
తరువాత "మూకపంచశతి"గా లోకప్రసిద్ధి పొందింది.
ఐదు శతకాలుగా విభజించబడిన ఆ అయిదువందల శ్లోకాల ప్రతి అక్షరం...
కామాక్షి కరుణకు సాక్ష్యంగా నేటికీ భక్తుల హృదయాలను పరవశింపజేస్తూనే ఉంది.
ఆ రోజు నుండి...
ప్రపంచం ఆయనను "మూకుడు" అని పిలవలేదు. "మూకకవి"గా కీర్తించి భక్తిశ్రద్ధలతో నమస్కరించింది.
ఆయన నోటి నుండి ప్రవహించిన ఆ దివ్య కవిత్వమే కాలక్రమేణా "మూకపంచశతి'"గా ప్రసిద్ధి చెందింది. ఐదు శతకాలుగా విభజించబడిన ఈ దివ్య స్తోత్రరత్నం
-ఆర్యాశతకం,
-పాదారవిందశతకం,
-స్తుతిశతకం,
-కటాక్షశతకం,
-మందస్మితశతకం
...అనే ఈ అయిదు భాగాలలో అమ్మవారి అనంత సౌందర్యాన్ని, కరుణను, కటాక్షామృతాన్ని అక్షరాలతో కూర్చి ప్రపంచానికందించారు మూకమహాకవి. ఆపదబంధాలు, ఛందో వ్యాకరణప్రయోగాలు, అద్భుతమైన అలంకారాల ప్రయోగ విన్యాసాలు ఆహా... అదో గొప్ప కావ్యమైంది...
కంపాతీచరాణాం కరుణాకోరకితదృష్టిపాతానాం!
కేలీవనం మనో మే కేషాంచిద్భవతు చిద్విలాసానాం!!
మూకకవిలో వెల్లివిరిసిన అసాధారణ పాండిత్యాన్ని, బ్రహ్మవిద్యాస్వరూపిణి ఐన అమ్మ కామాక్షి యొక్క స్వస్వరూప జ్ఞానాన్ని, అతనికి సద్యః ఫలితంగా భాసించిన వేదపాండిత్యాన్ని గమనించిన అప్పటి కాంచీ కామకోటి సర్వజ్ఞ మూలామ్నాయ పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ మార్తాండ విద్యాఘనేంద్ర సరస్వతి మహాస్వాములు, ఆయనకు సన్యాసదీక్షను ప్రసాదించారు.
సన్యాసాశ్రమంలో ఆయనకు "శ్రీ మూకశంకరేంద్ర సరస్వతి" అనే యోగపట్టా ప్రసాదించి,శంకర పరంపరాగత కాంచీ కామకోటి మూలామ్నాయ సర్వజ్ఞ పీఠానికి ఇరవయ్యవ జగద్గురువుగా అభిషేకించారు.
జగద్గురువుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం...
వేదాలు, వేదాంగాలు, శాస్త్రాలు, ఆగమాలు అన్నింటిలోనూ అపార పాండిత్యాన్ని ప్రదర్శించి, అనేక మంది శిష్యులను తీర్చిదిద్దారు.
ఆయన ఆశీస్సుల కోసం పండితులు మాత్రమే కాదు... అనేకమంది రాజులు కూడా వచ్చేవారు.
కాశ్మీర దేశాధిపతులైన మాతృగుప్తుడు, ప్రవరసేనుడు వంటి మహారాజులు సైతం ఆయనను దర్శించి, సేవించారని గురుపరంపరలో ప్రసిద్ధి.
దాదాపు ముప్పై తొమ్మిది సంవత్సరాలపాటు ( 385CE - 398CE) కాంచీ కామకోటి పీఠాన్ని అలంకరించిన శ్రీ మూకశంకరులు, ధర్మప్రచారం, వేదరక్షణ, శ్రీవిద్యా సంప్రదాయ పరిరక్షణలో అపూర్వ సేవలను అందించి, భక్తుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు.
ఆయన అపర శివావతారం... శివుడే ఒకనాడు దూత్వాసునిగా వచ్చి ఆర్యాద్విశతి రచించి, కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలోబర్చావిశేషాలను నిర్దేశించారు.
ఆ తరవాత ఆపరమ శివుడే ఆది శంకర భగవత్పాదులుగా వచ్చి సౌందర్యలహరినిచ్చి, శ్రీచక్ర ప్రతిష్ఠాపన గావించి, కామకోటిమూలామ్నాయ సర్వజ్ఞ పీఠాన్ని అక్కడే స్థాపించి అధిష్ఠించారు.
ఆ అంశయే మూక శంకరంద్రులుగా వచ్చి 500శ్లోకాలతో అమ్మను స్తుతించి కంచి కామకోటి మూలామ్నాయ సర్వజ్ఞపీఠాన్ని అధిరోహించారు.
కంచి కామకోటి మూలామ్నాయ సర్వజ్ఞ పీఠాధిపతి బ్రహ్మలీన జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ శ్రీ మూకశంకరేంద్ర సరస్వతీ మహా స్వామికీ జై!
నేటికీ కామాక్షి అమ్మవారి ఆలయంలో భక్తులు దర్శనానికొచ్చి చెప్పుకునేదొక్కటే...
తల్లి కటాక్షం లభిస్తే...
మూగవాడైనా మహాకవి అవుతాడు...
సామాన్య వటువైనా జగద్గురువు అవుతాడు...
మనిషి జీవితమే ఆదర్శపూర్వమైన దివ్యచరిత్రగా మారుతుంది.
ఐశ్వర్యమిందుమౌలేరైకాత్మ్యప్రకృతి కాంచిమధ్యగతం!
ఐందవకిశోరశేఖరమైదంపర్యం చకాస్తి నిగమానాం!!
భక్తి అనేది నాలుకతో పలికే మాటల్లో ఉండదు...
మనసునిండా అమ్మని తలచుకొని అర్పించే ప్రేమలో ఉంటుంది.
ప్రపంచం మొత్తం మనలో ఉన్న లోపాలను మాత్రమే చూస్తుంది.
జగన్మాత మాత్రం మన భక్తిని చూస్తుంది.
మనలోని లోపాలనే తన అనుగ్రహానికి హేతువుగా చూస్తుంది
జ్ఞానం గొప్ప సాధనతో రావచ్చు...
కానీ, జగదంబ అనుగ్రహం లభిస్తే జ్ఞానం కరతలామలకం ఔతుంది, వాగ్ఝరి అమృతధారలా ప్రవహిస్తుంది.
అమ్మ కటాక్షం కలిగితే...
మౌనం కూడా వేదమవుతుంది...
పామరులు కూడా మహాకవులుగా వెలుగొందుతారు...
నోటినుండి వచ్చే ప్రతిమాటా భక్తి కవిత్వమౌతుంది…
జీవితమే జగదంబలీలాతరంగ కావ్యమై నిలుస్తుంది...
---
అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే!
జయ దుర్గే! శివ దుర్గే! హర దుర్గే!
జయ జయ - జయ జయ కామాక్షీ!
జయ జయ - జయ కయ కామాక్షీ!
(యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్!
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే !!
విసర్గ బిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ !
న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పరమేశ్వర !!)
-శంకరకింకరః (శ్రీ అయ్యగారి నాగేంద్ర)