జై శ్రీనాథజీ!
ఆ రోజు జమునావతీ గ్రామంలో సాయంకాలం.
సూర్యుడు అస్తమించబోతున్నాడు.
ఆకాశం అంతా బంగారు రంగులో మెరిసిపోతోంది.
కుంభనదాసు ఇంటి ముందు కూర్చొని శ్రీనాథుడి నామం పాడుకుంటున్నాడు.
అంతలో అతని భార్య ఆందోళనగా వచ్చింది. "వింటున్నారా? మన పొలంలో ఈసారి వచ్చిన పంటే మన ఆశ. రాత్రిపూట పొలాల్లోకి నెమళ్ళు, జింకలు ఇతర జంతువులు వస్తున్నాయి. ఈరోజు మీరు కాపలా వెళ్లాలి." అంది.
కుంభనదాసు పాటపాడుకుంటూ చిరునవ్వుతో అలాగే అన్నట్లుగా తల ఊపాడు.
రాత్రి అయింది.
చంద్రుడు ఆకాశంలో వెన్నెల కురిపిస్తున్నాడు.
కుంభనదాసు పొలానికి వెళ్లాడు.
చేతిలో కర్రపట్టుకున్నాడు, దానికి చిడతలు, గజ్జెలు కట్టాడు.
తనకున్న చిన్న పొలానికి నలువేపులా ఉన్న గట్లపై కాపలా తిరుగుతున్నాడు
అక్కడి నుంచి గోవర్ధనగిరి కనిపించింది.
వెన్నెలలో గోవర్ధనగిరి కనిపించగానే...
శ్రీనాథుడి రూపం హృదయంలో మెరిసింది.
కళ్లలో ఆర్ధ్రత కూడిన భక్తి నిండిపోయింది.
చేతిలోని కర్రను కిందపెట్టి,
చిడతలు చేతిలో పట్టుకొని,
మెల్లగా పాడడం మొదలుపెట్టాడు.
"శ్రీనాథ... నా నాథ...
నా జీవనాధారా..."
పాట క్రమంగా ప్రేమమయంగా మారింది.
ప్రేమ క్రమంగా పరవశంగా మారింది.
అంతలో చిలకలు, నెమళ్ళు వచ్చాయి.
ధాన్యం తినసాగాయి.
కొన్ని జింకలు వచ్చాయి.
ఆవులు వచ్చాయి.
పంటను మేస్తున్నాయి.
కానీ కుంభనదాసు వాటిని చూడలేదు.
అతని చూపు వెన్నెల్లో గోవర్ధనగిరి పైనే ఉంది.
అతని మనసు శ్రీనాథుడి పాదాల దగ్గరే ఉంది.
కొద్దిసేపటికి పక్షుల కిలకిలారావం విని వెనక్కి తిరిగాడు.
ధాన్యం తింటున్న పక్షులను చూసి ఆనందించాడు.
"ఆహాఁ!
మీరా వచ్చిందీ?
తినండి... తినండి...
ఇవన్నీ నా శ్రీనాథుడివే." అన్నాడు.
మరుసటి రోజు... ఉదయానికి సగం పంట కనిపించలేదు.
భార్యకు కోపం వచ్చింది. " మీకు చెప్పినపనేంటి మీరేం చేశారు రాత్రంతా?"అని అడిగింది.
కుంభనదాసు అమాయకంగా "మన యజమాని గోవులను పంపాడు, పక్షులను పంపాడు, జింకలను పంపాడు, మన యజమాని వస్తువును యజమానే తీసుకున్నాడు. అడ్డుపడటానికి నేనెవడిని?" అన్నాడు.
కహా కరౌం వహ మూరతి జియ తే న టరై!
నైనన భీతర బసి గఈ ఐసీ,
పల భర దూర న పరై!!
తెలుగు భావం
"ఏం చేయను?
ఆ కృష్ణమూర్తి నా హృదయం నుండి తొలగడం లేదు.
ఆ రూపం నా కళ్లలో, నా మనసులో శాశ్వతంగా స్థిరపడిపోయింది.
ఒక్క క్షణం కూడా ఆయనను మరచిపోలేను."
ఆ మాటలు విన్న ఇరుగుపొరుగుల కళ్లలో నీళ్లు తిరిగాయి.
ఎందుకంటే... పంట కంటే పెద్ద సంపదను కుంభనదాసు పొందాడు. అది స్వామిపై సంపూర్ణ సమర్పణ. అతని భక్తికి పరవశించిన గ్రామస్థులు కొంత సహాయం చేసి అతని భార్యని ఊరడించారు.
జై రాధే కృష్ణ
జై శ్రీనాథ్ జీ
No comments:
Post a Comment