జై జగన్నాథ! జై రాధే శ్యామ్!
పురుషోత్తమ క్షేత్రమైన పురీ...
నీలాచలంపై కొలువైన జగన్నాథుని దివ్యధామం...
సముద్రపు అలలు కూడా "జగన్నాథ... జగన్నాథ..." అని జపిస్తున్నట్లుగా వినిపించే పుణ్యభూమి...
ఆలయ గోపురంపై రెపరెపలాడే పతాకం భక్తులకు మోక్షమార్గాన్ని చూపిస్తున్నట్లుగా అనిపించే మహాక్షేత్రం...
అలాంటి పవిత్ర భూమిలోని ఒక చిన్న గ్రామంలో ఒక పేదింటి అమ్మాయి నివసించేది.
ఆమెకు పెద్దగా విద్య లేదు.
ఆస్తి లేదు.
అండగా నిలిచే బంధువులు లేరు.
లోకానికి ఆమె ఒక సాధారణ బాలిక మాత్రమే.
కానీ జగన్నాథుని దృష్టిలో మాత్రం ఆమె అమూల్యమైన భక్తురాలు.
ఎందుకంటే ఆమె వద్ద ఒక అమూల్యమైన సంపద ఉండేది.
అది...
శ్రీకృష్ణుని పట్ల నిష్కపటమైన ప్రేమ.
ఆ ప్రేమకు కారణం లేదు.
ఆ ప్రేమకు హద్దులు లేవు.
ఆ ప్రేమకు ప్రతిఫలం కావాలనే ఆశ లేదు.
ఆమె హృదయం అంతా కృష్ణమయం.
ఆమె చూపులో కృష్ణుడు...
ఆమె శ్వాసలో కృష్ణుడు...
ఆమె గానంలో కృష్ణుడు...
ఆమె కన్నీళ్లలో కూడా కృష్ణుడే...
---
ప్రతిరోజూ బ్రహ్మముహూర్తంలో లేచి, స్నానం చేసి, జగన్నాథుని నామస్మరణతో అడవివైపు బయలుదేరేది.
ఆ సమయంలో ఆకాశంలో నక్షత్రాలు ఇంకా మెరుస్తూనే ఉండేవి.
అడవి అంతా మంచుతెరలతో కప్పబడి ఉండేది.
చెట్ల ఆకులపై మంచుబిందువులు ముత్యాల్లా మెరుస్తుండేవి.
రంగురంగుల అడవి పూలు సువాసనలు వెదజల్లుతూ నవ్వుతున్నట్లుగా కనిపించేవి.
ఆమె ఆ పూలను ఎంతో జాగ్రత్తగా ఏరేది.
వాటితో అందమైన మాలలు అల్లేది.
ఒక దండను జగన్నాథునికి సమర్పించేది.
మిగిలిన పూలను అమ్ముకొని తన జీవనాన్ని గడిపేది.
అదే ఆమె జీవితం.
అదే ఆమె ఉపాధి.
అదే ఆమె భక్తి.
---
ఆలయం వద్దకు వచ్చే భక్తులు, పండితులు, సాధుసంతులు తరచుగా గీతగోవిందం ఆలపించేవారు.
శ్రీ జయదేవ కవి రచించిన ఆ అమృతగానం ఆమె చెవుల్లో పడింది.
మొదట వినింది.
తర్వాత నేర్చుకుంది.
ఆపై తన హృదయంలో దాచుకుంది.
కొద్దికాలానికే గీతగోవిందం ఆమె శ్వాసగా మారిపోయింది.
ఇక అడవిలో పూలు కోస్తూ ఉన్నా...
నడుస్తూ ఉన్నా...
మాలలు అల్లుతూ ఉన్నా...
ఆమె పెదవులపై గీతగోవిందమే.
ఆ రోజు కూడా పూల కోసం అడవిలోకి వెళ్తూ ఆమె మృదువుగా ఆలపించింది—
"లలిత లవంగ లతా పరిశీలన
కోమల మలయ సమీరే..."
ఆ మధుర గానం వినగానే అడవి గాలి కూడా నెమ్మదిగా వీచిందట.
కదంబవృక్షాలపై ఉన్న పక్షులు కిలకిలారావాలు ఆపి వినేవట.
జింకలు దగ్గరకు వచ్చి నిలబడేవట.
ఎందుకంటే అది సంగీతం కాదు...
ప్రేమకు వచ్చిన స్వరం.
రాధాకృష్ణుల లీలలకు వచ్చిన రూపం.
---
పూలు కోస్తూ కోస్తూ ఆమె కొన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకునేది.
రాధమ్మ విరహాన్ని తలచుకొని హృదయం కరిగిపోయేది.
అప్పుడు మరింత ఆవేశంతో ఆలపించేది—
"ప్రియే చారుశీలే!
ముంచ మయి మానమనిదానం..."
"ఓ రాధే! కోపాన్ని విడిచిపెట్టు. నీ శ్యాముడు నీకోసమే తపిస్తున్నాడు..."
అనే ఆ భావం ఆమెను మరో లోకానికి తీసుకెళ్లేది.
ఆమె శరీరం అడవిలో పూలకై తిరుగుతుండేది.
కానీ మనస్సు మాత్రం బృందావనంలో విహరించేది.
---
ఇలా రోజులు...
నెలలు...
సంవత్సరాలు గడిచిపోయాయి.
ఒకరోజు ఆలయ అర్చకులు ఒక విచిత్రమైన విషయం గమనించారు. ప్రతిరోజూ ఉదయం ఆలయం తెరవగానే చూస్తే స్వామివారి పీతాంబరాలు చిరిగిపోయి కనిపిస్తున్నాయి.
మొదట ఎలుకల పని అనుకున్నారు. కొన్ని రోజులు గమనించారు. కానీ పరిస్థితి మారలేదు. రోజురోజుకీ వస్త్రాలపై మట్టి మరకలు కనిపించసాగాయి. చిన్న చిన్న ముళ్ల గీతలు కనిపించసాగాయి. కొన్నిసార్లు ఎండిన ఆకులు, తీగల ముక్కలు కూడా కనిపించసాగాయి.
అర్చకులు ఆశ్చర్యపోయారు.
"రాత్రి గర్భగుడి తలుపులు బిగించి మూసేస్తాం. లోపలికి ఎవరూ రారు. అయితే స్వామివారి పీతాంబరాలు ఇలా ఎలా చిరుగుతున్నాయి?" అని చర్చించుకున్నారు.
ఆ వార్త కొద్దిరోజుల్లో రాజుగారి చెవిన కూడా పడింది. రాజు ఆశ్చర్యపోయాడు.
"ఇందులో ఏదో దివ్యరహస్యం ఉంది." అని భావించాడు.
---
ఆ రాత్రి...
జగన్నాథుని ధ్యానిస్తూ నిద్రపోయిన రాజుకు ఒక అద్భుతమైన స్వప్నం కలిగింది.
ఆ స్వప్నంలో నీలమేఘశ్యాముడైన జగన్నాథుడు ప్రత్యక్షమయ్యాడు.
ఆ ముఖంలో అపూర్వమైన చిరునవ్వు.
ఆ కళ్లలో అనంత కరుణ.
రాజు సాష్టాంగ నమస్కారం చేశాడు.
అప్పుడు జగన్నాథుడు మృదువుగా .
"రాజా... నా పీతాంబరాలు ఎందుకు చిరుగుతున్నాయో తెలుసుకోవాలని నీకు ఆసక్తి కదా?" అని పలికాడు.
"అవును ప్రభూ!" అని రాజు వినయంగా అన్నాడు.
జగన్నాథుడు చిరునవ్వు నవ్వాడు.
---
"ప్రతిరోజూ నా కోసం పూలు తెచ్చే ఒక కన్య ఉంది.
ఆమె గీతగోవిందం పాడుకుంటూ అడవిలో తిరుగుతుంది.
ఆమె హృదయం అంతా నాతో నిండిపోయి ఉంటుంది.
పూలు కోస్తున్నా నన్నే చూస్తుంది.
నడుస్తున్నా నన్నే తలుస్తుంది.
పాడుతున్నా నాకోసమే పాడుతుంది." కొద్దిసేపు ఆగి మళ్లీ అన్నాడు
"ఆమె ఇలా ఆలపించినప్పుడు...
స్మర గరళ ఖండనం
మమ శిరసి మండనం
దేహి పదపల్లవముదారం... "
ఆమె తనను తాను మరచిపోతుంది.
ప్రపంచాన్ని మరచిపోతుంది.
ఆ అడవిలో ముళ్లు ఉంటాయి.
రాళ్లు ఉంటాయి.
పాములు ఉంటాయి.
విషపురుగులు ఉంటాయి.
కానీ ఆమెకు ఏవీ కనిపించవు.
ఆమెకు కనిపించేది నేను మాత్రమే."
---
"అందుకే నేను ఆమె వెనకాలే నడుస్తుంటాను.
ఆమె పరుగెత్తినప్పుడు పరుగెత్తుతుంటాను.
ఆమె పాదాలకు ముళ్లు గుచ్చుకోకుండా కాపాడుతుంటాను.
ఆమెను నీడలా అనుసరిస్తుంటాను."
"ఆ ముళ్లపొదల్లో నా పీతాంబరాలే చిక్కుకుని చిరుగుతున్నాయి. ఆ ధూళి నా వస్త్రాలపై పడుతోంది. ఆ ఆకులే, తీగలే నాతో పాటు ఆలయానికి వస్తున్నాయి."
---
రాజు కళ్లలో నీళ్లు తిరిగాయి.
సర్వలోకాలాధిపతి...
దేవతలు సేవించే దేవదేవుడు...
వేదాలు వెతికే పరబ్రహ్మ...
ఒక పేద భక్తురాలి వెనకాల పరుగెత్తుతున్నాడా?
ఆమెకు ముళ్లు గుచ్చుకోకూడదని తన పీతాంబరాలనే త్యాగం చేస్తున్నాడా?
---
జగన్నాథుడు మళ్లీ ఇలా అన్నాడు
"రాజా... నాకు బంగారం అవసరం లేదు.
నాకు రత్నాలు అవసరం లేదు.
నాకు రాజుల వైభవం అవసరం లేదు.
నాకు కావలసింది ఒక్కటే...
ప్రేమ.
నిష్కపటమైన ప్రేమ.
ఆ కన్య నాకు అదే ఇస్తోంది.
నా పీతాంబరాలు చిరగకుండా ఉండాలంటే...
ఆమె ఒకచోట కూర్చొని గీతగోవిందం పాడేలా ఏర్పాటు చేయి." అని చెప్పి అంతర్ధానమయ్యాడు.
---
రాజు ఉలిక్కిపడి మేల్కొన్నాడు.
హృదయం ఆనందంతో నిండిపోయింది.
మరుసటి రోజు ఆలయానికి వెళ్లి అర్చకులు, అధికారులు, పండితులను సమావేశపరిచాడు.
ఆ కన్యను కూడా పిలిపించాడు.
భయంతో, సంకోచంతో వణుకుతూ ఆమె వచ్చింది.
తనకు ఏమీ తెలియదని వేడుకుంది.
"ప్రభూ... నేను ఏ తప్పూ చేయలేదు. ఉదయం పూలదండ సమర్పించి వెళ్తాను అంతే..." అని అమాయకంగా చెప్పింది.
అప్పుడు రాజు తన స్వప్నంలో జరిగినదంతా వివరించాడు.
---
ఆమె ఆశ్చర్యపోయింది.
కళ్లలో ఆనందబాష్పాలు ఉబికాయి.
చేతులు జోడించి జగన్నాథుని వైపు చూస్తూ...
"ప్రభూ...
నేను అనాథను.
నాకు తల్లీ తండ్రీ లేరు.
నాకు బంధువులూ లేరు.
నాకు అన్నీ నీవే.
నీకు పూలు సమర్పించడం నా జీవితం.
అంతకంటే నాకు ఏమీ తెలియదు."
అని చెప్పి కన్నీళ్లతో జగన్నాథుని దర్శించసాగింది.
---
ఆ రోజు నుండీ రాజు ఆలయంలో ప్రత్యేక వేదికను నిర్మింపజేశాడు.
ప్రతిరోజూ మంగళవేళలో జగన్నాథుని సన్నిధిలో ఆ కన్య గీతగోవిందం ఆలపించడం ఆచారంగా మారింది.
ఆమె గానం మొదలైతే ఆలయం నిశ్శబ్దమైపోయేది.
అర్చకులు మంత్రోచ్చారణను కూడా కాసేపు మరిచిపోయేవారు.
భక్తులు కాలాన్ని మరచిపోయేవారు.
ఎందుకంటే అక్కడ పాడుతున్నది ఒక గాయని కాదు...
తన హృదయాన్ని జగన్నాథుని పాదాల వద్ద ఉంచిన ఒక ప్రేమభక్తురాలు.
---
ఆ రోజు నుండి జగన్నాథుని పీతాంబరాలు చిరగడం ఆగిపోయిందని చెబుతారు.
కానీ పురీ ప్రజలు మాత్రం ఒక మాట చెప్పుకునేవారు. "పీతాంబరాలు ఇక చిరగకపోవచ్చు...
కానీ జగన్నాథుని హృదయం మాత్రం ఆ కన్య ప్రేమకు శాశ్వతంగా బంధించబడిపోయింది."
ఆ రోజు పురీ ప్రజలు ఒక గొప్ప సత్యాన్ని గ్రహించారు.
భగవంతుడికి అర్పించే పుష్పాల విలువ వాటి సుగంధంలో ఉండదు.
వాటిని సమర్పించే హృదయపు పవిత్రతలో ఉంటుంది.
భగవంతుడికి వినిపించే గానం విలువ రాగంలో ఉండదు.
అందులో దాగిన ప్రేమలో ఉంటుంది.
అందుకే భక్తులు అంటారు—
"భక్తుడు భగవంతుని వెతుకుతాడు.
కానీ ప్రేమ పరాకాష్టకు చేరినప్పుడు,
భగవంతుడే భక్తుని వెనకాల పరుగెత్తుతాడు."
ఆ కన్య గీతగోవిందం పాడుతూ అడవిలో పూలు కోసిన ప్రతిసారీ...
ల్
జగన్నాథుడు ఆమె వెనకాల నడిచేవాడు.
ఆమె పరుగెత్తినప్పుడు పరుగెత్తేవాడు.
ఆమె అలసిపోయినప్పుడు నీడలా వెంట ఉండేవాడు.
ఆమె కన్నీళ్లు పెట్టుకున్నప్పుడు మౌనంగా తుడిచేవాడు.
అందుకే ఆయన పీతాంబరాలు చిరిగిపోయేవి.
కానీ ఆ చిరిగిన పీతాంబరాలు...
భక్తి చరిత్రలో ప్రేమకు లభించిన అత్యంత మధురమైన సాక్ష్యాలుగా నిలిచిపోయాయి.
జై జగన్నాథ!
జై రాధే! జై శ్యామ్!
- శంకరకింకరః
అనిల తరళ కువలయ నయనేన,
తపతి న సా కిసలయ శయనేన!
సఖి! యా రమితా వన మాలినా!
వికసిత సరసిజ లలిత ముఖేన,
స్ఫుటతి న సా మనసిజ విశిఖేన!
సఖి! యా రమితా వన మాలినా!
అమృత మధుర మృదుతర వచనేన,
జ్వలతి న సా మలయజ పవనేన!
సఖి! యా రమితా వన మాలినా!
(జయదేవ)
No comments:
Post a Comment