Pages

Tuesday, July 17, 2018

భర్తకన్నా తనకు నచ్చినదేదో కావాలనుకుని

(రామాయణం సనాతనం జీవన కావ్యం, సదా అధునాతనం..... ఇప్పటికీ ఎప్పటికీ మన జీవితాలకెప్పుడూ అన్వయం.)
భర్త కన్నా మనసుకి నచ్చినదాన్నే కావాలనుకున్నాను. ఆకోరికయే మొదట మానసికంగా ఆతరవాత శారీరకంగా భర్తనుండి విడదీసింది...........


సీతమ్మంటుంది నాకు కాలమే మృగం రూపంలో వచ్చి నన్ను లోభ పెట్టింది లేకపోతే నన్ను ఇన్నాళ్ళు నా భర్త చాలు. నాకు ఇంకేమీ అక్కరలేదనుకుని ఐశ్వర్యమే వదిలేసినదాన్ని, అంతఃపురమే వదిలేసినదాన్ని, పరిజనాన్ని వదిలేసినదాన్ని బంధుజనాన్ని వదిలేసినదాన్ని, అత్తమామలను వదిలేసినదాన్ని, లక్ష్మణ స్వామి వద్దువదినా... నా మాట వినూ అని అది మారీచుడూ అని స్పష్టంగా చెప్తున్నా.. ఇప్పుడు కాకపోతే రేప్పొద్దున్న అరణ్యవాసం అయిపోయిన తరువాత అంతఃపురానికి వెళ్ళినప్పుడు చూడ్డానికి బాగుంటుందని చెప్పి బంగారు మృగం మీరు ప్రాణాలతోనైనా తీసుకురండి చంపైనా తీసుకురండి అని ఎందుకు పంపించినట్లు? అంటే కాలము నన్ను లోభ పెట్టింది.

 
భర్త తప్ప అన్యం కోరని నన్ను భర్త మరిది వద్దంటున్నా వినకపోవడం వల్ల, భర్త తప్ప దేన్నీ కోరని నామనసు భర్తకన్నా వేరొకదానిని కోరింది. భర్త మరిది వద్దన్నా వాళ్లకన్నా ఆ మృగమే ఆకర్షించింది. భర్త ముఖ్యమా నన్ను ఆకర్షించిన మృగం ముఖ్యమా అని విచారణ చేసి ఉంటే నేను రాముని దగ్గరే ఉండేదానిని. భర్తయే కావాలనుకున్న నాళ్ళు సుఖంగా రాముడివద్దనే ఉన్నాను, లక్ష్మణుడు చెప్తున్నప్పటికీ భర్త క్షేమంకన్నా, భర్త కన్నా మనసుకి నచ్చినదాన్నే కావాలనుకున్నాను. ఆకోరికయే మొదట మానసికంగా ఆతరవాత శారీరకంగా భర్తనుండి విడదీసింది. ఈ కష్టాన్ని అనుభవింపజేయడానికే నా భర్తకన్నా మృగంమీద ఆసక్తి కలిగింది కాలం బలవత్తరమైనది. - సుందరకాండ

-శంకరకింకర

Wednesday, July 11, 2018

రామాయణం చదవడమంటే అక్షరాలు ఘట్టాలు చదవడం కాదు

దుస్తర్కాత్ సువిరమ్యతాం...

నలుగురి మధ్యలో చర్చ.. కుతర్కం ఎగేసుకుంటూ వెళ్ళడం. వద్దయ్యా అంటే మన వాయిస్ ఉండద్దా అని తిరిగి సుద్ధులు, సాధించిందేమిరా అంటే... వ్యక్తిగత దూషణలు ఆపై దైవ దూషణలు, నలుగురి మధ్య వైరం సమాజ పరం చేయడం అంటే ఇదే.  ఇప్పటికైనా పండితులు, విజ్ఞులు కుతర్కాలకెందుకెళ్ళరంటే ఇందుకే అని అవగతమవాలి. అవతలవాడోటంటాడు ఇవతలి వాడు తన ప్రశాంతతని కోల్పోయి ఇంకో రెండంటాడు అక్కణ్ణుంచి ఇలాంటి గొడవలు. లేకపోతే వీళ్ళకన్నా పండితులు లేరనా, వీళ్ళేమైనా శాస్త్రార్థాలలో ప్రతివాదభయంకరులనా. కుతర్కం కూడదు అని శంకరులు ఘాట్టిగా వక్కాణించినదిందుకే.


రాముడు రాముడని గోలకాదు వ్యక్తిగత వైరం వస్తే ముందు లోకాలన్నింటినీ తన బాణాలతో కప్పి లయం చేస్తానన్న రాముడే లక్ష్మణుడిమాటతో ఊరడిల్లి, నా వైరాన్ని లోకానికి కీడుగా మార్చను అని చెప్తాడు. అలా కాదనుకుంటే తన వ్యక్తిగత వైరంకోసం క్షణంలో సీతమ్మనెత్తుకెళ్ళిన వాడితో సహా లోకాలను లయం చేసి ఉండేవాడు. పండితుడు ధార్మికుడు లోకాన్ని స్థంభింపజేయటానికో, అతలాకుతలం చేయటానికి తన శక్తినుపయోగించడు. శాంతిని పంచడానికుపయోగిస్తాడు. అందుకే రాముణ్ణి పండితుడంటారు, సాధుపుంగవుడంటారు.


రామాయణం చదవడమంటే అక్షరాలు ఘట్టాలు చదవడం కాదు, రాముడి నడతను అంటే రాముణ్ణి చదవడం.  రాముణ్ణి జీర్ణించుకోవడం.

-శంకరకింకర.