జై శ్రీ రాధే కృష్ణ
అది పుణ్యపావన కాశీ మహాక్షేత్రం.
గంగమ్మ తల్లి తరంగాల సవ్వడితో,
విశ్వనాథుని డమరుక నాదంతో,
ఆశ్రయించిన జీవులకు నిత్య ముక్తిని ప్రసాదించే ఆ దివ్యనగరంలో...
ఒక పేద బ్రాహ్మణుడు నివసించేవాడు. దరిద్రం అతని గడప దాటి లోపలికి వచ్చినా, అతని అంతరంగం మాత్రం అపారమైన ఆధ్యాత్మిక సంపదతో, కృష్ణ భక్తి రసంతో తులతూగుతూ ఉండేది.
చిన్ననాటి నుంచే అతనికి లోకవ్యవహారాలపై విరక్తి కలిగింది. ధనకనక వస్తువాహనాలు, కీర్తిప్రతిష్ఠలు—ఇవన్నీ క్షణభంగురమైన మాయాజాలమని అతని అంతరాత్మకు తెలుసు. అతనికి తెలిసినది, నమ్మినది, శ్వాసించినది ఒక్కటే "శ్రీమద్భాగవత మహాపురాణం".
ఉదయం కన్ను తెరచిన క్షణం నుండి నిశీధి నిశ్శబ్దంలో నిద్రపోయే వరకూ అతని ప్రతి నిమిషం భాగవతమయమే. ఆ గ్రంథంలోని ప్రతి శ్లోకం అతనికి అమృతధార; ప్రతి లీల ఒక పరమానంద సాగరం. ముఖ్యంగా దశమస్కంథం లోని నందనందనుని బాల్య లీలా విశేషాలను చదువుతున్నప్పుడు, అతని నయనాల నుండి ఆనందాశ్రువులు జాలువారేవి. ఆ ముఖారవిందంలోని తేజస్సు చూస్తే, సాక్షాత్తు ఆ మురళీకృష్ణుడే అతని సముఖాన కూర్చొని లీలలు ప్రదర్శిస్తున్నాడా అన్నట్లు ఉండేది.
ఆ అశ్రుధారలు కేవలం కన్నీళ్లు కావు; అవి ఆ పరమాత్ముని లీలావిలాసాల్లో ఓలలాడిన ఒక భక్తుని అంతరంగ తరంగాలు! చిన్ని కృష్ణుడు యశోదమ్మ నోట విశ్వరూపాన్ని చూపినప్పుడు ఆశ్చర్యంతో, నవనీతాన్ని చోరీ చేస్తూ గోపికలకు దొరికినప్పుడు ముగ్ధత్వంతో, కాళీయుని మదమణిచి నర్తించినప్పుడు భక్తి పారవశ్యంతో ఆయన హృదయం నాట్యమాడేది.
ఆ సమయంలో ఆయన బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా మరచిపోయేవాడు. చుట్టూ ఉన్న దరిద్రం, లోకుల నిందలు, సంసార తాపత్రయాలు—ఏవీ ఆయనను తాకలేకపోయేవి. ఎందుకంటే, ఆ క్షణంలో ఆయన కాశీ నగరంలో లేడు; సాక్షాత్తు ద్వాపరయుగపు బృందావన వీధుల్లో ఆ బాలకృష్ణుని అడుగుజాడల్లో విహరిస్తున్నాడు!
ఇక తల్లిదండ్రులు అతన్ని లోకరీతిలోకి తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. వ్యాపారాలు పెట్టించారు, ఉద్యోగాలలో చేర్పించారు. కానీ, ఆకాశంలో విహరించే పక్షి పంజరంలో ఇమడనట్లు, అతని మనసు ఆ లౌకిక బంధాలలో ఇమడలేదు. చివరకు అన్నింటినీ త్యజించి, మళ్ళీ ఆ భాగవత శరణాగతినే ఆశ్రయించాడు.
ఇది చూసి విసిగిపోయిన బంధుమిత్రులు, "వివాహం జరిపిస్తే బాధ్యతలు పెరుగుతాయి, సంసార చక్రంలో పడితే వాడే దారికొస్తాడు" అని భావించి, అతనికి వివాహం జరిపించారు. కాలక్రమంలో ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. కానీ, ఆ బ్రాహ్మణుని నిశ్చల భక్తి ముందు సంసార మాయాబంధాలు నిలువలేకపోయాయి. అతని ధ్యాస, శ్వాస నిరంతరం ఆ కృష్ణ పాదారవిందాలపైనే లగ్నమై ఉన్నాయి.
ఇక సంసార శకటాన్ని లాగే భారమంతా ఆ ఇల్లాలి భుజాలపై పడింది. ఆమె మహా పతివ్రత, సహనశీలి. భర్త ఏ పనీ చేయకపోయినా ఎన్నడూ పల్లెత్తుమాట అనలేదు; దైవఘటనగా భావించింది. సంసారం నడవడానికి సంపాదనకై తెల్లవారకముందే లేచి, పొరుగు ఇళ్లలో వంటలు చేస్తూ, రొట్టెలు కాలుస్తూ, ఆ కాయకష్టంతో వచ్చిన కొద్దిపాటి ధనంతోనే ఇల్లు గడిపేది. భర్తకు భోజనం పెట్టడం, పిల్లలను సాకడం, ఇంటికి వచ్చే సాధు సంతులకు సేవలందించడం—ఇవన్నీ ఆమె నిశ్శబ్దంగా చేసిన నిత్య యజ్ఞం.
అది ఒక సాయంసమయం... భానుడు పశ్చిమ దిక్కున అస్తమిస్తున్నాడు. ఆ సమయంలో ముగ్గురు తేజోవంతులైన సాధువులు ఆ ఇంటి ముంగిటకు వచ్చారు.
"అమ్మా! ఆకలి వేస్తోందమ్మా, కొద్దిగా ప్రసాదం ఉంటే పెట్టవా తల్లి!" అని ప్రార్థించారు.
ఆ మాట వినగానే ఆ తల్లి ఆప్యాయంగా వంటిట్లోకి వెళ్ళింది. కానీ, అక్కడ ఖాళీ పాత్రలను చూడగానే ఆమె గుండె ఆగినంత పనైంది. ఇంట్లో కనీసం ఒక్క మెతుకు కూడా లేదు! ఆ ఖాళీ కుండలు తన దరిద్రాన్ని చూసి వెక్కిరిస్తున్నట్లు అనిపించింది. ఆమె కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి.
ఆమె నిస్సహాయతను, కన్నీళ్లను గమనించిన ఆ సాధువులు మందహాసం చేస్తూ—
"బాధపడకు తల్లి! ఈరోజు ఆ భోళాశంకరుని సంకల్పం ఇలా ఉంది. మేము మళ్ళీ ఎప్పుడైనా వస్తాంలే" అని చెప్పి, ఆకలితోనే వెనుదిరిగి వెళ్ళిపోయారు.
అతిథులను ఆకలితో పంపాల్సి వచ్చిన ఆ క్షణం ఆమె హృదయాన్ని ముక్కలు చేసింది. ఏళ్ల తరబడి అణచిపెట్టుకున్న ఆవేదన, దుఃఖం ఒక్కసారిగా అగ్నిపర్వతంలా బద్దలయ్యాయి. ఆమె నేరుగా భర్త ఉన్న గదిలోకి వెళ్ళింది. అక్కడ ఆయన ఏమీ ఎరుగనివానిలా, పరమానంద భరితంగా భాగవత పారాయణంలో మునిగిపోయి ఉన్నాడు. ఆ దృశ్యం ఆమెలో క్రోధాన్ని మరింత రగిల్చింది.
"రోజంతా ఈ పుస్తకమేనా! ఈ భాగవతం మనకు ఏమిచ్చింది? పిల్లలు ఆకలితో అలమటిస్తున్నా, ఇంటికి వచ్చిన సాధువులు ఆకలితో వెళ్ళిపోతున్నా మీకు చలనం లేదా? కనీసం ఒక గుప్పెడు అన్నం పెట్టలేని ఈ బ్రతుకెందుకు? ఇక నా వల్ల కాదు!" అని రోదిస్తూ, ఆవేశంలో భర్త చేతిలోని భాగవత గ్రంథాన్ని లాక్కుని నేలకేసి కొట్టింది. "ఇదే నీకు సర్వస్వం అయితే, దీనితోనే బ్రతుకు... ఈ ఇల్లు వదిలి వెళ్ళిపో!" అని నిందించింది.
ఆ నిందలకు బ్రాహ్మణుడు అణుమాత్రమైనా కోపించలేదు. నేలపై చెల్లాచెదురుగా పడిపోయిన భాగవత పత్రాలను ఒక్కొక్కటిగా ఏరుకున్నాడు. అవి అతనికి కేవలం కాగితాలు కావు... అతని ప్రాణం, అతని కృష్ణుడు! ఆ పత్రాలను గుండెలకు హత్తుకుని, కన్నీరు మున్నీరుగా విలపించాడు.
"కృష్ణా! నా భార్యను క్షమించు స్వామీ. సంసార భారం ఆమెను అలసిపోయేలా చేసింది. సాధుపుంగవులకు సేవచేయలేని తనం ఆమె చిరాకుకు కారణమైంది, ఆమెలో దోషాన్ని వెతకకు, ఆమెకు శాంతిని ప్రసాదించు" అని వేడుకుంటూ, ఇల్లు వదిలి గంగాతీరానికి చేరుకున్నాడు. ఆ తల్లి ప్రవాహాన్ని చూస్తూ, కృష్ణస్మరణలో మునిగిపోయాడు.
భక్తుని కన్నీటి ప్రతి బిందువూ వైకుంఠ వాసుని హృదయాన్ని తాకింది.
తన భక్తుని ఆక్రందన చూసి ఆ భక్తవత్సలుని మనసు ద్రవించిపోయింది.
ఇంకేముంది? ఆ మాయానాటక సూత్రధారి ఒక సుందర బాలకృష్ణుని రూపం దాల్చాడు. తలపై ఒక పెద్ద గంప, ముఖంలో కోటి సూర్యచంద్రుల ప్రకాశం, పెదవులపై మధురమైన చిరునవ్వు... కానీ తానేమీ మాట్లాడలేని మూగవానిగా వేషం వేశాడు.
ఆ నవనీతచోరుడు కాశీ వీధుల్లో నడుస్తుంటే,
ఆ సౌందర్యానికి జనం కళ్ళప్పగించి చూస్తున్నారు.
ఆ చిన్నికృష్ణుడు గెంతుతూ, ఈలలు వేస్తూ,
ముసలివాళ్లను, సాధువులను కళ్లతోనే పరామర్శిస్తూ,
చివరకు ఆ బ్రాహ్మణుని ఇంటి గుమ్మానికి చేరుకున్నాడు.
తలుపు తీసిన ఇల్లాలు ఆ ముగ్ధమనోహర బాలుని చూసి మురిసిపోయింది. "ఎవరివి బాబూ నువ్వు? ఈ గంపలో ఏముంది?" అని అడిగింది.
బాలుడు ఏమీ మాట్లాడకుండా, తాను మూగవాడినని సైగ చేసి, తన చేతిలోని కాగితం, కలం ఆమెకు అందించాడు. ఆమె ఆశ్చర్యపోతూ చూస్తుండగా, ఆ బాలుడు చకచకా ఇలా రాశాడు:
"అమ్మా! మీ భర్త చిన్నప్పటి నుంచీ నా దగ్గరే పనిచేస్తున్నారు. ఆయన నా కోసమే తన జీవితమంతా కష్టపడ్డారు. కానీ, ఇప్పటి వరకు ఒక్క పైసా కూలీ కూడా తీసుకోలేదు. ఈరోజు ఆయనకు అత్యవసరమని తెలిసి, ఇంతకాలం ఆయన దాచుకున్న కూలీని ఇవ్వడానికి నేనే స్వయంగా వచ్చాను."- ఇట్లు, మీ భర్త యొక్క యజమాని.
ఆమె ఆశ్చర్యంతో గంపపై ఉన్న వస్త్రాన్ని తొలగించింది. అంతే! ఆమె కళ్లు మిరుమిట్లు గొలిపాయి. అందులో అపారమైన బంగారం, ధగధగలాడే వజ్రాలు, నవరత్నాలు దివ్యకాంతులతో మెరిసిపోతున్నాయి! ఆమె కుటుంబం నిర్వహించడానికి, సాధుసంతుల సేవ చేయడానికి ఆమెకు జీవితాంతం సరిపోయే ఆ సంపదను చూసి ఆమె నోట మాట రాలేదు. తన భర్త మహత్యాన్ని ఎంత తప్పుగా అర్థం చేసుకుందో గ్రహించింది, తన భర్తకు తాను చేసిన అవమానం గుర్తొచ్చి కళ్ళనీళ్లు జల జలారాలాయి. పశ్చాత్తాపంతో పిల్లలను పిలిచి, "నాయనా! నాన్నగారిని ఎక్కడున్నా వెంటనే వెతికి తీసుకురండి" అని పంపింది.
గంగాతీరంలో ధ్యానంలో ఉన్న తండ్రిని పిల్లలు ఇల్లేర్చారు. కానీ, తన వీధిలోకి అడుగుపెట్టిన బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాడు. ఉదయం వరకు దరిద్రంతో అల్లాడిన ఆ ఇల్లు, ఇప్పుడు వందలాది దీపాల వెలుగులతో, తోరణాలతో, పూలమాలలతో ఒక దివ్య దేవాలయంలా ప్రకాశిస్తోంది.
అతడు లోపలికి రాగానే, భార్య మంగళ హారతి పట్టుకుని భక్తితో ఎదురొచ్చింది. తన కళ్ళొత్తుకుని, చెంబులో నీళ్ళతో తన భర్త కాళ్ళు కడుక్కుంది "ఏమిటి దేవీ ఇదంతా?" అని ఆయన అడిగాడు. ఆమె కన్నీళ్లతోటే జరిగింది చెప్పింది, తన భర్త యజమాని యిచ్చిన ఆ ఉత్తరాన్ని భర్త చేతిలో పెట్టింది.
బ్రాహ్మణుడు ఆ ఉత్తరాన్ని విప్పి చూడగానే, అందులోని అక్షరాలన్నీ ఒక్కసారిగా కాంతిపుంజాలుగా మారాయి. మరుక్షణమే... ఆ కాగితంపై వేణువును అధరాలపై ఉంచిన ఆ నీలమేఘశ్యాముని దివ్యమంగళ స్వరూపం ప్రత్యక్షమైంది!
ఆ పరమాత్ముని దర్శించగానే బ్రాహ్మణుడు ఆనందంతో ఉప్పొంగిపోతూ, వెంటనే తన భార్య పాదాలకు నమస్కరించాడు. భార్య కంగారుపడుతుండగా ఆయన గద్గద స్వరంతో అన్నాడు:
"దేవీ! ఈరోజు మన ఇంటికి వచ్చిన ఆ యజమాని ఎవరో తెలుసా? ఆయన ఈ విశ్వానికే యజమాని! భక్తుల కోసం పరితపించే ఆ గోపాలకృష్ణుడు. నేను జీవితమంతా చదివిన ఆ భాగవత రూపమే ఈ కృష్ణుడు. ఈరోజు ఆ భక్తవత్సలుడు నా సేవను స్వీకరించి, స్వయంగా కూలీ ఇవ్వడానికి మన గడప తొక్కాడు. నీ పవిత్ర హృదయానికి ఆ స్వామి దర్శనభాగ్యం లభించింది!"
ఆ మాటలు విన్న ఇల్లాలి కళ్లలో పశ్చాత్తాపపు కన్నీళ్లు నదులై పారాయి. భర్త పాదాలపై పడి క్షమాపణ కోరింది. ఆ రోజు నుండి ఆ దంపతుల జీవితం భగవద్భక్తితో, నిత్య భాగవత శ్రవణంతో, అన్నదానాలతో, సాధు సంతుల సేవతో నందనవనంలా కాశీలో మరో బృందావనంలా మారింది. చివరకు ఆ కృష్ణకృపతో, విశ్వనాథుని ఆశీస్సులతో మోక్షాన్ని పొంది తమ జన్మను సార్థకం చేసుకున్నారు.
జై శ్రీ రాధే కృష్ణ
జై కాశీ విశ్వనాథ్
- శంకరకింకరః
No comments:
Post a Comment