Pages

Showing posts with label గురువు. Show all posts
Showing posts with label గురువు. Show all posts

Wednesday, August 19, 2026

శ్రీ శంకరవిజయేంద్ర సరస్వతీ దశశ్లోకీ స్తోత్రమ్


शङ्कराचार्य-रूपाय विजयेंद्र-गुरवे नमः !!

శంకరాచార్య-రూపాయ విజయేంద్ర-గురవే నమః !!

ఛందస్సు : అనుష్టుప్ వృత్తం



तपस्तेजो-विराजाय कामकोटि-विभासिने !

शङ्कराचार्य-रूपाय विजयेंद्र-गुरवे नमः !! १ !!

తపస్తేజో-విరాజాయ కామకోటి-విభాసినే !

శంకరాచార్య-రూపాయ విజయేంద్ర-గురవే నమః !! 1 !!


ప్రతిపదార్థం: 

తపస్-తేజో-విరాజాయ = తపోమహిమచే వెలుగొందువారూ; కామకోటి-విభాసినే = కామకోటి పీఠమును ప్రకాశింపజేయువారూ; శంకరాచార్య-రూపాయ = ఆదిశంకరుల దివ్యరూపమైన; విజయేంద్ర-గురవే = శ్రీ విజయేంద్ర సరస్వతీ గురుదేవులకు; నమః = నమస్కారము. 


తాత్పర్యం: తపశ్శక్తి యొక్క దివ్య తేజస్సుతో శోభిల్లుతూ, కంచి కామకోటి పీఠాన్ని అలంకరించిన జగద్గురు ఆదిశంకరాచార్య స్వరూపులైన శ్రీ విజయేంద్ర సరస్వతీ గురుదేవులకు నమస్కారములు.


श्रुतिस्मृति-सदाचार-संरक्षण-रतौजसे !

शङ्कराचार्य-रूपाय विजयेंद्र-गुरवे नमः !! २ !!


శ్రుతిస్మృతి-సదాచార-సంరక్షణ-రతౌజసే !

శంకరాచార్య-రూపాయ విజయేంద్ర-గురవే నమః !! 2 !!


ప్రతిపదార్థం: 

శ్రుతి-స్మృతి-సదాచార = వేదాలు, స్మృతులు, సనాతన ధర్మాచారాల యొక్క; సంరక్షణ-రత-ఓజసే = రక్షణ యందే నిమగ్నమైన దివ్య తేజస్సు కలవారూ; శంకరాచార్య-రూపాయ = ఆదిశంకరుల దివ్యరూపమైన; విజయేంద్ర-గురవే = శ్రీ విజయేంద్ర సరస్వతీ గురుదేవులకు; నమః = నమస్కారము. 


తాత్పర్యం: 

వేదశాస్త్రాలను, స్మృతులను, సనాతన ధర్మ సంప్రదాయాలను పరిరక్షించడమే ధ్యేయంగా కలిగిన శంకరాచార్య స్వరూపులైన శ్రీ విజయేంద్ర గురుదేవులకు ప్రణామాలు.


चन्द्रशेखर-पादाम्बु-भक्त्याय दृढचेतसे !

शङ्कराचार्य-रूपाय विजयेंद्र-गुरवे नमः !! ३ !!

చంద్రశేఖర-పాదాంబు-భక్తాయ దృఢచేతసే !

శంకరాచార్య-రూపాయ విజయేంద్ర-గురవే నమః !! 3 !!


ప్రతిపదార్థం: 

చంద్రశేఖర-పాద-అంబు-భక్తాయ = శ్రీ చంద్రశేఖరేంద్ర మహాస్వామి (మహా పెరియవా) చరణ కమలాల యందు అనన్య భక్తి కలవారూ; దృఢ-చేతసే = నిశ్చల చిత్తము కలవారూ; శంకరాచార్య-రూపాయ = ఆదిశంకరుల దివ్యరూపమైన; విజయేంద్ర-గురవే = శ్రీ విజయేంద్ర సరస్వతీ గురుదేవులకు; నమః = నమస్కారము. 


తాత్పర్యం: 

పరమాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామివారి పాదారవిందముల యందు అచంచల భక్తిని, నిశ్చల మనస్సును కలిగిన శంకరాచార్య స్వరూపులైన శ్రీ విజయేంద్ర గురుదేవులకు నమస్కారములు.


जयेन्द्र-वर-शिष्याय तदाज्ञा-परिपालिने !

शङ्कराचार्य-रूपाय विजयेंद्र-गुरवे नमः !! ४ !!

జయేంద్ర-వర-శిష్యాయ తదాజ్ఞా-పరిపాలినే !

శంకరాచార్య-రూపాయ విజయేంద్ర-గురవే నమః !! 4 !!


ప్రతిపదార్థం: 

జయేంద్ర-వర-శిష్యాయ = శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామివారి శ్రేష్ఠులైన శిష్యులూ; తత్-ఆజ్ఞా-పరిపాలినే = గురుదేవుల ఆజ్ఞను నిరంతరం శిరసావహించి పాలించువారూ; శంకరాచార్య-రూపాయ = ఆదిశంకరుల దివ్యరూపమైన; విజయేంద్ర-గురవే = శ్రీ విజయేంద్ర సరస్వతీ గురుదేవులకు; నమః = నమస్కారము. 


తాత్పర్యం: 

జగద్గురు శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామివారి ప్రియతమ ప్రధాన శిష్యులై, గురువాక్య పరిపాలనలో అగ్రగణ్యులైన శంకరాచార్య స్వరూపులైన శ్రీ విజయేంద్ర గురుదేవులకు నమస్కారములు.


कामाक्षी-चरण-ध्यान-निर्मलाय महात्मने !

शङ्कराचार्य-रूपाय विजयेंद्र-गुरवे नमः !! ५ !!

కామాక్షీ-చరణ-ధ్యాన-నిర్మలాయ మహాత్మనే !

శంకరాచార్య-రూపాయ విజయేంద్ర-గురవే నమః !! 5 !!


ప్రతిపదార్థం: 

కామాక్షీ-చరణ-ధ్యాన = శ్రీ కామాక్షీ దేవి పాద ధ్యానము చేత; నిర్మలాయ = పరిశుద్ధమైనవారూ; మహాత్మనే = పరమ పవిత్ర మహాత్ములైన; శంకరాచార్య-రూపాయ = ఆదిశంకరుల దివ్యరూపమైన; విజయేంద్ర-గురవే = శ్రీ విజయేంద్ర సరస్వతీ గురుదేవులకు; నమః = నమస్కారము. 


తాత్పర్యం: 

కంచి కామాక్షీ అమ్మవారి చరణ ధ్యానంలో సదా నిమగ్నమై పరమ నిర్మలమైన చిత్తం కలిగిన మహాత్ములు, శంకరాచార్య స్వరూపులైన శ్రీ విజయేంద్ర గురుదేవులకు ప్రణామాలు.


अद्वैत-तत्त्व-दीपाय ज्ञान-वैराग्य-शालिने !

शङ्कराचार्य-रूपाय विजयेंद्र-गुरवे नमः !! ६ !!

అద్వైత-తత్త్వ-దీపాయ జ్ఞాన-వైరాగ్య-శాలినే !

శంకరాచార్య-రూపాయ విజయేంద్ర-గురవే నమః !! 6 !!


ప్రతిపదార్థం: 

అద్వైత-తత్త్వ-దీపాయ = అద్వైత వేదాంతమనే దివ్య దీపమైనవారూ; జ్ఞాన-వైరాగ్య-శాలినే = సంపూర్ణ బ్రహ్మజ్ఞానము మరియు వైరాగ్యములతో శోభిల్లుచున్న; శంకరాచార్య-రూపాయ = ఆదిశంకరుల దివ్యరూపమైన; విజయేంద్ర-గురవే = శ్రీ విజయేంద్ర సరస్వతీ గురుదేవులకు; నమః = నమస్కారము. 


తాత్పర్యం: 

జగత్తుకు అద్వైత సత్యాన్ని ప్రసాదించే జ్ఞానజ్యోతియై, ఆత్మజ్ఞానము మరియు వైరాగ్యములతో భాసిల్లే శంకరాచార్య స్వరూపులైన శ్రీ విజయేంద్ర గురుదేవులకు నమస్కారములు.


दीन-दुःख-विनाशाय कारुण्यामृत-सिन्धवे !

शङ्कराचार्य-रूपाय विजयेंद्र-गुरवे नमः !! ७ !!

దీన-దుఃఖ-వినాశాయ కారుణ్యామృత-సింధవే !

శంకరాచార్య-రూపాయ విజయేంద్ర-గురవే నమః !! 7 !!


ప్రతిపదార్థం: 

దీన-దుఃఖ-వినాశాయ = దీనుల, భక్తుల దుఃఖాలను పోగొట్టువారూ; కారుణ్య-అమృత-సింధవే = కరుణ అనెడి అమృత సముద్రమైన; శంకరాచార్య-రూపాయ = ఆదిశంకరుల దివ్యరూపమైన; విజయేంద్ర-గురవే = శ్రీ విజయేంద్ర సరస్వతీ గురుదేవులకు; నమః = నమస్కారము. 


తాత్పర్యం: 

ఆశ్రయించిన భక్తుల సమస్త దుఃఖాలను బాపువారూ, అపార దయా సముద్రులైన శంకరాచార్య స్వరూపులైన శ్రీ విజయేంద్ర గురుదేవులకు నమస్కారములు.


शान्ति-दान्ति-समेताय सर्वभूत-हिताय च !

शङ्कराचार्य-रूपाय विजयेंद्र-गुरवे नमः !! ८ !!

శాంతి-దాంతి-సమేతాయ సర్వభూత-హితాయ చ !

శంకరాచార్య-రూపాయ విజయేంద్ర-గురవే నమః !! 8 !!


ప్రతిపదార్థం: 

శాంతి-దాంతి-సమేతాయ = అంతఃకరణ నిగ్రహము, ఇంద్రియ నిగ్రహములతో కూడినవారూ; సర్వభూత-హితాయ చ = సకల ప్రాణుల క్షేమాన్ని కోరువారూ; శంకరాచార్య-రూపాయ = ఆదిశంకరుల దివ్యరూపమైన; విజయేంద్ర-గురవే = శ్రీ విజయేంద్ర సరస్వతీ గురుదేవులకు; నమః = నమస్కారము. 


తాత్పర్యం: అంతర్-బహిరింద్రియ నిగ్రహ గుణములు కలిగి, సకల చరాచర సృష్టి లోక కళ్యాణాన్ని సదా ఆకాంక్షించే శంకరాచార్య స్వరూపులైన శ్రీ విజయేంద్ర గురుదేవులకు ప్రణామాలు.


वेद-विद्या-प्रदानाय लोक-मङ्गल-हेतवे !

शङ्कराचार्य-रूपाय विजयेंद्र-गुरवे नमः !! ९ !!

వేద-విద్యా-ప్రదానాయ లోక-మంగళ-హేతవే !

శంకరాచార్య-రూపాయ విజయేంద్ర-గురవే నమః !! 9 !!


ప్రతిపదార్థం: 

వేద-విద్యా-ప్రదానాయ = వేద విద్యను లోకానికి ప్రసాదించువారూ; లోక-మంగళ-హేతవే = సమస్త లోక శుభములకు కారణభూతులైన; శంకరాచార్య-రూపాయ = ఆదిశంకరుల దివ్యరూపమైన; విజయేంద్ర-గురవే = శ్రీ విజయేంద్ర సరస్వతీ గురుదేవులకు; నమః = నమస్కారము. 


తాత్పర్యం: 

సనాతన వేద విజ్ఞానాన్ని భవిష్యత్ తరాలకు ప్రసాదిస్తూ, జగత్తుకు సమస్త శుభాలను అనుగ్రహించే శంకరాచార్య స్వరూపులైన శ్రీ విజయేంద్ర గురుదేవులకు నమస్కారములు.


भवताप-प्रशान्ताय मोक्ष-मार्ग-प्रदर्शिने !

शङ्कराचार्य-रूपाय विजयेंद्र-गुरवे नमः !! १० !!

భవతాప-ప్రశాంతాయ మోక్ష-మార్గ-ప్రదర్శినే !

శంకరాచార్య-రూపాయ విజయేంద్ర-గురవే నమః !! 10 !!


ప్రతిపదార్థం: 

భవ-తాప-ప్రశాంతాయ = సంసారిక తాపత్రయములను శాంతింపజేయువారూ; మోక్ష-మార్గ-ప్రదర్శినే = మోక్ష మార్గమును చూపించువారూ; శంకరాచార్య-రూపాయ = ఆదిశంకరుల దివ్యరూపమైన; విజయేంద్ర-గురవే = శ్రీ విజయేంద్ర సరస్వతీ గురుదేవులకు; నమః = నమస్కారము. 


తాత్పర్యం: సంసార దుఃఖాలనే తాపాలను పోగొట్టి, మోక్ష సాధనకు సరైన సన్మార్గాన్ని ఉపదేశించే శంకరాచార్య స్వరూపులైన శ్రీ విజయేంద్ర గురుదేవులకు నమస్కారములు.


नागेन्द्र-रचितं स्तोत्रं दशश्लोकी-समन्वितम् !

शङ्कराचार्य-रूपाय विजयेंद्र-गुरवेऽर्पितम् !! ११ !!

నాగేంద్ర-రచితం స్తోత్రం దశశ్లోకీ-సమన్వితమ్ !

శంకరాచార్య-రూపాయ విజయేంద్ర-గురవేఽర్పితమ్ !! 11 !!


ప్రతిపదార్థం: 

నాగేంద్ర-రచితం = 'నాగేంద్ర' అనే భక్తునిచే రచింపబడి; దశశ్లోకీ-సమన్వితం = పది దివ్య శ్లోకములతో కూడిన ఈ స్తోత్రము; శంకరాచార్య-రూపాయ విజయేంద్ర-గురవే = శంకరాచార్య స్వరూపులైన శ్రీ విజయేంద్ర గురుదేవులకు; అర్పితమ్ = సమర్పించబడినది.


తాత్పర్యం: 

భక్తుడైన 'నాగేంద్ర' చేత భక్తిశ్రద్ధలతో రచింపబడిన ఈ పది శ్లోకాల 'దశశ్లోకీ స్తోత్రం' ఆదిశంకరాచార్య స్వరూపులైన పూజ్యశ్రీ విజయేంద్ర సరస్వతీ మహాస్వామివారి చరణ కమలాలకు సమర్పింపబడినది.


यः पठेत् प्रातरुत्थाय दशश्लोकीं गुरोः मुदा !

स लभेत् ज्ञान-सम्पत्तिं मुक्तिं च गुरु-शासनात् !! १२ !!

యః పఠేత్ ప్రాతరుత్థాయ దశశ్లోకీం గురోః ముదా !

స లభేత్ జ్ఞాన-సంపత్తిం ముక్తిం చ గురు-శాసనాత్ !! 12 !!


ప్రతిపదార్థం: 

యః = ఎవరైతే; ప్రాతః ఉత్థాయ = ప్రాతఃకాలమున లేచి; గురోః = గురుదేవుల యొక్క; దశశ్లోకీం = ఈ దశశ్లోకీ స్తోత్రాన్ని; ముదా = ఆనందభక్తితో; పఠేత్ = పఠిస్తారో; సః = వారు; జ్ఞాన-సంపత్తిం = ఆత్మజ్ఞాన సంపదను; గురు-శాసనాత్ = గురుకృపానుగ్రహం వలన; ముక్తిం చ = మోక్షమును కూడా; లభేత్ = పొందుదురు.


తాత్పర్యం: ప్రతిరోజూ వేకువజామున భక్తిశ్రద్ధలతో జగద్గురు శ్రీ విజయేంద్ర సరస్వతీ స్వామివారి ఈ 'దశశ్లోకీ స్తోత్రము'ను పఠించే భక్తులు జగద్గురు శంకరవిజయేంద్రసరస్వతీ శంకరాచార్యుల కృపావిశేషము వలన సకల సంపదలను, జ్ఞానమును, ముక్తిని పొందగలరు.

శఙ్కరకిఙ్కరనాగేన్ద్రవిరచితం శ్రీశఙ్కరవిజయేన్ద్రపఞ్చకమ్

శఙ్కరకిఙ్కరనాగేన్ద్రవిరచితం శ్రీశఙ్కరవిజయేన్ద్రపఞ్చకమ్


तपस्तेजो-विराजाय कामकोटि-विभासिने !

शङ्कराचार्य-रूपाय विजयेंद्र-गुरवे नमः !! १ !!


తపస్తేజో-విరాజాయ కామకోటి-విభాసినే !

శంకరాచార్య-రూపాయ విజయేంద్ర-గురవే నమః !! 1 !!


ప్రతిపదార్థం:

తపస్-తేజో-విరాజాయ = తపశ్శక్తి యొక్క దివ్య బ్రహ్మవర్చస్సుతో ప్రకాశించువారూ, కామకోటి-విభాసినే = కంచి కామకోటి పీఠమునందు వెలుగొందువారూ, శంకరాచార్య-రూపాయ = జగద్గురు ఆదిశంకరాచార్యుల దివ్య స్వరూపమైనవారూ

విజయేంద్ర-గురవే = శ్రీ విజయేంద్ర సరస్వతీ గురుదేవులకు, నమః = ప్రణామాలు / నమస్కారము.


తాత్పర్యం:


తపశ్శక్తి యొక్క దివ్య తేజస్సుతో శోభిల్లుతూ, కంచి కామకోటి పీఠాన్ని తన దివ్యత్వంతో ప్రకాశింపజేస్తున్నవారూ, సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల ప్రతిరూపమైన జగద్గురు శ్రీ విజయేంద్ర సరస్వతీ గురుదేవులకు నా భక్తిపూర్వక నమస్కారములు.



श्रुतिस्मृति-सदाचाराः रक्षिता येन नित्यशः !

शान्ति-दान्ति-स्वरूपाय विजयेंद्राय मङ्गलम् !! २ !!

శ్రుతిస్మృతి-సదాచారాః రక్షితా యేన నిత్యశః !

శాంతి-దాంతి-స్వరూపాయ విజయేంద్రాయ మంగళమ్ !! 2 !!


ప్రతిపదార్థం:

యేన = ఎవరి చేతనైతే, నిత్యశః = నిరంతరము, శ్రుతి-స్మృతి-సదాచారాః = వేదములు, స్మృతులు మరియు సనాతన సదాచారములు, రక్షితాః = రక్షింపబడుతున్నాయో, శాంతి-దాంతి-స్వరూపాయ = అంతరింద్రియ నిగ్రహము (శాంతి), బహిరింద్రియ నిగ్రహము (దాంతి) మూర్తీభవించిన, విజయేంద్రాయ = శ్రీ విజయేంద్ర సరస్వతీ స్వామివారికి, మంగళమ్ = శుభము (మంగళము) కలుగుగాక.


తాత్పర్యం:

వేదాలను, స్మృతులను, సనాతన ధర్మ సదాచారాలను నిరంతరం సంరక్షిస్తూ, శాంతి మరియు ఇంద్రియ నిగ్రహాలకు ప్రతిరూపంగా నిలిచిన పూజ్యశ్రీ విజయేంద్ర సరస్వతీ మహాస్వామి వారికి దివ్య మంగళము కలుగుగాక.


चन्द्रशेखर-पादाब्ज-भक्त्याय दृढचेतसे ! जयेन्द्र-वर-शिष्याय विजयेंद्र-गुरवे नमः !! ३ !! చంద్రశేఖర-పాదాబ్జ-భక్తాయ దృఢచేతసే ! జయేంద్ర-వర-శిష్యాయ విజయేంద్ర-గురవే నమః !! 3 !!

ప్రతిపదార్థం:

చంద్రశేఖర-పాదాబ్జ-భక్తాయ = శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి (నడిచేదేవుడు) వారి పాదపద్మములయందు అనన్య భక్తి కలవారూ, దృఢ-చేతసే = నిశ్చలమైన చిత్తము కలవారూ, జయేంద్ర-వర-శిష్యాయ = శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి(పలికే దేవుడు) వారి శ్రేష్ఠులైన ప్రియశిష్యులూ, విజయేంద్ర-గురవే = శ్రీ విజయేంద్ర గురువర్యులకు, నమః = నమస్కారము.


తాత్పర్యం:

నడిచేదేవుడు పరమాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామివారి చరణ కమలాల యందు అచంచలమైన భక్తిని కలిగి, నిశ్చల మనస్కులై, పలికేదేవుడు శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామివారి ప్రియతమ శ్రేష్ఠ శిష్యులైన శ్రీ విజయేంద్ర సరస్వతీ (నడిపే దేవుడు) జగద్గురుదేవులకు నమస్కారములు.



कामाक्षी-चरण-ध्यान-लीन-चित्ताय धीमते !

ज्ञान-वैराग्य-पूर्णायाऽद्वैत-तत्त्व-प्रकाशिने !! ४ !!

కామాక్షీ-చరణ-ధ్యాన-లీన-చిత్తాయ ధీమతే !

జ్ఞాన-వైరాగ్య-పూర్ణాయాఽద్వైత-తత్త్వ-ప్రకాశినే !! 4 !!


ప్రతిపదార్థం:

కామాక్షీ-చరణ-ధ్యాన-లీన-చిత్తాయ = కంచి కామాక్షీ అమ్మవారి పాదధ్యానమునందే లీనమైన మనస్సు కలవారూ

ధీమతే = శ్రేష్ఠమైన ధీమంతులూ, జ్ఞాన-వైరాగ్య-పూర్ణాయ = ఆత్మజ్ఞానము మరియు వైరాగ్యములతో పరిపూర్ణులైనవారూ

అద్వైత-తత్త్వ-ప్రకాశినే = అద్వైత వేదాంత సత్యాన్ని లోకానికి ప్రకాశింపజేయువారూ అయిన స్వామివారికి నమస్కారము.


తాత్పర్యం:

కంచి కామాక్షీ అమ్మవారి దివ్య పాదారవిందాల ధ్యానంలో నిమగ్నమైన చిత్తం కలవారూ, సత్యజ్ఞానము మరియు నిష్కామ వైరాగ్యములతో సంపూర్ణులై, జగత్తుకు అద్వైత వేదాంత తత్త్వాన్ని చాటిచెప్పే జ్ఞానభాస్కరులైన శ్రీ విజయేంద్రులకు ప్రణామాలు.


भवताप-प्रशान्ताय करुणा-पूर-चेतसे !

श्रीकञ्ची-पीठ-नाथाय विजयेंद्राय ते नमः !! ५ !!

భవతాప-ప్రశాంతాయ కరుణా-పూర-చేతసే !

శ్రీకంచీ-పీఠ-నాథాయ విజయేంద్రాయ తే నమః !! 5 !!


ప్రతిపదార్థం:

భవ-తాప-ప్రశాంతాయ = భక్తుల సంసార తాపత్రయాలను (దుఃఖాలను) ఉపశమింపజేయువారూ, కరుణా-పూర-చేతసే = నిండు కరుణతో నిండిన హృదయము కలవారూ, శ్రీకంచీ-పీఠ-నాథాయ = శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులూ అయిన, తే = అట్టి మీకు, విజయేంద్రాయ = శ్రీ విజయేంద్రులకు, నమః = నమస్కారము.


తాత్పర్యం:

భక్తుల సంసారిక బాధలను, తాపాలను పోగొట్టేవారూ, కరుణా రసము వెల్లువిరిసే పరమ పవిత్ర హృదయం కలవారూ, శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులైన జగద్గురు శ్రీ విజయేంద్ర సరస్వతీ స్వామి వారికి నా సాష్టాంగ ప్రణామాలు.


नागेन्द्र-रचितं स्तोत्रं गुरुपाद-समर्पितम् !

विजयेंद्र-गुरु-श्रीमान् गृहातु कृपया सदा !! ६ !!

నాగేంద్ర-రచితం స్తోత్రం గురుపాద-సమర్పితమ్ !

విజయేంద్ర-గురు-శ్రీమాన్ గృహాతు కృపయా సదా !! 6 !!


ప్రతిపదార్థం:

నాగేంద్ర-రచితం = నాగేంద్రచే రచింపబడి, గురు-పాద-సమర్పితమ్ = గురుదేవుల పాదాల చెంత సమర్పించబడిన, స్తోత్రం = ఈ స్తోత్రమును, శ్రీమాన్ విజయేంద్ర-గురుః = మహిమాన్వితులైన శ్రీ విజయేంద్ర సరస్వతీ గురువర్యులు, సదా = ఎల్లప్పుడూ

కృపయా = అపారమైన దయతో, గృహాతు = స్వీకరించి అనుగ్రహించుగాక.


తాత్పర్యం:

భక్తుడైన 'నాగేంద్ర' చేత భక్తిశ్రద్ధలతో రచించబడి, గురుచరణాల చెంత సమర్పింపబడిన ఈ స్తోత్రాన్ని పూజ్యులైన శ్రీ విజయేంద్ర సరస్వతీ మహాస్వామి వారు తమ అపారమైన కృపాకటాక్షాలతో స్వీకరించి అనుగ్రహింతురు గాక.


फलश्रुतिः

यः पठेत् प्रातरुत्थाय विजयेंद्र-गुरोः स्तवम् !

स लभेत् ज्ञान-सम्पत्तिं गुरु-पाद-कृपा-बलात् !!

ఫలశ్రుతి:

యః పఠేత్ ప్రాతరుత్థాయ విజయేంద్ర-గురోః స్తవమ్ !

స లభేత్ జ్ఞాన-సంపత్తిం గురు-పాద-కృపా-బలాత్ !!


ప్రతిపదార్థం:

యః = ఎవరైతే, ప్రాతః ఉత్థాయ = వేకువజామున మేల్కొని, విజయేంద్ర-గురోః స్తవమ్ = శ్రీ విజయేంద్ర గురుదేవుల ఈ స్తోత్రమును, పఠేత్ = పఠిస్తారో, సః = వారు, గురు-పాద-కృపా-బలాత్ = సద్గురు పాదకృపా బలము వలన, జ్ఞాన-సంపత్తిం = దివ్య జ్ఞాన సంపదను, లభేత్ = పొందుదురు.


తాత్పర్యం:

ప్రతిరోజూ ప్రాతఃకాలమున శుచియై, భక్తితో జగద్గురు శ్రీ విజయేంద్ర సరస్వతీ స్వామివారి ఈ స్తోత్రాన్ని పఠించే భక్తులకు జగద్గురుపాదాల కరుణా కటాక్షాల వలన సమస్త జ్ఞానము మరియు సకల శుభ సంపదలు చేకూరుగాక అని ప్రార్థిస్తున్నాను.

Saturday, August 15, 2026

పరమహంసం యతిశ్రేష్ఠం అమృతానన్దమాశ్రయే!

 స్వరూపానన్దసచ్ఛిష్యం సమయాచారదీక్షితమ్ !

వేదాన్తజ్ఞం కాశీవాసం జ్ఞానవైరాగ్యభూషణమ్ !!

శ్రీచక్రార్చనసంతుష్టం శాన్తం సన్న్యాసిశేఖరమ్ !

పరమహంసం యతిశ్రేష్ఠం అమృతానన్దమాశ్రయే !!


జగద్గురు శ్రీ స్వరూపానంద సరస్వతీ స్వామివారి శిష్యులై, సమయాచార సంప్రదాయంలో దీక్ష పొందినవారు, వేద వేదాంత శాస్త్ర జ్ఞానాన్ని కలిగినవారు, కాశీవాసి, జ్ఞాన–వైరాగ్యాలను తన ఆభరణాలుగా ధరించినవారు, శ్రీచక్రార్చన యందు అమితానందాన్నిపొందేవారు, ప్రశాంత స్వభావులు, సన్న్యాసులలో శ్రేష్ఠులు, పరమహంస పరివ్రాజకులైన శ్రీ అమృతానంద సరస్వతీ స్వామివారిని నేను భక్తితో ఆశ్రయిస్తున్నాను.


సనాతన ధర్మ పరంపరలో శాస్త్రపాండిత్యాన్ని, వైరాగ్యాన్ని, సాధనను, గురుభక్తిని సమన్వయపరిచిన మహనీయులు అరుదుగా దర్శనమిస్తారు. అటువంటి పరమహంస పరివ్రాజకాచార్యులలో శ్రీమదమృతానంద సరస్వతీ స్వామివారు విశిష్టమైన స్థానం కలిగినవారు. ద్వారకా–జ్యోతిష్పీఠాధీశ్వరులైన బ్రహ్మలీన జగద్గురు శంకరాచార్య శ్రీ స్వరూపానంద సరస్వతీ స్వామివారి శిష్యులుగా, కాశీక్షేత్రాన్ని తమ సాధనా క్షేత్రంగా చేసుకుని వేదాంత బోధ, శాస్త్ర విచారణ, ఉపాసన, ముముక్షువులకు మార్గదర్శనం చేస్తున్నారు.


స్వామివారి పూర్వాశ్రమ నామం దెందుకూరి మల్లికార్జున సోమయాజి. బాల్యం నుండే సంస్కృతం, వేద–వేదాంగాలు, శాస్త్రాధ్యయనం పట్ల గాఢమైన ఆసక్తి పెంచుకున్నారు. పాణినీయ వ్యాకరణం, కావ్య–నాటక–అలంకార శాస్త్రాలతో పాటు నవ్యన్యాయ, పూర్వమీమాంస వంటి గంభీర శాస్త్రాలను అభ్యసించారు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీతలను శాంకరభాష్య సహితంగా గురుముఖంగా అధ్యయనం చేసి, వేదాంత విచారణలో విశేష పాండిత్యాన్ని సంపాదించారు. చిన్న వయస్సులోనే సంస్కృత పండిత పరిషత్తులలో శాస్త్రార్థ చర్చలలో పాల్గొని తన ప్రతిభను చాటుకున్నారు.


పూర్వాశ్రమంలోనే కాంచీపురంలోని శ్రీ కాంచీ కామకోటి పీఠంతో ఆయనకు సన్నిహిత అనుబంధం ఏర్పడింది. శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామివారు, శ్రీజయేంద్ర సరస్వతీ స్వామివారి సాన్నిధ్యాన్ని పొంది, వారి తపోనిష్ఠ, ధర్మనిబద్ధత, శాస్త్రపాండిత్యాన్ని సమీపంగా దర్శించారు. అనంతరం శ్రీశంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారి ధర్మప్రచార, వేదపరిరక్షణ కార్యక్రమాలను కూడా గౌరవంతో అభినందిస్తూ వచ్చారు. అటు శృంగేరీ పీఠాధిపతుల తపోనిష్ఠ, ఇటు కాంచీ కామకోటి పీఠ ఆచార్యుల ధర్మనిష్ఠ—ఈ మహనీయ సంప్రదాయాల ప్రభావం స్వామివారి ఆధ్యాత్మిక జీవితంపై చెరగని ముద్ర వేసింది.


పరిపక్వమైన వైరాగ్యంతో పూర్వాశ్రమ జీవితాన్ని విడిచి, జగద్గురు శ్రీ స్వరూపానంద సరస్వతీ స్వామివారి ఆశ్రయాన్ని స్వీకరించి, వారి అనుగ్రహంతో దండసన్న్యాసదీక్షను పొంది పరమహంస పరివ్రాజక సంప్రదాయంలో ప్రవేశించారు. బదరీ–ద్వారకా పీఠ పరంపరలో త్రిపురసుందరీ–చంద్రమౌళీశ్వరుల అర్చనను నిత్యనిష్ఠతో నిర్వహిస్తూ, చాతుర్మాస్య సందర్భాలలో సన్యాసులు, పండితులకు న్యాయ–మీమాంస–వేదాంతాది శాస్త్రాలను బోధిస్తూ శాస్త్రపారంపర్య సేవను కొనసాగించారు.


గురుదేవుల విదేహముక్తి అనంతరం పవిత్ర కాశీక్షేత్రాన్ని తమ సాధనా నిలయంగా స్వీకరించారు. గంగాతీరంలో ఒక గదిలో జపం, తపస్సు, ధ్యానం, వేదాంత విచారణతో జీవిస్తూ, కాశీకి వచ్చే జిజ్ఞాసువులు, ముముక్షువులు, సంస్కృత పండితులకు శంకరభగవత్పాదుల ప్రస్థానత్రయ భాష్యాలను బోధిస్తున్నారు. 


గురుపరంపర ద్వారా లభించిన సమయాచార నిష్ఠను కొనసాగిస్తూ, బాహ్య ఆచరణతో పాటు అంతరంగ శుద్ధి, ఉపనిషత్ ప్రతిపాదిత ఆత్మవిచారణకు ప్రాధాన్యతనిస్తున్నారు. శ్రీవిద్యా తత్త్వానికీ అద్వైత వేదాంతానికీ అంతర్లీనమైన అభేదాన్ని, శివ–శక్తి ఐక్యాన్ని బ్రహ్మాత్మైక్య జ్ఞాన దిశగా వివరిస్తూ, అర్హులైన జిజ్ఞాసువులకు గురుపరంపరానుసారంగా మంత్రదీక్ష, సాధనా మార్గదర్శనం అందిస్తున్నారు. శ్రీవిద్యా మంత్రరహస్యాలు గురుముఖంగా గ్రహించవలసినవన్న సంప్రదాయ మర్యాదను కాపాడుతూ సాధకులను ఆత్మసాక్షాత్కార మార్గంలో నడిపిస్తున్నారు.

పరమగురువులు శ్రీమదీశ్వరానన్దనాథులు


బ్రహ్మలీన జగద్గురు శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతీ జీ మహారాజ్ (1924–2022)


ఆధునిక భారతదేశంలో అద్వైత వేదాంత పరంపరను, సనాతన ధర్మ వైభవాన్ని, శ్రీవిద్యా ఉపాసనా సంప్రదాయాన్ని తన తపస్సు, జ్ఞానం, ఆచరణలతో పరిపుష్టం చేసిన సిద్ధులలో జగద్గురు శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతీ జీ మహారాజ్ వారు విశిష్ట స్థానాన్ని పొందారు. పశ్చిమామ్నాయ ద్వారకా శారదా పీఠం మరియు ఉత్తరామ్నాయ జ్యోతిర్మఠం—ఈ రెండు పీఠాలకు జగద్గురువుగా మార్గదర్శనం చేసిన అరుదైన తపోమూర్తి.



శ్రీవిద్యాపరమానంద-సారథిం వేదసారవిద్ !

ద్వారకాజ్యోతిషాం నాథం స్వరూపానందమాశ్రయే !!


శ్రీవిద్యా పరమానంద స్వరూపులైన, వేదవేదాంత సారాన్ని అవగతం చేసుకున్న తత్వజ్ఞులైన, ద్వారకా శారదా పీఠం మరియు జ్యోతిర్మఠానికి అధిపతులైన పూజ్య జగద్గురు స్వామి స్వరూపానంద సరస్వతీ మహారాజ్ వారి చరణారవిందాలను నేను ఆశ్రయిస్తున్నాను.


జీవిత విశేషాలు – గురు పరంపర

1924లో మధ్యప్రదేశ్‌లోని సివనీ జిల్లాకు చెందిన దిఘోరీ గ్రామంలో పోతీరామ్ ఉపాధ్యాయ్ గా జన్మించిన స్వామి స్వరూపానంద సరస్వతీ వారు బాల్యంలోనే  సుమారు తొమ్మిదేళ్ల ప్రాయంలో కాశీకి చేరి వేద, వేదాంత, న్యాయ తదితర శాస్త్రాలను అభ్యసించారు.


1942లో జరిగిన ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలో చురుకుగా పాల్గొని, స్వాతంత్ర్య సమరంలో తన వంతు పాత్రను నిర్వర్తించారు. ఈ కారణంగా జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. ఆధ్యాత్మిక సాధనతో పాటు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన అరుదైన సన్యాసిగా ఆయన జీవితం నిలిచింది. క్రాంతికారీ సాధువుగా ప్రసిద్ధి చెందారు.


జ్యోతిర్మఠ పీఠోద్ధారకులైన స్వామి బ్రహ్మానంద సరస్వతీ మహారాజ్ వారి శిష్యరికంలో ఆధ్యాత్మిక విద్యను అభ్యసించి, దండసన్యాసాన్ని స్వీకరించారు. అనంతరం ధర్మరక్షణ, వేద పరిరక్షణ, సనాతన ధర్మ ప్రచారం వంటి కార్యక్రమాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. ధర్మసమ్రాట్ కరపాత్రి స్వామి వారి దగ్గర శ్రీవిద్యాదీక్ష, వేదాంతం నేర్చుకున్నారు. కరపాత్రి స్వామివారితో ఆయనకు అత్యంత సన్నిహితమైన ఆధ్యాత్మిక, ధార్మిక సంబంధం ఉండేది, 


స్వామి స్వరూపానంద సరస్వతీ వారు శంకరాచార్య పరంపరలోని శ్రీవిద్యా ఉపాసనా సంప్రదాయానికి విశిష్ట సాధకులుగా ప్రసిద్ధి చెందారు. శ్రీచక్ర నవావరణార్చన, మంత్రోపాసన, అంతర్యాగ భావన వంటి శ్రీవిద్యా సాధనా మార్గాలకు ఆయన ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు.


గంగాతీర ప్రాంతాల్లోను, నర్మదా పరివాహక ప్రాంతాల్లోని ఏకాంత ప్రదేశాల్లోను దీర్ఘకాలం తపస్సు, మౌనవ్రతం, జపానుష్ఠానాలను ఆచరించిన ఆయన జీవితం కఠోర సాధనకు ప్రతీకగా నిలిచింది. ఆయన భాగవత సప్తాహాన్ని విరివిగా నిర్వహించేవారు. వారు బాహ్య ఆరాధనతో పాటు అంతర్యాగం, ఆత్మసాధన, ధ్యానం శ్రీవిద్యా మార్గంలో అత్యంత ప్రధానమైనవని ఆయన బోధించారు.


పరమహంసీ గంగా ఆశ్రమం – ఝోటేశ్వర్, నరసింహపూర్


మధ్యప్రదేశ్‌లోని నరసింహపూర్ జిల్లా, గొటేగావ్ సమీపంలోని ఝోటేశ్వర్ అరణ్య ప్రాంతం స్వామి స్వరూపానంద సరస్వతీ వారి ప్రధాన తపోభూమిగా చేసుకున్నారు. అది ఇప్పుడు గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చెందింది. ఇక్కడ ఆయన పరమహంసీ గంగా ఆశ్రమమాన్ని  ఆధ్యాత్మిక సాధనకు విశిష్ట కేంద్రంగా తీర్చిదిద్దారు.


శ్రీ రాజరాజేశ్వరీ త్రిపురసుందరీ ఆలయం


శ్రీవిద్యా ఉపాసనకు ప్రధాన క్షేత్రంగా నిలిచే విధంగా ఇక్కడ శ్రీ రాజరాజేశ్వరీ త్రిపురసుందరీ దేవి ఆలయం నిర్మించబడింది. ఉత్తర, దక్షిణ భారతీయ శిల్పకళా సంప్రదాయాల సమన్వయంతో రూపుదిద్దుకున్న ఈ దేవాలయం శ్రీవిద్యా భక్తులకు పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోంది. గర్భగృహంలోని శ్రీ రాజరాజేశ్వరీ త్రిపురసుందరీ దేవి సన్నిధి, శ్రీచక్రాధిష్ఠాత్రి పరాశక్తి ఆరాధనకు కేంద్రబిందువుగా ఉంది.


రాజరాజేశ్వరీ ఆలయ ప్రాంగణంలో అనేక ఆలయాలుణ్ణయి. ప్రముఖంగా చతుష్షష్టి యోగినిలను ఇక్కడ చూడవచ్చున్


మణిద్వీపం – గురు సరోవరం

శ్రీవిద్యా సంప్రదాయంలో పరాశక్తి యొక్క దివ్య నివాసంగా భావించబడే మణిద్వీప తత్త్వాన్ని స్ఫురింపజేసే విధంగా ఆశ్రమ ప్రాంగణంలో అనేక ఆధ్యాత్మిక నిర్మాణాలు, సాధనా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. గురు సరోవరం, శివాలయాలు, దివ్య లింగ ప్రతిష్ఠలు తదితర పవిత్ర ఆలయాలు ఈ క్షేత్రానికి ప్రత్యేక ఆధ్యాత్మిక వైభవాన్ని చేకూర్చాయి.


2022 సెప్టెంబర్ 11న పరమహంసీ గంగా ఆశ్రమంలోనే జగద్గురు స్వామి స్వరూపానంద సరస్వతీ జీ మహారాజ్ వారు బ్రహ్మీభావం పొందారు.


వేదవేదాంత పరంపర, అద్వైత తత్త్వజ్ఞానం, సనాతన ధర్మ పరిరక్షణ, శ్రీవిద్యా ఉపాసనా వైభవం—ఈ నాలుగు ధారలను తన జీవితంలో సమన్వయపరిచిన మహనీయ తపోధనుడిగా ఆయన స్మరణీయులు.


ఆయన జీవితం కేవలం ఒక సన్యాసి జీవితచరిత్ర మాత్రమే కాదు; గురుభక్తి, తపస్సు, జ్ఞానం, ధర్మనిష్ఠ, దేశభక్తి, శక్తి ఉపాసన సమన్వయమైన ఒక మహత్తర ఆధ్యాత్మిక ప్రస్థానం.


పరమగురువుల పాదపద్మాలకు అనంతకోటి నమస్సులు

పరమేష్ఠిగురువులు శ్రీ షోడశానందనాథులు



ధర్మసామ్రాట్ పరమహంస పరివ్రాజకాచార్య స్వామి కరపాత్రి జీ మహారాజ్ (సన్యాసాశ్రమ నామం స్వామి హరిహరానంద సరస్వతి) ఆధునిక యుగంలో సనాతన వైదిక ధర్మాన్ని, అద్వైత వేదాంతాన్ని మరియు అత్యున్నతమైన శ్రీవిద్యా శాక్తేయ సాధనను ఏకకాలంలో సమన్వయం చేసిన మహాసిద్ధ పురుషులు.


కరపాత్రేణ భుంజానః శంకరాచార్యరూపధృక్ !

శ్రీవిద్యాసాధనాసిద్ధం వందే తం కరపాత్రిణమ్ !!

చేతులనే పాత్రగా చేసుకుని భిక్ష స్వీకరిస్తూ, ఆదిశంకరుల ప్రత్యక్ష రూపమై వెలుగొందుతూ, శ్రీవిద్యా మహాసాధనలో సిద్ధిని పొంది ధర్మసంస్థాపన చేసిన పూజ్య కరపాత్రి స్వామి వారికి  నమస్సులు.



శ్రీవిద్యా విశేషాలు & ఆధ్యాత్మిక సాధనా గ్రంథాలు


శ్రీ లలితా మహా త్రిపురసుందరి ఉపాసన: కరపాత్రి స్వామి వారు కేవలం తర్క, వేదాంత పండితులే కాక పరాశక్తి అయిన 'శ్రీ లలితా పరమేశ్వరి'ని అగ్రస్థానంలో ఆరాధించిన పరమ శ్రీవిద్యా సాధకులు. హిమాలయాలలోని తీవ్ర ఏకాంతంలో, గంగా తీరంలో ఆయన శ్రీవిద్యా మహామంత్రాలను (పంచదశి, షోడశి) కోట్లాది జపాలతో పునశ్చరణ చేసి సాక్షాత్కార సిద్ధిని పొందారు.


'శ్రీ విద్యారత్నాకరః' ఉద్గ్రంథ రచన: శ్రీవిద్యా సంప్రదాయంలో ఉన్న అతి క్లిష్టమైన రహస్యాలను, పూజా విధానాలను సాధకులకు సులభతరం చేస్తూ ఆయన 'శ్రీ విద్యారత్నాకరః' (Sri Vidya Ratnakara) అనే అత్యున్నత శ్రీవిద్యా మంత్ర తంత్ర శాస్త్ర గ్రంథాన్ని ప్రణీతం చేశారు. సంపూర్ణ శ్రీచక్ర నవావరణార్చన, తంత్ర రహస్యాలు, ముద్రలు, మంత్ర విధులకు ఇది ప్రామాణిక గ్రంథంగా నేటికీ పరిగణించబడుతోంది.

క్రమబద్ధమైన శ్రీవిద్యా సాధనా విధానం: పరశురామ కల్పసూత్రాల ఆధారంగా శ్రీవిద్యా ప్రవేశానికి కరపాత్రి స్వామి వారు ఒక పద్ధతిని నిర్దేశించారు:

1. శ్రీ మహాగణపతి సాధన

2. శ్రీ మాతంగీ (శ్యామలా) సాధన

3. శ్రీ వారాహీ సాధన

4. శ్రీ బాలా త్రిపురసుందరి సాధన

5. శ్రీ లలితా పంచదశీ / షోడశీ మంత్ర దీక్ష & శ్రీచక్ర నవావరణ పూజ

ఇవి కాక రామరాజ్య్ ఔర్ మార్క్స్వాద్, రామాయణ మీమాంస , వేదార్థ పారిజాత, విచార పీయూష్, చాతుర్వర్ణ సంస్కృతి విమర్శ వంటి అనేక గ్రంథాలు రచించారు


సమయాచార - అద్వైత సమన్వయం: ఆదిశంకరాచార్యుల 'సౌందర్యలహరి' మార్గంలో, బాహ్య పూజలతో పాటు భావనోపనిషత్ ప్రతిపాదిత అంతర్యాగాన్ని (శరీరమే శ్రీచక్రంగా భావించి చేసే కుండలినీ సహస్రార ధ్యానం) స్వామి వారు ప్రబోధించారు. శక్తి ఆరాధన మరియు నిర్గుణ బ్రహ్మసాక్షాత్కారం రెండూ వేర్వేరు కాదని, శివశక్తుల ఐక్యతే మోక్షమని ఆయన నిరూపించారు.


జీవిత విశేషాలు 

సన్యాసాశ్రమం స్వీకరించిన పిదప ఎటువంటి పాత్రలను కూడా వాడకుండా కేవలం చేతుల్లోనే భిక్షను గ్రహించే నియమం (కరపాత్ర) పాటించడం వల్ల ఆయనకు 'కరపాత్రి స్వామి' అనే పవిత్ర నామం స్థిరపడింది.గురు పరంపర: ఉత్తరామ్నాయ జ్యోతిర్మఠ పీఠాన్ని పునరుద్ధరించిన పరమహంస బ్రహ్మానంద సరస్వతి స్వామి వారి వద్ద వేదాంత, న్యాయ, తంత్ర శాస్త్రాలన్నింటినీ ఔపోసన పట్టారు.


ధర్మసంస్థాపన & గోరక్షణ: 1940లో సనాతన సంస్కృతి రక్షణార్థం 'ధర్మ సంఘ్'ను స్థాపించారు. వేద ధర్మ పరిరక్షణతో పాటు 1966లో దేశవ్యాప్తంగా గోహత్యా నిరోధం కోసం చారిత్రాత్మక గోరక్షా ఉద్యమాన్ని నడిపించారు.


స్వామి కరపాత్రి మహారాజ్  ప్రపంచానికి వేదధర్మ రక్షకుడిగా కనిపిస్తూనే, శ్రీవిద్యాఉపాసకులకు పరాభట్టారికా లలితా దేవి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందిన సిద్ధ గురువులుగా ప్రసిద్ధం.

Wednesday, August 12, 2026

చంద్ర సాచివ్యం - సుందరకాండ, రాసపంచాధ్యాయీ

 చంద్ర సాచివ్యం - సుందరకాండ, రాసపంచాధ్యాయీ

వాల్మీకి మహర్షి రచించిన సుందరకాండ 5వ సర్గలో, లంకలోకి ప్రవేశించిన ఆంజనేయస్వామికి ఆ రాత్రి చంద్రుడు అపూర్వమైన సహకారం అందిస్తాడు. తన శీతల కిరణాలను సర్వత్రా విరజిమ్మి, ప్రతి వీధిని, ప్రతి గృహాన్ని, ప్రతి దారిని స్పష్టంగా దర్శనమిచ్చేలా చేస్తాడు. సీతామాత అన్వేషణకు బయలుదేరిన హనుమంతునికి ఆ చంద్రప్రకాశమే మార్గదర్శిగా నిలుస్తుంది.
హంసో యథా రాజతపఞ్జరస్థః - సింహో యథా మన్దరకన్దరస్థః!
వీరో యథా గర్వితకుఞ్జరస్థః - చన్ద్రోఽపి బభ్రాజ తథామ్బరస్థః!!
(వాల్మీకి రామాయణం, సుందరకాండ 5వ సర్గ)
వెండి పంజరంలో ఉన్న హంసవలె, మందరపర్వత గుహలోని సింహంవలె, గర్విత గజంపై ఆసీనుడైన వీరునివలె, ఆకాశంలో చంద్రుడు అపూర్వ కాంతితో ప్రకాశించాడు.
తదనంతరం చంద్రుని శీతల కాంతి జగత్తును ఎలా ప్రకాశింపజేసిందో మహర్షి ఇలా వర్ణిస్తారు...
ప్రకాశచన్ద్రోదయ నష్టదోషః - ప్రవృత్త రక్షః పిశితాశ దోషః!
రామాభిరామేరిత చిత్తదోషః - స్వర్గప్రకాశో భగవాన్ ప్రదోషః!!

(వాల్మీకి రామాయణం, సుందరకాండ 5వ సర్గ)
చంద్రోదయంతో రాత్రి చీకట్లు తొలగిపోయాయి. చంద్రుని నిర్మల కాంతి సమస్త దిక్కులను ప్రకాశింపజేసి, సీతాన్వేషణకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించింది. ఈ చంద్రకాంతి కేవలం ప్రకృతిలోని వస్తువులను ప్రకాశింపజేయలేదు; హనుమంతుని కార్యసిద్ధికి సహాయకంగా మార్గదర్శకంగా నిలిచింది.
అదేవిధంగా, శ్రీమద్భాగవతం దశమ స్కంధంలోని రాసపంచాధ్యాయి (29-33 అధ్యాయాలు)లో, వేణునాదాన్ని ఆలకించి పరమప్రియుడైన శ్రీకృష్ణుని అన్వేషించేందుకు గోపికలు రాత్రివేళ బృందావనంలోకి ప్రవేశిస్తారు. ఆ సందర్భంలో కూడా వ్యాసమహర్షి శరద్ పూర్ణిమ చంద్రుని నిర్మల కాంతిని ఎంతో రమణీయంగా వర్ణిస్తారు.
భగవానపి తా రాత్రిః శరదోత్ఫుల్లమల్లికాః |
వీక్ష్య రన్తుం మనశ్చక్రే యోగమాయాముపాశ్రితః ||
(శ్రీమద్భాగవతం 10.29.1)
"శరదృతువులో వికసించిన మల్లెల పరిమళాలతో నిండిన ఆ పూర్ణిమ రాత్రిని దర్శించిన శ్రీకృష్ణుడు, యోగమాయను ఆశ్రయించి రాసలీలకు సంకల్పించాడు."
ఈ రెండు మహాగ్రంథాలలోనూ ఒక అద్భుతమైన అంతరార్థం దాగి ఉంది.
ఇక్కడ వెతుకుతున్నవారు సాధకులు.
వెతకబడేది పరమాత్మ.
ఎటువైపు నడవాలో, ఏ మార్గంలో సాగాలో, ఏమి గ్రహించాలో స్పష్టంగా చూపించే వెలుగే గురువు.
అజ్ఞానతిమిరాన్ధస్య జ్ఞానాఞ్జనశలాకయా !
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః !!
"అజ్ఞానాంధకారంలో మునిగిన శిష్యునికి జ్ఞానాంజనం అద్ది దృష్టిని ప్రసాదించేవాది గురువు."
సుందరకాండలో హనుమంతుడు లంకలోని గృహాలను పరిశీలిస్తూ, రత్నఖచిత కిటికీలను, వాటి అలంకారాలను ఎంతో నిశితంగా దర్శిస్తాడు.
భాగవతంలో గోపికలు శ్రీకృష్ణుని వెతుకుతూ వస్తున్నప్పుడు, ఆయన ముఖారవిందాన్ని, ముఖ్యంగా చెవులలో ఊగిసలాడుతున్న మకరకుండలాలను పరమాత్మ దగ్గరకు వచ్చేవారికి దారిచూపడానికి ఊగుతున్నాయా అన్నట్లు వ్యాసమహర్షి మనోహరంగా వర్ణిస్తారు.
మనిషి ముఖానికి ద్వారం నోరైతే, చెవులు జ్ఞానానికి కిటికీలు.
చెవుల ద్వారానే శ్రుతి, అంటే వేదం, మనలోకి ప్రవేశిస్తుంది.
రత్నాలతో అలంకరించిన కిటికీలు, మకరకుండలాలు - వేదాభరణాలు, వేదానికి ఆభరణం వేద విహిత ఆచరణకు సంకేతాలు.
వేదానికి ఆభరణం వేదవిహిత కర్మాచరణ, అదే జ్ఞానానికి పరమాత్మను పొణ్దడానికి మార్గం.
---
సుందరకాండలో హనుమంతుడు లంకలో సంచరిస్తూ ఎన్నో రకాల సాధకులను దర్శిస్తాడు. ఎవరో అగ్నిహోత్రం నిర్వహించడంలో నిమగ్నులై ఉంటారు. ఎవరో జపమాలను చేతబట్టి, దర్భకట్టలు మంత్రాలు చేస్తుంటారు. పూర్తిగా కర్మకాండలో లీనమై ఉంటారు.
ప్రతి ఒక్కరి మార్గం వేరు. ప్రతి ఒక్కరి సాధన వేరు. హనుమంతుడు మాత్రం వారందరినీ గమనిస్తూ, తన లక్ష్యమైన సీతామాత అన్వేషణను కొనసాగిస్తాడు.
అదేవిధంగా భాగవతంలో గోపికలందరూ బృందావనంలో శ్రీకృష్ణుని అన్వేషణలో పరుగులు తీస్తుంటారు. వారు ఒకరిని ఒకరు చూడరు; ఎవరి సాధనను వారు గమనించరు. ఎవరు ముందున్నారు, ఎవరు వెనుక ఉన్నారు అనే భావమే వారికి లేదు.
ఎందుకంటే
పరమాత్మను చేరే మార్గంలో పోటీ ఉండదు.
పోలిక ఉండదు.
ప్రతి సాధకుని ప్రయాణం అతనిదే.
నాయమాత్మా ప్రవచనేన లభ్యో
న మేధయా న బహునా శ్రుతేన!
యమేవైష వృణుతే తేన లభ్యః !!
(కఠోపనిషత్ 1.2.23)
"ఆత్మతత్త్వం వాక్చాతుర్యంతో కాదు, మేధస్సుతో కాదు, వినికిడితో మాత్రమే కాదు; తనను ఆశ్రయించినవారికి మాత్రమే పరమాత్మ తనను తాను అనుగ్రహిస్తాడు."
అందుకే వ్యాస వాల్మీకులిద్దరూ ఈ రెండు ఘట్టాలూ ఒకే విధంగా చెప్పారు.
సాధన మార్గాలు అనేకం కావచ్చు.
సాధకులు ఎందరో కావచ్చు.
ఎలాగైతే ఎవరి ఆకలి వారిదే,
ఎవరి నిద్ర వారిదే,
ఎవరి అనుభవం వారిదే... అదేవిధంగా...
కానీ, సాధకుల అంతిమ గమ్యం ఒక్కటే "పరమాత్మను పొందడం"
ఆ గమ్యానికి దారి చూపి, ఆ మార్గంలో నడిపించే "చంద్రకాంతి - స్వగురుకృపయే", ఆ ప్రయాణాన్ని సార్థకం చేసేది నిరంతర సాధన.
"గురుకృపా హి కేవలం - శిష్య పరమ మంగళం."
- శంకరకింకరః

Saturday, July 25, 2026

శ్రీ విధుశేఖర భారతీ స్తుతిః

 శ్రీ విధుశేఖర భారతీ స్తుతిః

శ్రీశారదాంబుజవిలోచనపుణ్యపాత్రం
శ్రీశంకరార్యపదపంకజభృంగరాజమ్!
వేదాంతవేద్యపరతత్త్వవిశారదం తం
వందే విధుశేఖరభారతిదేశికేంద్రమ్!!
విద్యావినీతహృదయం విగతాభిమానమ్
వైరాగ్యసంపదనిశం విభవోపపన్నమ్!
లోకానుకంపనపరం లలితప్రసన్నమ్
వందే విధుశేఖరభారతిదేశికేంద్రమ్!!
(స్తుతి రూపం ఛందోబద్ధం కాదు)
- శంకరకింకరః (శ్రీ అయ్యగారి నాగేన్ద్ర కుమార్)

Thursday, July 14, 2022

*వేదవ్యాసుడు- గురుపూర్ణిమ*

 *వేదవ్యాసుడు- గురుపూర్ణిమ*

(బ్రహ్మశ్రీ రేమిళ్ల వేంకటరామకృష్ణశాస్త్రిగారు)
_______________________________
व्यासं वशिष्ठनप्तारं शक्तेः पौत्रम् अकल्मषम्
पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिम् ।।
వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్రం అకల్మషం
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం ..
వేదవ్యాసమహర్షి వశిష్ఠునికి మునిమనుమడు,
శక్తికి పౌత్రుడు, పరాశరుని కుమారుడు, శుకమహర్షికి తండ్రి. అకల్మషుడు. భారతీయులకు మానవాళికి జ్ఞానభిక్షపెట్టిన పరమేష్ఠిగురువు.
వీరిని త్రిమూర్త్యాత్మకముగా మనం ప్రార్థిస్తూ ఉంటాం.
త్రిమూర్త్యాత్మక గురుస్వరూపుడు -
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః..
అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహు రపరో హరిః
అఫాలలోచనః శంభుః భగవాన్ బాదరాయణః.
ఇక్కడ మొదటి శ్లోకంలో గురువును బ్రహ్మవిష్ణుస్వరూపంగా, పరబ్రహ్మస్వరూపంగా భావించి నమస్కరిస్తూన్నాం. రెండవ శ్లోకంలో వ్యాసుని త్రిమూర్తిస్వరూపంగా భావిస్తూన్నాం.
రెండిటి సమన్వయంచేత గురువుగా వ్యాసమహర్షిని భావించాల(భావిస్తున్నామ)న్నమాట.
సాక్షాత్ శ్రీకృష్ణస్వరూపుడు-
అభ్రశ్యామః పింగల జటాబద్ధకలాపః
ప్రాంశుర్దండీ కృష్ణమృగత్వక్పరిధానః .
సర్వాన్ లోకాన్ ప్లావయమానః
కవిముఖ్యః పర్వసు రూపం వివృణోతు.
ఇది వ్యాసులవారివర్ణన. ఆయన మేఘమువలె నల్లనైనవాడు. పింగళవర్ణంలో జటలుకలవాడు.పొడగరి.చేతిలో దండముకలవాడు. కృష్ణమృగాజినం ధరించినవాడు. కవిముఖ్యుడు.
ఇవి బదరికాశ్రమంలో తపస్సుచేసినప్పటి శ్రీకృష్ణునుకి కూడా వర్తిస్తాయి. ఇంతే కాక ఈక్రిందిశ్లోకం వ్యాసనారాయణుల అభేదాన్ని తెలుపుతోంది-
శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం
సూత్రభాష్యకృతౌ వన్దే భగవన్తౌ పునః పునః।
ఇది బ్రహ్మసూత్రకర్త వ్యాసునికి శ్రీకృష్ణునికి, భాష్యకర్త శంకరాచార్యునకు సంకరునికి అభేదాన్ని ప్రతిపాదిస్తోంది. భగవద్గీతనందించిన కృష్ణుడూ కవే.
అనేక పురాణాలను,మహాభారతాన్ని అందించిన వ్యాసుడూ కవే.పైగా వ్యాసుడు కవిముఖ్యుడు.
ఆయన మానవజాతికందించిన సాహిత్యం వెలకట్టలేనిది. అందుకే ఆయన కవిముఖ్యుడు.
ఆదిత్యసదృశుడు వ్యాసుడు -
కవిం పురాణ మనుశాసితార మణోరణీయాంస మనుస్మరేద్యః
సర్వస్యధాతార మచింత్యరూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్.
పెనుచీకటికవ్వలి పరతత్త్వాన్ని ఆదిత్యవర్ణునిగా,
కవిగా ఈశ్లోకం చెపుతోంది. నన్నయగారి ఈ పద్యాన్ని గమనించండి-
భారత భారతీ శుభగభస్తి చయంబుల ఘోర సం
సార వికార సంతమసజాల విజృంభము వాపి సూరి చే
తోరుచిరాబ్జ బోధన రతుండగు దివ్య పరాశరాత్మజాం
భోరుహమిత్రు గొల్చి మునిపూజితు భూరి యశోవిరాజితున్.
(ఆం.మ.భా.అవ.22ప.)
ఇందులో వ్యాసుని అంభోరుహమిత్రునిగా అంటే సూర్యునిగా అభివర్ణించాడు.
సూర్యుడు పద్మాలకు వికాసం కలిగించినట్లే వ్యాసుడు పండితులమనఃపద్మాలను వికసింపజేస్తాడు.
సూర్యునివల్ల చీకటితొలగినట్లే వ్యాసునివల్ల మన అజ్ఞానతిమిరం తొలగిపోతుంది.
కాబట్టే ఆయన మునిపూజితుడు, గొప్పకీర్తిచే ప్రకాసించువాడూ అయ్యేడు.
జనహితప్రారంభుడు –
ఎవరే పనిచేసినా అది జనాలకు హితాన్ని కూర్చేదైతే అంతకుమించిన గొప్పపని ఏమీ ఉండదు.
వ్యాసుడు కురువంశాన్ని నిలబెట్టినా, మహాభారతాన్ని, హరివంశాన్ని, అష్టాదశపురాణాల్ని, మహాభావగతాన్ని, బ్రహ్మసూత్రాల్ని ... రచించినా జనహితంకోసమే.
తాను తరించడం కాదు, శిష్యులను తరింపజేయడమే ఉత్తమగురులక్షణం.
అదే వ్యాసులవారి లక్ష్యం. నన్నయగారి ఈ పద్యం గమనించండి.
పరమబ్రహ్మనిధింబరాశరసుతున్ బ్రహ్మర్షిముఖ్యున్ దయా
పరుఁ గౌరవ్యపితామహున్ జనహితప్రారమ్భుఁ గృష్ణాజినాం
బరు నీలాంబుదవర్ణదేహు ననురూప ప్రాంశు నుద్యద్దివా
కర రుక్పింగజటాకలాపు గతరాగద్వేషు నిర్మత్సరున్ .
(ఆం.మ.భా.ఆది.3ఆ.3ప.)
వ్యాసులవారు వేదాలకునిధి, పరమబ్రహ్మకునిధి(పరతత్వాన్ని ఎరిగినవారు) బ్రహ్మర్షులలో ముఖ్యుడు, దయాపరుడు,జనహితానికే ప్రయత్నం చేసేవాడు, రాగద్వేషాలు లేనివాడు,
మాత్సర్యం లేనివాడు.
ఇవి సద్గురువుకు ఉండవలసిన లక్షణాలు.
శ్రీమన్నారాయణుడే వేదవ్యాసుడు
రామాయణకాలంలో రాముని పరతత్త్వంగా తెలిసినవారు మహర్షులు మాత్రమే. కాని మహాభారతంలో వ్యాసుని గొప్పతనం చాలమందికి తెలుసు.
కాని ఆయన కథలో ప్రత్యక్షంగా పూనుకున్న సందర్భాలు చాలతక్కువ. తిక్కనగారు వ్యాసుని ఎలా ఆవిష్కరించారో చూడండి -
విద్వన్మోదవిధాయి నిర్మలవచోవిస్ఫూర్తివిఖ్యాతుఁ గృ
ష్ణద్వైపాయను నీవెఱుంగుము విభున్ నారాయణుంగా విప
శ్చిద్వంద్యంబగు భారతాధ్యయనముంజేయంగ శక్తుండు ధ
ర్మాద్వైతుండు సరోజలోచనుఁడ కాకన్యుండు తద్వాచ్యుఁడే.
(ఆం.మ.భా.శాంతి.6ఆ.476ప.)
విద్వన్మోదవిధాయి - పండితులకు , జ్ఞానులకు ఆనందం కలిగించేవాడు, నిర్మలవచోవిస్ఫూర్తివిఖ్యాతుఁడు, కృష్ణద్వైపాయనుడు, ధర్మాద్వైతుడు, సరోజలోచనుడు, తద్వాచ్యుడు,మోక్షప్రదాత. ఈవిశేషణాలను గమనిస్తే వ్యాసుడు నారాయణాభిన్నుడని వేరే చెప్పనవసరం లేదు.
నిర్వాణదానక్రియాశీలుడు -
బాలార్క ద్యుతి పుంజ పింజర జటా భారంబుఁ బ్రావృట్ఘన
శ్రీలీలం బ్రహసించు నింగమును రోచిస్స్ఫారదండంబు ను
న్మీలన్నీల మృగాజినాంబరమునై నిర్వాణదానక్రియా
శీలుండైన పరాశరాత్మజుఁడు విచ్చేసెం గృపాలోలుఁడై.
(ఆ.మ.భా.అశ్వ.3ఆ.147ప)
పాండవులకు ఏసమస్య వచ్చినా అక్కడ వ్యాసులవారు ప్రత్యక్షంకావడం చూస్తూ ఉంటాం. అదే ఆయన కృపాలోలత.నిర్వాణదానక్రియాశీలత.
యోగామృత స్ఫీతస్వాంతుడు – వ్యాసుడు
వ్యాసుని జీవితాన్ని పరికిస్తే ఆయన ఎంతటి స్థితప్రజ్ఞడో తెలుస్తుంది.అది యోగంవల్లకాని సాధ్యంకాదు. అందుకే ఎఱ్ఱన గారు ఆయన్ని యోగామృతస్ఫీత స్వాంతుడు అని వర్ణించారు ఈ పద్యంలో -
ప్రీతుండై చనుదెంచె నాశ్రితజనాభీష్ట క్రియాశీలుఁ డు
ద్గీతామ్నాయుఁడు నిర్విధూత దురిత క్లేశుండు యోగామృత-
స్ఫీతస్వాంతుఁ డనంత సంతత సమావిర్భూత కారుణ్య ధా
రా తోయస్నపనైకశీలుఁడగు పారాశర్యుఁడచ్చోటికిన్ .
(ఆ.మ.భా.అరణ్య.6ఆ.103ప.)
ఒకకసారి ఆ విశేషణాలను గమనించండి. ఆశ్రితజనాభీష్టక్రియాశీలుడు, నిర్విధూతదురితక్లేశుండు, యోగామృతస్ఫీతస్వాంతుడు,
సంతత.... కారుణ్యధారా స్నపనైకశీలుడు.
ఆయన కృపావృష్టిని కురిపించే స్వభావంకలవాడు.
తన జ్ఞానంచే పాపాలను పోగొట్టగలవాడు. (జ్ఞానవిధూతపాప్మా—భగవద్గీత)
ఆగమ పదార్థతత్త్వవిదుడు- వేదవ్యాసుడు
ప్రాంశుఁ బయోదనీలతనుభాసితు నుజ్జ్వలదండధారుఁ బిం
గాంశుజటాచ్ఛటాభరణు నాగమపుంజ పదార్థతత్త్వ ని
స్సంశయకారుఁ గృష్ణమృగచర్మ కృతాంబరకృత్యు భారతీ
వంశవివర్థనుం ద్రిదశ వందితు సాత్యవతేయుఁ గొల్చెదన్ .
(ఆ.మ.భా.భీష్మ.1ఆ.71 ప.)
ఆయన వేదాలను విభజించేడంటే పేజీలు చూసి బైండింగు చేయించలేదు. వాటితత్త్వాని ఎరింగిన మహానుభావుడు. అందుకే ఆపనికి పూనుకున్నాడు.
విద్వత్సంస్తవనీయ భవ్యకవితావేశుండు విజ్ఞాన సం
పద్విఖ్యాతుఁడు సంయమిప్రకర సంభావ్యానుభావుండు గృష్ణ ద్వైపాయనుఁ డర్థిలోక హితనిష్ఠంబూని కావించె ధ
ర్మాద్వైతస్థితి భారతాఖ్య మగు లేఖ్యంబైన యామ్నాయమున్.
(ఆ.మ.భా.విరాట.1ఆ.3ప.)
ఆయన అర్థిలోకహితనిష్ఠను పూని భారతరచన చేసాడు. మొదట అనుకున్నట్లుగా జనహితప్రారంభుడన్నమాటను గుర్తుచేసుకోవాలి.ఈ పద్యలను ఇంకా విస్తృతంగా వ్యాఖ్యానింపవచ్చు. కాని నిడివి పెరుగుతుందని విరమిస్తున్నాను. మన్నించండి.
ఇటువంటి మహానుభావును మనం గురుపూర్ణిమరోజున గురువుగా ఆరాధించాలి,ధ్యానించాలి, పూజించాలి.
🙏శ్రీగురుచరణారవిందాభ్యాం నమః।।🙏

Saturday, February 26, 2022

జగద్గురు పద నిర్వచనం - ఎవరు జగద్గురువులు? - విచారణ

 "జగద్గురు" పద నిర్వచనం - విచారణ

గురువు గుకారశ్చంధకారశ్చ రుకారస్తన్నిరోధకృత్ (గురు గీత)

గు - అంధకారం

రు - దాన్ని నిరోధించగలిగినవారు, నివారణ చేయగలిగినవారు

అంధకార నివారణ, అనగా అజ్ఞాన నివారణ చేయగలిగేవారు గురువులు

 

చిన్నప్పుడు వచ్చీరాని మాటలు మాట్లాడినా, దాన్ని అక్షర రూపంలో వ్రాయడం నేర్పినవారు, అక్షర విషయకమైన అజ్ఞానాన్ని తొలగించిన వారు అక్షర గురువులు. అదేవిధంగా భాషా విషయమై అంధకారాన్ని, అజ్ఞానాన్ని తొలగించి, పదాల కూర్పు, వాక్యాలు, వ్యాసాలు మొదలైనవీ, భాషకు సంబంధించిన నియమాలు, వ్యాకరణం నేర్పినవారు, భాషావిషయకమైన అజ్ఞానాన్ని, అంధకారాన్ని పోగొట్టినవారు భాషా గురువు. ఇదే విధంగా, మనకు సైన్సు, లెక్కలు, భూగోళ, ఖగోళ ఇత్యాది విషయాల్లో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి వాటిని నేర్పేవారు ఆయా విషయ గురువులను తెలియబడుతున్నారు.

ఉపనయనం, బ్రహ్మోపదేశం అయ్యిన తరవాత, మనకు వేదం తెలిసినవారు, ఎవరైతే వేదం తెలియనివానికి వేదం నేర్పిస్తున్నారో, అతను వేదగురువు ఔతున్నాడు. అలాగే ఆయా శాస్త్ర గురువులు ఇత్యాది. ఇలా వీరిదగ్గర బాగా నేర్చుకున్న వ్యక్తి మరొకరికి ఆయా విషయాల పట్ల ఉన్న అజ్ఞానాన్ని, అంధకారాన్ని పోగొడతాడు. అతను పరంపరలో ఇంకొక గురువుగా వస్తున్నాడు. మనకు తేలికగా అవగతమవడానికి, సామాన్య పరిభాషలో ఇదీ గురువుకు సంబంధించిన విషయం.

 

జగత్తు

మనకి జగత్తు రెండు విధాలను చెప్పబడింది

1) స్వాప్నిక జగత్తు - అవాస్తవమైనది. కలలో మాత్రమే కనిపించేది.

2) జాగ్రత్ జగత్తు - ఇది మన కంటికి కనపడేది ఇంద్రియాలతో తెలుస్తున్నది, మన మనసుకి అనుభవంలోకి వస్తున్నది.

మనమందరం ఈ జాగ్రత్ జగత్తులోని విషయాలని కళ్లతో చూస్తున్నాం, స్పర్శతో తెలుసుకుంటున్నాం మిగతా ఇంద్రియాలతో అనుభవిస్తున్నాం. మన మనసుకు కలిగిన అనుభవానికి విరుద్ధంగా ఇంకొకరు చెప్తే ఔనా అలాగా అని నమ్మడానికి లేదు. కానీ శాస్త్రం ఈ జాగ్రత్ జగత్తును కూడా అవాస్తవ జగత్తు అనే అంటుంది. దీనివల్ల మనకి సందేహం కలుగుతుంది. ఈ విషయాలను తెలుసుకోవడానికి మనకు తెలియపరచడానికి మనమొక గురువు దగ్గరకెళ్లాలి.

 

జగత్తులో కలుగుతున్న అనుభవానికి సంబంధించి సత్య విషయం, జగత్స్వభావం తెలుసుకోవడం, తత్సంబంధ అంధకారం తొలగించుకోవడానికిగానూ గురువును ఆశ్రయించాలి.

 

జగత్తులో ఉన్న ఒకే విషయంపట్ల మనకు ఒక్కొక్కరికీ ఒక్కొక్క అనుభవం కలగవచ్చు. భిన్న-భిన్నమైన, కొందరికొకలా మరికొందరికొ ఇంకొకలా  అనుభవాలు కలుగవచ్చు. ఉదా:- పౌర్ణమి చంద్రుడున్నాడు, అందరికీ జానెడే కనిపిస్తాడు, గుండ్రని అప్పడంలా కనిపిస్తాడు. మనకు కొద్ది దూరంలోనే ఉన్నట్లు కనిపిస్తాడు. అంతమాత్రాన నిజానికి చంద్రుడు అప్పడంరూపంలోనో, జానెడు పరిథిలోనో, మనకు కొద్ది దూరంలోనే ఉంటాడా? లేదు, చాలా పెద్దగా ఉంటాడు, లక్షల కి.మీ. దూరంగా ఉంటాడు.

భూమి మీదనుంచి ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని చూసే వ్యక్తికి అది ఓ చిన్న పక్షిరూపంలో కనిపిస్తుంది, దానియొక్క అసలు పరిమాణం మరుగునపడుతుంది. అదే ఆకాశంలో విమానంలో ఉన్న విమానంలోంచి క్రిందకు చూస్తున్న ప్రయాణీకునికి క్రింద ఉన్న ఇళ్ళు, మనుషులు చీమలు, క్రిముల పరిమాణంలో కనపడతాయి. నిజాకవేవీ సత్యం కాదు. విమానం చాలా పెద్దది, భూమి మీద ఉన్న మనుష్యులు, ఇళ్ళు-భవనాలపరిమాణం చీమలంత క్రిములంత కాదు.

 

దీనివల్ల మనకు తెలిసేదేమిటంటే మనకు కలిగిన అటువంటి అనుభవాలన్నీ దుష్టమైనవే కానీ, నిర్దుష్టమైనవి కావు కదా.

 

ఆవిధంగా దుష్టమైన అనుభావలన్నీ సత్యం కావు అని తెలిసి జగత్తు యొక్క స్వభావం, తత్త్వం వాస్తవ స్వరూపం గురించి పూర్తిగా తెలిసినవాడు జగత్తుగురించి నిర్దుష్టంగా మనకు తెలుపగలడు.

 

మనకు ఒక నానుడి ఉన్నది "జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేలా?" అని. జగములో ఉన్నవారంతా గుర్తుపట్టే బ్రాహ్మణునికి అని కాదు ఇక్కడ చెప్పింది, జగమంటే ఏమిటో దాని స్వభావమేమిటో పూర్తిగా తెలిసినవానికి జంధ్యం అవసరంలేదు అని. జంధ్యం అవసరంలేని బ్రాహ్మణుడెవరు అనే ప్రశ్నకు సమాధానం "సన్యాసి" అని. జగత్తుగురించి పూర్తిగా తెలియని వాడు జంధ్యం వేసుకుని సాధన చెస్తారు. కొందరు సన్యాసులైనా సరే, ఎందుకంటే వారికి జగత్స్వరూప స్వభావాలు సరిగ్గా పూర్తిగా తెలియవు కాబట్టి. నిర్దుష్టం, నిర్దోషం కాని జగత్తునందలి అనుభవాలను కూడా సత్యమే, వాస్తవమే అనుకునే సిద్ధాంతంలో ఉన్నవారికి జగత్తుయొక్క వాస్తవ స్వభావ, స్వరూప, తాత్త్విక విషయ జ్ఞానం అసంపూర్ణం, కాబట్టి వారు తద్విషయమై అజ్ఞానాన్ని తొలగజేయలేరు. వారికి జంధ్యం అవసరమే!

ఎవరు జగత్తు విషయమైన అజ్ఞానాన్ని పోగొడతారో వారే జగద్గురువులు

ఈ జగద్గురువులు అంటే ఎవరెవరు?

ఒక శరీరాన్ని, ఒక ఆకారంతో ఉన్నవారిని చూసి జగద్గురువులు అని అంటున్నాము. వారు బ్రహ్మాన్ని తెలుసుకుంటే అంటే తార్కికంగా ఐనా, అనుభవపూర్వకంగా ఐనా తెలుసుకున్న వారిని జగద్గురువులంటున్నాము.

ఐతే, మనకు భాగవతం 2వ స్కందం, 5వఅధ్యాయంలో బ్రహ్మ నారద సంవాదంలోని 10-12 శ్లోకాలలో జగద్గురు విషయం ఉన్నది.

నానృతం తవ తచ్చాపి యథా మాం ప్రబ్రవీషి భోః !

అవిజ్ఞాయ పరం మత్త ఏతావత్త్వం యతో హి మే !! 10

యేన స్వరోచిషా విశ్వం రోచితం రోచయామ్యహమ్ !

యథార్కోఽగ్నిర్యథా సోమో యథర్‍క్షగ్రహ తారకాః !! 11

తస్మై నమో భగవతే వాసుదేవాయ ధీమహి !

యన్మాయయా దుర్జయయా మాం బ్రువంతి జగద్గురుమ్!! 12

ఓ నారదా! వాస్తవముగా నన్ను గూర్చి నీవు సర్వజ్ఞుడవు, సర్వేశ్వరుడవు మొదలైన మాటలచే సంబోధించిన విషయం ఏదీ అసత్యం కాదు. ఎందుకంటే? నాకంటే అధికుడైన పరమాత్మ యొక్క తత్త్వమును గూర్చి తెలియనంతవరకూ "ఇదంతా నా ప్రభావమే" అని లోకంలోని వారికి అనిపించడం సహజము. యథార్థముగా ఈ సమస్త సృష్టికీ ఆపరమశక్తి స్వరూపుడగు పరమాత్మ శక్తియే కారణము.(10) నారదా! సూర్యుడు, అగ్ని, చంద్రుడు, నక్షత్రములు, గ్రహములు, తారాకలు, స్వయంప్రకాశమానుడైన ఆ భగవంతుని నుండి తేజస్సును పొందియే, ఈ జగత్తులో వెలుగులు నింపుచున్నవి. అదే విధంగా నేను కూడా ఆ పరమేశ్వరునిచే ప్రకాశింపజేయబడీన జగత్తును మాత్రమే ప్రకటింపజేయుచున్నాను. (11) భగవంతునియొక్క దుర్జయమైన మాయచే మోహితులవడం వలననే లోకులు నన్ను చూచి జగద్గురువుగా పేర్కొనుచున్నారు. వాస్తవముగా ఆ శ్రీ కృష్ణుడే జగద్గురువు (కృష్ణం వందే జగద్గురుమ్) అటువంటి వాసుదేవ భగవానుని నేను నమస్కారపూర్వకముగా ధ్యానించుచున్నాను.(12)

ఈ విషయం ద్వారా మనకు సిద్ధమైనదేమంటే పరబ్రహ్మమునే జగద్గురువు అని చెప్పబడింది. ఆ పరబ్రహ్మమును తెలుసుకున్నవారిని కూడా జగద్గురువు అని సంబోధించబడుతున్నారు.

జగద్గురువులు అంటే ఒక్కరే ఒక్కరు ఆ పరమాత్మయే! అప్పుడు మరి శంకరభగవత్పాదులు జగద్గురువులు కారా! అంటే? వేదాంత ప్రతిపాదిత అద్వైత సిద్ధాంతం ప్రకారం  "బ్రహ్మవిద్బ్రహ్మైవ భవతి - బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే ఔతున్నాడు"

 

నేనే బ్రహ్మమును అని తెలుసుకోవడం అసలైన తెలుసుకోవడం అదీ అద్వైతం! అంతే తప్ప వేరెక్కడో ఉన్నది బ్రహ్మము అని తెలుసుకోవడం అసలు తెలుసుకోవడం కాదు.
అంటే "This is Bramham" అని కాదు, "I am Brahmam" అని తెలుసుకోవడమే అసలైన తెలుసుకోవడం. ఆ విధమైన జ్ఞానమును తెలుసుకున్నవారూ బ్రహ్మమే, వారే జగద్గురువులుగా పిలువబడుతున్నారు.

 

ఐతే మరి ఎంతమంది జగద్గురువులు? అనాదిగా సదాశివుడు, నారాయణుడి నుంచి లెక్కకడితే ఇప్పటివరకూ ఎందరో జగద్గురువులు. వేలు లక్షలు. ఔనా ? కానీ ఈ లెక్క శరీరాలను , నామరూపాలను సూచించే లెక్కయే కదా! వీళ్ళు జగద్గురువులు, వాళ్ళు జగద్గురువులు ఎందరో జగద్గురువులు అని చెప్పేవారు శరీరాలను లెక్కపెడుతున్నారు తప్ప, బ్రహ్మమును చెప్పట్లేదు. బ్రహ్మము ఒక్కటే, అదే జగద్గురు తత్త్వం.

ఏ వ్యక్తి ఆ బ్రహ్మము తానే అనీ, ఈ జగత్తు అవాస్తవమనీ దాని తత్త్వ స్వరూపాది విషయకాన్ని తెలుసుకుని బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే వేదాంత వాక్యాన్ని అనుభవపూర్వకముగా తెలుసుకున్నాడో అతనే జగద్గురువు.

 

ఒకసారి కంచికామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేన్ద్ర సరస్వతీ మహాస్వామి వారు చిన్నవయసులోనే ఉన్నప్పుడు ఉత్తరభారత యాత్ర చేశారు. ప్రయాగలో చాతుర్మాస్యం చేసి కాశీవైపు యాత్ర ప్రారంభించారు. కాశీలో పండితులు ప్రముఖులు రెండుగా విడిపోయారు, వారి ప్రకారం నాలుగు ఆమ్నాయ పీఠాల్లో కంచిపీఠంలేదు కాబట్టి ఆహ్వానం, గౌరవ సత్కారం అవసరంలేదు అని కొందరభిప్రాయం. అప్పుడు కాశీరాజు సంకటంలో పడిపోయారు. ఏంచేయాలో తెలియలేదు, వచ్చినది సామాన్య యతి కాదు, పైగా కంచి కామకోటి పీఠాధీశ్వరులు. అప్పుడు కాశీరాజు ప్రయాగనుంచి వస్తూ వింధ్యాచలంలో బస చేసిన పరమాచార్య స్వామి వారి వద్దకు సాదరంగా వెళ్ళి, మేముండేది వ్యాసకాశీలో, కాబట్టి ఉత్తరకాశీపండితుల విషయం పక్కనపెట్టి, పీఠంతో , పరివారంతో సహా వచ్చి మా ఆతిథ్యం స్వీకరించమని విజ్ఞప్తి చేసారు. అపుడు స్వామివారు ఉత్తరకాశీ పండితులు వచ్చి మమ్మల్ని జగద్గురువులు అని నిర్ణయిస్తే మేము కాశీ వస్తాము. లేదా విశ్వేశ్వరునికి ఇక్కణ్ణుంచే నమస్కారం చేసి వెళ్ళిపోతాము అని తెలిపారు. అప్పుడు ఉత్తరకాశీ నుంచి వచ్చిన పండిత బృందం స్వామివారిని " మీరు జగద్గురువులు ఎలా ఔతారు, మీకు జగత్తంతా తెలుసా?" అని ప్రశ్న వేసారు. అప్పుడు స్వామి వారు ఎవరు జగద్గురువో వారు జగత్తునుండి అన్నీ తెలుసుకుంటారు. అని భాగవతంలోని అనేక ఘట్టాలను, దత్తాత్రేయ స్వామి వారు జగత్తులోని అనేక విషయాల ద్వారా వారు నేర్చుకున్నవిషయాలను చూపారు.

 

మన ఇంట్లో చెత్త ఊడ్చి బైట పారేస్తే (పూర్వకాలంలో, ఇప్పటికీ పల్లెల్లో) కోడి వెళ్ళి చెత్తను తనకాళ్లతొ లాగేసి, తనక్కావలసిన గింజలో, ఏ ఆహారమో మాత్రమే ముక్కుతో పొడిచి తింటుంది. మన ఉంగరంలోంచి వజ్రం ముక్క పడిపోయి అది చెత్తతో పాటు బైట పారవేయబడ్డా, చెత్తలో ఆహారం ఏరుకునే కోడి మాత్రం దాన్ని వజ్రం ముక్క చాలావిలువైనది అని దాచదు, మిగిలిన చెత్తతో సమానంగానే కాళ్లతో జరిపేసి తనకి కావలసినది మాత్రమే ముక్కుతో తీసుకుంటుంది. ఇలా జగత్తునుంచి తెలుసుకొనే విషయాలనేకం.ఆతరవాత ఎంతో సంతోషంతో ఉత్తరకాశీ పండితులంతా కలిసి జగద్గురువు అని నిర్ణయించి వారిని సాదరంగా కాశీకి ఆహ్వానించి, స్వాగత సత్కారాలు ఉత్సవాలు చెసారు.

 

జగత్తులో ఉన్న తాత్విక విషయం తెలుసుకొని, జగద్విషయకమైన అజ్ఞానము, అంధకారాన్ని పోగొట్టేటువంటి వారే జగద్గురువులు.

 

ఇంతమంది జగద్గురువుల శరీరాలు వేరైనా, లెక్కపెట్టగలిగినా పరమాత్మ తత్త్వం ఒక్కటే జగద్గురుత్వం, జగద్గురుతత్త్వం ఒక్కటే!

 

మన ఇంట్లో కిచెన్, హాలు, బెడ్రూమ్, పూజారూమ్, స్టోర్ రూమ్ అన్నీ ఉన్నాయ్ అన్నిరూములూ వేరే ఆయా గదులకోసం కట్టిన గోడలవల్ల ఆయా గదుల్లో ఉండే స్పేస్/ఆకాశం వేరుగా కనపడుతోంది. అదే పూజారూమ్ చిన్నగా ఉన్నదని గోడ బద్దలుకొట్టి స్టోర్ రూమ్ పూజారూం కలిపేస్తే ఇప్పుడున్నది ఒకటే గది, ఒకటే ఆకాశం. "ఆకాశవత్ సర్వగతశ్చ నిత్యః" గమనిస్తే గురు తత్త్వం ఒక్కటే, కానీ గురువు శరీరాన్నిచూసి ఆ శరీరమే గురువు అని అనుకోవడం కాదు, గురువు అనేది ఒక తత్త్వం. తత్త్వానికి ఆకారం లేదు, ఉండదు. అందుకొరకు ఆకారానికి, ఆ శరీరానికి పూజ, గౌరవం. గురువు ఆకాశం వలె సర్వ వ్యాపకుడు అతనికి శరీరం ఒక ప్రతీక.

 

ఏ విషయమైన అజ్ఞాన్ని పోగొడితే ఆవిషయానికి గురువు అని అన్నట్లు, రామాయణం చెప్ఫేవారిని రామాయణ గురువు, భాగవతం చెప్పేవారిని భాగవత గురువు, పురాణం చెప్పేవారిని పురాణ గురువు అని అంటున్నాం. దానర్థం వాళ్ళు రామాయణానికంతటికీ గురువు , లేదా భాగవతానికంతటికీ గురువు, లేదా పురాణాలన్నిటికీ గురువు అని కాదు. రామాయణానికి సంబంధించిన అజ్ఞానాన్ని, భాగవతానికి సంబంధించిన అజ్ఞానాన్ని, పురాణాలకు సంబంధించిన అజ్ఞానాన్ని తొలగతేసే గురువులు అని అర్థం.

 

అదే విధంగా ఈ జగత్తు విషయకమైన అంధకారాన్ని, అజ్ఞానాన్ని పోగొట్టి దాని స్వభావాన్ని బోధించి సత్యం తెలియజేసే గురువే "జగద్గురువు". జగత్తు యొక్క అసలు స్వరూపాన్ని యెరిగి, తానే బ్రహ్మమైయున్నాననే సత్యాన్ని తెలుసుకున్న అటువంటి గురువులందరకూ ప్రతీకగా శంకరులు ఆయా పీఠాల్లో పీఠాధిపతులను జగద్గురువులుగా ప్రతిష్ఠించే వ్యవస్థను ఏర్పరచారు.

 

-శంకరకింకరః

(శ్రీ అయ్యగారి సూర్య నాగేంద్ర కుమార్)

------------

గురువుల అమృతమయమైన అనుగ్రహంతో జగద్గురు శబ్దానికి సంబంధించిన విషయ, విచారణ పూర్వకమైన ఈ వ్యాసం ప్రచురించడం జరిగింది. ఈ వ్యాసమందు ఏవైనా తప్పులు, దోషాలుంటే సూచించ ప్రార్థన.

----------------