Pages

Showing posts with label భక్తి. Show all posts
Showing posts with label భక్తి. Show all posts

Wednesday, March 10, 2021

*లింగపూజకు అర్చనకు (అభిషేకము అర్చనలోని అంగము) అధికారి ఎవ్వరు?*

శ్రీ శివ మహాపురాణములోని విద్యేశ్వర సంహితయందు సాధ్యసాధనఖండము నుండి


అనేక లింగం యో నిత్యం భక్తి శ్రద్దా సమన్వితః !! 30 

పూజయేత్స లభేత్కా మాన్మనసా మానసేప్సితాన్‌ !

న లింగారాధనాదన్యత్పుణ్యం వేద చతుష్టయే !! 31

విద్యతే సర్వశాస్త్రాణామేష ఏవ వినిశ్చయః !

సర్వమేతత్పరిత్యజ్య కర్మజాల మశేషతః !! 32 

భక్త్యా పరమయా విద్వాన్‌ లింగమేకం ప్రపూజయేత్‌ !

లింగేsర్చితేsర్చితం సర్వం జగత్‌ స్థావరజంగమమ్‌ !! 33

సంసారాం బుధి మగ్నానాం నాన్యత్తారణ సాధనమ్‌!

అజ్ఞానతిమిరాం ధానాం విషయాసక్త చేతసామ్‌ !! 34

ప్లవో నాన్యోsస్తి జగతి లింగారాధన మంతరా !

...అనేక లింగములను నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించు వ్యక్తి కోరికలన్నీ తీరును. నాలుగు వేదములలో లింగారాధనము కంటెను అధికపుణ్యమైన కర్మ లేదని, సర్వశాస్త్రముల నిశ్చయము.  విద్వాంసుడు, తెలిసినవాడు ఈ కర్మ సముదాయమునంతను వీడి పూర్ణభక్తితో లింగపూజను చేయవలెను. అలా లింగము నర్చించినచో, చరాచర జగత్తు నంతనూ అర్చించినట్లే అని, . అజ్ఞానము అనే చీకటివలన అంధులై, ఇంద్రియ భోగములలో నిమగ్నమైన మనస్సు గల వారికి , ఈ లోకములో లింగార్చన తప్ప మరిసంసారమును దాటించే మరింకొక నావ లేదు.

 

ఎవరెవరు లింగమునర్చించిరి? ఎవరెవరు అర్చింవచ్చు.

హరి బ్రహ్మదయో దేవా మునయో యక్షరాక్షసాః !! 35

గంధర్వాశ్చారణాస్సిద్ధా దైతేయా దానవాస్తథా !

నాగాశ్శేష ప్రభృతయో గరుడాద్యాః ఖగాస్తథా !! 36

సప్రజాపతయ శ్చాన్యే మనవః కిన్నరా నరాః !

పూజయిత్వా మహాభక్త్వా లింగం సర్వార్థ సిద్ధిదమ్‌ !! 37

ప్రాప్తాః కామానభీష్టాంశ్చ తాంస్తాన్సర్వాన్‌ హృది స్థితాన్‌ ! 

*విష్ణువు, బ్రహ్మ మొదలగు దేవతలు, మునులు, యక్షులు, రాక్షసులు, గంధర్వులు, చారణులు, సిద్ధులు, దైత్యులు, దానవులు మరియు శేషుడు మొదలగు నాగులు, గరుడుడు మొదలగు పక్షులు ప్రజాపతులు, మనువులు, కిన్నరులు, మరియు మనుష్యులు సర్వకార్యములను సిద్ధింపజేయు ఈ లింగమును అనన్య భక్తితో పూజించి , తమ తమ మనోరథములనన్నింటినీ సాధించుకొనిరి.*


*బ్రాహ్మణః క్షత్రియో వైశ్యః శూద్రో వా ప్రతిలోమజః* !! 38

*పూజయేత్సతతం లింగం తత్తన్మంత్రేణ సాదరమ్‌* !

*కిం బహూక్తేన మునయః స్త్రీ ణామపి తథాన్యతః* !! 39

*అధికారోఽస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజాః* !

*ద్విజానాం వైదికేనాపి మార్గేణారాధనం వరమ్‌* !! 40

*అన్యేషా మపి జంతూనాం వైదికేన న సంమతమ్‌* !

*వైదికానాం ద్విజానాం చ పూజా వైదిక మార్గతః* !! 41

*కర్తవ్యా నాన్యమార్గేణ ఇత్యాహ భగవాన్‌ శివః* !

*దధీచి గౌతమాదీనాం శాపేనాదగ్ధచేతసామ్‌* !! 42

*ద్విజానాం జయతే శ్రద్ధా నైవ వైదిక కర్మణి* ! 

బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులని గాక సర్వులు లింగమును ఆయా మంత్రములతో అనగా వారి వారికి అధీకృతమైన మంత్రములతో శ్రద్ధగా నిత్యము పూజించవలెను. (అనగా బ్రాహ్మణులు వైదిక మంత్రములతోనూ, ఇతరులు వారివారికి నిర్దేశించిన వైదిక, తాంత్రిక, పౌరాణికాది మంత్రములతోనూ పూజించవలెను ) *ఓ మునులారా! ఇన్ని మాటలేల? ఓ ద్విజులారా! స్త్రీలకు, ఇతరులకు అందరికి కూడ శివలింగమును అర్చించుట యందు అధికారము గలదు.* ద్విజులు వైదిక పద్ధతిలో ఆరాధించుటయే శ్రేష్ఠము* . *ఇతరులకు వైదిక పద్ధతి అను కూలము కాదు*. వేదవేత్తలగు *ద్విజులు వైదిక పద్ధతిలోనే పూజించవలెననియు , ఇతర పద్ధతిలో కాదనియు పరమేశ్వరుడు చెప్పెను*. దధీచి, గౌతముడు మొదలగు ఋషుల శాపముచే భ్రష్టమైన అంతః కరణము గల ద్విజులకు వైదిక కర్మల యందు శ్రద్ధ కలుగనే కలుగదు.

యో వైదిక మనాదృత్య కర్మ స్మార్‌ మథాపి వా !! 43

అన్యత్స మాచరేన్మర్త్యో న సంకల్పఫలం లభేత్‌ !

ఇత్థం కృత్వార్చనం శంభోర్నై వేద్యాంతం విధానతః !! 44

పూజయే దష్ట మూర్తీశ్చ తత్రైవ త్రిజగన్మయీః !

క్షితిరాపోsనలో వాయురాకాశ స్సూర్య సోమకౌ !! 45

యజమాన ఇతి త్వఎ్టౌ మూర్తయః పరికీర్తితా !

శర్వోభవశ్చ రుద్రశ్చ ఉగ్రో భీమ ఇతీశ్వరః !! 46

మహాదేవః పశుపతి రేతాన్మూర్తిభిరర్చయేత్‌ !

వైదిక కర్మలను, స్మార్తకర్మలను అశ్రద్ధచేసి ఇతర కర్మల నాచరించు మానవుడు తాను కోరిన ఫలమును పొందడు. ఈ విధముగా నైవేద్యము వరకు యథావిధిగా అర్చించి, ఆ లింగమునందే, త్రిలోకములను వ్యాపించియున్న అష్టమూర్తులను పూజించవలెను. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, యజమాని అనునవి అష్టమూర్తులు అని కీర్తింపబడినవి. శర్వుడు, భవుడు, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, ఈశ్వరుడు మహాదేవుడు, పశుపతి అను పేర్లను అష్టమూర్తులతో బాటు భావించి అర్చించవలెను.

పూజయేత్పరివారం చ తతశ్శంభోస్సు భక్తితః !! 47

ఈశానాది క్రమాత్తత్ర చందనాక్షత పత్రకైః!

ఈశానం నందినం చండం మహాకాలం చ భృంగిణమ్‌ !! 48

వృషం స్కందం కపర్దీశం సోమం శుక్రం చ తత్ర్కమాత్‌ !

అగ్రతో వీరభద్రం చ పృష్ఠే కీర్తిముఖం తథా !! 49

తత ఏకాదశాన్‌ రుద్రాన్‌ పూజయేద్విధినా తతః !

తతః పంచాక్షరం జప్త్వా శతరుద్రియ మేవ చ !! 50 

స్తుతీర్నానావిధాః కృత్వా పంచాంగ పఠనం తథా !

తతః ప్రదక్షిణాం కృత్వా నత్వా లింగం విసర్జయేత్‌ !! 51


ఆ తరవాత శివుని పరివారమును భక్తితో పూజించవలెను . ఈశానునితో మొదలిడి, క్రమముగా నంది, చండ, మహాకాల, భృంగి, వృష, స్కంద, కపర్దీశ, సోమ, శుక్రులను, ముందువైపు వీరభద్రుని, వెనుక వైపు కీర్తి ముఖుని గంధ అక్షత, బిల్వపత్రములతో పూజించవలెను.  తరువాత పదకొండు రుద్రులను యథావిధిగా పూజించి, పంచాక్షరిని జపించి, రుద్రాధ్యాయమును పఠించవలెను. పిమ్మట వివిధ స్తుతులను, పంచాగమును పఠించి, ప్రదక్షిణము చేసి, నమస్కరించి లింగమునకు ఉద్వాసన (పార్థివ లింగమునకు ఉద్వాసన, ఇతర లింగములకు పూజార్పణం చేసి మందసమునందుంచవలెను, లేదా సింహాసనమందుంచవలెను) చెప్పవలెను.

 

ఇతి ప్రోక్తమశేషం చ శివపూజన మాదరాత్‌ !

రాత్రా వుదజ్ముఖః కుర్యాద్దేవకార్యం సదైవ హి !! 52 

శివార్చనం సదాప్యేవం శుచిః కుర్యాదుదజ్ముఖః !

న ప్రాచీమగ్రత శ్శంభో ర్నోదీచీం శక్తి సంహితామ్‌ !! 53

న ప్రతీచీం యతః పృష్ఠ మతో గ్రాహ్యం సమాశ్రయేత్‌ !

వినా భస్మ త్రిపుండ్రేణ వినా రుద్రాక్ష మాలయా !! 54 

బిల్వపత్రం వినానైవ పూజయోచ్ఛంకరం బుధః !

భస్మాప్రాప్తౌ మునిశ్రేష్ఠాః ప్రవృత్తే శివపూజనే !! 55

తస్మాన్మృదాపి కర్తవ్యం లలాటే చ త్రి పుండ్రకమ్‌ !! 56


ఇతి శ్రీ శివ మహాపురాణే ప్రధమాయాం విద్యేశ్వర సంహితాయాం సాధ్యసాధనఖండే పార్ధివ పూజన వర్ణనం నామైక వింశోsధ్యాయః (21)

ఈ విధముగా శివపూజను నిశ్శేషముగా శ్రద్ధతో చెప్పితిని. దేవకార్యమును "రాత్రియందు" ఎప్పుడైననూ ఉత్తరము వైపు కూర్చుండి మాత్రమే చేయవలెను భక్తుడు శుచియై, ఉత్తరాభిముఖుడుగనే శివుని అర్చించవలెను. శివలింగమునకు ఎదురుగా తూర్పునందు గాని, శక్తి ఉంéడే ఉత్తరభాగమునందు గాని , వెనుక పశ్చిమ మునందు గాని అర్చనకు కూర్చుండరాదు. కావున మిగిలిన దక్షిణము నందు కూర్చుండవలెను. భస్మ యొక్క త్రిపుండ్రము లేకుండా, రుద్రాక్షమాల లేకుండా, మారేడు దళములు లేకుండా విజ్ఞుడు శంకరుని అర్చించరాదు. ఓ ముని వరులారా! శివపూజ ఆరంభమైనప్పుడు భస్మ లభించనిచో, మట్టితో నైననూ లలాటము నందు త్రిపుండ్రమును ధరించవలెను.

 శ్రీ శివ మహాపురాణములోని విద్యేశ్వర సంహితయందు సాధ్యసాధనఖండములో పార్థివ పూజన వర్ణనము అనే ఇరువది యొకటవ అధ్యాయము ముగిసినది (21).


Thursday, February 20, 2020

శివరాత్రి ప్రార్థన



శివరాత్రివ్రతం వక్ష్యే భుక్తిముక్తిప్రదం శృణు ! మాఘఫాల్గునయోర్మధ్యే కృష్ణా యా తు చతుర్దశీ !!1
కామయుక్తా తు సోపోష్యా కుర్వన్‌ జాగరణం వ్రతీ ! శివరాత్రివ్రతం కుర్వే చతుర్దశ్యామభోజనమ్‌!! 2
రాత్రిజాగరణేనైవ పూజయామి శివం వ్రతీ ! ఆవాహయామ్యహం శమ్భుం భుక్తిముక్తిప్రదాయకమ్‌!! 3
నరకార్ణవకోత్తారనావం శివ నమోస్తుతే ! నమః శివాయ శాన్తాయ ప్రజారాజ్యాదిదాయినే!! 4
సౌభాగ్యారోగ్య విద్యార్థస్వర్గమార్గప్రదాయినే ! ధర్మం దేహి ధనం దేహి కామభోగాది దేహి మే!! 5
గుణకీర్తిసుఖం దేహి స్వర్గం మోక్షం చ దేహి మే ! లుబ్దకః ప్రాప్తవాన్‌ పుణ్యం పాపీ సున్దరసేనకః!! 6
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే శివరాత్రివ్రతం నామ త్రినవత్యధిక శతతమో೭ధ్యాయః!!
-శంకరకింకర
శివరాత్రి ఉపవాసముండి రాత్రి జాగరము చేసి ఇట్లు కోరవలెను ''నేను చతుర్దశినాడు ఉపవాసముండి శివరాత్రి వ్రతము చేయుచుంటిని. నేను వ్రతముక్తుడనై రాత్రి జాగరము చేసి శివుని పూజ చేయుచున్నాను. భోగమోక్షములను ప్రసాదించు శివుని ఆవాహనము చేయుచున్నాను. శివా! నీవు సంసారనరకసముద్రమును దాటించు నౌకవంటివాడవు. నీకు నమస్కారము. నీవు సంతానమును, రాజ్యమును ఇచ్చువాడవు. మంగళమయుడవు. శాంతస్వరూపుడవు. నీకు నమస్కారము. నీవు సౌభాగ్య - ఆరోగ్య - విద్యా - ధన - స్వర్గముల నిచ్చువాడవు. నాకు ధర్మమును, ధనమును, కామభోగాదులను ప్రసాదించుము. నన్ను గుణ - కీర్తి - సుఖసంపన్నునిగా అనుగ్రహించుము. దేహాంతమున నాకు స్వర్గ - మోక్షముల నిమ్ము''  - అగ్నిమహాపురాణము- శివరాత్రివ్రతము 193వ అధ్యాయము


Wednesday, May 22, 2019

ప్రహ్లాదుని ధృతి

''ఎవని బలమున నీవు నేను చెప్పిన మాట వినక అతిక్రమించుచున్నావు?'' అని అడుగగా, 

''ఏ భగవంతుడు ఈ జగమును సృజించి పాలించుచున్నాడో, అతని బలముననే ఇట్లు ప్రవర్తించుచున్నాను. అంతః శత్రువులను గెలువలేక ప్రపంచమంతనూ గెలువ గల్గితినని తలంచుట భ్రాంతి. గనుక అంతఃశత్రువులను జయించుడు'' అని ప్రహ్లాదుడు తండ్రికి విన్నవించెను.


ఆహా ఏమి ధృతి అదికదా కావలసినది. ఎంతమంది బలగం ఉన్నా, అఖండైశ్వర్యం, త్రిలోకాధిపతిఅనే కీర్తి... ప్చ్ ఎన్ని ఉన్నా హిరణ్యకశిపుడు ఏమీలేనివాడే... అర్భకుడు, బాలకుడు అనుకున్న ప్రహ్లాదుడు అన్నీ ఉన్నవాడే!


-శంకరకింకర

Saturday, May 18, 2019

శ్రీ కూర్మనాథ జయంతి - తత్త్వం

సముద్రంలో ఇతర జలాలో ఉండే తాబేలు తను అటూ ఇటూ వెళ్లడానికి సంసార వ్యాపారానికి గానూ కాళ్లూ చేతులు బయటపెట్టి కదిలిస్తుంది. ఆ గమనం అవసరం లేనప్పుడు వాటిని తాబేటి డిప్పలోకి లాగేస్కుంటుంది.

ఇది ఆధ్యాత్మిక సాధనలో విషయ సుఖాలనుంచి ఇంద్రియాలను వెనక్కు మరల్చడమనే స్థితికి ప్రతీక. ఎంత గొప్ప స్థితికి చేరితే అంత లోపలికి లాక్కోవాలి. ఎంత పెరిగితే అంత ఒదగాలి, సముద్ర స్వరూపమైన ప్రపంచ సంసార వ్యాపారం నుండి తగ్గాలి ధన,జన,బల,కీర్తి మున్నగు లౌకిక విషయాలనుండి తగ్గి బహిర్ముఖ ప్రవృత్తిని అంచెలంచెలుగా ఆపి అంతర్ముఖ ప్రవృత్తిలోకి వెళ్లగలిగే చిత్తవృత్తి రూప ప్రజ్ఞకు శ్రీ కూర్మనాథ రూపం ప్రతీక.

-శంకరకింకర

Monday, March 4, 2019

శివరాత్రి ప్రార్థన



శివరాత్రివ్రతం వక్ష్యే భుక్తిముక్తిప్రదం శృణు !
మాఘఫాల్గునయోర్మధ్యే కృష్ణా యా తు చతుర్దశీ !!1
కామయుక్తా తు సోపోష్యా కుర్వన్‌ జాగరణం వ్రతీ !
శివరాత్రివ్రతం కుర్వే చతుర్దశ్యామభోజనమ్‌!! 2
రాత్రిజాగరణేనైవ పూజయామి శివం వ్రతీ !
ఆవాహయామ్యహం శమ్భుం భుక్తిముక్తిప్రదాయకమ్‌!! 3
నరకార్ణవకోత్తారనావం శివ నమోస్తుతే !
నమః శివాయ శాన్తాయ ప్రజారాజ్యాదిదాయినే!! 4
సౌభాగ్యారోగ్య విద్యార్థస్వర్గమార్గప్రదాయినే !
ధర్మం దేహి ధనం దేహి కామభోగాది దేహి మే!! 5
గుణకీర్తిసుఖం దేహి స్వర్గం మోక్షం చ దేహి మే !
లుబ్దకః ప్రాప్తవాన్‌ పుణ్యం పాపీ సున్దరసేనకః!! 6
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే శివరాత్రివ్రతం నామ త్రినవత్యధిక శతతమో೭ధ్యాయః!!
-శంకరకింకర
శివరాత్రి ఉపవాసముండి రాత్రి జాగరము చేసి ఇట్లు కోరవలెను ''నేను చతుర్దశినాడు ఉపవాసముండి శివరాత్రి వ్రతము చేయుచుంటిని. నేను వ్రతముక్తుడనై రాత్రి జాగరము చేసి శివుని పూజ చేయుచున్నాను. భోగమోక్షములను ప్రసాదించు శివుని ఆవాహనము చేయుచున్నాను. శివా! నీవు సంసారనరకసముద్రమును దాటించు నౌకవంటివాడవు. నీకు నమస్కారము. నీవు సంతానమును, రాజ్యమును ఇచ్చువాడవు. మంగళమయుడవు. శాంతస్వరూపుడవు. నీకు నమస్కారము. నీవు సౌభాగ్య - ఆరోగ్య - విద్యా - ధన - స్వర్గముల నిచ్చువాడవు. 

నాకుధర్మమును, ధనమును, కామభోగాదులను ప్రసాదించుము. నన్ను గుణ - కీర్తి - సుఖసంపన్నునిగా అనుగ్రహించుము. దేహాంతమున నాకు స్వర్గ - మోక్షముల నిమ్ము''  - అగ్నిమహాపురాణము- శివరాత్రివ్రతము 193వ అధ్యాయము






Thursday, October 4, 2018

పూజ, అభిషేకం, నీ భజనలు పారాయణలు ట్రాష్ అని ఏ జ్ఞానీ, పండిన ఏ పండితుడూ చెప్పడు


పరమాత్మనాశ్రయించిన గజేంద్రుడు గొప్పవాడుకాడా? స్తోత్రం చేయలేదా భగవానుడు రక్షించలేదా?

శ్రీకృష్ణుణ్ణాశ్రయించి రాజ్యం బడసిన పాండవులు గొప్పవారు కారా? పూజించలేదా భగవానుడు రక్షించలేదా?
-------------++

శ్రీగురుభ్యోనమః

చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున !
ఆర్తో జిజ్ఞాసురర్థార్టీ జ్ఞానీ చ భరతర్షభ !!
అర్జునా! ఆపదలో ఉన్నవారు, ధనాన్ని కోరుకునేవారు, నన్ను తెలుసుకోగోరేవారు, జ్ఞాని అనే ఈ నాలుగు రకములవారూ నన్ను భజిస్తారు.

ఈ శ్లోకం అనంతరం ఇందులో నాకు జ్ఞాని, జ్ఞానికి నేను ఇష్టులం అని చెప్పారు పరమాత్మ. సరే అసలు విషయానికొస్తే, స్వయం పరమాత్మయే ఆయనను పూజించేవారు/ కీర్తించేవారు/స్తుతించేవారి/ సేవించేవారు నాలుగురకాలు అని ఒప్పుకున్నారు. కాదనడానికి మనమెవరం?  స్థాయీ బేధాలున్నాయని భగవానుడే చెప్పినపుడు, ఠాఠ్ మిగతా ముగ్గురూ వేష్ట్ జ్ఞానమున్నవాళ్ళే బెస్ట్ అని చెప్పడానికి కాదు జ్ఞానం ప్రోది చేసుకునేది.

కొత్త కొత్త మాటలు వినబడుతున్నాయ్ భగవంతుడు స్తోత్రప్రియుడుకాడు, పూజాప్రియుడుకాడు ఇత్యాది ఇత్యాది... అది అహంకారాజ్ఞానజనితమైన మాట అని భగవంతుని మాటల సారంగా ఎరగవచ్చు.

Ø పరమాత్మనాశ్రయించిన గజేంద్రుడు గొప్పవాడుకాడా? స్తోత్రం చేయలేదా భగవానుడు రక్షించలేదా?

Ø శ్రీకృష్ణుణ్ణాశ్రయించి రాజ్యం బడసిన పాండవులు గొప్పవారు కారా? పూజించలేదా భగవానుడు రక్షించలేదా?

Ø ధ్రువ ప్రహ్లాదాదులు గొప్పవారు కారా? సర్వత్ర సమభావన చూపి రాజ్యాదులు పొంది భగవంతుని తెలుసుకోలేదా?

Ø జ్ఞానులైన నారద మైత్రేయ విదురాదులు పైవారినెప్పుడైనా తక్కువగా చూశారా? మా భక్తియే భక్తి మీవికావన్నారా?
 
అలా కానే కాదు, అలా తేడా చూపడం కుదరదు. పండిన జ్ఞానం ఉన్నప్పుడు ఔదార్యం ఇనుమడించాలి.

న బుద్ధిభేధం జనయేదజ్ఞానాం కర్మసఙ్గినామ్!
జోషయేత్సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్!!
కర్మలయందాసక్తిని కలిగియున్నవారి బుద్ధిని పండితుడు/జ్ఞాని చెదర కొట్టరాదు. తాను జ్ఞానమార్గంలో నిలిచి, ఆమార్గంలో  చక్కగా కర్మలనాచరిస్తూ, కర్మాసక్తులైన వాళ్ళని ఆ మార్గాన్ని అనుసరించి కర్మలాచరించేలా ప్రోత్సహించాలి.

పైవిధంగా భగవానుడే చెప్పాడు. నువ్వు చేసే పత్రి పూజ ట్రాష్, నువ్వు చేసే అభిషేకం ట్రాష్, నీ భజనలు పారాయణలు ట్రాష్ అని ఏ జ్ఞానీ, పండిన ఏ పండితుడూ చెప్పడు , భగవంతుడంతకన్నా చెప్పడు. సగం సగం జ్ఞానం ఉంటేనే మిడిసిపాటు తొట్రుపాటు అది పామర జనానికి గ్రహపాటు.
 

మేము సామూహికంగా పారాయణ చేస్తున్నామండీ. సంతోషం ఈఈ జాగ్రత్తలు తీస్కుని ఇలా పారాయణ చేయండి. ఫలానా అభిషేకం అండీ, ఓహ్ అద్భుతం, ఆయా ద్రవ్యాలను చక్కగావాడి ఈ విధంలో వినియోగించి చక్కగా అభిషేకించండి, ఫలానా పత్రి పూజండి, రొట్టలు తెచ్చి వేయకండి, ఇదిగో ఈఈ రకంగా సేకరించి తెచ్చి చేయండి సమాజంలో కలిసి మెలిసి చేయీ చేయీ పట్టుకుని ప్రస్థానం సాగించండి అని మార్గదర్శనం చేస్తారు విజ్ఞులు. అంతే తప్ప ఠాఠ్ ఎవడు చెప్పాడు, ఒక్కడివీ పూజ చెయ్, ఒక్కడివీ భజన చెయ్ ఇవి తాలుధాన్యం మాటలు.
 

సాధన క్రమంలో ఒక్కడుగా సాధించలేనివి సంగంతో పదిమందితో కలిసి సాధిస్తాడు. పోను పోనూ ఏకాంతతపై అనురక్తి కలుగుతుంది ఒక్కోమెట్టూ ఎక్కుతాడు. అంతే తప్ప పై అంతస్థులలో ఉన్నవాడు కిందున్నవాణ్ణి చూసి గేలి చేస్తే ఆ వ్యక్తిని అవివేకి అనే అంటారనడంలో సందేహంలేదు!

పండిన జ్ఞానానికి గుర్తు నీలో లోకులపై పెరిగిన ఔదార్యం, ప్రేమ. అంతేకాని హేళన లోకువ కాదు!

-శంకరకింకర

Tuesday, October 10, 2017

తెలుసుకోవడానికి విచారణ చేయాలి వితండం కాదు

శ్రీ గురుభ్యోనమః

ఓ ఊళ్ళోకెళ్ళి ఒక తెలిసిన వ్యక్తి ఇంటి గురించి విచారణ చేస్తే అక్కడ "పెద్దమనిషి" తిన్నగా వెళ్లండి రైటు తీస్కోండి లెఫ్టుతీస్కోండి మూడో మలుపు, నాలుగో సందు, ఐదో ఇంట్లో ఉంటారన్నారనుకోండీ. అప్పుడు మనం ఏం చేస్తాం? ఏదీ ఋజువు చూపించు అంటామా? లేదు కదా ! మహా ఐతే మళ్లీ ఆ పేరు రూపు రేఖలు చెప్పి అతనిల్లేనా అండీ? అని అడిగి ఇల్లు వెతుకుతూ బయలుదేరతాం.. అలా కాకుండా ఋజువు చూపించు అప్పుడే వెళతా అని అడిగితే.. కిందాపైనా చూసి నీక్కావాలంటే వెళ్ళి చూస్కో అంటారు లేకపోతే నీకేమైనా పిచ్చా అంటారు, కదా! ఆ యింట్లో మనక్కావలసిన వ్యక్తి ఉన్నాడోలేడో వెతికి చూస్కోవాలసిన అవసరం మనది తప్ప ఆ దారి చెప్పినతనిది కాదు. ఒకవేళ అతను తప్పైనా వెళ్ళి చూసుకుని వెతుక్కోవలసింది మనమే. అప్పటివరకూ పక్కవాణ్ణి, ఆ ఊరి "పెద్దమనిషిని" ఆనూపానూ తెలిసినవాణ్ణి నమ్మాలి, దొరక్క పోతే తిరిగి ఆచోటికి వచ్చి మళ్లీ కావలసిన వ్యక్తి గురించి మరింత వివరంగా అడిగి సరియైన చిరునామా అడిగి వెతికి పట్టుకుని ఆ యింటికి చేరాలి. అది మన పని అతని పని కాదు. అవసరాన్ని, అవకాశాన్ని బట్టి ఆ "పెద్దమనిషి" ఉదారుడై మన వెంట వచ్చి కావలసిన వ్యక్తి ఇంటి వరకూ వచ్చి చూపగలడు అది అన్ని వేళలా సాధ్యం కాదు. అది అతని ఔదార్యం మాత్రమే.
 
అలాగే, నువ్వొక్క అడుగూ వేయకుండా ఋషుల మాట గురువుల బాట పట్టకుండా ధర్మం మీద శ్రద్ధలేకుండా భగవంతుడు లేడంటే? దేవుడుంటే చూపించు? అని అంటే ఏమనాలి నిన్నప్పుడు? ఆ అవసరం, అగత్యం ఎవరిది? నీది! అంతే తప్ప ఋషులదీ, గురువులదీ ఆ మార్గంలో కుదురుకున్నవాళ్లదీ, భక్తి మార్గంలో వేదాంతారణ్యంలో హేలగా సంచరించేవారిదీ కాదు. ఏమో ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు ఔదార్యంతో అలా చూపవచ్చేమో కోట్లల్లో ఒకరికి. ఆ కోట్లల్లో ఒక్కడివి నువ్వే అనుకోవడం అత్యాశ. కాబట్టి భగవంతుణ్ణి తెలుసుకోవడానికి విచారణ చేయాలి వితండం కాదు. అది శంకరుల దుస్తర్కాత్ సువిరమ్యతామ్...

-శంకరకింకర

Monday, October 9, 2017

రూప సంకరం చేయకూడదు

శ్రీ గురుభ్యోనమః

నువ్వు నమ్మిన గురువునో, దేవుణ్ణో ఇతర దేవీ దేవతల రూపాలుగా మార్చి మార్ఫింగ్ చేస్తున్నావంటే , నీకు నీ గురువు "స్వ స్వరూపం " అంటే అసలైన భౌతిక రూపం మీద ప్రేమ, నమ్మకం లేదన్నమాటే. అది ఆయనను అవమానించడమే - పూజించడం కాదు. అది గణపతి కావచ్చు, సాయి కావచ్చు ఇతర ఏ బాబా ఐనా కావచ్చు.

నిరాకారుడైన పరమాత్మ మనకి ఒక రూపంలో గోచరించాడంటే ఆరూపం ఒక గొప్ప సందేశాన్ని చూపుతుంది, తాను ప్రకటించే రక్షణకి, విభూతికి అనుగుణంగా ఆయుధాలు, కూర్చునే, నించునే భంగిమ ఇవన్నీ ఆ అవతార హేతువునీ, ప్రత్యేకతనీ చూపుతాయి. దాన్ని ఇంకొరికి మార్ఫ్ చేసి చూడడం భావదారిద్ర్యమే. అలా ఆరూపం సగుణంగా రావడానికి వెనక తత్సంబంధ ఋషుల ద్రష్టత్వమూ, తపఃఫలమూ, తపించిన భక్తుల కోరికా ఉంటాయి, వాటిని ఒకరివేరొకరివిగా మార్చడం అంటే ఇవన్నింటినీ, ఋషులనూ అవమానించినట్లే. ముఖ్యంగా ఆ బాబాలను గురువులనూ అవమానించడమే ఔతుంది. ఎవరికి ఏరూపం ఉందో ఆరూపంతో కొలవడమే ఉత్తమ భక్తుని లక్షణం. రూప సంకరం చేయకూడదు.

-శంకరకింకర


Friday, April 15, 2016

అమ్మా! కామాక్షీ! నీ కరుణా కటాక్షము రాముడే!

శ్రీ గురుభ్యోనమః
నమస్తే

కుంఠీకరోతు విపద్మమ కుంచిత భ్రూ
చాపాంచితః శ్రితవిదేహ భవానురాగః!
రక్షోపకార మనిశం జనయన్ జగత్యామ్
కామాక్షి! రామ ఇవతే కరుణా కటాక్షః!! (మూక మహాకవి)

అమ్మా! కామాక్షీ! నీ కరుణా కటాక్షము రాముడే. రాముడు వంచిన ధనస్సు కలిగినవాడు. నీ కటాక్షము వంచిన కనుబొమలు కలది. కటాక్షము సంసారులలో దేహ అనుభవ అనురాగ రాహిత్యాన్ని పొందింపచేస్తుంది. రాముడు ’విదేహ’ రాచకన్య సీతమ్మను పొందినవాడు. కటాక్షము అనునది జగత్రక్షణమునకు ఉపకారము చేస్తుంది. రాముడు జగద్రక్షణోపకారమొనర్చినవాడు. ఈ నీ కరుణా కటాక్షమే రాముడు రాముడే నీ కరుణా కటాక్షము.

Monday, March 7, 2016

ఈ అహంకారపుటజ్ఞానం మూలఘాతికాక తప్పదు

శ్రీ గురుభ్యోనమః
నమస్తే

శివరాత్రి వ్రతం ఉపవాసం, జాగరణ, అభిషేకాలు, మహాలింగేష్టి ఎన్నో ఎంతో హడావుడి చేస్తాం. భక్తి శ్రధాసక్తులతో చేసే ఈ కార్యాలు అనంత ఫలదాలు. నిస్సందేహం. ఐతే ఈ శివరాత్రి ఒక గొప్పనైన ఉపకారపు సందేశాన్నిస్తున్నది. అది అందుకున్నవారికి అందుకున్నంత... టూకీగా ఇందులోని ముఖ్యవిషయాలు తీసుకుంటే

౧) పరబ్రహ్మము సృష్టిలో మొదట చేసిన ఉపదేశం ’తపించు’ - తపస్సు చేయడం. ఏపని చేసినా తపస్సు చేయడం. తపస్సెప్పుడూ పక్కవాణ్ణి మెప్పించడానికో, పరపతి పెంచుకోడానికో కాదు అదెప్పుడూ ఆత్మానందానికే
౨) వేరే వ్యక్తి, పెద్దవాడు, భగవదనుగ్రహం ఉన్నవాడు కనిపిస్తే వినయంతో ప్రవర్తించక, తనకన్న అధికుడు కాదని లేదా అల్పుడని ఎంచి అహంకరించవద్దు.
౩) పేరు, పరపతికోసం, అసత్యమాడవద్దు, అసత్యమాడించవద్దు.
౪) లేని పెద్దరికం, లేని అర్హతలతో సత్యాన్ని మరుగునపెట్టి నేనధికుణ్ణని బీరాలు పోవద్దు.
౫) నాకు తెలుసు, నాకే తెలుసు, అవతలి వారెంత అని ఇచ్చవచ్చినట్లు ఎంచవద్దు.
౬) నేను గొప్ప అని అహంకరించి నువ్వు చెప్పడం చెప్పించుకోవడంకాదు, వినయశీలివైన నీ సుగుణాలను పెద్దలైన వారు గుర్తించాలి.

చూడండి అగ్నిస్తంభ ఆవిర్భావఘట్టంలో ఈ పైవన్నీ కనిపిస్తాయి. అది సృష్టి కర్త లోకానికి నేర్పే గుణపాఠమే ఐనా తానే మూడుగా మారి పాఠం చెప్తాడు. అందుకోవలసినవాడందుకోకపోతే రజోగుణ తమోగుణాలు పెచ్చరిల్లి జరగవలసినది జరుగుతుంది. శివరాత్రి నాడు ఓహ్ గొప్ప గొప్పవి బ్రహ్మాండమైనవి ఐన పూజలు, ఉపవాసాలు, జాగరణ చేసి నేర్చినదేమైనా ఉందా? అన్న విచారణ ముఖ్యం. అది అత్యంత ఉద్ధరణ కారకం. అప్పుడు పెల్లిబికే భక్తి శ్రద్ధలు వాటి స్థాయి ఉత్తమం.

ఎంత బ్రహ్మగారైనప్పటికీ విష్ణువు ఆధిక్యమేమి అని ప్రశ్నించారు అనవసరంగా కయ్యానికి కాలు దువ్వారు. చిన్నపెద్ద అంతరం లేకుండా తన మానాన తాను తపస్సు చేసుకుంటున్న విష్ణు మూర్తితో తలపడ్డారు. కారణం ఏమిటి దీనికి, నేను గొప్ప, నేను అధికుణ్ణి అని నిరూపించుకోవడం తప్ప వేరు ఏ కారణమూ కనపడదు (భగవంతుని లీల మాయ అన్నది పక్కనపెట్టండి). మన జీవితంలోనూ ఎందరినో చూస్తుంటాం ఎన్నో పటాటోపాలూ,  నేనది నేనిది వాడెంత వీడెంత నాఅంత వాణ్ణి నేను అనే వాళ్ళు కోకొల్లలు అది ఏ రంగమైనా సరే అలాంటి వాళ్ళు చాలా కనపడుతుంటారు.

ఇక విష్ణు మూర్తో తన మానాన తాను తపస్సు చేసుకుంటుంటే వచ్చిన బ్రహ్మగారితో అలాకాదురా అబ్బాయి ఇదీ విషయం అని చెప్పారు, బ్రహ్మగారు విన్నారా లేదు. పోనీ వెళ్ళిపోయారా విష్ణుమూర్తిని ఆయన తపస్సుకి ఆయనని వదిలి అంటే అదీలేదు. కయ్యానికి కాలు దువ్వారు. మొదట బ్రహ్మగారికి అహంకారం పెచ్చుమీరింది, నేనెందుకు తగ్గాలని విష్ణుమూర్తి కయ్యానికి సిద్ధపడ్డారు. చూడండి నేను గొప్ప అని ప్రూవ్ చేసుకోవాలనుక్కునే మనస్తత్త్వం వల్ల ఎంత ప్రమాదం వాడు ఆవేశకావేశాలకి లోనై ప్రశాంతంగా ఉన్నవాడినీ పాడుచేస్తాడు. ఎంత భయంకరమైన అహంకారపుటజ్ఞానం!!! అప్పుడే కదా జ్ఞానం కావాల్సింది.

కథగా, లోకులకి పాఠంగా చెప్పాలంటే, పరబ్రహ్మం ఊరుకోదు కదా సాధుజనులవద్దకెవరైనా వస్తే... సరే ఇద్దరి మధ్యలో అగ్ని స్తంభం రూపంలో ప్రత్యక్షమయ్యాడు. అక్కడా ఇద్దర్లో ఎక్కూ తక్కూలే... సరే ఒకరు హంస రూపమై ఆది చూస్తానన్నారు మరొకరు సూకరమై అంత్యం చూస్తానన్నారు... ఇద్దరివల్లా కాలేదు.

సత్వగుణ ప్రధానుడు, వినయంతో పరబ్రహ్మం చెప్పిన మాటవింటూ తపస్సు చేసుకునే విష్ణుమూర్తికి అర్థం అయ్యి తేరుకొని స్వస్థితికి వచ్చి ఎక్కడమొదలైయ్యారో అక్కడికి వచ్చారు. మరి బ్రహ్మగారు ఉక్రోషం పెరిగి ఎక్కడ విష్ణుమూర్తి ఆధిక్యాన్ని ఒప్పుకోవాల్సొస్తుందో అని ఎదురుగా వచ్చిన మొగలి పువ్వుని, ఆవుని అబద్ధపు సాక్ష్యం చెప్పమన్నారు. ఇక్కడ తెలుసుకోవాల్సిందేమంటే ఎవరితో కూడాలి ఎవరిని వదలాలి అని. మొగలి పువ్వు, ఆవు ఏది ఏమైనా  పరవాలేదు మేము అబద్ధం చెప్పము, మాకు పరమేశ్వరుడున్నాడు అని నమ్ముకుంటే సరిపోయేది, కానీ మొహమాటానికి లేని గౌరవాలకో అబద్ధం చెప్పడానికి ఒప్పుకున్నాయి.

సర్వజ్ఞుడు ఆయనకి తెలీదూ?  ఎంత వేదాలని గడగడా వల్లించి సృష్టి చేసే బ్రహ్మైనా... ఇంత అహంకరించినందుకు ఫలితంగా ఒక ’కుత్తుక’ తెగింది తస్మాత్ జాగ్రత్త ఎదుటివారి ఔన్నత్యాన్ని గుర్తు పెట్టుకుని ప్రవర్తించవలసిన రీతిలో ప్రవర్తించకపోతే ఆతల ఉన్నా ఒకటే ఊడినా ఒకటే అని పరమేశ్వరుని తీర్పు శిరోధార్యంగా ఇందులోంచి తీసుకోవాలి. ఎంత బ్రహ్మగారైనా ఆలయమేలేకపోయింది. అంటే పదిమందీ పూజించడానికి అర్చించడానికీ కుదరకుండా ఐంది.   అటువంటి వారికి సహకరించినందుకు ఎంత గొప్పనైన గుబాళింపుంటేనేమి? మొగలికి స్వామి పాదాలు చేరే అర్హత జీవితంలో కోల్పోయింది. ఎంత పవిత్రమైన దైనా అమ్మా అని అందరూ పిలిచినా గోమాత తన ముఖానికి పూజా కోల్పోయింది.

అహంకారులు, గొడవలు పెట్టుకునేవారు, చులకన చేసి గేలిచేసేవారున్నా తనకు విధించిన తన కర్తవ్యం చేస్తూ ఉన్నవాడు లోకానికి నాథుడైయ్యాడు పరమపూజ్యుడై జగన్నాథుడై అనంత నామాలతో కొడియాడబడుతూ సృష్టిలో ఆలయాలలో ఇళ్లలో పూజలనందుకొంటున్నారు. ఒక్క అహంకారం ఎంత పని చేస్తుందో మనం ఎరగాలి. వినయంగా మౌనంగా ఉన్నవాడు ఎదురుగా మాటలు భరిస్తున్నవాడు అశక్తుడు కాదు సాధువు అని గుర్తెరగి జాగ్రత్తగా మసలుకోగలగాలి. లేకపోతే ఎప్పుడో ఒకప్పుడు ఈ అహంకారపుటజ్ఞానం మూలఘాతికాక తప్పదు

ఇలాంటి మూర్తీభవించిన అజ్ఙానపు అహంకారపు తలపులతో ఉన్నవారు కోకో..... కో కొల్లలు... ఎంతమందిని చూస్తుంటాం  ఏ సాహితీరంగమైనా, ఏ కార్యాలయాలైనా,  ఏ రాజకీయ రంగమైనా, ఇక్కడా అక్కడా కాదు ఆధ్యాత్మిక రంగమైనా సరే బహుశా ఇక్కడే కాస్త ఎక్కువేమో ఇది... వాళ్ళు వీళ్ళుకాదు ఇది వ్రాస్తున్న నాతో సహా ఎందరో... అది పోగొట్టుకునే భాగంగా ఈ చిన్ని ప్రయత్నం.. పరమేశ్వరునికి ఈ నివేదనం..
…