Pages

Monday, June 22, 2026

బృందావన కథలు – 32 (స్వామి హరిదాసు – బాంకే బిహారీ)

జై రాధే! జై శ్యామ్!

బృందావనం...
అది కేవలం ఒక పవిత్రక్షేత్రం కాదు...
రాధాకృష్ణుల ప్రేమ నిత్యం ప్రవహించే దివ్యరససాగరం.
అక్కడి ప్రతి వృక్షం ఒక రహస్యం చెబుతుంది.
ప్రతి పుష్పం ఒక లీలను దాచిపెడుతుంది.
అతి ముఖ్యంగా... "నిధివనం"
నిధివన రహస్యం నేటికీ రహస్యమే...
కానీ ఒక విషయం మాత్రం నిజం...
ప్రేమతో పిలిచే హృదయం ఉంటే,
బాంకే బిహారీ నేటికీ ప్రత్యక్షమవుతాడు.
ఆ నిధివనం గురించి బ్రజవాసులు పుంఖాను పుంఖానులుగా ఇప్పటికీ ఎన్నో కథలు చెప్తూంటారిప్పటికీ
"ఇప్పటికీ ప్రతి రాత్రి అక్కడ రాసలీల జరుగుతుంది."
"అక్కడ రాధాకృష్ణులు విహరిస్తారు. ఫలానా వారు చూశారు " అని.
ఆ నిధివనంలో ఒక మహాయోగి నివసించేవాడు.
ఆయనే "సంత్ హరిదాసు స్వామి"
ఆయనకు రాజసభలతో పని లేదు.
ప్రపంచంతో పని లేదు.
ఆయనకు తెలిసింది ఒక్కటే
"రాధా నామం - శ్యామసుందరుడు"
రోజంతా ధ్యానం.
రాత్రంతా భజనలు.
కన్నులు మూసినా కృష్ణుడు.
కన్నులు తెరిచినా కృష్ణుడు.
శ్వాసలో కృష్ణుడు.
నిశ్వాసలో కృష్ణుడు.
ప్రతిరోజూ రాధా కృష్ణులతో మాట్లాడేవారు. వారి ఎదుట పాడేవారు, ఆడేవారు.
ఒకరోజు శిష్యులు "గురుదేవా!మీరు ప్రతిరోజూ ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరి కోసం పాడుతున్నారు?" అనడిగారు
స్వామి హరిదాసు చిరునవ్వు నవ్వి " బేటా! మీకు కనిపించడంలేదా? అక్కడ... ఆ కదంబవృక్షం కింద రాధా నిలబడి ఉంది." ఆమె పక్కనే నా శ్యాముడు ఉన్నాడు." అన్నారు.
శిష్యులు ఆశ్చర్యంగా చూశారు. వారికి ఏమీ కనిపించలేదు.
కానీ గురువు కళ్లలో మాత్రం తన్మయత్వం కనిపించింది.
ఒక పౌర్ణమి రాత్రి...
నిధివనం చంద్రకాంతిలో వెండి వర్ణంగా మెరిసిపోతోంది.
పూల పరిమళం గాలిలో తేలుతోంది.
ఆ రాత్రి స్వామి హరిదాసు పరవశంతో ఆలపించడం ప్రారంభించాడు.
"మై రీ! సహజ జోరీ ప్రకట్ భయీ!
గౌర శ్యామ్ ఘన దామినీ జైసే,
ప్రథమ హీ హుట్ అభయీ!!"
ఆయన గానం క్రమంగా మరింత మధురమైంది. మరింత ఆర్తిగా మారింది.
"ప్రభూ! ఎన్నాళ్లు దాగి ఉంటారు?
నా కళ్లకు మాత్రమే కాదు...
ఈ లోకానికికూడా దర్శనం ఇవ్వండి!" అని ఆలపించాడు.
ఆ క్షణం
అకస్మాత్తుగా...
గాలి ఆగిపోయింది.
వృక్షాలు నిశ్చలమయ్యాయి.
కూసే పక్షులు ఆగి నిశ్శబ్దాన్ని వహించాయి .
నిధివనం మొత్తం ఒక దివ్యకాంతితో నిండిపోయింది.
స్వామి హరిదాసు కళ్లనుండి ఆనందబాష్పాలు ప్రవహిస్తున్నాయి.
శిష్యులు భయంతో వణుకుతున్నారు, వారికేమీ గోచరమవ్వట్లేదు.
అప్పుడు...
కదంబవృక్షం క్రింద రెండు దివ్యరూపాలు ప్రత్యక్షమయ్యాయి.
ఒకవైపు...
అనంత సౌందర్యస్వరూపిణి "శ్రీమతి రాధారాణి."
మరోవైపు...
త్రిభంగిమలో నిలబడి వేణువు ధరించిన "శ్యామసుందరుడు."
వారి దివ్యకాంతి వల్ల నిధివనం కోటిసూర్యుల కాంతితో ప్రకాశించింది. స్వామి హరిదాసు నేలపై సాష్టాంగపడ్డాడు. ఆనంద భాష్పాలు కారుస్తూ "ప్రభూ! నా కళ్లకు ప్రత్యక్ష దర్శనం ఇచ్చారు. ఇప్పుడు నాకు మరొక వరం కావాలి." అని వేడుకున్నాడు.
కృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. "హరిదాసా! ఏమి కావాలి అడుగు?" అన్నాడు.
స్వామి హరిదాసు చేతులు జోడించాడు. "ఈ కలియుగంలో ఉన్నవారందరూ మీ దర్శనం పొందలేరు, అందుకే... మీ ఇద్దరూ ఒకే రూపంలో ఇక్కడే ఉండాలి. భక్తులందరినీ అనుగ్రహిం చాలి." అని వేడుకున్నాడు.
రాధా కృష్ణులు పొంగిపోయారు " రాధారాణి కరుణతో నిండిన చూపులతో హరిదాసు స్వామిని చూశారు.
శ్యామసుందరుడు చిరునవ్వు నవ్వాడు.
"హరిదాసా! నీవు నీ కొరకు ఏమీ అడగలేదు. మమ్మల్ని మాత్రమే కాదు... మా ప్రేమను ఈ లోకమంతటికీ పంచాలని కోరుకున్నావు. భక్తుల కన్నీటి విలువ తెలిసినవాడివి. అందుకే నీ కోరిక తప్పక నెరవేరుతుంది." అనిరాధా, కృష్ణులు ఒకరినొకరు చూసి చిరునవ్వు నవ్వుకున్నారు.
అకస్మాత్తుగా...
రెండు దివ్యరూపాలు ఒకే కాంతిపుంజంగా మారిపోయాయి.
ఆ కాంతి క్రమంగా శాంతించి...
ఒక అపూర్వమైన మూర్తిగా నిలిచింది.
త్రిభంగిమలో నిలబడిన
అందాలరాశి
మోహనాంగుడు
"శ్రీ బాంకే బిహారీ లాల్!" స్వామి హరిదాసు ఆనందతన్మయత్వంతో కళ్ళనీరు కారుస్తూ నర్తించాడు.
స్వామి హరిదాసు ఆ మూర్తిని చూస్తూనే ఉన్నాడు.
ఆ క్షణంలో ఆయనకు బాంకే బిహారీ కనిపించలేదు...
రాధ కనిపించింది.
కృష్ణుడు కనిపించాడు.
ప్రేమ కూడా కనిపించింది.
పరబ్రహ్మం కనిపించింది.
ఆయన కన్నీళ్లు నేలపై పడుతున్నాయి.
కానీ అవి దుఃఖాశ్రువులు కావు...
జన్మజన్మల తపస్సు ఫలించిన ఆనందబాష్పాలు.
"బిహారీ!
నా శ్యామా!
నా రాధారమణా!"
అని పిలుస్తూ కన్నీళ్లతో ఆ మూర్తిని ఆలింగనం చేసుకున్నాడు.
అప్పటి నుండి నిధివనంలో ప్రత్యక్షమైన ఆ మూర్తి, నేటికీ సంత్ హరిదాస్ స్వామి కోరిక మేరకు ఆ రాధాకృష్ణులు ఒకే మూర్తిగా బాంకే (వంకలున్న / త్రిభంగ) బిహారీ ఆలయంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు.
ఇక్కడ ఆలయంలో మరో విశేషం ఉంది.
బాంకే బిహారీ స్వామి ఎదుట తెరను తరచూ మూసి తెరుస్తుంటారు. ఎందుకంటే... ఎవరైనా భక్తులు ఆర్తితో పిలిస్తే, ఆ ప్రేమను చూసి స్వామి వెంటనే వాళ్ళ వెంట వెళ్లిపోతాడని బ్రజవాసుల విశ్వాసం.
రూపొందించండి
---
"హరి భజన బిను సుఖ శాంతి నాహీ!
రాధే నామ బిను బ్రజ రస నాహీ!!"
జై శ్రీ బాంకే బిహారీ లాల్ కీ జై!
జై జై శ్రీ రాధే!
జై జై సంత్ శ్రీ హరిదాస్ స్వామీకీ!
-శంకరకింకరః


No comments:

Post a Comment