Pages

Tuesday, February 5, 2013

భగవత్సాక్షాత్కారం

శ్రీ గురుభ్యోనమః


చాలామందికి భగవత్సాక్షాత్కారం ఒక్క జన్మలోనే కలుగుతుందా, లేక ఎన్ని జన్మలు పడుతుంది, ఉదాహరణకి ఒక లక్ష జన్మలైతే మరి ఇది ఎన్నో జన్మ ఇలా ఎంకా ఎన్ని జన్మలెత్తాలి ఇలా ఎన్నో అనుమానాలు. కాని ఇలా ఒక జన్మకో లేదా కొన్ని జన్మలకో భగవత్సాక్షాత్కారం అన్న నియమమేమీలేదు. భగవత్సాక్షాత్కారం కలగడానికి కారణం కేవలం భగవంతునిపై ఉన్న ప్రగాఢ భక్తి. భక్తిలేనినాడు భగవత్సాక్షాత్కారం కలుగదు. భగవత్భక్తి ఎక్కువైపోతే ఒక్క జన్మలోనే జీవన్ముక్తులౌతారు. -శంకరకింకర


భగవంతుడు, పరమ స్వతంత్రుడు, నియంత, దీనికి కట్టుబడతాడని చెప్పలేం అంతటి పరమ స్వతంత్రుడు కేవలం భక్తుని ఆర్తికి ప్రేమకి వశవర్తి నడుచుకుంటాడు.

ఎంత కరుణ.. ఏమి సౌలభ్యం..

ఎవరో ఒక భక్తుడు ఇలా అన్నాడట...

"అహో చిత్రమహో చిత్రం వందే తత్ప్రేమబంధనమ్!
యద్బద్ధం ముక్తిదం ముక్తం బ్రహ్మ క్రీడామృగీకృతామ్!!"


భగవంతుని పొందడానికి కొందరు నిర్గుణ పరబ్రహ్మాన్నిఉపాసన చేస్తుంటారు, మరి కొందరు సగుణ పరబ్రహ్మాన్ని ఉపాసన చేస్తుంటారు. ఎవరెలా కావాలంటే వారి సౌలభ్యానికనుగుణంగా మారిపోయి వారినుద్ధరిస్తున్నాడు. కానీ భగవంతుడు, అన్ని జీవరాసులకు మోక్షమిచ్చి బంధాలను తీయగలడో, నిత్యుడో, శుద్ధుడో, నిరంజనుడో అటువంటి వాడు భక్తుల చేతిలో ఆటబొమ్మగా మారుతున్నాడు. అలా ఆటబొమ్మగా మార్చిన భక్తుల భక్తి, ప్రేమ అనే పాశాలున్నాయే వాటినే నేను భజిస్తాను, ఎందుకంటే అవి భగవంతునే కట్టివేశాయి కనుక.


భక్తుడు తన ప్రగాఢమైన భక్తి పారవశ్యంచేత భగవంతునికి దూరంగా ఉండలేడు. అంతకన్నా ఎక్కువగా భక్తునికి దూరంగా భగవంతుడుండలేడు. సత్యం సత్యం పునస్సత్యం... -శంకరకింకర


కొమ్మనుండి పువ్వును తుంచటానికైనా సమయం పట్టవచ్చేమోకాని, భగవత్ప్రాప్తిని పొందటం కొరకు మన భక్తిపొంగినప్పుడు క్షణంలో కోటి వంతుకూడా భగవత్ప్రాప్తికి ఆలస్యం కలుగదు. సత్యం సత్యం పునస్సత్యం


"దూరాత్సుదూరే అన్తికాత్తదు అన్తికేచ"
వేదం భగవంతుని పొందుట దుర్లభమని చెబుతూనే, అతి సులువైనవాడు అనికూడా చెప్పింది. మనం భగవంతుని పొందటం చాలాకష్టం. అదే మనం ఆయన మీద నిష్కళంక, సంతత భక్తితోఉంటే ఆయనే వచ్చి మనని పొందుతాడు అదే సులువైనది. అది ఆయన కారుణ్యానికి పరాకాష్ట.


సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు..

-శంకరకింకర

No comments:

Post a Comment