Pages

Thursday, August 18, 2016

ఏనియమాలూ అవసరం లేదు....!!!

శక్తి ప్రసరణం ఉన్నచోట నియమం ఉంటుంది, శక్తిలేని చోట ఏనియమాలూ ఉండవు.

కరెంటు తీగలో కరెంటు ఉపయోగించాలంటే దాన్ని ఉపయోగించుకునే విధానం తెలియాలి, దానికి ప్రత్యేకమైన సదుపాయాలు, స్లిప్పర్స్, చేతి తొడుగులు వగైరా వగైరా కావాలి లేదా అవి తెలిసిన నిపుణుల సహాయం తీసుకోవాలి. కరెంట్ ఒక శక్తి దాన్ని పొందటానికి కొన్ని కండిషన్స్ అంటే నియమాలు ఉంటాయి.

అదే కరెంటు లేని తీగలనో కర్రపుల్లలనో ముట్టుకోవాలంటే ఏ కండిషన్, భయమూ, నియమాలు అక్కరలేదు. ఎందుకంటే అందులో కరెంట్ అనేశక్తి ప్రసరణం లేదు. ఎవరైనా ముట్టుకోవచ్చు ఏమైనా చేయొచ్చు, కరెంట్ ప్రసరణం లేని కర్రపుల్లను ముట్టుకోడానికి తొడుగులూ, స్లిప్పర్లూ, అందులో నైపుణ్యం ఉన్నవాళ్ళు కావాలేంటి? ఏమీ అఖ్ఖరలేదు!

విద్యుత్ శక్తి కావాలంటే? కరెంటు తీగ ద్వారా దాన్ని నియమిత విధానంలో ఉపయోగించుకునే పరికరం, దాని నిపుణత ఉండాలి. తీసి పక్కనపెట్టే కర్రపుల్ల విషయంలో ఏమీ అక్కరలేదు. కదా....! అందుకే సనాతన ధర్మంలో దేవతారాధనకి దేవాలయాల నిర్వహణకి నియమాలు ఆచార వ్యవహారాలు.

మావిధానంలో ఏ నియమాలూ లేవని ఎవరైనా చెప్తే విషయం ఎవరికి వారు అర్థం చేసుకోవాల్సిందే మరి..

శక్తి ప్రసరణం ఉన్నచోట నియమం ఉంటుంది, శక్తిలేని చోట ఏనియమాలూ ఉండవు
-బ్రహ్మశ్రీ సామవేదం వారి ప్రవచనం నుండి..Wednesday, August 17, 2016

దత్తావతారాలు దత్తునికి వ్యతిరేకంగా చెప్తాయా?

శ్రీ గురుభ్యోనమః
జై గురు దత్త

జనామోదానికి దత్తావతారం అని వాడుక తప్ప ఆచరణకి కాదా? దత్తుడు చెప్పిందే ఆచరించకపోతే ఇంకెందుకు ఆయన పేరు వాడుకోవడం.

శ్రీ బ్రహ్మాండ పురాణాంతర్గత శ్రీ దత్త మాహాత్మ్యం - చతుర్థ అంశః చతుర్ధశాధ్యాయః (శ్రీ గురు చరిత్ర అరవై ఒకటవ అధ్యాయము నుండి).

శౌచాచారవిహీనస్య సమస్తం కర్మ నిష్ఫలమ్!!
శౌచం తు ద్వివిధం ప్రోక్తం బాహ్యమభ్యంతరం తథా !
మృజ్జలాభ్యాం బహిః శుద్ధిః భావశుద్ధిస్తథాంతరమ్ !!

స్వయం శ్రీ దత్తాత్రేయులవారు ధర్మాన్ని ఉపదేశిస్తూ శౌచం లేని కర్మ నిష్ఫలం అని చెప్తుంటే, శౌచం పాటించకుండా అదేదో నీరు దొరకని అరబ్బు దేశవాసులలాగా శౌచం పాటించకుండా దత్తావతారాలు దత్త పరంపరలోని గురుపరంపర అని పిలవబడే మందిరాలకీ, సంస్థానాలకి శౌచం లేకుండా ఎలా వెళ్తున్నారు? పూజాదులు ఎలా నిర్వహిస్తున్నారు? ధర్మకర్తలు, పురోహితులెలా అనుమతిస్తున్నారు?

కేవలం విస్తృతజనామోదానికి దత్తావతారం అని వాడుక తప్ప ఆచరణకి కాదా? దత్తుడు చెప్పిందే ఆచరించకపోతే ఇంకెందుకు ఆయన పేరు వాడుకోవడం.?

నిత్యం స్యాధ్యాయశీలః స్యాత్ యథాచారం సమాశ్రయేత్!...

నారోహేద్దుష్టయానం శుష్కవాదం వర్జయేత్!
అన్యస్త్రీయం గచ్ఛేచ్చ పైశున్యం పరివర్జయేత్!!...

దుర్జనైః సహ వసేత్ నాశాస్త్రం శృణుయాత్తధా!
ఆసవద్యూతగీతేషు నరః ప్రీతింవివర్జయేత్ !!
నిత్యమూ స్వాధ్యాయము (వేదము, పురాణేతిహాసాలు) ఆచారనియమాలు పాటించాలి, దుష్టమార్గములో వెళ్లవద్దు, శుష్కవాదం చేయవద్దు, పరస్త్రీలవద్దకు వెళ్ళవద్దు...

దుర్జనులతోటి కలిసి ఉండరాదు, అశాస్త్రమైన వాటిని వినరాదు అని దత్తుడే చెప్తుంటే వేదశాస్త్రాలు వద్దని అవధూతపరంపరలో ఉన్నామని చెప్పేవారెలా చెప్తున్నారు.

పంచయజ్ఞపరిత్యాగీ బ్రహ్మహేత్యుచ్యతే బుధైః!
కుర్యాదహరహస్తస్మాత్ పంచయజ్ఞాన్ప్రయత్నతః !!
దేవయజ్ఞో భోతయజ్ఞః పితృయజ్ఞ సథైవ !
నృయజ్ఞో బ్రహ్మయజ్ఞశ్చ పంచయజ్ఞాః ప్రకీర్తితాః!!

అవధూతలకే అవధూత మహా అవధూతా ఐన శ్రీ దత్తాత్రేయులవారు స్వయంగా  ధర్మాన్ని ఉపదేశిస్తూ వేద విహితమైన పంచయజ్ఞములనాచరించమని, ప్రతి ఒక్కరూ ప్రయత్న పూర్వకంగా వాటినాచరించాలని చెప్తూంటే. వేద విహిత కర్మలవసరంలేదనీ, అవన్నీ వేర్వేరు మార్గాలనీ, దత్తావతారాలు దత్త పరంపరలోని గురుపరంపర అని చెప్పుకుని దత్తుడు చెప్పినదానికి వ్యతిరిక్తంగా ఎలా అవైదికాన్ని ఎలా ప్రచారం చేసి ప్రోత్సహిస్తున్నారు? ముఖ్యంగా ధర్మం చెప్పాల్సిన పురోహితాదులు వారి పంచ ఎలా చేరి ధర్మ భ్రష్టం, కర్మ భ్రష్టం, ఆచార భ్రష్టం చేయిస్తున్నారు.

బ్రాహ్మణ క్షత్రియవిశాం శూద్రాణాం చైవ యోషితామ్ !
మోక్షదం కుర్వతాం భక్త్యా విష్ణోః ప్రియతరంమునే !!
ఏకాదశీవ్రతం నామ సర్వకామఫలప్రదమ్ !
కర్తవ్యం సర్వదా విప్రైః విష్ణుప్రీణనకారణమ్ !!
ఏకాదశ్యాం భుంజీత పక్షయోరుభయోరపి !
యది భుంక్తే పాపీ స్యాత్ పరత్ర నరకం ప్రజేత్ !!

నాలుగు వర్ణాలవారూ ఏకాదశీ వ్రతం చేయాలనీ, దానివల్ల మోక్షార్హత కలుగుతుందనీ శుక్లకృష్ణ పక్షాలు రెంటిలోనూ ఏకాదశీ ఉపవాసం చేయాలని శ్రీ దత్తాత్రేయులవారు చెప్తేదత్తపరంపర, దత్తావతారం అని కొలిచే వారు ఉపవాసం చేయవద్దు అని చెప్పారని తప్పు ప్రచారం ఎలా చేస్తున్నారు. అవధూతలకే అవధూత, మహాయోగి, స్మర్తృగామి ఐన దత్తుని పేరు వాడుకుని దత్తుడు చెప్పిందానికి వ్యతిరిక్తంగా ఎలా ప్రచారం కావిస్తున్నారు?

దత్తార్పణం..

Friday, August 12, 2016

విద్వాంసుడు పామరులను భ్రమింపచేయకూడదు..

శ్రీ గురుభ్యోనమః

          విహిత కర్మలనొదలండి జ్ఞానం పట్టుకోండి అనే వాక్కులతో భ్రాంతి కలిగించే వారినుండి మనం తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. నీటి స్నానం అక్కరలేదు జ్ఞాన స్నానం చేయండీ అంటూ చెప్పేవారి పట్ల అప్రమత్తతో మెలగాలి. బట్టల రంగు మార్చి ఆచారవ్యతిరిక్తంగా మన ప్రవర్తనను ప్రోత్సహించేవారినుండి మనని మనం కాపాడుకోవాలి. సంప్రదాయదూరులూ, అనాచారులూ ఐన వారు ఎంత చదివినా గొప్పగా తియ్యని మాటలు (చార్వాక్కులు) మాట్లాడినా వారు మూర్ఖవదుపేక్షణీయః అని శంకరులు చెప్పారు ... సనాతనులను ధర్మదూరులుగా కర్మలోభులుగా మార్చే ప్రయత్నాలనుండి దూరంగా మనకి మనం ఉండాలి. శాస్త్రాలెందుకు, వేదాలెందుకు, కర్మలెందుకు అనేవారినుండి ఎంతో జాగ్రత్తగా మనముండవలె.

శంకరులు ఆత్మ బోధ అనే గ్రంథాన్ని ఎందుకై, ఎవరికై ఇస్తున్నారో మొట్టమొదటి శ్లోకం చేస్తూ చెప్పారు.

తపోభిః క్షీణ పాపానాం - శాంతానాం వీత రాగిణాం
ముముక్షూణాఽమపేక్ష్యోయం - అత్మబోధీ విధీయతే (01)

తాత్పర్యం: తపస్సుచేయటం చేత క్షీణమైన పాపముకలవారికినీ, ప్రశాంత చిత్తులకునూ, రాగద్వేషాలు విడిచినవారికినీ, మోక్షమునందు కోరిక కలిగినవారునూ కోరుకునే ఆత్మబోధ అనే ఈ ఆత్మ జ్ఞాన సంబంధమైన గ్రంథం ఇవ్వబడుతున్నది.

        కాబట్టి, బ్రహ్మవిద్య లేదా ఔపనిషద్ విద్య సార్వజనీకంగా ప్రవచించడం అంత శ్రేయస్కరమైనది కాదు. చిత్తశుద్ధి పొంది జ్ఞానమును ఇంకా పొందని వారు వేదవిహితమైన కర్మలను ఆచరించి చిత్తశుద్ధి పొంది జ్ఞానమును పొందుటకు గురువునాశ్రయించినపుడు బ్రహ్మవిద్యను ఏంకాతమున లేదా అతి కొంతమంది ముముక్షువులైన జిజ్ఞాసువులకు బోధించదగును. లేకపోతే ఆతురతచే లేక బుద్ధిదోషముచే పరిపక్వముకాకున్ననూ జ్ఞాన కాంక్షచే విహితకర్మాచరణమును వీడే ప్రయత్నం చేస్తారు.. అది కూడని పని. పైగా ఒకవేళ ఎవరైనా విహితకర్మాచరణం సరిగ్గా చేయాకపోతే సరిదిద్ధి సరిగ్గా ఆచరించేలా చూడాలి కానీ ఇంకా అనాసక్తి అశ్రద్ధ పెరిగేలా చేయకూడదు, అలాంటి మాటలు చెప్పకూడదు.

ఈ విషయాన్ని భగవానుడు గీతలోకూడా ఈ విధంగా చెప్పాడు భగవద్గీత 3 వ అధ్యాయములో ఇలా చెప్తారు...

"న బుద్ధిభేధం జనయేదజ్ఞానాం కర్మసఙ్గినామ్!
జోషయేత్సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్!!

        విహితధర్మపు ఫలముల యందు ఆసక్తిని కలిగిన పామరుల మనస్సు కలతపడి అనుమాన పడే రీతిగా విద్వాంసుడు పామరులను కర్మ నుండి నిగ్రహింపకూడదు (దృష్టి మరల్చరాదు) . అనగా పరమాత్మ స్వరూపమునందు నిశ్చలస్థితిని పొందిన జ్ఞాని శాస్త్రవిహిత కర్మలను ఆసక్తితో ఆచరించేవారి బుద్ధులను భ్రమకులోనుచేయరాదు. అనగా కర్మలయందు వారికి అశ్రద్ధకలిగించరాదు. తానుకూడా శాస్త్రవిహితములైన కర్మలను విహితవిధిన చేసి ఇతరులతోనూ అట్లే చేయించవలెను. అంటే ఒకరికి చెప్పవలసినది మరొకరికి చెప్పి భ్రమింపచేసి ఆచరణ దూరులను కావించరాదు.

So, please be choosy in sharing / teaching vedanta related topics as Brahma vidya / Upanishad vidya is to be taught in person (one to one or with small group of shishyas who are mumukhsu and has jignyasa) Should never be taught in open dais or broadcast them like purana pravachanam... may be one can use it as reference should not teach them openly without assessing the anushthana level of sadhaka(s).