Pages

Tuesday, February 5, 2013

లక్ష్మణ రేఖ నిజమా...?


శ్రీ గురుభ్యోన్నమః
శ్రీ గణేశాయనమః
శ్రీ రామాయణంలో ఒకానొక చర్చనీయాంశం లక్ష్మణస్వామి పంచవటిలో సీతమ్మను వదిలి వెళ్ళేటప్పుడు గీసిన గీతలు. అత్యంత ప్రామాణికమూ ఐన వాల్మీకి విరచిత శ్రీ రామాయణంలో ఇటువంటి సందర్భం కానరాదు. లక్ష్మణుడు గీతలు గీసినట్టుగా అది దాటలేని మాయా రావణుడు, సీతమ్మను గీత దాటి వస్తేనే భిక్ష తీసుకుంటానని బెదిరించడం వంటివి మనం అనేక సినిమాల్లో నాటకాల్లో చూసాం. ఎన్నో ఇతర రామాయణ అనువాద కథల్లో చదివాం. మరి స్వయంగా బ్రహ్మగారే వరమిచ్చి వాల్మీకి మహర్షి విరచితమైన శ్రీ రామాయణంలో తప్పులు కానీ అబద్ధాలు కానీ ఉండవని చెప్పారు. అందునా వాల్మీకి మహర్షి శ్రీ రాములవారు ఏక కాలం వారు.
లక్ష్మణ స్వామి గీత గీయలేదు అన్నదానిని క్రింది వాని ద్వారా విశ్లేషించ వచ్చు.

౧) వాల్మీకి వ్రాసిన రామాయణాన్ని శ్రీ రాముడు లక్ష్మణ భరత శత్రుఘ్న సకల పరివార సహితుడై లవకుశులనోట విన్నాడు. మరి వాల్మీకి మహర్షి తప్పు రాసుంటే శ్రీ రాముడు సరి దిద్ది ఉండాలి
౨)లేదా సమయానికి రాముడు అడవిలో బంగారు జింకను (మారీచుని) వేటాడడానికి వెళ్ళాడు కాబట్టిరామునికి పంచవటిలో జరిగిన విషయం తెలియదు అని అనుక్కున్నా, అక్కడే ఉన్న లక్ష్మణస్వామి లేదు లేదు నేను గీతలు గీసి వచ్చాను అని ఐనా చెప్పి సరి జేసి ఉండవచ్చు. కానీ అలా జరగలేదు.
౩)ఒక వేళ మాయా సన్యాసి భిక్ష తీసుకోవడానికి గీతలు దాటలేక, సీతమ్మనే బయటకు వచ్చి భిక్ష వేయమన్నప్పుడు. ఎంత కలత, పరాకులో ఉన్నా సీతమ్మ క్షత్రియ కాంతగా పెరిగినది, శాస్త్ర జ్ఙానం, లోక జ్ఙానం కలది కాబట్టి వచ్చినవాడు మాయావి అన్న అనుమానం తప్పక కలుగుతుంది, అనుమానంతో తన భర్త, మరిది వచ్చేవరకూ అక్కడే ఆగి ఉండమని చెప్పి ఉండవచ్చు.
౪)లక్ష్మణ స్వామి గీత గీసి దానిని దాటి ఎవరూ రాకుండా ఉంటారని అనుక్కున్నా, ఆయన గీత గీసింది బాణం ములుకుతో కాబట్టి అది ధనుర్వేదంలోని మంత్రములతో గీసినదై ఉండాలి. అటువంటివి ఏవైనా ఉంటే ఇతర పురాణాల్లో, ఇతిహాసాల్లో ఇటువంటి ఉదంతాలు ఉండాలి, కాని అలా లేవు.
౫)దీనితో పాటు మాయావి ఐన రావణునికి ఎక్కువ సమయంకూడా లేదు. రామలక్ష్మణులిద్దరూ తిరిగి వచ్చే వరకూ గీత దాటే ప్రయత్నమూ, గీత దాటుతుంటే అగ్ని రావటమూ సీతమ్మ ముందు గీత దాటి రాననటమూ, తరవాత భయపడి వస్తాననటమూ ఇవన్నీ చాల సమయాన్ని హరించేవి. అంత సమయాన్ని రావణుడు వృథా చేయలేడు ఎందుకంటే సహజంగా భయస్తుడు. ఎందుకంటే దొంగలకి నేరగాళ్ళకి దొరికిపోతామనే భయం అనుక్షణం వెన్నాడుతూనే ఉంటుంది. (14 వేల మంది ఖరదూషణాది రాక్షసులను సంహరించిన రాముడన్నా రాముని పరాక్రమమన్నా  ఇంకా భయం కలవాడు లేక పోతే రామ లక్ష్మణులు లేనప్పుడు సీతమ్మని ఎత్తుకు పోయే ప్రయత్నం చేయడు). కాబట్టి తప్పు చేస్తున్నాన్న భయం అతడిలోనున్నది
అందుకు ఇంత సమయం వృథా చేసుకోడు.
కారణాలచేత లక్ష్మణస్వామి గీత గీసాడన్న వాదు సరియైనది కాదని తెలుస్తుంది.
ఐతే మరి లక్ష్మణుడు గీసిన గీత వృత్తాంతం ఎలా వచ్చింది?
లక్ష్మణుడు గీసిన గీత అంటే లక్ష్మణుడు చెప్పిన బోధ/మాట దాటటం. భగవద్గీత అంటే భగవంతుడు గీసిన గీత అని కాదు కదా. భగవంతుని గాత్రంలోంచి వచ్చినది. గాత్రం, గీతం, గీత అన్నీ వాక్కుకి నోటికి / గొంతుకి సంబంధించినవి. భగవంతుని బోధ భగవద్గీత, అలాగే వశిష్ఠుని బోధ వశిష్ఠగీత, పరమశివుని బోధ శివగీత ఇలా అన్నమాట. కాలాంతరంలో కొత్త కవులు గీతనికాస్తా రేఖగా మార్చిఉంటారు. వాల్మీకి మహర్షులవారి తరవాత వచ్చిన కవులు మొదట్లో గీతని లక్ష్మణుడు చెప్పిన మాట వినలేదు అన్న అభిప్రాయంతో వాడి ఉంటారు. తరవాత గీత కాస్తా నేలమీద గీసిన గీత అయ్యింది అని అనిపిస్తోంది. ఇలా శ్రీ రామాయణ మూలంలోని ఎన్నో రహస్యాలను సామన్యులకి అర్థం అయ్యేలా వివరించటంకోసం తరవాత వచ్చిన కవులు ముఖ్యంగా ప్రాంతీయ భాషలలోని కవులు చేసిన కొన్ని కొన్ని ప్రయత్నాలు మూలంలోని వృత్తాంతాలకి కథలకి పూర్తిగా వ్యతిరిక్తంగా మారిపోయాయి.

[ ఉదా: మొల్ల రామాయణంలో సుగ్రీవుడు రాముణ్ణి ఏడు తాటిచెట్లు కొట్టమని చెప్పినట్టు ఉంది. కాని మూలంలో సాలవృక్షాలని  భేధించినట్లు ఉంది. బహుశా దీనికి కారణం ఆంధ్రదేశంలో పొడవైన చెట్లుగా తాటి చెట్లు ఉండడం ఇంకా చందనం చెట్లు గుబురుగా అవీ అతి కొద్ది ప్రదేశాలలో ఉండడం మూలాన మొల్లగారు తాటి వృక్షాలని ఎంచుకుని ఉంటారు.]
లక్ష్మణుడు చెప్పిన ముఖ్యమైన మాటలు (గీతలు)
  • అడవిలో మణులతో కూడిన బంగారు జింక ఉండదు బంగారు జింక ఒక మాయ, అది మారీచుని మాయ.
  • రాముని ఎవరూ నిర్జించలేరు రాముడు క్షేమంగా ఉంటాడు మాయావిని సంహరించి త్వర త్వరగా వచ్చేస్తాడు.
  • నేను రాముని కోసం వెళితే వదినా మీకు అపాయం కలుగుతుంది, రోజూ మీ పాదసేవ చేసే భాగ్యాన్ని దూరం చేయవద్దు అని తాను వెళ్ళిపోతే జరిగే అనర్థాన్ని ముందే సీతమ్మకి చెప్పడం.
సీతమ్మ మూడు ముఖ్యమైన లక్ష్మణుని బోధలను వినలేదు అంటే వాటిని అధిక్షేపించింది బోధలను దాటింది అదే సీతమ్మ గీతని దాటడం. బోధలు సీతమ్మ దాటకుండా ఉంటే రావణుడు సీతమ్మని ఎత్తుకెళ్ళలేడు. అదే రావణుడు లక్ష్మణ గీతని దాటలేకపోవడం.

వీటినే దృశ్యరూపకంగా చూపించేందుకు నాటకాలలో వాల్మీకేతర రామాయణాలలో లక్ష్మణుడు గీతలు గీసినట్టు చూపించడం ద్వారా అలానే ప్రచారం జరిగిపోయింది. అందరం అదే నిజమనీ, మూల గ్రంథమైన వాల్మీకి విరచిత శ్రీరామాయణంలో లక్ష్మణుడు గీత గీసినట్టులేదని చెప్తే అదే తప్పేమో అనుక్కునేంతగా మనలో వృత్తాంతం పాతుకుపోయింది.

సర్వం శ్రీ ఉమా మహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.
~~~~~~~~~~~~~~~~~~~~~~
ధర్మస్య జయోస్తు - అధర్మస్యనాశోస్తు
जय जय शंकर हर हर शंकर

No comments:

Post a Comment