Pages

Thursday, August 24, 2017

చంద్రశాపానుగ్రహ ఆఖ్యానము (శ్రీ గణేశ పురాణo)

గణేశావిర్భావమును గూర్చి కొన్ని పిట్టకథలు, సినిమా కథలు విరివిగా ప్రచారముననున్నవి. గణేశుడి బాగా ఉండ్రాళ్ళు ఇతర పదార్థాలు తిని తన తల్లి దండ్రులకు నమస్కరించబోగా ఏదో ఉయ్యాల ఊగినట్లు కాళ్ళు నేలకానితే చేతులానవనీ, చేతులానితే కాళ్ళు ఆనవనీ హాస్య స్ఫోరకమైన తప్పుడు కథలల్లి వినాయక వ్రత కథలందు జొప్పించడం జరిగింది. అంత అసంబద్దమైన కథలు పురాణమునందు కానీ, ప్రామాణిక వ్రతకథయందుకానీ లేవు అని గమనించి పురాణోక్తమైన కథలను చదివి వివరము తెలిసి, వ్రత ఫలితమును పొందగలరు. గణేశ పురాణమునుండి చంద్రశాపానుగ్రహమను మూలమునకు తెలుగు అనువాదము మనందరికొరకు  -శంకరకింకర

చంద్రశాపానుగ్రహ ఆఖ్యానము (శ్రీ గణేశ పురాణo)
బ్రహ్మగారు నారదుని కోరిక మేరకు చంద్రునికి కలిగిన శాప వృత్తాంతము, శాప విమోచనమును గూర్చి వివరిస్తూ ఇట్లు పలికెను "ఒకానొక సమయమున  పరమశివుడు నివసించు కైలాసము శిఖరమున సభలో నారదాది మునిముఖ్యులుండే సభకు వెళ్ళి, పరమశివుని అర్చించి శివునకు, శివుని కుమారుడైన గణపతికి ఫలాదులు సమర్పించిన పిమ్మట సభాంతమున బ్రహ్మ మరియు ఇతరులు ఎవరి గృహమునకు వారు వెళ్ళిరి. సమయమున వినాయకుడు కైలాసము నుండి చంద్రలోకమునకు వెళ్లగా, చంద్రుడు, ఉత్తముడు లోకోపకారిఐన వినాయకుని యొక్క బాహ్య ఆకారమును అనగా ఏనుగు మొఖము, జారిన బొజ్జను చూసి పరిహసించాడు. లోకమంతా, శిష్ఠులంతా యెవరిని "సుముఖుడు" అని ప్రశంసిస్తారో అటువంటి గణేశుని చంద్రుడు చూసి పరిహసించాడు. అది చూసిన వినాయకుడు క్రోధమును పొంది. అందముగా ఉన్న కారణముచేత లోకములో అందరూ నిన్ను పొగడుతున్నారన్న అహంకారంతో ఉన్నావు. ఉచ్ఛనీచాలు మరచి ప్రవర్తించావు కాబట్టి నాటి నుండి నీవు మలినుడవు, నిన్ను చూచిన వారికి నీలాపనిందలు కలుగుతాయి" అని శాపమును ఇచ్చి తన గృహానికేగెను.


విషయం సర్వ లోకములలో పాకి ఆనాటి నుండి చంద్రుని ఎవ్వరూ చూడటం మానేశారు. చంద్రుని అతిశయం, బాహ్య సౌందర్యంతో మిడిసి పడి లోకోపకారం చేస్తూ సుముఖుడుగా ప్రసిద్ధికెక్కిన వినాయకునే పరిహసించి శాపవాక్కు పొందిన విషయం సర్వలోకాలలోని వారికి తెలిసిందితాను అందరికీ ఆదర్శుడైన వినాయకునిచే శాపం పొందినందుకు చంద్రుడు సిగ్గుతో వివర్ణుడైనాడు. ఎంత అందమైన స్వరూపమైతే నేమి తన ముఖము ఎవ్వరూ చూడటానికి ఇష్టపడడంలేదని కృంగ సాగాడు.


చంద్ర శాప వృత్తాంతాన్ని తెలుసుకున్న ఇంద్రాది దేవతలు గజాననుని వద్దకు వెళ్ళి నమస్కరించి విధముగా విజ్ఞప్తి చేశారు " దేవ దేవా! సర్వ జగద్వందితా! నీవు స్వతంత్రుడవు, నీయిచ్ఛ వచ్చినట్లు పరిపాలించే నియంతవు. నిర్గుణుడవు, సగుణుడవు, అన్ని గుణములు నీ యందే కలవు. ఈశ్వరా ! పాహి పాహి! నిన్నే శరణు కోరుతున్నాము. చంద్రుడు చేసిన అపరాధమునకు వేసిన శిక్ష లోకమునంతకూ శిక్ష అగుచున్నది కాబట్టి చంద్రుడు పొందిన శాపమునకు విమోచనము ఇచ్చి చంద్రుని క్షేమమును, లోక క్షేమమును చూడవలసినది. లోకములు చంద్రుడు కనపడక, చూడక కష్టములలో ఉన్నవి. మరల అన్ని లోకములకు చంద్రుని దర్శనము , చంద్రుని తో భాషణము చేయు సౌలభ్యము కలుగజేయుము. ధర్మార్థకామ మోక్షములను ప్రసాదించు వినాయకుడు అది విని ప్రసన్నుడయ్యి ఇట్లు పలికెను " దేవతలారా! మీ స్తోత్రమునకు సంతుష్టుడనైతిని. కానీ మీరు కోరిన కోరిక మూడులోకములలోనూ అసాధ్యమైనది. చంద్రుడు చేసిన పనికి  శాప విమోచనము కుదరదు" అని పలికెను. అంత దేవతలు గణపతితో " దేవా! చంద్రుడు వివర్ణుడై ప్రకాశ హీనుడవ్వడం వలన, చంద్రుని అమృత కిరణములు పడక ఓషధులు ప్రకాశించుటలేదు లోకములు ఆపదలో ఉన్నవి కనుక ఆగ్రహింపక చంద్రుణ్ణి ఆపదనుంచి గట్టెక్కించు" మని ప్రార్థన చేసిరి.

దేవతల ప్రార్థన విన్న వినాయకుడు " దేవతలారా! లోకములో ఆదర్శనీయులను, మహాత్ములను నేరుగా కానీ అన్యాపదేశంగా కానీ కించపరిస్తే శిక్ష తప్పదు. చంద్రుడు అటువంటి అపరాధమే చేశాడు. ఉద్దేశ్యపూర్వకంగా వికటా అని పరిహాసం చేసి ఆపదలపాలయ్యాడు. అగ్ని, సూర్యూడూ చల్లగా ఐననూ, సముద్రము ఇంకిననూ నా వాక్కు ఫలించకతప్పదు. సుర సంఘములారా, నేటినుండి భాద్రపద శుక్ల చవితి తిథినాడు తెలిసి కానీ, తెలియక కానీ శాపముపొందిన చంద్రుని చూసినవారి ఎన్నో కష్టములను పొందెదరు." అదివిన్న దేవతలు "ఓం" అనుచూ ప్రణిపాతం చేసి పుష్ప వృష్టి కురిపించిరి తమ ఇండ్లకు వెళ్ళి చంద్రునికి చెప్పగా, అంత చంద్రుడు " నేను మూఢుడను, లోకములకు ఆదర్శుడైన గజాననునిచూచి పరిహాసమాడి కించ పరచినందుకు నాకే కాక మూడులోకములకు ఆపదలు తెచ్చిన అపరాధినిత్రైలోక్యనాయకుడు! దేవుడు! మూడులోకములు పాలించువాడు! అవ్యయుడు!నిర్గుణుడు ! నిత్యుడు! పరబ్రహ్మ స్వరూపమైన! గజాననుని! సమస్త లోకములకు గురువైనవానికి! నావల్ల అపరాధం జరిగినది. సర్వలోకముయొక్క హితము కొరకు నియమించబడినవాడినైనా నావల్ల అపరాధం జరిగినది. భాద్రపద శుక్ల చతుర్థినాడు మాత్రమే నన్ను చూడరాదన్న శాపమునకు విమోచనము ఎట్లు కలుగగలదు" అని పశ్చాత్తాపపడుతూ " గజాననునే శరణు వేడెదను, ఆయన ప్రసాదముగానే తిరిగి నేను ఖ్యాతిని ఆర్జించగలను" అని పల్కి దేవతల వద్ద సెలవు తీసుకొని గంగా నది దక్షిణ తీరమైన కాశీయందు గణేశుని కొరకై తీవ్ర తపస్సు చేసెను. ప్రదేశంలో చంద్రుడు ఇరవైరెండు సంవత్సరాలు కఠిన తపస్సు చేసాడు.


చంద్రుని తపస్సుకు మెచ్చిన గజాననుడు ఎర్రని వస్త్రములు కట్టుకున్నవాడై, ఎర్రని మాలలు ధరించినవాడై చతుర్భుజములతో, మహా కాయముతో, సింధూరవర్ణంతో, కోట్లాది సూర్యుల ప్రకాశంకన్నా ఎక్కువైన కాంతిపుంజపు ప్రకాశంతో చంద్రుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అంత కాంతిపుంజం చూసిన చంద్రుడు కళ్ళుతెరచి స్వామిని చూసి దోసిళ్ళొగ్గి నమస్కరిస్తూ తన మనసులో ఉన్న కోరికను కోరడానికై పరమ భక్తియుతుడై గజాననునితో " దేవా ! విఘ్ననాశకా! సర్వులకూ ధర్మార్థకామములనొసగడంలో విఘ్నములను హరించువాడా! దయా సముద్రుడా! పరబ్రహ్మా! విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడా! సమస్త విశ్వమూ నీయందే ఉన్నవాడా! జగత్తు యందు మాయగా ఉన్నవాడా! మూడులోకాలనూలయించు శక్తి కలవాడా! నీకు పునః పునః నమస్కారములు. బుద్ధిని ప్రకాశింపజేసి ప్రచోదనం చేయు దేవా! దేవతలకు అధిపతీ! నిత్యము సత్యమూ ఐన పరబ్రహ్మమా! నీకు నిత్యమూ నమస్కారములు. అజ్ఞానముతో చేసిన అపరాధమును మన్నించి దయను వర్షించి నన్ను దోష రహితుని చేయవలసినది." అని వేడుకొన్నాడు.


చంద్రుని స్తోత్రము, అతని కోరిక విన్న గజాననుడు " చంద్రా! నేను నీతపస్సుకు సంతోషించాను. నీకు ఇక పూర్వ వైభవం పూర్వ రూపం కలుగుగాక. భాద్రపద శుక్ల చవితి నాడు నావ్రతం చేసిన వారికి భాద్రపద శుక్లచవితినాడు చంద్రుని చూసిన ఎటువంటి దోషము కలుగదు." అని పలికి చంద్రునిలోని ఒక కళను తన తలమీద పెట్టుకుని చంద్రునికి తిరిగి సముచిత స్థానాన్ని కలిగించాడు. ఆనాడు గజాననుడు "ఫాల చంద్రుడు" అన్న నామాన్ని పొంది, దేవతలందరిచేతా షోడశోపచార పూజలందుకొని చంద్రుడు తపస్సు చేసిన క్షేత్రము సిద్ధి క్షేత్రము కాగలదని వరమిచ్చి అక్కడ చేసిన అనుష్ఠానాది కార్యములు త్వరగా సిద్ధించగలవని పలికెను. అంత దేవతలు మునులు సంతోషం చెందినవారై వారి వారి స్వగృహములకేగిరి. గజాననుడు శుక్ల పక్ష ప్రతిపత్తిథి నాటి చంద్రరేఖను ఎంతో ఉల్లాసంగా, ప్రహృష్ఠ వదనంతో తల మీద ధరించి తన గృహమునకేగెను.

శ్రీ గణేశ పురాణమందలి ఉపాసనా ఖండములోని చంద్ర శాపానుగ్రహము అనే ఆఖ్యానం సమాప్తము
-శంకరకింకర