శ్రీ గురుభ్యోనమః
నమస్తే
మన సాంప్రదాయంలో ఈ 108 సంఖ్య ఎన్నో చోట్ల వాడబడుతున్నది. అష్టోత్తరశత నామావళి అని, అష్టోత్తర శత శ్లోక గ్రంథములనీ ఇలా. శంకరుల విష్ణు సహస్రనామ భాష్య గ్రంథం కూడా 108 శ్లోకములదే
ఈ నూట ఎనిమిదికి మన సాంప్రదాయంలో పెద్దలు చెప్పిన కొన్ని వివరాలు చూద్దాం.
108 లో మొదటిదైన '1' పరబ్రహ్మమును చూపిస్తున్నది ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అన్నట్లుగా బ్రహ్మకు సంకేతం.
రెండవదైన '0' మాయ లేదా ప్రకృతి లేదా జగత్తుకి సంకేతం. ఎలా కుదురుతుంది? బ్రహ్మముయొక్క మాయ చేత అనంత మైన సృష్టి వెడలుతున్నట్టు 1 ని 0 తో భాగిస్తే వచ్చేది అనంతం (1/0=infinity) అదే ప్రళయకాలంలో జగత్తుతోసహా మాయ పరబ్రహ్మంలో కలిసిపోతే ఉండేది ఏకం, 1+0X8=1
మూడవదైన '8' ఎనిమిది విధములైన ప్రకృతిని సూచిస్తుంది. అదే అష్టమూర్తి తత్త్వం అనీ పెద్దలు చెప్తారు, ఆకాశం, గాలి, నిప్పు, నీరు, భూమి, సూర్యుడు, చంద్రుడు, యజమాని (జీవుడు).
అంటే అనంతమైన సృష్టిని ఈ ఎనిమిదిగా సూచించవచ్చు. ఈ ఎనిమిదిగానే జగత్తు ఉంటుంది. 1 నుండి 0 విడివడడం వల్ల (8) అష్టవిధ ప్రకృతితోకూడిన అనంతమైన జగత్తు ఏర్పడుచున్నవి. 8X0=0+1=1. అటువంటి ఈ జగత్తును కాపాడమని ఆ 1 రూపమైన పరమాత్మకు లేదా పరమాత్మ ప్రతిరూపాలకు వివిధ దేవతలపేర 108 నామాలతో అర్చన కావిస్తాం.
1+0+8=9 సాంప్రదాయంలో ఈ సంఖ్యద్వారా ప్రణవాన్ని సూచిస్తారు, అంటే ఇది మారదు ఎన్ని హెచ్చులువేసినా అదే సంఖ్యగా ఉంటుంది. ఈ కారణం చేతనే నవమి నాడు పుట్టిన శ్రీరాముడు ఎన్ని కష్టాలుపడ్డా తన స్వస్థితిలోనుండి తప్పుకోలేదు అని పెద్దల వ్యాఖ్యానం.
ఉదా:-
9+9=18, 1+8=9
9x3=27,2+7=9
9x25=225,2+2+5=9
మనిషి ప్రశాంతంగా ఉండే సమయంలో రోజుకు 21600 సార్లు ఉచ్ఛ్వాస నిశ్వాసలుంటాయి. ఉచ్ఛ్వాస తీసుకుంటున్నప్పుడు మంద్రంగా సో.... అన్న అక్షరం లోపల వినపడుతుంది అదే నిశ్వాస అంటే ఊపిరి వదిలేటప్పుడు హమ్... అన్నట్టుగా శబ్దం వినపడుతుంది. (ప్రయత్నించి చూడండి) రెండూ కలిపితే సోహం.... దీనినే ఒక జపంలాగా తీసుకుని హంసోపాసన అని నిత్యమూ అనుసంధానిస్తారు పెద్దలు. అంటే మాలకి 108 మణులచొప్పున రోజుకి 200 సార్లు ఈ హంసోపాసన జరుగుతుంది.
మనకి 12 రాశులు 27నక్షత్రములున్నవి ఒక్కో నక్షత్రానికీ నాలుగేసి పాదాలున్నాయి. అంటే మొత్తం 27 X 4 = 108 పాదాలున్నాయి. అలాగే ఒక్కో రాశిలో 9 పాదాలుంటాయి. 12 రాశుల x 9 నక్షత్ర పాదాలు =108. పుట్టినదేదైనా ఈ 108 పాదాలలో తప్ప పుట్టటానికి ఇంకో నక్షత్ర పాదం లేదు.
అందుకే మన సంప్రదాయంలో 108 నామాలతో భగవదర్చన చేయడం ద్వారా ఆయా పాదాలలో పుట్టిన ప్రతి ఒక్క జీవీ క్షేమంగా ఉండాలని కోరుతూ చేస్తాం. ఒక్కోసారి అది మనకి తెలీదు కూడా అదీ మన సాంప్రదాయం గొప్పతనం. మనకి తెలిసి భగవంతుని పూజించినా తెలియక పూజించినా, దాని సారాంశం, శం ద్విపదే, శం చతుష్పదే.... రెండు కాళ్ళున్నజీవులు, నాలుగు కాళ్ళున్న జీవులు, అలానే ఏకాచమే.. అంటూ ఒకటి సంఖ్యతో మొదలయ్యేవి, రెండుతో మొదలయ్యేవి ఇలా... అన్నీ మనకి వాటితో సంబంధమున్నా లేకున్నా అందరూ క్షేమంగా ఉండాలీ అని భగవంతుణ్ణి కోరడమే. అదీ సనాతన ధర్మం గొప్పదనం.
No comments:
Post a Comment