Pages

Tuesday, February 5, 2013

మనం ఏ ప్రయోజనము కొరకు పుట్టి ఉంటాము?

శ్రీ గురుభ్యోన్నమః
శ్రీ గణేశాయనమః

నమస్తే
ప్రతి జీవి పుట్టుకకి పరమార్థం ఉద్దరణే. అన్ని జీవులూ ఒక్కో జన్మలో ఒక్కో ఉత్తమ జీవిగా జన్మించి మనుష్యునిగా పుట్టి అక్కడ నుంచి ఇక పుట్టనవసరంలేని స్థితికి చేరుకోవడమే లక్ష్యం.

పుట్టేముందు జీవి పరమాత్మతో మొరపెట్టుకుని , పుట్టిన తరవాత సత్కర్మాచరణం చేసి తద్వారా జ్ఙానంపొంది తిరిగి భగవంతునే చేరుకుంటానని ఆ పరమాత్మకి ప్రమాణం చేసి, పుట్టగానే అన్నీ మరచి సంసారంలో పడతాడు.

ఏ జీవికైనా లక్ష్యం, పరమ ప్రయోజనం తిరిగి ఎక్కడనుంచి వచ్చామో అక్కడకి చేరుకోవడం. పునరావృత్తి రహిత శాశ్వత స్థానానికి చేరుకోవడమే. అనుషంగికంగా లౌకిక ప్రపంచంలో అన్ని అనుబంధాలు, ఏదో చేసామన్న కీర్తి, గొప్ప పనులు చెశామన్న తృప్తి, ఇంత సంపాదన లెక్కలు, ఎవరి మనసో నొప్పించామన్న అపకీర్తి ఇలా చాలా. ఐతే ఈ ప్రయాణంలో చేతనైనంత మన పక్కవారినికూడా తీసుకెళ్ళగలిగినంత తీసుకెళ్ళడం ఉత్కృష్టం. అది ఇంకో జీవిమీద కలిగే దయ. అది ఎంతవరకూ ఉంటుందంటే మన అసలు ప్రయోజనం దెబ్బ తినకుండా ఉన్నంత వరకు.

అది ఎలా ఉంటుందంటే అందరూ కలిసి వంట వండి వడ్డించినా, ఎవరి అన్నం వారే తినేలా. విస్తరి ముందు కూర్చునే వరకే అందరితో సంగం, కూర్చున్నాక ఎవరి ఆకలి వారిది ఎవరన్నం వారు తినాలి. ఒకరు కూరలు తెస్తారు, ఒకరు బియ్యం తెస్తారు, ఒకరు నూనె, నెయ్యి, పోపు గింజలు తెస్తారు, ఒకరు నీరు తెస్తారు, ఒకరు నిప్పు తెస్తారు, ఒకరు వంట చెరకు / గ్యాస్ తెస్తారు. ఇందులో ఎవరెక్కువ ఎవరు తక్కువ? ఎవరి ప్రయోజనం ఎక్కువ? ఎవరిది తక్కువ? అందరి పరమార్థం ఒక్కటే అందరూ కలిసి చక్కగా వంట వండి అందరూ కలిసి భోజనం చేయడమే. కానీ విస్తరిలో వడ్డించిన తరవాత ఎవరి తిండి వారిదే.

సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు


~~~~~~~~~~~~~~~~~~~~~~
ధర్మస్య జయోస్తు - అధర్మస్యనాశోస్తు
जय जय शंकर हर हर शंकर
https://groups.google.com/group/satsangamu

No comments:

Post a Comment