Pages

Thursday, February 7, 2013

సుందరం అత్యంత సుందరం సుమనోహరం

శ్రీ గురుభ్యోన్నమః
శ్రీ గణేశాయనమః
శ్రీ సీతారామ చంద్ర పరబ్రహ్మణేనమః

నమస్సులు

భద్రాచలం, శ్రీ రామ కార్యం గురించి ఆలోచిస్తూండగా సీతారామానుగ్రహంగా సుందరకాండ పారాయణ చేయాలని ప్రచోదనం కలిగింది.

తీపితిన్న నోరు తియ్యగానే ఉండిపోయినట్లు, సుందరకాండ పారాయణమనే పటికబెల్లం తీపి ఇంకా అలాగే ఉండి ఇంకా కాండలోని సన్నివేశాలను గుర్తుతెస్తూనే ఉంది. సరే మనసు సుందరకాండ చుట్టూ తిరుగుతుంటే దాని గురించే మీతో పంచుకోవాలనిపించింది.

సుందరే సుందరో రామ: సుందరే సుందరీ కథ:
సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం
సుందరే సుందరం కావ్యం,సుందరే సుందరం కపి:
సుందరే సుందరం మంత్రం, సుందరే కిం సుందరం?

శ్రీ రామాయణంలో శ్రీరాముడు అన్ని కాండలలోనూ ప్రత్యక్షంగా కనిపిస్తూ నాయక పాత్రలో ఉంటాడు. కానీ సుందరకాండలో మాత్రం శ్రీరాముడు ప్రత్యక్షంగా కనపడకపోయినా హనుమంతునిచే పలుమార్లు పలుకబడిన శ్రీరామ కథలో ఉంటాడు.

సుందరకాండలో ఎన్నో గొప్ప గొప్ప మంత్రాలు నిక్షిప్తమై ఉన్నాయి. పరాదేవతా స్వరూప వర్ణనము, గాయత్రీ స్వరూప మంత్ర వర్ణనము మొదలైన విశేషాలు ఎన్నో. శ్రీ, దీప్తి, శాంతి, హ్రీ మొదలైన అక్షర, పద ప్రయోగాలద్వారా సీతమ్మను పరాదేవతగా జగదంబగా శ్రీమాతగా వాల్మీకి నిరూపించిన సౌందర్యం సీతమ్మది. అమ్మే సౌందర్యం కదా అందుకనే సుందరకాండ.

శ్రీరామాయణమే ఒక మహా మాలా మంత్రం, అందులో సుందరకాండ అతిశక్తి వంతం. కష్టమొచ్చినా, ఆపదతొలగాలన్నా, ముక్తి కావాలన్నా, గ్రహ బాధలు తీరాలన్నా ఏంకావాలన్నా సుందరకాండ పారాయణమే శరణ్యం. అందుకే సుందరే సుందరం మంత్రం. ఇందులో సుందర హనుమ మంత్రాన్ని వాల్మీకి నిక్షిప్తం చేసారని సుందరకాండ అయ్యిందని కూడా పెద్దల వాక్కు.

గాయత్రిలోని 'దేవ' బీజాక్షరాలు కాండలో రామ శబ్దాన్ని సూచిస్తాయని. పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అన్నరీతిలో రాముడే సుందరుడు ( త్రిపుర సుందరికి శ్రీరామ సుందరునికి తేడాఏమి? ఇద్దరూ ఒక్కటే స్త్రీ పుం రూపాలు తప్ప..) 'రామ' శబ్దం మంత్రరూపంలో నిక్షేపింపబడిందికాబట్టి సుందర కాండ అని ఇంకో వాక్కు.

సుందరమైన శతయోజన విస్తీర్ణ లంకా నగర వర్ణనం జరిగింది. నాయకుడు దశగ్రీవుడు. అదే నూరు సంవత్సరాల వయసు గల శరీరం దాని భ్రాంతి వర్ణనం జరిగింది, పది ఇంద్రియాలుకలది, అహంకార, మమకారాలు రావణ కుంభకర్ణులు, బుద్ధి విభీషణుడు, భగవంతుడు రక్షిస్తాడోలేదో అన్న డోలాయమానంలో ఉన్న సీతమ్మ జీవుడు లేదా సాధకుడు. హనుమ వాక్యాలచే స్వాంతన పొంది రామునికై తపస్సు చేసి నిరీక్షించడమే గురుకృపతో దేవదేవుని తెలుసుకొనటం, ఆదేవుని పొందటం. అలాగే హనుమంతుడు ఒక సాధకునిగా చూస్తే, సాధనలోని విశేషాలు కుండలినీ శక్తి, నమస్కారం యొక్క ప్రభావం, సాధకుని వైక్లవ్యం దాని దిద్దుబాటు ఆత్మానుభవం, అందులో అన్నిటికన్నా సుందరమైన ఆత్మ వర్ణనం ఆత్మానుభవ వర్ణనం జరిగింది కాబట్టి సుందర కాండ.

ఇలా ఎంతని చెప్పగలను పెద్దలే, కవులే, పండితులే దీనిని కీర్తించ తరమా అన్నారు, అందరికన్నా చివరవాణ్ణి చిన్నవాణ్ణి నేనెంత. పైన రాసింది కూడా ఏదీ నా సొంతగా రాసింది కాదండోయ్ చూచిరాతే (కాపీ కొట్టడం అన్నమాట).

ఇంకా సుందరకాండ లోపలి విషయాలకి వెళ్తే.. సుందరకాండ ఉపాసన చేసిన వారిని సాక్షాత్ సీతారామ చంద్ర ప్రభువే కాపాడుకుంటుంటాడు.

బ్రహ్మాండపురాణం ప్రకారం, సుందరకాండతో సమమైన మంత్రముకాని, సుందరకాండ పారాయణ ఉపాసన వల్ల కలగని సిద్ధి ఇతర మార్గాలద్వారా కలగబోదని బ్రహ్మ గారి శాసనం. అలాగే, శ్రీ రామాయణానికి ఇది బీజ కాండ. అన్ని మంత్రములకు ఇది రాజు అని కొనియాడబడింది. ఇది సాధకుల పాలిటి వాంఛితార్థప్రదాయిని, చింతామణి, కల్పతరువు, కామధేనువు. లౌకిక విషయాలనుంచి పారలౌకిక విషయాలవరకూ ఏదైన తీర్చగలదు (ధర్మ బద్దమే సుమండీ).

సుందరకాండ మొదటి శ్లోకం "తతోరావణనీతాయ.." లో "తత్" తో మొదలైంది. అలాగే "తత్" తో ఆరంభం మయ్యే "తతో మయా వాగ్భి రదీనభాషిణా.." అనే చివరి శ్లోకంతో పూర్తయ్యింది.

అంతేకాదు కాండ మొదలు చివరి అక్షరాలు కూడా ""... "తతోరావణనీతాయ......
తథాభిపీడితా"
సుందరకాండ అద్వైతాన్ని సూచిస్తూ, మహావాక్యమైన తత్త్వమసిని , ఓం తత్సత్ ని సూచిస్తోంది. అందుకే ఈకాండ ఉపాసన చేసినవారు చివరికి ఏది పొందాలో అది తప్పక పొందుతారు. ముక్తినే ఇవ్వగలిగిన కాండ లౌకికంగా ఏది ఇవ్వలేదు కనుక?

సుందరకాండ శ్రీరామాయణానికే బీజమైతే, ఇందులో సీతమ్మను గాయత్రిగా, పరాశక్తిగా వర్ణించిన త్రిజటా స్వప్నం సరిగ్గా 24000 శ్లోకాల రామాయణం మధ్యలో వస్తోంది. సీతమ్మను పరాశక్తిగా వర్ణించే సర్గయే శ్రీరామాయణానికి పట్టు. రామాయణమహామాలకి మధ్యలోని మణిమయ పతకం.


ఇక పారాయణకి సంబంధించి, గాయత్రి చేసే అధికారం కలవారు మాత్రం అంగన్యాస కరన్యాసాదులతోనే సుందరకాండ పారాయణం చేయాలని పెద్దల, రామాయణోపాసకుల వాక్కు. ఇతరులు మామూలుగా పారాయణచేయవచ్చు.

పారాయణకి ముందు, గురువులకు నమస్కారం చేసి, ఆచమన సంకల్పాదులతో, విఘ్నేశ్వర, శ్రీ హనుమత్లక్ష్మణభరతశత్రుఘ్నాది సకలపరివారసమేత శ్రీ సీతారామ చంద్ర పూజ చేసి, అందులో శ్రీరామనామాలు (పూలు లేదా తులసి తో అర్చన) , సీతానామాలు (కుంకుమార్చన), హనుమనామాలు (తమలపాకులు / సింధూరం తో అర్చన) చేసి. గురువు,ఇష్టదేవతా, శక్తి సహిత త్రిమూర్తి, ఆంజనేయ, శ్రీసితారామ, శ్రీ వాల్మీకి, శ్రీ రామాయణ, శ్రీ సుందరకాండ స్తుతులు చేయడం పరిపాటి అలాగే. సుందరకాండ మొదలు పెట్టే ముందు గాయత్రి రామాయణం. రామాయణ ప్రథమ సర్గ, శ్రీరామ జనన సర్గ, సీతాకళ్యాణ సర్గ, చివర్లో శ్రీరామ పట్టాభిషేక సర్గ, మంగళ శ్లోకాలు చదవాలి. ఐతే పారాయణ సమయంలో బ్రహ్మచర్యం పాటించాలి. శుచిగా ఉండి, తినకూడనివస్తువులు పారాయణ సమయంలో త్యజించాలి. పారాయణ సమయంలోఎవ్వరితో మాట్లాడకూడదు.

ఇంకా ఎన్నోవిశేషాలు ప్రయత్న పూర్వకంగా తెలుసుకోవలసినవి. ఎన్నో ఎన్నెన్నో.. అన్నీ ఇక్కడపెట్టలేంకదా..

సుందరం అత్యంత సుందరం అతి మనోహరం...

సర్వం శ్రీసీతారామచంద్రపరబ్రహ్మార్పణమస్తు.
~~~~~~~~~~~~~~~~~~~~~~
ధర్మస్య జయోస్తు - అధర్మస్యనాశోస్తు
जय जय शंकर हर हर शंकर

No comments:

Post a Comment