Pages

Friday, December 28, 2018

భస్మ భూషితాంగ దేవ చంద్రశేఖరా


భస్మ భూషితాంగ దేవ చంద్రశేఖరా
అరుణ కిరణ శోభితా చంద్రశేఖరా
కరుణా రస సాగరా చంద్రశేఖరా
కామ బాణ నాశకా చంద్రశేఖరా
కామ కోటి భూషణా చంద్రశేఖరా
కమల నయన పూజితా చంద్రశేఖరా
విమల మూర్తి ధారకా చంద్రశేఖరా
కృపా కటాక్ష శోభితా చంద్రశేఖరా
పార్వతీ మనోహరా చంద్రశేఖరా
భస్మ భూషితాంగ దేవ చంద్రశేఖరా
అమర జన సేవితా చంద్రశేఖరా
సత్య వ్రత క్షేత్ర వాసి చంద్రశేఖరా
దేవ సింధు శేఖరా చంద్రశేఖరా
నీల గరళ శోభితా చంద్రశేఖరా
కామకోటి దేశికా చంద్రశేఖరా
కాల దర్ప నాశకా చంద్రశేఖరా
నాగ రాజ భూషణా చంద్రశేఖరా
రామ రామ రామ రామ చంద్రశేఖరా
రామ దాస సేవితా చంద్రశేఖరా
కామకోటి పూజ్య పీఠ చంద్రశేఖరా
శశి కిషోర శేఖరా చంద్రశేఖరా
దక్ష యజ్ఞ ధ్వంసకా చంద్రశేఖరా
సకల శాస్త్ర సన్నుతా చంద్రశేఖరా
నిగమ మార్గ గోచరా చంద్రశేఖరా
భస్మ భూషితాంగ దేవ చంద్రశేఖరా

(Collection)

Saturday, December 15, 2018

ధనుర్మాసమ్ ప్రాచీన వ్రతం

శ్రీ గురుభ్యోనమః

ధనుర్మాసమ్ తిరుప్పావైతో మాత్రమే మొదలవ్వలేదు.. అంతకన్నా ప్రాచీన వ్రతం ఇది..

ధనుర్మాసం కాల విభాగం చేసినప్పటినుండీ ఉన్నది. తిరుప్పావైతో మొదలవ్వలేదు. తిరుప్పావై పాశురాలు గోదామాత యొక్క మధుర భక్తి ప్రకటనంగా మనకి తదనంతర కాలంలో అందించబడ్డవి. అవి తమిళ భాషలో రచింపబడినవి. ధనుర్మాసంలో (సూర్యుడు ధనస్సు రాశిలోకి చేరిన మరునాటినుండి మకర సంక్రాంతి వరకు) తెల్లవారుఝామున విష్ణు ఆరాధన, శివాభిషేకం తులసి పూజ, గోపూజ విధించబడ్డాయి. చలిని తట్టుకోలేని ఆర్తులకు అగ్నిదానం, వస్త్ర కంబళి దానం విధింపబడ్డాయి. 

ఈ మాసంలో ద్రవిడ దేశంలో తిరుప్పావై (విష్ణు సంబంధం) - తిరువెంబావై (శివ సంబంధం) తమిళ స్తోత్రాలు పఠిస్తారు. వైష్ణవ సాంప్రదాయంలో పూర్వాచార్యులవల్ల ముఖ్యంగా దక్షిణ భారతంలో ఎక్కువగా దేవభాషకన్నా తమిళ ప్రభావం తీవ్రంగా ఉన్నకారణాన ఈ ప్రాంతాల్లోని వైష్ణవాలయాల్లో తిరుప్పావై ప్రాభవం ఎక్కువ. ఐతే తిరుప్పావై రచించిన కాలానికి మునుపే ఈ ధనుర్మాస వ్రతం ఎప్పటినుంచో కొనసాగుతూ వస్తున్నది. ఈ కాలంలో విష్ణు పురాణం, భాగవతం, ఇతర పురాణాలు పారాయణ చేయాలని బ్రహ్మగారు నారదునిద్వారా బోధించారు.

ఈ ధనుర్మాసంలో ఐదు నాణేల ఎత్తు విష్ణుమూర్తిని స్థాపించి ఈ నెలంతా అభిషేకార్చనాదులు పంచామృతాలు తులసీ జాతి పుష్పాలతో నిర్వహించి మిరియాలు, పెసరపప్పు, లవణం బియ్యం కలిపి వండిన పొంగలి, ఆవుపాలతోచేసిన పాయసం, దధ్యోదనం నివేదన చేయాలి. ఈ వ్రతం ఆచరించేవారు విష్ణుపూజతోపాటు తులసి పూజ, గోపూజ నిర్వహించాలి. చివరి రోజున ఆ మూర్తిని భోజన దక్షిణ తాంబూలాదుల సహితంగా పురోహితునికి గానీ సద్బ్రాహ్మణుకిగాని ఇచ్చి ప్రదక్షిణ నమస్కారాలు చేయాలి. 

ఈ మాసంలోనే తెల్లవారు ఝామున 3 గంటల ప్రాంతంలో శివాభిషేకం అద్భుతంగా చేస్తారు అతి ముఖ్యంగా ఆర్ద్రా నక్షత్రం ఉన్నరోజు మరింత శోభాయమానంగా నిర్వహిస్తారు శివాలయాల్లో.

వ్యాసపూజ చేయకపోతే ఈ వ్రతం నిష్ఫలం
----------------------------------------------------
ఈ ధనుర్మాసంలో ఒకసారైనా వ్యాసపూజ చేయాలి, వ్యాసపూజ చేయకపోతే ఈ ధనుర్మాస వ్రతం నిష్ఫలమని చతుర్ముఖబ్రహ్మ నారదునికి ధనుర్మాస వైశిష్ఠ్యంలో చెప్పారు.

సర్వం శ్రీ రంగరాజ - శ్రీ నటరాజ పాదారవిందార్పణమస్తు

- శంకరకింకర

Friday, December 14, 2018

స్థాయి బేధాల గురించి..

స్థాయి బేధాల గురించి మాట్లాడేవాళ్లని చాలామందిని చూస్తుంటాం... (నాలాంటి టుమ్రీలైతే బోల్డుమంది). నిజానికి ఆ స్థాయి ఈ స్థాయి అని బేధాలు మాట్లాడే ఎవరుకూడా అసలు చేరవలసిన స్థాయిని చేరకుండా ఉన్నవారే. నూటికి తొంభైమందికి అసలు విషయంలో ప్రవేశమే ఉండదు కానీ ఈ కవిత స్థాయి కాదండీ ఆ పాట ఈ స్థాయి కాదండీ ఈనకి పూజలో అంత స్థాయి లేదండీ అంటూ అతిఎక్కువగా విషయ పరిజ్ఞానంలేనివారే మాట్లాడేస్తారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక విద్యలలో ఇది ఎక్కువ. అసలు ఆంతర స్థాయి ఎవరికి తెలుస్తుంది? "ఆధ్యాత్మ విద్యలలో ఎవరి స్థాయి ఏంటి అనేది పరసంవేద్యం కానేకాదు అది స్వసంవేద్యం". అది తెలిసినవారు స్థాయీ బేధాలగురించి మాట్లాడరు. మాట్లాడుతున్నారంటే తరణం సంగతి దేవుడెరుగు ఒడ్డున ఇసకలో గవ్వలేరుకుంటున్నవారే... పైన చెప్పినట్లు నాతో సహా!

-శంకరకింకర

Tuesday, December 11, 2018

తపోజలాలను

తపో జలాలను సిరాగ మార్చి
పదునెక్కిన మనో కలాన్ని ముంచి వ్రాస్తానొక శాసనం!

ధర్మపరుల ఆలోచనలనావాహన చేస్తూ
ఉపాసకుల ఊపిరులతొ కొత్త శ్వాస తీస్తున్నా!

దృశ్యమే తామైన సమాధి స్థితి పొందిన ద్రష్టల దృష్టిని కోరుతు ఉన్నా!

మాటల చేతల అంతరాలనూ
చండీసింహపు గర్జనలతో ప్రశ్నిస్తున్నా!

శివపార్వతుల తాండవ కేళీ
విలాస సాక్ష్యమై కాలి అందెగా సత్యాన్నై నిలుస్తున్నా!

-శంకరకింకర (10-01-2018)

భవాని త్వం... భవానిత్వం



దేశిక పాద స్మరణం!

ఆ జగజ్జనని అనుగ్రహంలేనివారు ఎంతటి నీచ కార్యములను చేయడానికైనా వెనుకాడరు. గురు స్త్రీ బాల వృద్ధులనే బేధం లేకుండా అష్టాదశ వ్యసనాలయందూ మునిగి తేలుతుంటారు. అష్టాదశ వ్యసనాలేవి అంటే మహానుభావుడైన మహర్షి మనువు ధర్మ సూత్రాలలో వీటి గురించి చెప్పి ప్రతి మనిషి ప్రయత్న పూర్వకంగా విసర్జించి దూరంగా ఉండాలని జాగ్రత్త చెప్పారు.

మృగయాక్షో దివాస్వాపః పరివాదస్త్రియోమదః
తౌర్యత్రికం వృధాట్యాచ కామజో దశకోగణః
పైశున్యం సాహసం ద్రోహ ఈర్ష్యాసూయార్ధ దూషణేః
వాగ్దండనంచ పారుష్యమ్ క్రోధజోఽపి గణోఽష్టకః (మనుస్మృతి)


వేటాడడం, జూదం, పగలు నిద్రించడం, నిందాలాపనలు చేయడం, స్త్రీలౌల్యం, గర్వం, దుష్టమైన ఆలోచనలను రేకిత్తించు నృత్య , గీత, వాద్యములందు విపరీతమైన ఆసక్తి, పని పాట లేక తిరుగుచుండుట-ఈ పది కామజనక వ్యసనములు.

చాడీలు చెప్పుట, దుస్సాహసము, సాధుజనులపై ద్రోహచింత, పరుల కీర్తిని చూసి అసహనము ఓర్వలేని తనము కలిగియుండుట, ఇతరుల గుణములందుదోషములు ఆరోపించి చులకన చేయుట తద్వారా కీర్తి హననము , నీచముగా కఠినముగా మాట్లాడుట అను ఈ ఎనిమిది క్రోధజములైన వ్యసనములు.

పై వ్యసనాలు ఎవరియందైనా స్పష్టంగా ప్రకటంగా కనిపిస్తున్నాయంటే దానర్థం ఆ జగజ్జనని యొక్క అనుగ్రహానికి అటువంటి వ్యక్తులు పాత్రులు కారు అని మనకు సప్తశతీత్యాదిగా అమ్మవారి స్తుతులలో తెలుస్తున్నది.

ధర్మ్యాణి దేవి సకలాని సదైవ కర్మా- ణ్యత్యాదృతః ప్రతిదినం సుకృతీ కరోతి !
స్వర్గం ప్రయాతి చ తతో భవతీప్రసాదా- ల్లోకత్రయేఽపి ఫలదా నను దేవి తేన!!

అమ్మా ధర్మ కార్యాలను ఎవరు చేయగలరో తెలుసా, నీ దయ ఉన్నవాడు, నువ్వు ఎవరిని అనుగ్రహిస్తావో ఆ వ్యక్తి మాత్రమే దైవీ గుణ సంపత్తిని పెంచుకొని, ధర్మ కార్యములను నిర్వర్తించగలడు. నీ అనుగ్రహం ఉన్నవారే సుకృతములను చేయగలరు. అనగా, అనుగ్రహం లేనివారు దుష్కృత్యములను నిర్వహిస్తూ, పర ధనయశోకాంతలనాశిస్తూ వివేక హీనుడై, ధర్మ హీనుడై ప్రవర్తిస్తాడు. ఏ వ్యక్తి యైనా , అధార్మికమైన కార్యం చేస్తున్నాడు, స్త్రీబాలవృద్ధసాధుభక్తజనులలో ఏ ఒక్కరి గురించి చెడు ఆలోచన చేస్తున్నా దానికి తాత్పర్యం ఆ వ్యక్తికి జగజ్జనని అనుగ్రహం లోపించింది అని గుర్తు. ఎవరైతే నీ అనుగ్రహాన్ని పొందడం వల్ల దైవీ గుణసంపన్నులై మంచిని పెంచి పంచుతారో, అందరినీ ఆదరిస్తారో అటువంటివారు స్వర్గాది త్రిలోకములే కాదు నీ చరణ సీమనే పొందెదరు.


దుర్గే స్మృతా హరసి భీతిమశేషజన్తోః స్వస్థైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి!
దారిద్ర్యదుఃఖభయహారిణి కా త్వదన్యా సర్వోపకారకరణాయ సదాఽఽర్ద్రచిత్తా!!

అమ్మా, నీ భక్తుల సంకటములెల్లను పోగొట్టి నిన్ను సదా తలిచి నిలిచేవారికి భయాన్ని, బాదను తొలగించి స్వస్థతను చేకూర్చెదవు. అలాంటి వారికి మరింత మంచి బుద్ధిని కటాక్షించి నీ మార్గమునుండి మరలని స్థిరబుద్ధిని ప్రసాదించెదవు.  నీవు ఎలాంటి వారికైనా మంచి చేయాలనే తలపు గలదానవు, కానన్జేశి నీ భక్తులకు గూడా భవాని త్వం... భవానిత్వం గామారి అటువంటి లక్షణములే అలవడి అపకారులను కూడ ఉపేక్షించి ఉపకారమే చేయుదురు. నీ అనుగ్రహ వృష్టిచే దారిద్ర్య దుఃఖాలను తాపార్తిని హరించడంలో నీకన్నా పణ్డితులెవరున్నారు లోకంలో అని నీదరి చేరిన వారిని అక్కున చేర్చుకుందువు. సత్యము సత్యము సత్యము.

- శంకరకింకర