Pages

Friday, August 30, 2013

పురాణేతిహాసాలలోని ఘట్టాల వక్రీకరణ - దానిపై మనం చేపట్టాల్సిన చర్యలు?

పురాణేతిహాసాలలోని ఘట్టాల వక్రీకరణ - దానిపై మనం చేపట్టాల్సిన చర్యలు?

శ్రీ గురుభ్యోనమః
నమస్తే

పురాణేతిహాసాలలో ఉన్న మహానుభావుల చరిత్రలను వారి వృత్తాంతాన్ని వక్రీకరించి జనబాహుళ్యంలోకి ప్రచారంలోకి తీసుకురావడం ఎంతవరకు సమంజసం. పురాణపురుషులను వారి వ్యక్తిత్వాలని వారి నిజ స్థితిని కాకుండా ఎవరికి తోచినట్లు వారు మార్చి వ్రాయటం, పురాణంలో ఉన్న మహానుభావులను కించపరుస్తూ ఉన్న పుస్తకాలు అసలు భారత జాతికే మూలగ్రంధాల్లోవైన పురాణాల వక్రీకరణను ప్రేరేపిస్తున్న లేదా మరుగున పరుస్తున్న పుస్తకాలు వాటి రచయితలను ఎందుకు ఉదాసీనంగా ఉపేక్షించడం జరుగుతోంది. మన ధర్మ గ్రంథాలను, పురాణేతిహాసాలను వక్రీకరిస్తుంటే మనం నిలదీయలేమా?

అవైదిక మతాలలో వారి గ్రంథాలకి వ్యతిరిక్తంగా ఒక్క నాటకం, సినిమా, పుస్తకం, వ్యాసం ఆఖరికి మాట బయటికొచ్చినా మూకుమ్మడిగా అందరూ కలిసి ఖండిస్తారే! న్యాయ పరంగా చట్టపరంగా ఎన్నో విధాల అలాంటి విషయాలు బయటికి రానివ్వకుండా జాగ్రత్త తీసుకుంటారు.  అలాంటిది మన సనాతన ధర్మంలో ఉన్నవారమెలా మన ధర్మ ప్రచార గ్రంథాల విషయంలో మిన్నకుంటున్నాం? ఉదాసీనతకు కారణమేంటి?

మన పురాణ పురుషులు, పురాణంలో ఉన్న కథలను వ్యక్తులను వారి వ్యక్తిత్వాలను కించపరచినప్పుడు, వారి కథలను వక్రీకరించినప్పుడు ఖండించాల్సిన అవసరం మనకు లేదా? వక్రీకరించబడిన పురాణ కథలు ప్రచారంలోకి రాకుండా అడ్డుకునే చర్యలు తీసుకోవాల్సిన జాగ్రత్త మనకు లేదా?

విషయం మీద పెద్దలందరూ కలిసి చర్చిస్తే కనీసం భవిష్యత్తులో పురాణేతిహాసాలను వక్రీకరించే వ్రాతలను ఆపడంలో కొంతైనా చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మీమీ అభిప్రాయాలు తెలియజేయగలరు.

Friday, August 16, 2013

దేనివల్ల చారుమతికి అమ్మవారి అనుగ్రహం కలిగింది?

శ్రీ గురుభ్యోనమః
నమస్తే

ప్రతి సంవత్సరం చేసుకునే వ్రతాలలో ముఖ్యంగా స్త్రీలకు సంబంధించి వరలక్ష్మీవ్రతం అత్యంత విశిష్ఠమైనదని తెలిసిందేగా. వ్రతం కేవలం వ్రతంలా కల్పంలో చెప్పినట్లు భవిష్యోత్తర పురాణంలో చెప్పిన విధంగా భక్తితో చేసుకోవడం ద్వారా అమ్మవారి సంపూర్ణ అనుగ్రహానికి తప్పకుండా నోచుకోగలము. ఐతే వ్రతంలో అమ్మవారి అనుగ్రహం చారుమతి ఎమ్దుకు పొందగలిగింది అన్న విషయాన్ని మనం తరచి చూసుకొని సద్విషయాల్ని మనం ప్రోది చేసుకొని ఆచరించడం ద్వారా మరో చారుమతీ దేవి అంత ఆదర్శ ప్రాయమైన జీవితాన్ని గడపగలం.

వ్రతమే కాదు, వ్రతమైనా అందులో ఉండే వ్రత కథ కొన్ని విషయాల్ని మనకు చెప్తాయి, ఉదా: సత్యనారాయణ స్వామి వ్రత కథలలో ఏది సత్యమైనదో తెలుసుకోవడం, లోభమోహాది దుర్గుణాల్ని వదలడం, భక్తిశ్రద్ధలను కలిగి ఉండడం వంటివి అందులోనుంచి తెలుసుకుంటాం. అలానే వినాయక వ్రత కథలో: బాహ్య రూపాన్ని కాక ఆంతర రూపాన్ని  ఎలా చూడాలి, లోకమాన్యులను, లోకం కోసం జీవించే వాళ్ళనెలా గౌరవించాలి, లోక రక్షకులను ఎలా సేవించాలి, తప్పు చేస్తే ఎలా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, తప్పొప్పుకున్నవాణ్ణి క్షమించి ఎలా ఆదరించాలి, అలాగే ఏది పరిగ్రహము ఏది అపరిగ్రహము వంటివిషయాలు తెలుస్తాయి.

కథను విచారిస్తే నాకిలా అనిపించింది.
)
కైలాస శిఖరే రమ్యే నానాగణవిషేవితే... అంటూ కైలాసం రమణీయం వివరించారు, కల్పలతలు, కుబేరుడు, వరుణుడు ఇత్యాది దిక్పాలకులు, నారద, వాల్మీకి, పరాశరాది మహర్షులు పరివేష్ఠించి ఉన్న చోట రత్న పీఠంమీద సుఖాసీనుడౌ లోకములకు శుభం కలిగించే నిత్యశుభుడైన శంకురుడు ఆసీనుడై ఉన్నాడు.
సన్నివేశాన్ని మీ కళ్ళతో మీరు చూస్తున్నట్లుగా భావన చేసి చూడండి అద్భుతంగా ఉంటుంది. తెల్లని పరమేశ్వరుడు పక్కన సింధూరారుణ కాంతులతో అమ్మవారు కల్పవృక్షం దగ్గర, కుబేరాది దిక్పాలకులు, నారద,వాల్మీక,పరాశరాది మహాజ్ఞానులు. సన్నివేశాన్ని భావన చేసి లోన చూడడమే సగం భాగ్యం చేయడమే.  ( మూర్తిని వామదేవ మూర్తి అంటారు, ఈయన అడిగిందే తడవుగా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు)

) ప్రపచ్చ గౌరీ సంతుష్ట లోకానుగ్రహ కామ్యయా.. నిత్య సంతుష్ఠయైన అమ్మవారు లోక కళ్యాణం కొరకు బాగుగా కూర్చిన ప్రశ్నను పరమేశ్వరుని ప్రశ్న చేసెను. అమ్మవారు నిత్య సంతుష్ట ఆమెకు వేరు కోరికలేవు, ఆమె కోరికల్లా లోకంలోని తన పిల్లలు తనలా నిత్య సంతుష్ఠులవ్వాలన్నదే! అందుకే ఆమె ఎప్పుడూ పరమేశ్వరుని లోక క్షేమం కొరకు ప్రశ్నలడుగుతూ ఉండి వచ్చిన సమాధానాల ద్వారా మనకి  శుభం కలుగజేస్తుంది.

సరే ఇక పరమేశ్వరుడు సర్వసౌభాగ్యకరమైనది, సర్వ సంపత్ప్రదం, శీఘ్రమే పుత్ర పౌత్రవర్థనం గావించేది ఐన వరలక్ష్మీ వ్రతమున్నది అని చెప్పారు.. దానికి అమ్మవారు అది ఎలా చేయాలి? ఇంతకు ముందు ఎవరు చేసారు అన్న ప్రశ్నలడిగారు దానికి పరమేశ్వరుడూ సమాధానం చెప్పారు.
)కుండిన నగరంలో ఉన్న చారుమతి అనే బ్రాహ్మణ యువతి ఉంది, ఆమె పతిభక్తి రతా సాధ్వీ శ్వశ్రూ శ్వశురయోర్ముదా! కళావతీ సా విదుషీ, సతతం మంజుభాషిణీ! తస్యాః ప్రసన్న చిత్తాయాః లక్ష్మీ స్వప్నగతాతదా!’ ఆమె పతిననుగమిస్తూ పతియంది గురువుగా, దైవముగా భక్తి కల సాధ్వి, అత్త మామమలను చక్కగా సేవిస్తూ వారి ప్రేమను చూరగొన్నది. చక్కని కళాకాంతులు చిమ్మే శుభలక్షణ (ఏదో... జుట్టు విరబోయకుండా చక్కని సిగ పెట్టుకొని/జడ వేసుకొని , పువ్వులు పెట్టుకొని,  బొట్టు, కాటుక ఇత్యాది శుభకరమైన, పవిత్రములైన, సుమంగళద్రవ్యములను వాడుతూ శుభప్రదముగా దర్శనమిచ్చునది). చక్కని మాటలతో స్వాంతన చేకూర్చగలది, ఎన్నడూ ప్రసన్నమైన మనసుతో ఉండే తల్లి చారు మతీ దేవి. ఆమె చారిత్రము చూసి ఒకనాడు స్వయాన లక్ష్మీదేవి పొంగిపోయి స్వప్న దర్శనం ఇచ్చి తన వ్రత వివరం తెలిపింది.

) సరే ఆమెకి స్వప్నం వచ్చింది, ఆవిడ ఉదయాన్న లేచి తన భర్తకు, అత్తమామలకు, బంధువులకు పురజనులకు తెలిపింది. అందరూ సంతోషించారు ఎవ్వరూ అసూయపడలేదు ఆమె కలని కొట్టిపారేయలేదు. భర్త, అత్తమామలు, బంధువులు, స్నేహితులు అందరూ కలసి ఆనందించి శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు వస్తుందా అని ఆర్తితో ఎదురు చూసి  రోజునాటి సాయంత్రం అమ్మవారు చెప్పిన విధంగా వ్రతం చేసుకున్నారు. (ఇది నక్త వ్రతం, అంటే సాయంకాలం చేయవలసిన వ్రతం అని కథలో ఉన్నది)

)తరవాత సుశీలురు వృద్ధులు (వయో/జ్ఞాన) ఐన బ్రాహ్మణుని లేదా బ్రాహ్మణ దంపతులను అతి భక్తితో పూజించి వాయనమును ఇచ్చి, అమ్మవారిని పూజ చేసిన మంటపం దగ్గరే నివేదనము చేసిన వంటకములను అందరూ కలిసి భోజనం చేసారు. అందరికీ వరలక్ష్మీ అమ్మవారి అనుగ్రహం వల్ల అనంత ఐశ్వర్యాలు కలిగాయి, అందరూ సంతోషపడి చారుమతీ వృత్తాంతాన్ని ఆమె పొందిన అమ్మవారి అనుగ్రహాన్ని తలచుకొని ఆమెను కీర్తించారు, అలా ఆమె లోకప్రసిద్ధిగాంచింది.

) ఇంకొకటి చారుమతీ ఇతరస్త్రీలు కలిసి మొదటి ప్రదక్షిణం చేయగానే కాళ్ళు ఘల్లు ఘల్లుమంటూ గజ్జెలు, ఇతర ఆభరాణాలు వచ్చాయి, ఇంకో ప్రదక్షిణకి రథ, గజ, తురగాలు ఆయా స్త్రీల ఇళ్ళలో ప్రత్యక్షమయ్యాయి అని తెలుగు కథలో ఉంది. కాబట్టి మనం పూజించుకునేటప్పుడు మంటపాన్ని ఏర్పరుచుకునేటప్పుడు చుట్టూ ప్రదక్షిణ చేయగలిగే వీలుతో ఉంచుకోవాలి అని అన్యాపదేశంగా సన్నివేశం చెప్తోంది.

కుటుంబమూ, సమాజమూ ఒక్కమాటపై ఉండి పరస్పర గౌరవ మన్ననలు ఆదరాభిమానాలు కలిగిఉండడం, కలిసికట్టు తనం, సమాజం అంతా ఐకమత్యంగా ఉండడం, కలిసి ఉన్నతమైన కార్యాలు నిర్వహించుకోవడం సంపూర్ణ లక్ష్మీ కటాక్షానికి ప్రాతిపదిక అని అంతర్లీనమైన సందేశం

ఆ మహాతల్లి చారుమతీ దేవి, ఆమె భర్త, అత్తమామలు, బంధువులు, స్నేహితులు, కుండిన పుర ప్రజలను వీ సౌభ్రాతృత్వాన్ని చక్కనైన శీలాన్ని మనం మార్గదర్శంగా తీసుకొని ఆచరించి జీవించవలసి ఉంది అని నా భావన, అప్పుడు లక్ష్మీనారాయణులు మనందరినీ చక్కగా ఆశీర్వదించి వైభవోపేతమైన జీవితాన్నిచ్చి, అంత్యంలో పొందవలసినదాన్ని తప్పక ఇస్తారు.

సర్వం శ్రీ లక్ష్మీనారాయణ పాదారవిందార్పణమస్తు