Pages

Friday, July 31, 2015

నజానామి భవద్రూపం - నజానామి భవత్ స్థితిమ్

శ్రీ గురుభ్యోనమః
నమస్తే

వ్యాసం వశిష్ఠ  నప్తారమ్ శక్తేః పౌత్రమకల్మషమ్ !
పరాశరాత్మజమ్ వందే శుకతాతమ్ తపోనిధిమ్!!

సదాశివ సమారంభామ్ వ్యాస శంకర మధ్యమాం!
అస్మదాచార్య పర్యంతామ్ వందే గురు పరంపరాం!!

మానవ జీవిత లక్ష్యం కైవల్యమును పొందడం. అంటే పునరావృత్తి రహితమైన శాశ్వత మోక్షస్థితిని పొందడం. జ్ఞానాద్ధేవతుకైవల్యం అని కదా ఆచార్యవాక్కు. ఆ శాశ్వత మోక్ష స్థితి జ్ఞానం వల్లనే సాధ్యం. తత్త్వమస్యాది మహావాక్యముల అర్థమును తెలుసుకొని జీవితంలో అనుష్ఠానంలోకి తెచ్చుకోవడం ద్వారా ఆ జ్ఞానం బోధపడి మరొకటి తెలుసుకునే అవసరం లేని స్థితిలో కైవల్యానంద స్థితిలో శరీరమున్నంతవరకూ ఆత్మజ్ఞానంలో ఓలలాడుతూ తదనంతరంకూడా పుట్టుక మరణం లేని స్థితిలో ఆత్మగా నిలబడిపోవడం. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని కదా శ్రుతి. వేద భూమిగా పేరొందిన ఈ గడ్డమీద వేదము తదంగములు తదనుసారములైన స్మృత్యాది ధర్మ శాస్త్రములు తంత్ర,పురాణేతిహాసాదులు ప్రామాణిక గ్రంథములై లౌకిక పారలౌకిక జీవన విధానానికి వలసిన ఎంతో విజ్ఞానమును ప్రసాదిస్తున్నాయి. ఐతే కలిలో యుగంధర్మం ప్రకారం మానవులు అల్పాయుష్కులు, మంద బుద్ధులైనవారిగా ఉండేలక్షణాలున్నవారవడం చేత ఈ అపారమైన వైదిక వాఙ్మయం అంతా సాంగోపాంగంగా అభ్యాసం చేసి ఆచరణలోకి తెచ్చుకొని మానవ జీవిత లక్ష్యాన్ని చేరుకోలేరని ఆ అపారమైన వేద రాశిని నాలుగుగా విభజించి తన నలుగురు శిష్యులకు బోధించి ప్రచారం చేసిన ఉదారులు భగవాన్ బాదరాయణులు. వ్యాసపదవిని అధిరోహించి వేద విభాగం చేసినవారు కాబట్టి "వేదవ్యాసులు" అన్నపేర మన కలియుగంలో నుతికెక్కారు.

కలియుగంలో జనులందరికోసం అపౌరుషేయమైన వేద వాఙ్మయంతో పాటు అందులోని సూక్ష్మాలను గ్రహించడానికి ఆచరించడానికి గాను ఏ వర్ణాశ్రమాది అధికారబేధంతో సంబంధం లేకుండా కనీస శౌచంతో పారాయణకు వీలుగా, ధర్మం తెలుసుకొని ఆచరించడానికీ వీలుగా ఆ వేదార్థాలను సులభంగా బోధించే మహా పురాణాలను, ఉపపురాణాలనూ, మహా భారతాన్నీ అందించారు. బ్రహ్మమునందు రమించే తాత్వికులైన వేదాంతులకొరకు బ్రహ్మసూత్రభాష్యాదులనూ అందించారు. ఒక్కమాటలో చెప్పాలంటే వేదంలో చెప్పబడిన కర్మాచరణానికీ, ధర్మ సూక్ష్మాలకూ, వేదాంత ప్రదిపాదిత జ్ఞానం సంపాదించడానికీ కావలసిన సమస్త విద్యనూ సరియైన విభాగంగా ఏయే భూమికలలో వారికి ఆయా విధంగా పనికి వచ్చేలా వాఙ్మయాన్నిమనకందించారు.

సమస్త పురాణ సారం బాహ్యంగా వైదిక ధర్మ కర్మాచరణం ఐతే వేదాంత ప్రతిపాదిత జ్ఞానం అంతర్లీనం. వేదవ్యాసులు కలియుగంలోని ’రాబోవుతరాలకోసం’ అన్న ఉదారతతో ఇంత ప్రామాణికమైన వాఙ్మయాన్ని ఇచ్చి ఉండకపోతే, ఆ వాఙ్మయం గురుశిష్య పరంపరగా కొనసాగుతూ వచ్చి ఉండకపోతే, ఈ గడ్డమీద ధర్మవ్యతిరేకులు ఆచరణదూరుల "స్వకపోలకల్పితాల" వల్ల నేటి మన జీవితం ఎంత అయోమయావస్థలో ఉండేదో.. అటువంటి మహాపురుషుడైన వేదవ్యాసుని కొరకు నమస్కరించడం, ఉత్సవం చేయడం, ఆ గురుపరంపరలో గురువులని దర్శించడం, వారిని సత్కరించి, నమస్కరించడం ఆషాడ పౌర్ణమి నాటి విధిగా ధర్మజ్ఞులైన పెద్దలు నిర్ణయించి మనకందించిన సంప్రదాయం.

శ్రీ వ్యాసులవారి తదనంతర పరంపరా, శ్రీశంకరభగవత్పాదాచార్యులూ వారి పీఠ పరంపరా నలువేపులా ధర్మరక్షణ చేస్తూ ఈ వాఙ్మయాన్ని ప్రచారం చేస్తూ అందులోని విషయాలను తెలుసుకుంటూ ఆచరించమని చెప్పారు చెప్తూనే ఉన్నారు. ఇప్పటికీ అదే పరంపరలో పీఠాధిపతులు, సద్గురువులైన వారూ ఆచరిస్తూ ప్రచారం చేస్తూ  ఉన్నారు. అసలు ఈ వాఙ్మయం సారం చూస్తే ’ధర్మము, వేదవిహిత కర్మాచరణము, తద్వారా చిత్తశుద్ధిని పొంది మానవ జీవిత లక్ష్యమైన పునరావృత్తిరహితమోక్షస్థితిని పొందడమును గూర్చిన విశేషములే’.

చతుర్విధా భజంతే మాం.... ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ.. అని గీతాచార్యుడే సాధకులలోని నాలుగురకాలు చెప్పారు. ఆ నాలుగు రకములైన సాధకుల కోర్కెలు తీర్చగలిగే సమర్థత, ఉపాయములు కలది సనాతన వైదిక వాఙ్మయము. ఒక్క సూర్యుడు అందరు మనుష్యులకీ ఒక్కో సూర్యుడుగా కనపడి వారివారికి కావలసిన విధంగా వారి దృష్టికోణానికనుగుణంగా ఫలితాలనిస్తున్నట్లు. ఆచార్యులు/ గురువులనాశ్రయించిన ఈ నాలుగు విధాల ఆస్తికజనులకూ తదనుగుణమైన బోధ జరుగుతుండడం కేవల సనాతన ధర్మ పరంపరకే సొంతం. గురువు తాపత్రయాలను పోగొట్టి అజ్ఞానపు చీకట్లను పారద్రోలే భానుడు కదా... నమో శంకర భానవే అని ఆస్తికమహాజనులందరూ నమస్కరిస్తున్నది జగద్గురువులైన శంకరాచార్యులకే కదా...

పరమపూజ్యులు నడిచేదేవుడిగా కీర్తింపబడిన కామాక్షీ స్వరూపులు శ్రీ శ్రీ శ్రీ శంకర చంద్రశేఖరేంద్రసరస్వతీ స్వాముల వారు ఒకసారి "ధర్మాన్ని కాపాడడానికి ముందు గౌరవించి పునరుద్ధరించవలసినది ఆచారమును’. ఆచారమే శ్రేయము. విషయం తెలియనంత మాత్రాన ఆచారాలను వదలి ధర్మగ్లాని చేయకూడదు" అని తమ అనుగ్రహ భాషణంలో సెలవిచ్చారు.

ఆచారః పరమోధర్మః శ్రుత్యుక్తః స్మార్త ఏవ చ!
తస్మాదస్మిన్సదా యుక్తో నిత్యం స్యాదాత్మవాన్ద్విజః!!
’ఆచారము’ సర్వోత్కృష్టమైన ధర్మమమని శ్రుతి స్మృతులు చాటుచున్నవి, కాబట్టి తన ఆత్మజ్ఞానమును కోరుకునే వ్యక్తి ఎప్పుడూ సదాచార సంపన్నుడై ఆచారమును పాటించేవాడై ఉండాలి.

ఆచారలక్షణో ధర్మః సంతస్త్వాచార లక్షణాః!
ఆగమానాం హి సర్వేషామాచారః శ్రేష్ఠ ఉచ్యతే!!
ఆచార ప్రభవో ధర్మో ధర్మాదాయుర్వివర్ధతే
ఆచారాల్లభతేహ్యాయురాచారాల్లభతే శ్రియమ్!!
ధర్మము యొక్క లక్షణమే ఆచారము. మంచి అన్న దానికి లక్షణమూ ఆచారమే. అన్ని బోధలకంటే ఆచారము శ్రేష్ఠము. ఆచారమే ధర్మమూలం అక్కడనుండే ధర్మము ఉద్భవించింది. ధర్మము ఆయుష్షుని అభివృద్ధి చేస్తుంది. ఆ ఆచారం వలన మానవునికి ఆయుష్షు సిరిసంపదలు లభిస్తాయి.
(అలాగే మహాభారతం అనుశాసన పర్వం నుండి..)

ఈ వేద విహితమైన వాఙ్మయాన్ని అందులోని విషయాలను కూలంకషంగా వివరిస్తూ "ఆచరణం వల్లనే ధర్మం నిలబడుతుంది" అన్న ఆర్షవాక్కుని నిక్కచ్చిగా చేసి చూపుతూ ధర్మాన్నే ఆచరిస్తూ ప్రచారంచేస్తున్న వారిలో తెలుగునాట అగ్రగణ్యులు మన పూజ్య గురువులే అనడంలో ఏమాత్రమూ సంకోచమూ అతిశయోక్తీలేదు. కొన్నేళ్ళ క్రితం స్తబ్దుగా ఉన్న సనాతన ధర్మ ప్రచారం తెలుగునాట తిరిగి వేళ్ళూనుకొని ప్రతి తెలుగింటా తిరిగి ధర్మము ఆచారము పునరుద్ధరింపబడుతున్నవంటే, కారణం ఒక్కటే! ఏ విధమైన ప్రతిఫలాపేక్ష లేకుండా సనాతన ధర్మ వైభవమును, ఆచార వైశిష్ట్యమును తెలుగునాట ఘంటాపథంగా అప్రతిహత కొనసాగించి ఎందరికో మార్గనిర్దేశంచేసిన పూజ్య గురువాణియే .

పురాణేతిహాసాదులైన శ్రీ రామాయణ, భారత, భాగవతాదులు, ఆర్షవాఙ్మయం కేవలం ప్రవచనాలకీ కుక్షింభరత్వానికి కాదు అనీ, ఆవి తెలుసుకొని నిత్యజీవితంలో ఆచరించి తరించటానికి అనీ ఎలుగెత్తి చాటి చెప్పి ఎందరికో మార్గదర్శకునిగా ఆచార్యునిగా నిలబడినవారు మన పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. గీతాచార్యుడు చెప్పిన విషయాలైనా శంకరులు చెప్పిన విషయాలైనా ఆచార్య వరేణ్యులైన చంద్రశేఖరేంద్ర సంయమీంద్రుల వాక్కులైనా, రామకృష్ణ రమణాదుల జ్ఞాన నిర్దేశనమైనా పూజ్య గురువుల ప్రవచనాలలోనూ వారిఆచరణలోనూ దొరులుతూ స్పష్టంగా గోచరిస్తాయి.

ధర్మము, వైదిక కర్మాచరణము, విజ్ఞానము ఈమూడు విషయాలు పూజ్య గురువుల ప్రవచనాలలో అంతర్లీనం. విద్యార్థులకు లక్షసాధనవేపుకి మార్గదర్శనం చేసినా, ఆధునిక మానవ జీవన విధానంలో ధర్మాన్ని అన్వయం చేసుకుంటూ తీర్చిద్దుకోవలసిన జీవన విధానంపై మార్గదర్శనం చేసినా, భాగవతంతో భక్తిరసంలో ఓలలాడించినా, శ్రీ రామాయణంలో ధర్మాన్ని ఆచరణను పక్కపక్కనే చూపినా, శంకరుల ప్రశ్నోత్తరమాలిక, షట్పది ఇత్యాదులలో వేదాంత జ్ఞానాన్ని బోధించినా గీతాచార్యుడు చెప్పిన అన్ని భూమికలలోని సాధకులను ఒకేవేదిక మీదనుంచి ఒకే విషయం ద్వారా సంతృప్తికలిగించడం బహుఅరుదైన విషయం. అది పూజ్య గురువుల వంటి వారికే సొంతం.

అందుకే పామరులనుండి, పండితులవరకూ అందరూ పూజ్య గురువుల ప్రవచనాలు వినడానికి అంత ఆసక్తి కనబరుస్తారు. పూజ్య గురువుల ప్రవచనం వింటుంటే రామాయణ భాగవతాది పురాణాఖ్యానాలు, శాంకర స్తోత్రాదుల వ్యాఖ్యానాలలో ఉన్న పాత్రలు కళ్ళముందు కదలాడతాయి. ఆయాఘట్టాలు జరిగిన ఆయాకాలాలకు ప్రదేశాలకు మనని మానసికంగా తీసుకొని వెళ్తాయి. అదే సమయంలో తత్త్వ విచారణ చేసేవారికి ప్రశ్నలకీ జ్ఞాన సంబంధమైన వివరణలూ దొరుకుతాయి. పూజ్య గురువుల ప్రవచనాలు విన్నంత, ఒక సాధారణ వ్యక్తి తన ఆచార వ్యవహారాదులలోనూ, ధర్మం పట్ల తన దృష్టికోణాన్నీ, మార్చుకొని విహిత కర్మాచరణం వేపు ధర్మాచరణం వేపు అడుగులిడడం ఎందరో వ్యక్తుల జీవితాలలో ప్రత్యక్షంగా చూస్తూన్నాం.

అటువంటి మహనీయమూర్తులైన వ్యాసశంకరాది గురుపరంపరను, దాన్ని మనకందించిన పూజ్య గురువుల వైభవాన్ని కీర్తించడం సాధమయ్యే పనేనా... గురువంటే పరబ్రహ్మమనీ, మూర్తీభవించిన జ్ఞానపుముద్ద అని కదా ఆర్షవాక్కు.  మన అదృష్టం మన కళ్ళు ఆ రూపును చూడగలవు, చెవులు వినగలవు, అన్ని ఇంద్రియాలతో వారిని భౌతికంగా తెలుసుకొనగలవు.. "అణో రణీయాన్ మహతో మహీయాన్" .... ఎంత అదృష్టం. కానీ "బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిమ్! ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యమ్" ఐన ఆ స్వరూపాన్ని మనోవాక్కాయములచేత పట్టుకోగలమా? వారి అసలు తత్త్వం తెలుస్తుందా అసలు రూపు తెలుస్తుందా? ఆ తత్త్వం ఎంగిలిపడగలదా? వాక్కులు నుతించగలవా? ...

నజానామి భవద్రూపం - నజానామి భవత్ స్థితిమ్
నజానామి భవత్పూజాం - క్షమస్వ శ్రీశ ప్రభో....

పూజ్య గురువులకు వ్యాస పౌర్ణమి పర్వదిన సందర్భంగా సాంజలిబంధకంగా ప్రణమిల్లుతూ...


Wednesday, July 29, 2015

సాంజలిబంధకంగా ప్రణమిల్లితూ

శ్రీ గురుభ్యోనమః
జయం

కలియుగంలో మనుష్యులు అల్పబుద్ధులనీ, అలసులు, మందబుద్ధులు సుకర్మలు చేయని వారుగా ఉంటారని వ్యాసులవారి భాగవతాన్ని తెనిగించిన పోతన తేటతెలుగులో సున్నితంగా చెప్పిన పలుకులు. " సత్యం వద ధర్మం చర " అని ఆర్షవాక్కు. సత్యం చెప్తూ ధర్మం ఆచరిస్తూ సత్య ధర్మాలను ప్రచారం చేయడం ఈ కాలంలో తేలికపని కాదు. పదిమందికి చెప్పడానికే సుద్దులు స్వతః ప్రమాణాలే శాస్త్రం అని ధర్మాన్ని వక్రీకరించి ప్రచారం జరుగుతున్న రోజులివి.

మహానుభావులు పుట్టాలి భరత జాతికి సనాతన ధర్మీయులకి పూర్వవైభవం రావాలి అని అందరూ కోరుకుంటూనే ఆ పుట్టే మహానుభావుడేదో పక్కింట్లో పుట్టాలి మనింట్లోకాదు అనుక్కునే కుటుంబాలెన్నో...

ధర్మం విషయంలో ఎవరో వస్తారని ఏదోచేస్తారని కూర్చోక కర్తవ్యోన్ముఖులైన మహాపురుషులే చరిత్రలు తిరగవ్రాయగలరు. చిరకీర్తిని పొందగలరు. వారి లక్ష్యం కీర్తి కాకపోయినా పరాదేవత అటువంటివారిని చూసి ముచ్చటపడి యశస్సునీ ఇస్తుంది ఆమె యశస్విని కదా... ఆ యశస్సుని ఏ అల్పబుద్ధులూ తాకలేరు. అందుకు ప్రయత్నించిన వారిని అధార్మికులుగా లెక్కకట్టి అలా ప్రయత్నించిన వారి యశస్సునే ఆతల్లి తగ్గిస్తుంది. అవసరమనుక్కుంటే సాంతం తీసేసి అపకీర్తినీ కట్టబెడుతుంది.

దైవం మానుషరూపేణ... ఈ కలియుగంలో దేవుడు మానవాతీత రూపంతో అవతరించడు సాటి మనిషిగా కంటిముందే తిరుగుతాడు. ఆయన లఘువుకాదు ఒక గురువు అని గుర్తెరగడం కేవలం పురాకృతం.
శ్రీ శ్రీ శ్రీ మూక శంకరులు "ఖణ్డం చాన్ద్రమసం వతంసమనిశం కాఞ్చీపురే ఖేలనం..."అంటూ శ్లోకం చేస్తున్నపుడు అమ్మవారి పాదాలు చూసి తన గురువులను తలుస్తారు.. కామాక్షియే గురువు.. ఆమె గురుమండలరూపిణి కదా...!!! అన్ని విషయాలూ బోధించి చివరకు అందరి కథలనూ కంచికి చేర్చగలిగిన బరువైన ప్రజ్ఙావిశేషమున్నవారెవరో వారినే సద్గురువులు అంటారు. అటువంటివారు జీవితంలో లభించడం దృష్టం కాదు పురాకృతవిశేషమైన అదృష్టమే..

రామచంద్రమూర్తి తన స్థితినుండి తానెప్పుడూ మారడు. ఇతరుల వల్ల అభిమానం పొందినా ఆదరం కలిగినా అసూయ కలిగినా అపకీర్తి కలిగినా తనయందు ఏమార్పూ ఉండక తనలోతానుగా నవలాగా ఉంటాడు. బహుశః నవమినాడు జన్మించిన "సత్పురుషుల" గొప్పలక్షణమేమో అది.

తెలుగునాట సనాతన ధర్మవర్తకులను విదేశీ శక్తులు టోకున ప్రలోభపెడుతూ ఏమున్నది మీ ధర్మంలో అంతా అయోమయం అని నింద చేస్తున్నప్పుడు 'కోకనదపు పద్మములలోనుండి ప్రత్యక్షమైన చతుర్ముఖ బ్రహ్మా' అన్నట్టుగా తన సత్యవాక్కులచే తెలుగునాట నాలుగు వేపులా తిరిగి అప్రహతిగతంగా సనాతన ధర్మ ప్రచారం ఏకకంఠంతో జరిగింది. సనాతన ధర్మీయులను ఇచ్చవచ్చినట్టు కించపరుస్తూంటే సనాతన ధర్మ వ్యతిరేకులైన అన్యమతస్థులు, భౌతికవాదులు విసిరే రాళ్ళవాననుండి ధార్మాచరణాసక్తులు ఇతర ధర్మ ప్రచారకులకూ తోడా అన్నట్టు 'గోవర్థనగిరినెత్తిన కృష్ణునివలె' అండా దొరికింది. తెలుగునాట ధర్మ కర్మదూరులైన వారికీ ధర్మాసక్తులకీ ముముక్షువులకీ ఒకరేమిటి అన్ని రకాల సాధకులకు కూడా ధర్మ కర్మాచరణముయొక్క ఆవశ్యకత తద్వారా జ్ఙాన సముపార్జన అనే తన వాక్ఝరిఅనే గంగా ప్రవాహంలో తడిపిన 'గంగాధరుడా' అని లోకం తెలయెత్తి చూసింది... గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరఁబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః... ఈ శ్లోకం కరచరణాదులతో సాకారరూపం దాలిస్తే ముమ్మూర్తులా ఆరూపమే మన పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారు....

పుంసాం మోహనరూపాయ.. అన్నట్లు పండిత పామర తారతమ్యంలేకుండా అందరూ మా గురువు, మా సఖుడు, ఆయన మాకు తెలుసుఅంటున్నారంటే.. ఆఁహ్.. ఆయన్ని చూస్తేనే చాల్రా భలే ఉంటుందిఅని లక్షల మంది అనుక్కుంటున్నారంటే ఆయనంటే ఎందరికి ఆప్యాయతో గౌరవమన్ననలో ఇట్టే తెలిసిపోతుంది. ఆయన మన అందరి ఇళ్ళలో ఒక సభ్యుడు, ఒక తండ్రి, ఒక తాత, ఒక అన్న, ఒక కొడుకు.. నిజంగా చెప్పాలంటే తెలుగునాట సింహభాగం ఇళ్ళలో ఆయనే ఇంటి పెద్ద. ఆయన క్షేమంగా ఉండాలని కోరుకోని ఆస్తిక కుటుంబం అరుదేమో.. ఆయన గురించి ఎందరో ఎన్నో గుళ్ళలో క్షేత్రాలలో పూజాధికాలు నిర్వహిస్తున్నారు, గ్రహ శాంత్యర్థం, ఆయుష్యర్థం హోమాదులు నిర్వహిస్తున్నారు, మొక్కులు తీర్చుకుంటున్నారు... ఇన్ని ఇళ్ళకీ ఇంటిపెద్ద ఆయన... ఇంటిపెద్ద పుట్టినరోజు అందరికీ పండగేగా మరి...

పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి జన్మదిన సందర్భంగా వారికి సాంజలిబంధకంగా ప్రణమిల్లితూ...

జయం

మన్మథ నిజ ఆషాడ శుద్ధ నవమి 
భాగ్యనగరం

Wednesday, July 22, 2015

నదీ, సముద్ర, తటాక స్నాన ప్రకరణం అందరికీ....

నమస్తే
నదీ సముద్ర తటాక స్నానాల గురించి స్నాన ప్రకరణం నుండి తీసుకున్న విషయాలపై చిన్న వీడియో లింక్ క్రింద ఇవ్వబడింది.. అందరూ తప్పక చూడండి.

Thanks