జనమాత్రుండననీ, మహాత్ము డననీ, సంసార మోహంబు పై
కొననీ, జ్ఞానము గల్గనీ, గ్రహగతుల్ కుందింపనీ, మేలు వ
చ్చిన రానీ, యవి నాకు భూషణములే, శ్రీకాళహస్తీశ్వరా!
శ్రీ కాళ హస్తీశ్వరా! నిన్ను సేవించుటచేత నాకు ఆపదలు కలుగనీ, నిత్యము ఉత్సవములే సిధ్ధించనీ, ఇతరులు నన్ను సాధారణ మానవునిగ అననీ, మహాత్ముడని మెచ్చుకొననీ, సంసారబంధవిషయమున సుఖభ్రాంతిచే, మోహమే కలుగనీ, వివేకముచే శివతత్వ జ్ఞానమే కలుగనీ, గ్రహచారవశమున బాధలే రానిమ్ము, మేలే కలుగనీ. అవి అన్నియు నాకు అలంకారములే అని భావించుచు వదలక నిన్ను సేవింతును. నీసేవలో మొదలుపెట్టిన ఈ యజ్ఙమునందు నీ పాదములందు భక్తిని ఎట్టి పరిస్థితులలో ఎటువంటి భావ వ్యగ్రత వలనా విడువకుండా నీపాదసేవకు నన్ను నియోగించుకొని కృతార్థుని చేయి. ఏమీ చేతకానివానినైన నేను నీ కారుణ్యామృత వర్షమునకు దయకు సంపూర్ణపాత్రుడను కదా...
పవి పుష్పంబగు అగ్ని మంచగు అకూపారంబు భూమిస్థలం
బవు శత్రుండతి మిత్రుడౌ విషము దివ్యాహారమౌ నెన్నగా
అవనీ మండలి లోపలన్ శివశివేత్యాభాషణోల్లాసికిన్
శివ సద్భుద్ధిని మాకునిచ్చుటెపుడో శ్రీకాళహస్తీశ్వరా!
శ్రీ కాళహస్తీశ్వరా! నిరంతరము నీ నామము స్మరించుచు దాని అర్ధము భావన చేయుచు ఉచ్చరించినో దాని మహిమచే ఉపాసకులకు లోకములో ఏదియు హానికరము, బాధాకరము కాదు. పైగా సాధారణముగ హాని బాధాకరములు సుఖమును కల్గించునవియే అగును. నీ ఉపాసకులకు పిడుగు కూడ పుష్పమగును, అగ్నిజ్వాలలు మంచుగా అగును, మహాసముద్రము జలరహిత నేలయై నడువ అనుకూలమగును, ఎంతటి శత్రువు మిత్రుడగును, విషము కూడ దివ్య ఆహారమైన అమృతమగును. ఇవి అన్నియు నీ నామము సర్వవశీకరణ సాధనమగును.
నీ రూపంబు దలంపగా తుదమొద ల్నేగాన నీవైననున్
రారా! రమ్మనియంచు చెప్పవు, వృథారంభంబు లింకేటికిన్
నీరన్ముంపుము, పాలముంపు మిక నిన్నే నమ్మినాడన్ జుమీ
శ్రీరామార్చిత పాదపద్మ యుగళా ! శ్రీకాళహస్తీశ్వరా !!
శ్రీ కాళహస్తీశ్వరా! శ్రీరాముని చేత లేదా లక్ష్మీపతియైన విష్ణువు చేత పూజింపబడు పాదపద్మద్వయము కలవాడా నీ సగుణరూపమును ధ్యానించవలయునని నాకు కోరిక యున్నది. కాని అట్టి నీ రూపపు తుద ఏదియో మొదలు ఏదియో నేను యెరుగను.
పూర్వము బ్రహ్మ అంతటివాడే ఎంత పైకి పోయియు విష్ణువు ఎంత లోతునకు పోయినను నీతుది కానలేదు. మరి నేను ఎంతటివాడను! నీవయినను వాత్సల్యముతో నన్ను రారమ్మని దగ్గరకు పిలిచి ఇదిగో ఇట్టిది నారూపము అని చూపకుంటివి. నేను ఎంత ప్రయత్నించినా ప్రయోజనము లేకున్నది. కనుక శరణాగతి చేయుచున్నాను. నీవు నన్ను నీట ముంచినను పాలముంచినను రక్షించినను, రక్షిమ్చక త్రోసివేసినను సరియే. నిన్ను నమ్ముకొని యున్నాను. ఇక నీ ఇష్టము.
“చదువుల్నేర్చిన పండితాధములు స్వేచ్ఛాభాషణక్రీడలన్
వదరన్, సంశయ భీకరాటవుల త్రోవల్దప్పి వర్తింపగా
మదనక్రోధ కిరాతులందు గని భీమప్రౌఢిచే దాకినం
చెదురుంజిత్తము, చిత్తగింపగదవే శ్రీకాళహస్తీశ్వరా !! “
~~~~~~~~~~~~~~~~~~~~~~
ధర్మస్య జయోస్తు - అధర్మస్యనాశోస్తు
जय जय शंकर हर हर शंकर
https://groups.google.com/group/satsangamu
No comments:
Post a Comment