Pages

Saturday, April 8, 2017

ధర్మం విషయంలో మూడు రకాల ప్రవర్తనలు

శ్రీ గురుభ్యోనమః
 
ధర్మం గురించి మూడు రకాల వ్యక్తుల గురించి వారి పరిస్థితి గురించి రామాయణం నుండి.
 
దశకంఠుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ముగ్గురూ సాంగోపాంగంగా వేదం చదువుకున్నారు, తపస్సంపన్నులు, సాక్షాత్ బ్రహ్మ వంశస్థులు. ధర్మం విషయంలో ముగ్గురూ మూడు రకాల ప్రవర్తనలు కలిగి ఉంటారు. దాని వలన ఎవరేం ఫలితం  పొందారో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు కదా...!
 
ధర్మం తెలుసు, కానీ ధర్మం చెప్పడు, ఆచరించడు :-
1] దశకంఠుడు (రావణుడు) - వేదం చదువుకున్నాడు, ధర్మం తెలుసు, కానీ ధర్మం చెప్పడు, ధర్మం ఆచరించడు, భూతదయలేనివాడు. ఎవరైనా తనకు ధర్మబోధ చేసినా వినడు, సహించడు తనకు నచ్చినట్లుగా ఉండడమే ధర్మం అని బుకాయిస్తాడు. రాముడి చేతిలో చచ్చాడు.
 
ధర్మం తెలుసు, ధర్మం బోధిస్తాడు, కానీ ఆచరించడు :-
2] కుంభకర్ణుడు - వేదం చదువుకున్నాడు, ధర్మం తెలుసు, కానీ ధర్మం చెప్తాడు, ధర్మం ఆచరించడు, భూతదయలేనివాడు, అధర్మం ఐనా సరే అన్నకోసం చేసేస్తాడు. రావణుడికే సీతమ్మను అపహరించి అధర్మం చేసి లేనిపోని కష్టం కొని తెచ్చుకున్నావని కోపంతో ధర్మబోధ చేసాడు, కానీ అన్నకోసం అధర్మం వైపే ఉన్నాడు. రాముడి చేతిలో చచ్చాడు.
 
ధర్మం తెలుసు, ధర్మం బోధిస్తాడు, ధర్మమే ఆచరిస్తాడు:-
3] విభీషణుడు - వేదం చదువుకున్నాడు, ధర్మం తెలుసు, ధర్మం చెప్తాడు, ధర్మం ఆచరిస్తాడు, భూతదయఉన్నవాడు, అధర్మం ఐతే అన్నైనా సరే విభేధిస్తాడు. రావణుడికే సీతమ్మను అపహరించి అధర్మం చేసి లేనిపోని కష్టం కొని తెచ్చుకున్నావని ధర్మబోధ చేసాడు. మహాశక్తివంతుడు మహైశ్వర్యవంతుడైన రావణుణ్ణి ఎదిరించి, వానరాలతో వచ్చిన సాధారణ మానవుడు శ్రీరాముని శరణు జొచ్చాడు. ఐశ్వర్యమూ, బలమూ ఎక్కడ ఉన్నదో అని కాదు ధర్మం ఎక్కడుందో అక్కడ ఉంటాడు. రామునికి ప్రాణ మిత్రుడైయ్యాడు.
 
-శంకరకింకర


Friday, April 7, 2017

తమ్ముణ్ణి వదిలినందుకు రావణుడు చనిపోలేదు. "ధర్మాన్ని" వదిలినందుకు చనిపోయాడు...

శ్రీ గురుభ్యోనమః


...నిజానికి తమ్ముణ్ణి వదిలినందుకు రావణుడు చనిపోలేదు. "ధర్మాన్ని" వదిలినందుకు చనిపోయాడు...

ఫేస్ బుక్లోనూ, వాట్సప్లోనూ ఒక రావణుడికి సంబంధించి ఒక కథ చక్కర్లు కొడుతోంది. యుద్ధరంగంలో పడిఉన్న రావణుడు రాముణ్ణి పిలిచి నేను నీకన్నా అన్నింట్లోనూ గొప్ప కానీ నీ చేతిలో ఎందుకు ఓడి చనిపోయాడని అడుగుతాడట (ఇలా రామాయణంలో లేదు, రాముడు కొట్టిన బ్రహ్మాస్త్రానికి రక్తం కక్కుకుని మాట్లాడకుండా కుక్కిన పేనులా చచ్చాడు మరి.) అప్పుడు రాముడంటాట్ట నా తమ్ముళ్ళు నాదగ్గరే ఉన్నారు నీ తమ్ముడు నీదగ్గరలేడు అని. అందుకే నువ్వు చచ్చిపోయావ్ నాచేతిలో అని. అంటే సీతమ్మని అపహరించినందుకూ, దేవ మనుష్యాదులను అందరినీ హింసించి అధర్మ కార్యాలు చేసి పాపం మూటగట్టుకున్నందుకూ కాదుట. తమ్ముడు పక్కనలేడు కాబట్టి చచ్చిపోయాట్ట.నిజానికి తమ్ముణ్ణి వదిలినందుకు రావణుడు చనిపోలేదు. "ధర్మాన్ని" వదిలినందుకు చనిపోయాడు అన్న సూక్ష్మమైన విషయాన్ని పైన పోస్ట్ చేయబడ్డ కథనం రచించిన రచయిత మరిచాడు. అన్నదమ్ములతో కలిసుండండం శ్రేయోదాయకమే, కానీ అలా కలిసి ఉండీ కూడా ధార్మికమైన జీవితంలో లేకుండా ఉంటే 100 మంది అన్నదమ్ములైనా (కౌరవులు) మడిసిపోయారు. అర్థాత్, దీనిలో ఉన్న కీలకం ఏంటంటే! కేవలం అన్నదమ్ములు కలిసి ఉండడమే కాదు, అ అన్నదమ్ములు ధర్మంతో కలిసి ఉండడం ముఖ్యం. అదీ ఇతిహాసం కానీ, పురాణం కానీ 14 ధర్మ స్థానాలు కానీ చెప్పేవి.

సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్
న బ్రూయాత్ సత్య మప్రియం!
ప్రియం చ నానృతం బ్రూయాత్
ఏష ధర్మ స్సనాతన:!!

అందంగా ఉందని అబద్ధాలు కలిపించి చెప్పకూడదు. సత్యమే సనాతనమైన ధర్మము. ఆ సత్యమే భగవత్స్వరూపము. ఆ భగవంతుని విషయంలోనే అసత్య ప్రచారం చేయకూడదు.

పురాణేతిహాసాలను ప్రక్షిప్తం చేసి వాని పవిత్రతను పాడుచేసే అధికారం మనకు లేదు. మనకు ఎంత స్వచ్చంగా పురాణేతి హాసాలివ్వబడ్డాయో అంతే స్వచ్చంగా రాబోవు తరాలకు మనం అందించాలి. పురాణేతిహాసాలపై, పౌరాణిక పాత్రలపై తప్పుడు రచనలు చేయకూడదు.
స్వస్తి"

-శంకరకింకర

Wednesday, March 1, 2017

గురువులలో ఉత్తముడు పౌరాణికుడు

శ్రీ గురుభ్యోనమః

       
పౌరాణికులకు గురుశబ్ద అన్వయము సరికాదు అనీ సరి అనీ జరిగిన ఒకానొక చర్చలో, అది సరియే అని రూఢి పరుస్తూ ప్రచురించిన వ్యాసమిది (దీనిలో గురువునకూ, ఆచార్యునకూ బేధం ఆచార్యుడెందువల్ల అనుసరనీయుడూ, వంటి విషయాలు చర్చించడంలేదు. మన ప్రస్తుత వ్యాసం గురువు ఎన్ని రకాలు ఎవరిని గురువుగా ఎరిగి సంబోధించవచ్చు అని కాన, దీనిని ఆ విషయానికి పరిమితం చేస్తూ..)

       
అసలీ గురువు ఎవరు అంటే మొట్టమొదట ఉండవలసిన లక్షణం శ్రోత్రియో బ్రహ్మనిష్ఠా... అని శాస్త్రం గురువుకి చెప్పిన ఎన్నో నిర్వచనాల్లో ముఖ్య నిర్వచనం. శ్రోత్రియుడే గురువు అవుతాడు అని దీనింబట్టి తెలియవలె. అవైదిక గురువులను ఆధ్యాత్మిక గురువులుగా యెంచుకుంటున్న, సనాతన ధర్మంలో ఒక కొత్త ఆధ్యాత్మమార్గంగా ఒక కల్ట్ గా ఏర్పరచుకుంటున్న ఈ కాలంలో శ్రోత్రియులైన గురువుల సంఖ్య తక్కువ అనే చెప్పవచ్చు. శ్రుతి ఏది చెబుతున్నదో, స్మృతులు దానిననుసరిస్తాయి శృతి స్మృతులేవి చెపుతాయో పురాణేతిహాసాలు దానినే కథారూపమున విశదీకరిస్తాయన్నది సువిదితమే. వైదికమైన తంత్ర గ్రంథములూ, వైదికమైన ఆగమ గ్రంథములూ శ్రుతి స్మృతులకూ పురాణాలకూ మధ్యన ఉండి అనుష్ఠానమున మరింత సమన్వయం చేయిస్తాయి. ఈ విషయం పక్కన బెట్టి గురువులెవరు ఎన్ని రకాలు అని తరచి చూచిన,

       
పూర్వం వేద విద్యను, తదంగములనూ, దాని తో బాటు ఇతర కళలనూ అభ్యసింపచేయడానికి గురుకులంలో "అధ్యాపకులు" గానూ, వారి సహాయకులుగా ఉండేవారు "ఉపాధ్యాయులు"గానూ ఉండేవారు. వీరు కూడా గురువులే. అటులనే ఏ జీవన విధానమువలన విశేష పాండిత్యమూ జ్ఞానమూలేకున్ననూ, పరమ పామరులైననూ, ఆధ్యాత్మ విద్యా బుద్ధులు నేర్పని తల్లిదండ్రులుకూడా శిశువుకు మొట్టమొదటి గురువులగుచున్నారు.

       
అట్లుగాక, గురువులు ముఖ్యముగా ఈ రకములని చెప్పబడినది
సూచక గురువు, వాచక గురువు, బోధక గురువు, వైదిక గురువు. దేశికగురువు, కామ్యక గురువు, కారణ గురువు, విహితోపదేష్ట వీరు గాక నిషిద్ధ గురువు మరియొకరు. నిషిద్ధ గురువుగానీ, బోధక , సూచక, వాచక, కామ్యక, గురువులుగానీ లేదా పైన చెప్పుకుఉన్న ఉపాధ్యాయ, అధ్యాపకులుగానీ తిన్నగా ఆత్మవిద్యా జ్ఞానాన్ని ఇవ్వరు. దానికి వలసిన పూర్వరంగాన్ని తమ శిష్యుడు లేదా అనుయాయునిలో కల్పిస్తారు. నిషిద్ధ గురువు గురువే ఐననూ ఆత్మోన్నతికి సంబంధించిన విద్యా, దీక్షావిధానమెట్టిదీ కనబడదు. ఐననూ ఆతడూ గురువే అని తెలియనగును.

సరే, మనము వ్యాసపౌర్ణమిని గురుపూజోత్సవము లేదా గురుపూర్ణిమోత్సవము పేర నెరపడం విదితము. ఈ వ్యాస పౌర్ణమినాడు ఎవరిని పూజించుచున్నాము? (ఇప్పుడు కొత్తగా వచ్చిన అవైదిక మత పూజలను పక్కన బెట్టి, సనాతన సంప్రదాయముని విచారించవలె) వ్యాసపౌర్ణమినాడు గురుమండల పూజ నెరపడం సంప్రదాయం. ఈ గురుమండలమున యెవరెవరు ఉన్నారు. అని చూస్తే ఆదిగురువు నుండి మొదలు పెట్టి జగదాచార్యుడైన కృష్ణపంచకము. వ్యాస పంచకము, ఇత్యాదిగా మొదలిడి సూత, శుక, శౌనకాది పౌరాణికులనూ ఆరాధన చేయడం జరుగుతుంది. అన, పౌరాణికులు మనకు తిన్నగా బోధ జేయకున్ననూ గురు స్వరూపములని ఈ సాధన వలన ఎరుగవలె.

       
ఇక రెండు, కలియుగమున గురు పూజ అనిన గురువులలో నుత్తముడు పౌరాణికుడను బ్రహ్మ నుడివిన వాక్య ప్రమాణమును బట్టి, వివిధ దీర్ఘ ఉపాసనా విధుల అంతమున పౌరాణికుని వ్యాసునిగ తలచి గురు పూజ చేయుట యుత్తమ కర్మ. అది వ్యాసుని అనుగ్రహమునకు హేతువని ధనుర్మాసాది వ్రత నియమములయందు తెల్పబడినది. ఈ విధమును సంప్రదాయ పరంపరాగత పీఠాదులు, సంప్రదాయ బ్రహ్మవిద్యా గురు పరంపరలయందుండువారు ఉత్సవములందు కానీ, పైన పేర్కొనిని నైమిత్తిక ఉత్సవాలయందు కానీ పౌరాణికులను గురురూపమున నెంచి పూజ, సత్కారము నెరపుదురు.

       
ఇక మొదలు చెప్పిన శ్రుతి-పురాణ సంబంధమునకు చూచిన, పురాణమును కలుపుకోనిదే వేదవేదాంగ విద్య అసంపూర్ణము అని కూడా ప్రమాణమున్నంజేసి, మన కాలమున, మనకు తారసపడు పౌరాణికులెవరుగానవచ్చురో వారు వ్యాసపీఠమునందున్నప్పుడు స్వయం వ్యాసునిగ నెరుగవలయును, పౌరాణికుడు నిత్యమూ తన హృదయమందు భగవద్లీలావిషేషసంపదను, భగవద్విశేషములనబడు బరువుని మోయుటచే గురువై జనులకు మార్గదర్శకుడగుచున్నాడు. శ్రుతియొక్క మరోరూపమే పురాణమని జగద్విదితము గదా. అందుంజేసి పౌరాణికుడు శ్రోత్రియుడే అగుచున్నాడు. ఇవియన్నిటి విచారణ వలన గురువులలో ఉత్తముడు పౌరాణికుడు అను ఆర్యోక్తియే ఈ నా వ్యాసము ద్వారా మరల సాధించబడెను.

//
గురవస్సంతి లోకే తు జన్మతో గుణతశ్చయే!
తేషామపి చ సర్వేషాం పురాణజ్ఞః పరో గురుః
భవకోటీషు సర్వాసు భూత్వా భూత్వాఽవసీదతామ్!
       లోకములో చాలామంది గురువులు కలరు. వారెల్లరియందు పౌరాణికుఁడుత్తమ గురుడు అతనివలన సకల జనులూ భవకోటి సహస్రములనుండు బాధలు దాటి పునరావృత్తి లేని మోక్షమొందగవచ్చు. (కపింజలసంహిత - బ్రహ్మనారద సంవాదం)//

       
ఈ విషయాన్ని అవగతము చేసికొని తగు రీతిన తెలియవలె. ఈ పై విషయములెవ్వియుని నా స్వకపోలకల్పితములు గావు శాస్త్ర, పురాణ విచారణ సారమని తెలుపుతూ. ఇవ్విషయములు దెలిసిన, గురువులలో స్థాయీ బేధములు దెలిసి ఎవరియొద్ద ఏవిధమున ప్రవర్తించవలెనో దెలిసి మనము వినీతులమై యుండ ప్రపంచమే గురువౌను, అట్లు ఆచరించినవానికి అనంతర కాలమున ఆ మహా ప్రపంచమే లఘువౌను.

స్వస్తి.
-
శంకరకింకర


Tuesday, January 31, 2017

కొండముచ్చుల చలికాపడం

అనగనగా ఒక అడవి, శీతాకాలం వచ్చింది. ఆ అడవిలో కొండముచ్చులు ఎక్కువ. ఓ సారి ఎప్పుడో దారిన పోయే మనుషులు నిప్పురాజేసి చలి కాచుకోవడం చూసాయి. వాటికి నిప్పు అని తెలీదు. కానీ అవీ చలికాచుకోవాలనుక్కున్నాయి. అన్నీ గుంపుగా బయలు దేరి చలి కాచుకోవడానికి వెళ్ళాయి, దూరంనుంచి వెలుగు కనిపించింది.. వెళ్ళి చలికాచుకోవడం మొదలెట్టాయి. కొంతసేపటికి అటుగా ఒక కుందేలు వెళ్తూ చూసింది. వాటి దగ్గరకెళ్ళి ఏం చేస్తున్నారనడిగింది. అవి చలికాచుకుంటున్నాము అని చెప్పాయి.. అది పక్కున నవ్వి ఇవి మిణుగురుపురుగుల వెలుగులు వేడికాచుకునే నెగడు కాదు అని చెప్పింది. వాటికి కోపం వచ్చి మూర్ఖత్వంతో ఆ కుందేటి మెడవిరిచి చంపేసాయి.....

అందుకే పెద్దలు ఎవరైనా కొందరు ఫలితంలేని పనీ, ఏదోచేయాలికదా అని చేసే పనినీ చూసి... కొండముచ్చులు మిణుగురులతో చలికాచుకున్నట్లుంది అంటూంటారు.. అలాగే మూఢులని సమాధాన పరచి బాగుపరచడంకూడా అంత తేలికవిషయమూ, క్షేమకరమైన విషయమూ కాదని దీన్ని ఉదహరించి చెప్తారన్నమాట.

పక్కవారేదైనా చేప్తే విని ఒకక్షణమైనా ఆలోచించి సరియైన దాన్ని నిర్ణయించి స్థిరపరుచుకుని అప్పుడు మన పూర్వ నిర్ణయం తప్పైతే దిద్దుకోవాలి తప్ప మూఢత్వంతో ఎదురు దాడి చేయకూడదు. అలానే మన పూర్వ నిర్ణయం సరియైనదైతే నిర్భీతిగా నొప్పించకుండా చెప్పి మన కార్యాన్ని మనం సాధించుకోవాలన్నమాట.
----------------------
విద్యఐనా, ఉద్యోగమైనా, ఆధ్యాత్మికత ఐనా ఏ రంగమైనా అంతే ఏదో ఒకటి వ్రాస్తున్నాం, ఏదో ఒకటి చేస్తున్నాం అని కాదు.. ఏం చేస్తున్నామో. ఏం చేయాలో ఎలా చేయాలో తెలుసుకుని ఆలోచించి చేయాలి బుర్రకి పదునుపెట్టి వ్యవసాయాత్మక బుద్ధిని పెంపొందించుకోవాలి.
-
శంకరకింకర

Monday, January 30, 2017

అవగాహన జ్ఞానము కాదు

నమస్తే
అవగాహన జ్ఞానము కాదు, అవగాహన శ్రవణ మననాదుల వల్ల కలిగినది. సాధారణంగా చాలామంది చేసేది చేస్తున్నది ఆగిపోతున్నది శ్రవణమననాదుల వద్దనే అంటే అవగాహన వద్దనే అదియే జ్ఞానమని పొరబడి ఆగిపోతారు. విషయమై ఎన్నో గ్రంథాలు రచించినవారు రచిస్తున్నవారు, వేదాంత పాఠాలు బోధిస్తున్నలేదా బోధించినవారుకూడా శ్రవణమననాదుల వల్ల కలిగిన అవగాహనే జ్ఞానమని పొరబడ్డవారున్నారు (అటువంటి కొందరు పండితులే స్వయంగా తెలుసుకుని చెప్పారు) వానిని దాటి నిధి ధ్యాసము చేసి అందులో కుదురుకుని అనుభవములోకి వచ్చినదే జ్ఞానము. ధ్యానము ఉపాసకులు చేసేదో లేక మరే మెడిటేషనో కాదు సర్వత్ర సర్వకాలాలయందు సమస్తమునందు దేహంలో మాత్రమే ఉన్నదనుకున్న నేనును సర్వత్రావ్యాప్తమైన ఏకాత్మనుగా చూడడమే ధ్యానము. దాని వల్ల అనుభవమునకు వచ్చేదే జ్ఞానము. అది నిరంతర అనుభవైకవేద్యము.

(పైది ముఖ పుస్తకంలో ఒక మిత్రుని పోస్ట్ కు సవరణగా పంపిన విషయం, )

అవగాహన జ్ఞానము కాదు, అవగాహన శ్రవణ మననాదుల వల్ల కలిగినది.... అంటే శ్రుతి స్మృతులతో సహా పురాణేతిహాసాదులు శాస్త్ర భాష్యాలు పఠించడం వల్లనూ, వినడం వల్లనూ తద్విషయము మీద కలిగేది అవగాహన అది జ్ఞానము కాదు. గురువాక్యమననముతో పాటు కలిగిన అవగాహనను ఆచరణలో ఉంచినిధి ధ్యాసము చేయడం ద్వారా స్థిరీకృతమై అనుభవైకవేద్యమయ్యేదే జ్ఞానము.
- శంకరకింకర
(01/Jan/2015......)


Monday, November 21, 2016

ఆశ్రమ ధర్మసంకరం


          వర్ణ ధర్మము, ఆశ్రమ ధర్మము అనేవి సనాతన ధర్మానికి పునాదులు. ఏ ధర్మాచరణం చెప్పినా ఏ వర్ణాశ్రమానికి సంబంధించి ఏది ధర్మం అని చెప్పబడుతుంది. వర్ణ ధర్మాచరణను చాలా మటుక్కు వక్రీకరించి చెప్పి వర్ణధర్మాలను పాటించనివ్వకుండా చేసారు స్వాతంత్ర్యం పూర్వ పాలకులు స్వాతంత్ర్యానంతరం వారి అనుయాయులైన పాలకులు.
ఇక ఆశ్రమ ధర్మాలకొస్తే మొదటి రెండు ఆశ్రమాల్లో ముఖ్యంగా బ్రహ్మచారి గృహస్థులా జీవించడం అతి సాధారణమైన జీవన విధానంలా ఐపోయింది.. దాన్ని ప్రజలపై రుద్దడంలో మీడియా, సినిమా, సిక్కులర్ కమ్మీ ప్రొఫెసర్లున్న యూనివర్సిటీలు పెద్ద పాత్ర పోషించాయి. పోషిస్తున్నాయు...

          ఇక ఎవరిని ఎవరికి నిరూపించాలో తెలియని అపరమేధావులుగా కీర్తించబడ్ద ఆధునిక ధర్మ ప్రచారకులని తెలియబడ్డ ఆధునిక సన్యాసులూ ఆశ్రమ సంకరం చేసేశారు. చేస్తూనే ఉన్నారు.. మాది విశాల దృక్పథం అని చెప్పడానికి ధర్మం కట్టుబాట్లు వదలక్కరలేదు.. ధర్మ ప్రచారానికి ధర్మం వదలడం ఏరకంగా ధర్మమో అర్థంకాని పెద్ద ప్రశ్న. వీరివల్ల తాత్కాలికంగా సిక్యులర్స్ నుంచి వారికి ఆక్సెప్టెన్స్ వచ్చిందేమో కానీ... శాస్త్రరీత్యా ధర్మగ్లాని చేసారు, ఏం డౌట్ లేదు.
          మన ధర్మంలో కాషాయాంబరధారులకు అత్యున్నత గౌరవం ఇవ్వబడింది. కానీ ఇప్పుడు ఇక్కడా కొందరు సంకరం చేసేశారు మరి కొందరు అది కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. సంప్రదాయపీఠ పరంపరలను కాక స్వంత పీఠాలు పెట్టుకుని సనాతన సంప్రదాయము ఆచారమునకి వ్యతిరేకంగా నూతన ఒరవడి సృష్టించాలనే ప్రయత్నం కొనసాగుతూనే ఉన్నది. సనాతన ధర్మం నుండి విడివడి లేదా దానికి అనుబంధంగా కొన్ని విభాగాలుగా ఏర్పడిన సమాజాలున్నాయి, వాటిలో స్పష్టత ఉంది, కానీ ఇందులోనే ఉండి ఇక్కడ సంకరం చేసేవాళ్లతో తస్మాత్ జాగ్రత చెప్పుకుంటున్నాను.
         
          ఈ విపరీతాలు ఎప్పుడో ఎందరో చూసి ఉండచ్చు నాకు కొత్త కావచ్చు... గృహస్థు, పత్నీ సహితులు కాషాయం కడుతున్నారు. వ్యవహారం అంతా కుటుంబీకుడిది వస్త్రం మాత్రం కాషాయం... కషాయం తాగినంత చిరాకు కలిగేలా..

          ఇక రెండు , తీసుకున్నది సన్యాసం చేసేది గృహస్థు పనులు. పోనీ వారేమైనా ఆమ్నాయ, సర్వజ్ఞాది పీఠాధిపతులా పీఠనిర్వహణలో భాగం ఉంటుంది అనుక్కోడానికి అంటే.. మా ఇంట్లోనూ పీట ఉంది దాని మీద కూర్చున్నప్పుడు నేనూ పీటాధిపతినే టైపు.. కట్టేది కాషాయం నెత్తికి క్రాపు, సోఫా సిట్టింగ్, వాటర్ బాటిల్ డ్రింకింగ్, కాషాయ ప్యాంటూ షర్టు... పైగా చేసేది ఫక్తు వ్యాపారం... ఇవి నార్త్ లోనే కాదు తెలుగు నేలలో మరింత ఊపు పొందుతోంది... సంప్రదాయ పీఠాలెప్పుడు కలుగజేసుకుంటాయో ధర్మ దండంతో నాలుగు చీవాట్లెప్పుడుపెడతాయో...

జయ జయ శంకర హర హర శంకర


Monday, October 31, 2016

కార్తీక పురాణము (సంస్కృత మూల సహితం) - 02వ అధ్యాయం

ఓం శ్రీ పరాదేవతాయైనమః
శ్రీ కార్తీక దామోదర త్ర్యంబక దేవతాభ్యోనమః
అథ శ్రీ స్కాందపురాణే కార్తికమహాత్మ్యే ద్వితీయాధ్యాయః
శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణం
ద్వితీయ అధ్యాయం


వసిష్ఠః
శ్రుణురాజన్ ప్రవక్ష్యామి మహాత్మ్యం కార్తికస్యచ
కర్మత్రయకృతాత్పాపాన్ముచ్యతే శ్రవణాదపి!!
యః కార్తికేమాసినృప సోమవార వ్రతంచరేత్
సోమశేఖరతుష్ట్యార్థం సయాతిశివమందిరం!!
కార్తిక్యామిందువారేతు స్నానదానజపాదికం
అశ్వమేధసహస్రాణాం ఫలంప్రాప్నోత్యసంశయః!!

తా! వశిష్ఠ మహర్షి ఇట్లు చెప్పుచున్నారు "  రాజా! కార్తీక మహాత్మ్యమును వినుము. విన్నంతనే మనోవాక్కాయ కర్మలవల్ల కలిగిన పాపమంతయు నశించును. కార్తీక మాసమందు శివప్రీతికొరకు సోమవార వ్రతమాచరించేవారు కైలాస నివాసిఅగుదురు. కార్తీక సోమవారమునాడు స్నానము గాని, దానము గాని, జపముగాని చేసిన 1000 అశ్వమేధయాగ ఫలమును పొందును. ఇందుకు సందేహములేదు.

ఉపవాసం చైకభుక్తం నక్తంచాయాచితవ్రతం
స్నానంచతిలదానంచ షడ్విధంకవయోవిధుః!!

తా!కార్తీక సోమవారమునాడు, ౧) ఉపవాసము, ౨)ఏక భుక్తము, ౩) నక్తము-రాత్రి భోజనము, ౪)అయాచిత భోజనము, ౫) స్నానము, ౬)తిలాదానము సమానములని చెప్పబడుచున్నవి.

ఉపవాససమర్థానాముపవాసోవిధీయతే
అసమర్థాశ్చోపవాసే నక్తభోజనమాచరేత్!!
తదశక్తస్యతుచ్ఛాయా నక్తభోజన మిష్యతె
తదభావెద్విజైస్సార్థం దివాభోజనమేవవా!!
తా! శక్తి గలవారు కేవల ఉపవాసము చేయవలెను. అందుకు శక్తిలేనివారు నక్తము అనగా రాత్రి భోజనము చేయవలెను. అందుకు శక్తి చాలని వారు ఛాయానక్తము చేయవలెను అనగా (సూర్యకాంతి కొంచెము తగ్గిన తరవాత తనకొలతకు రెట్టింపుగా తన నీడ రాగానే చీకటి పడకముందే భుజించవలెను. అందుకు శక్తి లేనువారు బ్రాహ్మణులను పిలుచుకువచ్చి వారికి పగలే భోజనం పెట్టి తానూ పగలే భోజనం చేయవలెను.

యంధర్మంకార్తికేమాసి నాచరేద్యది యేనరాః
కుంభీపాకేతు పచ్యంతె రౌరవేతుయుగాష్టకం!!
తా! మానవులు కార్తీకమాసమందు కార్తీక వ్రతములలోదేనినైనౌ ఆచరించని వారైన, ఎనిమిది యుగాలు నరకంలో కుంభీపాకంలోనూ, రౌరవంలోను బాధలు పొందుతారు.

కార్తికే సోమవారేతు ఉపోష్యగతభర్తృకా
సమభ్యర్చ్యవిధానేన విందేల్లోకంశివస్యతు!!
తా! కార్తీక సోమవారం నాడు పూర్వసుహాసిని యధావిధిగా ఉపవసించి శివుని పూజించిన శివలోకమును పొందును

స్త్రియోవాపురుషోవాపి కార్తికేచేందువాసరే
నక్షత్రమండలందృష్ట్వా యఃకుర్యాన్నక్తభోజనం
తేషాంపాపావినశ్యంతి వహ్నౌప్రక్షిప్తతూలవత్!!
తా! స్త్రీలుగానీ పురుషులు గానీ ఎవరు కార్తీక సోమవారమందు నక్షత్రములనుచూసి రాత్రి భోజనము చేస్తారో వారి పాతకములు అగ్నియందుంచబడిన దూదివలె నశించును.

సోమవారేతు కార్తిక్యాం శివలింగాభిషేచనం
పూజాం చైవతునక్తంచ యఃకుర్యాత్సశివప్రియః!!
అత్రైవోదాహరంతీమ మితిహాసంపురాతనం
శ్రుణ్వతాంసర్వపాపఘ్నం వక్తౄణామఘనాశనం!!
తా! కార్తీక సోమవారమందు శివలింగమునకు అభిషేకము, పూజ చేసి రాత్రి భుజించువాడు శివునకు ప్రియుడగును.  విషయమై ఒక పురాతనమైన ఒక కథ ఉన్నది, చెప్పెదను వినుము. ఇది విను వారికి చెప్పువారికి పాపనాశన కారిఅగును.

కాచిత్కాశ్మీరదేశేతు నామ్నాస్వాతంత్ర్యనిష్ఠురీ
రూపయౌవనసంపన్నా సుకేశీసుష్ఠుమంగళా
యాజకస్యనుతాతన్వీ వుంశ్చవీబహుభాషిణీ!!
మాతాపితృపరిత్యక్త్వా శ్వశురాభ్యాంనరేశ్వరః!!
పతిస్తాంకర్కశాందృష్ట్వా ద్విజస్సౌరాష్ట్రసంభవః
మిత్రశర్మ ఇతిఖ్యాతో వేదవేదాంగ పారగః!!
సదాచారసమాపన్న స్సర్వభూతదయాపరః
తీర్థయాత్రారతస్సమ్య క్సత్యవాదీసదాశుచిః!!
ఏవం సర్వోత్తమో విప్రోతర్జితస్తాడితోభృశం
సగార్హస్థ్యాభిలాషేణ చేతసా సౌనచాత్యజత్!!
తా! కాశ్మీర దేశమునందొక పురోహితున కూతురు స్వాతంత్ర్య నిష్ఠురియను ఒక స్త్రీ కలదు. ఆమె చక్కని రూపముతోనుండి మంచి యవ్వనముతో గూడి యుండెను. తలదువ్వుకొని, అలంకరించుకొని అతిగా మాట్లాడు జారత్వమును అవలంబించుచుండెను. ఈమె దుర్గుణములు చూసి తల్లిదండ్రులు అత్తమామలు ఈమెను విడచిరి. ఈమె భర్త సౌరాష్ట్ర దేశస్థుడు. అతని పేరు మిత్ర శర్మ. అతడు వేద వేదాంగ పారీణుడు. సదాచారవంతుడు. సమస్తభూతములందు దయగలవాడు. తీర్థయాత్రలు చేసి తీర్థములను సేవించినవాడు. సత్యవాక్కును కలిగిఉండేవాడు. ఎప్పుడూ శుచిగా ఉండేవాడు. ఇన్ని ఉత్తమోత్తమ గుణములున్నప్పటికీ ఈతనిని భార్య ఐన స్వాతంత్ర్య నిష్ఠురి నిత్యమూ కొట్టుచునుండేది. అలా నిత్యమూ ఆమెచేత దెబ్బలుతిని గృహస్థ ధర్మమునుండి వెల్వడక భార్యను విడువలేక ఆమెవలన కష్టములను పొందుచున్నాడు.

కదాచికర్కశాకృద్ధా పరేషాంరూపతోషిణీ
దుర్జనైః ప్రీతిసంయుక్తా యౌవనోద్బోధితానృప!!
ద్రవ్యైరాభరణైసమ్యక్ సంతుష్టాదుష్టచారిణీ
పరినాప్రీతియుక్తేవరాత్రౌ శయ్యాంసమాగతాః!!
పతినిద్రాంసమాజ్ఞాయ శనైరుత్థాయ సాతథా
శిలామాదాయమహతీం మస్తకెప్రాక్షిపద్రుషా!!
తేనసోపిమమారాధ కర్కశాసంగలాలసః
స్వయమాదాయతంపృష్ఠే శూస్యకూపెన్యసర్జయత్!!
తా! ఆమె పరమ కర్కశురాలైయుండెను. భర్తయైన మిత్రశర్మ ఈమెతో సంభోగవాంచచేత ఈమెతో అనురాగముతో ఉండెను. అంత ఒకనాడు ఈమె దుర్జనులైన తన ప్రియులిచ్చిన ద్రవ్యము ఆభరణములు తీసుకొని, వారి కోరిక మేరకు ఆమెయందు వారికి నిరంతర సంభోగము మిత్రశర్మ వలన భంగము కలుగుతున్నందున అతనిని చంపమని చెప్పగా సమ్మతించినది.  కర్కశ రాత్రి తన భర్తతో క్రీడించి తరవాత తన భర్త నిద్రించగానే తానులేచి ఒక పెద్దరాతిని తెచ్చి భర్తశిరస్సున కొట్టగా మిత్రశర్మ మరణించెను. తరవాత కర్కశ స్వయముగా తన భర్త శవమును వీపుమీద వేసుకొని తీసుకొనిపోయి పాడుబడిన నూతిలో పడవేసెను.

బహుభిర్యౌవనస్థేష్టైః పర స్త్రీసంగలాలసైః
కామశాస్త్ర కలాపైశ్చ పరిరంభణచుంబనైః!!
నానాచాతి ధరైః పుంభిఃవర్ణ సంకర కారకైః
కరోతిసంగమంనిత్యం సారతింపతిఘాతకీ!!
పతిభక్తిరతస్త్రీణాం కుంఠినీపరయోజనీ
ఏకపత్నీరతానాంచ తేషాంరతివరాశుచిః
పరనిందాపరద్వేషీ సర్వదేవపరాఙ్గ్ముఖీ!!
తా! అలా భర్తను చంపి తరుణులను పరస్త్రీసంగమాభిలాషులను కామశాస్త్ర ప్రావీణులను, వర్ణసంకర కారకులు ఐన అనేక జాతి పురుషులతో ఆలింగన చుంబనాదులతో నిత్యము సంభోగము చేయుచుండెను. అంతియేగాక, భర్తయందనురాగముతోనున్న భార్యలను దుర్భోదలచేత యితరులచే సంభోగము చేయించుచు, ఏక పత్నీ వ్రతుల వ్రతమును భంగ పరచి వారితో సంభోగించుచు నిత్యము పరనింద చేస్తూ ద్వేషపూరితయై దేవతలను ద్వేషించుచుండెను.

దంభేనవాదయాహీనా పరిహాసేనమాయయా
నధ్యాతంవిష్ణుపాదాబ్చం నశ్రుతాహరిసత్కథా!!
యౌవనాతిక్రమంచాసీజ్జరాచాస్యా ఉపాగతా
వ్రణవ్యాధిరభూద్రాజన్ క్రిమిభిః పూర్ణశోణితా!!
సర్వేభుజంగాస్తాంభూప రూపవంతోమదాన్వితాః
దృష్ట్వా శావికలారాజన్ వేశ్మనాయాంతిదుఃఖితాః!!
తా! ఆమె నిరంతరమూ దయాశూన్యమనస్కయై, గర్వముచేకానీ, పరిహాసానికి కానీ హరి నామ స్మరణము , విష్ణు పాదాబ్జముల ధ్యానమూ చేయకుండినది. ఇలా ఉండగానే, ఈమెకు యవ్వనమయు పోయినది, వ్రణములు కలిగి వ్యాధులు ప్రబలినవి. ఆమెకు ఉన్న వ్రణముల నుండి పురుగులు వచ్చి దుర్గంధము వచ్చుచుండెడిది. ఆమె కొరకై వచ్చెడి జారులందరూ రూపవంతులై మదయుక్తులై వచ్చి ఆమెను చూసి నిరాశతో తిరిగిపోయెడివారు.

మమారవ్యాధినాదుష్టా పాపాధిక్యాన్నరేశ్వర
యమదూతాస్తదాజగ్ము శ్చండహాసభయంకరాః!!
యమస్యాంతికమానీయ తాం యమాయార్పయన్ భటాః
యమస్తాంకోపతామ్రాక్షో శిక్షామతిభయంకరీం!!
అయసానిర్మితం స్తంభం తప్తంచాతిభయంకరం
సకంటంస్వజలితం పరిరంభణకారణం!!
తాంవైతదాయమభటా యమేనాజ్ఞప్తచేతసః
ఆలింగయామాసురతః పాపంప్రతివదన్పునః!!
తా! ఆమె పాపాధిక్యముచేత చాలా బాధనుపొంది  వ్రణ బాధతోనే శరీరము విడిచెను. అక్కడకు భయంకరమైన యమభటులు వచ్చి  కర్కశను పాశములతో బంధించి కట్టి యముని వద్దకు తీసుకొని పోయిరి. అంత  సమవర్తి ఆమెను చూసి కృద్ధుడై ఈమెను భయంకరమగు ముళ్ళతో కూడి, ఎర్రగా కాలి మండుచుండగా దానిని ఆలింగనము చేయించుడని కఠినమైన శిక్షను వేసెను. అంత  ఆజ్ఞమేరకు భటులు  కర్కశకు చేసిన పాపములను చెప్పుచూ  కాలుతున్న స్తంభమును సంభోగించమనిరి.

తతస్తన్మూర్థ్ని పాతంచ యమదండైర్భయంకరైః
కుంభీపాకేనపశ్చాత్తాం బాధంతెయమకింకరాః!!
శిలోపరిపునస్తాంచ పాదౌసంగృహ్యతాడయన్
తతస్తేతప్తరక్తంచ తస్యాః పానమచిక్లపన్
త్రవుంతప్తంసమాదాయ ద్విశ్రోత్రేప్రక్షిపంతిచ!!
ఇత్యాదిభిర్మహాఘోరైః రాజన్ తాంయమకింకరాః
చిత్రగుప్తేనబహుశః ప్రేరితాస్తేయమేనచ!!
సామహాఘోరనరకం పితృభిశ్చపితామహైః
స్వబాంధవైరనేకైశ్చ దశపూర్వైర్దశాపరైః
నారకీంయాతనాంభుక్త్వా పునర్భూమిముపాగతా!!
తా! తరవాత యమ కింకరులు యమ దండములచేత కర్కశ తల మీద కొట్టి తరవాత కుంభీపాకమునందు వేసి బాధించిరి. ఆమె పాదములు రెండు పట్టుకుని రాతిమీద పెట్టి కిట్టిరి, రక్తము కాచి త్రాగించిరి సీసము కాచి రెండు చెవులా పోసిరి. యమ కింకరులు యమాజ్ఞమేరలు చిత్రగుప్తాజ్ఞమీదను అనేక నరక బాధలకు కర్కశను గురిచేసిరి. అలా  కర్కశ తన పితృపితామహులతో కూడ తన ముందు పది తరములు తరవాత పది తరములతో కలిసి ఘోరమైన నరకబాధలను పొంది తరవాత తిరిగి భూమి పై జన్మించినది.

శ్వానయోనౌసముత్పన్నా దశజన్మనిపంచచ
తతః పంచదశె రాజన్ కలింగేబ్రాహ్మణాలయే!!
శ్వానదేహమనుప్రాప్య చోదితాగృహేగృహే
కదాచిద్బ్రాహ్మణగృహే కార్తికేచేందువాసరే!!
శివపూజాంచ విధివత్కృత్వా నక్షత్రమండలం
ద్రష్టుంసమాగాద్రాజేంద్ర బలిమాదాయపాణినా!!
నివేదనాంతే చబలిం త్యక్త్వాబ్రాహ్మణపుంగవః
పాదౌప్రక్షాళ్యచాచమ్య ప్రావిశద్గృహమంజసా!!
తా! భూమి మీద పదిహేను జన్మలు కుక్కగా జన్మించినది అందులో పదిహేనవ జన్మ కళింగ దేశమందు బ్రాహ్మణుని ఇంట కుక్కగా పుట్టి ఇంటింటికి తిరుగు చుండెను.

 జనక మహారాజా! ఇట్లుండగా ఒకానొకప్పుడు  బ్రాహ్మణుడు కార్తీక సోమవారం రోజున పగలంత ఉపవాసముచేసి ఇంట్లో శివలింగాభిషేక పూజాదులను చేసి నక్షత్రమండలమును చూసి ఇంట్లోనికి పోయొ దేవ నివేదన చేసి  తరవాత భూత బలిదానము కొరకు బచ్చి భూమిమీద బలిని ఉంచి కాళ్ళు కడుక్కొని ఆచమనము చేసి తిరిగి లోనికి వెళ్ళెను.

దివాసలబ్ధ్వావేశంవా సాశునీబలిభోజనం
కార్తిక్యామిందువారేతు అకరోద్బలిభక్షణమ్!!
తేన జాతిస్మృతిరభూత్సాహీ త్యాహముహుర్ముహుః
సవిప్రోనిస్మితోభూత్వా గృహంగత్వాబ్రవీద్వచః!!
కింకింకరోషిచాస్మాకం గృహేతత్మారణంవదః
భో బ్రహ్మన్ శ్రుణుమేవాక్యం నారీచాహం పురాద్విజ!!
కులటా పాపనిరతా జాతి సంకర కారిణీ
పరేషాంసంగతిరతా పుంశ్చలీపతిఘాతకీ!!
తా!  కుక్క ఆనాడు పగలంతయు ఏమీ దొరకనందున కృశించినదై కార్తీక సోమవారము నక్షత్ర మండల దర్శన కాలమైన తరవాత ప్రదోషంబున  బలిని భక్షించెను.  బలిని భక్షించుటచే  కుక్కకు పూర్వజన్మ స్మృతి కలిగి బ్రాహ్మణోత్తమా రక్షింపు రక్షింపుమని అరచెను.  మాటవిని బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఆశ్చర్యపోయి, ’ కుక్కా మా యింట్లో ఏమి తప్పు చేసినావు రక్షింపుమని అడిగావు అని అడిగెను. అంత  కుక్క   బ్రాహ్మణోత్తమా నేను పూర్వ జన్మమునందు బ్రాహ్మణ స్త్రీని పాపములు చేసినదానను, కులటను, వర్ణసంకరమునకు కారణమైతిని, అన్య పురుషులను మరిగి నా నిజ భర్తను చంపినాను.

ఏవమాదీని పాపాని కృత్వాచయమ మందిరె
తత్రభుక్త్వాయాతనాంచ పునర్భూమింగతాస్మ్యహం!!
జన్మేదమంతిమంవిప్ర జాతిస్మరణ కారణం
తద్వదస్యద్విజ శ్రేష్ఠః శ్రుత్వాచాహంపునామివై!!

తా! ఇన్ని పాపములు చేసిన చచ్చి యమలోకమునకు బోయి అక్కడ అనేక బాధలు పొంది తిరిగి భూమి వచ్చి 15 మాట్లు కుక్కగా పుట్టి నాను. నాకు ఇప్పుడు నా ఆజాతి స్మరణ మెట్లు కలిగెనో చెప్పుము విని సంతోషించెదను

ఏవం శ్రుత్వా  విప్రేంద్రో జ్ఞానచక్షుర దర్శయత్
కార్తిక్యామిందువారేతు బల్యన్నంనక్తభోజనాత్!!
జాతిస్మరణ హేతుర్వై సాధుజ్ఞాత్వేతి సోవదత్
సాశునీతు పునః ప్రాహ బ్రాహ్మణం వేదపారగం
మాంపాహి కృపయో బ్రహ్మన్ శ్వానయోనిధరాంద్విజ!!
తా! బ్రాహ్మణోత్తముడీ మాటవిని జ్ఞాన దృష్టితో చూసి, తెలుసుకుని ఇట్లనె.  కుక్కా!  కార్తీక సోమవారమునాడు ప్రదోషసమయము వరకు భుజించక యిప్పుడు నేను ఉంచిన బలిని భక్షించితివి కనుక నీకు నీ స్వంత స్మృతి కలిగినది.  మాటలు విని  కుక్క వేద వేదాంగ పారీణుడైన  బ్రాహ్మణోత్తమా  కుక్క జాతినుంచి నాకెట్లు మోక్షమో చెప్పుమా అని అడిగెను

ఏవం సంప్రార్థితో విప్రో దదౌధర్మ మనుత్తమం
కార్తిక్యామిందివారేషు ఏకవారేణయత్ఫలం!!
తత్ఫలం ప్రదదౌసద్య ఉపకారాయభూపతే
దేదీప్యమాన దేహాఢ్యా దివ్యస్రగ్వస్త్రభూషణా!!
పితృభిస్సహరాజేంద్ర కైలాసం ప్రతిసాయయౌ
శివేన మోదతేతత్ర శివాయద్వన్మహీపతే!!
తా!కుక్క ఇలా ప్రార్థించగా  బ్రాహ్మణుడు పరోపకార బుద్ధితో కార్తీక సోమవారములందు తాను చేసిన పుణ్యములో ఒక సోమవార పుణ్యము  కుక్కకు ధారపోసెను. బ్రాహ్మణుడు సోమవార పుణ్యము ఇవ్వగానే కుక్కదేహమును విడిచి ప్రకాశించుచున్న శరీరము గలదై ప్రకాశించెడి వస్త్రములు కలదై మాలలను, ఆభరణములను ధరించి తన పితరులతో కూడి కైలాసమునకు వెళ్ళి అక్కడ పార్వతీ దేవివలె శివునితో గూడి ఆనందించుచుండెను.

తస్మాత్కార్తీకమాసేతు సోమవార వ్రతం చరేత్
యః కరోతి వ్రతం భక్త్యా కైవల్యం కరసంస్థితం
తస్మాత్త్వమపిరాజేంద్ర కార్తిక్యాంధర్మ మాచర!!
తా! కాబట్టి కార్తీకమాసమందు సోమవార వ్రతమాచరించవలెను. ఎవరు  కార్తీక సోమవార వ్రతమును చేయునో వారికి మోక్షము కరతలామలకము. జనక మహారాచా పుణ్య ప్రదమైన కార్తీక వ్రతంబును నీవునూ చేయుము.

ఇతి స్కాందపురాణే కార్తిక మహాత్మ్యె ద్వితీయోధ్యాయస్సమాప్తః
ఇది సాంతపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యమనెడు కార్తీక పురాణమందలి రెండవ అధ్యాయము సమాప్తము.

సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు

మీ
శ్రీ అయ్యగారి సూర్యనాగేంద్ర కుమార్ శర్మ
~~~~~~~~~~~~~~~~~~~~~~
ధర్మస్య జయోస్తు - అధర్మస్యనాశోస్తు
जय जय शंकर हर हर शंकर