Pages

Tuesday, September 22, 2015

దేవీ మహాత్మ్యము 3

శ్రీ గురుభ్యోనమః

ప్రథమ చరిత్ర మొదట్లోనే ఒక సూచన దొరికింది మనకు. రెండు రకాల వ్యక్తులు అమ్మవారిని గురించి తెలుసుకోవడం తపించడం ఉపాసించడం మొదలు పెట్టబోతున్నారని. ఒకరు లౌకిక ప్రయోజనాలు కోరేవారైతే మరొకరు ముముక్షువు. మనకి చివరి అధ్యాయాలలో అమ్మవారు సురథ సమాధులకి వరాలిచ్చే ఘట్టాలొస్తాయి అప్పుడు సురథుడడిగిన రాజ్యం, భార్య, పిల్లలు సమస్త భోగాలు ఇచ్చి భవిష్యత్ మనువుగా కూడా అవుతావని వరమిచ్చింది. సమాధి మోక్షం కోరాడు మోక్షమూ ఇచ్చింది. దీనర్థం అమ్మ కోరికనైనా తీర్చగలదు మోక్షాన్నిచ్చే అమ్మ కోరికలను తీర్చలేదుగనక? ధర్మబద్ధమైతే చాలు. అందుకే ఇది మహావిద్య ఈమె కామకోటి.

ఇక ముందుకు సాగుతే, వీరిద్దరూ వెళ్ళి సుమేధుని ఆశ్రయించారు ఇతఃపూర్వం చెప్పినట్లే మాకర్థమౌతోంది మేము మా భార్యాపిల్లలకు దూరంగా ఉన్నామని కానీ వారిమీద మాకు మనసు పోవట్లేదు వారు మాదగ్గరలేరనీ, తిరిగిరారనీ తెలుసు అని చెప్తూ ఏదో మాకు జ్ఞానం ఉంది కానీ ఎందుకు ఇలా బాధపడుతున్నాం అని అడిగారు.

సుమేధ ఆశ్రమంలోనే ఉన్నా సురథుడు, సమాధి వచ్చేవరకూ సుమేధను ఏమీ అడగలేదు. మనస్సు ఇంద్రియాలు బుద్ధి ప్రచోదనం లేకపోతే అవీ విచక్షణ వివేచన చేయవు కదా... అప్పటి వరకూ సుమేధ మహర్షి కూడా ఏం చెప్పలేదు. గురువుని సేవించే మార్గం చెప్పేసారు ఇక్కడ... పరిప్రశ్నేన సేవయా... మంచి ప్రశ్నలను అడగడం ద్వారా గురువుని సేవించగలం. అప్పుడు గురువు తన బోధ ద్వారా వర్షిస్తాడు అజ్ఞానాన్ని పటాపంచలు చేస్తారు. సరే వారికి మీకున్నది జ్ఞానం కాదు అని అసలువిషయాలు చెప్తూ అమ్మవారికి (ఆత్మ చైతన్యానికి) సంబంధించిన విషయాలు కొన్ని చెప్పారు. ఆతృత పెరిగింది శిష్యులలో, మరింత పరి పరి విధముల అడిగారు ఎవరామె ఎక్కడుంది ఎలా పుట్టింది ఇలా..... వైనంలో కథ చెప్పారు మేధాముని.

అందరికీ తెలిసిన కథయే సృష్ట్యాదిలో సమస్తం నీరుగా ఉన్నప్పుడు బ్రహ్మగారు తపస్సులో ఉండడం విష్ణువు యోగ నిద్రలో ఉండగా ఆయన చెవి మలం లోంచి మధు కైటభులనే రాక్షసులు పుట్టడం. వారు అంతా తిరిగి వారిద్దరే ఉన్నారనుక్కుని అంతా తిరిగితే చతుర్ముఖ బ్రహ్మగారు కనబడడం ఆయన్ని బెదిరించడం ఆయన నాతో యిద్దమెందుకని విష్ణువుని లేప ప్రయత్నించడం యోగ మాయ వలన లేవకపోతే అమ్మవార్ని ప్రార్థించడం యోగమాయ నుండి విష్ణువు బహిర్ముఖుడవడం. మధు కైటభులు ఇద్దరూ కలిసి విష్ణువుతో యుద్ధానికెళ్ళడం. ముగ్గురూ తలపడడం కొన్ని వత్సరాలు యుద్ధం తరవాత అమ్మవారి ప్రచోదనంతో విష్ణువు వారిని ఏం వరం కావాలో కోరుకోమని అడగడం, వారు మదోన్మత్తులు మాయావశులై నీకే ఏం కావాలో అడుగు అని విష్ణువుని తిరిగి వరం కోరుకోమనడం జరిగింది. అపుడు విష్ణువు మీరు నాచేతిలో చనిపోండని వరం కోరారు. వాళ్ళు రాక్షసులు ఊరుకుంటారా నీళ్ళు లేని ప్రదేశంలో చంపమన్నారు అపుడు విష్ణువు తన ఆకారాన్ని పెంచి రెండు తొడలమీద వాళ్ళ తలలుంచి చక్రంతో వారి కుత్తుకలు కత్తిరించి సంహరించారు.. { తరవాత భూమి ఏర్పడడం అన్నీ ప్రస్తుతం అప్రస్తుతం :) }.

భక్తి తో అమ్మ లీలను విష్ణుమూర్తి చేసిన రాక్షస సంహారాన్నీ తెలుసుకుని నమస్కారం పెట్టుకున్నా. కథ తెలుసుకుని మనం పొందవలసినది ఏమిటి తెలుసుకోవలసినది ఏమిటి అన్న, మనని మనం ఎక్కడ సరిదిద్దుకోవాలి వంటి విషయాలు తరచి చూడాలి.
శబ్దం ఆకాశగుణకం, శబ్దాన్ని గ్రహించేది కర్ణం (చెవి). దహరాకాశమలాన్ని సూచించడానికి విష్ణువు యొక్క చెవి గులిమినుండి ఉద్భవించిన రాక్షసులుగా వీరిని చూపారు. మొదటినుండి చూద్దాం.. సర్వత్రా వ్యాప్తి చెందిన విష్ణువనే జీవాత్మ స్తబ్దుగా లోన మనలోనే ఉన్నది. దానినుండి పుట్టిన మనస్సుఅహంకారము, చిత్తము, బుద్ధి అనే నాలుగు బ్రహ్మగారి నాలుగు ముఖాలు. దహరాకాశంలోనుండే పుట్టిన మధు కైటభులు అనగా మధు అంటేనేనుఅనే భావన, కైటభము అంటే నేనుకి సంబంధించిన నాది అనేభావన. అహంకారము మమకారముల దుర్భావనలవల్ల ఉచ్ఛ నీచాలు మరచి మనస్సుని మర్ధించ ప్రయత్నించి వీలు కాక ఆత్మనే లేదంటూ దానిని నిర్మూలింప ప్రయత్నించే నాస్తికభావనలు. అవి తొలగడానికి అమ్మవారిని మనస్సు(బ్రహ్మ) ఇంద్రియాలతో సహా ఆశ్రయించగా మాయా విచ్చేదం చేసి ఆత్మ ఎరుకనిచ్చి అహంకార మమకారాలను వదిలేలా చేస్తుంది. అది వదిలే వరకూ మధు కైటభులతో వందల సంవత్సరాలు యుద్ధం జరుగుతూనే ఉంటుంది అంటే అహంకార-మమకారాలలోపడి తిరుగుతూనే ఉంటాడు జీవుడు. ఒక్కసారి జ్ఞానం వచ్చిందా అహంకార మమకార మోహవిచ్చేదం జరుగుతుంది. భావనలను తొలగడానికి మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తములను పణంగా పెట్టి ప్రార్థిస్తే అమ్మవారు మాయ తొలగించి ఆత్మ జ్ఞానం తెలుసుకునేలా చేస్తుంది. ఒకసారి నాది నేననేభావనలు పోయాయా అంతా సమానం అందరూ సమానం ఉన్నది ఒకటే అని తెలుస్తుంది. అప్పటి వరకూ సృష్టిలో సమస్తమూ బేధమే... ఏదీ సమానం కాదు ఎవరూ సమం కాదు... ఇలా అందరూ సమానం అంతా సమానం అని చెప్పేవాళ్ళు ఇద్దరే ఒకరు జ్ఞాని ఇంకొకరు పరమ అజ్ఞాని. జీవజాలంలో బేధాలు, ఆశ్రమ బేధాలు, వర్ణ బేధాలు, అధికారబేధాలు, అన్నీ అప్పటివరకూ వ్యావహారికంలో ఉంటాయి... ఎవరు కాదన్నా సత్యం అవగతమయ్యేంత వరకు అవితప్పవు. నోటిమాటకు చెప్పవచ్చేమో ఆచరణకు భావనలకు సరిపోవు....

అమ్మ  పంచకృత్య పరాయణా, పంచబ్రహ్మాసనాసీన కదా.... శాక్తేయంలో అమ్మవారు నిర్వహించే సమస్తాన్నీ ఇక్కడే వర్ణించారు. సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహ (మోక్షం) తత్త్వం అంతా కథలో చూడవచ్చు.

అఖ్యానం చెప్పాక శిష్యులిద్దరూ గురువుని ఇంకా అడిగారు పరాదేవత ఎలా ఆవిర్భవించింది ఎక్కడుంటుంది ఇలా.. పరిప్రశ్నలతో గురువుని సేవించారు దానికి గురువైన మేధాముని తగు సమాధానాలు రాబోవు అధ్యాయాల్లో చెప్పారు....

ఈ ప్రథమ చరిత్రలో 90 బీజమంత్రాలు ఇందులోని శ్లోకములలో నిబిడీకృతమై ఉన్నాయి..

సర్వం మహాకాళీ స్వరూప శ్రీ మాతా చండీ పరమేశ్వరీ పాదారవిందార్పణమస్తు

సశేషం..

మనగుడి

శ్రీ గురుభ్యోనమః

గుడి లేదా ఆలయాలు మనలోని ఆధ్యాత్మికతను ఉత్తేజితపరచే ముఖ్య స్థానాలు. అంతటానిండి ఉన్న భగవంతుణ్ణి సాకారంగా ఒక రూపంలో చూడాలనిపిస్తే ఆ రూపం ఉండే స్థలమే గుడి ఆలయం. ఒక గుడికి మనం వెళ్ళాము అంటే అది మన ఉన్నతికి కారణం కావాలి మన సంస్కారం సంస్కృతి అక్కడ ప్రతిబింబించాలి. అందుకే ఆలయాలు మన సంస్కృతికి పట్టుకొమ్మలు అని పెద్దలంటారు. ఆలయంలో ప్రవేశించేది మొదలు మనసు ప్రశాంతంగా హడావుడిలేకుండా ఉంచుకోవాలి. అందుకు తగ్గట్టుగా ఆలయాలను మనం నిర్వహించుకోవాలి. ఒక ఆలయం చూస్తే ఏదో మాల్ లాగానో మరేదో ప్రదేశంలో లాగానో గడబిడగా కాక దైవత్వం ఉట్టిపడుతూప్రశాంతతనిక్రమశిక్షణని, సంస్కారాన్ని, వినయాన్ని పెంపొందించేదిగా ఉండేలా చూసుకోవాలి. దేవాలయం అందుకు తగ్గట్టుగా ఉండేలా తీర్చిదిద్దడం ఆలయ ధర్మాధికారులు అర్చకుల కర్తవ్యమే ఐనా.. దాన్ని నిలబెట్టి ఆ పూనిక ప్రకటించవలసింది గుడికి వచ్చే భక్తులు కూడా...

పూర్వం చాలా ఆలయాలు వాటి పోషణ నిమిత్తమై స్వయం సమృద్ధిగా ఉండేవి. కనీసం ఇప్పుడు పూజా పుష్పాదులవరకైనా సరే సమృద్ధిగా ఉండేటట్టు పూల మొక్కలు పెంచడం బృందావనం మారేడు వనం పెంచడం వంటివి చాలా అవసరం. ఒక ఆఖ్యానం చెప్తారు ప్రాణ భయంతో ఉన్న పిచుక ఒకటి ఆలయంలోకి ఎగురుకుంటూ వచ్చి అంతరాలయంలో ప్రవేశించిందట తరవాత అది మళ్ళీ ఎగిరి వెళ్ళినపుడు రెక్కలు అల్లార్పుకి అక్కడ ధూళి తొలగి శుభ్రమై అంతరాలయం శుభ్రం చేసిన ఫలితం వల్ల మరుజన్మలో ఉత్తమ మానవ జన్మ లభించింది అని. అంటే పురాణాలు ఆలయ శుభ్రత ఆవశ్యకత గురించి ఎంత స్పష్టంగా మనకి చెప్పాయో చూడండి.

ఏదో ఒక ఆలయంతో భక్తునికి ఒక అనుబంధం ఎల్లప్పుడూ ఉండాలి. అందుకు గానూ విధిగా ఆ ఆలయాన్ని దర్శించడం, ఆ ఆలయంలో చేసే కార్యక్రమాలలో పాల్గొనడం ఉత్సవాల్లో పాల్గొనడంతో వంటివి చేయాలి. ఆ అనుబంధం కొన్నాళ్ళకి ఆ ఆలయంలో ఎక్కడైనా జిల్లేడు రావి వంటి మొక్కలు ఏ గోడమీదో మొలుస్తున్నాయనుక్కోండి వాటిని తీయడం. బూజు పట్టినచోట దులపడం క్రింద పడిన పూలు, ప్రసాదపు కాగితాలు వంటివి తీయడం. వృధాగా పోతున్న నీటికుళాయిని కట్టేయడం ఇలా అనుకోకుండా ఒక ఆలయ సేవరూపంలోకి ఆ అనుబంధం మారిపోతుంది. అలా అసంకల్పిత సేవగా జీవనం మారాలంటే ముందు బలమైన సంకల్పంతో ఓ నాలుగైదుసార్లు ఆపని చేయాలి. ఉదాహరణకి పువ్వులు తొక్కకూడదు అందునా ఎర్రపూలు అసలు తొక్కకూడదు అని తెలుసనుక్కోండి. గుడిలో ప్రదక్షిణమో మరేదో పనిలో ఉన్నప్పుడు ఆ నడిచే దారిలో ఒ ఎర్ర పువ్వు కనిపించిందనుక్కోండి తీసి పక్కన పెట్టే అలవాటు చేసుకుంటే ఎక్కడైనాసరే పక్కవాళ్ళతో మాట్లాడుతున్నా అసంకల్పితంగా వంగి చేత్తో ఆ పువ్వు తీసి ఎవరూ తొక్కని వేపుకి వేసేయగలగాలి.

ఇలా ప్రతి ఒక్కరూ నిత్యం చేస్తున్నా శరీరగత శక్తి పరిథిననుసరించి అన్నీ ఒకేసారి ఒక్కరే చేయలేరు కాబట్టి గుడికొచ్చే భక్తులందరూ కలిసి ఒక సత్సంగం గా మారి గుడి ధర్మకర్తలు అర్చకుల సహాయంతో గుడిలో చేయవలసిన శుభ్రపరచవలసిన పనులు మూడు నెలలకో ఆరునెలలకో ఓసారి నిర్వహించుకోవాలి. పాత్రల శుభ్ర పరచడం దగ్గరనుంచి ఆలయం శుభ్రంగా కడగడం తుడవడం దగ్గరనుంచి ఆలయం బయట ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టుకోవాలి.. ఇలా ఎన్నో విధాల గుడిని శుభ్ర పరచి అలంకరించుకొని శోభాయమానంగా అలంకరించుకోవాలి. ఏ ఉత్సవాలో లేదా కార్తీకం వచ్చిందనుక్కోండి. అందరూ కలిసి గుడి చుట్టూ ప్రమిదలు చక్కగా అందంగా అమర్చి సాయం వేళ వెలిగించారనుక్కోండి గొప్ప శోభాయమానంగా ఉంటుంది...  ఇదే "మనగుడి", ప్రతి పనికీ మనం డబ్బులిచ్చి కూలికి పిలుచుకొని చేయనవసరం లేకుండా మనం కరసేవ చేసి ఆలయాన్ని బాగుచేసుకుంటే మనకి ఆ ఆలయానికి కలిగే అనుబంధం ఉద్ధరణ హేతువు...


కనీస కర్తవ్యంగా భక్తులు ఆలయ మర్యాదనీ, ఆలయ శోభనీ కాపాడే విధంగా ప్రవర్తించవలసి ఉంటుంది.
-పదుగురూ కలిసి గుడి శుభ్రం చేయడం
- ఆకులు, ఎండిన పూలూ, చెత్త కనబడితే తీసి చెత్తబుట్టలో వేయడం
-ముఖ్యంగా కుంకుమ లేదా బొట్టు పెట్టుకునే చోట వాటిని ధరించి లేదా తీర్థ ప్రసాదాలు తిని ఆ చేతిని గోడలకి, స్థంభాలకి పూసేయడం.... వంటివి చేసి ఆలయ ప్రాంగణాన్ని పాడుచేయకూడదు.
- ఆలయంలోకి ప్రవేశించిన తరవాత మనసులో కానీ పక్కవాళ్ళకి ఇబ్బంది లేని స్థాయిలో కానీ భగవన్నామ స్మరణ చేసుకోవాలి.
-వస్త్ర ధారణ సాంప్రదాయబద్ధంగా ఉండాలి... ఇలా ఎన్నో ఇవి ఒకరు చెప్పేవి కావు ఎవరికి వారు తరచి చూసుకొని " పరవాలేదులే" అన్న మాట వదిలి ఖచ్చితంగా ఆచరించాల్సినవి....
Saturday, September 19, 2015

దేవీ మహాత్మ్యము 2

శ్రీ గురుభ్యోనమః
……..
ఇక సప్తశతి ఎప్పటిది అంటే అది సనాతనం. సనాతనమైన వేదవేదాంత సారమే సప్తశతి. ఇలాంటి సారభూతమైన వాఙ్మయమే మరొకటి మనకి కపడేది భగవద్గీత... రెండూ మోహ విచ్చేదం చేయడం కోసమే వచ్చాయి. భగవద్గీత అర్జునుడు మోహపడి యుద్ధం చేయనంటే కృష్ణుడు బోధచేసాడు చివరలో అర్జునుడే నష్టోమోహః స్మృతిర్లబ్దః అని చెప్తాడు. అలాగే దేవీమహాత్మ్యం సురథుడు సమాధి అనే ఇద్దరు వ్యక్తుల మోహాన్ని పోగొట్టడానికి సుమేధ చెప్పే అమ్మవారి ఆఖ్యానాలతో మొదలై చివర్లో వారి మోహం పోయి వారుకోరుకున్న లౌకిక పారలౌకిక వాంఛలు తీరుతాయి.

సప్తశతికి ఎందరో మహానుభావులు భాష్యాలు వ్రాసారు. ప్రస్తుతం గుప్తావతి అనుపేర భాష్యం సంస్కృతంలో లభిస్తున్నది. అలానే విరివిఐన వివరణ శ్రియానందులు రచించారు. గౌడపాదులవారు దీనికి భాష్యం రచించారు అలాగే శాంకర భాష్యం ఉన్నదని ప్రతీతి కానీ ప్రస్తుతం దాదాపు అలభ్యం. దీనికి ప్రస్తుతం లభిస్తున్న అతి ప్రాచీన భాష్యం శాంతనవి. భీష్ముని తండ్రిఐన శంతన చక్రవర్తి వ్రాసినది. అంటే ఎంత ప్రాచీన భాష్యమో తెలుస్తున్నది. ఇది అంతకన్నా ప్రాచీనము. ఇది మార్కండేయ పురాణంలోదే ఐనా దీనికి కర్త మార్కండేయుడు కాదు ప్రవాచకుడు మాత్రమే...
మనం ఒకటి గుర్తుంచుకోవాలి, భగవద్గీతైనా, ఇతిహాసమైనా, పురాణమైనా, తంత్ర గ్రంథాలైనా, ఆగమాలైనా వేదాన్ని అనువర్తించినపుడే అవి ప్రమాణాలు, వేదదూరమైనవి ప్రమాణ వాఙ్మయం కానేరదు. కాబట్టి ఆయా వాఙ్మయ వ్యాఖ్య కూడా తదనుగుణంగా ఉండాలి తప్ప అవైదిక మార్గంలో వేదహృదయాన్ని విడిచి చేసిన భాష్యాలు ఎంత అందంగా ఆకర్షణీయంగా వినసొంపుగా తియ్యని మాటల్లా (చార్వాక్) ఉన్నా ఒక్కనాటికీ వైదికములు కానేరవు.

మొదటి అధ్యాయం గురించి కొద్దిగా...
చండీవిద్య స్వతంత్ర విద్య, లౌకికమైన కోరికలకూ, పారలౌకికమైన మోక్షాపేక్ష కలిగినవారికీ కూడా కొంగుబంగారంఅది చూపడానికే మనకి కథలో క్షత్రియుడైన సురథుడు వైశ్యుడైన సమాధి కనిపిస్తారు వీరికొరకు మంచి మేధస్సు కల గురువు బోధ చేస్తారు. కథని ఎవరి కథో ఎప్పటి కథో అని కాక దాన్ని పరిశీలిస్తే సురథుడు సమాధి సుమేధ మనలోనే ఉంటారు మన పక్కనే చుట్టూనే ఉంటారు. అందులో చెప్పిన రాక్షసులు మొదలైన వారు కూడా మనలోనూ మన సమాజంలోనూ కనిపిస్తారు.

ఇంద్రియాణి పరాణ్యాహు.. అని కదా ఇంద్రియాలే గుఱ్ఱములై నడిపే రథము మన శరీరమే. ఎవరి శరీరమైనా బాగుండాలనేగా కోరుకునేది అందుకే ఎవరి శరీరం వారికి సురథమే. శరీరాన్ని కాపాడుకోవడం ధర్మ కార్యాలు చేయడం భార్యా పిల్లలతో ఐశ్వర్యం ఇత్యాది అన్నీ ధర్మంగా పొంది అనుభవించడం ఇవన్నీ సురథుడు చేయవల్సినవే.. వాటికొరకు శ్రమించవలసినదే. దానికి సంబంధించి ఉపాయం (ఇక్కడ రాజ్యం పాలించడం అనే ఉద్యోగం) పోయింది భార్యా పిల్లలు, రాజ్యం మీద మోహంతో ఉన్నాడు. క్షత్రియతత్త్వం. ఇంద్రియాలు మనసు

ఇక సమాధి ఈయనకు బుద్ధి విశేషం ఎక్కువ, విచక్షణా జ్ఞానం కలవాడు, తన వ్యవసాయాత్మిక బుద్ధితో ఏది పుత్తడి ఏది ఇత్తడి తెలుసుకోగలడు కానీ స్థిరబుద్ధి కాకపోవడం చేత మోహం ఉంది ఇది వైశ్య ప్రవృత్తి. భగవంతుడి పాదాలు దొరికితే చాలు ఈజన్మకి ఏమఖ్కర్లేదంటాం.. తిరుమలలో గుడికెళ్ళి దణ్ణం పెట్టుకుంటూ భార్యాపిల్లలు ఎక్కడున్నారని అంతరాలయంలో వెతుక్కుంటాం... బుద్ధి...

ఇద్దరూ మనమే.... మనలోనే సురథుడున్నాడు మనలోనే సమాధి ఉన్నాడు... స్థాయీబేధాలు ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తాం మోహంతో... వాఙ్మయంలో మనకన్నీ తెలిసినట్టే ఉంటుంది ఏదైనా ఎవరైనా చెప్దామని మొదలెట్టగానే అది ఇలాగండి అలాగండి అని మనం చెప్పేస్తాం... కానీ జ్ఞానం నోటి మాటవరకే తప్ప శరీరంలో జీర్ణమవదు. అది అప్పటికే తప్ప చక్కగా స్థిరీకరింపబడినది కాదు. అందుకే ఆచరణలో ఉండదు... అందువల్ల ప్రశాంతత ఉండదు.

వీళ్ళిద్దరూ వెళ్ళి (ఇంద్రియాలతో కూడిన మనస్సు + బుద్ధి) వెళ్ళి మేధస్సునడిగారు. ఆయన గురువు. గురు వాక్యం సింహనాదం. ఒక్కసారి అదివినపడితే అజ్ఞానం పటాపంచలైపోతుంది. గురువుని లఘువుగా భావించిన వాని కర్మ పరీపాకం కాలేదని అర్థం. కానీ సురథ సమాధులిద్దరూ వెళ్ళి మాకు జ్ఞానం ఉంది కానీ మా కుటుంబ సభ్యులమీద మోహం పోవట్లేదు అని సుమేధ దగ్గర మొరపెట్టుకున్నారు. అప్పుడు సుమేధ సున్నితంగా మందలించి మీకు తెలిసిందేది అసలు తెలివి కాదు అని ఉపనిషత్తుల్లో చెప్పబడినఉమతత్త్వాన్ని బోధిస్తూ ఆఖ్యానాలరూపంలో అమ్మవారి అవతారాలని ప్రస్తుతిస్తాడు. అందులో నిబిడీకృతమైన జ్ఞాన బోధ చేస్తారు...

చండీ సప్తశతి ప్రథమాధ్యాయానికి ప్రథమ చరిత్ర అని పేరు అధిష్ఠాన దేవత మహాకాళీ స్వరూపం... మంత్రం లేనివారు హవిర్భాగం ఇచ్చేటప్పుడుశ్రీ మహాకాళ్యైఇదం మమఅని చెప్తూ ఇవ్వాలి... 

సశేషం...