Pages

Friday, March 21, 2014

సుయతీంద్ర తీర్థుల వారి పాదాల చెంత సాగిలపడుతూ...

శ్రీ గురుభ్యోనమః
నమస్తే
 
యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్టితః !
తస్య ప్రకృతిలీనస్యయం పరస్స మహేశ్వరః!!
 
నిన్నటి నాటి రాత్రి, మంత్రాలయ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సుయతీంద్ర తీర్థులు బ్రహ్మైక్యాన్ని పొందారు. వీరు పూర్వాశ్రమ నామం శ్రీ సుశీలేంద్రాచార్య, పూర్వాశ్రమంలో వీరికి ఒక కూతురు కొడుకు ఉన్నారు. వీరు BSc, BEd తోపాటు మరిన్ని సర్టిఫికేట్ కోర్సులూ చేసి లౌకిక విద్యనేర్చుకున్నారు, వీరి పూర్వాచార్యుల సూచన మేరకు సంస్కృతం, కావ్యాలు, వేదాగమాలూ , న్యాయం ఇత్యాది మరెన్నో నేర్చుకున్నారుట. పూర్వాచార్యులు శ్రీ శ్రీ శ్రీ సుయమీంద్రతీర్థులు పీఠాధిపతిగా ఉన్నప్పుడు వీరు భారతీయ సంస్కృతి విద్యాపీఠం, బెంగుళూరులో 30 సంవత్సరాలు ఉపాధ్యాయ/అధ్యాపక వృత్తిని నిర్వహించి ప్రిన్సిపాల్గా వ్యవహరించారు, అదేసమయంలో గొప్ప అనుభవాన్ని, కీర్తినీ గడించారు. పదవీ విరమణ  తరవాత సమ్సారంలో ఉన్నా వానప్రస్థుగా ఉంటూ మఠానికి సంబంధించిన బెంగుళూరు శాఖకు ధర్మాధికారిగా సేవలందించారు, పిమ్మట శ్రీ సుయమీంద్రుల ఆశీస్సులతో మఠానికి దివాన్ గా నియమింపబడ్డారు, శ్రీ సుయమీంద్రుల వార్థక్యం వల్ల మూల రాములకు పూజలు ఆగకూడదని నిర్ణయించి వారికి సుశీలేంద్రాచార్య పై ఉన్న గురితో ఉత్తరాధికారిగా నియమించారు.  పూర్వాచార్యుల సాన్నిహిత్యంతోపాటు వారియందున్న గురితో పీఠాధిపతిగా కొనసాగుతూ మఠ నిర్వహణ, భక్తి, ధర్మ ప్రచారం చేస్తూ వచ్చారు. వారి హయాంలోనే మంత్రాలయం నూతనంగా చాలా అభివృద్ధిని పొందింది, వచ్చేభక్తులసౌకర్యార్థం ఒంటి పూట భోజనాన్ని రెండుపూటలా ఏర్పాటు చేసారు. పైగా ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి కోట్ల విరాళాలు సేకరించి మఠానికి దగ్గరలో నూతన వసతి గృహాలు, రాఘవేంద్రుల మూల బృందావనానికి, బంగారు కవచం, బయట నలువైపులా మంటపాలు ఇత్యాది నిర్మించారు.  ఇంతేకాక పోయినసారి తుంగభద్ర వరదల్లో నష్టపోయిన ఎన్నో కుటుంబాలకు ఇళ్ళు కట్టించి, ఊళ్ళొ మంచి రోడ్లు, మంచి నీటి సదుపాయాలు మఠం తరపున్ కల్పించే ఏర్పాట్లు చేసారు.
 
యతీంద్రుల వారు గత కొంత కాలంగా అనారోగ్యంగా ఉంటున్నా నిత్య నైమిత్తిక విధులను నిర్వహిస్తూ ఉండేవారు, నిన్న వారి నిత్య జప తపాదులనంతరం ఉత్తరాధికారి ఐనటువంటి శ్రీ సుబుధేంద్ర తీర్తులు నిర్వహించిన మఠ పూజలలో పాల్గొన్నారు, మధ్యాహ్న భిక్షావందనం తరవాత సాయంత్రం వేళ గంటకు పైగా భాగవత శ్రవణం చేసి నిన్నటి మధ్యరాత్రి కాలంలో బ్రహ్మైక్యాన్ని పొందారు. ఇక వీరి తరవాత ఉత్తరాధికారిగా నియమింపబడ్డ వీరి శిష్యులు శ్రీ సుబుధేంద్ర తీర్థులు మఠాధిపతిగా వ్యవహరిస్తారు. యతీంద్రుల పార్థివ శరీరాన్ని, మంత్రాలయ పీఠ ఉత్తరాధికారి, ఇతర మఠాధికారులు వారి బృందావనం వారికి ప్రీతిపాత్రులైన గురువుగారి బృందావనానికి పక్కనే ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
 
నిబద్ధతతో, నియమంతో క్రమశిక్షణతో, వ్యవసాయాత్మక బుద్ధితో, గురువు మీద శాస్త్రంమీద గురి ఉన్నవారు ఏదైనా సాధించగలరు అన్నదానికి నేటికాలంలో సుయతీంద్రతీర్థులు మనకి ఆదర్శం. వారు ఘటాకాశ మఠాకాశాలను ఛేధించుకొని అనంతాకాశంలో కలిసినా వారి ఆశీస్సులు మనకెల్లప్పుడూ ఉండాలనీ కోరుకుంటూ, ఉంటాయనీ నమ్ముతూ... వారి పాదాల చెంత సాగిలపడుతూ...
 
నకర్మణా నప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశుః!
పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజదేతద్యతయో విశంతి!!
వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా స్సంన్యాసయోగా ద్యతయశ్శుద్ధసత్త్వాః!
తే బ్రహ్మలోకేతు వరాంతకాలే పరామృతా త్పరిముచ్యన్తి సర్వే!!
దహ్ర విపాపం పరమేశ్మభూతః యత్పుండరీకం మురమధ్యసగ్గ్౦స్థం
తత్రాపి దహ్రం గగనం విశోక స్తస్మిన్ యదంతస్తదుపాసితవ్యం!!
యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్టితః !
తస్య ప్రకృతిలీనస్యయం పరస్స మహేశ్వరః!!