Pages

Sunday, February 27, 2011

ఆద్యాత్మిక సాధన మార్గం లో ఉన్నతమైనది,సులువైనది, ఎ విదముగా పొందగలిగినది

నమస్తే,
చాలా గడ్డు ప్రశ్నే వేశారు! మొత్తం ఆధ్యాత్మిక జీవన లక్ష్యాలను,
మార్గాలను గురించిన ప్రశ్నలను ఒక్క ప్రశ్నలొ ఇమడ్చారు.
గురువుగారి మరియు ఇతర పెద్దల సాంగత్యం వలన, వారు చెప్పిన ఎన్నో
విషయాలలోని నాకర్థమైన కొంతదాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాను.
అన్నిటికన్నా ఉత్తమమైన మానవ జన్మ పొందడము సామాన్యము కాదు, మానవ జన్మ
దుర్లభమని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కాని మానవ జన్మ మన పూర్వ
జన్మలలో చేసిన పాప పుణ్యఫలము, కాని అదే ఆ అన్ని జన్మలకీ ఫలము కాదు. ఇది
ఎలా ఉంటుందంటే, మౌఖిక, పరీక్షలు, నెలవారి పరీక్షలు, త్రైమాసిక పరీక్షలు
వగైరాలు దాటి చిట్ట చివరి పరీక్షకు అర్హత సంపాదించినట్టు, అన్ని జన్మలూ
దాటి జీవుడు ఈ మానవ జన్మ పొందుతాడు. అసలు సమస్య అంతా ఇక్కడే! ఇక్కడిదాకా
వచ్చాకే! అఙ్ఞానం వల్ల అసలు ఈ జన్మలోకి ఎందుకు వచ్చాడో మర్చిపోయి ఇతర
విషయాలపై ఆసక్తి పెంచుకుంటాడు. అసలు పరీక్షగురించి (జన్మ ప్రయోజనాన్ని)
మర్చిపోతాడు. దీంట్లో ఉత్తీర్ణుడు కాకపోతే మళ్ళీ అదే తరగతి మళ్ళీ మౌఖిక,
పరీక్షలు, నెలవారి పరీక్షలు, త్రైమాసిక పరీక్షలు వగైరాలు అన్నీ మొదలు.
ఉత్తీర్ణతపొందడమంటే.. పండిపోవడం.. అదే ఇంకో జన్మ లేకుండా చేసుకోవడం.. అదే
పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుజ్య స్థితి కి చేరుకోవడం. ఇదే ఆధ్యాత్మిక
సాధనలో చిట్ట చివరి ప్రయోజనం. అది ఎలా అంటే, భక్తి చే ఙ్ఞానమును పొంది
వైరాగ్యముపెంపుచేసుకొని అసలువస్తువును తెలుసుకోవటమే పునరావృత్తిరహిత
శాశ్వత శివ సాయుజ్య స్థితి. అసలు వస్తువైన ఆత్మ యొక్క యెరుక తెలుసుకొని
ఆత్మానుభవమును పొంది అంతటా ఉన్నది ఆ ఆత్మయే అని ఆత్వ ద్వారా ఆ పరమాత్మలో
లీనమైపోవడమే ఈ జన్మ ప్రయోజనం అదే ఉన్నతమైనది. అదికాక ఇంకొక ప్రయోజనం
ఆధ్యాత్మిక సాధన మార్గంలో ఉన్నది అని నేను అనుక్కోవట్లేదు ( గురువుగారు
కూడా ఎప్పుడు ఇదే చెపుతారు). అది సాధించే నేపధ్యంలో అనుషంగిక ప్రయోజనాలు
ఏవైనా చేకూరవచ్చుగాక (ఉదా: ధనం, ఐశ్వర్యం, పేరు ప్రతిష్టలు, కుటుంబ
వృద్ధి, పిల్లలు పెళ్ళిళ్ళు వంటివి, అంతకన్నా అష్టసిద్ధుల వంటివి
పొందవచ్చునేమో), కాని వాటితో తన్మయత్వం చెందక చిట్టచివరి ప్రయోజనమైన
ఆత్మానుభవమును పొందటమే ఉన్నతమైన లక్ష్యం.
ఇదిపొందటానికి సులువైన మార్గం వైదికధర్మావలంబనమే, నీ ధర్మంలో నువ్వు ఉంటూ
నీ కర్తవ్యాలని నెరవేర్చటమే సులువైనది. అందునా గృహస్థు సంసారంలో ఉంటూ తన
ధర్మాన్ని తాను ఆచరించి భగవత్కైంకర్యం చేస్తూ ఉండాలి. భక్తితో కూడిన
కర్మాచరణముచే ఙ్ఞానసముపార్జవైపు అడుగులిడి వైరాగ్యమును పెంపొందించుకుంటూ
తుట్టతుద జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలి.
ఇంకా విపులంగా చెప్పాలంటే, ఏది చేసినా భక్తితో భగవంతునికి సమర్పణ భావంతో
మెలగటం. అలా చేయగా చేయగా ఒకనాడు ఆ భగవంతుడే చిట్ట చివరి లక్ష్యానికి
చేరుకోవడానికి కావల్సిన సంబారములను చేకూర్చడానికి తానే ఒక మహానుభావుని
రూపంలో కావలసిన ఉపదేశం చేస్తాడు ( ఉపదేశం అనేది, బోధ కావచ్చు, మరింకేదైనా
కావచ్చు అది ఇలాగే ఉండాలని, ఒక పద్ధతిలోనే ఉండాలని చెప్పటం కష్టమే).
గురువుగారు లలితా సహస్ర వ్యాఖ్యానాంతర్గతంగా ఒక సుత్రాన్ని తెలిపారు.
నీవు ఏదైనా పని చేసేటప్పుడు నీకు నువ్వు ఒక ప్రశ్న వేసుకో నీవు చేసే
పనిని నీ గురువు ఇంకా భగవంతుడు ఆమోదిస్తారా అని వివేచన చేస్కో.
దానిద్వారా నీ ప్రతి కర్మాచరణమును సంస్కరించుకో, అదే నిన్ను మెల్లి
మెల్లిగా నువ్వు చేరుకోవలసిన స్థితికి తీసుకెళ్తుంది.
అడ్డ దార్లను, ఇతర మైన  మార్గాలను పెద్దలు ఎవరూ ఇష్టపడరు, అవి మనకి
సమాజానికి అంత శ్రేయస్కరంకూడా కావు.
నేను విన్నవి చదివినవి నాకు అర్థం అయ్యినంతవరకూ ఇక్కడ వ్రాసాను, తప్పులు
ఉంటే పెద్దలు దిద్దగలరు.
మీ...
సూర్య నాగేంద్ర కుమార్ అయ్యగారి

నిత్య శివరాత్రి

నమస్తే!
ముందుగా ఈ శివరాత్రులు సంవత్సరానికొకసారో నెలకొకసారో కాక ప్రతి రాత్రి
శివరాత్రిగానే భావించే సాంప్రదాయముంది. ఉదయాన్నే లేచి [శ్రీ హరి అని మూడు
సార్లు తలచి లేవాలి ఎందుకంటే  నిద్రలేచినది మొదలు నిద్ర కుపక్రమించేవరకు
(జాగ్రదావస్థకు)ఉన్న కాలమునకు విష్ణువే అధిపతి ఆయన అనుగ్రహముతో ఆ రోజు
కార్యములన్నీ శుభప్రదంగా జరగడానికొరకు, మీరు చేసే మొదటి సంకల్పమే బ్రహ్మ
తత్వమైన సృష్టికి గుర్తు]. నిత్య కర్మానుష్టనములు చేసుకొని
శివలింగమునారాధించి, తను చేసే ప్రతి పనిలో ప్రతి ఒక్కరిలో శివును చూస్తూ
సాత్వికాహార బద్ధుడై తిరిగి సాయంత్రం శివారాధన చేసి నివేదన చేయబడిన
పదార్థములను ప్రాసాద బుద్ధితో తీసుకొని రాత్రి నిద్రకు ఉపక్రమించడం. ఈ
నిద్రనే శివుని స్వల్పకాలిక లయం అంటారు. ఈ నిద్రను పొందటను గమనిస్తూ
శివుని పదకొండు సార్లు తలచుకొని నిద్రపోవాలని శాస్త్ర వచనం / పెద్దల
వచనం . ఇలా రోజూ త్రిమూర్తులను తన అవస్థలలో గుర్తిస్తూ సాధన ద్వారా
జ్ఙానం వేపుకి అడుగులేయడం. ప్రతి రోజు శివరాత్రి.
ఇక త్రయోదశి తిథి పరమ శివుని తిథిగా శాస్త్రాలు పెద్దలు గుర్తించారు.
శుక్ల పక్షంలో వచ్చే త్రయోదశి తిథితో కూడుకుని ఉన్న చతుర్థశిని శుక్ల
పక్ష శివరాత్రి అని పిలుస్తూ ఉంటారు ఇది సంపూర్ణ జ్ఙానం వైపు వెళ్ళే
సాధకునికి గుర్తు (చాలా వరకు శుక్ల పక్ష శివరాత్రిని ఉపాసన చేయడమన్నది ఈ
మధ్య కాలంలో కనబడడంలేదు, దీనికి తగిన ఆఖ్యానాలు కూడా ప్రచారంలో లేవు,
ఉన్నవేమో తెలీదు.)
ఇక కృష్ణ పక్షంలో త్రయోదశి తిథిని కూడిన చతుర్దశీ తిథిని మాస శివరాత్రి
అని పిలుస్తారు అదే కృష్ణ పక్ష శివరాత్రి. ఒక రోజులో అసుర సంధ్య వేళ
కేవలం శివ పూజకు ఎంత విశిష్టమో అలా ఒక నెలలో మాస శివరాత్రి అటువంటిది. ఈ రోజు కూడా మహాశివరాత్రి లాగానే శివారాధనలూ, శివాభిషేకాలు, బిల్వ పత్రి
పూజలూ, శివాలయ సందర్శనలూ, భజనలూ, ఉపవాసాలు, జాగరణలూ చేయడం పరిపాటి. ఆరాధనలో ఎటువంటి తేడాలేదు. ఐతే రోజూ చేసే ఉపాసనకన్నా ఈ రోజు చేసే ఉపాసన కొంత అధికం.
అలాగే మాఘమాసంలో వచ్చే కృష్ణ పక్ష చతుర్దశిని మహా శివరాత్రి అని
నిర్ధారించారు. ఆరోజే రాత్రే శివలింగము ఆవిర్భవించిందని శాస్త్ర వాక్కు.
ఆనాడు పగలంతా శివ పూజలతో, శివ కథా కాలక్షేపములతో సాత్విక ఆహారము లేదా ఉపవాసము (ఉపవాసమంటే లంఖణం కాదు ఉప= దగ్గర, వాసము= ఉండుట, భగవంతునికి దగ్గరగా ఉండుట. వీలైనంత తక్కువైన ఆహారము సాత్వికమైనది తీసుకొని భగవంతుని గుణములను కొలుస్తూ, స్తోత్ర పాఠాలను చేస్తూ, ఆ లీలా మూర్తి అనుగ్రహాలను తలచుకొంటూ భగవత్కార్యక్రమాలలో పాల్గొనుట).
శివలింగం అర్థ రాత్రి ఆవిర్భవించడం అంటే ఏదో ఒక రాయిలానో శిల గానో
ఆవిర్భవించటం అని కాదు. మాఘ మాసం వచ్చేసరికి, (ఆషాడ మాసంనుంచి వర్షాలవల్ల లోకంలో సృష్టి ప్రతి సృష్టి జరిగుతుంది. భౌతికంగా అన్ని జీవాలు అంధకారంలో ఉంటాయి, సరిగ్గా కనపడదు అందునా మాఘ మాసం చతుర్దశి అర్థ రాత్రి అమావాస్య ఘడియలలో లేదా అమావాస్య వస్తుందనగా ఉన్న చీకట్ల ను తొలగించడానికి జ్యోతి రూపంలో శివుడు ఆవిర్భవించాడు అదే అజ్ఙానరూపంలో ఉన్న చీకట్లను తొలగించడానికి జ్యోతి రూపంలో ఆవిర్భవించాడు. అవ్యక్తమైన పరమాత్మ
వ్యక్తమైనాడు. ఆరోజు రాత్రి జాగరణ చేసి లింగావిర్భావ సమయమున ఒక జ్యోతి
(దీపమును లేదా కర్పూర దీపమునుగాని) గాని ఈ క్రింది శ్లోకము చదువుతూ
చూడవలెను అప్పుడు శివరాత్రి వ్రత పూర్ణ ఫలము.
కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః
జలేస్థలే యే నివసంతి జీవాః
దృష్ట్వా ప్రదీపం నీచజన్మ భాగినః
భవన్తి త్వం శ్వపచాహి విప్రాః
మన సనాతన ధర్మ గొప్పదనమెంతో చూడండి. ఈ శ్లోకం చదివి, ఆ దీపాన్ని
వెలిగించిన యజమానే కాక, దానిని చూస్తున్న వారందరే కాక, కీటకములు,
పక్షులు, దోమలు, చెట్లు, జల నివాసములు, ఏ ఏ జీవములు ఆ దీపమును
చూచుచున్నవో లేదా ఏ ఏ జీవములపై ఆ దీపపు కాంతి పడుతున్నదో అవన్నీ ఉద్ధరణ పొందవలెను అని ఆ యజమాని భావన చేయాలి. దీనితోనే ఆ శివరాత్రి వ్రతం
సంపూర్ణం. (ఇదే శ్లోకం కార్తీక పౌర్ణమి దీపం ను చూస్తూ కూడా చెప్పవలెను)
ఈ విషయాన్ని మీకు తెలిసినవారందరకీ తెల్పండి. [పూర్తిగా శివరాత్రి,
కార్తీక పౌర్ణమి వ్రతాలు చేయకపోయినా (ఏ అస్వస్తత వల్లనో) అ నాటి రాత్రి
జ్యొతి స్వరూపుడైన శివును దీపము లో చూస్తూ ఈ శ్లోకం చెప్పినా చాలు అని
పెద్దలెవరో చెప్పగా విన్నట్లు గుర్తు ]
ఇన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి, స్వయంగా ఆ పరమేశ్వరుడే మన అజ్ఙానపు
చీకట్లను తొలగించడానికి జ్యొతి రూప శివలింగంగా ఆవిర్భవించిన రోజు
కాబట్టీ, ప్రతి రోజూ అంత గొప్పగా ఉపాసన చేయడం అందరికీ సాధ్యం కాబట్టీ,
కనీసం ప్రతి సంవత్సరం మహా శివరాత్రైనా ...

విద్=దివ్ ; వేదం= దైవం

శ్రీ గురుభ్యోన్నమః
శ్రీగణేశాయ నమః
మన సనాతన ధర్మంలో ఈ రెండు అక్షరాలు ఎంతో ప్రభావవంతమైనవి. అసలు ఈ రెండు అక్షరాలే కీలకం, మూలం. ఈ రెండు అక్షర సమాహారాలైన పదాలు రెండు లే మన ధర్మానికి ఆమ్లజని (ఆక్సిజన్).
అవే 1) వేదం 2) దైవం రెంటిలోనూ వున్నవి వ్,ద్, ౦,  మూడింటిలో ఒకటి పూర్ణం
తీసేస్తే ఉండేవి వ్,ద్
విద్ అనే ధాతువు నుండు పుట్టునది వేదం
విద్ = తెలుసుకొనవలసినది
తెలుసుకోవలసినది ఏది = జ్ఙానము
జ్ఙానము వలన సిద్ధించునది =  అజ్ఙానమనే చీకటి తొలగుట
అజ్ఙానమనే చీకటి తొలగుట = జ్ఙానమనే వెలుగు ప్రసరించుట
వెలుగు ప్రసరించుట = ప్రకాశము చెందుట
ప్రకాశము = భాసించుట (భాః = కాంతి క్ భాః+కరుడు =భాస్కరుడు
వెలుగునిచ్చువాడు)
భాసించునది = దివ్
దివ్ రూపాంతరం దైవం
వేదమును వేద హృదయమును తెలుసుకొనటం ద్వారా దైవమును చేరవచ్చు.
మొత్తానికి పూర్ణం ఓం పూర్ణ మదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణ మాదాయ పూర్ణమేవా వశిష్యతే !! ఓం శాంతి శ్శాంతి శ్శాంతి:!!
(అచ్చుతప్పులుండచ్చేమో)
అందుకే మన ధర్మములో వేదమునకు దైవమునకు అభేదం వేదము అపౌరుషేయం, దైవం యొక్క శ్వాస. వేదమును కేవలంగా కుక్షింభరత్వానికో మరి దేనికో చదువుట తనంత తానుగా దైవసాక్షాత్కారమును చేయించలేదు. అందుకు గల మార్గములను చెప్తుంది (like a directory or road map to show the address, but not the address
itself). వేదమువలన దైవము ఎక్కడ ఉన్నదో తెలియబడుతుంది. ఆ శ్రుతి
ప్రమాణములని వాక్యములను గురు బోధ వల్ల అంతర్ముఖత్వమున మననము చేయగా చేయగా పొందిన విద్ వల్ల దివ్ తెలియబడుతుంది.
నాకు సంస్కృతం రాదు ఐనా నాకు మొన్న ఒక రోజు వచ్చిన ఆలోచన తదనుగుణంగా జరిగిన అంతః చర్చను అక్షర రూపంగా ఇక్కడ పెట్టాను.
వేదమే ప్రమాణము - ధర్మమే ఆచరణీయము
సర్వం శ్రీ ఉమా మహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు

ఉత్తరాయణ పుణ్యకాలం

మనకందరికీ నక్షత్రాలు 27 అని బాగా తెలుసు. మళ్లీ ఒక్కొక్క నక్షత్రానికి
నాలుగు పాదాలు. ఒక్క నక్షత్రానికి నాలుగు పాదాల లెక్కన 108 పాదాలుగా
నక్షత్రాలు విభజించారు. తిరిగి 108 పాదాల్ని 12 రాశులుగా విభజించారు.
ఇందులో భాగంగా... సూర్యుడు నెలకొక రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ
రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి ఆ సంక్రాంతిగా వ్యవహరించబడుతోంది. ఇలాగే...
మకరరాశిలో సూర్యుడు ప్రవేశించినపురోజుని మకర సంక్రాంతి లేదా మకర సంక్రమణం అంటారు శాస్త్ర, పురాణాల వాక్కు.
(నేటి వైజ్ఙానికులకు, అంతా ట్రాష్ అనుక్కునేవారికి ఇది విచిత్రంగానో
మూఢనమ్మకంగానో తోచవచ్చు లేదా ఈ జ్యోతిష్యం, సూర్యుడు, నక్షత్రాలు బ్లా
బ్లా బ్లా అని అనుక్కోనూవచ్చు. పాపం వారికి తెలియనిదేమంటే భౌగోళికంగా
కూడా ఈ సంక్రాంతి రోజు నుంచీ భూమి సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు మిగిలిన
ఆరు నెలలపాటు కొంచెం సూర్యుని వైపు మొగ్గి (TILT) తిరుగుతుంది. దాని వలన
సూర్యుని ఆకర్షణ శక్తి భూమి మీద పడి తదనుగుణ లక్షణాలు , సూర్య తరంగాలు
భూమి మీద ఉండేవారి మీద ప్రసరిస్తాయి. దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలమని
పెద్దలు నిర్ణయించారు, దీని వెనకున్న శక్తినే మనం దైవం అంటాం, పాపం
వారికేమనాలో తెలియక తంటాలు పడుతుంటారు. అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా కదా మరి, అలా వెతికేస్తే చేతికి దొరికేస్తుందేమిటి
పరబ్రహ్మం...)
సూర్యుడు ధనూరాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి కర్కాటక
రాశిలోకి ప్రవేశించే వరకు దేవతలకు పగలుగా ఉంటుంది. ఈ సమయాన్నే ఉత్తరాయణం అంటారు. అలాగే సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పటి నుంచి ధనూరాశిలో ప్రవేశించే వరకు దేవతలకు రాత్రిగా ఉంటుందని శాస్త్ర వచనం
అందుచేత ఉత్తరాయణం దేవతలకు పగలుగా ఉంటుంది... కాబట్టి.. దేవతలకు పగటి
కాలంలో యజ్ఞయాగాదులు చేసి వారి అనుగ్రహాన్ని పొందమని మకర సంక్రాంతి
సూచిస్తుంది. ఇంకా చెప్పాలంటే... ఉత్తరాయణ పుణ్యకాలం ఉత్తమ లోకప్రాప్తిని
కలిగిస్తుందని విశ్వాసం. అంతే కాదు దక్షిణాయనం అంతా ఉపాసనా కాలం
దక్షిణాయనం లో మరణిస్తే ఉపాసన చేసుకునే అవకాశం పోతుందని పెద్దలు ఊర్ధ్వ
ముఖ రేతస్సు కలవారు తమ మరణాన్ని ఉత్తరాయణంలో పొందేవారు. అందుకే పూర్వం భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వచ్ఛంధ మరణాన్ని కోరుకున్నాడు.

శివ సంకల్పమస్తు

 (అసురుడైనా మయుడు శివుని అడిగిన వరములు బహుశా
మానవమాత్రులు కూడా అడగలేరేమో)
నీ పాద కమల సేవయు....
శివమహాపురాణము - 12 వ అధ్యాయము - మయ స్తుతి
మయ ఉవాచ:-
దేవ దేవ మహాదేవ భక్తవత్సల శంకర!
కల్పవృక్ష స్వరూపోసి సర్వపక్ష వివర్జితః!!
జ్యోతి రూపో నమస్తేస్తు విశ్వరూప నమోస్తుతే!
నమః పూతాత్మనే తుభ్యం పావనాయ నమో నమః!!
చిత్ర రూపాయ నిత్యాయ రూపాతీతాయ తే నమః!
దివ్యరూపాయం దివ్యాయ సుదివ్యా కృతయే నమః!!
నమః ప్రణత సర్వార్తి నాశకాయ శివాత్మనే!
కర్త్రే భర్త్రే చ సంహర్ర్తే త్రిలోకానాం నమో నమః!!
భక్తి గమ్యాయా భక్తానాం నమస్తుభ్యం కృపాలవే!
తపస్సత్ఫలదాత్రే తే శివాకాంత శివేశ్వర!!
న జానామి స్తుతిం కర్తుం స్తుతిప్రియవరేశ్వర!
ప్రసన్నోభవ సర్వేశ పాహి మాం శరణాగతమ్!!
దేవ దేవా! మహాదేవా!భక్త ప్రియా!, శుభములనే చేయు వాడా! కల్ప వృక్ష
స్వరూపుడవగు నీకు స్వ, పర భేధములు లేవు. జ్యొతి స్వరూపుడవు (జ్ఙాన
స్వరూపుడవు) అగు నీకు నమస్కారము. ఈ సమస్త విశ్వరూపములో ఉన్న నీకు
నమస్కారము. పవిత్రమగు ఆత్మ స్వరూపుడవైన నీకు నమస్కారము. అత్యంత పావనుడవు, పాపులను కూడా పావనము చేయు నీకు నమస్కారము. చిత్రమైన రూపము కలవాడవు, నిత్యుడవు, ఏ రూపమూ లేని రూపాతీతుడవు ఐన నీకు నమస్కారము. దివ్య మైన స్వరూపము కలవాడవు, ప్రకాశ స్వరూపుడవు, గొప్పనైన దివ్య ఆకృతి కలవాడవు ఐన నీకు నమస్కారము. నమస్కరించినవారి కష్టములనన్నీ తొలగించువాడా, సర్వ మంగళ స్వరూపుడా నీకు నమస్కారము.  ముల్లోకములను సృష్టించి, భరించి, లయం కావించు నీకు అనేక నమస్కారములు.  భక్తిచే పొందవలసిన వాడు, భక్తులందరి గమ్యమూ, భక్తుల యెడ అపారమైన కరుణ కలవాడూ  ఐన నీకు నమస్కారము. తపస్సులకు ఘనమైన
ఫలములొసగు వాడు పార్వతీ మాత కు పతి, అన్ని మంగళములకు ఈశ్వరుడవు ఐన నీకు నమస్కారము. ఓ ప్రభూ! సర్వమునకూ ఈశ్వరుడవైన వాడా! నీవు స్తోత్ర ప్రియుడవు, కాని నాకు స్తోత్రము చేయుట కూడా రాదు. హే సర్వేశ్వరా! నీవు ప్రసన్నుడవై నా యందు అపార కృపతో నన్ను రక్షింపుము.
{శివ ఉవాచ:-
వరం బ్రూహి ప్రసన్నోహం మయ దానవసత్తమ! మనోభిలషితం యత్తే తద్దాస్యామి న
సంశయః!!
ఓ రాక్షస శ్రేష్ఠా ! మయా! నీ యందు ప్రసన్నుడనైతిని, నీ మనస్సుకు నచ్చిన
వరము కోరుకొనుము, సంశయము లేకుండ ఇచ్చెదను}
మయ ఉవాచ:-
దేవ దేవ మహాదేవ ప్రసన్నోయది మే భవాన్!
వరయోగ్యోస్మ్యహం చేద్ధి స్వభక్తిం దేహి శాశ్వతీమ్!!
స్వభక్తేషు సదా సఖ్యం దీనేషు చ దయాం సదా!
ఉపేక్షా మన్యజీవేషు ఖలేషు పరమేశ్వర!!
కదాపి నాసురో భావో భవేన్మమ మహేశ్వర!
నిర్భయస్స్యాం సదా నాథ మగ్నస్త్వద్భజనే శుభే!!
దేవ దేవా! మహాదేవా! నీవు నాయందు ప్రసన్నుడవతివేని, నేను వరమునకు
అర్హుడైనచో, నాకు నీయంది శాశ్వత భక్తి కలుగునట్లు అనుగ్రహింపుము. నీ
భక్తులతో మైత్రిని సత్సంగమును, దీనుల యందు దయను, ఇతర ప్రాణులయందును
దుష్టులయందును ఉపేక్షాభావమును కలిగించుము. హే పరమేశ్వరా! నాకు ఎన్నటికీ
ఆసురీ భావములు కలుగకుండుగాక. హే మహేశా! నేను సర్వదా మంగళకరమగు నీ నామ భజనము యందే నిమగ్నుడనై భయము లేక ఉండు వరమిమ్ము.
శివ ఉవాచ:-
దానవర్షభ ధన్యస్త్వం మద్భక్తో నిర్వికారవాన్!
ప్రదత్తాస్తే వరాస్సర్వేభీప్సితాయే తవాధునా!!
రాక్షస శ్రేష్ఠా! నీవు కోరిన వరములచే నా భక్తుడవగు నీవు ధన్యుడ వైనావు.
నీవు కోరిన వరములనిచ్చితిని.

పూజా పుష్పాలు

భాగవతులకి నమస్కారం
ఈ క్రింద చెప్పినవి భగవంతుడు కోరే అపురూప మైన పూజా పుష్పాలు
అహింసా ప్రథమం పుష్పం, పుష్పమింద్రియనిగ్రహః
తృతీయం తు దయాపుష్పం క్షమాపుష్పం చతుర్థకం
ధ్యానపుష్పం తపః పుష్పం జ్ఙానపుష్పం తు సప్తమం
సత్యం చైవాష్టమం పుష్పమేభిః తుష్యంతి దేవతాః
దైవాన్ని పూజించాల్సిన పుష్పాల వివరాలు
మొదటి పుష్పం అహింస
రెండవ పుష్పం ఇంద్రియ నిగ్రహం
మూడవది పరోపకారబుద్ధి, దయ కలిగి ఉండటం
నాలుగవది ఓర్పు తో క్షమా గుణం కలిగి ఉండటం
ఐదవది ఇష్టదైవాన్ని ధ్యానంతో సేవించటం
ఆఱవది తపస్సు
ఏడవది జ్ఙానమును ప్రోది చేసుకోవటం
ఎనిమిదవది సత్యం (సత్య వస్తువును తెలుసుకొనుట, నిత్యమూ సత్యమునందు
చరించడం)
పైన పొందు పరచబడినది శ్రీశైల ప్రభ మాస పత్రిక లోనిది.
ఐతే అగ్ని మహాపురాణములోని పుష్పాధ్యాయము అను రెండువందల రెండవ అధ్యామునుండి
గ్రహించినది క్రింద పొందు పరచబడినది ( అర్థము ఒక్కటైనా కొద్దిగా పద భేదాలు
ఉన్నాయి)
అహింసా ప్రథమం పుష్పం పుష్పమిన్ద్రియనిగ్రహః
సర్వ పుష్పం దయా భూతే పుష్పం శాన్తిర్విశిష్యతే!!
శమః పుష్పం తప పుష్పం ధ్యానం పుష్పం చ సప్తమమ్
సత్యం చై వాష్టమం పుష్పమేత్తెస్తుష్యతి కేశవః!!
ఏతే రేవాష్టభిః పుష్పైస్తుష్యత్యేవార్చితో హరిః
పుష్పాన్తరాణి సన్త్యత్ర బాహ్యాని మనుజోత్తమ!!
భక్త్యా దయాన్వితైర్విష్ణుః పూజితః పరితుష్యతి.......
ఇతర పుష్పాలు బాహ్యాలంకారాలు అసలు పుష్పాలు ఈ ఎనిమిదే ఆ జగన్నాధుడు ఈ పుష్పములతో పూజచే అతి ప్రసన్నుడవుతాడు.
---------------------
ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు
జయ జయ శంకర హర హర శంకర

సాధనా చతుష్టయ సంపత్తి

శ్రీగురుభ్యోన్నమః
సభాయైనమః
ప్రతి వ్యక్తి ప్రయత్న పూర్వకముగా సాధనా చతుష్టయ సంపత్తిని పొందవలెను.
సద్గురువును సేవించి, అతని బోధలను విని శాస్త్ర పరిశోధనము,
అంతర్ముఖత్వము, సత్సంగము మొదలగునవి నెఱుపుట ద్వారా మనిషి భగవంతుని యొక్క,
గురువు యొక్క అనుగ్రహముతో ఈ సంపత్తిని కూర్చుకొనవలెను.
ఈ నాలుగు సాధనలు ఏవి?
1.నిత్యానిత్య వస్తువివేకము: అనగా నిత్యమైన వస్తువేది?అనిత్యము అశాశ్వతము
అయిన వస్తువేది?అని విచారించి తెలిసికొనుటనిత్యమైన వస్తువు
ప్రబ్రహ్మమనియు,అశాశ్వతమైనది ఈ పంచభూతాత్మకమైన చరాచర సృష్టియనియు
గ్రహించి యుండుట.
2.ఇహాముత్ర ఫలభోగవిరాగము: ఈ లోకమునందున్న భోగముల యుందును స్వర్గాదిభోగముల
యందును కోరిక లేకుండుట.
3.శమాది షట్కములు కలిగి ఉండుట:- శమ,దమ,ఉపరతి, తితిక్ష, సమాధాన, శ్రద్దలు
ఆరింటిని శమాది షట్కములందురు.
♦శమము:-మనో నిగ్రహము
♦దమము:- అనగా ఇంద్రియ నిగ్రహము
♦ఉపరతి:- అనగా చిత్తవిశ్రాంతి మనస్సును స్త్రీ గాను,పరబ్రహ్మను పురుషుని
గాను తలచి మనస్సును పరమాత్మ యందే నిలిపి ఆనందించుట. అంతర్ముఖత్వము
♦తితిక్ష:- యనగా శీతము గాని ఉష్ణము గాని సహించగల సహనము.
♦సమాధానము:- అనగా గురువులు ఉపదేశించిన శాస్త్ర విషయ పరిజ్ఞానము మరల తన
బుద్దితో ఆలోచించి నిశ్చయమునకు వచ్చుట.
♦శ్రద్ద:- యనగా గురువునందు,శాస్త్రము నందు,ఆ శాస్త్రము చెప్పిన
విషయములందు దృఢ విశ్వాసము కలిగియుండుట.
4.ముముక్షుత్వము అనగా మోక్షము నందు ఆసక్తి
-శ్రీ అయ్యగారి సూర్య నాగేంద్ర కుమార్
--------------------------------------------------
ధర్మస్య జయోస్తు - ఆధర్మస్య నాశోస్తు
జయ జయ శంకర హర హర శంకర

ఏదో శాస్త్రానికి ఆ మాత్రం చాలు, ఫరవాలేదు

             మాటలు తరచూ మనం వినేవే. ఏదో ఒక సందర్భంలో రోజువారీ జీవితంలో మనం వినేవే. మరీ ముఖ్యంగా ఆధ్యాత్మిక వైదిక కార్యక్రమాలలో ఐతే ఒకసారి కన్నా ఎక్కువగా చాలా తఱచుగా, సునాయాసంగా సంకోచం లేకుండా విరివిగా వాడే మాటలు ఇవి. మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి మాటలు అడ్డంకి అనే చెప్పాలి, అతి దారుణమైనవి కూడా!

            తఱచుగా ఏదో వైదికి కార్యక్రమంలోనో, పూజల్లోనో, "అంతా అఖ్ఖర్లేదురా... శాస్త్రానికి ఏదో కొంచెం ఇలా చేసెయ్యండి, మిగిలింది ఫరవాలేదు తరవాత చూసుకోవచ్చు" అని చెప్పేవారే ఎక్కువ. తరవాత చూసుకోవడానికి ఏమీ ఉండదు, ఫరవాలేదు అని వదిలిపెట్టబడిన వైదిక కార్యక్రమం వల్ల మొత్తం కార్యం అసంపూర్ణమై వ్యతిరిక్త ఫలితాలు వచ్చినా, అసలు ఫలితాలు రాక ఇవ్వన్నీ వ్యర్థం అని ప్రచారం జరిగితే ఫరవాలేదని తరవాత చూసుకోవడానికి ఏమీ ఉండదు. మరి వాళ్ళు తెలిసి చెప్తారో లేక తెలియక చెప్తారో దేవుడికెఱుక.

            శాస్త్రంకోసం కొంచెం చెయ్యడమేమిటి? చేసినా ఫరవాలేదు అని అనడమేమిటి? అంటే శాస్త్రం చెప్పిన పద్ధతులు నియమాలు ఏదో మొక్కుబడిగా పాటించడమా?  శాస్త్రం కోసం కొంచెం సొంతంకోసం మొత్తమా?  మాటలు వాడేవారు వేద విహితమైన ధర్మాలను శాస్త్ర ప్రామాణాలను పాటించవలసిన అవసరం అంతగాలేదు అని చెప్తున్నారా అన్న అనుమానం వస్తుంది, బహుశా వాళ్ళ ఉద్దేశ్యం కూడా అదేనేమో!. ఆమాట అన్నవాళ్ళని కూడా నిలదీసి సరిఐన శాస్త్ర ప్రమాణమేమిటో తెలుసుకొని ఆచరించవలసిన అవసరం నేడు చాలా ఉంది.




ఆచార్యుడు - గురువు - ఉపాధ్యాయుడు

నమస్తే
శ్రీ గురుభ్యోన్నమః
శ్రీ గణేశాయనమః
మన సనాతన ధర్మంలో గురువు అన్న పదానికి కాని గురువు కి కాని భగవంతునితో
సమాన స్థానం.
ఈ సారి మన చర్చా విషయం "ఆచార్యుడు - గురువు - ఉపాధ్యాయుడు".
ఆచార్యుడు ఎవరు?
గురువు ఎవరు?
ఉపాధ్యాయుడు ఎవరు?
వీళ్ళంతా ఎన్ని రకాలు?
ఉపదేశం అంటే ఏమిటి?
దీక్ష ఎన్ని రకాలు?
.........మొదలైన వాటి గురించిన చర్చ జరగాలని సంకల్పించాం.
ఒక చిన్న విషయం
మా గురువుగారు ఒకసారి ఒక కథ చెప్పారు.  సమస్త సృష్ఠిలోని వారంతా కలిసి
గురువుని పూజించి సత్కరించాలని సంకల్పించి గురుపూజా మహోత్సవాలు
నిర్వహించారట. గురువు మటుక్కు తనలో తాను రమిస్తూ ఉండిపోయారట. ఆ పిమ్మట
అందరూ కలిసి "గురువు"కి ఒక బిరుదు ప్రధానంగా లేదా గురువు స్థాయిని పెంచే
విధంగా మరొక పేరు గురువుకి ఇవ్వ దలిచి ఆ గురువుని కొందరు బ్రహ్మతో సముడని
"బ్రహ్మా" అని పిలిచారట గురువు మటుక్కు తనలో తాను అలాగే రమిస్తూ
ఉండిపోయారట.మళ్ళీ వాళ్ళలో వాళ్ళకే ఈ పిలుపు గురువుకి సరిపోలేదని తలచి ఇంత
తక్కువ పేరు గురువుకా అని వాళ్ళలో వాళ్ళే ప్రశ్నించుకుని బ్రహ్మకన్నా
గొప్పవాడు గురువు అందుకు ఆయనని "విష్ణువు" అని పిలుద్దాం అని
నిర్ణయించారట. గురువు మటుక్కు తనలో తాను అలాగే రమిస్తూ ఉండిపోయారట. ఇంతలో
మళ్ళీ అందరిలో అలజడి విష్ణువు నామం మటుక్కే ఆయనకి సరిపోదు సర్వజ్ఙుడైన ఆ
మహేశ్వరుడే ఈయనకు సాటి అని "మహేశ్వరా" అని అన్నారట. ఐనా గురువులో మార్పు
లేదు.
ఇంత జరిగినా సృష్ఠి మొత్తానికీ సంతృప్తిగాలేదు. గురువుకి తగిన మర్యాద
చేయలేకపోయామనే బాధ తప్ప. ఇంతలో వారికి త్రిమూర్తుల వారి శక్తుల
అనుగ్రహంతో ఒక ప్రచోదనం జరిగింది అందరికీ ఒకేసారి. అందరూ కలిసి గట్టిగా
గురువుని "పరబ్రహ్మా" అని గట్టి గట్టిగా ఆనందంతో అన్నిలోకాలూ
దద్దరిల్లేటట్టు కీర్తించారట.
గురువు మాత్రం ప్రబ్రహ్మకన్నా వేరు కానివాడై తనలో తాను అలానే రమిస్తూ
అప్పటికీ ఇప్పటికీ గురువులానే ఉన్నారట. మీకూ నాకూ ప్రతి ఒక్కరికీ ఏదో ఒక
రూపంలో గురువుగా అనుగ్రహిస్తూనేఉన్నారు. అందుకే అప్పట్నుంచి ఇప్పటికీ
"గురుబ్రహ్మ....గురుర్విష్ణుః........గురుర్దేవో
మహేశ్వరః......గురుస్సాక్షాత్ పరబ్రహ్మ......తస్మై శ్రీ గురవే నమః"

(పై కథలో చెప్పిన గురువు అన్న మాట విస్తారమైన అర్థంతో గురువు అన్న పదవి
గురించి చెప్పినది కేవలం నవగ్రహాలలో గురువు లేదా బృహస్పతి గురించి
మాత్రమే కాదు)
!నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం!
మాగురువుగారి పాదాలకు శిరస్సు తాటించి నమస్కరిస్తూ

(సుచన:కేవల సనాతన ధర్మంలోని విషయాలు వేద విహితమైనవి మాత్రమే పొందు
పరచగలరు, అన్య సాంప్రదాయాలు మనకి అప్రస్తుతం)

మాయ

శ్రీ గురుభ్యోన్నమః శ్రీ గణేశాయ నమః అందరికీ నమస్సులు మాయ, మాటా గురించి ఇక్కడ చర్చ జరిగితే బాగుంటుంది. మాయా స్వరూపమేంటి? ఎలా కలుగుతుంది? ఎలా పోతుందు? ఉండడం వల్ల నష్టమేంటి? పోవడం వల్ల కలిగేదేమిటి? వగైరా వగైరాలు.. -సూర్య నాగేంద్ర కుమార్

ధర్మం

శ్రీ గురుభ్యోన్నమః
శ్రీ గణేశాయనమః
సత్సంగము కుటుంబీకులందరికీ నమస్కారం
 
"యతో అభ్యుదాయ నిశ్రేయ ససిద్ధిః స ధర్మః " ఏది అభ్యుదయ కారకమో ఏది మోక్ష సాధనమో లేదా మోక్షాన్ని సిద్ధింపజేయటంలో తోడ్పడుతుందో అదే ధర్మం.
అభ్యుదయం అంటే కేవల లౌకికం కాదు, నాకు లక్ష రూపాయలు వస్తున్నాయి కాబట్టి అది నాకు అభ్యుదయం అన్న వాదన అసంబద్ధం, అది మోక్ష కారకమైనదా అన్నది అవసరం.
ధర్మం అంటే తెలుసుకొని ఆచరించేది. మానవుడు లౌకిక పార లౌకిక వ్యాపారాలాను నిర్వర్తించడానికి వేదం చెప్పిన త్రోవలే ధర్మాలు. ఆ ధర్మాచరణమే మోక్షానికి దైవ సాక్షాత్కారానికి మార్గం.
ఒకే వ్యక్తికి ఒకే ధర్మం ఒకేలా అన్నివేళలా అన్ని దేశాలలో ఉంటుందన్నది సత్య దూరం
.
నేను నాగురువుల దగ్గర ఉన్నప్పుడు నేను పాటించాల్సింది శిష్య ధర్మం. అలాగే నా
తలి దండ్రుల దగ్గర పుత్ర ధర్మం, అదే సమయంలో నాపిల్లల దగ్గర నాది పితృ
ధర్మం. ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం ద్వాదశి నాడు పారణ ( త్వరగా భుజించడం) ధర్మం. అదే ఏకాదశి నాడు ఇక్కడ ఉంటే ఉపవాసం ధర్మం, కాశీలో ఉంటే అన్నపూర్ణ అనుగ్రహంగా ఉపవాసం ఉండకపోవడం ధర్మం. కొన్ని మాసాల్లో సముద్ర స్నానం నదీ స్నానం ధర్మం కొన్ని మాసాల్లో నిషిద్ధం. ఇలాగే చాలా మారుతూ ఉంటుంది.
అలాగే వర్ణాశ్రమాలలో కూడా, బ్రహ్మచారికి ఉన్న ధర్మం వేరు అదేబ్రహ్మచారి వివాహం
చేసుకుంటే పాటించాల్సిన గృహస్థ ధర్మాలు వేరు అలాగే సన్యాసికీ వానప్రస్తుకీ...
ధర్మం మారడం అంటే ఒకే వ్యక్తికి దేశ కాల అవస్థ వర్ణ ఆశ్రమాదులని బట్టి మార్పు
చెందుతుంది. అదే ఇద్దరు వ్యక్తులు ఒకే దేశ, కాల, ఆశ్రమ, వర్ణ, అవస్థాదులలో ఉంటే
ఇద్దరికీ ఒకే ధర్మం ఏ ఒక్కటి మారినా ధర్మం మారుతుంది.... స్థూలంగానీ
సూక్ష్మంగానో....
ధర్మ శాస్త్రాల వాఖ్యానాలు చదివి గురువుల వద్ద నేర్చుకొని అనుష్టించడమే ఉత్తమం.
అంతా కాకపోయినా కొంత మన ప్రస్తుత జీవన సరళికి కావల్సిన ధర్మ సూక్శ్మాలు
తెలుసుకొని ఆచరించడం శ్రేయస్కరం, మోక్ష ప్రదం.


నాకు ధర్మం తెలుసు ఏది చేయాలో ఎలా చేయాలో తెలుసు కాని చేయను అంటే అది నా ధర్మమును నిర్వర్తించడము కాదు నేను ధర్మాత్ముడను కాను. లేదా ధర్మ సూత్రములను నాకు ఇష్టం వచ్చినట్టు అన్వయించుకోవడం కూడా ధర్మాచరణము కాదు.
ధర్మం గురించి రాస్తూ ధర్మ పరాయణుడైన రాముని తలచుకోకుండా ఎలా ఉంటాం. రామాయణం అంతా ధర్మాచరణమే దానిని ధర్మాయణం అనచ్చేమో. ఇక అంత స్థాయిలోనివారు హరిశ్చంద్రుడు, భీష్ముడు, ధర్మ రాజు, ఆది శంకరులు మొదలైనవారు.

ధర్మం అనేమాట సనాతన ధర్మం లోనిదే దానికి ఇతర ఏ భాషలోనైనా పర్యాయ పదంలేదు. ఆంగ్లేయులే తత్సమాన పదం వారి భాషలోలేక వారు మాట్లాడేటప్పుడు వారి వాజ్ఙ్మయంలోనూ "Dharma" అనే వాడారు.
ఇక ధర్మాన్ని పట్టుకుంటే ఒరిగేది ఉత్తరదిశా ప్రయాణమే.. ధర్మాన్ని పట్టుకున్న
రాముడు ఉత్తర దిశగా పుష్పకం ఎక్కి ధర్మాన్ని పట్టుకున్న వారినందరినీ పుష్పకం
ఎక్కిమ్చుకున్నాడు, ఎంత మంది ఎక్కినా అందులో మరొకరికి స్థానం ఉంటుంది.
ధర్మాన్ని పట్టుకుంటే రాముని పుష్పకంలో ఎక్కగలం ఉత్తర దిశా ప్రయాణం చేయగలం ఎవరూ భేధించలేని మోక్ష సామ్రాజ్యాన్ని పొందగలం (అయోధ్య / కైలాసం). వదిలేస్తే రావణునితో కూడి దక్షిణాపథంలో ప్రయాణించి, పుట్టుక చావులమధ్య ఎంకా ఎన్నో దురవస్థలమధ్య తిరుగుతూనే ఉంటాం.
ధర్మో రక్షతి రక్షితః అంటే నీ ధర్మాన్ని నువ్వు ఆచరించటమే ధర్మ రక్షణం. గీతా
చార్యుడు కూడా ఇదే అంటాడు. స్వధర్మమే శ్రేయస్కరం పరధర్మం భయంకరమైనది.
బ్రహ్మచారి బ్రహ్మచారి ధర్మాన్ని పాటించాలి కాని గృహస్థు ధర్మాన్ని కాదు అలానే
గృహస్థు గృహస్థు ధర్మాన్ని అలా......... రాజ ధర్మాన్ని రాజు, సేవక ధర్మాన్ని
సేవకుడు అలా.... కాకుండా ఒకరి ధర్మాన్ని ఒకరు విస్మరించి ఇంకొకరి ధర్మాన్ని
అనుసరిస్తే కలిగే పరిస్థితి అతి గందరగోళం ( ప్రస్తుతం ఉన్న స్థితి అదేనేమో)