Pages

Wednesday, October 26, 2016

దీపావళి - దరిద్రమంటే కేవలం ధనం లేకపోవడం కాదు

శ్రీ గురుభ్యోనమః

జ్ఞాత్వా కర్మాణి కుర్వీత -  తెలిసి చేసినా తెలియక చేసినా పుణ్య కార్యానికి ఫలం ఉంటుంది, తెలిసి చేస్తే మరింత జాగురూకతతో చక్కగా చేయవచ్చు అని పరమాచార్య ఉద్భోధ.       దీపావళి పర్వదినం మూడు రోజులు పాటు ఆచరించాలి. నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, బలి పాడ్యమి. మూడు రోజులూ తెల్లవారు ఝాముననే తైలాభ్యంగన స్నానం చేసి కులదేవతారాధనం చేసి, యమధర్మరాజుని పితృదేవతలను, ఇష్టదేవతల స్మరించి పూజించడం భగవదనుగ్రహానికి మార్గం. దరిద్రనివారణకు దీపావళి త్రిరాత్ర ఉత్సవం చక్కని మార్గం.

        దరిద్రమంటే కేవలం ధనం లేకపోవడం కాదు. ధర్మమును, సంప్రదాయమును వదిలి ఉన్నదానితో తృప్తిలేకుండ ఉండడమే దరిద్ర్రం. పైకి ధనం లేనట్టు కనబడ్డా ధర్మిష్టి అయ్యి వేద ధర్మాన్నిఆచరించి నిత్యతృప్తుడని కొనియాడబడిన కుచేలుడు స్వయంగా పరబ్రహ్మముచే పూజలందుకున్నవాడు దరిద్రుడు కాదు కానే కాదు పరమ ఐశ్వర్యాన్ని పొందినవాడు.

      అన్నీ ఉన్నా ధర్మదూరులై, నిత్యం కోరికలతో రగిలి, పెద్దల వాక్కులను, ధర్మాన్ని, ఆచారాన్ని, సంప్రదాయాన్ని, కుల దేవతను, స్వధర్మాన్ని, వదిలి ప్రవర్తించి, అనాచారాన్ని ప్రవర్తింపచేసిన రావణాది రాక్షసులు, కంసకౌరవాదుల వలె పైకి ఐశ్వర్యపరులుగా కనపడ్డా వారే అసలైన దరిద్రం అనుభవించినవారు.

      భగవదనుగ్రహాన్ని అపేక్షించడం, ధర్మ మార్గావలంబనం, కులదేవతారాధనం, స్వధర్మపాలనం, ఆచారసంప్రదాయాలను పాటించడం గురుపాద సేవనం ఇవే ఐశ్వర్యం, తద్వ్యతిరిక్తమే దారిద్ర్యం.

        అందరూ దీపావళి పండుగను చక్కగా అందంగా ఆనందంగా ప్రమాదరహితంగా జరుపుకోవాలని కోరుకుంటూ, పోయిన సంవత్సరం పంచుకున్న దానికి కొద్ది మార్పులతో.. దీపావళిగూర్చి చిన్న వివరాన్ని రోజు చేయవలసిన విధులు అందరికీ ఉపయోగపడతాయని పెద్దలు గురువులు చెప్పినది సంకలనం చేసి పొందుపరిచాను.

        "ప్రాతః స్నానంతు యఃకుర్యాత్ యమలోకం నపశ్యతి" - విధిగా నిత్యమూ వేకువ ఝామునే స్నానం చేసినవానికి యమలోక దర్శనముండదని చెప్తారు పెద్దలు. స్నానం యొక్కపవిత్రత అది. ఎప్పుడోఅప్పుడు ఎలాగో అలాగ ఒళ్ళుకడుక్కోవడం స్నానం కాదు నియమంగా నియమిత వేళలో, నియమిత విధిలో స్నానం చేయాలి అది బాహ్యాంతరశ్శుచిని వృద్ధినికలిగిస్తుంది.

ఆశ్వయుజ బహుళ చతుర్దశ్యాం సూర్యోదయాత్పురా
యామినీ పశ్చిమే భాగే తైలాభ్యంగో విధీయతే

      నరక చతుర్దశినాడు సూర్యోదయాత్ పూర్వం నువ్వులనూనెతో తైలాభ్యంగన స్నానమాచరించాలి. దీనివలన కలిగే ఫలితం కేవలం ఋష్యాదులు మాత్రమే దర్శించగలరు దానిఫలితం ఇంత అని మానవ మాత్రులు దర్శించలేరు. యతులతో సహా అందరూ ఇలాగే రోజు స్నానం చేయాలని శాస్త్రవాక్కు.

అలానే దీపావళినాడు నూనెతో తైలాభ్యంగన స్నానమాచరించాలి
తైలే లక్ష్మీ ర్జలే గంగా దీపావళి తిథౌ వసేత్
అలక్ష్మీపరిహారార్థం తైలాభ్యంగో విధీయతే


      దీపావళినాడు సూర్యోదయాత్ పూర్వం రాత్రి చివరి ఝాములో లేదా సోర్యోదయానికి 4ఘడియల ముందుగా (అంటే కనీసం 4-4:30 మధ్యకాలం అనుక్కోండి) నువ్వుల నూనె తోతలంటుకుని స్నానం చేయాలి. దీపావళినాడు సమయంలో ఎక్కడెక్కడున్న నువ్వులనూనెలోనూ లక్ష్మీదేవి, అలాగే అన్ని నీటి స్థానాలలోనూ గంగాదేవి నివసించి ఉంటారు. కనుక ఈసమయంలో నువ్వులనూనె వంటికి రాసుకుని, తలంటుకొని స్నానం చేసినవారికి అలక్ష్మి పరిహరింపబడుతుంది. అలాగే గంగా స్నాన ఫలితం దక్కుతుంది. స్నానం చేసేటప్పుడుపైశ్లోకాన్ని ఒక్కసారి పఠించి నమస్కరించి స్నానం చేయడం మంచిది.  అలాగే ఇలా సూర్యోదయానికి ముందు అరుణోదయ సమయంలో (అంటే సూర్యోదయానికి 4 ఘడియల పూర్వంరమారమి 4-4:30 మధ్యలో) ప్రకారం స్నానం చేసినవారికి యమ లోకము కనపడదు.

అపామార్గం మథౌతుంబీం ప్రపున్నాట మథాపరం
భ్రామయేత్ స్నానమధ్యేతు నారకస్య క్షయాయవై

      స్నానం మధ్యలో ఉత్తరేణి, ఆనప లేదా ప్రపున్నాట మొక్కను తల చుట్టూ మూడు సార్లు తిప్పుతూ స్నానం చేయాలి. అలాచేస్తే నరక ప్రాప్తి లేదు. అకాల మృత్యువు రాదు అనిశాస్త్రం పెద్దల వాక్కు. ఉత్తరేణి లేదా అపామార్గ చాలా విరివిగా దొరుకుతుంది. లేకపోయినా ఆనప, ప్రపున్నాట మొక్కలను వాడవచ్చు. ఇలా స్నాన మధ్యంలో మొక్కలను తల చుట్టూతిప్పుతూ ఉన్నప్పుడూ క్రింది ప్రార్థనా శ్లోకం / మంత్రం చెప్పుకోవాలి

శీతలోష్ఠ సమాయుక్త సకంటక దళాన్విత
హరపాప మపామార్గ భ్రామ్యమాణః పునః పునః

       తా: దున్నిన మట్టి పెళ్ళలతో కలిసినది, ముళ్ళతో ఉండే ఆకులు గలదీ అగు అపామార్గమా! నిన్ను నాచుట్టూ తిప్పుతున్నాను. మళ్ళీ మళ్ళీ తిప్పడం వల్ల నువ్వు నాపాపాన్నిహరించు అని చెప్తూ చేయాలి.

        ఒకవేళ అటువంటి అవకాశం లేకపోతే దక్షిణానికి నిర్భయంగా తిరిగి యమునికి మూడు సార్లు నమస్కరించమని పెద్దలు చెప్తారు. తరవాత నిత్యవిధులైన సంధ్యాదులు అయ్యింతరవాతయమధర్మరాజుగారికి నమస్కరిస్తూఈ క్రింది శ్లోకం చెప్పి మూడు మార్లు తర్పణం ఇవ్వాలి

యమాయ ధర్మరాజాయ మృత్యవేచాంతకాయచ
వైవస్వతాయ కాలాయ  సర్వభూత క్షయాయచ!
ఔదుంబరాయ  ధర్మాయ నీలాయ పరమేష్ఠినే
మహోదరాయ చిత్రాయ చిత్రగుప్తాయతే నమః!!
యమం తర్పయామి! యమం తర్పయామి !యమం తర్పయామి !
(అని నువ్వులతో మూడు మార్లు తర్పణలు వదలాలి.)

      యమధర్మరాజుగార్కి పితృత్వం దైవత్వం రెండూ ఉన్నాయి దక్షిణాభిముఖంగా నిర్భయంగా తిరిగి ప్రాచీనావీతిగానూ, నివీతిగానూ తర్పణం ఇవ్వవచ్చు. తల్లి దండ్రులున్నవారుమాత్రం నివీతిగానే చేయాలి అని పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారి వాక్కు.

మాషపత్రస్య శాకేన భుక్త్వాతత్ర దినే నరః
ప్రేతాఖ్యాయాంచతుర్దశ్యాం సర్వపాపైః ప్రముచ్యతే.

      ఈనాడు తప్పకుండా మినప ఆకు కూర తినాలి. (మినపాకు ఎక్కడ దొరుకుతుందీ అన్న సందేహం వద్దు, మినుములు నానేసుకొంటే మొలకలొస్తాయిగా (అదే స్ప్రౌట్స్) వాటినేకొద్దిగా కూర లాగ చేసుకుని తినవచ్చు .. )

సాయంకాలం ఇళ్ళలోనూ, గుళ్ళలోనూ అన్ని ప్రదేశాలలోనూ దీపాలు పెట్టాలి. నువ్వులనూనెతో పెట్టమని శాస్త్రం. దీపదానం చేయటం కూడా కద్దు. ఇక్కడ్నుంచి కార్తీకమాసమంతా దీపదానం, దీపతోరణాలు, ఆకాశ దీపోత్సవాలే.

      దీపావళి సాయంత్రం దక్షిణం వైపు తిరిగి పితృదేవతలకి మార్గం చూపడానికి మగపిల్లలు దివిటీలను (ఉల్కాదానం) చూపాలి,  తరవాత కాళ్ళూ చేతులూ కడుక్కుని ఏదైనా మధురపదార్థం తినాలి. దివిటీలను గోగు కర్ర, చెఱకు గడ, బొబ్బాస ఆకు, ఆముదం ఆకు, గోంగూర చెట్టు వంటి వాటికి కట్టి వెలిగిస్తారు.

      ముఖ్యంగా దీపావళి లక్ష్మీ పూజకి ప్రసిద్ధి ముందురోజైన నరక చతుర్దశి నుండి బలి పాడ్యమి వరకు బలి చక్రవర్తి భూమిమీదకు వచ్చి తన అధికారం చేసేటట్లు, రోజుల్లో లక్ష్మీపూజ చేసేవారి ఇంట లక్ష్మి సుస్థిర నివాసం ఏర్పరచుకునేటట్లు వరం కోరుకున్నాడు కాబట్టి మూడు రోజులు లక్ష్మీ పూజతో పాటు భగవత్సంకీర్తనం జాగరణం చేసే ఆచారం ఉంది.

        దీపావళినాడు దీపంలోనే లక్ష్మీదేవిని ఆవాహనం చేసి పూజించాలి. అలక్ష్మిని పంపేయటానికి ఢక్కాలు వాయించడం, దివిటీలు వెలిగించడం, టపాసులు పేల్చి చప్పుడు చేయడం,ఆచారమైంది. దీనినే అలక్ష్మీ నిస్సరణం అంటారు. ముఖ్యంగా అర్థరాత్రి స్త్రీలు కార్యం నిర్వహించవలసి ఉంటుంది. ఇంతకు ముందు ఋతువులో పుట్టిన క్రిమి కీటకాదులు దేవతాహ్వానం చేయబడిన దీపాదులు బాణాసంచాదులలో పడి జన్మ నుండి విముక్తిని పొందుతాయిఉత్తరజన్మలకు వెళతాయి. అంతే కాని లేని పోని ఆడంబరాలు లేక వాతావరణ కాలుష్యం కోసం కాదు. ఇంత గొప్ప సాంప్రదాయం మనది.

మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.

4 comments:

 1. మీరు మరీనూ .. షాంపూలుండగా, ఇంకా పాతకాలంలా, నువ్వుల నూనె అంటారేంటండి .. మీరుకూడా కొంచం లేటెస్టుగా తయ్యారావ్వాలి ..

  సరే, ఏదో మీరు చెప్పారు కదా, ఈ సారికి అలా చేయ్యడానికి ప్రయత్నిస్తాను .. అదిగో, పొద్దున్నే లేవాలి అంటే కుదరదు.. ఎప్పుడు లేస్తే అప్పుడు (వీలైతే) చేస్తాను .. వాకే!!!

  ReplyDelete
  Replies
  1. స్వాగతం...
   హహ్హహ్హ... మీరసలే చక్రవర్తులు... మీరేం చెప్తే అదే.. కొన్ని రోజులు పోయాక... ఉప్పుందా బొగ్గుందా టూత్ పేస్ట్ లాగా ఇవి ఉన్న షాంపువ్వులు వస్తాయేమో.. చూద్దాం...

   Delete

 2. మరీ 'యమ' దీపావళి :)

  శుభాకాంక్షలతో

  జిలేబి

  ReplyDelete