శ్రీ గురుభ్యోనమః
నమస్తే
"అర్థం భార్యా మనుషస్య - భార్యా శ్రేష్ఠ తమ సఖాః
భార్యా మూలం త్రి వర్గస్య - భార్యామూలం తరిష్యతః"
సనాతన ధర్మంలో పురుషుని జీవితంలో భార్య అర్థ భాగం. సహజీవనంలో, సంతానపాలనంలో, సంసార యాత్రలో అన్నిటా సగభాగం భార్య. అందుకే ఆమె అర్థాంగి. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులే అర్థనారీశ్వరతత్త్వంతో స్త్రీ పురుషుల స్థితిని లోకానికి చాటుతున్నారు. ప్రతి పురుషునికీ జీవితంలో అందరినీ మిమ్చిన స్నేహితురాలు భార్య. భగవంతుడిచ్చిన ఒక జీవిత కాలపు 'నెచ్చెలి'. ధర్మ, అర్థ, కామములనే పురుషార్థముల సమన్వయాన్ని సాధించి నాలుగవ పురుషార్థమైన మోక్షాన్ని పొందటానికి మూలం భార్య. ఆమె మూలంగానే పురుషుడు తరిస్తాడు, ఆమే! అంతే వినయంగా అతనిననుసరిస్తుంది. అదీ సనాతన ధర్మంలో భార్యా భర్తల సంబంధం. స్త్రీకున్న గొప్పదనం. సనాతన ధర్మంలో స్త్రీపురుషుల మధ్య పవిత్ర ధర్మ బంధం 'వివాహం' తప్ప అన్యస్తులలా కేవల ఆడమగ సంబంధంకాదు, ఆ సంబంధాన్ని కేవలం చట్టబద్ధం చేయడమూకాదు.
"స్త్రీ యాంతు రోచమానాయాం - సర్వమ్ తద్రోచతే కులమ్"
ఎక్కడ స్త్రీ సంతోషముతో ఉంటుందో ఆ వంశము ఆనందంగా ఉంటుంది.
"సదా ప్రహృష్టయా భావ్యం... గృహ కార్యేషు దక్షయా"
ఇంటిలో సదా ఆనందంగా ఉంటూ, అందరినీ ఉల్లాస పరుస్తూ, ప్రహృష్టమైన వదనంతో ఇంటిల్లిపాదినీ చక్కగా చూసుకునే పెద్దదిక్కు (వయసులో చిన్నైనా) ఆయింటి యింతి. గృహ నిర్వహణలో ఎవరికేమి కావాలో, ఏది ఎవరికి ఎలా సమకూర్చాలో దక్షతతో నిర్వహించగలిగేది స్త్రీ మాత్రమే.
పెళ్ళినాటి మంత్రాలలో కూడా, నేను సంపాదించినది తీసుకువచ్చి నీకిస్తాను, ధనాన్ని ఖర్చు చేయటంలోనూ వృద్ధి చేయటంలోనూ సంపూర్ణ అధికారం నీకిస్తున్నాను. నీవే ఈ గృహానికి యజమానివి. గృహ నిర్వహణలో నీదే ప్రధానమైన స్థాయి, కుటుంబ వ్యవహారంలో శిష్ఠాచారమును నెరపి కుటుంబ పోషణము, రక్షణ చేయడానికి పూర్తి అధికారము నీకే ఇస్తున్నాను. అని భర్త తన భార్యతో అంటాడు.
అంతెందుకు, ధర్మ సూత్రాలలో కూడా, పెళ్ళిళ్ళు, లేదా ఇతర ఏ వైదిక సంస్కారాదులలోనైనా ధర్మ సూత్రాలలో చెప్పనిది ఏదైనా ఉంటే, కులస్త్రీలనాశ్రయించడం ద్వారా శాస్త్రములందు చెప్పబడని శిష్ఠాచారములను తెలుసుకొని ఆచరించమని చెప్పబడింది. ధర్మ శాస్త్రాలలో ఏదేని ఆచారము తెలియకపోతే తెలుసుకోవలసినది ఆ ఇంటిలేదా కుటుంబములోని శిష్ఠాచారులైన స్త్రీల వల్లనే. అంత పెద్ద పీట స్త్రీలకు నా ధర్మం ఇచ్చింది.
నెలకి మూడు వానలు కురవాల్సినవి ధర్మ లోపం వల్ల కురవకపోయినా, అప్పుడో ఇప్పుడో ఇంకా కురుస్తున్నవి మాత్రం ఎక్కువపాళ్ళు ఖచ్చితంగా ఈ గడ్డమీది 'స్త్రీ' నడవడివల్ల మాత్రమే!
సనాతన ధర్మంలో 'స్త్రీ' వైభవం .... సశేషం..
No comments:
Post a Comment