Pages

Tuesday, February 5, 2013

కాశీలో ఏం వదలాలి...?

సూరి నాగమ్మ గారి 'నా రమణాశ్రమ జీవితం' నుంచి...

రమణుల దేహం అరుణగిరి పాదాల వద్ద వదిలివేయబడిన తరవాత కొన్ని రోజులకు రమణుల పెద్దకూతురుగా పేరొందిన సూరి నాగమ్మగారు అన్నా వదినెలతో కాశీ గయాది ఉత్తరభారత యాత్రకి వెళ్లారు. సూరి నాగమ్మగారి వదినగారికి కాశీ వెళ్ళాక కాస్త అస్వస్తత చెందగా వారు మునుపనుక్కున్నట్టుగా కాక యాత్రలో కొన్ని ప్రదేశాలను తగ్గించడం జరిగింది. సూరి నాగమ్మగారు కాశీ విశ్వనాథ సేవనం గంగాస్నానం చేస్తూ తొమ్మిది రోజులూ కాశీలో గడిపారు. హృషీకేశం ప్రయాణం విరమించి గయకి వెళ్ళి అక్కడ పితృకార్యాలు చేయాలని నిశ్చయించి అందరూ గయ చేరారు. వారితో కాశీలో ఉండే తెలుగు పురోహితుడు కూడా బయలుదేరారు. సరే అందరూ కలిసి వట వృక్షం కింద ఉన్న విష్ణు పాదాలమీద పితృకార్యానికి సంబంధించి అన్ని కర్మ కాండలూ చేస్తున్నారు. సూరి నాగమ్మగారు మౌనంగా చూస్తున్నారు. అక్కడే, వచ్చిన వారు ఆకు, కూర, పండు వదులుతారు, పండాలు సూరి నాగమ్మ గారి అన్నని వదిననీ చూసి మీ ఇద్దరూ మాట్లాడుకుని మీరేమి వదులుతారో చెప్పండి అని చెప్పి, సూరి నాగమ్మగారిని కూడా చూసి అమ్మా మీరేమి వదులుతారు? అని అడిగారట. వారిని చూసి అమ్మగారు ఇక్కడ ఏమూడూ వదలాలి అని తిరిగి అడగగా.. వారు 'ఈషణత్రయం' అని సమాధానమిచ్చారు. ఈలోగా అక్కడికి యాత్రకై వచ్చిన ఇతర తెలుగువారు ఈషణత్రయం అంటే ఏమిటి అని అడుగగా కాశీ నుంచి తోడు వచ్చిన పురోహితుడు దారైషణ, ధనైషణ, పుత్రైషణ అని చెప్పి, అందరూ ఇవి వదలలేరు కనుక ప్రతిగా ఆకు, కూర, పండు వదులుతారు అని పలికారు. (బహుశా అలా తినే వస్తువులను వదలగా వదలగా మనసు సంస్కరింపబడి కాస్త వైరాగ్యం పాలు పెరుగుతుందనేమో).

సూరి నాగమ్మగారు విష్ణుపాదాలకి నమస్కరిస్తూ ' అయ్యా నేను ఆ ఈషణత్రయాన్ని వదులుతున్నాను అని గట్టిగా చెప్పలేనేమో కానీ, అవి నన్ను పట్టుకోకుండా వదిలేటట్లు అనుగ్రహించమని మనసారా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను' అని అన్నారు.


దారైషణ= భార్య/భర్త మీద మోహం
ధనైషణ= ధనం ఐశ్వర్యం మీద మోహం
పుత్రైషణ= సంతానం మీద మోహం

కాశీలో వదలవలసినవి ఈ మూడూ. అవి మూడూ వదిలి విరాగిగా మారు వరకు అభ్యాసంగా ఇతర ఇష్టమైన పదార్థములు వదులుతూ ఉంటారు.

ఆ అమ్మకి శాస్త్రవాక్కు ఉన్న నమ్మకం, గురు భక్తి, దైవచింతన, అణువంతైనా నాయందు కలగాలని దీవించమని ఆయమ్మకే నమస్కరిస్తూ...

మీ

~~~~~~~~~~~~~~~~~~~~~~
ధర్మస్య జయోస్తు - అధర్మస్యనాశోస్తు
जय जय शंकर हर हर शंकर

1 comment:

  1. eppatinuncho.. unna sandeham.. ippadaiki mivalla.. tirindi.

    thank you andi

    ReplyDelete