Pages

Tuesday, September 10, 2013

ఎన్ని కిలోల లడ్డూ తెద్దాం??????

ఎన్ని కిలోల లడ్డూ తెద్దాం?

పోయినేడాదే మేం కొత్త ఫ్లాట్లోకి మారాం. పోయినేడాది వినాయక చవితికి ఇంకా అరడజను ఫ్లాట్లవాళ్ళుకూడా నివాసానికి రాలేదు ఈసారికి మొత్తం అన్ని ఫ్లాట్ల కుటుంబాలూ కాపురముంటున్నాయి మా ఫ్లాట్స్లో. సరే మొన్న శుక్రవారం అందరం కలిసి సామూహికంగా వినాయక ప్రతిష్ట జరిపి ఈ నవరాత్రులు వినాయక ఉత్సవం చేద్దామని తీర్మానించారు. భగవద్కార్యం అందునా రోజూ ప్రదోష వేళ పాల్గొనే అవకాశం కలిసొచ్చిందని ఆనంద పడ్డాను. ఇక ఔత్సాహికులు ఒక పెద్ద వినాయక మూర్తిని కావలిన హంగులు వగైరా వగైరా తెచ్చారు మధ్యాహ్నానికి అంతా సిద్ధం. అన్ని ఏర్పాట్లు ఒకసారి చూడండి అని అడగడం మూలానూ, మా ఫ్లాట్స్లో మేమందరం ఒక ఇంటివారిలా జరుపు కుంటున్న కార్య క్రమంమూలాన సాయంత్రం కిందకి వెళ్ళి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని చూద్దామని వెళ్ళాను. పత్రి అన్న పేర ఒక రొట్ట ఏదో ఏ ఆకులున్నాయో తెలియని రొట్టలు కొన్ని కట్టలు తెచ్చారు. ’అయ్యో ఇవన్నీ ఎందుకండీ? అంటే ’పత్రి అంటే అన్ని ఆకులూ గద్సార్! అని ’వాళ్ళవే ఇస్తున్నారు కదా!’ అని చెప్పారు. సరేలే అనుక్కుని నేను కూర్చుని 21 నామాలకి గానూ ముందుగా పనికివచ్చే పత్రాలను విడదీసి నామాల వరుసక్రమంలో ఉంచి ఏ పత్రాలు లేవో అక్కడ గరిక బిల్వాది ఇతరదళాలు ఉంచి కొన్ని అక్షతలు కలిపి సిద్ధం చేసి వరుసగా పేర్చి ఆ బ్రహ్మగారిగా వ్యవహరిస్తున్నాయనకి, పీటల మీద కూర్చున్న దంపతులకి వరుస క్రమం చూపి ఇక స్నానం చేసి సాయం సంధ్య తరవాత పొద్దున్న కుదర్లేదని గణపతికి చతుర్వార తర్పణం చేసుకోవడానికి వెళ్దామని లేచాను.

ఇంతలో ఫ్లాట్స్లో ఒకాయన ’సార్! 3-4 కిలోల లడ్డూ తెప్పిద్దామా సార్ గణేశునికి’ అన్నాడు. నేను యథాలాపంగా ’ఎందుకండీ? ఎలాగూ ఇవ్వాళ ముందనుక్కున్నట్లు ఉండ్రాళ్ళు, పులిహోర ప్రసాదం మా యింట్లోంచి వస్తాయి కదా! రేపెప్పుడో చూద్దాం ఆ లడ్డూ ఎవరు చేస్తారో’ అన్నాను. ఆయన ’అదికాద్సార్ అందరూ వేల వేల కిలోల లడ్డు పెడ్తున్నారు, మనం కనీసం ఓ నాలుగు కిలోల లడ్డూ పెట్టద్దా?’ అని కాస్త అసహనంగా గదమాయిస్తున్నట్లు అడిగారు. అప్పుడర్థమయ్యింది నాకు ’ఓహ్ అదా! అవును వాళ్ళెవరో పెడుతున్నారట మంచిదే. కానీ అన్ని రోజులు చేతిలో అన్ని వేల కిలోల లడ్డూ పెట్టేది ఆయన తినడానికా లేక మనం తినడానికా’ అన్నాను దాంతో కొంచెం సీరియస్గా ’ఏంట్సార్! వాళ్లేమన్నా బచ్చాలా వాళ్ళకు తెలీదా పిచ్చోళ్ళా అందరు పెడ్తున్నారు కదా మీరట్లాంటారేంటి? అని గట్టిగా అడిగారు. అసలే వివాదానికి దూరంగా ఉండే మనస్తత్వమేమో ఒక క్షణం ఆగాను, కానీ తప్పుని తప్పు అని చెప్పటానికి భయమెందుకని ముందు నేను చెప్పేది వినాలంటే ముందు తనని గట్టిగా ఖండించాలి అందుకు ’అవును వాళ్ళకి తెలీదు కాబట్టే పెడుతున్నారు, మీరోపని చేయండి మీ కంచంలో నిండా అన్నం పెట్టుకుని ఈ నాలుగు రోజులూ తిరుగుతూ కూర్చోండి’ అన్నాను ’అదేంద్సార్? అన్నాడు వెంటనే. అంటూ ’మరి మేం కిలో లడ్డూ తెచ్చాంగా ఏం చేయాలి’ అన్నారు. మీరు ఈ పని చేయకముందు అడగాలి పని చేసాక సర్వం జగన్నాధం! గణపతి కాళ్ళు పట్టుకుని తప్పైతే క్షమించమని అడగాలి తప్ప ఎవరైనా ఏం చెప్పగలరు చెప్పినా వినాలని ఉండాలి కదా అన్నాను. సరే మీరే ఏదైనా చేయండి తెచ్చాం గదా అన్నాడు. అదిగో అలంకారం కోసం తెచ్చిన 7 అడుగుల మూర్తి చేతిలో పెట్టండి వ్రతం, పూజాధికాలు క్రింద ముందు వేపుకు పెట్టబడి ఉన్న ఒక్క అడుగు మట్టి గణపతి స్వామికి చేద్దాం. మీ అలంకారాలన్నీ పెద్ద మూర్తికి చేయండి అని చెప్పాను. సరే అని కవరు తో సహా లడ్డూని స్వామి వారి చేతిలో పెట్టారు. ’అయ్యా మరి స్వామి వారు ఎలా తింటారు కవరుతో ఇస్తే కనీసం వారి దృష్టిఐనా పడాలా అదీ వద్దా’ అన్నాను, ఆయన బిక్క మొహం వేసుకొని ’సార్ తెలీదు చెప్పండి ఏం చేయాలో’ అన్నారు. ’అయ్యో అలా కాదండీ  పర్వదినం జరుపుకునేది ఆనందం పెల్లుబికి బయల్పడడానికి అది స్వామిపై భక్తిగామారడానికే, మీరు ఆనందంతో మా స్వామికి కనీసం కిలో లడ్డూ ఐనా పెట్టాలని స్వీట్ షాపులన్నీ తిరిగుంటారు భగవంతుడికి అదే మీరిచ్చిన నివేదన కానీ ఇలాంటివి ఇకపై చేయకండి కావాలంటే ప్రతి రోజూ ఒక్కోరింట్లో లడ్డూలు చేయించి నివేదన చేద్దాం అందరూ స్వామి వారికి పాచి లడ్డూలు, నిలువ ఉంచిన లడ్డూలు పెడితే మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్ లడ్డూలు నివేదన చేద్దాం’ అన్నాను. ’అవునండీ బాగా అన్నారు మరు ఏటి నుండి ఇంకా చక్కగా ముందునుంచే ఇవన్నీ ప్లాన్ చేద్దాం’ అని ఆయన ఇతరులు అన్నారు. నేనూ ’అలాగేనండీ’ అంటూ ఇంట్లోకి అనుష్ఠానానికి వెళ్ళా..
……………………

నైవేద్యానికి ఏం పనికొస్తుందో ఏది పనికిరాదో తెలీదు, చెప్పవలసిన అగత్యమున్న బ్రహ్మస్థానంలో ఉన్నవారు చెప్పరు. అప్పటికప్పుడు వండిన పదార్థాలు నిలువలేనివి, పాచికానివి, ఇతఃపూర్వం తినబడనివి, (వ్రతకల్పంలో చెప్పారు ఏయే పదార్థాలు నైవేద్యంలో పెట్టాలో) నైవేద్యం పెట్టాలి. లేదుపో ఇన్ని వేల కిలోల లడ్లు ఎందుకు అంటే చివర్న వేలం వేయటానికి లేదా మనం తినటానికి. దానికి మరి గణపతి చేతిలో పనిష్మెంట్లా అంతంత బరువు లడ్లు అన్ని రోజులెందుకు? చిన్నప్పుడు స్కూల్లో గోడ కుర్చీ వేయించి తొడలమీద కర్ర పెట్టేవారు అది పడకుండా చూసుకోవాలి పడితే మాష్టారు చేతిలో దెబ్బలు. అలా ఆ మహా గణపతి ఏం పాపం చేసాడని అన్నేసి కిలోల లడ్లు క్రేన్ల సహాయంతో చేతిలో పెట్టడం...

ఒక సారి ఊహించండి స్వామే అక్కడ ఉన్నవాడున్నట్లుగా ప్రత్యక్షమైతే ఆయన స్పందనఏమిటీ అని? అంతెందుకు మన ఇంట్లోనే అన్నం వడ్డించడానికి తోలుబొమ్మలాటలో తాళ్ళు కట్టించి ఆడించినట్లు గరిటెలు, గిన్నెలు, కంచాలు తాళ్ళకి కట్టి మనకి ఎవరైనా వడ్డిస్తే ఏమంటాం? ఏం చేస్తాం? " పిచ్చా వెర్రా! ఏం చేస్తున్నావ్? అన్నం వడ్డించడం ఇలానా? బుర్రుండే చేస్తున్నావా?" అని గయ్య్ మని అడగమూ?

స్వామికి పూజ మనం చేస్తున్నామా? అసలు చేయగలమా? లేక స్వామే మన పూజ స్వీకరిస్తున్నాడా? అన్న విషయం అందరం ఆలోచించుకోవాలి.. 

6 comments:

  1. ఏమోనండీ !

    ఆ మిటాయి పొట్లం - లడ్డు అంగళ్ళ వారి జిలేబి వారి బిజినెస్స్ తగ్గి పోతుందే మో నండి అందరూ 'దేవుడి' గురించి ఆలోచిస్తే !జేకే !

    బాగా చెప్పారు !

    ReplyDelete
    Replies
    1. నమస్తే అండీ! మీ జిలేబీ మార్కు కామెంటుకి ధన్యవాదాలు

      Delete
  2. పాత రోజుల్లో చెప్పనే చెప్పారు. చిత్తం శివుడిపైన భక్తి చెప్పుల పైన అని.. వీరంతా అదే రకం..

    ReplyDelete
    Replies
    1. అవునవును చక్రవర్తిగారూ!

      Delete