Pages

Wednesday, February 13, 2013

సత్యనారయణుడెవ్వరు?

 శ్రీ గురుభ్యోనమః

మనం శుభకార్యం చేసుకున్నా శ్రీ రమా సహిత సత్యనారాయణస్వామి వారి వ్రతం చేయడం ఒక ఆచారం/సాంప్రదాయంగా వస్తున్నది. గృహా ప్రవేశమైనా, పెళ్ళైనా, పిల్ల బాలసారె ఐనా ఒక మంచి జరిగినా వ్రతం చేసుకుంటాం. లేదా ఏదైనా కష్టాలలో ఉంటే తొలగిపోవటానికీ సత్యవ్రతం చేస్తుంటాం.

మనకు పురాణేతిహాసాదులలో నారాయణుని గూర్చిన గాథలు ప్రస్తావనలు ఉన్నవి, కానీ సత్యనారాయణస్వామి గూర్చి ఉన్నది స్కాందంలోని రేవాఖండంలోనే (ముఖ్యంగా). సత్యనారాయణుడెవ్వరు ఇతర చోట్ల చెప్పబడిన నారాయణుడీతడేనా? ఏదేమైనా మనం ప్రతి కార్యంలోనూ సత్య నారాయణ వ్రతం ఎందుకు అనుసంధానిస్తాం?

నారాయణ అంటే సర్వమునకూ విశ్రాంతి స్థానం అని అర్థం ఉన్నది. అంటే సమస్త లోకములు చివరకు దేని యందు లయమైపోతున్నాయో నిత్య వస్తువు పేరు నారాయణ. నారాయణయే సత్యము మిగతాది అసత్యము. ఎందుకంటే ఏది నిత్యంగా ఉండటంలేదు ఇవ్వాళున్నది రేపులేదు, ఈక్షణం ఉన్నది మరుక్షణం లేదు అంతా మారిపోతూ ఉన్నది మాయమైపోతూ ఉన్నది. ఇదంతా కలిసి ఎక్కడ లయమౌతున్నవో ఏది అన్నిటినీ తనలో కలుపుకుని సత్యవస్తువుగా ఉన్నదో అదే సత్యనారాయణ స్వరూపం. స్వరూపం ఏమి చేస్తున్నది, తనలో తాను రమిస్తున్నది. సర్వమూ తనలో రమిస్తున్నది.  రమించట పరబ్రహ్మముయొక్క శక్తిగాన రమా సహిత అని చెప్పబడింది.

సరే మరి వ్రతం ఎందుకు చేసుకుంటాం అంటే.. ఉదాహరణకిస్వామీ! మా ఇంట్లో పిల్లలు పుట్టారు బాలసారె చేస్కున్నాం కొత్తది వచ్చింది మార్పు జరిగింది. కానీ స్వామీ సత్యమైన నీపాదాలు మరవలేదు నీకు ఏమార్పూలేక నిత్యుడవైనా నీ కారణమువల్లనే అసత్తు అంతా మారుతున్నది. మాకొకసారి సుఖభావనను దుఃఖభావనను ఇస్తున్నది. స్వామీ జగత్భావనలలో ఉన్నా.. నీవే సత్యం నిత్యం అని నమ్ముతున్నాము, మాకు మేము పరాకు చెప్పుకుంటున్నాముఅని స్వామికి విన్నవించుకుంటాము.

అదే ఒక బాధ కలిగిందనుక్కోండి, ఒక వ్యక్తి వెళ్ళిపోతే సంవత్సరీకాదుల తరవాత కుటుంబ సభ్యులు సత్య వ్రతం చేసుకుంటారు. ’స్వామీ! జగత్తులో ఇలా ఎందరో వచ్చారు వెళ్ళారు, ఐనా జగత్తు సత్యం అన్న భావనలో మానవ సహజ్కమైన సుఖదుఃఖాలు కలుగుతున్నాయి. కానీ స్వామీ! అసలు సత్యవస్తువువి నీవే సమస్త జగత్కారణమూ, జగన్నియామకమూ, జగన్నియంతవూ నీవే అని గుర్తెరిగే జీవిస్తున్నాను, మాకు నీవే రక్ష" అని విన్నవించుకుంటాము.

ఇలా ధర్మజీవనంతో, మన జీవతంలోని ప్రతి ఘట్టాన్నీ సత్యనారాయణునికి నివేదించి మనం చేసుకునే వ్రతం నిత్య వస్తువైన సత్ లో కలిసి పునరావృత్తి రహిత శాశ్వత పరబ్రహ్మసాయుజ్యమునకు చేరడానికే!

సర్వం శ్రీ రమాసహితసత్యనారాయణస్వామి పాదారవిందార్పణమస్తు

No comments:

Post a Comment