Pages

Thursday, May 26, 2016

ప్రవచనం - వ్యాఖ్యానం


శ్రీ గురుభ్యోనమః
పురాణేతిహాసాలు ప్రవచనం చేస్తారు - అంటే అందరికీ అర్థమయ్యేలా బోధ చేస్తారు.


ఉపనిషత్తులు వ్యాఖ్యానం చేస్తారు - అంటే ఏ శిష్యుడైతే బ్రహ్మమును గురించి తెలుసుకోవాలనుక్కుంటాడో ఆ శిష్యుని దగ్గరగా (ఉప) కూర్చోబెట్టుకుని (నిషత్) పాఠం చెప్పి బోధిస్తారు. గుంపులు గుంపులుగా బహిరంగ వేదికలమీద కాదు.
-శంకరకింకర


Friday, May 20, 2016

చర్చకి తీసుకున్న ఆరోపణలే తప్పు మహానుభావా!

శ్రీ గురుభ్యోనమః

చర్చకి తీసుకున్న ఆరోపణలే తప్పు మహానుభావా! అంటుంటే దాన్ని దాటి అభిమాన దృష్టితో అక్కడక్కడ ముక్కలు శ్లోకాలు చేర్చి ప్రమాణం చూపుతాననడం ఏం ప్రమాణం వైపు శాస్త్రం ఉందనీమరోవైపు శాస్త్రం లేదనీ కలగాపులగం చేస్తే.... చర్చలో తర్కంలో అభిమానానికి ద్వేషానికి తావుండనప్పుడే సిద్ధాంతం సాధింపబడుతుంది. లేకపోతే శంకురుల సోపాన పంచకంలో వద్దన్న చర్చ అవుతుంది. పోనీ చర్చిద్దామంటే, విషయం, తర్కం, ప్రమాణం ఏదీ సరిగా చెప్పరు అటంటే ఇటు ఇటంటే అటు శాస్త్రంమీద అభిమానం ఉండాలి కానీ చర్చా విషయం మీద కాదు..అటువంటి చర్చలకి మీరు నన్ను దూరం చేయడం కాదు, శంకర కింకరుడిగా అటువంటివాటిని నేనేదూరం. నేనేకాదు వ్యాస శంకర వాఙ్మయాన్ని నిజంగా ప్రమాణంగా ఉన్న ఎవరైనా అంతే! నిష్పక్షపాతంగా పాత్రల తీరుతెన్నులెండకట్టగలగాలి, తప్ప కొన్ని పాత్రల మీద అభిమానం కాదు.,

-శంకర కింకర

Friday, May 13, 2016

ఓ హిందువా! మేలుకో!


శ్రీ గురుభ్యోనమః
శంకరాచార్యుల అవతరణకు ముందు దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, ఇప్పుడే అవే పరిస్థుతులున్నాయి. అప్పుడు ఒక శంకరులే అవతరించారు. ఇప్పుడు హిందువులందరూ తమలో నిద్రాణమై ఉన్న ఆదిశంకరులను జాగృతం చేయాలి. ప్రతి హిందువు ఒక శంకరుడవ్వాలి. ఆయనే మనకిప్పుడు స్పూర్తి. ఆయన ఇప్పటికి మనలోనే, మనతోనే ఉన్నారు. అందుకే మనమీ ధర్మంలో జన్మజన్మలుగా పుడుతూనే ఉన్నాం. మన మాతృ ఋణం తీర్చుకోవలసిన సమయం ఆసన్నమైంది. సనాతనధర్మం మన తల్లి. మన గ్రంధాల మీద వేరేవాడు అధికారం చెలాయించడం ఏమిటి? మన గురించి వాడు పిచ్చిరాతలు రాయడమేమిటి?

 హిందువా! మేలుకో! అంతర్ముఖమై నీలో ఉన్న శంకరుల ఆర్తిని విను. ధర్మాన్ని తెలుసుకుని, ఆచరించి, శక్తి సంపాదించి, స్పూర్తి పొంది, నీ మీద, ధర్మం మీద స్పష్టతతో మరో శంకరుడివై, ధర్మంపై జరుగుతున్న దాడిని తిప్పి కొట్టు. ధర్మాన్ని పునః ప్రతిష్టించు. కర్తవ్యాన్ని విస్మరిస్తే, నీవు అధోగతి పాలుగాక తప్పదు. గుర్తుంచుకో. శంకరులు మనల్ని విడిచి పోలేదు. మేలుకో భారతీయుడా! కలియుగ గురువైన ఆ ఆదిశంకరుల రక్ష నీకు సదా ఉన్నది.

శంకర జయంతి శుభాకాంక్షలు.

మన్నాథః శ్రీజగన్నాథః మద్గురుః శ్రీజగద్గురుః !
మదాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీగురవే నమః !!

జయ జయ శంకర హర హర శంకర
-శంకరకింకర


Monday, May 2, 2016

సనాతన ధర్మం మీద మరోదాడి - సెల్ఫ్ గోల్

శ్రీ గురుభ్యోనమః
ఇది సనాతన ధర్మం మీద జరుగుతున్న మరోదాడి. ఇదెలా ఉంటుందంటే చాలా చక్కగా, అందంగా, అంతా మన పరిథిలోనే ఉన్నట్టుంటుంది. ఫుట్బాల్ లో సెల్ఫ్ గోల్ వంటిదిది. సరి వివరంలోకి వెళ్తే...  మనకే తెలియకుండా మనకంట్లో మనమే వేలు పెట్టి పొడుచుకునే చందంగా కొందరు పండితులు తయారయ్యారు. వారికున్న పాండిత్యాన్ని ఎంచట్లేదు ఎటువంటి అగౌరవాన్నీ ప్రకటించబోవట్లేదు. వాస్తవంగా జరుగుతున్న, లేదా వారి మాటల ప్రాచుర్యం వల్ల జరగబోయే పరిణామాన్ని ప్రమాదాన్ని గుర్తించి పరాకు చెప్పుకోవడం నా ఉద్దేశ్యం

సనాతన ధర్మం మరోపేరే వేదధర్మం. వేదంలో ఆచారకాండ, జ్ఞాన కాండ రెండూ ఉంటాయి. దీన్ని సరి ఐన రీతిలో అర్థం చేసుకోవడానికి దానికి అంగాలు అంగాలకి ఉపాంగాలూ ఇవన్నీ ఉన్నవన్న విషయం అందరికీ విదితమే. ప్రవృత్తి, నివృత్తి రెండు మార్గాలు. మన ధర్మానికి కర్మ-ఆచరణ, జ్ఞాన సముపార్జన రెండూ రెండు పాదాలవంటివి. రెంటి పాదాలతో చేసిన నడకయే చివరగమ్యమైన అద్వైత స్థితికి తీసుకెళుతుంది (సర్వ సామాన్యులైన అందరికీ ఇదే దారి, అవతార పురుషుల గురించి, అటువంటి విషయాలలో విశేష విభూతి కలిగిన వారి గురించి కాదు). ఐతే పండితులు యోగ వాశిష్ఠాన్నో, భగవద్గీతనో, రెండుమూడు ఉపనిషత్తులనో పట్టుకుని వాటినే బోధిస్తూ కర్మలను, ఆచారాలని తూలనాడడం లేదా వాటిని తుచ్చమైనవిగా చూడడం జరుగుతోంది. ఐతే అవి వారు వ్యక్తిగతంగా వారి వారి శిష్యులను ఆస్థాయిలో ఉన్నవారిని ఉద్దేశించి చెప్పడంలో ఇబ్బంది ఉండదు. కానీ సార్వజనీకంగా చెప్పినప్పుడే ఇబ్బంది. వేద విహితమైన కర్మలనాచరించి చిత్తశుద్ధిని పొంది ఔపనిషద్ సార జ్ఞానాన్ని పొంద వలసిన విషయాన్ని. తేలిగ్గా సార్వజనీకంగా చెప్పి జాతిని కర్మ భ్రష్టత్వం వేపు, ఆచార భ్రష్టత్వం వేపు ప్రేరేపిస్తే రేపొద్దున్న జరిగే నష్టానికి బాధ్యత ఎవరిది? ఇప్పటికే పలు మహిమాన్విత అవధూతల అనుయాయులవల్ల ఆచారభ్రష్టత్వం మొదలైంది.. కాదా..?

అవధానిగారు సంధ్యావందనం అక్కరలేదు, మనం అర్ఘ్యమిస్తేనే సూర్యుడుదయిస్తున్నాడా! ఏం అక్కరలేదు.. స్నానం చేసి తువ్వాలు కట్టుకుని పదకొండు మాట్లు గాయత్రి చెయ్ చాలు అని టీవీలో ఉవాచ. ఆశ్చర్యం!! ఏం చెప్తున్నామ్ మనం? బహుశా ఆయన కూడా ఏం చెప్పారో ఆయనకే తెలియకుండా చెప్పుంటారు మరి అని నా భావనప్రమాదో ధీమతామపికదా. ఎవరైనా అలా కాదు తప్పకుండా విహిత కర్మ చెయ్యండి అని చెప్తే కండువాగాళ్లంతా అంతే అని ఆయన ఎవర్ని అంటున్నారు. ఉత్తరీయం / కండువా శ్రామికుడి దగ్గరనుంచి పండితుడివరకూ అందరూ వేసుకునే అలవాటు భారతీయ వస్త్రధారణది. పట్టణాల్లో కరువైందేమో కానీ, ఊళ్ళలో ఇంకా ఉంది. నీకు కర్మాచరణ అలవాటుందో లేదో తెలీదు , నోటికి అమ్మవారు విభూతినిచ్చింది.. కర్మలక్కరలేదు కర్మలక్కరలేదు అని నోరేసుకు పడిపోవడం. కర్మ చేయమని చెప్పినవాడిమీద కుళ్ళుకోవడం.. ఇదేనా జ్ఞానం. యోగవాసిష్టం ఇదా చెప్పింది, ఉపనిషత్తులివా చెప్పాయి? సత్యం బ్రూయాత్ .. నిజం చెప్పు, పబ్బం గడుపుకోడానికి ఉనికి కాపాడుకోడానికి లేనిపోనివి కల్పించి స్వబుద్ధి స్వప్రమాణం చెప్పకు. చదవక ముందు కాకరకాయ అన్నవాడు చదివేసాక కీకరకాయ అన్నాట్ట ఇలాంటి పండితుడు..

జ్ఞానం పంచాలి, జ్ఞానం పొందాలి తప్పని ఎవరూ చెప్పరు, ఐతే కర్మలను వదలమని చెప్పడానికి, తద్విధంగా శాస్త్ర ప్రమాణాన్ని మార్చాలని , లేదా వాటిని  వదిలి ముందుకు సాగమనీ ఎలా చెప్తున్నారో అర్థం కావట్లే. అపర శంకరులు అని పేర్గాంచి, ప్రతివాదభయంకరులై సర్వవిద్యలకు తానే ఆలవాలం అయిపోయిన సార్వభౌమ పీఠాధిపతి అనంత శ్రీ విభూషిత భారతీ తీర్థ స్వామి అంతటివారు వేద విహితమైన కర్మలను మార్చే అధికారం ఎవరికీ లేదు ఆచరించవలసినదే అని చెప్తే, సంధ్యావందనం వదిలేయమని చెప్పే అవధాన్లు మరి వారిని మించిపోయారో అర్థం కావట్లేదు.  రకం ప్రచారం, బోధలు ఎంత దారుణమైనవంటే... కాయలని తీసుకొచ్చి కాభొహైడ్రేట్స్ వాడి పండేలా చేయడం వంటి దారుణ నేరం. పువ్వు పుట్టాలి, పిందె అవ్వాలి, కాయ అవ్వాలి, దోరగా మాగాలి, రంగు మారాలి, పండి కొమ్మనుండి విడివడాలి. తప్ప కర్మలక్కరలేదు జ్ఞానం ఒక్కటీ చాలు అని చెప్పడం ఇంతే దారుణమైన నేరం. ఆవ్యాపారులు తినే తిండి కాలుష్యం చేస్తే, ఇలాంటి పండితులు అవధానులు బుద్ధి కాలుష్యం, భావ కాలుష్యం ప్రసరింపజేసి సనాతన ధర్మ ప్రచారం అనుక్కుని  ద్రోహం చేస్తున్నారు. నాకు ప్రమాణం శంకరుల వాఙ్మయం. ప్రతీదానికీ రండి చర్చకి అంటారుగా నేను రెడీ, శంకరుల సోపాన పంచకం మొదటి శ్లోకం నా ప్రమాణం మీకు అవునా కాదా తేల్చండి.

అసలు ప్రతిదానికీ శంకరుల అద్వైత సిద్ధాంతం... స్నానం వద్దు జ్ఞానం కావాలి అని... అనేటప్పుడు శంకరుల ఉపదేశం ఎందుకు గుర్తు రాదు. శంకరులు కర్మ వదిలెయ్యమన్నారా? అత్యంత శ్రద్ధతో కర్మలనాచరించవలె కాదా, అది కానప్పుడు శ్రద్ధయొక్క అవసరమేమి? వేదో నిత్య మధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతామ్ తేనేశస్య విధీయతామపచితః కామ్యే మతిస్త్యజ్యతామ్ పాపౌఘః పరిధూయతాం భవ సుఖే దోషో 'నుసంధీయతామ్ ఆత్మేచ్చా వ్యవసీయతాం నిజగృహాత్ తూర్ణం వినిర్గమ్యతామ్...  "కర్మలని చక్కగా చేయమని శంకరాచార్యులు చెప్తే వ్యతిరిక్తంగా నోటితో చెప్తున్నారు?" కర్మలని శాస్త్ర ప్రమాణాలని వదలమని ఎవరైనా సనాతన ధర్మంలో చరిస్తున్నవారు చెప్తే... ధర్మ ప్రచారం ముసుగులో ద్రోహం చేయడమే. నా దృష్టిలో ఖచ్చితంగా ఎంత పాండిత్యం ఉన్నా వర్జించవలసినవాడు. నాస్తికుడు, శాస్త్రం మీద, తద్విహిత కర్మాచరణం మీద నమ్మకం లేని వాడు ధర్మంలో ఉండి చేసే పని, చెట్టులోపల ఉన్న అగ్ని చేసేపని ఒక్కటే అటువంటి వ్యక్తి ఖచ్చితంగా నాస్తికుడే.


కామాక్షీ పాదార్పణమ్