Pages

Tuesday, February 5, 2013

లక్ష్మన్న

శ్రీ గురుభ్యోనమః
నమస్తే
సహోదరుల వలె ఎలా మెలగాలన్న విషయంలో సర్వకాల సర్వావస్థలయందూ శ్రీ రామలక్ష్మణభరతశత్రుఘ్నులే ఆదర్శం.

ముఖ్యంగా లక్ష్మణస్వామి గూర్చిన మాట చెప్పాల్సి వస్తే 'మా లక్ష్మణస్వామి / మా లక్ష్మన్న' అనే అంటారు చాలామంది. ఎందుకంటే ఆయనా మనలాగా శ్రీరామునికి వ్యతిరేకంగా ఎవరు చేసినా తట్టుకోలేడు. సహజ ప్రతిక్రియగా ఎదురు నిలుస్తాడు, నాఅన్నను అంత మాటంటారా? నాఅన్ననే మోసం చేస్తారా? నాఅన్ననే కష్టపెడతారా అని.. ఇలా పెద్ద పెద్ద ఊపిరిలు పీలుస్తూ వదుల్తూ రోషంతో ఉంటాడు. వ్యాఖ్యానంలో రాముడు శేషి, లక్ష్మణుశేషుడు. అంటే ఆది శేషుడన్నమాట. నిశ్వసంతం... అని వాల్మీకీ మహర్షి చెప్తూ ఉంటారు.

బాలకాండలోనే రామ లక్ష్మణ సంబంధం చెప్పారు " బహిః ప్రాణ ఇవాపరః యదాయదాహియమారూఢో మృగయాంయాతి రాఘవః తదైన పృష్ఠతో భ్యేతి సధనుః పరిపాలయన్" రాముడుకి లక్ష్మణుడంటే చిన్నప్పట్నుంచీ ఇష్టం, ప్రాణంలా చూసుకునేవారు. రాముడు వేటకెళితే లక్ష్మణుడు ధనుస్సుతో సహా వెంట వెళ్ళాల్సిందే. అవును మరి ప్రాణంలేకుండా కాయం వెళ్ళదు కదా, చివర పరిపాలయన్ అన్న మాట కూడా వ్యాఖ్యాతలు అలానే వ్యాఖ్యానించారు, ప్రాణమే కదా దేహాన్ని పాలించేది. మనం నిద్రపోతున్నాం, ఆ సమయంలో మన శరీరాన్ని పాలించేది, శరీరంలోని సకల వ్యాపారాలు సక్రమంగా జరిగేటట్టు చూసేది ప్రాణములే కదా! అందుకే శ్రీరామాయణంలో లక్ష్మణుడు రాముడితో వేరుగా ఉన్నట్లు కనపడదు. అందుకే అరణ్యవాసంలో ఒక్కనాడు లక్ష్మణస్వామి నిద్రపోకుండా సీతారాముల్ని సేవించాడు అంటే, లక్ష్మణుడు ప్రాణ రూపుడు అతని అధీనంలో ఉండే నిద్రావృత్తి అయోధ్యలో ఉన్న ఊర్మిళ "ఊర్మి" అంటే నిద్ర అని పెద్దలు చెప్పారు. అందుకే ఆమె లక్ష్మణుడికి భార్య.

ఇక శ్రీరామాయణంలో లక్ష్మణుడిని సంబోధించాలనుకున్నప్పుడు రామానుజుడనీ, రాముణ్ణి సంబోధించాలనుకున్నప్పుడు లక్ష్మణ పూర్వజుడనీ వాల్మీకి మహర్షి వ్రాసారు. అంటే లక్ష్మణుడి పేరు చెప్తే శ్రీ రాముడికి కూడా అంత ఆనందం అతిశయం. నా తమ్ముడు అని. సాధారణంగా లోకంలో ఫలానా వారి అబ్బాయి అనో తమ్ముడు అనో చెప్పడం పిన్న వారు ఎంత గొప్పవారైనా పెద్దవారి తరఫునుంచి సంబోధన రావడం లోక మర్యాద. కానీ మహానుభావుల వృత్తాంతాలలోనే పిన్నవారి నుంచి పెద్దవారి వేపుకు సంబోధన వెళ్తుంది బహుశః అందులో అగ్రగణ్యులు లక్ష్మణస్వామేమో, అలా చెప్తే పొంగిపోయిన వారిలో అగ్రగణ్యులు శ్రీరాములవారే నేమో.

శ్రీ రామ లక్ష్మణులిద్దరూ చైతన్యము+ప్రాణము లాటివారు. ఒకటి విడిచి ఇంకొకటి ఉండవు అని పెద్దల శాస్త్ర వాక్కు. అందుకే దూరంగా ఉన్నా ఇటు రాముడు, అటు భరతుడు ఉండగలిగారు. రాముడికి దూరమైన లక్ష్మణుడు ఉండలేడు అని శ్రీరామాయణంలో ఒకటికి మూడు మాట్లు చెప్పించారు వాల్మీకి మహర్షి కానీ, శ్రీ రాముల వారు యుద్ధకాండంలో ఒక సారి చెప్తారు లక్ష్మణుడు లేడంటే రాముడూ ఉండడు అని . తిరిగి తన అవతార సమాప్తి సందర్భంలో ఇచ్చిన మరణ వాంగ్మూలం అది. ముందు లక్ష్మణ స్వామి అవతార సమాప్తి అంటే ప్రాణం వీడింది, తరవాత కాయం మాత్రమైన శ్రీరాములవారు అవతారం వీడారు.

[సందర్భం వచ్చింది కాబట్టి ఇందులోని ధర్మ సూక్ష్మం ఒకటి, అంత్యేష్టికి అగ్ని సంస్కారంతో జరగాలి (దశరథునికి కూడా అలానే జరిగింది). ఐతే రామావతారం చివర్లో అలా జరగలేదు సరయులో కలిసి పోయారు సాధారణంగా అంత్యేష్టికి అగ్ని సంస్కారం లేదా భూమిలో ఖననం ఈ రెండు భూతాలలోనే, కానీ తురీయావస్థలో ఉన్నవారు మాత్రం కోరుకుంటే నీటిలో కూడా శరీరాన్ని వదలచ్చు (మనకి ఎన్నో దృష్టాంతాలున్నాయి, ఉదాహరణకు మొన్ననే చర్చించుకున్న మన కాంచీ యతీశ్వరులు శ్రీ శ్రీ శ్రీ 'భగవన్నామ' భోదేంద్ర సరస్వతీ స్వామి వారు, జనార్థన సరస్వతీ స్వామి వారు, నీటిలోనే ప్రాణం వదిలిన చంద్రశేఖర భారతీ స్వామి వారు మొ,,) ఆత్మ హత్య చేసుకుని శ్రీరాముడు చివర్లో అధర్మాన్ని పాటించాడు అన్న వారికి ధర్మ సూక్ష్మం తెలుసుకోవడం అత్యంత ఆవశ్యకం. ఊపిరి వదిలే వరకూ తన ధర్మాన్ని శ్రీ రాముల వారు ఎన్నడూ వదలలేదు.]

లక్ష్మణుడు ప్రాణశక్తి కనుకనే రాముని మీద ఈగవాలనీయడు. రాముని కార్యానికి కానీ రాముడికి కానీ అపకార్యం తలపెట్టినవారిని సహించడు ఎవరైనా సరే ఆఖరికి తన తండ్రైనా సరే. అదే అతని లక్ష్మ లేదా లక్షణమితి లక్ష్మణ. లక్ష్మణుడికి ఎప్పుడు కోపం వచ్చినా "..నిశశ్వాసమహాసర్పో బిలస్థ ఇవరోషితః...", పుట్టలో పేద్ద పాము బుస కొడుతూ పైకి లేచినట్టు అంటారు. శేషుడంటే, పాము, అంటే కుండలినీ సంకేతం అదే ప్రాణం. ఎవరికి? శ్రీరామునికి.

రాముడికపకారం చేస్తే ఆవేశం ఉక్రోషం, ఉక్కు రోషం. "యం కైకయ్యా నదుష్టొయదినః పితా అమిత్ర భూతోనిస్సంగం బధ్యతాం వధ్యతామయమ్ గురోరప్యవలిప్తస్య కార్యాకార్యమజానతః ఉత్పథం ప్రతిపన్నస్య కార్యంభవతి శాసనమ్". ఎంత పెద్దవాడైనా సరే మంచి చెడ్డలు కానక కామంతో కళ్ళు మూసుకుపోయి ఏపని చేయాలో ఏది చేయద్దో తెలియక దుర్మార్గానికొడిగట్టినవాడు తండ్రైనా సంహరిస్తానంటాడు. అలాగే అరణ్యాలకు వెళ్ళేటప్పుడు తమ తల్లులను భరతుడు తన తల్లిలా చూసుకుంటాడో లేదోనని అనుమానిస్తుంటే, చూస్కోకపోతే చంపేస్తాను వాణ్ణి అంటాడు లక్ష్మణుడు "...తమహం దుర్మతిం క్రూరం వధిష్యామి నసంశయః", ఆయన పినల్ కోడ్లో బహుశా తప్పుచేసినవారెవరైనా మరణ శిక్షే లాగుంది.

రామ కార్యంలో సుగ్రీవుడు చేసిన కొద్ది ఆలస్యానికి శ్రీ రాముడు ఒక విధమైన ఆత్మ న్యూనతకి లోనైతే సుగ్రీవాంతఃపురానికి వెళితే ఆయనను చూసే ధైర్యమున్న వీరవానరం ఒక్కటీ లేదట, సుగ్రీవుడంతటి వాడే ఉన్నదున్నట్టు ఎగిరి సింహాసనంలోనే మూలకి అతుక్కుపోయి దాక్కున్నాడట ఇంత భయానికి తోడు ఆయన ధనుష్ఠంకారం ఒకటి. ఎంత బుస కొడతాడో ధర్మానికి అంతే లొంగుతాడు, వివరం తెలిసాక చల్లబడతాడు, అవసరమైతే పశ్చాత్తాపడతాడు.

ఇటువంటి స్వభావులు మనలో చాలా ఉంటారు, ఒక వ్యక్తి మీద విపరీత అభిమానం ప్రేమ పెరిగి పోయాయనుక్కోండి, వారు తప్ప ఆవ్యక్తిని ఇంకొకరు బాగా చూసుకోలేరన్న భావనలో ఉంటారు. వారు తప్ప అన్యులెవరు వచ్చినా పూర్తి విషయం తెలిసే వరకూ వారిని కాస్త దూరంగానే ఉంచుతారు.

ఐతే, ఈ లక్ష్మణుడు కేవలం దుందుడుకుగానే వ్యవహరిస్తాడు, కోపిష్టి, రోషగాడు అన్న విధంగా చాలా నాటకాలలోనూ, సినిమాలలోనూ చిత్రీకరించారు. కానీ లక్ష్మణుడు మృధు స్వభావి, అతి కోమల మనస్కుడు, స్వాభావికంగా శ్రీరామునికపకారం చేసేవారిపై ఆగ్రహం ప్రదర్శిస్తాడు, నిజంగా ఎప్పుడూ అంత కోపంతో ఉండే వాడైతే శ్రీ సీతారాములకి సేవచేయలేడు. కోపంతో ఉండేవాడి సేవ అంటే కత్తి మీద సాము వంటిదే, తినడానికి వడ్డిస్తే పాత్రలు నేలమీద గాలిలోనూ సాము చేస్తుంటాయి, చెప్పబోతే హుం కారాలు. కానీ లక్ష్మణ స్వామి అలాకాదు. ఆర్తితో ఆర్ద్రతతో ఉన్న హృదయం ఉన్నవాడు. సీతారాములు గుహుని గూడెంలో ఉన్నప్పుడు లక్ష్మణా నువ్వు కూడా నిద్రపో అంటే కథం? ఎలా ? ఎలా నిద్రపోను? అని కళ్ళనీళ్ళపర్యంతమయ్యాడు. అదీ లక్ష్మ... ఆయన లక్షణం. అందుకు లక్ష్మణుడు.

జీవిత పర్యంతం శ్రీరామునిచే పరీక్షలెదుర్కొన్నవాడు లక్ష్మణ స్వామి. అడపా దడపా నువ్వెళ్ళిపో అనో, నువ్వెందుకొచ్చావ్ అనో, నీకు రాజ్యం కావాలా అనో ఎప్పుడూ పరీక్షలే. సీతమ్మ అనరాని మాటలే అంది కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాడు తప్ప ఎదురు తిరగలేదు, నేనది చేసాను ఇది చేసాను అని లెఖ్ఖలు చెప్పలేదు.
అదే రాముడు ధర్మం తప్పబోయి లోకాల్నే లయం చేస్తానని రుద్రుడైతే అంతే అనునయంగా కర్తవ్యం చూపి ధర్మం వైపుకి మరల్చాడు. ఇంతా చేసింతరవాత, శ్రీ రాముడు చివర మళ్ళీ నీకు యవరాజ్యం కావాలా అని అడిగినా సున్నితంగా వద్దన్నయ్యా పెద్దవాడైన భరతునికి ఇవ్వు నాకెందుకు నీ పాదసేవతప్ప అని అన్నాడు.

ఇంత చేసి అన్న వెనకుండడమే తాను ముందుండడం, అన్నకు గౌరవం దక్కడమే తనకు గౌరవం దక్కడం, అన్నకు పూజ జరగడమే తనకు పూజ జరగడం అనుక్కున్నాడు తప్ప ఇంత చేసి నాకెవరు ఏమిచ్చారు? అందరూ కోపిష్టి అని నిందిస్తారు తప్ప అని ఏనాడూ ఆలోచించిన పాపానపోలేదు. అసలు ఆవేపు ఆలోచన నాబోటిగాడికి తప్ప నాస్వామి లక్ష్మణుడికి రాదు అదే ఆయన లక్ష... లక్షణం.

త్యాగం 'లక్ష్మన్న' నుంచి నేర్చుకోవాలి,
పెద్దలననుసరించడం 'లక్ష్మన్న' నుంచి నేర్చుకోవాలి,
మాట వినడం 'లక్ష్మన్న' నుంచి నేర్చుకోవాలి,
భగవత్, భగవత్భక్తుల రక్షణం 'లక్ష్మన్న' దగ్గర్నుంచి నేర్చుకోవాలి.
భగవంతుని పాదాలు పట్టుకుంటే భగవంతుడే పరీక్షపెట్టినా ఎలా గట్టిగా పట్టుకోవాలో 'లక్ష్మన్న' దగ్గర్నుంచే నేర్చుకోవాలి.

ఎంత చెప్పినా నా లక్ష్మన్న గూర్చి చెప్పడం తక్కువే. ఆంతరంలో సీతతోలేని రాముడు ఎలా పూర్ణుడు కాడో, బాహ్యంలో లక్ష్మణుడు లేని రాముడూ పూర్ణుడు కాడు అని ఎందరో శ్రీరామాయణ వ్యాఖ్యాతలు ఉపాసకులు చెప్పిన మాట.

రాముడు ధర్మం, లక్ష్మణుడు సత్యం. భరతుడు భక్తి, శత్రుఘ్నుడు శక్తి, సత్య ధర్మాలు, భక్తిశక్తిలు కలిసి ఉన్నప్పుడే పూర్ణమని శ్రీరామాయణం నిరూపిస్తున్నది.
మీ

సర్వం శ్రీ హనుమత్లక్ష్మణభరతశత్రుఘ్న సకల పరివార సమేత శ్రీ సీతారామచంద్రార్పణమస్తు

~~~~~~~~~~~~~~~~~~~~~~
ధర్మస్య జయోస్తు - అధర్మస్యనాశోస్తు
जय जय शंकर हर हर शंकर

No comments:

Post a Comment